చార్‌ధామ్ యాత్రకు నేటి (సోమవారం) నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యింది. ఉదయం 7 గంటల నుంచి రిజిస్ట్రేషన్ కోసం వెబ్‌సైట్ ఓపెన్ కానుంది. దీంతోపాటు మొబైల్ యాప్, వాట్సాప్ నంబర్, టోల్ ఫ్రీ నంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ సౌకర్యం అందుబాటులో ఉండనుంది.
కేదార్‌నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రిలను సందర్శించే భక్తులకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి. పర్యాటక శాఖ చార్‌ధామ్ రిజిస్ట్రేషన్ కోసం సన్నాహాలు పూర్తి చేసింది. ఈసారి చార్‌ధామ్ యాత్ర ప్రారంభానికి 25 రోజుల ముందు నుంచే యాత్రికులకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పిస్తున్నారు. తద్వారా వారు తమ ప్రయాణ ప్రణాళికలను తగిన విధంగా రూపొందించుకునేందుకు అవకాశం ఏర్పడనుంది. రిజిస్ట్రేషన్ కోసం యాత్రికులు తమ వివరాలతో పాటు మొబైల్ నంబర్, చిరునామాను జతచేయాలి.
పర్యాటక శాఖ వెబ్‌సైట్ registrationandtouristcare.uk.gov.inకు లాగిన్ అయి, రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే వాట్సాప్ నంబర్ 8394833833కు యాత్ర అని రాసి సందేశం పంపడం ద్వారా కూడా పేరు నమోదు చేసుకోవచ్చు. వెబ్‌సైట్‌లో పేరు నమోదు చేసుకునే అవకాశం లేని ప్రయాణికులు పర్యాటక శాఖ టోల్ ఫ్రీ నంబర్ 01351364కు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు..
గత ఏడాది 74 లక్షల మంది యాత్రికులు చార్‌ధామ్ యాత్రకు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. 56 లక్షల మంది చార్‌ధామ్‌ను సందర్శించారు. ఈసారి కూడా భక్తుల రద్దీ అధికంగా ఉండవచ్చని పర్యాటకశాఖ అంచనా వేస్తోంది. మే 10 నుంచి చార్‌ధామ్ యాత్ర ప్రారంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment