ఆన్‌లైన్‌లో స్టాంప్‌ డ్యూటీ | Stamp duty in online | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌లో స్టాంప్‌ డ్యూటీ

Published Wed, May 31 2017 4:39 AM | Last Updated on Tue, Sep 5 2017 12:22 PM

Stamp duty in online

- రిజిస్ట్రేషన్లలో కొత్త విధానం
ప్రచార లోపంతో అవగాహన లేమి
- నెలరోజులైనా అమలు అంతంతమాత్రమే

నర్సీపట్నం : స్థిరాస్తి కోనుగోలు, విక్రయాల్లో డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్‌ అతి ముఖ్యమైన అంశం. తరాలుగా ఇళ్ల స్థలాలు, భూముల రిజిస్ట్రేషన్‌ వ్యవహారాలు డాక్యుమెంట్ల ద్వారా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు డాక్యుమెంట్ల స్టాంపులు క్రయవిక్రయాలకు సంబంధించి రాయించుకుని రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటున్నారు. దీంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఆలస్యమవుతోంది.
 
ఆదాయం పెంపుదలకు వీలుగా ప్రభుత్వం నెల రోజుల క్రితం నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. రిజిస్ట్రేషన్లకు సంబంధించి మొత్తం ప్రక్రియ ఇక నుంచి ఆన్‌లైన్‌లోనే జరిగేలా చర్యలు తీసుకున్నారు. ఈ పద్ధతి ద్వారా తమ ఆస్తులకు సంబంధించి క్రయవిక్రయాలను ఆన్‌లైన్‌లోనే రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. దీనికి వీలుగా తగిన స్టాంపుడ్యూటీని ఆన్‌లైన్‌లోనే చెల్లించేలా నూతన విధానాన్ని తీసుకువచ్చారు. నూతన విధానం అమలులో జిల్లా రిజిస్ట్రేషన్‌ శాఖ ఆపసోపాలు పడుతోంది. జిల్లాలో 12 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉన్నాయి. వీటిలో ఎక్కడా కూడా ఆన్‌లైన్‌లో స్టాంప్‌ డ్యూటీ విధానం అమలు కావటం లేదు.  

కేంద్ర ప్రభుత్వం పాత నోట్ల రద్దు చేసిన తరువాత నగదు రహిత లావాదేవీలకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. స్టాంపు డ్యూటీని ఆన్‌లైన్‌ విధానం ద్వారా చెల్లిస్తే ఆదాయ మార్గాలు మెరుగవుతాయని భావించి కొత్త విధానం ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి అమలులోకి తీసుకువచ్చారు. అయినా ఆశించిన రీతిలో రిజిస్ట్రేషన్లు జరగటం లేదు.  ఏటీఎంల్లో తగినంత నగదును బ్యాంకర్లు ఉంచటం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గత ఏడాది కంటే సుమారు 30 శాతం తక్కువగా రిజిస్ట్రేషన్లు తక్కువగా జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. రోజుకు డివిజన్‌ వ్యాప్తంగా ఆదాయం రూ. రావాల్సి ఉంది. ఇందులో సగం కూడా రావటం లేదు. ఆన్‌లైన్‌ ద్వారా స్టాంపు డ్యూటీ చెల్లించేందుకు చర్యలు తీసుకుంటే కొంత వరకు అయినా ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు. డ్యక్యుమెంటు రిజిస్ట్రేషన్‌ చేశాక ఆస్తి విలువలో 7.5 శాతం స్టాంపు డ్యూటీ కింద చెల్లించాల్సి ఉంటుంది. దీంతో చాలా వరకు ప్రభుత్వానికి ఆదాయం తగ్గింది. 
 
రెవన్యూ డివిజన్‌ కేంద్రమైన నర్సీపట్నం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం పరిధిలో పదుల సంఖ్యలో దస్తావేజు లేఖర్లున్నారు. ఇప్పటి వరకు కూడా ఆయా ప్రాంతాల్లో దస్తావేజు లేఖర్లు, అధికారుల మధ్య ఉన్న సత్సంబంధాలు వల్ల వారు చెప్పిందే వేదంగా సాగుతోంది. ఒక స్థలాన్ని రిజిస్ట్రేషన్‌ చేయించుకోవడానికి స్టాంపు డ్యూటీ ఎంత అవుతుందనేది వీరే నిర్ణయించేస్తున్నారు. ప్రస్తుతం దీన్ని ఆన్‌లైన్‌లో చేస్తే దస్తావేజు లేఖర్ల ప్రాబల్యం పూర్తిగా తగ్గిపోతుంది. ఇప్పటికే కార్యాలయాల చుట్టూ వారు పాగా వేసి నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు నడిపిస్తున్నారు. ప్రస్తుతానికి కక్షిదారులు దస్తావేజు లేఖర్ల ద్వారానే చలానాలు చెల్లిస్తున్నారు. 
 
నిబంధనలకు విరుద్ధంగా రెండింతల సొమ్మును రిజిస్ట్రేషన్‌ చేయించడానికి వచ్చే వారి నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఇబ్బంది పెడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటే తప్ప పూర్తిస్థాయిలో ఆన్‌లైన్‌ విధానం అమలయ్యేలాలేదు. స్టాంపు డ్యూటీ చెల్లించాలని భావించే వారు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఐజీఆర్‌ఎస్‌.ఏపీ.జీవోవీ.ఐఎన్‌లోకి వెళ్లి ఇంటనెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా మొత్తం చెల్లించాలి. అనంతరం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ట్రైజరీ.ఏపీ.జీవోవీ.ఐఎన్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి రిజిస్ట్రేషన్‌ వివరాలు నమోదు చేసుకోవాలి. అనంతరం వారికి ఒక మెసేజ్‌ వస్తుంది. దాన్ని కార్యాలయానికి వెళ్లి అధికారులకు చూపిస్తే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను వారు పూర్తి చేస్తారు. కక్షిదారులు ఇంటి నుంచే రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి ఈ విధానంలో వీలవుతుంది.  

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement