
భూ మాయ
నకిలీ డాక్యుమెంట్లతో అక్రమ రిజిస్ట్రేషన్లు
అండదండలు అందిస్తున్న రిజిస్ట్రేషన్ సిబ్బంది
రియల్టర్ల అడ్డాగా రిజిస్ట్రార్ కార్యాలయాలు
బాధితుల ఫిర్యాదులు
సబ్‌రిజిస్ట్రార్‌లపై కేసులు
పేరం నాగిరెడ్డి ఓ సాధారణ ఉద్యోగి. అమరావతి రోడ్డులో 550 గజాల స్థలాన్ని పదేళ్ల కిందట కొనుగోలు చేశారు. వారం కిందట కుమార్తె పెళ్లికి కట్నకానుకల కింద ఆ స్థలాన్ని అల్లుడికి ఇచ్చారు. పెళ్లి తంతు పూర్తయ్యాక స్థలం రిజిస్ట్రేషన్ కోసం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ నిజం తెలిసి అవాక్కయ్యారు. రెండేళ్ల కిందటే ఆ స్థలం నాగిరెడ్డి సంతకంతో అమ్మినట్లు వుంది. రిజిస్ట్రేషన్ రికార్డుల్లో నాగిరెడ్డి పేరిట మరొకరి ఫొటో ఉంది.
చిన్నం రాములమ్మ భర్త వెంకటేశ్వర్లు అయిదేళ్ల కిందట మృతి చెందాడు. ఆయన పేరిట నల్లపాడులో నాలుగెకరాలపొలం ఉంది. ఆయన సమాధి కూడా అక్కడే నిర్మించారు. ఆయన మనువడ్ని అని చెప్పుకుంటూ ఓ వ్యక్తి జీపీ నకిలీ డాక్యుమెంట్లు సృష్టించాడు. రాములమ్మ అమెరికాలో ఉన్న కుమారుడి వద్దకు వెళ్లేక్రమంలో పొలాన్ని అమ్మాలని ప్రయత్నించగా..రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఈసీ వేరేవారి పేరిట వచ్చింది.
సాక్షి,గుంటూరు
జిల్లాలో అక్రమ రిజిస్ట్రేషన్లు జోరుగా సాగుతున్నాయి. గుంటూరు, నరసరావుపేట జిల్లా రిజిస్ట్రార్ పరిధిలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డబుల్ రిజిస్ట్రేషన్లు అధికంగా జరుగుతున్నాయి. గుంటూరు అర్బన్ పరిధిలో ఎనిమిది, నరసరావుపేట జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయం పరిధిలో 13 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి.రాష్ర్ట విభజన నేపథ్యంలో ఇటీవల భూముల కొనుగోలు, అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. పల్నాడు, గుంటూరు కేంద్రంగా అనేకమంది రియల్టర్లు అక్రమ దందా కొనసాగిస్తున్నారు. లంచాల ముసుగులో స్వయంగా అధికారుల అండదండలు రియల్టర్లకు అందుతున్నాయన్న ఆరోపణలు లేకపోలేదు. ఉదయం 10 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కిటకిటలాడడానికి ప్రధాన కారణమిదేనని చెప్పవచ్చు. ఇటీవల పోలీసు, రెవెన్యూ గ్రీవెన్స్ కార్యక్రమంలో జిల్లావ్యాప్తంగా బాధితులు డబుల్ రిజిస్ట్రేషన్‌లు, నకిలీ జీపీ డాక్యుమెంట్‌ల మోసాలపై ఫిర్యాదులు చేస్తున్నారు. వీటికి సంబంధించి ఇప్పటికే గుంటూరు అర్బన్‌లోని పట్టాభిపురంపోలీసుస్టేషన్‌లో మూడు కేసులు, నగరంపాలెం స్టేషన్‌లో ఒక కేసు నమోదయ్యాయి. పలు కేసుల్లో మోసాలకు పాల్పడిన నిందితుల్ని కూడా అరెస్టు చేశారు. గుంటూరు, నల్లపాడు సబ్ రిజిస్ట్రార్‌లతోపాటు డాక్యుమెంట్ రైటర్‌లపై సైతం కేసులు నమోదవడం గమనార్హం!
యథేచ్ఛగా అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లు
ప్రభుత్వ, రెవెన్యూ, అసైన్డ్, ఫోరంబోకు భూములకు సంబంధించి అక్రమ రిజిస్ట్రేషన్లు గుంటూరు కేంద్రంగా భారీస్థాయిలో జరుగుతున్నాయి. జిల్లాలో నాలుగేళ్లకిందట పనిచేసిన ఓ ఐఏఎస్ అధికారి అండదండలతో వివిధ ప్రభుత్వశాఖలకు చెందిన ముగ్గురు అధికారులు అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్‌ల బాగోతాన్ని నడిపించారని ఆరోపణలు ఉన్నాయి. యనమదల, చౌడవరం, ఈదులపాలెం, నల్లపాడు, ప్రత్తిపాడు, యడ్లపాడు, గోరంట్ల, అమరావతి రోడ్డులలో అసైన్డ్, ప్రభుత్వ స్థలాలు భారీఎత్తున రిజిస్ట్రేషన్లు జరిగిపోయాయి. కోట్లాది రూపాయల విలువైన ఈ స్థలాల్ని గుంటూరు, పెదకూరపాడు నియోజకవర్గాలకు చెందిన ఇద్దరు రాజకీయ ప్రజాప్రతినిధులు, వారి అనుచరులకు కట్టబెట్టినట్లు సమాచారం. ఈక్రమంలో శ్యామలానగర్‌లో రెండు స్థలాలకు సంబంధించి దొంగ రిజిస్ట్రేషన్‌లు జరిగాయని.. సదరు వ్యవహారంలో సంబంధిత నల్లపాడు సబ్ రిజిస్ట్రార్‌పై కూడా కేసు నమోదు చేసి ప్రభుత్వానికి పంపారు. ఇటీవల పట్టాభిపురం పోలీసులు మరో స్థల వివాదానికి సంబంధించి ఇదే నల్లపాడు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులు, డాక్యుమెంట్ రైటర్‌లను నిందితులుగా చేర్చి ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. మార్కెట్ విలువపై చెల్లించాల్సిన 0.5 శాతం ఫీజును అడ్డంపెట్టుకుని ఒకటి నుంచి మూడు రెట్లు ఫీజులను రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆది నుంచి ఉన్న ‘ఫీజు టు ఫీజు’ విధానానికి ‘సంతృప్తికర ఫీజు’ పేరుతో స్టాంపు వెండర్లు, డాక్యుమెంట్ రైటర్లు కొత్తభాష్యం చెబుతున్నారు.
ఏసీబీ, విజిలెన్స్ అధికారుల ఆరా..
జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతి, అక్రమ తంతుపై ఏసీబీ, విజిలెన్స్ అధికారులు ఆరాతీస్తున్నారు. ఈ క్రమంలో కొందరు స్థానికేతరులైన స్టాంప్‌వెండర్లు ఇక్కడకు వచ్చి చెలాయిస్తున్న అక్రమ తంతుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రిజిస్ట్రేషన్ అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ఆ కార్యాలయాల్లో జరుగుతున్న అక్రమ తంతుపై ఆధారాల సేకరించే పనిలో ఏసీబీ అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ప్రకారంగానైనా కార్యాలయాలపై దాడులు జరిగితే, పారదర్శకంగా రిజిస్ట్రేషన్‌లు జరుగుతాయని బాధితులు ఎదురుచూస్తున్నారు.