అవినీతికి రిజిస్టేషన్లు | Registration to corruption | Sakshi
Sakshi News home page

అవినీతికి రిజిస్టేషన్లు

Published Thu, Mar 10 2016 11:54 PM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM

అవినీతికి రిజిస్టేషన్లు - Sakshi

అవినీతికి రిజిస్టేషన్లు

రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అక్రమాలు
{పతి సేవకూ ప్రత్యేక వసూళ్లు దళారులదే హవా
‘నిషేధిత’ భూములతో కాసుల పంట
‘ఎనీవేర్ రిజిస్ట్రేషన్’తో గాడితప్పిన వ్యవస్థ

 
 హైదరాబాద్:  స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కార్యాలయాలు అవినీతికి చిరునామాగా మారిపోయాయి. అక్రమాలకు... అవకతవకలకు అడ్డాగా నిలుస్తున్నాయి. తల దాచుకునే జాగా... తనదనుకునే ఓ నివాసాన్ని సొంతం చేసుకోవాలన్న ఆశతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వస్తున్న ప్రజలను అక్కడి సిబ్బంది పీల్చి పిప్పి చేస్తున్నారు. దళారులతో కలసి అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు. భారీగా లంచాలు పుచ్చుకుని ‘నిషేధిత జాబితా’లోని స్థలాలనూ రిజిస్ట్రేషన్ చేసేస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు నగర శివార్లలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మంగళ, బుధవారాల్లో ‘సాక్షి’ విజిట్‌లో ఈ వ్యవహారాలు బయటపడ్డాయి. ఈ కార్యాలయాల్లో బ్రోకర్లు సర్వం తామే అయి కార్యకలాపాలు నిర్వహిస్తున్న తీరు కొట్టొచ్చినట్లు కనిపించింది. వీటిలో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేసినా ఫలితం శూన్యం. ఇక ప్రభుత్వం వినూత్నంగా ప్రారంభించిన ‘ఎనీవేర్ రిజిస్ట్రేషన్’ సౌకర్యం పూర్తిగా దారి తప్పింది. ప్రభుత్వ, వక్ఫ్, కోర్టు వివాదాల్లో ఉన్న భూములకు బై నంబర్లు లేదా అక్షరాలు జోడించి దర్జాగా రిజిస్ట్రేషన్ చేస్తున్న  వైనం వెలుగు చూసింది.
 
ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోనే..

చాలా కాలంగా రిక్రూట్‌మెంట్ లేకపోవడం... రిజిస్ట్రేషన్ల శాఖ వినియోగిస్తున్న సర్వర్లు ప్రైవేటువి కావడమే కాదు... కంప్యూటర్ల నిర్వహణ సహా ఇతర సేవలన్నీ ఔట్ సోర్సింగ్ సిబ్బంది చేతుల్లోనే ఉంటున్నాయి. దీంతో దళారులు, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది కనుసన్నల్లోనే రిజిస్ట్రేషన్లు, ఇతర సేవలు కొనసాగుతున్నాయి. రిజిస్ట్రేషన్లకు వచ్చే వారి డాక్యుమెంట్లను దళారులే సిద్ధం చేస్తున్నారు. ముందే ‘సొమ్ము’ ముట్టజె ప్పనిదే పని పూర్తి కాని పరిస్థితి నెలకొంది. హెల్ప్‌డెస్క్ వద్దకు వెళ్లి నేరుగా రిజిస్ట్రేషన్ చేయాలని కోరితే... సవాలక్ష ప్రశ్నలు, కొర్రీలతో విసిగించడం తప్పితే...ప్రయోజనం కనిపించదు.
 
‘ఎనీవేర్’తో అడ్డగోలుగా...
 గ్రేటర్ హైదరాబాద్‌లోని మెజారిటీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నిబంధనలను పాటించడం లేదు. అధికారులు, సిబ్బంది అన్ని పత్రాలున్న ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు కూడా బ్రోకర్ల ద్వారా స్క్వేర్ ఫీట్లు, గజాలు, ఎకరాలుగా లెక్క తేల్చి విస్తీర్ణాల మేరకు ప్రత్యేక ధరలు నిర్ణయించి దండుకుంటున్నారు. ఇక వివాదాస్పద భూముల విషయంలోనైతే వారికి హద్దులే ఉండటం లేదు. ముఖ్యంగా రెవెన్యూ, మున్సిపల్ విభాగాలు ప్రొహిబిటెడ్ (రిజిస్ట్రేషన్ చేయకూడని) జాబితాలో చేర్చిన భూములు, ప్లాట్ల విషయంలో దొరికినంత దండుకుంటున్నాయి. దీని కోసం ‘ఎనీవేర్ రిజిస్ట్రేషన్’ (ఒక జిల్లా పరిధిలోని ఏ కార్యాలయ పరిధిలోవైనా) సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు. ఇలా ‘ఎనీవేర్’ రిజిస్ట్రేషన్లు అత్యధికంగా బాలానగర్, కూకట్‌పల్లి, రంగారెడ్డి తూర్పు, పశ్చిమ కార్యాలయాల్లో ఎక్కువగా సాగుతున్నాయి. బాలానగర్, కూకట్‌పల్లిలలో నిషేధిత జాబితాలోని భూములకు బై నంబర్లు జోడించి దర్జాగా రిజిస్ట్రేషన్లు చేసేస్తున్నారు.

ప్రక్షాళన చేయాల్సిందే..
స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖను మొత్తంగా ప్రక్షాళన చేస్తేనే అవినీతి, అక్రమాలకు తావులేని, వేగంతో కూడిన నాణ్యమైన సేవలు అందుతాయని ఆ శాఖ ఉద్యోగులే పేర్కొంటున్నారు. రాష్ట్ర ఖజానాకు ఏటా రూ.3,500 కోట్ల ఆదాయం తెచ్చి పెడుతున్న ఈ శాఖకు రూ.100 కోట్లు వ్యయం చేస్తే తప్పక గాడిలో పడుతుందని అంటున్నారు. వారు చేస్తున్న సూచనలివీ...100 సంవత్సరాల రికార్డులు ఎక్కడా అందుబాటు లేవు. రికార్డుల డిజిటలైజేషన్‌ను ఒక్క కార్యాలయానికే పరిమితం చేసి చేతులు దులుపుకున్నారు. కేవలం 30 కోట్లు ఖర్చు చేస్తే రాష్ట్రంలో రికార్డులన్నీ డిజిటలైజ్ అవుతాయి. దీంతో సేవలు మరింత విస్తృతం చేయొచ్చు. సెంట్రల్ సర్వర్‌ను ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించాలి. 40 శాతంగా ఉన్న ఖాళీలను భర్తీ చేయాలి. ఈ చర్యలతో ఆదాయం రెండేళ్లలో రూ.ఐదువేల కోట్లు దాటే అవకాశం ఉంది.
      
రికార్డుల డిజిటలైజేషన్ పూర్తయ్యే వరకు ఎనీవేర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిలిపివేయాలి. తమిళనాడులోలాగా రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీ శాఖలను రిజిస్ట్రేషన్ శాఖతో అనుసంధానం చేయాలి. ఆయా శాఖలు ఆన్‌లైన్‌లో అనుమతిచ్చాకే రిజిస్ట్రేషన్ చేయాలి. కర్ణాటకలోనూ ఆయా సంస్థలు అనుమతిచ్చాకే డాక్యుమెంట్ ఇస్తున్నారు. ఆ విధానాలను రాష్ట్రంలో అమలు చేయాలి. {పభుత్వం రూపొందించిన ‘ప్రొహిబిటెడ్ 22 (ఎ)’ జాబితాలోని భూములను బై నంబర్, ఇతర అక్షరాలు వేసి రిజిస్టర్ చేసిన అధికారులు, వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి శిక్షించాలి. మార్కెట్ విలువల నిర్ధారణ, రిజిస్ట్రేషన్ల తీరు, ఆదాయం వంటివి క్షుణ్ణంగా పరిశీలించి, ఆదాయాన్ని పెంచేందుకు ఉద్దేశించిన ఆడిట్ విభాగాలు నిర్వీర్యమయ్యాయి. వాటిని నిజాయితీ గల అధికారులతో పటిష్టం చేయాలి.
 
ఎల్‌బీనగర్ పరిధిలోని తుర్కయాంజల్, రాగన్నగూడ ప్రాంతాల్లో హార్డ్‌వేర్ పార్కు సేకరణ పరిధిలో ఉన్న భూములను ప్రొహిబిటెడ్ జాబితాలో పెట్టినా రిజిస్ట్రేషన్లు జరిగిపోతున్నాయి. ఇతర ప్రాంతాల్లో రిజిస్టర్ చేయని వ్యవసాయ భూములు, ప్రభుత్వ భూములను సైతం ఎల్‌బీనగర్ కార్యాలయాల్లో రిజిస్టర్ చేసేస్తున్నారు.
 
నిషేధించినా...
మియాపూర్ సమీపంలోని మదీనాగూడ గ్రామంలో సర్వే నంబర్ 100లో 277 ఎకరాలు, 101లో 268 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. రెవెన్యూ రికార్డులు దీనిని ప్రభుత్వ భూమిగా చెబుతున్నాయి. కానీ ఆ స్థలం తమదంటూ దాదాపు 30 ఏళ్ల క్రితం కొందరు వ్యక్తులు కోర్టును ఆశ్రయించారు. ఆ వివాదం ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ భూములను రిజిస్ట్రేషన్ చేయవద్దని స్పష్టం చేస్తూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ‘ప్రొహిబిటెడ్ జాబితా’ను అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు పంపారు. కానీ ఈ 100 సర్వే నంబర్ పక్కన బై నంబర్లు, అక్షరాలు చేర్చి కూకట్‌పల్లి, బాలానగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement