వ్యవస్థల విధ్వంసం: వైఎస్‌ జగన్‌ | YS Jagan Mohan Reddy fires on coalition government | Sakshi
Sakshi News home page

వ్యవస్థల విధ్వంసం: వైఎస్‌ జగన్‌

Published Wed, Apr 23 2025 4:19 AM | Last Updated on Wed, Apr 23 2025 8:30 AM

YS Jagan Mohan Reddy fires on coalition government

రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్న కూటమి ప్రభుత్వం 

తద్వారా అక్రమాలు, అవినీతి ప్రజల్లోకి వెళ్లకుండా డైవర్షన్‌

పీఏసీ సమావేశంలో నిప్పులు చెరిగిన వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌

ఒక మనిషిని ఇబ్బంది పెట్టడం కోసం కుతంత్రాలు 

కేసుల్లో ఇరికించేందుకు తప్పుడు సాక్ష్యాల సృష్టి 

దుష్ట సంప్రదాయానికి తెర లేపుతున్న వైనం 

ఐపీఎస్‌ అధికారి ఆంజనేయులు అరెస్టే నిదర్శనం 

తొలిసారి ఇలాంటి దుర్మార్గాలు చూడాల్సి వస్తోంది 

నాడు లిక్కర్‌ విధానం విప్లవాత్మకం.. నేడు దోపిడీకి మార్గం 

అన్ని పథకాలకూ మంగళం.. యథేచ్ఛగా భూ పందేరాలు 

రాజధాని అమరావతి నిర్మాణంలో అంతులేని దోపిడీ 

రూ.36 వేల కోట్ల నుంచి రూ.77 వేల కోట్లకు పనుల విలువ పెంపు

కొందరిని జైలుకు పంపితే ప్రజా వ్యతిరేకత ఆగిపోదు

యుద్ధం మనకు కొత్త కాదు.. ఈ దుర్మార్గాలను నిలదీద్దాం 

పార్టీలో పీఏసీ అత్యున్నతం.. ఇకపై ప్రతి నెలా సమావేశం 

ఎప్పటికప్పుడు నిర్ణయాలతో ప్రజల పక్షాన పోరాటం  

కూటమి ప్రభుత్వం దేన్నీ వదిలి పెట్టడం లేదు. వైఎస్సార్‌సీపీ మీద బురదజల్లి, డైవర్షన్‌ పాలిటిక్స్‌కు పాల్పడుతోంది. రోమన్‌ రాజుల కాలంలో గ్లాడియేటర్లను పెట్టి.. గ్యాలరీల్లో మనుషులను చంపుకునే పోటీలు పెట్టేవారు. వినోదం కింద రోజుకో దుర్మార్గమైన ఆట ఆడిస్తూ ప్రజలను అందులో మునిగేలా చేసేవారు. ఇప్పుడు రాష్ట్రంలో అదే జరుగుతోంది. ఏదైనా ముఖ్యమైన సమస్య తలెత్తిన వెంటనే చంద్రబాబు డైవర్షన్‌ చేస్తున్నాడు. ఏమీ లేకపోతే ఎవరో ఒకర్ని తీసుకు వచ్చి జగన్‌ మీద మాట్లాడిస్తున్నాడు. లేకపోతే ఎవరో ఒకర్ని అరెస్టు చేస్తున్నారు. – వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో భయానక వాతావరణాన్ని సృష్టించి.. ప్రజా సమస్యలు, అన్యాయాలు, అక్రమాలు, అవినీతి నుంచి ప్రజల దృష్టి మళ్లించే కుట్రలో కూటమి ప్రభుత్వం నిత్యం మునిగి తేలుతోందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. వ్యవస్థలన్నీ దిగజారిపోయేలా చేస్తూ.. వాటి విధ్వంసానికి పాల్పడుతోందని, రాష్ట్రంలో మొద­టి­సారిగా ఇలాంటి దుర్మార్గాలు చూస్తున్నామని నిప్పులు చెరిగారు. ఇది ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో అరాచకం తప్ప ఏమీ కనిపించదన్నారు. 

చరిత్రలో తొలిసారిగా ఒక మనిషిని ఇబ్బంది పెట్టడానికి ప్రలోభపెట్టి, భయపెట్టి, తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారని చెప్పారు. ఈ పరిణామాలతో రాష్ట్రం ఎటువైపు వెళ్తోందో అర్థం కావడం లేదని, దుర్మార్గపు సంప్రదాయాలకు తెర లేపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులును అరెస్టు చేయడం దారుణమని, ఇదే కేసులో మరో ఇద్దరు పోలీసు అధికారుల పట్ల ప్రభుత్వ తీరును కోర్టు తప్పు పట్టినా పద్ధతి మార్చుకోలేదన్నారు. మంగళవారం ఆయన  తాడుపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ పొలిటికల్‌ అడ్వైజరీ కమిటీ (పీఏసీ) సమావేశంలో సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

అసలు లిక్కర్‌ స్కాం ఎవరిది? 
» లోక్‌సభ సభ్యుడు మిథున్‌రెడ్డిని టార్గెట్‌ చేసి, ఎలాగైనా ఇరికించాలని చూస్తున్నారు. తన కాలేజీ రోజుల్లో చంద్రబాబును.. పెద్దిరెడ్డి ఎదిరించారు కాబట్టి.. ఆయన పెద్దిరెడ్డి కుటుంబంపై కక్ష పెట్టుకున్నాడు. లేని ఆరోపణలు సృష్టించి, తప్పుడు సాక్ష్యాలతో వారిని ఇబ్బంది పెడుతున్నారు. వాస్తవానికి చంద్రబాబు హయాంలో జరిగిన లిక్కర్‌ స్కామ్‌పై సీఐడీ గతంలో కేసు కూడా పెట్టింది. 

»  లిక్కర్‌ అమ్మకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా? లేక అమ్మకాలు పెంచితే లంచాలు ఇస్తారా? మద్యం అమ్మకాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే లంచాలు ఇస్తారా? లేక ప్రభుత్వం ద్వారా మాత్రమే అమ్మితే లంచాలు ఇస్తారా? మద్యం దుకాణాలను పెంచితే లంచాలు ఇస్తారా? దుకాణాలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా? దుకాణాలకు తోడు పర్మిట్‌ రూములు, బెల్టుషాపులు పెడితే లంచాలు ఇస్తారా? లేక బెల్టు షాపులు తీసేసి, పర్మిట్‌ రూములు రద్దు చేస్తే లంచాలు ఇస్తారా?

»  2014–19 మధ్య చంద్రబాబు నిర్ణయించిన బేసిక్‌ రేట్లను పెంచి డిస్టిలరీల నుంచి కొనుగోళ్లు చేస్తే లంచాలు వస్తాయా? లేక పాత రేట్లు కొనసాగిస్తే లంచాలు వస్తాయా? ఇప్పుడున్న డిస్టిలరీల్లో అధిక భాగం అనుమతులు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న వారికి లంచాలు వస్తాయా? లేక ఏ ఒక్క డిస్టి­లరీకీ అనుమతివ్వని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఉన్న వారికి లంచాలు వస్తాయా? ఈ అంశాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలి. 

అన్ని పథకాలకు మంగళం 
ప్రజల నోటిలోకి నాలుగు వేళ్లు ఎందుకు పోవడం లేదు? మన ప్రభుత్వ పథకాలన్నింటినీ ఎందుకు రద్దు చేశారు? సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ హామీలు ఏమయ్యాయి? ఆరోగ్యశ్రీ పూర్తిగా ఎత్తివేశారు. రూ.3,500 కోట్ల బకాయిలు ఎందుకు పెట్టారు? ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వడం లేదు. ప్రతి క్వార్టర్‌కు రూ.700 కోట్లు ఇవ్వాలి. 

గత ఏడాది ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన కింద రూ.3,900 కోట్లు బకాయి పెట్టారు. ఇప్పుడు ఈ ఏడాది ప్రారంభమైంది. మళ్లీ ఈ ఏడాది ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కూడా కలుపుకుంటే, మొత్తం రూ.7,800 కోట్లకు గాను రూ.700 కోట్లు ఇచ్చారు. దీనివల్ల ప్రజలు కష్టాల్లో, బాధల్లో మునిగి ప్రభుత్వ నిర్వాకాలపై దృష్టి పెట్టరని అభిప్రాయం. ఇప్పుడు చంద్రబాబు అదే చేస్తున్నారు.

భూ పందేరాలు.. పనుల్లో యథేచ్ఛగా దోపిడీ
లులూ గ్రూపునకు రూ.1500–2000 కోట్ల విలువైన భూమిని కట్టబెట్టారు. రాజధానిలో నిర్మాణపు పనుల అంచనాలను విపరీతంగా పెంచి దోచేస్తున్నారు. అప్పటి రేట్లతో పోలిస్తే స్టీల్, సిమెంటు రేట్లు పెద్దగా పెరగక పోయినా.. పెరిగాయని చెబుతూ రూ.36 వేల కోట్ల పనులను ఇప్పుడు రూ.77 వేల కోట్లకు పెంచారు. జ్యుడిషియల్‌ ప్రివ్యూ, రివర్స్‌ టెండరింగ్‌ తీసేశారు. మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ విధానం తీసుకొచ్చారు. ఇంత దోపిడీని గతంలో ఎప్పుడూ చూడలేదు. 

బటన్లు నొక్కితే దోపిడీకి వీలు కాదని..
గతంలో అనేకసార్లు నేను చెప్పాను. గతంలో మనం చేసినట్టుగా చంద్రబాబు ఎందుకు బటన్లు నొక్కలేదు అని అడిగాను. బటన్లు నొక్కితే చంద్రబాబు లాంటివారికి ఏమీ రాదు. ప్రజల ఖాతాలకే నేరుగా వెళ్తుంది. అందుకనే చంద్రబాబు బటన్లు నొక్కడం లేదు. రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు తగ్గిపోతున్నాయి. కానీ దేశ వ్యాప్తంగా ఆదాయాలు పెరుగుతున్నాయి. ప్రభుత్వ పెద్దల జేబుల్లోకి ఆదా­యాలు వెళ్తున్నాయి. ఏ రైతుకూ గిట్టుబాటు ధర లేదు. పెట్టుబడి సహా­యం లేదు. ఉచిత పంటల బీమా లేదు. వ్యవస్థల్లో పారదర్శకత లేదు. దాదాపు 4 లక్షల పెన్షన్లు తగ్గించారు. కొత్తగా ఒక్క పెన్షన్‌ ఇచ్చింది లేదు. 

గతంలోనూ మనపై తప్పుడు ప్రచారాలు 
కాంగ్రెస్‌ పార్టీతో విభేదించి బయటకు వచ్చినప్పుడు మనపై ఇప్పటి మాదిరిగానే తప్పుడు ప్రచారాలు, దుర్మార్గపు ప్రచారాలు చేశారు. కానీ ప్రజలు మనల్ని నమ్మారు. ఆశీర్వదించారు. ఇప్పుడు కూడా చంద్రబాబునాయుడిపై వ్యతిరేకతను కప్పి పుచ్చడానికి వాళ్ల మీడియా ప్రయత్నిస్తోంది. కానీ ప్రజల తీర్పే అంతిమం. వాళ్లిచ్చే నిర్ణయాన్ని ఎవ్వరూ మార్చలేరు. రాష్ట్రాన్ని ఒక భయంలో పెట్టి, పాలన కొనసాగించాలన్న చంద్రబాబునాయుడి ధోరణిపై కచ్చితంగా ప్రజలు తగిన రీతిలో స్పందిస్తారు.

వక్ఫ్‌ చట్టం విషయంలో టీడీపీ వ్యవహార శైలిపై చర్చ  
వక్ఫ్‌ చట్టం సవరణ బిల్లుకు సంబంధించి టీడీపీ పార్లమెంట్‌ ఉభయ సభల్లో మద్దతు పలికి, కింది స్థాయిలో కప్ప­దాటు వైఖరితో వ్యవహరిస్తోందని పలువురు పీఏసీ సభ్యు­లు వైఎస్‌ జగన్‌ దృష్టికి తెచ్చారు. టీడీపీ చేసిన ద్రోహాన్ని మైనార్టీలు ఎండగడుతున్నారని.. ఊరూరా ర్యాలీలు, ధర్నాలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా జగన్‌ స్పందిస్తూ.. వక్ఫ్‌ చట్టం అన్నది కేవలం ఒక మతానికో, ఒక వర్గానికో సంబంధించినది కాదని, రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన, ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగింది కాబట్టే దీనిపై న్యాయపరంగా పోరాడేందుకు సుప్రీంకోర్టులో కేసు వేశామని చెప్పారు. 

రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ ఉత్పత్తుల ధరలు గణనీయంగా తగ్గడం గురించి సమావేశంలో చర్చకు వచ్చింది. ధాన్యం, పెసలు, మినుములు, కందులు, శనగలు, పొగాకు, మిర్చి, అరటి, టమాటా, కోకో సహా అన్ని పంటల ధరలు తగ్గిపోయాయని సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆక్వా రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారని, టారిఫ్‌ల బూచి చూపి రైతులను నిలువునా దోచుకున్నారని చెప్పారు. 

ఆక్వా రైతులకు మేలు చేయడానికి, వారికి ప్రభుత్వం అండగా ఉండేందుకు మన ప్రభుత్వం హయాంలో చట్టాలు తీసుకు వచ్చి, విద్యుత్‌ రాయితీలు కూడా కల్పించామని, కానీ ఈ ప్రభుత్వం ఆ చట్టాలను వాడుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే రైతులకు జరుగుతున్న నష్టంపై పార్టీ పలు దఫాలుగా స్పందించిందని, దీనిపై పార్టీ పరంగా మరింతగా పోరాటం చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుని.. కమిటీలుగా ఏర్పడి ముందుకెళ్లాలని వైఎస్‌ జగన్‌  చెప్పారు.

చంద్రబాబు పెడుతున్న కేసులతో ఏమవుతుంది? జైలుకు పంపినంత మాత్రాన ప్రజా వ్యతిరేకతను అణచి వేయలేరు. 16 నెలల పాటు నన్ను జైల్లో పెట్టారు. పార్టీని నడిపే పరిస్థితులు లేకుండా చేశారు. కాని ప్రజలు ఆశీర్వదించారు. ఇవాళ ప్రతి గ్రామంలో మన పార్టీ ఉంది. ఎవ్వరూ ఆపలేరు. ఈ ప్రభుత్వం ఎన్ని కేసులు పెడితే, ప్రజలు అంతగా స్పందిస్తారు. కలియుగంలో రాజకీయాలు ఈ రీతిలోనే ఉంటున్నాయి. 

ఇందుకు భయపడి రాజకీయాలు మానుకుంటారు అనుకోవడం పొరపాటు. ఈ ప్రభుత్వం చేస్తున్న కుట్రలు, పన్నాగాలు తాత్కాలికం. మన పార్టీకి ఉన్న విలువలు, విశ్వసనీయత మనల్ని ముందుండి నడిపిస్తాయి. ప్రజలకు చేసిన మంచి ఇంకా ఆయా కుటుంబాల్లో బతికే ఉంది. ఈ మేరకు పీఏసీ సభ్యులు కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయాలి. వారిలో స్ఫూర్తి నింపాలి. - వైఎస్‌ జగన్‌


యుద్ధ వాతావరణంలో పుట్టిన పార్టీ
» పార్టీని పునర్నిర్మించే కార్యక్రమంలో భాగంగా వివిధ విభాగాలను నిర్మిస్తూ వస్తున్నాం. ఇప్పటికే జిల్లా పార్టీ అధ్యక్షులందర్నీ నియమించాం. వాళ్లు క్షేత్ర స్థాయిలో గట్టిగా యుద్ధం చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ యుద్ధ వాతావరణంలోనే పుట్టింది. పార్టీ పుట్టిన తర్వాత పదేళ్లపాటు మనం యుద్ధ వాతావరణంలోనే ఉన్నాం. రాబోయే రోజుల్లో పార్లమెంటు నియోజక­వర్గాలకూ పరిశీలకులను నియమిస్తాం. పార్టీ రీజినల్‌ కో ఆర్డినేటర్లకు వారు అన్ని రకాలుగా సహాయపడతారు. ఇది పార్టీలో సమన్వయానికి బాగా ఉపయోగపడు­తుంది. ఈ నియామకాల తర్వాత పార్టీ యంత్రాంగం పూర్తి స్థాయిలో నిర్మాణం అవుతుంది.

»  జిల్లా అధ్యక్షులు, పార్లమెంటు నియోజక­వర్గా­లకు పరిశీలకులు, పీఏసీ ఏర్పాటు.. ఇలా అన్ని రకాలుగా పార్టీ నిర్మాణం అవుతోంది. కింది స్థాయిలో జిల్లా కమిటీలు, నియోజకవర్గాల కమిటీలు, మండల స్థాయి కమిటీలు కూడా దాదాపు ఏర్పాటయ్యాయి. ఇక గ్రామ స్థాయికి కూడా పార్టీ వెళ్లాలి. బూత్‌ లెవెల్‌ కమిటీలు కూడా ఏర్పాటు చేసుకోవాలి. వచ్చే ఆరు నెలల్లో మొత్తం నిర్మాణం పూర్తి కావాలి. మన పార్టీ బలోపేతంగా ఉంటేనే, మనకు చాలా ప్రయోజనకరం. ఈ విషయాన్ని అందరూ గుర్తించాలి.  

»  ప్రజల తరఫున మనం పోరాటాలు ఇప్పటికే మొదలుపెట్టాం. ఈ పోరాటాలు మరింత ముమ్మరం అవుతాయి. వచ్చే రెండు, మూడేళ్లలో ప్రజల తరఫున ప్రణాళికా బద్ధంగా పోరాటం చేస్తాం. చివరి ఏడాదిలో ఎన్నికలపై దృష్టి పెడతాం. పార్టీ పీఏసీ సభ్యులు క్రియాశీలకంగా ఉండాలి. ప్రజల తరఫున గొంతు విప్పాలి. అందరూ ప్రజల తరఫున మాట్లాడాలి. దీనివల్ల అన్ని అంశాలూ ప్రజల్లోకి వెళ్తాయి.

» మన పార్టీకి పెద్దగా మీడియా లేదు. టీడీపీకి పత్రికలు, అనేక ఛానళ్లు ఉన్నాయి. సోషల్‌ మీడియాలో వారికి ఉన్మాదులు ఉన్నారు. అందుకనే గ్రామ స్థాయిలో కార్యకర్తలను తయారు చేయాలి. అన్యాయాలను ఎదిరించడానికి, ప్రజల ముందు పెట్టడానికి ఫోన్‌ అనే ఒక బ్రహ్మాండమైన సా«ధనాన్ని వాడుకోవాలి. 
దీనిపై అందరికీ అవగాహన కల్పించాలి.

»  కష్టాల నుంచే నాయకులు ఎదుగుతారు. ప్రతిపక్షంలో మనం చేసే పోరాటాలను ప్రజలు గుర్తిస్తారు. ఆశీర్వదిస్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం చేసే పోరాటాలు, ప్రజా సమస్యల పట్ల స్పందిస్తున్న తీరును ప్రజలు గుర్తిస్తారు. ఒక పార్టీకి నాయకుడిగా వారి పని తీరు కూడా నా దృష్టికి వస్తుంది. ఇంకా టైముందిలే, తర్వాత చూద్దాంలే అన్న ధోరణి వద్దు. పార్టీలో అత్యున్నత స్థాయిలో ఉన్న మీరు స్పందిస్తే, ఆ సంకేతం పార్టీ శ్రేణులకూ వెళ్తుంది.. ప్రజల్లోకీ వెళ్తుంది. ఈ మూడేళ్లూ ప్రజల్లోకి ఉధృతంగా వెళ్లాలి. ప్రజల తరఫున గట్టిగా ప్రశ్నించాలి. పోరాటం చేయాలి. ఇందులో ఎలాంటి రాజీ పడొద్దు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement