
సాక్షి, అమరావతి /గుంటూరు లీగల్: తన మీద ఎన్ని కేసులు కట్టారో తనకే తెలియదని, రాష్ట్రమంతా తిప్పుతున్నారని, తాను నిజంగా తప్పు చేస్తే నరికేయండి సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి కన్నీళ్లు పెట్టుకున్నారు. బెయిల్ రాకపోతే తనకు ఆత్మహత్యే శరణ్యమని అంటున్నారాయన. పోసానిని సీఐడీ పోలీసులు బుధవారం రాత్రి గుంటూరులో ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి ఇంటి వద్ద హాజరు పరిచారు. ఈ సందర్భంగా పోసాని అనారోగ్య సమస్యల గురించి విన్నవించుకున్నారు.
తన పరిస్థితి చాలా దైన్యంగా ఉందని దయచేసి విడుదల చేయమని వేడుకున్నారు. ఈ కేసులకు సంబంధించి తనకు ఎటువంటి పాపం తెలియదని, తానేం చేయలేదని న్యాయమూర్తి ఎదుట బోరున విలపించారు. నిజం మాట్లాడినందుకు తన మీద కక్ష కట్టి ఇలాంటి అన్యాయమైన కేసులు పెట్టారని విన్నవించారు. తల్లి మీద, పిల్లల మీద ఒట్టేసి చెబుతున్నానని తనకే పాపమూ తెలియదని న్యాయమూర్తిని వేడుకొన్నారు. బెయిల్ ఇవ్వాలని కోరారు.
వయసు మీదపడడంతో కూర్చోలేక పోతున్నానని చెప్పుకొచ్చారు. పోలీసులు ఎక్కడినుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియడం లేదని, ఇప్పటికే కొన్ని వందల మైళ్లు ప్రయాణం చేయించారని, ఎందుకు నన్ను తిప్పుతున్నారో అర్థం కావడం లేదని, ఇలా చేస్తే తాను ఎక్కువ రోజులు బతకనని మొరపెట్టుకున్నారు. టీడీపీలోకి రమ్మంటే రానందుకు లోకేశ్ తనను వేధిస్తున్నారని, నంది అవార్డుల ప్రకటనలో పక్షపాతాన్ని ఎత్తిచూపడంతో కక్ష కట్టారని తెలిపారు.
అన్నీ నిజాలే చెబుతున్నానని నార్కో ఎనాలసిస్ టెస్టుకూ సిద్ధమన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఇన్ని కేసులు కడతారా అని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, న్యాయమూర్తి బెయిల్ పిటిషన్‌ను డిస్మిస్ చేసి ఈ నెల 23వ తేదీ వరకు రిమాండ్ విధించారు. పోసానిని గుంటూరు జైలుకు తరలించారు.
హైకోర్టులో పోసాని పిటిషన్ కొట్టివేత
సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయడంతో పాటు తదుపరి చర్యలన్నీ నిలిపేయాలని కోరుతూ సినీ నటుడు పోసాని కృష్ణమురళి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. ఇప్పటికే పీటీ వారెంట్‌ను అమలు చేసి కర్నూలు నుంచి మంగళగిరి మేజిస్ట్రేట్ వద్దకు పోసానిని తీసుకొస్తున్నామని రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) మెండ లక్ష్మీనారాయణ చెప్పడంతో.. హైకోర్టు దానిని పరిగణనలోకి తీసుకుంది. పీటీ వారెంట్ అమలైన నేపథ్యంలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యం కాదంటూ పిటిషన్‌ను తోసిపుచి్చంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూనెపల్లి హరినాథ్ బుధవారం ఉత్తర్వులిచ్చారు. సీఎం చంద్రబాబును పోసాని దూషించారంటూ మంగళగిరికి చెందిన తెలుగు యువత అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ పోలీసులు గతేడాది కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment