రిజిస్ట్రేషన్ శాఖలో ఆన్‘లైన్ కష్టాలు’
Published Wed, May 10 2017 12:12 AM | Last Updated on Tue, Sep 5 2017 10:46 AM
– మొరాయించిన సర్వర్
– జిల్లా వ్యాప్తంగా స్తంభించిన కార్యాకలాపాలు
కర్నూలు(టౌన్): జిల్లా స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో గత రెండు రోజులుగా ఆన్‌లైన్ వ్యవస్థ స్తంభించింది. ఈ కారణంగా సుదూర ప్రాంతాల నుండి రిజిస్ట్రేషన్ కోసం వచ్చే ప్రజలు అసౌకర్యానికి లోనవుతున్నారు. మంగళవారం ఉదయం కూడా ఆన్‌లైన్ సేవలు స్తంభించడంతో ఈసీ, నకలు, ఫొటో క్యాప్చరింగ్, ఆధార్ ఒపెన్ కాకపోవడంతో సమస్యలు తలెత్తాయి. దీంతో రిజిస్ట్రేషన్‌లపై ప్రభావం పడింది. ప్రతిరోజు కర్నూలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 30, కల్లూరు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో 30 చోప్పున రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తున్నారు. ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న 16 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రతి రోజు 300 వరకు రిజిస్ట్రేన్లు జరుగుతుంటాయి. ఆన్‌లైన్ సమస్య వల్ల ఈ పనులన్నీ నిలిచిపోయాయి.
కేవైసీ సర్వర్‌లో లోపం
రెండు రోజులుగా సర్వర్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. కేవైసీ సర్వర్‌లో లోపం వల్ల అనేక జిల్లాల్లో ఈ పరిస్థితి వచ్చినట్లు సమాచారం ఉంది. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. బుధవారం నాటికి ఆన్‌లైన్ ఇబ్బందులను అధిగమించే అవకాశం ఉంది.
- యు.వి.వి.రత్నప్రసాద్, జిల్లా రిజిస్ట్రార్
Advertisement