
గుంటూరు, సాక్షి: అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ ప్రజలకు అండగా ఉంటుందని, ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటుందని పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. వైఎస్సార్‌సీపీ 15వ ఆవిర్భావ వేడుకలు(YSRCP Formation Day) బుధవారం ఏపీ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వేడుకలకు హాజరైన వైఎస్ జగన్.. మహానేత వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించి, పార్టీ జెండా ఆవిష్కరించి ప్రసంగించారు.
వైఎస్సార్‌సీపీ ఇవాళ 15వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటోంది. ప్రజల కష్టాల నుంచి వైఎస్సార్‌సీపీ పుట్టింది. ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించి పోరాడుతోంది. ప్రతిపక్షంలో కూర్చోవడం మనకు కొత్త కాదు. అధికారంలో ఉన్నవాళ్లకు ఎప్పటికప్పుడు ధీటైన సమాధానమే ఇస్తున్నాం. ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటాం.

జగన్ చెప్పాడంటే.. చేస్తాడంతే అనే నమ్మకం ప్రజల్లో ఏర్పడింది. ఇవాళ ప్రజల్లోకి ధైర్యంగా కాలర్ ఎగరేసుకుని వెళ్లగలిగే స్థితిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఉన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటుంది. 3-4 ఏళ్ల తర్వాత మళ్లీ అధికారంలోకి వచ్చేది మనమే అని అన్నారాయన. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిన ఆయన.. ఇవాళ వైఎస్సార్‌సీపీ చేపట్టిన ఫీజు పోరు గురించి ప్రస్తావించారు. ఈ వేడుకల్లో పార్టీ ముఖ్యనేతలంతా పాల్గొన్నారు.

ప్రజాభ్యుదయమే పరమావధిగా ఎదుగుతున్న వైఎస్సార్‌సీపీ(YSRCP).. సవాళ్లనే సోపానాలుగా మార్చుకుంది. ప్రజాసమస్యల పరిష్కారంపై మడమ తిప్పకుండా పోరాటాలు చేస్తోంది. మహానేత వైఎస్సార్ ఆశయ సాధన లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే రాజకీయాల్లో నైతిక విలువలను చాటిచెప్పిన వైఎస్ జగన్(YS Jagan) ‘నేను విన్నాను.. నేను ఉన్నానంటూ’ ప్రజలకు భరోసా ఇస్తున్నారు.

Comments
Please login to add a commentAdd a comment