
సాక్షి, వరంగల్: వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ వైద్యుడు సుమంత్ రెడ్డి మృతిచెందారు. ఎనిమిది రోజులుగా మృత్యువుతో పోరాడిన సుమంత్ రెడ్డి శుక్రవారం అర్థరాత్రి చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. సుమంత్ మృతితో ఆయన కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇక, సుమంత్ రెడ్డి భార్యే ప్రియుడితో కలిసి హత్య చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో రెండు రోజుల క్రితం సుమంత్ రెడ్డి భార్య ఫ్లోరా మరియా, దాడికి సహకరించిన ఏఆర్ కానిస్టేబుల్ రాజ్ కుమార్, సామ్యూల్‌లను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. డాక్టర్ సుమంత్ రెడ్డి, ఫ్లోరా మరియాలు ఎనిమిది సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. కాజీపేటలో సుమంత్ క్లినిక్‌ను నిర్వహిస్తుండగా, అతని భార్య ఫ్లోరా మరియా రంగశాయిపేటలో డిగ్రీ లెక్చరర్‌గా పనిచేస్తోంది. అయితే, క్లినిక్ ప్రారంభించకముందు ఓ ఆస్పత్రిలో డాక్టర్‌గా సుమంత్ పనిచేసేవారు. ఆ సమయంలో ఫ్లోరా మరియా ఓ జిమ్‌లో చేరింది. అక్కడే ఆమెకు సామెల్ అనే యువకుడు పరిచయమయ్యాడు. ఆ పరిచయం ప్రేమగా మారింది.
దీంతో, వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం మొదలైంది. ఆ విషయం సుమంత్‌కు తెలిసిపోవడంతో భార్య ఫ్లోరాను మందలించాడు. అయినా, ఆమె వినిపించుకోలేదు. భర్తను వద్దనుకొని, ప్రియుడే కావాలని అనుకున్న ఆమె, చివరికి భర్తను అడ్డు తొలగించుకోవాలని అనుకుంది. ఇందుకోసం ప్రియుడు సామెల్, అతని స్నేహితుడు ఏఆర్ కానిస్టేబుల్ రాజును ఆమె పురమాయించింది. నేరం చేస్తే తన చేతికి మట్టి అంటకుండా ఉండాలన్న ఉద్దేశ్యంతో భర్తను ఎక్కడ, ఎలా హత్య చేయాలో ఫ్లోరా చెప్పింది.

సుమంత్‌ను చంపి, రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు స్కెచ్ వేసింది. ప్లాన్ ప్రకారం, యాక్సిడెంట్ ప్లాన్ విఫలమయ్యాక, ప్లాన్ బీ ప్రకారం ఈ నెల 20న రాత్రి ఖాజీపేట నుండి బట్టుపల్లి బైపాస్ రహదారిలో సమంత్ కారును అడ్డగించి, అతడిపై ఐరన్ రాడ్లతో దాడి చేశారు. చనిపోయాడనుకున్న తర్వాత నిందితులు పరారయ్యారు. కానీ చావుబతుకుల మధ్య ఉన్న బాధితుణ్ని స్థానికులు అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. సుమంత్‌పై జరిగిన హత్యాయత్నంపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో కట్టుకున్న భార్య ఫ్లోరా మరియా, ఆమె ప్రియుడు సామెల్, సామెల్ స్నేహితుడు ఏఆర్ కానిస్టేబుల్ రాజు నిందితులని తేలింది.
Comments
Please login to add a commentAdd a comment