ధర్మవరం హౌసింగ్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారింది. చేయి తడిపితేనే పేదలు నిర్మించుకునే ఇళ్లకు బిల్లులు మంజూరవుతున్నాయి. అధికార పార్టీకి చెందిన కొందరు దళారులుగా మారి జియోట్యాగింగ్ చేయాలంటే ఒక రేటు, బిల్లు మంజూరైతే మరో రేటంటూ బహిరంగంగానే వసూళ్లు చేస్తున్నారు. అధికారులు కూడా వారు చెప్పిన వారికే బిల్లులు మంజూరు చేస్తుండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో లబ్ధిదారులు డబ్బు ముట్టజెబుతున్నారు.
ధర్మవరం టౌన్ : నిరుపేదల సొంతింటి కల సాకారం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హౌసింగ్ ఫర్ ఆల్, ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకాలను ప్రవేశపెట్టాయి. ఈ పథకాల్లో భాగంగా ధర్మవరం పట్టణంలో 2016–17వ సంవత్సరానికి సంభందించి 1,400 ఇళ్లు, 2017–18వ సంవత్సరంలో 2,400 ఇళ్లు మంజూరయ్యాయి. అలానే ధర్మవరం మండలం, బత్తలపల్లి, ముదిగుబ్బ, తాడిమర్రి మండలాలకు 2016–17లో 1,250 ఇళ్లు, 2017–18వ సంవత్సరంలో 1,100 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ.1.50 లక్షలు, పట్టణాల్లో అయితే రూ.2.50 లక్షలను ప్రభుత్వం ఇస్తోంది.
అంతులేని అవినీతి
ఇంటి నిర్మాణం ప్రారంభించే లబ్ధిదారునికి బేస్‌మెంట్, రూఫ్‌లెవల్, టాప్‌లెవల్, ఇంటినిర్మాణం పూర్తి అనే నాలుగు దశలలో బిల్లును చెల్లిస్తారు. ఇందుకోసం హౌసింగ్ అధికారులు ఒక్కో దశలో జియోట్యాగింగ్ చేసి బిల్లులు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తే... నేరుగా అమరావతి నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బు జమ అవుతుంది. అయితే లంచాలకు అలవాటు పడిన హౌసింగ్ అధికారులు చేయితడపందే బిల్లులు ఆన్‌లైన్‌లో నమోదు చేయడం లేదు. అంతేకాకుండా ఇలా డబ్బు వసూళ్ల కోసం అధికార పార్టీకి చెందిన వారినే దళారులుగా నియమించారు. ధర్మవరం నియోజకవర్గంలోని లబ్ధిదారుడు ఎవరైనా సరే... జియోట్యాగింగ్ చేసి బిల్లు ఆన్‌లైన్ చేయాలంటే... ముందుగా అధికార పార్టీకి చెందిన దళారులను ఆశ్రయించాల్సిన దుస్థితి ఉంది. వీరి ద్వారా ఒకసారి జియోట్యాగింగ్ చేస్తే రూ.2 వేలు చెల్లించాల్సి వస్తోందని లబ్ధిదారులు వాపోతున్నారు. డబ్బులివ్వకపోతే నెలలు గడచినా జియోట్యాగింగ్ చేసేందుకు అధికారులు రావడం లేదనీ...అందువల్లే తప్పనిసరి పరిస్థితులలో లంచం ఇస్తున్నామని ఇళ్ల లబ్ధిదారులు వాపోతున్నారు. మరోవైపు ఇళ్లు మంజూరు కావాలంటే ముందుగానే రూ.20 వేలు చెల్లించాలని చాలా చోట్ల దళారులు, అధికారులు దోపిడీ చేస్తున్నట్లు సమాచారం.
పట్టుచీరల ఇవ్వాలని డిమాండ్
పట్టణంలోని శివానగర్, కేశవనగర్, శాంతినగర్, చంద్రబాబు నగర్ తదితర చేనేతలు అత్యధికంగా> నివశించే ప్రాంతాల్లో హౌసింగ్ అధికారులు దళారుల చేత పట్టుచీరల కోసం డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఇలా చాలామంది చేనేత కార్మికులు తాము కష్టపడి నేసిన పట్టుచీరలను హౌసింగ్ కార్యాలయంలో ఓ అధికారినికి ఇచ్చి బిల్లులు పొందామని వాపోతున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం వస్తుందన్న భరోసాతో ఇళ్లు నిర్మిస్తే..లంచాలకే అది సరిపోతోందని లబ్ధిదారులు నిట్టూరుస్తున్నారు.
అధికారుల బాధ్యతా రాహిత్యం
ఇటీవల మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 200 మంది లబ్ధిదారులకు ఒకసారి చెల్లించాల్సిన బిల్లును అధికారులు రెండుసార్లు ఖాతాల్లో జమ చేశారు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న అధికారులు బ్యాంకుల వద్దకు వెళ్లి లబ్ధిదారుల ఖాతాలను ఫ్రీజ్ చేశారు. వారి నుంచి డబ్బులు రికవరీ చేసేందుకు నానాపాట్లు పడ్డారు. దీంతో వాస్తవంగా ఆస్థానంలో బిల్లులు పొందాల్సిన వారు సకాలంలో బిల్లు అందక ఇంటి నిర్మాణాన్ని మధ్యలోనే నిలిపివేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలానే పట్టణంలోని శివానగర్‌లో ఒక వ్యక్తి ఇంటిని రెండు సార్లు జియోట్యాగింగ్ చేసి బిల్లును పొందారు. ఈ విషమం హౌసింగ్ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో సీరియస్ పరిగణించిన వారు బిల్లులు చెల్లించిన ఖాతాలను ఫ్రీజ్ చేసి నగదును రికవరీ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు.
అవినీతిని ఉపేక్షించం
ఇళ్ల లబ్ధిదారులు జియోట్యాగింగ్, బిల్లులు చెల్లింపులకు ఎవరికీ డబ్బు ఇవ్వాల్సిన ఆవసరం లేదు. ఎవరైనా డబ్బులు డిమాండ్ చేసినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం. సాంకేతిక సమస్యతో ఇటీవల కొంతమంది లబ్ధిదారులకు బిల్లు రెండుసార్లు ఖాతాలో జమ అయ్యింది. వెంటనే లబ్ధిదారుల ఖాతా నుంచి నగదును రికవరీ చేశాం. భవిష్యత్‌లో ఇలాంటి తప్పిదాలు జరగకుండా చూస్తాం.
–చంద్రశేఖర్, హౌసింగ్ డీఈ, ధర్మవరం
Comments
Please login to add a commentAdd a comment