మరింత సరళం కానున్న స్థిరాస్తుల క్రయ విక్రయాలు
ఆన్‌లైన్‌తో అక్రమాలకు చెక్
బెంగళూరులో విజయవంతమైన పెలైట్ ప్రాజెక్టు
బడ్జెట్ తర్వాత రాష్ట్ర మంతంటా
అమలుకు ప్రభుత్వం నిర్ణయం
బెంగళూరు: రాష్ట్రంలో ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత సరళం కానుంది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆన్‌లైన్ విధానాన్ని అమలు చేయనుంది. దీంతో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం చుట్టూ తిరిగి మధ్యవర్తులతో జేబులు గుల్ల చేసుకునే బాధ తప్పుతుందని నిపుణులు చెబుతున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఆన్‌లైన్ ప్రక్రియ బడ్జెట్ తర్వాత రాష్ట్ర మంతటా అమలయ్యే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం స్థిరాస్తుల క్రయ విక్రయాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ కోసం కచ్చితంగా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. సిబ్బంది తక్కువగా ఉన్నారన్న నెపం చూపిస్తూ సదరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి చెందిన కొంతమంది అధికారులు ఒకటికి పది సార్లు వినియోగదారులు తమ కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటున్నారు. అంతేకాకుండా సదరు ఆస్తి మార్కెట్ విలువను తక్కువగా చూపిస్తామని చెబుతూ వినియోగదారుల నుంచి ‘కొంత మొత్తం’ లంచం రూపంలో వసూలూ చేస్తున్నారు. ఈమేరకు క్రయ విక్రయాలకు సంబంధించిన పన్ను తక్కువగా వసూలు కావడంతో ఖజానాకు గండి పడుతోంది. ఇటువంటి అక్రమాలన్నింటికీ చెక్ పెట్టడానికి వీలుగా ఇకపై ఆస్తులను ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేయించడానికి అవకాశం కల్పించనున్నారు. క్రయవిక్రయాలకు సంబంధించిన దస్తావేజులను సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి అన్‌లైన్‌లో పంపించాల్సి ఉంటుంది. వాటిని పరిశీలించి నియమిత సమయంలో సదరు దరఖాస్తుదారుడికి సంబంధిత అధికారి అన్‌లైన్‌లోనే సమయాన్ని కేటాయిస్తారు. ఆ సమయంలో దరఖాస్తుదారుడు వెళ్లితే రిజిస్ట్రేషన్ ప్రక్రియ క్షణాల్లో పూర్తవుతుంది. ఈ విధానంలో మన కంటే ఎంతమంది ముందుగా వేచి చూస్తున్నారన్న విషయం కూడా ఆన్‌లైన్‌లో తెలిసిపోతుంది కాబట్టి కార్యాలయాలు చుట్టూ తిరిగే బాధ తప్పుతుంది. ఇక ఆస్తులకు సంబంధించిన దస్తావేజులను అన్‌లైన్‌లో ఉంచడం వల్ల మార్కెట్ విలువను తక్కువ చేసి చూపడం కుదరదు. దీంతో పన్ను వసూలు సక్రమంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఏ ప్రాంతంలో కొన్న ఆస్తులను ఏ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలోనైనా
ప్రస్తుతం ఆస్తుల క్రయ విక్రయాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ సదరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో మాత్రమే జరుగుతోంది. నూతన విధానంలో రాష్ట్రంలో ఏ ప్రాంతంలో కొన్న ఆస్తులనైనా ఏ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలోనైనా రిజిస్ట్రేషన్ చేయించుకునే అవకాశం కల్పించనుంది. ఇందు కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను కూడా రూపొందించారు. పెలైట్ ప్రతిపాదికన బెంగళూరులో ఇప్పటికే ఏ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో కొన్న ఆస్తులనైనా ఇతర సబ్‌రిజ్రిస్టార్ కార్యాలయంలో అన్‌లైన్‌లో విధానంలో రిజిస్ట్రేషన్ చేయించే విధానం విజయవంతంగా అమలవుతోంది. ఇదిలా ఉండగా రాష్ట్ర మంతటా ‘ఈ ఆన్‌లైన్, ఎక్కడి వస్తులనైనా ఏ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలోనైనా రిజిస్ట్రేషన్’ విధానాలను అమలు చేయడానికి వీలుగా రాష్ట్ర రెవెన్యూ చట్టంలో మార్పులు చేస్తూ రూపొందించిన ముసాయిదా బిల్లును ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టి చట్టసభల అనుమతి తీసుకోనుంది.
అటుపై ఈ విధానాన్ని రాష్ట్ర మంతటా అమలు చేయనున్నారు. ఈ విషయమై రాష్ట్ర రెవెన్యూశాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ‘మహారాష్ట్రలో ఈ విధానం ఇప్పటికే అమల్లో ఉంది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అక్కడికి వెళ్లి అధ్యయనం చేసి వచ్చారు. బడ్జెట్ తర్వాత ఈ విధానాన్ని రాష్ట్రమంతటా అమలు చేయనున్నాం.’ అని తెలిపారు.
ఎక్కడినుంచైనా రిజిస్ట్రేషన్
Published Wed, Mar 16 2016 1:34 AM | Last Updated on Sun, Sep 3 2017 7:49 PM
Advertisement