సాక్షి, వరంగల్: బంగారు ఆభరణాల నాణ్యత పరీక్షలను గుడ్డిగా చేస్తూ.. కొన్ని హాల్‌మార్కింగ్ కేంద్రాలు బంగారు వ్యాపారులకు కొమ్ముకాస్తూ ‘క్యాష్’చేసుకుంటున్నాయి. ఈ బంగారమైన దందా వరంగల్ కేంద్రంగా మూడు పువ్వులు, ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. హాల్ మార్కింగ్ ఉండడంతో వినియోగదారులు కూడా గుడ్డిగానే నమ్మకంతో వ్యాపారుల వద్ద ఆభరణాలు కొంటూ మోసపోతున్నారు.
12, 14, 18, 22 క్యారెట్లు ఉన్న బంగారాన్ని ఇతర లోహల కల్తీ ఉన్నా.. ఇంకాస్త ఎక్కువగా బంగారం ఉన్నట్టుగా అస్సెయింగ్ విధానం ద్వారా పరీక్షలు చేసి హాల్ మార్కింగ్ ముద్ర వేస్తుండడం వివాదాస్పదమవుతోంది. వరంగల్ నగరంలో కొన్ని నెలల క్రితం బీఎస్‌ఐ నిబంధనలు పాటించని ఓ హాల్ మార్కింగ్ కేంద్రాన్ని మూసివేసినా.. మళ్లీ ప్రారంభమైందంటే వారి ‘లాబీ’యింగ్ ఏ స్థాయిలో ఉందనేది తెలుస్తోంది. దీనిపై పూర్తిస్థాయిలో దృష్టి సారించాల్సిన సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో వీరి దందా రూ.కోట్లలో సాగుతుందనే ఆరోపణలు ఉన్నాయి.
ఇతర లోహాలు ఎక్కువగా ఉన్నా మంచి మార్కింగే..
బంగారంలో కలిపిన రాగి, వెండి, కాడ్మియం, జింక్ వంటి ఇతర లోహల శాతం ఆధారంగా బంగారం స్వచ్ఛత అంటే 22 క్యారెట్లు, 18 క్యారెట్లుగా నిర్ణయిస్తారు. 22 క్యారెట్ల బంగారం అంటే అందులో 91.6 శాతం బంగారం, 8.4 శాతం కలిపిన ఇతర లోహలు ఉంటాయి. 18 క్యారెట్లు అంటే బంగారం స్వచ్ఛత 75 శాతం, ఇతర లోహలు 25 శాతం ఉన్నాయని అర్థం. 14 క్యారెట్లలో బంగారం 58.5 శాతం, 12 క్యారెట్లలో 50 శాతం, 10 క్యారెట్లలో 41.7 శాతానికి మించి బంగారం ఉండదు. సాధారణంగా 22 క్యారెట్లతోనే బంగారు ఆభరణాలు తయారు చేస్తారు. 2022 జూన్ 1నుంచి ప్రతీ గోల్డ్‌షాపు నాణ్యమైన హాల్‌మార్క్ బంగారాన్ని అమ్మాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ బంగారు ఆభరణాల్లో కలిపే ఇతర లోçహాల శాతం ఎక్కువగా ఉన్నా కూడా స్వచ్ఛమైన బంగారం అంటే 22 క్యారెట్ల బంగారం అంటూ మార్కింగ్ ఇస్తుండడం గమనార్హం.
సిబ్బందిని మచ్చిక చేసుకొని..
బంగారు ఆభరణాల నాణ్యతను పరీక్షించే అస్సెయింగ్ విధానం దాదాపు ఆరు గంటల పాటు చేయాల్సి ఉన్నా కేవలం 15 నుంచి 30 నిమిషాల్లోనే ఆయా ఆభరణాలపై çహాల్ మార్కింగ్ ఇస్తుండడం గమనార్హం. ముఖ్యంగా కొందరు బంగారు వ్యాపారులు కావాలనే ఇక్కడి సిబ్బందిని మచ్చిక చేసుకొని మరీ మేలిమైన బంగారమంటూ హాల్‌మార్కింగ్ వేస్తుండడంతో వినియోగదారులు కూడా నిజమని నమ్మి కొనుగోలు చేసి మోసపోతున్నారు. బంగారు ఆభరణాల్లో తేడాలు కనిపిస్తే మౌలాలిలోని బీఎస్‌ఐ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలి. ‘దీనిపై మేం కూడా ఫిర్యాదు చేస్తున్నాం’ అని వినియోగదారుల మండలి రాష్ట్ర అధ్యక్షుడు సాంబరాజు చక్రపాణి తెలిపారు.
చదవండి: చదువు పేరుతో హైదరాబాద్‌లో సహజీవనం.. ఇంటికి వచ్చాక మాట మార్చిన మహేష్
Comments
Please login to add a commentAdd a comment