ఒంగోలు సబర్బన్ : ప్రకాశం జిల్లా ఒంగోలులో సంచలనం సృష్టించిన నకిలీ డాక్యుమెంట్లు, స్టాంపుల కుంభకోణం కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ మలికాగర్గ్ చెప్పారు. ఒంగోలు టూ టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆమె మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడారు. నకిలీ డాక్యుమెంట్లు, స్టాంపుల కుంభకోణం కేసును ఎవరైనా రాజకీయంగా వాడుకోవాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కేసులో ఏ పార్టీ వాళ్లు ఉన్నా వదిలిపెట్టేది లేదన్నారు. 20 రోజుల క్రితం వేరే కేసులో ఒంగోలు తాలూకా పోలీసులు తనిఖీ చేస్తుంటే అక్కడ నకిలీ స్టాంపులు, డాక్యుమెంట్లు బయటపడ్డాయని, అప్పటి నుంచి వేగంగా కేసు దర్యాప్తు జరుగుతోందన్నారు.
ఈ కేసు దర్యాప్తును వేగంగా చేపట్టాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి స్వయంగా తనతో చెప్పారని తెలిపారు. తనతో పాటు కలెక్టర్ ఏఎస్ దినే‹Ùకుమార్‌తో కూడా ఈ కేసు విషయంపై బాలినేని స్పష్టంగా మాట్లాడినట్టు చెప్పారు. ఈ కేసులో ఏ పార్టీ వారున్నా, చివరకు తన అనుచరులున్నా సరే ఎలాంటి రాజకీయ ఒత్తిడులకు తలొగ్గవద్దని కూడా బాలినేని స్పష్టం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. కొన్ని పార్టీలు రాజకీయ ప్రాబల్యం కోసం అనవసర ఆరోపణలు చేస్తున్నాయని, వెంటనే మానుకోవాలని సూచించారు. ఈ కేసుకు సంబంధించి ఎలాంటి ఆధారాలున్నా పోలీస్ అధికారులకు తెచ్చివ్వాలని సూచించారు. అంతే కానీ రాజకీయ స్వార్థం కోసం పోలీస్ దర్యాప్తును పక్కదారి పట్టిస్తే మాత్రం సహించేది లేదని ఎస్పీ హెచ్చరించారు.
‘కేసులో వేలకొలది డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నాం. వాటిలో 130 డాక్యుమెంట్లను నిశితంగా పరిశీలిస్తున్నాం. వాటిలో నకిలీవి ఎన్ని, అసలు డాక్యుమెంట్లు ఎన్ని ఉన్నాయో అటు రెవెన్యూ, ఇటు రిజి్రస్టేషన్ల శాఖల సమన్వయంతో దర్యాప్తు జరుగుతోంది. ఇప్పటికే ఎనిమిది మందిని అరెస్ట్ చేశాం, మరో 12 మందిని అరెస్ట్ చేయాల్సి ఉంది. ఇంకా ఎవరెవరి పాత్ర ఇందులో ఉందో కూడా లోతుగా దర్యాప్తు చేస్తున్నాం’ అని అన్నారు. తొలుత దర్శి డీఎస్పీతో సిట్ ఏర్పాటు చేశామని, కేసు తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఒంగోలు ఏఎస్పీ కే.నాగేశ్వరరావుకు కేసును అప్పగిస్తూ అప్‌గ్రేడ్ చేసినట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment