
రాయలసీమలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం
సాక్షి, అమరావతి/ఒంగోలు సబర్బన్: ఒకవైపు ఎండలు, మరోవైపు వర్షాలతో రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. శుక్రవారం రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురవగా, కోస్తాలోని పలుచోట్ల ఎండల తీవ్రత కొనసాగింది. అత్యధికంగా నంద్యాల జిల్లా మద్దూరు, ప్రకాశం జిల్లా రాళ్లపల్లిలో 111.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలసలో 39.9 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో 39.2 డిగ్రీలు, శ్రీకాకుళం జిల్లా కొల్లివలసలో 39.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
అకాల వర్షాలకు గుంటూరు, ప్రకాశంసహా పలు జిల్లాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గుంటూరు జిల్లాలో పలు ప్రాంతాల్లో శుక్రవారం తెల్లవారుజామున అకాల వర్షం కురిసింది. దీనివల్ల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాల్లో జొన్న రైతులకు కొంత మేర నష్టం వాటిల్లింది. మంగళగిరి నియోజకవర్గం వ్యాప్తంగా 150 హెక్టార్లలో పసుపు పండించారు.
అకాల వర్షం కురియడంతో నీళ్లు నిలబడకపోయినా పసుపు తడిసిపోయిందని, తడవడం వల్ల నల్లమచ్చలు, బూజు వస్తుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రకాశం జిల్లాలో పలుచోట్ల గురువారం రాత్రి భారీ వర్షం పడింది. కంభం, బేస్తవారిపేట, అర్థవీడు, కొమరోలు మండలాలు, యర్రగొండపాలెం మండలంలో ఈదురుగాలులతో కురిసిన అకాల వర్షానికి వందల ఎకరాల్లో అరటి, బొప్పాయి, టమోటా పంటలు దెబ్బతిన్నాయి.