బిల్లురాక ఆగిపోయిన ఎన్టీఆర్ ఇంటి నిర్మాణం
అనంతపురం టౌన్ : పేదల సొంతింటి కల నెరవేర్చామంటూ గొప్పలు చెబుతున్న టీడీపీ ప్రభుత్వం.. ఎన్టీఆర్ గృహ పథకం కింద ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు బిల్లులు ఇవ్వకుండా తిప్పలు పెడుతోంది. ప్రచార ఆర్భాటానికి రూ.కోట్లు ఖర్చు చేస్తున్న చంద్రబాబు సర్కార్... రూ.కోట్లబిల్లులు మాత్రం పెండింగ్‌లో పెట్టింది. దీంతో చేతిలో చిల్లిగవ్వలేక నిర్మాణాలు అర్ధంతరంగా ఆపేసిన సామాన్యులు.. ఇంటి కోసం చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక అల్లాడిపోతున్నారు.
పెండింగ్‌లో రూ.50 కోట్ల బిల్లులు
జిల్లాలో ఎన్టీఆర్ ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన లబ్ధిదారులకు రూ.50 కోట్ల మేర బిల్లులు అందాల్సి ఉంది. దీంతో లబ్ధిదారులు బిల్లులు మంజూరు కోసం గృహ నిర్మాణ సంస్థ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా సమాధానం చెప్పేవారు కరువయ్యారు. ఇప్పటికే అప్పులు చేసి ఇంటి నిర్మాణాలు చేపట్టామనీ, ఇక బిల్లు వస్తే కాని నిర్మాణాలు ముందుకు సాదే పరిస్థితి లేదని లబ్ధిదారులు వాపోతున్నారు.
అయోమయంలో లబ్ధిదారులు
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వారంరోజుల్లో ఎన్నికల కోడ్ సైతం వచ్చే ఆవకాశ ఉందని ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఎన్నికల కోడ్ వస్తే ఇంటి బిల్లులు వాస్తయో.. రావోనని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల కోడ్ వస్తే బిల్లులు ఆగిపోతున్న భావనతో చాలామంది ఉన్నారు. గ్రామీణ గృహనిర్మాణ శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు జిల్లా నుంచే ప్రాతినిథ్యం వహిస్తున్నా ప్రయోజనం లేకుండా పోయిందని లబ్ధిదారులు వాపోతున్నారు. వెంటనే అధికార యంత్రాంగం స్పందించి త్వరతగతిన బిల్లులు మంజూరు చేసే విధంగా చొరవ చూపాలని వారు వేడుకుంటున్నారు.
ఇంటి నిర్మాణం ఆపేశా
నాకు ఎన్టీఆర్ ఇల్లు మంజూరు కాగా...స్లాబ్ వరకు పూర్తి చేశా.. ఇప్పటి వరకు దాదాపు రూ.55 వేలకు పైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. చేతిలో చిల్లిగవ్వలేక నిర్మాణ పనులను మధ్యలోనే ఆపేశాను. అధికారులిచ్చే బిల్లులతోనే ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోవాల్సిన పరిస్థితి నాది.– మహబుబ్‌దౌలా, తలుపూరు, ఆత్మకూరు మండలం – మహబుబ్ దౌలా, తలుపూరు, ఆత్మకూరు మండలం
వారంలో అందజేస్తాం
రూరల్ హౌసింగ్ స్కీమ్‌లో చేపడుతున్న ఇళ్ల నిర్మాణాల బిల్లులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. అర్బన్ హౌసింగ్ నిర్మాణాలకు సకాలంలో బిల్లులు మంజూరవుతున్నాయి. బిల్లులను ఆన్‌లైన్‌లో జనరేట్ చేశాం. ఎన్నికల కోడ్‌కు బిల్లులకు ఎలాంటి సంబంధం లేదు.. మార్చి మొదటి వారంలో బిల్లులు మంజూరయ్యే అవకాశం ఉంది. నిధులు రాగానే ఖాతాదారుల ఖాతాల్లో జమచేస్తాం.
– చంద్రమౌళిరెడ్డి, ఇన్‌చార్జ్ హౌసింగ్ పీడీ
Comments
Please login to add a commentAdd a comment