వెండర్ల రాజ్యం! | Vendor kingdom! | Sakshi
Sakshi News home page

వెండర్ల రాజ్యం!

Published Tue, Sep 13 2016 12:39 AM | Last Updated on Mon, Sep 4 2017 1:13 PM

వెండర్ల రాజ్యం!

వెండర్ల రాజ్యం!

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల వద్ద వారిదే హవా
అందుబాటులో లేని స్టాంపులు
అవస్థలు పడుతున్న వినియోగదారులు
అనంతపురం టౌన్‌ : జిల్లాలో అనంతపురం, హిందూపురం జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉన్నాయి. అనంతపురం పరిధిలో గుత్తి, గుంతకల్లు, కళ్యాణదుర్గం, కణేకల్లు, పామిడి, రాయదుర్గం, శింగనమల, తాడిపత్రి, ఉరవకొండ, యాడికి, అనంతపురం, అనంతపురం రూరల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలున్నాయి. హిందూపురం పరిధిలోకి బుక్కపట్నం, చిలమత్తూరు, చెన్నేకొత్తపల్లి, ధర్మవరం, హిందూపురం, కదిరి, మడకశిర, పెనుకొండ, తనకల్లు కార్యాలయాలు వస్తాయి. జిల్లా వ్యాప్తంగా 150 మంది వరకు స్టాంప్‌ వెండర్లు ఉన్నారు. కొంతకాలంగా నాన్‌ జ్యుడీషియల్, స్పెషల్‌ అడెస్సివ్‌ స్టాంపుల కొరత వేధిస్తోంది. అప్పుడప్పుడూ జిల్లాకు స్టాంపులు వస్తున్నా.. అధిక శాతం ‘ వెండర్ల చేతుల్లోకి వెళ్తున్నాయి. నిబంధనల ప్రకారం కార్యాలయాల్లో ఎక్కువ స్టాంపులు అందుబాటులో ఉంచాలి. జిల్లాలో మాత్రం ఆ పరిస్థితి లేదు. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోని అధికారులు, సిబ్బంది స్టాంప్‌ వెండర్లతో ముందుగానే చేసుకున్న ఒప్పందం మేరకు వాళ్లకే పెద్దపీట వేస్తున్నారు. వెండర్లు స్టాంపులను ముందుగానే కొనేయడం వల్ల అక్కడ మిగిలిన వారికి లభించడం లేదన్న విమర్శలున్నాయి. ప్రజలకు అత్యంత అవసరమైన 10, 20 స్టాంపుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. నాన్‌ జ్యుడీషియల్‌ స్టాంపులకు సంబంధించి అనంతపురం జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయానికి ఈ ఏడాది మేలో రూ.50 విలువైన స్టాంపులు 96 వేలు వచ్చాయి. వీటి మొత్తం రూ.48 లక్షలు. రూ.100 స్టాంపులు లక్షా 60 వేలు వచ్చాయి. వీటి విలువ రూ.కోటి 60 లక్షలు. అలాగే జూలైలో రూ.10 విలువైన స్టాంపులు 24 వేలు, రూ.20 విలువైన స్టాంపులు 32 వేలు వచ్చాయి. వీటి మొత్తం రూ.8 లక్షల 80 వేలు. ఇలా వచ్చిన స్టాంపులను రిజిస్ట్రార్‌ కార్యాలయ పరిధిలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు పంపిణీ చేశారు. అయితే..వీటిలో ఎక్కువ శాతం వెండర్లకే పంపిణీ చేశారు. ఒక్క అనంతపురం రిజిస్ట్రార్‌ కార్యాలయంలోనే నెలకు  రూ.50 లక్షల వరకు విలువైన స్టాంపులు అవసరం. మిగిలిన ప్రాంతాల్లో కూడా  రూ.20 లక్షల వరకు విలువైన స్టాంపులు అవసరమవుతాయి. అనంతపురం కార్యాలయ పరిధిలో  40 మంది వరకు స్టాంప్‌ వెండర్లు ఉండగా.. రూ.10, రూ.20 స్టాంపులను అధిక శాతం వారికే ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో కార్యాలయాల్లో ఇవి అందుబాటులో లేవు.  వెండర్లు అవసరాన్ని బట్టి సాంపుపై రూ.100 నుంచి రూ.150 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. అనంతపురం నగరంలో కొంత మంది కార్యాలయం వద్దే తిష్టవేసి అధిక రేట్లకు విక్రయిస్తున్నారు.
అవస్థలు పడుతున్నా..
ఆస్తులు, భూములు, వాహనాలు, ఆర్థిక లావాదేవీలు, లీజులు తదితర వాటికి నాన్‌జ్యుడీషియల్‌ స్టాంపులు కావాల్సిందే. రూ.10, రూ.20, రూ.50, రూ.100 స్టాంపులు ప్రజలకు అందించడంలో రిజిస్ట్రేషన్‌ శాఖ విఫలమవుతోంది. జిల్లాలోని ఎక్కువ శాతం సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రూ.10, రూ.20 స్టాంపులు లేవంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 
రికార్డులు చూస్తే గానీ చెప్పలేం
స్టాంపులు విజయవాడ నుంచి వస్తాయి. ఆ వెంటనే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు పంపుతాం. సబ్‌ రిజిస్ట్రార్లే స్టాంప్‌ వెండర్లకు ఇస్తారు. కార్యాలయాల్లో తక్కువ పెట్టుకుని వెండర్లకు ఎక్కువ ఇస్తున్నారనే విషయం అక్కడి రికార్డులు చూస్తేగానీ చెప్పలేం. తనిఖీలు చేసి అలా జరుగుతుంటే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. 
– దేవరాజ్, రిజిస్ట్రార్, అనంతపురం   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement