అవినీతి రిజిస్ట్రేషన్‌ | Corruption Registration | Sakshi
Sakshi News home page

అవినీతి రిజిస్ట్రేషన్‌

Published Wed, Aug 9 2017 11:19 PM | Last Updated on Sat, Sep 22 2018 8:25 PM

అవినీతి రిజిస్ట్రేషన్‌ - Sakshi

అవినీతి రిజిస్ట్రేషన్‌

  •  రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో వేళ్లూనుకున్న అవినీతి
  • ప్రతి పనికీ రెట్టింపు ఫీజు
  • కార్యాలయ సిబ్బంది, రైటర్లు మిలాఖత్‌
  • మూడేళ్లలో మూడు ఏసీబీ దాడులు
  • ఇటీవల బుక్కపట్నంలో రూ.1.65 లక్షలు స్వాధీనం
  •  

    2014 సెప్టెంబర్‌ :

    చిలమత్తూరు సబ్‌ రిజిస్ట్రార్‌ గోపాలకృష్ణ రిజిస్ట్రేషన్లకు ఇష్టారాజ్యంగా డబ్బు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదు అందడంతో ఏసీబీ దాడులు చేసింది. ఆ సందర్భంగా రూ.25 వేల నగదు లభ్యం కాగా.. ఆ తర్వాత గోపాలకృష్ణ సస్పెండ్‌ చేశారు. ప్రస్తుతం ఈయన తనకల్లు సబ్‌ రిజిస్ట్రార్‌గా పని చేస్తున్నారు.

     

    2015 డిసెంబర్‌ :

    రాయదుర్గం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంపై ఏసీబీ డీఎస్పీ భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో దాడులు చేసి రూ.50 వేలు స్వాధీనం చేసుకున్నారు. సబ్‌ రిజిస్ట్రార్‌ నరసింహమూర్తి, జూనియర్‌ అసిస్టెంట్‌ జయదీప్, సిబ్బంది ప్రమీళ, ఓబుళేసుతో పాటు ఏడుగురు డాక్యుమెంట్‌ రైటర్లను అదుపులోకి తీసుకుని విచారించారు. అదనంగా వసూలు చేసిన డబ్బును కార్యాలయం వేళల తర్వాత సిబ్బందికి అందజేస్తున్నట్లు రైటర్లు ఒప్పుకోవడంతో అందరిపైనా కేసు నమోదుకు ప్రభుత్వానికి సిఫారసు చేశారు. 

     

    2016 సెప్టెంబర్‌ :

    కణేకల్లు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేసి రూ.1,02,490 నగదు స్వాధీనం చేసుకున్నారు. సబ్‌ రిజిస్ట్రార్‌ హనుమానాయక్‌ పట్టుబడ్డారు. రైటర్‌ సాధిక్, హనుమంతరావు, మహమ్మద్, డాక్యుమెంట్‌ అమ్మకందారు రవిని అదుపులోకి తీసుకున్నారు. ఈసీ, రిజిస్ట్రేషన్లు, సర్టిఫైడ్‌ కాపీల కోసం వచ్చిన వారి నుంచి అధిక వసూళ్లు చేసినట్లు నిర్ధారించారు.

     

    2 : రిజిస్ట్రేషన్‌ జిల్లాలు(అనంతపురం, హిందూపురం)

    21 : సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు

    రూ.283 కోట్లు: గత ఏడాది లక్ష్యం

    రూ.189 కోట్లు: గత ఏడాది ఆదాయం

    రూ.224 కోట్లు: ఈ ఏడాది లక్ష్యం

     

    అనంతపురం టౌన్‌:

    రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు అవినీతికి చిరునామాగా నిలుస్తున్నాయి. ‘బల్ల’ కింద చేయి పెట్టే విధానానికి స్వస్తి పలికినా.. ప్రత్యేక సిబ్బంది నియామకంతో వసూళ్ల పర్వం సాగుతోంది. రైటర్లు, కొందరు అధికారులు కలిసి దందా కొనసాగిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పనులు చక్కబెట్టి రాత్రికి పంపకాల్లో నిమగ్నమవుతున్నారు. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం నుంచి జిల్లా స్థాయి కార్యాలయంలో పని చేసే అధికారుల వరకు అందరికీ ‘వాటాలు’ వెళ్తుండడంతో ‘దొరికితేనే దొంగ.. లేదంటే దొర’ అనే పరిస్థితి నెలకొంది. గుంతకల్లు, కళ్యాణదుర్గం, రాయదుర్గం, తాడిపత్రి, ఉరవకొండ, అనంతపురం, అనంతపురం రూరల్, బుక్కపట్నం, చిలమత్తూరు, ధర్మవరం, హిందూపురం, కదిరి, పెనుకొండ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు అత్యధిక రెవెన్యూ లక్ష్యాలు విధించగా.. అదే స్థాయిలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో డాక్యుమెంట్‌ రైటర్లు ప్రధాన భూమిక పోషిస్తున్నారు. అధికారులతో ముందస్తుగా చేసుకున్న ఒప్పందాలతో క్రయ, విక్రయదారులతో ముక్కుపిండి వసూళ్లకు పాల్పడుతున్నారు. నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్‌ ఫీజు 7.5 శాతంగా ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు చలానా తీయడం వల్ల అవసరమయ్యే డాక్యుమెంట్‌ బాండ్‌పేపర్లు(స్టాంప్‌పేపర్లు) సరఫరా చేస్తారు. కానీ డాక్యుమెంట్‌ రైటర్లు చలానాకు పదిశాతం వరకు పెంచేసి వసూళ్లు చేస్తున్నట్లు  ఆరోపణలు ఉన్నాయి. ఇవి కాకుండా కార్యాలయ ఖర్చుల పేరుతో మరో రూ.1000  ముట్టజెప్పాల్సిన పరిస్థితి నెలకొంది. డాక్యుమెంట్లు తయారు చేసినందుకు రూ.1000 నుంచి రూ.1500 అదనంగా వసూలు చేస్తున్నారు. ఇవన్నీ ఇవ్వకుంటే పనిసజావుగా సాగని పరిస్థితి. కార్యాలయాల్లో అధికారులకు ఇవ్వాలని చెబుతూ నేరుగా అక్రమాలకు పాల్పడుతున్నారు. అధికారులు కూడా డాక్యుమెంట్‌ రైటర్ల ద్వారా వెళ్లిన వారికే పనిచేస్తూ.. వీరి ద్వారానే వసూళ్ల రాయబారం నడుపుతుండటం గమనార్హం.

     

    అంతా ‘సర్దుబాటే’

    సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో జరుగుతున్న అవితీతికి ఉన్నతాధికారులు కూడా వంతపాడుతున్నట్లు తెలుస్తోంది. రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో పని చేసే అధికారులు, సిబ్బంది నుంచి ప్రధాన కార్యాలయంలో పని చేసే వారి వరకు ఎక్కడికక్కడ నెలసరి ‘సర్దుబాటు’ ఉండటం వల్లే ఈ పరిస్థితి నెలకొందనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే జనం ఏసీబీ అధికారులను ఆశ్రయిస్తున్నారు.

     

    అక్రమార్కులపై ఏసీబీ నిఘా

    అక్రమాల రిజిస్ట్రేషన్లకు పాల్పడుతున్న అధికారులపై అవినీతి నిరోధకశాఖ దృష్టి సారించింది. ఇందులో భాగంగానే గత నెలలో 26న బుక్కపట్నం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో దాడులు చేసి రైటర్ల వద్ద రూ.1.65 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. సబ్‌ రిజిస్ట్రార్‌ వెంకటరమణను విచారించారు. కార్యాలయంలో అనధికారంగా కొందరు పని చేస్తున్నట్లు గుర్తించి పలు ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత రైటర్లు, సబ్‌ రిజిస్ట్రార్‌ను ఏసీబీ కార్యాలయానికి పిలిపించుకుని స్టేట్‌మెంట్‌ రికార్డు చేసుకున్నారు. పుట్టపర్తి, కొత్తచెరువు మండలాలకు సంబంధించి రూ.కోట్లు విలువ చేసే ఆస్తుల క్రయ, విక్రయాల్లో లోటుపాట్లున్నా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవడంలో బయటి వ్యక్తులు ఇక్కడ కీలకంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలోనే ఈ దాడులు కొనసాగినట్లు తెలిసింది. తాజాగా మరికొన్ని కార్యాలయాలపైనా ఏసీబీ నిఘా ఉంచినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హిందూపురం పరిసర ప్రాంతాలు, పెనుకొండ, అనంతపురం, కదిరి, తాడిపత్రి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాయాల పరిధిలో రియల్‌ వ్యాపారం జోరుగా సాగుతోంది. అక్రమ వసూళ్లు కూడా అదే స్థాయిలో జరుగుతుండడంతో ఏసీబీ నిఘా ఉంచినట్లు సమాచారం.

     

    కఠిన చర్యలు తీసుకుంటాం

    రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలకు వచ్చే వాళ్లెవరైనా రైటర్లను కలవాల్సిన అవసరం లేదు. నేరుగా సబ్‌ రిజిస్ట్రార్లను సంప్రదించి పనులు చేసుకోవచ్చు. డబ్బు ఎక్కువగా వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందితే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఈ విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదు.

    – అబ్రహాం, ఇన్‌చార్జ్‌ డీఐజీ, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్ల శాఖ

     

    నిర్భయంగా సంప్రదించొచ్చు

    ఏ శాఖలో అవినీతికి పాల్పడుతున్నా ప్రజలు నిర్భయంగా ఏసీబీని సంప్రదించవచ్చు. అలాంటి వారి పేర్లను గోప్యంగా ఉంచుతాం. అధికారులు డబ్బులు డిమాండ్‌ చేస్తే 94404 46181, 94404 46182, 94906 11026 నంబర్లకు కాల్‌ చేసి తెలియజేయండి.

    – సి.జయరామరాజు, ఇన్‌చార్జ్‌ డీఎస్పీ, అవినీతి నిరోధక శాఖ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement