stamps
-
డీఐజీ వికృత చేష్టలు.. వీడియో వైరల్!
సాక్షి, గుంటూరు: తాను సమాజంలో బాధత్య గల స్థాయిలో ఉన్నాననే విషయం ఆయన మరిచిపోయారు. భార్యను శారీరంగా హింసించారు. అంతేకాదు.. మరో మహిళతో సంబంధం పెట్టుకుని కట్టుకున్న ఇల్లాలినే మానసికంగా వేధించారు. విసిగిపోయిన ఆ ఇల్లాలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ బాగోతం బయటపడింది. గుంటూరు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డీఐజీ కిరణ్ వికృత చేష్టలు వెలుగులోకి రావడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. గుంటూరు పోస్టల్ కాలనీకి చెందిన తాళ్లూరి అనుసూయా రాణి, భారత్ పేటకు చెందిన వీర్నపు కిరణ్ ఇద్దరు గతంలో పాలకొల్లు ఎల్ఐసీ శాఖలో అసిస్టెంట్లుగా పని చేశారు. 1998 డిసెంబర్లో గుంటూరు శారదాకాలనీ చర్చిలో వీళ్ల వివాహం జరిగింది. అయితే ఈ జంటకు సంతానం కలగకపోవడంతో.. 2002లో ఒక బాలికను దత్తత తీసుకున్నారు. ఈలోపు.. 2009లో కిరణ్‌కుమార్‌కు విజయనగరంలోని రిజిస్ట్రార్‌గా ఉద్యోగం వచ్చింది. ఆపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో 2018లో డీఐజీగా పదోన్నతి లభించింది. అప్పటి నుంచి భర్త కిరణ్‌కుమార్ వికృత చేష్టలను ఆమె చూడసాగింది. ప్రస్తుతం అనుసూయా రాణి గుంటూరు అమరావతి రోడ్డులోని ఎల్ఐసిలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. కిరణ్ నెల్లురు జిల్లాలో డిఐజీగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే.. కొంతకాలంగా వేరే మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకున్న కిరణ్.. వాళ్లతో ఏకాంతంగా గడిపిన ఫొటోలను భార్యకు పంపి మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారు. ఈ క్రమంలో.. ఇద్దరూ దూరంగా ఉంటున్నారు. పది నెలల క్రితం పెద్దల సమక్షంలో రాతపూర్వకంగా రాసి భర్త కిరణ్ కుమార్ బాబును తల్లి సంరక్షణలోనే ఉంచేలా.. పోషణ, చదువు బాధ్యతలు తాను చూసుకునేలా రాసి ఇచ్చారు. అయితే అనసూయ శనివారం విజయవాడలోని ఓ శుభకార్యక్రమానికి వెళ్ళారు. అక్కడ ఆమెను చూసి కిరణ్ రగిలిపోయారు. బాబు సంరక్షణ విషయంలో గొడవ జరిగి ఆమెపై దాడి చేశారు. అంతటితో ఆగకుండా.. ఆస్పత్రి నుంచి తన పుట్టింటికి వెళ్తున్న ఆమెపై మళ్లీ దాడికి యత్నించాడు. దీంతో ఆమె అరండల్‌పేట పోలీసులను ఆశ్రయించారు. కిరణ్‌కుమార్‌ను అదుపులో తీసుకుని స్టేషన్‌కు తరలించిన పోలీసులు.. ఆ భర్త వికృత చేష్టలపై దర్యాప్తు చేస్తున్నారు. -
రాజకీయంగా వాడుకోవాలని చూస్తే సహించం
ఒంగోలు సబర్బన్ : ప్రకాశం జిల్లా ఒంగోలులో సంచలనం సృష్టించిన నకిలీ డాక్యుమెంట్లు, స్టాంపుల కుంభకోణం కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ మలికాగర్గ్ చెప్పారు. ఒంగోలు టూ టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆమె మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడారు. నకిలీ డాక్యుమెంట్లు, స్టాంపుల కుంభకోణం కేసును ఎవరైనా రాజకీయంగా వాడుకోవాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కేసులో ఏ పార్టీ వాళ్లు ఉన్నా వదిలిపెట్టేది లేదన్నారు. 20 రోజుల క్రితం వేరే కేసులో ఒంగోలు తాలూకా పోలీసులు తనిఖీ చేస్తుంటే అక్కడ నకిలీ స్టాంపులు, డాక్యుమెంట్లు బయటపడ్డాయని, అప్పటి నుంచి వేగంగా కేసు దర్యాప్తు జరుగుతోందన్నారు. ఈ కేసు దర్యాప్తును వేగంగా చేపట్టాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి స్వయంగా తనతో చెప్పారని తెలిపారు. తనతో పాటు కలెక్టర్ ఏఎస్ దినే‹Ùకుమార్‌తో కూడా ఈ కేసు విషయంపై బాలినేని స్పష్టంగా మాట్లాడినట్టు చెప్పారు. ఈ కేసులో ఏ పార్టీ వారున్నా, చివరకు తన అనుచరులున్నా సరే ఎలాంటి రాజకీయ ఒత్తిడులకు తలొగ్గవద్దని కూడా బాలినేని స్పష్టం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. కొన్ని పార్టీలు రాజకీయ ప్రాబల్యం కోసం అనవసర ఆరోపణలు చేస్తున్నాయని, వెంటనే మానుకోవాలని సూచించారు. ఈ కేసుకు సంబంధించి ఎలాంటి ఆధారాలున్నా పోలీస్ అధికారులకు తెచ్చివ్వాలని సూచించారు. అంతే కానీ రాజకీయ స్వార్థం కోసం పోలీస్ దర్యాప్తును పక్కదారి పట్టిస్తే మాత్రం సహించేది లేదని ఎస్పీ హెచ్చరించారు. ‘కేసులో వేలకొలది డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నాం. వాటిలో 130 డాక్యుమెంట్లను నిశితంగా పరిశీలిస్తున్నాం. వాటిలో నకిలీవి ఎన్ని, అసలు డాక్యుమెంట్లు ఎన్ని ఉన్నాయో అటు రెవెన్యూ, ఇటు రిజి్రస్టేషన్ల శాఖల సమన్వయంతో దర్యాప్తు జరుగుతోంది. ఇప్పటికే ఎనిమిది మందిని అరెస్ట్ చేశాం, మరో 12 మందిని అరెస్ట్ చేయాల్సి ఉంది. ఇంకా ఎవరెవరి పాత్ర ఇందులో ఉందో కూడా లోతుగా దర్యాప్తు చేస్తున్నాం’ అని అన్నారు. తొలుత దర్శి డీఎస్పీతో సిట్ ఏర్పాటు చేశామని, కేసు తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఒంగోలు ఏఎస్పీ కే.నాగేశ్వరరావుకు కేసును అప్పగిస్తూ అప్‌గ్రేడ్ చేసినట్టు తెలిపారు. -
AP: ఇక దస్తావేజులతో పని లేదు.. రిజిస్ట్రేషన్ల వ్యవస్థలో ఈ–స్టాంపులకు శ్రీకారం
సాక్షి, అమరావతి: ఇకపై ఆస్తుల రిజిస్ట్రేషన్లు, అగ్రిమెంట్లు వంటి వాటి కోసం దస్తావేజులు (నాన్–జ్యుడిషియల్ స్టాంపులు) వినియోగించాల్సిన అవసరం లేదు. ఈ–స్టాంపుల ద్వారా ఈ పనులన్నింటినీ చేసుకునే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. అంటే రూ.100, రూ.50 ఇతర నాన్–జ్యుడిషియల్ స్టాంపులను స్టాంప్ వెండర్ల వద్ద కొనక్కర్లేదు. ప్రభుత్వం అనుమతించిన కామన్ సర్విస్ సెంటర్లలో ఎంత డినామినేషన్ కావాలంటే అంతకి ఈ–స్టాంపులను సులభంగా పొందొచ్చు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఈ–స్టాంపింగ్ విధానం పూర్తిగా అందుబాటులోకి వచ్చింది. ఈ–స్టాంపుల ద్వారా ట్యాంపరింగ్‌కు, అవకతవకలకు ఆస్కారం ఉండదు. 1,200 కామన్ సర్విస్ సెంటర్లకు అనుమతి మొదట్లో ప్రయోగాత్మకంగా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల (అగ్రిమెంట్లు వంటివి) కోసం ఈ–స్టాంపింగ్‌ను అనుమతించారు. ఇప్పుడు రిజిస్ట్రేషన్లకు సైతం ఈ–స్టాంపింగ్‌ను ప్రభుత్వం అనుమతించింది. ఇందుకోసం 1,200 కామన్ సర్విస్ సెంటర్లు (ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్లు (ఏసీసీ)–మీ సేవా కేంద్రాలు వంటివి), 200 మంది స్టాంప్ వెండర్లకు ఈ–స్టాంపింగ్ చేసేందుకు లైసెన్సులు ఇచ్చింది. ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ఈ–స్టాంపింగ్‌కి సంబంధించి ఒక కౌంటర్‌ను ప్రారంభిస్తోంది. ఏసీసీ సెంటర్లు అందుబాటులో లేనివారు, వాటి గురించి తెలియని వారు నేరుగా ఆ కేంద్రాల వద్ద కెళ్లి ఈ–స్టాంపులు పొందొచ్చు. గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ ఈ–స్టాంపింగ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. తొలి దశలో మండల కేంద్రాల్లో ఉన్న సచివాలయాల్లో తేవడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే 30 శాతం రిజిస్ట్రేషన్లు ఈ–స్టాంపింగ్ ద్వారానే.. ఇప్పటికే నెల నుంచి ఈ–స్టాంపింగ్ విధానం ద్వారా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రోజూ సగటున 10 వేల రిజిస్ట్రేషన్లు జరుగుతుంటే అందులో 30 శాతం ఈ–స్టాంపుల ద్వారానే జరుగుతున్నట్లు ఈ విధానాన్ని పర్యవేక్షిస్తున్న స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ గుంటూరు డీఐజీ శ్రీనివాస్ తెలిపారు. వచ్చే నెల రోజుల్లో 70 శాతానికిపైగా రిజిస్ట్రేషన్లు ఈ–స్టాంపింగ్ ద్వారానే జరిగేలా చూసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దస్తావేజుల కంటే ఎక్కువ భద్రత నాన్–జ్యుడిషియల్ స్టాంపు పేపర్ల కంటే ఈ–స్టాంపులకు ఎక్కువ భద్రత ఉంటుంది. వీటిని ట్యాంపరింగ్ చేయడం అసాధ్యం. పాత తేదీల మీద స్టాంపులు విక్రయించే అవకాశం ఉండదు. దస్తావేజుల వ్యవస్థపై ప్రభుత్వ నియంత్రణ ఉండేది కాదు. కానీ ఈ–స్టాంపింగ్ వ్యవస్థ పూర్తిగా ప్రభుత్వ ఆదీనంలోనే ఉంటుంది. ప్రజలు మోసపోవడానికి ఆస్కారం ఉండదు. గతంలో మాదిరిగా దస్తావేజులను అధిక ధరలకు కొనే బాధ కూడా తప్పుతుంది. ఏసీసీ సెంటర్‌కి వెళితే అక్కడ ఒక దరఖాస్తు పూర్తి చేస్తే చాలు.. ఈ–స్టాంపు ఇస్తారు. నాన్–జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ల మాదిరిగా రూ.100, రూ.50, రూ.20, రూ.10 ఎంత డినామినేషన్ అయినా ఈ–స్టాంపుల ద్వారా పొందొచ్చు. సుమారు రూ.రెండు లక్షల డినామినేషన్ వరకు ఈ–స్టాంపులు జారీ చేసే అవకాశాన్ని కల్పించారు. పలు బ్యాంకులు సైతం ఈ–స్టాంపింగ్‌కి అనుమతి తీసుకుంటున్నాయి. వినియోగదారులు ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం స్టాంప్ డ్యూటీ, ఇతర చార్జీలను కూడా ఇకపై బ్యాంకుల్లో చలానాలుగా కాకుండా ఈ ఏసీసీ కేంద్రాల్లోనే చెల్లించే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ–స్టాంపింగ్ విధానాన్ని స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా రిజిస్ట్రేషన్ల శాఖ అమలు చేస్తోంది. ఈ–స్టాంపులతో ఎంతో మేలు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా రిజిస్ట్రేషన్ల శాఖలో ఈ–స్టాంపుల విధానాన్ని ప్రవేశపెట్టాం. దస్తావేజుల స్థానంలో ప్రజలు వీటిని వినియోగించుకోవచ్చు. నాన్–జ్యుడిషియల్ స్టాంపుల కంటే వీటికే భద్రత ఎక్కువగా ఉంటుంది. ఏసీసీ కేంద్రాలు అందుబాటులో లేని వారు తమకు సమీపంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్లి ఈ–స్టాంపింగ్ అవకాశాన్ని పొందొచ్చు. రిజిస్ట్రేషన్ల వ్యవస్థలో ఈ విధానం ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది. – వి.రామకృష్ణ, కమిషనర్ అండ్ ఐజీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ -
మార్గదర్శి కార్యాలయంలో 3వ రోజు ముగిసిన సోదాలు
-
సర్వాయి పాపన్న పోస్టల్ స్టాంపులు ముద్రించాలి: మంత్రి శ్రీనివాస్‌గౌడ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని మారుమూల పల్లెలో జన్మించి రాజుగా ఎదిగిన దివంగత సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్‌పై వివిధ డినామినేషన్లలో పోస్టల్ స్టాంపులు ముద్రించి విడుదల చేయాలని ఎక్సైజ్ శాఖమంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ హైదరాబాద్ రీజినల్ పోస్ట్‌మాస్టర్ జనరల్ పీవీఎస్ రెడ్డిని కోరారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ లేఖ రాశారు. 17వ శతాబ్దంలో వరంగల్ జిల్లా ఘన్పూర్ మండలం తాటికొండలో జన్మించిన, వరంగల్ జిల్లాలోని ఖిల్లాషాపూర్ నుంచి పాలించిన నాయకుడు సర్వాయి పాపన్న అని పేర్కొన్నారు. ఆయన్ను చరిత్రకారులు బార్బరా, థామస్ మెట్కాఫ్ ‘రాబిన్ హుడ్–లైక్’ అని వర్ణించారని గుర్తు చేశారు. మొఘల్ పాలకుడు ఔరంగజేబుకు వ్యతిరేకంగా పోరాడటానికి ప్రజలనే సైన్యంగా నియమించుకున్న నాయకుడు సర్దార్ పాపన్న అని అన్నారు. -
రిజిస్ట్రేషన్లలో సరికొత్త శకం.. ఏపీలో సేవలు మరింత చేరువ
సాక్షి, అమరావతి: రిజిస్ట్రేషన్ విధానంలో సమూల మార్పులను తీసుకొచ్చి డిజిటల్ స్టాంపుల వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. నాన్–జ్యుడిషియల్ స్టాంపు పేపర్ల విక్రయాలు, రిజిస్ట్రేషన్ చార్జీల చెల్లింపుల్లో ఎదురవుతున్న ఇబ్బందులు, అవకతవకలకు ఈ విధానంతో తెర పడనుంది. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే డిజిటల్ స్టాంపులను అందుబాటులోకి తేవడంతోపాటు డిజిటల్ చెల్లింపులన్నీ అక్కడి నుంచే పూర్తి చేసే వ్యవస్థకు శ్రీకారం చుడుతుండడంతో వినియోగదారులకు రిజిస్ట్రేషన్ల సేవలు మరింత చేరువ కానున్నాయి. చదవండి: AP: రూ.100 కోట్లతో ల్యాబ్‌లు బలోపేతం తరలింపులో పలు సమస్యలు.. ప్రస్తుతం 90 శాతం నాన్–జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ల విక్రయాలు స్టాంపు వెండార్ల ద్వారానే జరుగుతున్నాయి. అవసరాన్ని బట్టి రూ.10, రూ.20, రూ.50, రూ.100 స్టాంప్ పేపర్లను ఆర్డర్ ఇచ్చి నాసిక్‌లోని కేంద్ర ముద్రణ సంస్థ నుంచి రిజిస్ట్రేషన్ల శాఖ తెప్పిస్తోంది. వాటిని రాష్ట్రానికి తరలించడం, భద్రపరచడం, జిల్లా రిజిస్ట్రార్లకు పంపడం, అక్కడ నుంచి స్టాంపు వెండార్లకు సరఫరా చేయడం కష్టతరంగా మారింది. స్టాంపు పేపర్లకు ఆర్డర్ ఇవ్వడం నుంచి వెండార్ల ద్వారా విక్రయించడం వరకు పలు సమస్యలు, వ్యయ ప్రయాసలు ఎదురవుతున్నాయి. పాత తేదీలతో స్టాంపుల విక్రయాలు లాంటి అవకతవకలకు ఆస్కారం ఏర్పడుతోంది. రవాణా, నిల్వ, సరఫరా కోసం రూ.కోట్లలో ఖర్చు కావడంతోపాటు పని భారం పెరుగుతోంది. డిజిటల్ స్టాంపులతో ఈ సమస్యలన్నింటికీ తెర పడుతుంది. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలూ అక్కడే.. డిజిటల్ స్టాంపుల విక్రయాలు జరిగే కేంద్రాల్లోనే రిజిస్ట్రేషన్ చార్జీలు, యూజర్ చార్జీలు, స్టాంప్ డ్యూటీని ఆన్లైన్ ద్వారా చెల్లించే సౌలభ్యం తెస్తున్నారు. ప్రస్తుతం ఈ చార్జీలను వినియోగదారులు డాక్యుమెంట్ రైటర్ల ద్వారా బ్యాంకు చలానాల రూపంలో చెల్లిస్తున్నారు. ఈ చలానాలను తీసుకునే వద్ద ఇటీవల భారీ కుంభకోణం బయటపడిన విషయం తెలిసిందే. చలానాలు దుర్వినియోగం కాకుండా చెల్లింపుల్లో పారదర్శకత తెస్తూ ఎస్‌హెచ్íసీఐఎల్ కేంద్రాల్లోనే ఆన్లైన్లో చెల్లించే ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిద్వారా వినియోగదారులు మధ్యవర్తులపై ఆధారపడకుండా నేరుగా ఈ కేంద్రాల వద్ద ఆన్లైన్లో డిజిటల్ స్టాంపులను కొనుగోలు చేసి అక్కడే స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలు చెల్లించే అవకాశం ఉంటుంది. రిజిస్ట్రేషన్లు చేయించుకునేవారు స్టాంప్ పేపర్లను కొనకుండా నేరుగా డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారానే ఆ సౌకర్యాన్ని వినియోగించుకునే అవకాశం ఉంటుంది. స్టాంప్ డ్యూటీని ఆన్లైన్లోనే చెల్లించి రిజిస్టర్ అయిన డాక్యుమెంట్‌ను నేరుగా డిజిటల్‌గా పొందవచ్చు. దీనివల్ల రిజిస్ట్రేషన్ల శాఖకు ఖర్చు, పని భారం తగ్గడంతోపాటు వినియోగదారులకు సౌకర్యంగా ఉంటుంది. అవకతవకలు, మధ్యవర్తుల ప్రమేయానికి తెర పడుతుంది. రిజిస్ట్రేషన్ల వ్యవస్థలో ఈ విధానాన్ని తీసుకురావాలని గతంలో చాలా ప్రభుత్వాలు ప్రతిపాదించినా అమలుకు నోచుకోలేదు. ఇప్పుడు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం దీన్ని సాకారం చేస్తూ రిజిస్ట్రేషన్ల వ్యవస్థను పారదర్శకంగా తీర్చిదిద్దుతోంది. ఎస్‌హెచ్‌సీఐఎల్‌తో ఒప్పందం.. దేశంలో డిజిటల్ స్టాంపుల వ్యవస్థ అమలు బాధ్యతను కేంద్ర ప్రభుత్వం స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌కు(ఎస్‌హెచ్‌సీఐఎల్) అప్పగించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ సంస్థ ద్వారానే డిజిటల్ స్టాంపుల విక్రయాల కోసం ఎంవోయూ కుదుర్చుకుంది. దీని ప్రకారం ఈ సంస్థ గ్రామ, వార్డు సచివాలయాలు, కామన్ సర్వీస్ సెంటర్లు, స్టాంప్ వెండార్లతో ఎక్కడికక్కడ ఒప్పందాలు చేసుకుని డిజిటల్ స్టాంపుల విక్రయాలను నిర్వహిస్తుంది. ఇందుకోసం ఇంటర్ మీడియట్ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. రాష్ట్రంలోసుమారు 3 వేల కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సచివాలయాల్లో డిజిటల్ అసిస్టెంట్లకు వీటి విక్రయాల బాధ్యతలు అప్పగించనున్నారు. ఇప్పటికే 37 సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల సేవలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పుడు డిజిటల్ స్టాంపులను వినియోగదారులు అక్కడే ఆన్లైన్లో కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. త్వరలో అందుబాటులోకి... డిజిటల్ స్టాంపుల వ్యవస్థ చాలా సమస్యలకు పరిష్కారం చూపుతుంది. ఎస్‌హెచ్‌సీఐఎల్‌తో ఒప్పందం చేసుకున్నాం. 10 రోజుల్లో ఆ సంస్థ రాష్ట్రంలో పని ప్రారంభిస్తుంది. త్వరలో డిజిటల్ స్టాంపుల వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. దీనివల్ల పూర్తిస్థాయి పారదర్శకత ఏర్పడుతుంది. వి.రామకృష్ణ, కమిషనర్ అండ్ ఐజీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ -
రిజిస్ట్రేషన్ శాఖలో డిజిటల్ స్టాంపులు
సాక్షి, అమరావతి: రిజిస్ట్రేషన్ల శాఖలో పూర్తి స్థాయిలో ఈ–స్టాంపుల (డిజిటల్ స్టాంపుల) వ్యవస్థను తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న నాన్–జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ల స్థానంలో ఈ వ్యవస్థను ప్రవేశపెడితే ఇప్పుడున్న అనేక సమస్యలకు చెక్ పెట్టవచ్చని భావిస్తోంది. రాష్ట్రంలో పలుచోట్ల ఈ–స్టాంపింగ్ సౌకర్యం ఉన్నా.. అది చాలా నామమాత్రంగానే అమలవుతోంది. రానున్న రోజుల్లో ఈ–స్టాంపుల విధానాన్నే పూర్తిగా అమలు చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. నాన్–జ్యుడిషియల్ స్టాంప్ పేపర్లు అన్ని రాష్ట్రాలకు నాసిక్‌లోని కేంద్ర ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ నుంచి సరఫరా అవుతాయి. అవసరాన్ని బట్టి రూ.10, రూ.20, రూ.50, రూ.100 స్టాంప్ పేపర్లను రిజిస్ట్రేషన్ల శాఖ ఆర్డర్ ఇచ్చి తెచ్చుకుంటుంది. అక్కడి నుంచి మన రాష్ట్రానికి వాటిని తీసుకురావడం, భద్రపర్చడం, జిల్లా రిజిస్ట్రార్లకు పంపడం, అక్కడ వారు భద్రపర్చడం, స్టాంపు వెండర్లకు సరఫరా చేయడం కష్టతరంగా మారింది. పోస్టాఫీసుల్లోనూ స్టాంప్ పేపర్లు అందుబాటులో ఉంచుతున్నా ఎక్కువ భాగం స్టాంప్ వెండర్ల ద్వారానే వీటి విక్రయం జరుగుతోంది. స్టాంప్ పేపర్లు ఆర్డర్ ఇవ్వడం నుంచి వెండర్ల ద్వారా విక్రయించడం వరకు అనేక సమస్యలు, వ్యయప్రయాసలు నెలకొంటున్నాయి. అవకతవకలకు ఆస్కారం ఏర్పడుతోంది. రవాణా, నిల్వ, సరఫరాకు రూ.కోట్లలో ఖర్చవడంతోపాటు పని భారం ఎక్కువవుతోంది. ఈ–స్టాంపుల వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రవేశపెడితే ఇవన్నీ పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఎస్‌హెచ్‌ఐఎల్‌కు అప్పగింత దేశంలో ఈ–స్టాంపుల వ్యవస్థను అమలు చేసే బాధ్యతల్ని కేంద్ర ప్రభుత్వం స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌కు (ఎస్‌హెచ్‌ఐఎల్) అప్పగించింది. పలు రాష్ట్రాల్లో ఈ సంస్థే ఈ–స్టాంపుల విధానాన్ని అమలు చేస్తోంది. మన రాష్ట్రంలోనూ ఈ సంస్థ రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా కొన్నిచోట్ల కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దీన్ని మరింత విస్తృతం చేసేందుకు రిజిస్ట్రేషన్ల శాఖ సంప్రదింపులు జరుపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని రిజిస్ట్రార్ కార్యాలయాలను ఎస్‌హెచ్‌ఐఎల్‌తో అనుసంధానం చేయడం ద్వారా ఈ–స్టాంపుల విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఢిల్లీ, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో ఈ–స్టాంపింగ్ వ్యవస్థ పక్కాగా అమలవుతోంది. స్టాంప్ డ్యూటీని ఆన్లైన్లోనే చెల్లించి రిజిస్టర్ అయిన డాక్యుమెంట్‌ను నేరుగా డిజిటల్‌గా పొందవచ్చు. దీనివల్ల రిజిస్ట్రేషన్ల శాఖకు ఖర్చు, పని భారం తగ్గడంతోపాటు వినియోగదారులకు పని సులభమవుతుంది. ఈ–స్టాంపింగ్ ద్వారా పారదర్శకత, పని సులభం – వి.రామకృష్ణ, కమిషనర్ అండ్ ఐజీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఈ–స్టాంపింగ్ ద్వారా పూర్తిస్థాయి పారదర్శకత ఏర్పడుతుంది. స్టాంప్ పేపర్లతో పనిలేకుండా అంతా డిజిటల్‌గా చేయడం వల్ల పని మరింత సులభతరమవుతుంది. కేంద్ర ప్రభుత్వ అధీకృత సంస్థ ఎస్‌హెచ్‌ఐఎల్ ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. త్వరలో మన రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఈ–స్టాంపింగ్‌ను ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. -
నగదు లావాదేవీలపై నిరంతర నిఘా
కైకలూరు : ఇకపై ప్రధాన నగదు లావాదేవీలపై నిరంతర నిఘా కొనసాగిస్తామని కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మండవల్లి సబ్ రిజిస్ట్రార్ నకిలీ చలానా కేసులో ప్రధాన నిందితుడు రామ్థీరజ్ను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించినట్టు తెలిపారు. కైకలూరు సర్కిల్ కార్యాలయం వద్ద స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ రవీంద్రనాథ్, గుడివాడ డీఎస్పీ సత్యానందంతో కలసి గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ముందుగా మోసపోయిన బాధితులు ప్రసాద్, వీరసత్యబాబులు తాము ఏ విధంగా నష్టపోయారో వివరించారు. ఎస్పీ మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, డీజీపీ గౌతమ్ సవాంగ్‌లు.. నకిలీ చలానా కేసుపై సమీక్ష చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారని, దీంతో గుడివాడ డీఎస్పీ సత్యానందంను ప్రత్యేకాధికారిగా నియమించి విచారణ జరిపించినట్టు తెలిపారు. తండ్రీకొడుకులది ప్రధాన పాత్ర.. మండవల్లికి చెందిన స్టాంప్ వెండర్ మేడేపల్లి రామ్థీరజ్, అతని తండ్రి డాక్యుమెంట్ రైటర్ బాలాజీ కలిసి.. 568 రిజిస్ట్రేషన్ల నిమిత్తం 640 చలానాలలో రూ.2,68,04,943 ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉండగా, చలానాలను మార్ఫింగ్ చేసి కేవలం రూ.15,92,158 మాత్రమే చెల్లించినట్టు తెలిపారు. అదే విధంగా నాన్–జ్యుడిషియల్ స్టాంపుల కొనుగోలు నిమిత్తం ఏడు చలానాల ద్వారా రూ.1,55,800 చెల్లించాల్సి ఉండగా.. కేవలం రూ.1,981 మాత్రమే చెల్లించి, ప్రభుత్వానికి రూ.1,53,819 జమ చేయలేదన్నారు. ఈ నెల 19న సబ్ రిజిస్ట్రార్ ఇచ్చిన ఫిర్యాదుతో మండవల్లిలో కేసు నమోదు చేసి, బాధితులతో 21న డీఎస్పీ సమావేశం నిర్వహించినట్టు తెలిపారు. కేసును ఛేదించిన గుడివాడ డీఎస్పీ, కైకలూరు సీఐ వైవీవీఎల్ నాయుడు, మండవల్లి ఎస్ఐ రామకృష్ణను అభినందించారు. అలాగే మండవల్లి నకిలీ చలానా కేసులో పోలీసుల పనితీరు అభినందనీయమని స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ డీఐజీ రవీంద్రనాథ్ ప్రశంసించారు. -
వినూత్న ప్రయత్నం: స్టాంపులపై సాహితీ ముద్ర
సాక్షి, హైదరాబాద్: శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలోని ఆధునిక మార్పులు, తాత్విక అంశాలు కలగలిపి అద్భుత రచనలతో సాహిత్యంలో తొలి నోబెల్ బహుమతి అందుకున్న ఫ్రెంచ్ రచయిత సల్లీ ప్రుధోమ్మే... కాల్పనిక పాత్రలు సృష్టించి, అవి చేసే పనులతో మనల్ని కాల్పనిక లోకంలో విహరింపజేసిన బ్రిటిష్ రచయిత చార్లెస్ డికెన్స్... కవిత్వం అంటే ఇలా ఉండాలి అని ప్రపంచం నలుమూలలా అనిపించుకున్న రాబర్ట్ ఫ్రాస్ట్... 103 పద్యాల సంకలనంతో భక్తి భావాన్ని కళ్లముందు నిలిపి మన దేశానికి ఏకైక సాహిత్య నోబెల్ సాధించిపెట్టిన రవీంద్రనాథ్ ఠాగూర్... ఇలా ఒకరేమిటి.. ఏకంగా వెయ్యి మంది కవులు, రచయితలు, ఇతర సాహితీవేత్తలు. ప్రపంచవ్యాప్తంగా విశేషంగా సాహితీ సేవ చేసినవారు. ఆయా ప్రభుత్వాలు వారి పేరుతో తపాలాబిళ్లలు (స్టాంపులు) విడుదల చేసి నివాళులు అర్పించాయి. కొందరు మాతృదేశానికే పరిమితం కాకుండా.. ఇతర దేశాల్లోనూ తపాలాబిళ్లలపై సగౌరవంగా నిలిచారు. అలా తమదైన ‘ముద్ర’వేసుకున్న వెయ్యి మంది సాహితీవేత్తల పోస్టల్ స్టాంపులు ఒకచోట చేరాయి. భారత్ డైనమిక్ లిమిటెడ్ (బీడీఎల్) చీఫ్ విజిలెన్సు అధికారి వెన్నం ఉపేందర్ ఈ వినూత్న సేకరణ చేశారు. స్వతహాగా కవి అయిన ఉపేందర్‌కు ప్రపంచ సాహితీమూర్తులంటే ఎంతో అభిమానం. ఆయన మాతృసంస్థ తపాలా శాఖ కావడంతో పోస్టల్ స్టాంపులంటే ప్రత్యేక ఇష్టం. ఈ రెండు అభిరుచులను ఒకటి చేసి.. సాహితీరంగంలో విశేష సేవలందించిన వారి పేరిట విడుదలైన స్టాంపులను సేకరించారు. కొన్ని నెలల పాటు ప్రయత్నించి.. వంద దేశాలకు చెందిన వెయ్యి మంది సాహితీవేత్తల చిత్రాలున్న 1,100 స్టాంపులు, ప్రత్యేక పోస్టల్ కవర్లను సేకరించారు. నోబెల్ సాహిత్య బహుమతి ప్రారంభమైన 1901 నుంచి 2017 వరకు ఆ అవార్డు పొందిన 186 మంది చిత్రాలున్న స్టాంపులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం బ్రెజిల్లో జరుగుతున్న అంతర్జాతీయ తపాలాబిళ్లల ప్రదర్శనలో వీటిని అందుబాటులో ఉంచారు. ఇంతమంది సాహితీవేత్తల పేరిట విడుదలైన స్టాంపులు ఒకేచోట ఉండటం పట్ల సందర్శకులు ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నారు. ఇంతకు ముందు కూడా.. గతంలో రామాయణం ఇతివృత్తంగా వివిధ దేశాలు విడుదల చేసిన పోస్టల్ స్టాంపులను ఉపేందర్ సేకరించారు. వాటిపై ఉన్న చిత్రాలతో రామాయణ గాథను వివరించగలిగేంతగా ఆ సేకరణ ఉండటం విశేషం. అప్పట్లో అది లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ఇప్పుడు సాహితీవేత్తల స్టాంపుల సేకరణను కూడా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తించిందని, 2022 బుక్‌లో పొందుపరచనుందని ఉపేందర్ చెప్పారు. త్వరలో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నిర్వాహకులు కూడా తన సేకరణను పరిశీలించనున్నారని తెలిపారు. ప్రపంచంలో మరెవరూ ఇలా సేకరించలేదు వెయ్యి మంది సాహితీవేత్తలతో కూడిన తపాలా బిళ్లలను ఇప్పటివరకు ప్రపంచంలో ఎవరూ సేకరించిన దాఖలాలు లేవు. నా ప్రయత్నమే మొదటిది. నా అభిమానాన్ని, అభిరుచితో రంగరించి ఇలా చాటుకున్నందుకు సంతోషంగా ఉంది. – వెన్నం ఉపేందర్, బీడీఎల్ చీఫ్ విజిలెన్స్ అధికారి చదవండి: రేపు పీవీ శతజయంతి ఉత్సవాలు -
నాన్న ప్రేమకు స్టాంప్
కలం స్నేహం, దేశదేశాల నుంచి కొత్త కొత్త స్టాంపులు, నాణాలు, ఉత్తరాలు సేకరించడం,ఇది నాటి ట్రెండ్...వాట్సాప్, యాప్స్, ఈమెయిల్, ట్విటర్, ఫేస్బుక్, యూ ట్యూబ్...ఇది నేటి ట్రెండ్..నాటి ట్రెండ్‌ని పరిరక్షించడం ఎలా... వాటిని వెల కట్టడం ఎలా...అరవయ్యేళ్ల క్రితం తండ్రి దాచిన స్టాంపులకు దుర్గ వారసురాలిగా నిలిచారు.వయోభారం, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న దుర్గకు వాటిని భద్రపరచడం కష్టంగా ఉంది... దాంతో అరుదైన స్టాంపుల కలెక్షన్‌పై ఆసక్తి ఉన్నవారికి వీటిని ఇచ్చి, వాటిని దాచే భారం నుంచి, ఆర్థిక భారం నుంచి బయట పడాలనుకుంటున్నారు తెనాలి వాస్తవ్యురాలు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే...మా నాన్నగారు కుప్పా సుబ్రహ్మణ్య శాస్త్రి, డిఫెన్స్‌లో జిఆర్ఈఎఫ్ అంటే జనరల్ రెజీమ్ ఇంజినీర్ ఫోర్స్ సెంటర్లో 20 ఏళ్లు పనిచేశారు. 1983లో 46 సంవత్సరాల వయసులో కాలం చేశారు.నాన్నగారికి ఉద్యోగంలో ఉన్నన్ని రోజులూ సెలవులు ఉండేవి కాదు. అందువల్ల సంవత్సరానికోసారి 20 రోజులు ఉండే సెలవుల్లో మాత్రమే ఇంటికి వచ్చి మాతో గడిపేవారు. అస్సాం వంటి దూర ప్రాంతాలలో పనిచేస్తున్నప్పుడు, ప్రయాణానికే పది రోజులు పట్టేది, అందువల్ల ఒక్కోసారి ఇంటికి వచ్చేవారు కాదు. మాకు నాన్నగారితో కలిసి ఉండటానికి అవకాశం ఉండేది కాదు. అన్నీ అమ్మే చూసుకునేది. మేం ముగ్గురం ఆడపిల్లలం. అమ్మ మా కోసం, మా చదువుల కోసం బందరులో ఉండేది. నాన్నగారు బదరీలో పనిచేస్తున్న రోజుల్లోనే కన్నుమూశారు. నాన్నగారు పోయినప్పుడు నేను విజయవాడలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాను. నాన్నగారి కలం స్నేహం వల్లే... నాన్నగారికి కలం స్నేహితులు ఉండేవారట. వారి ద్వారా సేకరించిన స్టాంపులను సెలవుల్లో ఇంటికి వచ్చినప్పుడు తెచ్చి దాచేవారట. నాన్నగారికి చిన్నప్పటి నుంచీ ఈ అలవాటు ఉండేదట. తరచు బదిలీలు అవుతుండటం కారణంగా అక్కడ ఏర్పడిన కొత్త పరిచయాల ద్వారా కూడా నాన్న స్టాంపులు సేకరించేవారట. నాన్నగారు పోయాక కూడా ఆ స్టాంపులు ఇంట్లోనే ఉండేవి. అయితే అవి ఉన్నాయని మాకు తెలీదు. నాన్నగారు పోయిన తరవాత అమ్మని... అమ్మమ్మ, మావయ్య వాళ్లు నిద్ర చేయించడం కోసం వాళ్ల ఇంటికి తీసుకువెళ్లారు. అమ్మ వెనక్కి వచ్చాక, ఒకసారేవో అవసరమై అటక మీద చూసినప్పుడు నాకు కనిపించాయి. కొన్ని స్టాంపులు అప్పటికే పాడైపోయాయి. స్టాంపుల ఆల్బమ్స్, ఫస్ట్ డే కవర్లు మాత్రం ఉన్నాయి. ఇవన్నీ నాన్న ఎప్పుడు సేకరించారో మాకు అర్థం కాలేదు. అప్పుడు చెప్పింది అమ్మ ఈ విషయాలన్నీ. నా దగ్గరే... అమ్మను చూడటానికి అక్కలిద్దరికీ కుదరకపోవడం తో నేను నా దగ్గరకు అమ్మని తీసుకుని వచ్చేశాను. అమ్మ అనారోగ్యం... అత్తగారి బాధ్యత అమ్మకి పెరాలసిస్ వచ్చింది. ఐదు సంవత్సరాలు ఆవిడకు సేవ చేస్తూ గడిపాను. అదే సమయంలో మా అత్తగారితో కూడా ఇబ్బంది పడవలసి వచ్చింది. మా అత్తగారు ఎరుకలపూడి విశాలాక్షి వయసు 87, ఆవిడను చూసుకోవడం కోసం తెనాలి దగ్గర ఉన్న పల్లెటూరిలోనే ఉంటున్నాం. నాకు ఐదుగురు ఆడపడుచులు, ఒక బావగారు. మా అత్తగారే పిల్లలందరినీ కష్టపడి పెంచారు. కాస్త పెద్దయ్యాక మా పెద్ద ఆడపడుచు బాధ్యత నెత్తిన వేసుకుని, తోబుట్టువులందరినీ పైకి తీసుకువచ్చి, పెళ్లిళ్లు చేశారు. అందరూ సెటిల్ అయ్యారు. నాకు ఆవిడే ఆదర్శం. కష్టాలలో ఉన్నప్పుడే జీవితం విలువ తెలిసేది! మా అమ్మని నేను అమ్మలా చూసుకోవాలి. నాకు పిల్లలు పుడితే చూసేవారు లేరు. అందుకే మేం పిల్లలు వద్దనుకున్నాం. అమ్మకి కాఫీ తాగించి, రెండు బిస్కెట్లు తినిపించడానికి గంట సమయం పట్టేది. చివరి రోజుల్లో అమ్మ నాతో ‘‘నువ్వు నాకు అమ్మవి’’ అనేది. నాకు ఓపికను లేదా ఆవిడకు ఆరోగ్యాన్ని ఇవ్వు అని నిత్యం ఆ భగవంతుడిని ప్రార్థించేదాన్ని. అమ్మకోసం ఉద్యోగం మానేశాను... ఇరవై సంవత్సరాల పాటు పోలార్ ఫ్యాన్స్ కంపెనీలో పనిచేశాను. అమ్మ వాళ్ల కోసం తెనాలి దగ్గరకు వచ్చాక, విజయవాడకు ప్రయాణం చేయడం కష్టమైంది. రైలు వేళలు సమస్య అయ్యింది. నేను ఇంటి దగ్గర లేనప్పుడు అమ్మ ఒక్కతే ఉండవలసి వచ్చేది. దాంతో ఉద్యోగం మానేశాను. సంగీతం నేర్చుకున్నాను... చదువుకునే రోజుల్లోనే నా ఆనందం కోసం సంగీతం నేర్చుకున్నాను. వయొలిన్లో డిప్లొమా పూర్తి చేశాను. ఈ రోజు వరకు నా ఆత్మానందం కోసమే పాడుకున్నాను. ఇప్పుడు నా జీవనం కోసం శ్రద్ధ ఉన్నవారికి నేర్పించాలనుకుంటున్నాను. సంభాషణ: డా. వైజయంతి పురాణపండ ప్రస్తుతం నా దగ్గర 1500 స్టాంపులు, 250 ఫస్ట్ డే కవర్లు ఉన్నాయి. ఇండియా, సిలోన్, దుబాయి, యుఏఈ, యు ఎస్. మలేసియా, సౌత్ ఆఫ్రికా, హాంగ్ కాంగ్, మెక్సికో, ఆస్ట్రేలియా.. లాంటి చాలా దేశాలకు సంబంధించినవి స్టాంపులు ఆల్బమ్ ఉంది. స్టాంపుల బాధ్యత తీసుకోవడానికి నా తరవాత నా వారసులు ఎవ్వరూ లేరు కదా! నాన్నగారు కష్టపడి కలెక్ట్ చేసినందుకు, అవి సరైన వాళ్ల దగ్గరకు వెళితే సార్థకత అవుతుంది. ఇలా ఇంట్లోనే పడి ఉంటే చెదలు తిని వృధా అయిపోతాయి. వాటి విలువ తెలిసిన వాళ్ల వద్దకు అవి చేరితే, నాకు వాటి సంరక్షణ బాధ్యత తీరుతుంది. నాకు ఆర్థికంగానూ కొంత సాయం అందినట్లవుతుంది. – దుర్గ -
వేలికి ‘నకిలి’ ముద్ర!
శ్రీరంగం కామేష్, సాక్షి ప్రతినిధి వేలిముద్రలు.. ప్రపంచంలో ఏ ఇద్దరివీ సరిపోలవు.. కానీ ఓ టెలికం సంస్థ డిస్ట్రిబ్యూటర్ వద్ద మాత్రం మీ వేలిముద్రలు ఉంటాయి. మీ ఆధార్ నంబరు, పేరు, చిరునామా అన్నీ ఉంటాయి. అప్పుడప్పుడూ ఈ–కేవైసీ యంత్రంలో మీ వేలిముద్ర పడుతూ మీ పేరిట సిమ్‌కార్డులు జారీ అయిపోతుంటాయి. చదువును మధ్యలోనే ఆపేసిన సంతోష్‌కుమార్ అనే యువకుడు.. ఇంటర్నెట్ సాయంతో నకిలీ వేలిముద్రల తయారీని నేర్చుకుని, రిజిస్ట్రేషన్ల శాఖ పరిధిలోని ఓ లోపాన్ని ఆసరాగా తీసుకుని వేలాది మందికి చెందిన నకిలీ వేలిముద్రలను తయారుచేశాడు. ఆ వేలిముద్రలను ఆధార్ డేటాబేస్ నుంచి కేవైసీ అప్రూవల్ పొందడానికి వినియోగించి.. వేల సంఖ్యలో కొత్త సిమ్‌కార్డులను యాక్టివేషన్ చేశాడు. దీనిపై ‘యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ)’ సహా కేంద్ర నిఘా అధికారులు ఉలిక్కిపడ్డారు. దీనివెనుక ఉగ్రవాదులు, మావోయిస్టుల కోణం ఉందేమోనని సందేహించారు. కానీ లోతుగా పరిశీలించాక.. కేవలం సిమ్‌కార్డుల ‘టార్గెట్’పూర్తి చేసుకోవడానికి సంతోష్ ఈ పనిచేసినట్టు తెలుసుకుని నివ్వెరపోయారు. సంతోష్ అనుసరించిన విధానం ఏ ఉగ్రవాదుల చేతుల్లోనో, మావోయిస్టుల చేతుల్లోనో పడితే.. పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారేదని ఆందో ళన వ్యక్తమవుతోంది. ఈ వ్యవహారంపై హైదరాబాద్ లోని ‘ఆధార్’కార్యాలయం డిప్యూటీ డైరెక్టర్ ఫిర్యాదు మేరకు గత బుధవారం కేసు నమోదు చేసిన ఎస్సార్‌నగర్ పోలీసులు సంతోష్‌కుమార్‌ను అరెస్టు చేశారు. ఈ విషయం బయటకు పొక్కకుండా గోప్యత పాటించారు. తన వివరాలు గోప్యంగా ఉంచాల్సిందిగా కోరిన ఢిల్లీలో పనిచేసే యూఐడీఏఐ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ స్థాయి అధికారి ఒకరు ‘సాక్షి’కి పూర్తి వివరాలు వెల్లడించారు. సిమ్‌కార్డుల టార్గెట్ పూర్తి కోసం.. పెద్దపల్లి జిల్లా ధర్మారం గ్రామానికి చెందిన పాత సంతోష్‌కుమార్ బీఎస్సీ చదువు మధ్యలోనే మానేశాడు. ధర్మారం బస్టాండ్ సమీపంలో ధనలక్ష్మి కమ్యూనికేషన్స్ పేరుతో దుకాణం ఏర్పాటు చేసి వొడాఫోన్ ప్రీ–పెయిడ్ కనెక్షన్స్ డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేస్తున్నాడు. రూ.51 టాక్‌టైమ్‌తో ఉచితంగా ఇచ్చే ఈ సిమ్‌కార్డులను నెలకు కనీసం 600 విక్రయిస్తే.. ఒక్కో కనెక్షన్‌కు రూ.15 చొప్పున కమీషన్ ఇస్తామన్నది కంపెనీ పెట్టిన టార్గెట్. ఈ టార్గెట్ పూర్తికాకపోతే కమీషన్ చాలా తక్కువగా వస్తుంది. దాంతో సంతోష్ కొన్నాళ్ల పాటు కాలేజీలు, పాఠశాలల వద్ద స్టాల్ ఏర్పాటు చేసి.. తానే రూ.5 ఎదురిస్తూ సిమ్‌కార్డులు విక్రయించాడు. మొత్తంగా టార్గెట్ పూర్తి చేసి కమీషన్ పొందేవాడు. ఉచితంగా రూ.50కిపైగా టాక్‌టైమ్ వస్తుండటంతో విద్యార్థులు తరచూ సిమ్‌కార్డులు తీసుకుంటుండేవారు. కానీ ఒక్కొక్కరి పేరిట గరిష్టంగా తొమ్మిది సిమ్‌కార్డులు మాత్రమే తీసుకునేలా.. కచ్చితంగా ఆధార్, ఈ–కేవైసీ యంత్రంలో వేలిముద్ర నమోదు తర్వాతే సిమ్ యాక్టివేషన్ జరిగేలా కొంతకాలం కింద నిబంధనలు అమల్లోకి వచ్చాయి. దీనివల్ల సిమ్ విక్రయాల టార్గెట్ పూర్తిగాక కమీషన్ రావడం ఆగిపోయింది. దీంతో సంతోష్ ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాడు. వివరాలన్నీ ఒకే చోట దొరకడంతో.. ఎవరో ఒకరి పేరు మీద సిమ్‌కార్డులు యాక్టివేట్ చేయడం ద్వారా టార్గెట్ పూర్తి చేసుకోవాలని సంతోష్ భావించాడు. సాధారణంగా ఓ సిమ్‌కార్డు యాక్టివేట్ కావాలంటే.. వినియోగదారు పూర్తి పేరు, చిరునామా, ఆధార్ నంబర్ నమోదు చేయడంతోపాటు ఈ–కేవైసీ తనిఖీ పరికరంలో ఆ వ్యక్తి వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. ఈ వివరాలన్నీ ఎక్కడ దొరుకుతాయనే దానిపై అధ్యయనం చేసిన సంతోష్.. స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ల సమయంలో ఈ మూడు వివరాలను డాక్యుమెంట్లో పొందుపరుస్తారని గుర్తించాడు. అంతేకాదు రాష్ట్ర రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్సైట్ లో డాక్యుమెంట్ నంబర్, పలు వివరాలు నమోదు చేస్తే.. రిజిస్ట్రేషన్ల డాక్యుమెంట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలుసుకున్నాడు. సబ్–రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కేటాయించే డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ నంబర్ల సిరీస్‌ను పరిశీలించాడు. వాటి తరహాలో కొన్ని నంబర్లను వెబ్సైట్లో నమోదు చేస్తూ వెళ్లగా.. ఓ డాక్యుమెంట్ డౌన్లోడ్ అయింది. దాంతో ఆ సిరీస్‌లో తర్వాతి నంబర్లను నమోదు చేస్తూ.. వరుసగా డాక్యుమెంట్లను డౌన్లోడ్ చేశాడు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది స్థిరాస్తుల యజమానుల ఆధార్, పేరు, చిరునామా, వేలిముద్రలు వంటి పూర్తి వివరాలను సమకూర్చుకున్నాడు. ఇంటర్నెట్లో ‘వేలిముద్రల’తయారీ నేర్చుకుని.. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల చివరి పేజీలో ఆ స్థిరాస్తిని విక్రయించిన, కొనుగోలు చేసిన వారి వేలిముద్రలు ఉంటాయి. ఇలా పేపర్ మీద ఉన్న వేలిముద్రలను.. తిరిగి ఎక్కడైనా వేయగలిగేలా ఎలా తయారు చేయాలన్న దానిపై ఇంటర్నెట్లో వెతికాడు. యూట్యూబ్‌లో వీడియోలు చూసి.. రబ్బర్ స్టాంపుల తయారీ యంత్రాన్ని వినియోగించి వేలిముద్రలు తయారు చేసే విధానం నేర్చుకున్నాడు. కాగితంపై ముద్రించి ఉన్న లోగోలు, డిజైన్లను స్టాంపుగా మార్చడానికి ఈ యంత్రం ఉపయోగపడుతుంది. లోగోనుగానీ, డిజైన్నుగానీ కాంతి కిరణాలతో స్కాన్ చేసే ఆ యంత్రం.. అదే లోగో/డిజైన్‌ను రబ్బరుపై ఏర్పరుస్తుంది. అలాంటి ఓ యంత్రాన్ని కొనుక్కొచ్చి తన ధనలక్ష్మి కమ్యూనికేషన్స్ దుకాణంలో ఏర్పాటు చేసుకున్నాడు. అయితే యంత్రంలో లోగోను, డిజైన్‌ను పెట్టాల్సిన చోట.. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లలోని వేలిముద్రల కాగితాన్ని పెట్టాడు. దాంతో ఆ యంత్రం వేలిముద్రను స్కాన్ చేసి.. రబ్బరుపై అదే ఆకృతిని ఏర్పాటు చేసింది. అయితే సంతోష్ ఈ–కేవైసీ యంత్రంలో ముద్ర వేయడానికి వీలుగా రబ్బరుకు బదులుగా.. ప్రత్యేకమైన మెత్తటి ప్లాస్టిక్ పాలిమర్‌ను వినియోగించాడు. ఈ–కేవైసీ యంత్రంపై ఈ పాలిమర్ ముద్రను పెట్టినప్పుడు.. నేరుగా వేలిముద్ర వేసిన తరహాలో పనిచేసింది. ఇలా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల సహాయంతో పెద్ద సంఖ్యలో నకిలీ వేలిముద్రలను తయారు చేసిన సంతోష్.. ఈ–కేవైసీ యంత్రంలో సదరు ఆధార్ వివరాలు, ఇతర వివరాలు నమోదు చేసి, వేలిముద్రను పెట్టి.. సిమ్‌కార్డులను యాక్టివేషన్ చేశాడు. తర్వాత ఆ సిమ్‌కార్డులను ధ్వంసం చేసేసినా.. కొత్త కనెక్షన్ల టార్గెట్ మాత్రం పూర్తయి, సిమ్ విక్రయాల కమీషన్ అందింది. ఉలిక్కిపడిన యూఐడీఏఐ సంతోష్ రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్సైట్ నుంచి ఒక్కోసారి ఒక్కో ప్రాంతానికి చెందిన డాక్యుమెంట్లను డౌన్లోడ్ చేసి, నకిలీ వేలిముద్రలు తయారు చేసి.. సిమ్‌కార్డులను యాక్టివేట్ చేశాడు. ఇలా దాదాపు నెల రోజుల్లో ఆరు వేల సిమ్‌కార్డులు యాక్టివేట్ చేశాడు. అయితే ఒకే ఈ–కేవైసీ యంత్రం నుంచి భారీగా సిమ్‌కార్డుల కోసం ఆధార్ అప్రూవల్స్ పొందిన విషయాన్ని గుర్తించిన యూఐడీఏఐ విజిలెన్స్ విభాగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఉగ్రవాదులు, మావోయిస్టులతోపాటు అసాంఘిక శక్తులకు అక్కడి నుంచి సిమ్‌కార్డులు చేరుతున్నాయని సందేహించి.. కేంద్ర నిఘా వర్గాల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో రంగంలోకి దిగిన నిఘా అధికారులు, 18 ప్రభుత్వ విభాగాల అధికారులు.. సంతోష్‌కుమార్‌ను విచారించారు. సిమ్‌కార్డుల యాక్టివేషన్ టార్గెట్ పూర్తి చేసుకోవడం కోసం సంతోష్ చేసిన పని.. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల నుంచి వేలిముద్రల సేకరణ, రబ్బరు స్టాంపుల యంత్రంతో నకిలీ వేలిముద్రల తయారీ, ఇందుకోసం ఇంటర్నెట్ను వినియోగించుకున్న తీరు వంటివి తెలుసుకుని అవాక్కయ్యారు. జాతీయ స్థాయిలో ‘అలర్ట్’! వేలిముద్రల ఆధారంగా పనిచేసే బయోమెట్రిక్ విధానాన్ని భద్రమైన మార్గంగా పరిగణిస్తూ మన దేశం సహా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు దానిని వినియోగిస్తున్నాయి. మన దేశంలోనైతే ‘ఆధార్ (విశిష్ట గుర్తింపు సంఖ్య)’కు కూడా వేలిముద్రనే ప్రధాన ఆధారంగా ఉంది. ఈ నేపథ్యంలో సంతోష్ చెప్పిన వివరాలను విన్న అధికారులు అప్రమత్తమయ్యారు. నకిలీ వేలిముద్రల ప్రమాదకర పరిస్థితులు ఏర్పడే అవకాశముందని.. బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు తస్కరించడం వంటి ఆర్థిక నేరాల నుంచి ఓ వ్యక్తి ప్రమేయం లేకుండా అతడిని నేరాల్లో ఇరికించడం వంటి క్రిమినల్ నేరాలకూ దారితీస్తుందని వారు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో అధ్యయనం చేయాలని నిర్ణయించారు. ఢిల్లీలో ప్రతి మూడు నెలలకోసారి ‘మల్టీ ఏజెన్సీస్ కమిటీ’పేరుతో పిలిచే మ్యాక్ సమావేశం జరుగుతుంది. అందులో నిఘా నుంచి పరిపాలన వరకు అన్ని విభాగాల అధికారులు పాల్గొని వివిధ అంశాల్ని చర్చిస్తుంటారు. తాజాగా వెలుగులోకి వచ్చిన సంతోష్ వ్యవహారం నేపథ్యంలో.. వారం రోజుల్లో మ్యాక్ సమావేశం ఏర్పాటు చేయాలని యూఐడీఏఐ నిర్ణయించింది. అందులో ఈ కేసును చర్చించి.. దేశవ్యాప్తంగా ఇలాంటి లోపాలు గుర్తించాలని, ఆయా రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ల శాఖలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని యూఐడీఏఐ కోరనుంది. ఆయా లోపాలను పరిష్కరించేలా సూచనలు చేయనుంది. -
స్టాంపులను సగం చించి వాడేద్దామా!
ఓ పోస్టు పంపాలి.. రూ.15 స్టాంపులు కావాలి. కానీ మీ దగ్గర రూ.10 స్టాంపులు రెండు ఉన్నాయి. ఓ రూ.10 స్టాంపును సరిగ్గా సగానికి కత్తిరించి వాడుకోవడం కుదురుతుందా.. ఇక్కడ మాత్రం కుదిరింది. స్టాంపులు మొదలైన తొలి రోజుల్లో వాటి ముద్రణ, వితరణ ఊపందుకోని సమయంలో అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఇతర యూరోపియన్, ఆసియా దేశాల్లో దీన్ని అనుమతించారు. సరిగ్గా కర్ణం (డయాగోనల్)లా కత్తిరించిన స్టాంపులు వాటి ముఖ విలువలో సగంగా పరిగణించేవారు. కొన్ని కొన్ని సార్లు మరింత ముందుకెళ్లి మూడు వంతులు, నాలుగు వంతులుగా కూడా కత్తిరించి వాడేవారు. మెక్సికోలో అయితే మూడు, నాలుగు, ఎనిమిది వంతులుగా కత్తిరించి ఉపయోగించేవారు. స్టాంపుల కొరత ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే దీన్ని అమలు చేశారు. పక్కనున్న ఫొటోలోని పోస్టల్ స్టాంపును చూశారుగా.. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో గురెన్సీ ద్వీపంలో సగానికి కత్తిరించి అతికించి పోస్టు చేశారు..! -
స్టాంపుల సేకరణతో స్కాలర్షిప్
సాక్షి, హైదరాబాద్ : తపాలా బిళ్లల సేకరణ విద్యార్థులకు సరదా అలవాటు.ఇది వారిలో సృజనాత్మకతను, ఓ అంశంపై ఏకాగ్రతను పెంచుతుందని నిపుణులు చెబుతారు. ఇప్పుడు ఆ అలవాటు కాసులను కూడా రాల్చనుంది. తపాలా బిళ్లల సేకరణపై మనసు లగ్నం చేసేవారికి కేంద్రప్రభుత్వం ఏకంగా ఉపకార వేతనం (స్కాలర్షిప్) అందించనుంది. పోస్టాఫీసుల వైపు విద్యార్థులను మళ్లించేందుకు వారిలో తపాలాబిళ్లల సేకరణ అలవాటును పెంచాలని నిర్ణయించింది. ఆరు నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు పరిమిత సంఖ్యలో ఉపకార వేతనాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో ఎంపికైన వారికి రూ.ఆరు వేల ఆర్థిక సాయం అందుతుంది. దీన్ని ప్రతి మూడు నెలలకు రూ.1,500 చొప్పున తపాలాశాఖ చెల్లిస్తుంది. దీన్‌దయాళ్ స్పర్శ్ యోజన పేరుతో కేంద్రం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఇందులో స్పర్శ్ (ఎస్‌పీఏఆర్‌ఎస్‌హెచ్)ను స్కాలర్షిప్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఆప్టిట్యూడ్ అండ్ రీసెర్చ్ ఇన్ స్టాంప్స్ యాజ్ ఏ హాబీగా పేర్కొంది. ఎంపిక విధానం ఇలా...: తొలివిడతగా దేశవ్యాప్తంగా 920 స్కాలర్షిప్స్ మంజూరయ్యాయి. ప్రతి తపాలా సర్కిల్‌కు మొదట 40 చొప్పున మంజూరు చేశారు. ఆరు నుంచి తొమ్మిది వరకు ఒక్కో తరగతికి 10 చొప్పున పంచారు. ఇందులో పాల్గొనాలనుకుంటున్న విద్యార్థి కచ్చితంగా గుర్తింపు పొందిన పాఠశాలలో చదువుతుండాలి. ఆ పాఠశాలకు ప్రత్యేకంగా తపాలా బిళ్లల సేకరణ క్లబ్ ఉండాలి. ఆ క్లబ్ లేనప్పటికీ నేరుగా విద్యార్థి ఫిలటెలీ డిపాజిట్ ఎకౌంట్ తీసుకుని ఉన్నా సరిపోతుంది. ఆ విద్యార్థి కనీసం 60 మార్కులతో ఉత్తీర్ణుడైన మెరిట్ అర్హత ఉండాలి. తపాలా తెలంగాణ సర్కిల్ నిర్వహించే తపాలా బిళ్లలకు సంబంధించిన ప్రాజెక్ట్ వర్క్ చేయటంతోపాటు ఆ సర్కిల్ నిర్వహించే క్విజ్‌లో పాల్గొనాలి. ఇందులో మెరుగైన ప్రదర్శన నిర్వహించిన వారిని పోస్టల్ కమిటీ ఎంపిక చేస్తుంది. వారికి ఏడాది వరకు స్కాలర్షిప్ అందుతుంది. -
రిజిస్ట్రేషన్ శాఖలో ఆన్‘లైన్ కష్టాలు’
– మొరాయించిన సర్వర్ – జిల్లా వ్యాప్తంగా స్తంభించిన కార్యాకలాపాలు కర్నూలు(టౌన్): జిల్లా స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో గత రెండు రోజులుగా ఆన్లైన్ వ్యవస్థ స్తంభించింది. ఈ కారణంగా సుదూర ప్రాంతాల నుండి రిజిస్ట్రేషన్ కోసం వచ్చే ప్రజలు అసౌకర్యానికి లోనవుతున్నారు. మంగళవారం ఉదయం కూడా ఆన్లైన్ సేవలు స్తంభించడంతో ఈసీ, నకలు, ఫొటో క్యాప్చరింగ్, ఆధార్ ఒపెన్ కాకపోవడంతో సమస్యలు తలెత్తాయి. దీంతో రిజిస్ట్రేషన్లపై ప్రభావం పడింది. ప్రతిరోజు కర్నూలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 30, కల్లూరు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో 30 చోప్పున రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తున్నారు. ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న 16 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రతి రోజు 300 వరకు రిజిస్ట్రేన్లు జరుగుతుంటాయి. ఆన్లైన్ సమస్య వల్ల ఈ పనులన్నీ నిలిచిపోయాయి. కేవైసీ సర్వర్‌లో లోపం రెండు రోజులుగా సర్వర్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. కేవైసీ సర్వర్‌లో లోపం వల్ల అనేక జిల్లాల్లో ఈ పరిస్థితి వచ్చినట్లు సమాచారం ఉంది. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. బుధవారం నాటికి ఆన్లైన్ ఇబ్బందులను అధిగమించే అవకాశం ఉంది. - యు.వి.వి.రత్నప్రసాద్, జిల్లా రిజిస్ట్రార్ -
మహాత్ముడా.. మజాకా!
లండన్: జాతిపిత మహాత్మాగాంధీ చిత్రంతో ఉన్న అరుదైన స్టాంపులు యూకేలో రికార్డు ధర పలికాయి. యూకేలోని స్టాన్లీ గిబ్బన్స్ అనే స్టాంప్ కలెక్టింగ్ కంపెనీ మహాత్ముడి చిత్రంతో ఉన్న నాలుగు స్టాంపులను వేలం వేయగా.. రికార్డు స్థాయిలో 5లక్షల పౌండ్ల ధర పలికాయి. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 4.1కోట్లు చెల్లించి వేలంలో ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తి వీటిని దక్కించుకున్నారు. యూకేలో ఓ భారత స్టాంప్‌కు ఇంత ధర పలకడం ఇదే తొలిసారని నిర్వాహకులు చెబుతున్నారు. 1948 నాటి పది రూపాయల విలువ గల మహాత్ముడి స్టాంపులు కేవలం 13 మాత్రమే చలామణిలో ఉన్నట్లు వేలం నిర్వాహకులు చెప్పారు. -
రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ బాధ్యత స్వీకరణ
కర్నూలు (టౌన్): స్టాంపులు రిజిస్ట్రేషన్లశాఖ డీఐజీగా శ్రీనివాసరావు శనివారం తన చాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. గుంటూరులో జిల్లా రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న ఆయనకు పదోన్నతి కల్పించి డీఐజీగా ఇక్కడ నియమించింది. ఇక్కడ డీఐజీగా పనిచేస్తున్న సాయిప్రసాద్ పదవీ విరమణ పొందారు. -
చరిత్రకు ఆనవాళ్లు నాణేలు
291 దేశాల నాణేలు, కరెన్సీనోట్లు, స్టాంపుల ప్రదర్శన ఆసక్తిగా తిలకించిన విద్యార్థులు రావులపాలెం : చరిత్రకు అద్దం పట్టే వివిధ దేశాల నాణేలు, కరెన్సీ నోట్లు, స్టాంపుల ప్రదర్శన విద్యార్థులను విశేషంగా ఆకట్టుకుంది. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలతో అమలాపురానికి చెందిన పి.కృష్ణకామేశ్వర్ శుక్రవారం ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు. మన దేశంతో పాటు 291 దేశాలకు చెందిన నాణేలు, నోట్లు అందర్నీ అబ్బురపరచాయి. మంగోలియా దేశం తాజ్‌మహల్ చిత్రంతో విడుదల చేసి నాణెం, సోమాలియా దేశం గిటార్లు, త్రిజ్యామితీయ ఆకృతులతో, నియో దేశపు స్‌పైడర్‌మ¯ŒS చిత్రపు నాణెం, ప్రపంచంలో తొలి సారిగా ట్రా¯Œ్సనిస్ట్రియా దేశం విడుదల చేసి ప్లాస్టిక్ నాణేలు, బెని¯ŒS దేశం విడుదల చేసిన పరిమళపు నాణెం, వియాత్నాంకు చెందిన రూ.50 వేలు, రూ.లక్ష నోటు, 45 దేశాలకు చెందిన ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు, కెనడా, ఇండియా, ఐక్యరాజ్య సమితి తపాల విభాగాలు విడుదల చేసిన స్టాపులు, ఇటీవల ఐక్యరాజ్య సమితి ఎంఎస్ సుబ్బులక్ష్మి చిత్రంతో విడుదల చేసిన స్మారక స్టాంపు, భారత ప్రభుత్వం విడుదల చేసిన కరెన్సీ నోట్లు, నాణేలు, పలు దేశాలకు చెందిన స్టాంపులు విద్యార్థులను విశేషంగా ఆకట్టుకున్నాయి. విద్యార్థులకు వీటి గురించి కామేశ్వర్ సమగ్రంగా వివరించారు. ప్రదర్శనను రావులపాలెంలోని పలు కళాశాల విద్యార్థులు తిలకించారు. తొలుత ఈ ప్రదర్శనను దివ్యాంగుల సేవా సంస్థ జిల్లా అధ్యక్షుడు పేరి లక్ష్మినరసింహం, ప్రిన్సిపాల్ కె.వి.రమణారావు ప్రారంభించారు. నగదు రహిత లావాదేవీలు, డెబిట్, రూపే కార్డులు వినియోగించడంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. -
విజయవాడ నుంచి స్టాంపుల సరఫరా
– గ్రామీణ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్లు తగ్గాయి – జిల్లా రిజిస్ట్రార్ ఆనందయ్య కోవెలకుంట్ల: జిల్లాలోని రిజస్టర్ కార్యాలయాల్లో రూ. 10, రూ. 20, రూ. 50 స్టాంపుల కొరత ఉందని, అయితే విజయవాడ నుంచి అవి సరఫరా కావాల్సి ఉందని జిల్లా రిజిస్ట్రార్ ఆనందయ్య చెప్పారు. శనివారం కోవెలకుంట్ల రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లాలోని కోవెలకుంట్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి రూ. 4.50 కోట్లు, ఆళ్లగడ్డకు రూ. 6.67కోట్లు, బనగానపల్లెకు రూ. 6.58కోట్లు, నంద్యాలకు రూ. 29.06కోట్లు, అవుకుకు రూ.2.22కోట్లు, పాణ్యంకు రూ. 2.42 కోట్లు, శిరువెళ్లకు రూ. 4.47కోట్లు, బండి ఆత్మకూరుకు రూ. 2.38కోట్లు, బేతంచెర్లకు రూ. 2.45కోట్లు, ఆత్మకూరుకు రూ. 4.16 కోట్లు రెవెన్యూ రాబడిని లక్ష్యంగా పెట్టినట్లు వెల్లడించారు.మార్చి ఆఖరుకల్లా ఈ లక్ష్యాన్ని అధిగమిస్తామని చెప్పారు. వ్యవసాయ పనులు ముమ్మరంగా ఉండటంతో గ్రామీణ ప్రాంతాల సబ్ రిజిస్టర్ కార్యాలయాల పరిధిలో రిజిస్ట్రేషన్లు తగ్గాయని చెప్పారు. గ్రామకంఠం స్థలాల రిజిస్ట్రేషన్లకు ఉన్న అడ్డంకి తొలగిపోయిందని, ఈ సర్వే నంబర్లలోని స్థలాలను క్రమ విక్రయాలు జరిపి రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో కోవెలకుంట్ల సబ్ రిజిస్టర్ నాగన్న, సీనియర్ అసిస్టెంట్ షంషుద్దీన్ పాల్గొన్నారు. 22కెకెఎల్04: సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా రిజిస్ట్రార్ ఆనందయ్య -
వెండర్ల రాజ్యం!
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద వారిదే హవా అందుబాటులో లేని స్టాంపులు అవస్థలు పడుతున్న వినియోగదారులు అనంతపురం టౌన్ : జిల్లాలో అనంతపురం, హిందూపురం జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. అనంతపురం పరిధిలో గుత్తి, గుంతకల్లు, కళ్యాణదుర్గం, కణేకల్లు, పామిడి, రాయదుర్గం, శింగనమల, తాడిపత్రి, ఉరవకొండ, యాడికి, అనంతపురం, అనంతపురం రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. హిందూపురం పరిధిలోకి బుక్కపట్నం, చిలమత్తూరు, చెన్నేకొత్తపల్లి, ధర్మవరం, హిందూపురం, కదిరి, మడకశిర, పెనుకొండ, తనకల్లు కార్యాలయాలు వస్తాయి. జిల్లా వ్యాప్తంగా 150 మంది వరకు స్టాంప్ వెండర్లు ఉన్నారు. కొంతకాలంగా నాన్ జ్యుడీషియల్, స్పెషల్ అడెస్సివ్ స్టాంపుల కొరత వేధిస్తోంది. అప్పుడప్పుడూ జిల్లాకు స్టాంపులు వస్తున్నా.. అధిక శాతం ‘ వెండర్ల చేతుల్లోకి వెళ్తున్నాయి. నిబంధనల ప్రకారం కార్యాలయాల్లో ఎక్కువ స్టాంపులు అందుబాటులో ఉంచాలి. జిల్లాలో మాత్రం ఆ పరిస్థితి లేదు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోని అధికారులు, సిబ్బంది స్టాంప్ వెండర్లతో ముందుగానే చేసుకున్న ఒప్పందం మేరకు వాళ్లకే పెద్దపీట వేస్తున్నారు. వెండర్లు స్టాంపులను ముందుగానే కొనేయడం వల్ల అక్కడ మిగిలిన వారికి లభించడం లేదన్న విమర్శలున్నాయి. ప్రజలకు అత్యంత అవసరమైన 10, 20 స్టాంపుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. నాన్ జ్యుడీషియల్ స్టాంపులకు సంబంధించి అనంతపురం జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయానికి ఈ ఏడాది మేలో రూ.50 విలువైన స్టాంపులు 96 వేలు వచ్చాయి. వీటి మొత్తం రూ.48 లక్షలు. రూ.100 స్టాంపులు లక్షా 60 వేలు వచ్చాయి. వీటి విలువ రూ.కోటి 60 లక్షలు. అలాగే జూలైలో రూ.10 విలువైన స్టాంపులు 24 వేలు, రూ.20 విలువైన స్టాంపులు 32 వేలు వచ్చాయి. వీటి మొత్తం రూ.8 లక్షల 80 వేలు. ఇలా వచ్చిన స్టాంపులను రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు పంపిణీ చేశారు. అయితే..వీటిలో ఎక్కువ శాతం వెండర్లకే పంపిణీ చేశారు. ఒక్క అనంతపురం రిజిస్ట్రార్ కార్యాలయంలోనే నెలకు రూ.50 లక్షల వరకు విలువైన స్టాంపులు అవసరం. మిగిలిన ప్రాంతాల్లో కూడా రూ.20 లక్షల వరకు విలువైన స్టాంపులు అవసరమవుతాయి. అనంతపురం కార్యాలయ పరిధిలో 40 మంది వరకు స్టాంప్ వెండర్లు ఉండగా.. రూ.10, రూ.20 స్టాంపులను అధిక శాతం వారికే ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో కార్యాలయాల్లో ఇవి అందుబాటులో లేవు. వెండర్లు అవసరాన్ని బట్టి సాంపుపై రూ.100 నుంచి రూ.150 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. అనంతపురం నగరంలో కొంత మంది కార్యాలయం వద్దే తిష్టవేసి అధిక రేట్లకు విక్రయిస్తున్నారు. అవస్థలు పడుతున్నా.. ఆస్తులు, భూములు, వాహనాలు, ఆర్థిక లావాదేవీలు, లీజులు తదితర వాటికి నాన్‌జ్యుడీషియల్ స్టాంపులు కావాల్సిందే. రూ.10, రూ.20, రూ.50, రూ.100 స్టాంపులు ప్రజలకు అందించడంలో రిజిస్ట్రేషన్ శాఖ విఫలమవుతోంది. జిల్లాలోని ఎక్కువ శాతం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రూ.10, రూ.20 స్టాంపులు లేవంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. రికార్డులు చూస్తే గానీ చెప్పలేం స్టాంపులు విజయవాడ నుంచి వస్తాయి. ఆ వెంటనే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు పంపుతాం. సబ్ రిజిస్ట్రార్లే స్టాంప్ వెండర్లకు ఇస్తారు. కార్యాలయాల్లో తక్కువ పెట్టుకుని వెండర్లకు ఎక్కువ ఇస్తున్నారనే విషయం అక్కడి రికార్డులు చూస్తేగానీ చెప్పలేం. తనిఖీలు చేసి అలా జరుగుతుంటే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. – దేవరాజ్, రిజిస్ట్రార్, అనంతపురం -
స్టాంపుల్లేవ్..!
కొత్తగూడెంలో ఏర్పడిన కొరత ఫ్లాంకింగ్ మిషన్ లేక ఇబ్బందులు దోచుకుంటున్న వెండర్లు, దళారులు పట్టించుకోని రిజిస్ట్రేషన్ల శాఖ కొత్తగూడెం రూరల్ : కొత్తగూడెంలో స్పెషల్ అడెసివ్ స్టాంప్(ఎస్ఏఎస్)ల కొరత ఏర్పడింది. స్టాంపులు కావాల్సిన వారు ఖమ్మం, భద్రాచలం ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. కొత్తగూడెంలో ముద్రణ యంత్రం లేకపోవడంతో.. ఖమ్మం, భద్రాచలం స్టాంప్ వెండర్ల వద్దకు వెళ్లి కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇళ్లు కట్టుకోవాలన్నా.. పెళ్లి చేసుకోవాలన్నా.. పిల్లలను పై చదువులకు విదేశాలకు పంపించాలన్నా.. మార్ట్గేజ్.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు తదితర రుణాలు బ్యాంకు నుంచి పొందాలంటే.. ఎస్ఏఎస్ స్టాంప్‌లు తప్పని కావాల్సి ఉంది. కొత్తగూడెంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కేవలం రూ.10, రూ.20 విలువచేసే స్టాంప్‌లు మాత్రమే లభిస్తుంటాయి. కానీ.. రుణానికి సంబంధించి ఎంత మొత్తానికి రుణం కావాలనుకుంటామో.. దానికనుగుణంగా రూ.100 నుంచి ఎంత మొత్తానికైనా స్టాంపింగ్ చేయాల్సి ఉంటుంది. దీని ద్వారానే రుణం పొందుతున్న వ్యక్తికి, బ్యాంకుకు మధ్య ఒప్పందం జరుగుతుంది. కేవలం రూ.10, రూ.20 స్టాంపులు మాత్రమే ఇక్కడ లభిస్తుండటంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. కాగా.. 2012 వరకు రాము అనే వ్యక్తి ఫ్లాంకింగ్ యంత్రం లైసెన్స్ కలిగి.. స్టాంప్ వెండర్‌గా ఉండేవాడు. అతడు మృతిచెందడంతో ఆ లైసెన్స్ రద్దు చేశారే తప్ప తిరిగి ఎవరికీ కేటాయించలేదు. దండుకుంటున్న దళారులు ఖమ్మం రిజిస్ట్రార్ కార్యాలయం, కొత్తగూడెం, మధిర, సత్తుపల్లి, ఇల్లెందు, బూర్గంపాడు, వైరా, కల్లూరు, కూసుమంచి.. ఇలా 11 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. అయితే ఖమ్మం కార్యాలయృలో మాత్రమే స్టాంపులను ముద్రించే ఫ్లాంకింగ్ మిషన్ అందుబాటులో ఉంది. ఖమ్మం, భద్రాచలం, సత్తుపల్లి ప్రాంతాల్లో ప్రైవేటు లైసెన్స్డ్ స్టాంప్ వెండర్లు ఉండగా.. ఇతర ప్రాంతాల్లో స్టాంపులు అందుబాటులో లేవు. దీంతో దళారులు స్టాంప్ ముద్రలు అవసరమైన వారి నుంచి అధికంగా దండుకుంటూ.. వారే ఇతర ప్రాంతాలకు వెళ్లి స్టాంప్ వెండర్లతో ఒప్పందాలు కుదుర్చుకుని స్టాంప్‌లు వేయిస్తున్నట్లు సమాచారం. స్టాంపునకు అవసరమైన దానితోపాటు దాని మొత్తానికి 10 నుంచి 20 శాతం అదనంగా వసూలు చేస్తున్నట్లు సమాచారం. రూ.వెయ్యి స్టాంప్ వేయాల్సి ఉంటే.. అదనంగా రూ.100 వసూలు చేస్తున్నారని, రానుపోను చార్జీలు మరింత అదనంగా వసూలు చేస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ముద్రణ యంత్రాలు అందుబాటులో ఉంటే సౌకర్యవంతంగా ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు. కొత్తగూడెంలో ఫ్లాంకింగ్ మిషన్ లైసెన్స్ కోృÜం ఆరు నెలల క్రితం రెండు దరఖాస్తులు వచ్చాయని, వాటిని ఉన్నతాధికారులకు సమర్పించినట్లు సబ్ రిజిస్ట్రార్ ఆనంద్ చెప్పారు. దీనిపై జిల్లా రిజిస్ట్రార్ సుభాషిణిని వివరణ కోరగా.. జిల్లాలో ఫ్లాంకింగ్ మిషన్ ఒక్కటే ఉందని, దీనికోసం ముగ్గురు దరఖాస్తు చేసుకున్నట్లు వివరించారు. స్పెషల్ అడెసివ్ స్టాంపులు అందుబాటులో లేకపోతే నాన్ జ్యుడీషియల్ స్టాంపులు వాడుకోవచ్చని ఆమె పేర్కొన్నారు. -
అవినీతికి రిజిస్టేషన్లు
రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అక్రమాలు {పతి సేవకూ ప్రత్యేక వసూళ్లు దళారులదే హవా ‘నిషేధిత’ భూములతో కాసుల పంట ‘ఎనీవేర్ రిజిస్ట్రేషన్’తో గాడితప్పిన వ్యవస్థ హైదరాబాద్: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కార్యాలయాలు అవినీతికి చిరునామాగా మారిపోయాయి. అక్రమాలకు... అవకతవకలకు అడ్డాగా నిలుస్తున్నాయి. తల దాచుకునే జాగా... తనదనుకునే ఓ నివాసాన్ని సొంతం చేసుకోవాలన్న ఆశతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వస్తున్న ప్రజలను అక్కడి సిబ్బంది పీల్చి పిప్పి చేస్తున్నారు. దళారులతో కలసి అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు. భారీగా లంచాలు పుచ్చుకుని ‘నిషేధిత జాబితా’లోని స్థలాలనూ రిజిస్ట్రేషన్ చేసేస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు నగర శివార్లలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మంగళ, బుధవారాల్లో ‘సాక్షి’ విజిట్‌లో ఈ వ్యవహారాలు బయటపడ్డాయి. ఈ కార్యాలయాల్లో బ్రోకర్లు సర్వం తామే అయి కార్యకలాపాలు నిర్వహిస్తున్న తీరు కొట్టొచ్చినట్లు కనిపించింది. వీటిలో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేసినా ఫలితం శూన్యం. ఇక ప్రభుత్వం వినూత్నంగా ప్రారంభించిన ‘ఎనీవేర్ రిజిస్ట్రేషన్’ సౌకర్యం పూర్తిగా దారి తప్పింది. ప్రభుత్వ, వక్ఫ్, కోర్టు వివాదాల్లో ఉన్న భూములకు బై నంబర్లు లేదా అక్షరాలు జోడించి దర్జాగా రిజిస్ట్రేషన్ చేస్తున్న వైనం వెలుగు చూసింది. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోనే.. చాలా కాలంగా రిక్రూట్మెంట్ లేకపోవడం... రిజిస్ట్రేషన్ల శాఖ వినియోగిస్తున్న సర్వర్లు ప్రైవేటువి కావడమే కాదు... కంప్యూటర్ల నిర్వహణ సహా ఇతర సేవలన్నీ ఔట్ సోర్సింగ్ సిబ్బంది చేతుల్లోనే ఉంటున్నాయి. దీంతో దళారులు, ఔట్సోర్సింగ్ సిబ్బంది కనుసన్నల్లోనే రిజిస్ట్రేషన్లు, ఇతర సేవలు కొనసాగుతున్నాయి. రిజిస్ట్రేషన్లకు వచ్చే వారి డాక్యుమెంట్లను దళారులే సిద్ధం చేస్తున్నారు. ముందే ‘సొమ్ము’ ముట్టజె ప్పనిదే పని పూర్తి కాని పరిస్థితి నెలకొంది. హెల్ప్‌డెస్క్ వద్దకు వెళ్లి నేరుగా రిజిస్ట్రేషన్ చేయాలని కోరితే... సవాలక్ష ప్రశ్నలు, కొర్రీలతో విసిగించడం తప్పితే...ప్రయోజనం కనిపించదు. ‘ఎనీవేర్’తో అడ్డగోలుగా... గ్రేటర్ హైదరాబాద్‌లోని మెజారిటీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నిబంధనలను పాటించడం లేదు. అధికారులు, సిబ్బంది అన్ని పత్రాలున్న ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు కూడా బ్రోకర్ల ద్వారా స్క్వేర్ ఫీట్లు, గజాలు, ఎకరాలుగా లెక్క తేల్చి విస్తీర్ణాల మేరకు ప్రత్యేక ధరలు నిర్ణయించి దండుకుంటున్నారు. ఇక వివాదాస్పద భూముల విషయంలోనైతే వారికి హద్దులే ఉండటం లేదు. ముఖ్యంగా రెవెన్యూ, మున్సిపల్ విభాగాలు ప్రొహిబిటెడ్ (రిజిస్ట్రేషన్ చేయకూడని) జాబితాలో చేర్చిన భూములు, ప్లాట్ల విషయంలో దొరికినంత దండుకుంటున్నాయి. దీని కోసం ‘ఎనీవేర్ రిజిస్ట్రేషన్’ (ఒక జిల్లా పరిధిలోని ఏ కార్యాలయ పరిధిలోవైనా) సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు. ఇలా ‘ఎనీవేర్’ రిజిస్ట్రేషన్లు అత్యధికంగా బాలానగర్, కూకట్పల్లి, రంగారెడ్డి తూర్పు, పశ్చిమ కార్యాలయాల్లో ఎక్కువగా సాగుతున్నాయి. బాలానగర్, కూకట్‌పల్లిలలో నిషేధిత జాబితాలోని భూములకు బై నంబర్లు జోడించి దర్జాగా రిజిస్ట్రేషన్లు చేసేస్తున్నారు. ప్రక్షాళన చేయాల్సిందే.. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖను మొత్తంగా ప్రక్షాళన చేస్తేనే అవినీతి, అక్రమాలకు తావులేని, వేగంతో కూడిన నాణ్యమైన సేవలు అందుతాయని ఆ శాఖ ఉద్యోగులే పేర్కొంటున్నారు. రాష్ట్ర ఖజానాకు ఏటా రూ.3,500 కోట్ల ఆదాయం తెచ్చి పెడుతున్న ఈ శాఖకు రూ.100 కోట్లు వ్యయం చేస్తే తప్పక గాడిలో పడుతుందని అంటున్నారు. వారు చేస్తున్న సూచనలివీ...100 సంవత్సరాల రికార్డులు ఎక్కడా అందుబాటు లేవు. రికార్డుల డిజిటలైజేషన్‌ను ఒక్క కార్యాలయానికే పరిమితం చేసి చేతులు దులుపుకున్నారు. కేవలం 30 కోట్లు ఖర్చు చేస్తే రాష్ట్రంలో రికార్డులన్నీ డిజిటలైజ్ అవుతాయి. దీంతో సేవలు మరింత విస్తృతం చేయొచ్చు. సెంట్రల్ సర్వర్‌ను ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించాలి. 40 శాతంగా ఉన్న ఖాళీలను భర్తీ చేయాలి. ఈ చర్యలతో ఆదాయం రెండేళ్లలో రూ.ఐదువేల కోట్లు దాటే అవకాశం ఉంది. రికార్డుల డిజిటలైజేషన్ పూర్తయ్యే వరకు ఎనీవేర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిలిపివేయాలి. తమిళనాడులోలాగా రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీ శాఖలను రిజిస్ట్రేషన్ శాఖతో అనుసంధానం చేయాలి. ఆయా శాఖలు ఆన్లైన్లో అనుమతిచ్చాకే రిజిస్ట్రేషన్ చేయాలి. కర్ణాటకలోనూ ఆయా సంస్థలు అనుమతిచ్చాకే డాక్యుమెంట్ ఇస్తున్నారు. ఆ విధానాలను రాష్ట్రంలో అమలు చేయాలి. {పభుత్వం రూపొందించిన ‘ప్రొహిబిటెడ్ 22 (ఎ)’ జాబితాలోని భూములను బై నంబర్, ఇతర అక్షరాలు వేసి రిజిస్టర్ చేసిన అధికారులు, వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి శిక్షించాలి. మార్కెట్ విలువల నిర్ధారణ, రిజిస్ట్రేషన్ల తీరు, ఆదాయం వంటివి క్షుణ్ణంగా పరిశీలించి, ఆదాయాన్ని పెంచేందుకు ఉద్దేశించిన ఆడిట్ విభాగాలు నిర్వీర్యమయ్యాయి. వాటిని నిజాయితీ గల అధికారులతో పటిష్టం చేయాలి. ఎల్బీనగర్ పరిధిలోని తుర్కయాంజల్, రాగన్నగూడ ప్రాంతాల్లో హార్డ్‌వేర్ పార్కు సేకరణ పరిధిలో ఉన్న భూములను ప్రొహిబిటెడ్ జాబితాలో పెట్టినా రిజిస్ట్రేషన్లు జరిగిపోతున్నాయి. ఇతర ప్రాంతాల్లో రిజిస్టర్ చేయని వ్యవసాయ భూములు, ప్రభుత్వ భూములను సైతం ఎల్బీనగర్ కార్యాలయాల్లో రిజిస్టర్ చేసేస్తున్నారు. నిషేధించినా... మియాపూర్ సమీపంలోని మదీనాగూడ గ్రామంలో సర్వే నంబర్ 100లో 277 ఎకరాలు, 101లో 268 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. రెవెన్యూ రికార్డులు దీనిని ప్రభుత్వ భూమిగా చెబుతున్నాయి. కానీ ఆ స్థలం తమదంటూ దాదాపు 30 ఏళ్ల క్రితం కొందరు వ్యక్తులు కోర్టును ఆశ్రయించారు. ఆ వివాదం ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ భూములను రిజిస్ట్రేషన్ చేయవద్దని స్పష్టం చేస్తూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ‘ప్రొహిబిటెడ్ జాబితా’ను అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు పంపారు. కానీ ఈ 100 సర్వే నంబర్ పక్కన బై నంబర్లు, అక్షరాలు చేర్చి కూకట్పల్లి, బాలానగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. -
'ఇందిర, రాజీవ్ స్టాంపులు కొనసాగించాల్సిందే'
-
'ఇందిర, రాజీవ్ స్టాంపులు కొనసాగించాల్సిందే'
హైదరాబాద్: దివంగత ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ పోస్టల్ స్టాంపులను రద్దు చేయడం సరికాదని తెలంగాణప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఆరోపించింది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ ప్రభుత్వం సంకుచితంగా ప్రవర్తిస్తుందని ఆరోపించారు. విదేశాలు కూడా రాజీవ్ , ఇందిర పేరిట స్టాంపులు విడుదల చేశాయని అన్నారు. రాజీవ్ స్టాంపులను తిరిగి ప్రభుత్వం కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 22న తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో పోస్టాపీసుల ఎదుట కాంగ్రెస్ పార్టీ నిరసన వ్యక్తం చేస్తుందని స్పష్టం చేశారు. -
విభిన్న ఆలోచనలు.. విదేశీ కరెన్సీలు
అభిలాష్ అభిరుచి 120 దేశాల కరెన్సీ సేకరణ రామటెంకీలు, ముద్ద, చిల్లుపైసలు ఆయన సొంతం కొందరు యువకులు కంప్యూటర్‌తో పరుగులు పెడుతున్నారు. తమ లక్ష్య సాధనకు కృషి చేస్తున్నారు. కానీ, చేర్యాలకు చెందిన ఉప్పల అభిలాష్ విభిన్న ఆలోచనలతో ముందుకు సాగుతున్నారు. దేశవిదేశాల కరెన్సీ సేకరించి భవిష్యత్ తరాలకు అందిస్తున్నారు. సుమారు పదహారేళ్లుగా 120దేశాల కరెన్సీ నోట్లు, నాణేలు, స్టాంపులు సేకరించి భద్రపర్చుతున్నారు. - చేర్యాల సిద్దిపేట, తిమ్మాపురానికి చెందిన తన మేనమామ పడకంటి నాగరాజు స్ఫూర్తితో తల్లిదండ్రులు, సోదరుల సహకారంతో ఈ పనికి పూనుకున్నారు. అభిలాష్ చేర్యాలలో నాలుగో తరగతి చదువుతున్నప్పట్నుంచే విదేశాల నాణేలు, నోట్లు, స్టాంపుల సేకరణ ప్రారంభించారు. ఇండియాతో పాటు ఇండోనేషియా, సౌత్ఆఫ్రికా, శ్రీలంక, పాకిస్తాన్, నేపాల్, యూఎస్ఏ, ఫిలిఫైన్స్, భూటాన్, దుబయ్, సౌదిఅరేబియా, రష్య, చైనా, ఘన, మలేషియా, సింగపూర్, జర్మనీ, ఇంగ్లడ్, ఫ్రాన్స్ తదితర 120 దేశాల నాణేలు, 80 దేశాల స్టాంపులు, 40 దేశాల కరెన్సీ తన వద్ద భద్రపర్చారు. వెరుు్య ఏళ్లనాటి నాణేలు భద్రం న్యూ మీస్ మ్యాటిక్ సొసైటీ సహకారంతో సుమారు వెరుు్య ఏళ్లనాటి నాణేలు అభిలాష్ సేకరించారు. ఇందులో ఇండియూలోని వెండి రామటెంకీలతో పాటు 400 క్రితం నాటి(1500-1600ఏళ్లనాటి ముద్దపైసలు), 1835 నాటి బ్రిటిష్ ఈస్టు ఇండియా కంపెనీ(నిజాం సిక్క) నాణేలు, 1900 నాటి నిజాం హయూంలోని చార్మినార్ నాణెం నుంచి నేటి వరకు అన్ని నాణేలు సంపాదించారు. వీటిలో నిజాం హయూంలోని రూపారుులో 1/24 పైస నాణెం, ఈస్ట్ ఇండియా కంపెనీ వినియోగించిన రూపాయిలో 1/12 పైస నాణెం, ఇండియా కరెన్సీలోని నాణేలు, 1948 నుంచి నేటి వరకు అన్ని రకాల విదేశీ కరెన్సీ సేకరించారు. అభిలాష్ సేకరించిన ఫారిన్, ఇటలీ దేశాలతో పాటు యూరో, ఫౌండ్, దినార్, దిరాం, సెంట్ల, యూవాన్, రింగిట్, పైసో, లీరా, టెకా, ప్రాంకీ, రుప్పయలాంటివి ఉన్నారుు. ఇండియాతో పాటు 80 దేశాల స్టాంపులు సైతం.. అభిలాష్ సిలాటలి సొసైటీ గ్రపులతో కలిసి ఇండియాతో పాటు 80 దేశాలకు చెందిన స్టాంపులు సేకరించారు. 1947లో స్వాత్రంత్యం వచ్చాక వినియోగంలోకి వచ్చిన సుమారు ‘ఒక అణా’విలువైన స్టాంపుల నుంచి రూ.250 విలువైన అన్ని రకాల స్టాంపులు సంపాదించారు. స్వాతంత్య్రానంతరం కూడా.. 1947 స్వాత్రంత్య నాటి ముద్రగా ఉన్న ఒక్కరూపాయి నోటు నుంచి నేడు మార్కెట్లో చెలామణిలోని రూ.1000 విలువైన నోట్లు సేకరించారు. బెహరాన్కు చెందిన 1/4 బినాద్ (బెహరాన్కు చెందిన కరెన్సీ నోటు- ఇండియా కరెన్సీతో పోల్చితే రూ.40 కి సమానం). 1/4 దినార్ కువైట్‌కు చెందిన కరెన్సీ (ఇండియా రూ.40కి సమానం) వీటితో పాటు 40 దేశాల్లోని వివిధ రకాల కరెన్సీ నోట్లు అన్ని డిజైన్లవీ సేకరించారు. అనుభూతులు తెలిశారుు దేశవిదేశాల కరెన్సీ, స్టాంపుల సేకరణలో ఆ దేశస్తుల ఆచా ర వ్యవహారాలు, సంస్కృ తి, సంప్రదాయూలు, నా యకులు, అక్కడి చరిత్ర తెలిసింది. అన్నింటికీ మించి అక్కడి వారితో కొత్తమిత్రులు లభించారు. వీటి సేకరణ ద్వారా మహానాయకుల జీవితాల గురించి తెలుసుకోవాలనే ఆశ కలిగింది. నా స్నేహితులు ఎంతో సహకరించారు. - అభిలాష్ -
ఇకపై ప్రముఖుల చిత్రాలతో స్టాంపులు
న్యూఢిల్లీ: ఇప్పటివరకూ స్టాంపుల మీద ఎందరో సంఘసంస్కర్తలు, రాజకీయ నాయకుల చిత్రాలనుచూశాం. ఇకపై ప్రముఖ గాయకులు, చిత్రకారులు, రచయితలు, స్వాతంత్ర్యసమరయోధుల చిత్రాలతో స్టాంపులను విడుదల చేయనున్నారు. ఈ స్టాంపుల డిజైన్లను ప్రజల నుంచి కూడా సేకరించాలని భావిస్తోంది. చాంపియన్‌షిప్ ఆఫ్ కమ్యూనికేషన్, ఐటీ శాఖ మంత్రి రవి శంకర ప్రసాద్ తో సమావేశమైన అనంతరం దీనిపై స్టాంపుల సలహాకమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ప్రముఖుల చిత్రాలతో ముద్రించిన స్టాంపులను తాజ్ మహల్, అజంతా, ఎల్లోరా, బెలూర్ మాత్, కజరహో వంటి పర్యాటక స్థలాల వద్ద విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే 'స్వచ్ఛ భారత్' పేరుతో ఇతివృత్తాన్ని ముద్రించి తపాలా శాఖ జనవరి 30న స్టాంపులను విడుదల చేసిన సంగతి తెలిసిందే. మహిళా సాధికారత గౌరవార్థంగా ఓ స్టాంపును ఆగస్టు 15న విడుదల చేయనున్నారు. స్టాంపులపై ప్రకటించే ప్రతి సమాచారం ప్రజలకు చేరేలా ఒక మొబైల్ యాప్‌ను రూపొందిచాలని భావిస్తున్నట్టు మంత్రి ప్రసాద్ చెప్పారు. -
విభజన వివాదాలపై ఢిల్లీలో పంచాయితీ
హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పుల పంపిణీ పంచాయితీ ఢిల్లీకి చేరింది. కేంద్ర హోంశాఖ సారథ్యంలోని వివాదాల పరిష్కార కమిటీ శుక్రవారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులతో సమావేశం కానుంది. కేంద్ర హోం శాఖ కార్యదర్శి అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. రాష్ర్ట విభజనలో భాగంగా నిధులు, ఆస్తులు, అప్పుల పంపిణీ అంశాలను ఇందులో ప్రధానంగా చర్చించనున్నారు. రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న వివాదాలతోపాటు.. ఇప్పటివరకు జరిగిన విభజనను ఈ కమిటీ పరిశీలిస్తుంది. ఇందుకు వీలుగా సంబంధిత సమగ్ర సమాచారాన్ని రెండు రాష్ట్రాల నుంచి ఇప్పటికే స్వీకరించింది. పునర్విభజనకు ముందున్న పన్నుల బకాయిల పంపిణీని ప్రధానంగా ప్రస్తావించాలని తెలంగాణ సర్కారు పట్టుదలతో ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో పన్నుల బకాయిలు భారీ మొత్తంలో పేరుకుపోయాయి. ఎక్సైజ్ డ్యూటీ, వాహనాల పన్ను, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల పన్ను, గనులు-ఖనిజ వనరులు, ల్యాండ్ రెవెన్యూ, విద్యుత్ బకాయిలు కలిపితే మొత్తం రూ.7,326 కోట్ల పాత బకాయిలున్నట్లు ఇటీవలే కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) తమ నివేదికలో ప్రస్తావించింది. 2014 మార్చి 31 వరకు ఉన్న ఈ బకాయిల్లో దాదాపు రూ. 2,337.06 కోట్లు ఐదేళ్లుగా పేరుకుపోయాయి. వీటి పంపిణీ విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తింది. బకాయిలను ఆస్తిగా పరిగణించి జనాభా ప్రాతిపదికన తెలంగాణకు 41.68 శాతం, ఏపీకి 58.32 శాతం పంచుకోవాలని పొరుగు రాష్ర్టం పట్టుబడుతోంది. కానీ ఏ ప్రాంతంలో ఉన్న బకాయిలను ఆ ప్రభుత్వమే స్వీకరించాలని తెలంగాణ సర్కారు వాది స్తోంది. హైదరాబాద్‌లో వచ్చే రెవెన్యూ బకాయి మొత్తం తెలంగాణ సర్కారుకే చెందుతుందని అంటోంది. దీంతో ఈ అంశం పెండింగ్‌లో పడింది. ఆస్తులు, అప్పుల విభజనకు సంబంధించి పునర్విభజన చట్టంలోని ఏడో షెడ్యూలులో ఉన్న అంశాలపై తాజా భేటీలో కేంద్ర కమిటీ దృష్టి సారించనుంది. దీనికితోడు ప్రభుత్వరంగ సంస్థల ఆస్తుల పంపిణీ, ఇటీవల ఏపీ ఉన్నత విద్యామండలి నిధులు, బ్యాంకు ఖాతాల నిలిపివేతపై హైకోర్టు తీర్పు ప్రస్తావనకు వచ్చే అవకాశముంది. అలాగే కేంద్ర రుణాల పంపిణీ, నాబార్డు, వరల్డ్ బ్యాంకు, జైకా తదితర సంస్థల నుంచి ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న అప్పుల పంపిణీ కూడా జరగాల్సి ఉంది. ప్రాజెక్టులవారీగా పంచుకోవాలా లేక జనాభా ప్రాతిపదికన పంచుకోవాలా అనేది తేలాల్సి ఉంది. ఈ అప్పులకు సంబంధించి లెక్కలు కూడా లేకపోవడం గందరగోళంగా మారింది. దీంతో రుణ సంస్థల వద్ద గణాంకాలనే పరిగణనలోకి తీసుకోవాలని రెండు రాష్ట్రాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజా భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. -
రిజిస్ట్రేషన్ ఆదాయ లక్ష్యం రూ.4 వేల కోట్లు
సబ్ రిజిస్ట్రార్ల సంఘం డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో మహమూద్ అలీ సాక్షి, హైదరాబాద్: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా ఈ ఏడాది రూ.4వేల కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామని, ప్రజలకు మెరుగైన సేవలందించడం ద్వారా లక్ష్యా న్ని చేరుకోవాలని ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ సబ్- రిజిస్ట్రార్లను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర సబ్-రిజిస్ట్రార్ల సంఘం రూపొందించిన కరదీపికను బుధవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఈ ఆర్థిక సంవత్సరంలోనే సొంత భవనాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపా రు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద బ్రోకర్లను నియంత్రించి, ప్రజలకు అవసరమైన సమాచారం అందించేందు కు ‘హెల్ప్’ డెస్క్‌లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. -
ఆదివారాల్లో కూడా రిజిస్ట్రేషన్లు!
హైదరాబాద్: తెలంగాణలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖను ప్రక్షాళన చేస్తామని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ చెప్పారు. అవసరమున్న చోట ఆదివారాల్లో కూడా రిజిస్ట్రేషన్లు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాలు రెండు షిప్టుల్లో పనిచేయనున్నాయని వెల్లడించారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఒక షిప్టు ఉంటుందని, మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మరో షిప్టు ఉంటుందని తెలిపారు. నిజాం ప్రభువును ఉద్దేశించి సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్లో తప్పులేదని సమర్థించారు. నిజాం చేసిన మంచి గురించి చెబితే తప్పెలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. -
తపాలా..సేవలు భళా
పోస్టాఫీసులంటే ఒకప్పుడు ఉత్తరాల బట్వాడాకే పరిమితం. మరిప్పుడో... బ్యాంకుల్లోలా డబ్బులు వేయొచ్చు.. తీయొచ్చు. వేరే ఊరికి డబ్బులు పంపొచ్చు. ఏటీఎం సేవలూ లభ్యం. తపాలా సేవలతో అతితక్కువ ఖర్చుతో ఇల్లు మారొచ్చు. రైల్వే రిజర్వేషన్ సౌకర్యం, బీమా సేవలు... వీటితో పాటు మీకో చక్కటి వరం తిరుపతి వెంకన్న స్వామి అక్షింతలతో ‘ఆశీర్వచనం’ సేవలు. ‘మై స్టాంప్’ సేవల కింద మీ ఫొటోలతోనే స్టాంపులు మీకు లభ్యం. నిన్నమొన్నటి వరకు కొన్ని రకాల సేవలకే పరిమితమైన తపాలా శాఖ ప్రస్తుతం తలుపులు బార్లా తెరిచి బహుముఖంగా తన సేవలను విస్తరించింది. తపాలా శాఖ ప్రస్తుతం ఏయే సేవలు... ఎలా అందిస్తోంది తదితర వివరాలు మీకోసం... ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్ ఈ సౌకర్యం ద్వారా 24 గంటల్లో డబ్బులు వేరే ప్రాంతంలో ఉండేవారికి అందజేయవచ్చు. మొదటగా పోస్టాఫీసులో వినియోగదారుడు డబ్బులు చెల్లించగానే సంబంధిత అధికారి ఏ ప్రాంతానికైతే మనీ ఆర్డర్ బుక్ అయిందో ఆయా ప్రాంత కార్యాలయ అధికారికి మెసేజ్ ద్వారా పూర్తి వివరాలను తెలియజేసి డబ్బులు అందేటట్టు చూస్తారు. కొంచెం సుదూర ప్రాంతం, ఇతర సమస్యలు వస్తే మాత్రం 48 గంటల సమయంలో ఈ ఎలక్ట్రానిక్ మనీఆర్డర్‌ను వినియోగదారునికి అందజేస్తారు. ఆశీర్వచనం ఆశీర్వచనం పథకం ప్రశంసలు అందుకుంటోంది. పోస్టల్‌శాఖలో వినూత్న పథకంగా కొందరు భక్తులు చెబుతున్నారు. తిరుపతి పుణ్యక్షేత్రంలో శ్రీవేంకటేశ్వరస్వామి పాదాల చెంతన ఉన్న అక్షింతలను కేవలం రూ.5 ఆర్డర్ ద్వారా పొందవచ్చు. అక్షింతలతోపాటు స్వామివారి ఫొటో కూడా అందుతుంది. తిరుపతి వెళ్లలేని పరిస్థితి ఉన్నవారికి ఈ పథకం ఓ వరంగా చెప్పవచ్చు. సేవింగ్స్ బ్యాంక్ పోస్టల్ ఖాతాలో బ్యాంకుల్లో ఉన్న జమ, విత్‌డ్రా వంటి సౌకర్యాలు లభిస్తున్నాయి. ఏటీఎం సౌకర్యం సైతం అతిత్వరలో అందుబాటులోకి రానుంది. మరికొద్ది రోజుల్లో బ్యాంకు మాదిరిగా రుణ సౌకర్యం అందుబాటులోకి రానుంది. సేవింగ్స్ బ్యాంక్‌లో అయితే వయోవృద్ధులకు బ్యాంకులాగానే 9 శాతం వడ్డీని పోస్టల్‌శాఖ చెల్లిస్తుంది. కొన్ని రోజుల్లో పోస్టల్ బ్యాంక్‌లు కూడా వస్తాయని పోస్టల్ అధికారులంటున్నారు. లాజిస్టిక్ పోస్టు ఈ లాజిస్టిక్ పోస్టు సౌకర్యంలో మరికొన్ని సేవలు లభిస్తాయి. కొన్ని ముఖ్య వస్తువులను వేరే ప్రాంతాలకు పంపించుకోవచ్చు. నగరంలో నివసించే వారు అయితే హౌస్షిఫ్టింగ్కు కూడా వినియోగించుకోచ్చు. ఇల్లు మార్పిడికి ఇక వేలకువేలు చెల్లించే అవసరం ఉండదు. అతి తక్కువ ఖర్చుతో ఇల్లు మారిపోవచ్చు. ఈ సౌకర్యం బాగుందని తపాలా శాఖ వినియోగదారుల ప్రశంసలు అందుకుంటోంది. ఈ విధమైన హౌస్ షిప్టింగ్ సౌకర్యం ఉందని కొందరికి మాత్రమే తెలుసునని, దీనికి ఇంకా విస్తృత ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉందని పోస్టల్ అధికారులు భావిస్తున్నారు. రైల్వే రిజర్వేషన్ సౌకర్యం ఏ జిల్లాల్లో అయితే రైల్వే రిజర్వేషన్ కార్యాలయం లేదో, ఆ ప్రాంతంలోని పోస్టాఫీసులో ఈ సౌకర్యం లభిస్తుంది. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ జీవిత బీమా సౌకర్యాన్ని పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ కల్పిస్తోంది. తక్కువ ప్రీమియం, ఎక్కువ బోనస్ దీని ప్రత్యేకత. పల్లె ప్రాంత ప్రజలకు గ్రామీణ తపాలా జీవిత బీమా, పట్టణంలోని ఇతరులందరికీ ఎంప్లాయిస్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో ఉంది. గ్రామాల్లో ఉండేవారికి గ్రామీణ తపాలా బీమా ఉపయోగపడుతుంది. -
హైదరాబాద్, రంగారెడ్డిలో పడిపోయిన రిజిస్ట్రేషన్లు
-
జోరుగా క్రయ విక్రయాలు
* ఆంధ్రప్రదేశ్‌లో భారీగా పెరిగిన స్థిరాస్తి రిజిస్ట్రేషన్లు * విభజన తర్వాత 93 శాతం వృద్ధి నమోదు * ఆరు నెలల్లో ప్రభుత్వానికి రూ.1,316 కోట్ల ఆదాయం * ‘రాజధాని’ జిల్లాల్లో రికార్డు స్థాయిలో డాక్యుమెంట్ల నమోదు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకుంది. ఈ ఏడాది జూన్ - అక్టోబర్ నెలల మధ్య స్థిరాస్తి క్రయ విక్రయాలు భారీగా పెరిగాయి. గత ఏడాది ఈ మధ్యకాలంలో జరిగిన రిజిస్ట్రేషన్ల కంటే దాదాపు రెట్టింపు (93.35 శాతం అధికం) రిజిస్ట్రేషన్లు జరగడం గమనార్హం. గత ఏడాదితో పోల్చితే ఇదే కాలంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం కూడా భారీగా పెరిగింది. ఇక రాష్ట్ర రాజధాని ఏర్పాటవుతుందని గత కొన్ని నెలలుగా ప్రచారం సాగిన కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రిజిస్ట్రేషన్ల సంఖ్య రెట్టింపుకంటే అధికంగా ఉండటం విశేషం. మొత్తం 13 జిల్లాలకు గాను ఆరు జిల్లాల్లో గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది దాదాపు రెట్టింపు సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరిగాయి. విజయనగరం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో గత ఏడాదికంటే రెట్టింపు సంఖ్యలో డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయి. రిజిస్ట్రేషన్ల వృద్ధిలో ప్రకాశం, కృష్ణా, గుంటూరు జిల్లాలు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్నాయి. గత ఏడాది జూన్ - అక్టోబర్ నెలల మధ్య మొత్తం 3,08,445 డాక్యుమెంట్లు రిజిష్టర్ కాగా ఈ ఏడాది ఇదే కాలంలో 5,96,385 రిజిస్ట్రేషన్లు (93.35 శాతం అధికంగా) జరగడం గమనార్హం. ఇబ్బడిముబ్బడిగా పెరిగిన రాబడి రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పటితో పోల్చితే విభజన తర్వాత రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు 2013 -14 ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో (ఏప్రిల్ - సెప్టెంబర్) ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో వచ్చిన దానికంటే ఈ ఏడాది ఇదే కాలంలో దాదాపు రెట్టింపు ఆదాయం వచ్చింది. గత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో రూ.624.83 కోట్లు రాగా ఈ ఏడాది ఇదే కాలంలో రూ. 1,316 కోట్లు వచ్చింది. అయితే ఈ ఏడాది అక్టోబర్‌లో మాత్రం రాబడి తగ్గిపోయింది. రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా ఈ ఏడాది అక్టోబర్ నెలాఖరు వరకు రూ.1,469.95 కోట్ల రాబడి వచ్చింది. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి నూతన రాజధాని ఏర్పాటుపై, వివిధ జిల్లాల్లో విద్యాసంస్థలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటుపై అనేకరకాల ప్రకటనలు చేస్తూ వచ్చింది. ఈ కారణంగానే అన్ని జిల్లాల్లో స్థిరాస్తి రంగం పుంజుకుంది. అయితే అదే అక్టోబర్‌కు వచ్చేసరికి రాజధాని ప్రాంతం మినహా మిగిలిన జిల్లాల్లో పెద్దగా ఏ సంస్థగానీ, పరిశ్రమలు గానీ వచ్చే అవకాశం కనిపించడంలేదనే భావానికి ప్రజలు వచ్చారు. -
లక్ష్యానికి లంగరు!
* ఆస్తుల క్రయవిక్రయాల్లో అనిశ్చితి.. తప్పిన అంచనాలు * లక్ష్యాలకు దూరంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం * హైదరాబాద్, రంగారెడ్డిలో పడిపోయిన రిజిస్ట్రేషన్లు * ఇతర జిల్లాలు, భావి జిల్లా కేంద్రాల్లోనూ భూ విక్రయాల్లో స్తబ్దత.. * ఈ ఆర్థిక సంవత్సరంలో లక్ష్య సాధన ఇప్పటికీ 52 శాతమే! * ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలోకన్నా తక్కువే * కొత్త రాష్ర్టంగా అవతరించినా కనిపించని రియల్ బూమ్ * ధరల హెచ్చుతగ్గులపై ప్రజల్లో ఉన్న భారీ అంచనాలే కారణం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆస్తుల క్రయవిక్రయాలపై అంచనాలు తలకిందులవుతున్నాయి! తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తగ్గిన రిజిస్ట్రేషన్లు కొత్త రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కూడా పుంజుకోలేదు. స్వరాష్ట్రం సిద్ధిస్తే రాజకీయ స్థిరత్వంతో ‘రియల్’ బూమ్ పునరావృతమవుతుందని రియల్టర్లు వేసిన అంచనాలు తప్పుతున్నాయి. కొత్త రాష్ట్రానికి వలసలు పెరిగి, భూముల క్రయవిక్రయాల్లో చలనం వస్తుందని ప్రభుత్వం పెట్టుకున్న ఆశలు కూడా నెరవేరడం లేదు. జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఐదు నెలల కాలంలో కూడా రిజిస్ట్రేషన్లలో పెద్దగా పురోగతి లేదు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ శాఖ అంచనా వేసిన ఆదాయ లక్ష్యం ఇప్పటికీ అందనంత దూరంలో ఉండటం గమనార్హం. ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఆస్తుల అమ్మకాలు, కొనుగోళ్లలో అనిశ్చితి ఇంకా కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే భూముల మార్కెట్ విలువలు తగ్గుతాయని కొనుగోలుదారులు, బూమ్‌లేక ఇప్పటికే పడిపోయిన ధరలు కొత్త రాష్ట్రంలో పెరుగుతాయని రియల్టర్లు భావించడమే ఈ పరిస్థితికి కారణమని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సాధించిన లక్ష్యం 52 శాతమే! అధికారికంగా జూన్ 2న రాష్ర్టం ఏర్పాటైనప్పటికీ కొత్త సంవత్సరం ఆరంభంలోనే తెలంగాణ ఏర్పాటు ఖాయమైంది. దీంతో జనవరి నుంచే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో క్రయవిక్రయాలు తగ్గిపోయాయి. జిల్లా కేంద్రాలు, భవిష్యత్తులో జిల్లా కేంద్రాలుగా మారుతాయని భావి స్తున్న సిద్ధిపేట, మంచిర్యాల, వికారాబాద్, నాగర్‌కర్నూలు, వనపర్తి, సూర్యాపేట, జనగామ తదితర పట్టణాల్లో భూముల రేట్లు పెరిగాయి. అక్కడ రిజిస్ట్రేషన్లూ జరిగాయి. తెలంగాణ ఆవిర్భావం (జూన్2) నాటికి మళ్లీ స్తబ్ధత ఏర్పడింది. కొత్త జిల్లాల ఏర్పాటు ఇప్పట్లో ఉండదని కేసీఆర్ ప్రకటించిన తర్వాత ఆయా ప్రాంతాల్లో కూడా రిజిస్ట్రేషన్లు తగ్గిపోయాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా రెవెన్యూ శాఖ రూ. 4,766.79 కోట్లు రాబట్టుకోవాలని అంచనా వేసింది. దీని ప్రకారం అక్టోబర్ వరకు రూ. 2,717.07 కోట్లు రాబట్టాలి. కానీ వచ్చిన ఆదాయం మాత్రం రూ.1,418.91 కోట్లు. మిగిలిన 5 నెలల్లో వంద శాతం లక్ష్యాన్ని సాధిం చాలంటే మరో రూ. 3,348 కోట్లు ఆర్జించడం సాధ్యమయ్యే పనికాదు. అదే గత ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లక్ష్యం రూ. 4,445.30 కోట్లు కాగా, వచ్చిన ఆదాయం రూ. 2,939.05 కోట్లు. అంటే గత ఏడాది 66.12 శాతం లక్ష్యాన్ని చేరుకున్నప్పటికీ, ఈ ఏడాది ఇంకా 52 శాతానికే పరిమితమైంది. హైదరాబాద్, రంగారెడ్డిలోనే గండి... తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచే క్రయవిక్రయాల ద్వారా 68 శాతం ఆదా యం వస్తుంది. ఈసారి రెవెన్యూ శాఖ అంచనాలో ఈ 2 జిల్లాల లక్ష్యమే రూ. 3283 కోట్లు. ఈ లెక్క ప్రకారం ఇప్పటికే రూ. 1871.85 కోట్ల ఆదాయం రావాలి. కానీ ఇప్పటివరకు వచ్చిన ఆదాయం రూ. 968. 83 కోట్లు మాత్రమే. ఈ ప్రభావం మిగతా జిల్లాలపై కూడా పడినట్లు కనిపిస్తోంది. నిజామాబాద్ జిల్లాలో 61.74 శాతం తప్ప.. ఇతర ఏ జిల్లాలో కూడా 60 శాతానికి మించి లక్ష్యాలను సాధించలేదు. అయితే గత ఏడాది రంగారెడ్డిలో 60.4 శాతం లక్ష్యాన్ని చేరగా, హైదరాబాద్‌లో 70 శాతానికిపైగా సాధించింది. అంటే రెండు జిల్లాల్లో కలిపి 65 శాతానికిపైగా రెవెన్యూ లక్ష్యాలను ప్రభుత్వం సాధించింది. మరోవైపు రాబోయే ఐదు నెలల్లో మంచి ఫలితాలే ఉంటాయని రియల్టర్లు ఆశాభావం వ్యకం చేస్తుండగా, ఆ పరిస్థితి లేదని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. -
ఆన్లైన్ రిజిస్ట్రేషన్లకు అంతా సిద్ధం
నవంబర్‌లో శ్రీకారం దస్తావేజు లేఖరులకు చెక్ నేటినుంచి విధుల బహిష్కరణ అధికారులు, సిబ్బందిలోనూ గుబులు విజయవాడ : స్టాంప్స్, రిజిస్ట్రేషన్స్ శాఖ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లు చేసే ప్రక్రియను వచ్చే నెల నుంచి ప్రారంభించనుండంతో దస్తావేజు లేఖర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వాస్తవంగా ఈ విధానం అమల్లోకి వస్తుందని ఎప్పటినుంచో వినపడుతున్నప్పటికీ ఇప్పటికి కదలిక వచ్చింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం కూడా పచ్చజెండా ఊపిందని సమాచారం. రవాణ, పాస్‌పోర్టు కార్యాలయాల్లో మాదిరిగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియను స్లాట్ బుకింగ్ ద్వారా చేయాలని భావించి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. దస్తావేజు లేఖరులు లేకుండా నేరుగా ప్రజలు రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వెళ్లే విధంగా ఆన్లైన్ విధానాన్ని అమలు చేయడానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. ఈ నెల 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు స్టాంప్స్, రిజిస్ట్రేషన్స్ అధికారులు రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. ఇందుకు సంబంధించి సెంట్రల్ సర్వర్‌ను ఆన్‌లైన్‌కు అనుసంధానం చేసి కొత్త సాఫ్ట్వేర్లను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో సేల్డీడ్లు, గిఫ్ట్‌డీడ్‌లు, ఇతర రిజిస్ట్రేషన్లు ఎవరికి వారు సొంతంగా నిర్వహించుకునే విధానాన్ని అమలు చేయనున్నారు. ఆస్తుల మార్కెట్ విలువను కూడా నెట్లో పొందుపరిచారు. ప్రజలు తాము రిజిస్ట్రేషన్ చేయించుకోదలుచుకున్న ఆస్తి మార్కెట్ విలువను నేరుగా నెట్లో చూసుకోవచ్చు. రిజిస్ట్రేషన్‌కు అయ్యే ఫీజులు చలానా రూపంలో నేరుగా చెల్లించుకోవచ్చు. స్లాట్ బుకింగ్ ఇలా... రిజిస్ట్రేషన్ ప్రక్రియలో డాక్యుమెంట్ రైటర్ ప్రమేయం లేకుండా ఎవరికివారు సొంతంగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయదలుచుకునే వారు ఆన్లైన్లో డాక్యుమెంటు నమూనాను పూర్తి చేయాలి. వెబ్సైట్లోకి వెళ్లి, ఆ దరఖాస్తులో ఆధార్ నంబర్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్‌గా డేటా సెంటర్ నుంచి సదరు వ్యక్తి వివరాలు వేలిముద్రలతో సహా వచ్చేస్తాయి. ఆస్తి వివరాలకు సంబంధించిన ఖాళీల్లో సరిహద్దులు, విస్తీర్ణం నింపాల్సి ఉంటుంది. మార్కెట్ విలువ ఆన్లైన్లోనే తెలుసుకుని, బ్యాంకు ఖాతా నుంచే నగదు బదిలీ ద్వారా చలానా లేకుండా ఫీజు కట్టేయవచ్చు. ఏ తేదీన రిజిస్ట్రర్ చేయదలుచుకుంటారో అందులో పేర్కొం టే ప్రాధాన్యతా క్రమంలో స్లాట్ కేటాయిస్తారు. ఆ సమయానికి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళితే పాత దస్తావేజులు, లింకు డాక్యుమెంట్లు పరిశీ లించి మరోసారి వేలిముద్రలు, ఫొటో లు తీసుకుని రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇందులో డాక్యుమెంటురైటర్కు ఎటువంటి సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తారు. డాక్యుమెంటు రైటర్ దళారీగా వ్యవహరించి రిజిస్ట్రేషన్స్ సిబ్బందికి మామూళ్లు ముట్టచెబుతున్నారని ప్రభుత్వం భావిస్తోంది. దాంతో కొత్త విధానాన్ని అమలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. కాగా ఈ విషయం తెలియడంతో దస్తావేజు లేఖర్లలో, రిజిస్ట్రేషన్స్ అధికారులు, సిబ్బందిలో అలజడి చెలరేగుతోంది. ఈ నేపథ్యంలో వారు ఆందోళనకు దిగుతున్నారు. కొత్త విధానం అమల్లోకి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా వేలాది కుటుంబాలు రోడ్డున పడతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, సిబ్బంది కూడా ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. నేటి నుంచి దస్తావేజు లేఖరుల సమ్మె చల్లపలి: దస్తావేజు లేఖరుల సేవలను దూరంగా పెట్టడాన్ని నిరసిస్తూ శుక్రవారం నుంచి రెండురోజులపాటు వారు సమ్మెకు సిద్ధమయ్యారు. ఎన్నో ఏళ్ల నుంచి అందిస్తున్న దస్తావేజుల సేవలను నిలిపివేసి, మీసేవా కేంద్రాలకు అప్పగించడాన్ని నిరసిస్తూ సమ్మెకు దిగుతున్నారు. ఈ ఏడాది జనవరిలో 10రోజులు చేపట్టిన సమ్మె వల్ల జిల్లాలో రూ.24 కోట్ల మేర ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది. ఈసారి చేపట్టనున్న సమ్మెవ ల్ల రూ.8కోట్లు మేర ఆదాయానికి గండి పడనుంది. విజయవాడ రిజిస్ట్రార్ పరిధిలో 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుండగా, మచిలీపట్నం రిజిస్ట్రార్ పరిధిలో 14 సబ్‌రిజిస్ట్రార్ కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాల్లో 1800 మంది దస్తావేజు లేఖరులు, స్టాంపు వెండర్స్, డీటీపీ ఆఫరేటర్లు పనిచేస్తున్నారు. -
పోస్టల్‌స్టాంపుల్లో బాపూజీ
చరిత్రలో ఎన్నడూలేని విధంగా 91 ప్రపంచదేశాలు దాదా పు 250 మహాత్మాగాంధీ చిత్రాల తో కూ డిన పోస్టల్స్టాంపుల ను వెలువరించాయి. ఇంగ్లిష్ వారివి తప్ప ఎవరిపైనా స్టాంపులను వెలువరించని ఇంగ్లాడ్ సహితం గాంధీ చిత్రంతో పోస్టల్స్టాంపులు వెలువరించడం విశేషం. ఏడేళ్ల ప్రాయంలో ప్రాథమిక పాఠశాల దశలో ఉన్న చిత్రంతో బార్బుడా దేశం 1931లో స్టాంపును విడుదలచేసింది. అలాగే 1948లో నాలుగు జతల గాంధీస్టాంపును మనదేశం మొట్టమొదటి సారిగా ఆవిష్కరించింది. అలాగే 1969లో సతీమణి కస్తూర్బాతో కలిసి ఉన్న గాంధీ స్టాంపును వెలువరించారు. 1980లో దండియాత్రకు సంబంధించిన రెండుజతల గాంధీజీ స్టాంపులను వెలువరించారు. 2005లో 70 ఏళ్ల ఉప్పు సత్యాగ్రహం సందర్భంగా నాలుగు జతల స్టాంపులను వెలువరించారు. సత్యాగ్రహ ఉద్యమానికి వందేళ్లు పూర్తయిన సందర్భంగా 2007లో నాలుగు జతల స్టాంపులను వెలువరించారు. వీటన్నింటిని తెలుగు ఉపాధ్యాయుడు కమలాకర్ శ్యాంప్రసాద్‌రావు సేకరించి పదిలపరిచారు. -
అపాయింట్మెంట్పై రిజిస్ట్రేషన్
ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ హైదరాబాద్: భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే ఇకపై ఒకరోజు ముందుగా సబ్ రిజిస్ట్రార్ అపాయింట్మెంట్ తీసుకోవాలి... మరుసటి రోజు సరిగ్గా సమయానికి వెళితే క్షణాల్లో రిజిస్ట్రేషన్ పూర్తిచేసుకుని రావచ్చు... రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖల మంత్రి. ఉప ముఖ్యమంత్రి మహమ్మద్ మహమూద్ అలీ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మధ్యవర్తులను నియంత్రించేందుకు ఈ విధానాన్ని ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నదని పేర్కొన్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో హెల్ప్‌డెస్కులను ఏర్పాటు చేసి వినియోగదారులకు డాక్యుమెంట్ల తయారీలో సహాయం అందిస్తామని, రిజిస్ట్రేషన్లకు సంబంధించిన 21 రకాల నమూనా డాక్యుమెంట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతామన్నారు. ప్రజల సౌకర్యార్థం ఇకపై తపాలా కార్యాలయాల్లోనూ స్టాంపు పేపర్లను విక్రయిస్తామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. -
ఎవరికైనా ‘స్టాంప్’
చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ సుధాకర్ ఏపీ పోస్టల్ ఫిలాటెలిక్ ఎగ్జిబిషన్ ప్రారంభం విజయవాడ : నగరంలో ఏపీ పోస్టల్ ఫిలాటెలిక్ ఎగ్జిబిషన్ (అప్పెక్స్-2014) గురువారం ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ ఆధ్వర్యాన వేదిక ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ బి.వి.సుధాకర్ ప్రారంభించారు. మొత్తం 18వేలకు పైగా స్టాంపులను ప్రదర్శించారు. ఇందులో గురజాడ అప్పారావు, ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖరరెడ్డి ఇతర దేశాలకు సంబంధించిన స్టాంప్‌లు ఉన్నాయి. ప్రదర్శన ఈనెల 26తేదీ వరకు కొనసాగుతుంది. తొలిరోజు వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ప్రదర్శనను తిలకించారు. తొలుత నిర్వహించిన సభలో సుధాకర్ మాట్లాడుతూ.. ఫిలాటెలిక్ అంటే స్టాంప్ అని, ప్రజలలో చాలా మందికి స్టాంప్ కలెక్షన్ ఒక అలవాటుగా ఉంటుందన్నారు. ఇప్పటివరకు ముఖ్యమైన వ్యక్తుల ఫొటోలతోనే స్టాంప్‌లు ముద్రించామని, ఇకమీదట ఎవరైనా సరే.. పోస్టాఫీసుకు వచ్చి వారి ఫొటోతో స్టాంప్ కావాలంటే వెంటనే తయారు చేసి ఇవ్వబడతాయని తెలిపారు. భవిష్యత్తులో ఎలక్ట్రానిక్ స్టాంపులు వస్తాయని చెప్పారు. 20 ఏళ్ల తర్వాత విజయవాడలో స్టాంపుల ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సత్యసాయిబాబా, గురజాడ అప్పారావు, వైఎస్ రాజశేఖరరెడ్డి, అరసవెల్లి, నేషనల్ పోలీస్ అకాడమీ పేర్లపై గత ఏడాది స్టాంప్‌లు విడుదల చేసినట్లు తెలిపారు. ఆగస్టు నుంచి విద్యార్థులకు పోస్టాఫీసులో జరిగే కార్యకలాపాలపై అవగాహన కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అనంతరం విజయవాడ రీజియన్ పరిధిలోని స్పెషల్ కవర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద తపాలా ఉద్యోగులు పాల్గొన్నారు. -
ఇరు రాష్ట్రాలకు వేర్వేరు స్టాంపులు
విభజన నేపథ్యంలో వచ్చేనెల రెండో తేదీ నుంచి భూములు, స్థలాలు, ఇతర స్థిరాస్తుల క్రయ విక్రయాలకు సంబంధించిన లావాదేవీలను కూడా రెండు రాష్ట్రాలు వేర్వేరుగా నిర్వహిస్తారుు. తెలంగాణలో జరిగే రిజిస్ట్రేషన్ల ఆదాయం తెలంగాణకు, ఆంధ్రలో జరిగే రిజిస్ట్రేషన్ల ఆదాయం ఆంధప్రదేశ్‌కు చెందుతుంది. తెలంగాణలో రిజిస్ట్రేషన్లకు ఆ రాష్ట్రం పేరిట ప్రత్యేక స్టాంపులు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ప్రస్తుతం ఉన్న స్టాంపులే అమల్లో ఉంటాయి. అయితే కొత్తవి వచ్చే వరకు ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పేరిట ఉన్న స్టాంపులనే రెండు రాష్ట్రాల్లోనూ వినియోగిస్తారు. తెలంగాణలో రిజిస్ట్రేషన్ సమయంలో ఈ స్టాంపులపై తెలంగాణ అనే ప్రత్యేక రబ్బరు స్టాంపు ముద్రిస్తారు. జూన్ ఒకటో తేదీకి ముందు ఉమ్మడి రాష్ట్రంలో కొనుగోలు చేసిన స్టాంపులను ఆ తర్వాత కూడా ఏ రాష్ట్రంలోనైనా వినియోగించుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తెలంగాణ పేరిట స్టాంపులు ముద్రించి పంపాల్సిందిగా నాసిక్‌లోని ప్రింటింగ్ ప్రెస్‌కు ప్రభుత్వం తరఫున అధికారిక ఇండెంటు పంపాల్సి ఉంటుంది. అవి వచ్చే వరకు రెండు రాష్ట్రాల్లోనూ పాత స్టాంపులే చెల్లుబాటవుతారుు. -
రిజిస్ట్రేషన్ల రాబడి లక్ష్యం 7,376 కోట్లు
గత ఏడాది కంటే 68 శాతం అధికంగా లక్ష్యం ఆదాయం పెరగడం అసాధ్యమంటున్న అధికారులు లక్ష్యాన్ని తగ్గించాలంటూ ప్రభుత్వానికి లేఖ హైదరాబాద్: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.7,376 కోట్ల ఆదాయం సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టింది. మార్చి 31తో ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో ఈ శాఖ ద్వారా రూ.4,383.84 కోట్ల రాబడి వచ్చింది. దీనికంటే 68 శాతం అధిక ఆదాయం సాధించాలని ప్రభుత్వం తాజాగా ఆ శాఖ కమిషనర్‌కు సర్క్యు లర్ పంపింది. అరుుతే రూ.7,376 కోట్ల ఆదాయం మాట అటుంచితే గత ఏడాది మేరకు లేదా ఆపై రాబడి సాధించడం కూడా అసాధ్యమని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు నిర్ధారణకు వచ్చారు. అధికారులతో ఈ విషయమై చర్చించిన కమిషనర్ విజయకుమార్ వాస్తవ పరిస్థితులను బేరీజు వేసుకుని.. ఇంత రాబడి సాధ్యం కాదని, లక్ష్యాన్ని కుదించాలని పేర్కొం టూ ప్రభుత్వానికి లేఖ రాశారు. అరుుతే రాష్ట్రం వచ్చేనెల 2వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోతున్నందున కొత్త ప్రభుత్వాలు సమీక్షించి తాజాగా ఆదాయ లక్ష్యాలను నిర్ణయిస్తాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ‘ కొత్త ప్రభుత్వాలు ఆదాయ లక్ష్యాలను నిర్ణయించిన తర్వాత రెండు రాష్ట్రాల్లోని ఉన్నతాధికారులు జిల్లాల వారీ రాబడి లక్ష్యాలను ఖరారు చేసి జిల్లా రిజిస్ట్రార్లు, సబ్ రిజిస్ట్రార్లకు పంపుతారు. వారు ఈ మేరకు ఆదాయ సాధనకు కృషి చేస్తారు. రాష్ట్రాలు రెండుగా విడిపోయిన తర్వాత వాస్తవ విలువలకు అనుగుణంగా భూములు, స్థలాల మార్కెట్ విలువలను కూడా పునస్సమీక్షించే అవకాశం ఉంది’ అని రిజిస్ట్రేషన్ శాఖకు చెందిన ఒక ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. -
పోస్టల్ స్టాంపులపై 'స్వలింగ' శృంగారం
స్టాంపులపై గే శృంగారమా? బుగ్గలు నోళ్లు నొక్కుకోకండి. మన దేశం ఇప్పుడిప్పుడే స్వలింగ సంపర్కులకు సమాన హక్కుల గురించి మాట్లాడుతోంది. కానీ ఫిన్లండ్ లో పోస్టల్ స్టాంపులపై గే కల్చర్ ను ప్రతిబింబించే బొమ్మలు కూడా దర్శనమిస్తున్నాయి. ఈ మధ్యే ప్రముఖ గే చిత్రకారుడు టౌకో లాక్సోనెన్ వేసిన చిత్రాలతో ఫిన్లండ్ స్టాంపులను విడుదల చేసింది. మగటిమి ఉట్టిపడే నాలుగు చిత్రాలతో స్టాంపులు రూపొందించారు. ఈ చిత్రాలను ఇంకో ప్రముఖ చిత్రకారుడు టిమో బెర్రీ ఎంపిక చేశారు. మన బోంట్లకు కాస్త కంగారు పుట్టించవచ్చునేమో కానీ ఈ చిత్రాలు ఫిన్లండ్ లో మాత్రం భలే సూపర్ హిట్! ఫిన్లండ్ లో సమలైంగిక వివాహాలకు ఆమోదం ఇవ్వాలని 1.66 లక్షల మంది సంతకాలు చేశారు. -
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సమ్మెపోటు
= 73వ రోజుకు ఉద్యమం = జిల్లాలో రూ.25 కోట్ల ఆదాయం కోల్పోయిన ప్రభుత్వం మదనపల్లె, న్యూస్‌లైన్: సమైక్యాంధ్రకు మద్దతుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల మూతపడడంతో ప్రభుత్వాదాయానికి భారీ ఎత్తున గండిపడింది. జిల్లాలో 26 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. చిత్తూ రు డివిజన్లో 14, తిరుపతి డివిజన్లో 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. ఉద్యోగుల స మ్మె 73వ రోజుకు చేరుకుంది. జిల్లాలో దా దాపు రూ.25 కోట్లకుపైగా ప్రభుత్వాదాయా నికి గండిపడింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ప్రభుత్వం టార్గెట్‌ను నిర్ణయిస్తుంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో భూ క్రయ, విక్రయాలు, దాన విక్రయాలు, దస్తావేజులు, స్టాం పుల విక్రయాలు, వివాహాలు, సో సైటీ రిజిస్ట్రేషన్లు, ఈసీ నకళ్లు, ఆయుకాల రిజి స్ట్రేషన్లు, పలు ఇతర రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. మదనపల్లె సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి ఏటా దాదాపు రూ.12 కోట్లుకుపైగా ఆదాయం వస్తోంది. సమ్మె నేపథ్యంలో ఇక్కడ దాదాపు రూ.1.20 కోట్లకుపైగా ఆదాయం కోల్పోయింది. గతంలో ఎన్న డూ లేని విధంగా సమైక్య పోరు జరుగుతుం డడంతో ఇటు ప్రభుత్వంతో పాటు అటు స్టాం ప్ వెండర్లు భారీగా నష్టపోతున్నారు. స్టాంప్ వెండర్లు స్టాంపులు అమ్మకాలతో జీవనం సాగి స్తున్నారు. అలాంటిది దాదాపు రెండు నెలలకు పైగా సమ్మె కొనసాగుతుండంతో వీరి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. -
విదేశీ నాణెంపై విఘ్నేశ్వరుడు
గణపవరం, న్యూస్‌లైన్ : విఘ్నేశ్వరునిపై భక్తి శ్రద్ధలతో ఆఫ్రికా ఖండంలోని ఐవరీకోస్ట్ దేశం ప్రత్యేక నాణెం ముద్రించడం విశేషం. ఈ నాణేన్ని స్టాంపులు, నాణేలు, కరెన్సీ నోట్ల సేకరణ అభిరుచి ఉన్న గణపవరానికి చెందిన రుద్రరాజు ఫౌండేషన్ చైర్మన్ ఆర్వీఎస్ రాజు సేకరించారు. ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ వివిధ దేశాల నాణాలు, స్టాంపుల సేకరణ హాబీ ఉన్న తాను ఇంటర్నెట్లో ఈ నాణెం గురించి తెలుసుకుని ఉత్తర ప్రత్యుత్తరాలు సేకరించారన్నారు. నాణెం 25 గ్రాముల బరువు, 38.61 మిల్లీమీటర్ల వ్యాసం ఉందన్నారు. నాణేనికి ఒక వైపు ఆ దేశ రాజముద్ర, నాణెం విలువ, రెండో వైపు రావిఆకులతో రూపొందించిన విఘ్నేశ్వరుడి చిత్రం ముద్రించి ఉన్నాయన్నారు. గిఫ్టు బాక్సును వినాయకుని మూషిక వాహనం నమూనాలో రూపొందించి, అందులో ఈ స్మారక వెండి నాణేన్ని ఉంచి పార్శిల్ ద్వారా పంపారన్నారు. ఆ దేశ కరె న్సీ ప్రకారం ఈ నాణెం విలువ 1001 ఫ్రాంక్‌లని తెలిపారు. దీని సేకరణకు తనకు రూ.8 వేలు ఖర్చయిందని రాజు చెప్పారు. వివిధ దేశాల నాణేలు, స్టాంపులు, కరెన్సీ నోట్లు సేకరిస్తున్నానని, వాటి సేకరణకు ఇప్పటి వరకు రూ. 8 లక్షలు ఖర్చు చేశానన్నారు. -
‘రిజిస్ట్రేషన్’ బాదుడు
పాలమూరు, న్యూస్‌లైన్: ఇకనుంచి రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన సవర ణ, ఒప్పందాల రద్దు తలకు మించిన భారంగా మారనుంది. నేటి నుంచి భూ క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్ మరింత చార్జీలు పెరగనున్నాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అందించే వివిధ రకాల సేవలకు సంబంధిం చి పెంచిన ఫీజులు ఆదివారం నుంచి అమల్లోకి రానున్నాయి. రిజిస్ట్రేషన్‌ను సమయానికి చేసుకోలేకపోయి నా, ఆస్తి వివాదం ఉన్నా, సర్టిఫికెట్లలో లోపాలున్నా రి జిస్ట్రేషన్ తర్వాత దాన్ని రద్దు చేసుకునే అవకాశం కూ డా ఉంది. అయితే ఈ మూడు రకాల ఫీజులను ప్రభుత్వం పదిరెట్లు పెంచేసింది. వీటికి ప్రస్తుతం వందరూపాయలు ఉండగా, రూ.వెయ్యికి పెంచేసింది. అటెస్టేషన్ ఆఫ్ స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ, విక్రయహక్కు లు లేని జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ, విల్ ఎంక్వయిరీ, సీల్డ్ కవర్ డిపాజిట్ ఫీజులను కూడా రూ.వంద నుం చి రూ.వెయ్యికి పెంచింది. సెలవు దినాల్లో రిజిస్ట్రేష న్, భాగస్వామ్య ఒప్పందాల ఫీజును రూ.వెయ్యి నుం చి రూ.ఐదువేలకు పెంచింది. హక్కుదారు కదల్లేని పరిస్థితుల్లో సబ్ రిజిస్ట్రారు కార్యాలయ సిబ్బంది ఇం టికి వచ్చే ప్రైవేట్ అటెండెన్స్‌కు ప్రస్తుతం రూ.ఐదొందల రుసుం కాగా దీన్ని రెట్టింపు చేశారు. సర్టిఫైడ్ కాపీలు (నకళ్లు) కోసం ప్రస్తుతం రూ.50 చెల్లిస్తుండగా.. ఇకనుంచి రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. భూమి, ఇళ్లు, ఇంటి స్థలం కొనదలచిన వారు తప్పకుండా వాటికి సంబంధించిన ఈసీ, నకళ్లు(సీసీ) తీసుకోవాల్సిందే..30 ఏళ్లలోపు లావాదేవీల వివరాలతో కూడిన ఈసీ కావాలంటే రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. 30 ఏళ్లకు మించిన లావాదేవీల వివరాలు కావాలంటే ఈసీ కోసం రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. టైటిల్ డీడ్ల విడుదల ఫీజును మాత్రం రూ.వెయ్యికి తగ్గించింది. హక్కు విడుదల దస్తావేజు ఫీజు రూ.వెయ్యి రూ.10 వేలకు పెరిగినట్లే. అమ్మకం డిక్రీ రుసుముల విలువలో 0.5 శాతం యథాతథంగా ఉంటుంది. తనఖా దస్తావేజు రుసుం ఆస్తి విలువలో 0.5 శాతం నుంచి 0.1 శాతానికి తగ్గింది. ఏటా రూ.2.50 కోట్ల భారం జిల్లాలో ఆయా రిజిస్ట్రేషన్ కార్యాలయాల పరిధిలో ఈసీ, సీసీ సేవలు నెలకు నాలుగు వేల చొప్పున.. పెంచిన ఫీజు ప్రకారం ఏటా దాదాపు రూ.50 లక్షల వరకు ప్రజలపై అదనపు భారం పడనుంది. రక్త సంబంధీకులకు దాన సెటిల్మెంట్, సెలవుదినాల్లో రిజిస్ట్రేషన్, అభివృద్ధి ఒప్పందం, ఇతర సేవలకు సంబంధించి పెంచిన ఫీజుల ప్రకారం రూ.రెండుకోట్ల వరకు క్రయవిక్రయ దారులపై భారం పడనున్నట్లు అంచనా.. ఇక సెటిల్మెంట్ భారం రక్త సంబంధీకులకు స్థిరాస్తిని దానంగా కట్టబెడుతూ.. సెటిల్ మెంట్ రాయించేందుకు ప్రస్తుతం రూ.వెయ్యి చెల్లిస్తుండగా..స్థిరాస్తి విలువలో 0.5 శాతం కనిష్టంగా రూ.వెయ్యి, గరిష్టంగా రూ.10వేలు చెల్లించాలని నిర్ణయించారు. ఈ ఫీజు రూ.వెయ్యి నుంచి రూ.10 వేలకు పెరిగినట్లేనని సబ్ రిజిస్ట్రార్లు చెబుతున్నారు. స్థలాన్ని అభివృద్ధి చేసేందుకు కుదుర్చుకునే ఒప్పందాల రిజిస్ట్రేషన్‌కు రూ.రెండువేల ఫీజు ఉండగా.. ఆస్తి విలువలో ఫీజు 0.5 శాతం గరిష్టంగా రూ.20వేలుగా నిర్ణయించారు. టైటిల్ డీడ్ డిపాజిట్ ఫీజు ఆస్తి విలువలో 0.1 శాతం గరిష్టంగా రూ.వెయ్యి ఉండగా, ప్రభుత్వం దీన్ని గరిష్టంగా రూ.10 వేలకు పెంచింది. సవరణ భారమే.. రిజిస్ట్రేషన్ సమయంలో దిక్కులు, ఇంటిపేర్లు, ఉప నంబర్లు వంటి అంశాల్లో ఎక్కడైనా తప్పుగా నమోదైతే తర్వాత సవరించుకునే (రెక్టిఫికేషన్)అవకాశం ఉంది. ఆస్తి వాటాదారుల్లో ఎవరైనా ఒకరు విధిలేని పరిస్థితుల్లో ఫలానా తేదీన వచ్చి సంతకాలు చేస్తామంటూ ఒప్పుదల (రాటిఫికేషన్) ఒప్పందం చేసుకునే వెసులుబాటు కల్పించారు.