NTR housing scheme
-
ఏ ఒక్కరు గృహప్రవేశానికి నోచుకోలేదు
-
ఇళ్లయినా ఇవ్వండి.. డబ్బులన్నా కట్టండి
సాక్షి, మంగళగిరి: అప్పులు చేసి.. వడ్డీలకు తెచ్చి ఇళ్లు వస్తాయనే ఆశతో డీడీలు తీయడంతో పాటు కౌన్సిలర్లకు లంచాలు ఇచ్చామని, కాని గత టీడీపీ ప్రభుత్వ పాలకులు లంచాలు తీసుకుని లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించకుండా అన్యాయం చేశారని పలువురు ఆరోపించారు. పట్టణంలోని రాజీవ్ గృహ కల్ప రోడ్డులోని ఎర్రచెరువులో నిర్మిస్తున్న నివాసాల వద్ద ఆదివారం లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు మాట్లాడుతూ గత టీడీపీ పాలనలో కౌన్సిలర్లు ఇళ్లకు ప్రభుత్వానికి డీడీలు కట్టించడంతో పాటు ఒక్కో ఇంటికి రూ.30 వేల నుంచి లక్ష, రెండు లక్షలు వసూలు చేశారని, కాని లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించకుండానే పాలన ముగిసిందని మండిపడ్డారు. ఇప్పుడు కౌన్సిలర్లను డబ్బులు తిరిగి ఇవ్వాలని అడుగుతుంటే మాత్రం ప్రభుత్వం మారిందని, ప్రభుత్వానికి డీడీలు తీసిన డబ్బులు మాత్రం వస్తే తిరిగి వస్తాయని, మాకు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వలేమని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలోని 24వ వార్డుకు చెందిన టీడీపీ కౌన్సిలర్ ఒక్కో ఇంటికి రూ.30 వేలు తీసుకుందని, ఇప్పుడు అడుగుతుంటే ప్రభుత్వం మారింది కనుక మా చేతుల్లో ఏమి లేదంటున్నారని చెప్పారు. ప్రభుత్వానికి డీడీలు కట్టిన వారికి వస్తే ఇళ్లు వస్తాయని, లేదంటే లేదని, తీసుకున్న డబ్బులు మాత్రం తిరిగి ఇవ్వలేమంటూ సమాధానం చెబుతున్నారని, ఇదెక్కడి న్యాయమంటూ లబ్ధిదారుడు సుబ్బారావు వాపోయాడు. అలాగే పలువురు లబ్ధిదారులు టీడీపీ కౌన్సిలర్లతో పాటు డబ్బులు వసూలు చేసిన కౌన్సిలర్లందరూ తీసుకున్న డబ్బులు అయినా తిరిగిఇవ్వాలని, లేదంటే ఇళ్లు కేటాయించాలంటూ డిమాండ్ చేశారు. లేదంటే రానున్న రోజుల్లో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఘటనాస్థలానికి పట్టణ పోలీసులు చేరుకుని ఆందోళనను విరమింపజేశారు. -
గూడు చెదిరింది.. గోడు మిగిలింది
సాక్షి, సంతబొమ్మాళి (శ్రీకాకుళం): గత ఏడాది అక్టోబర్‌లో సంభవించిన తిత్లీ తుపాను ధాటికి నియోజకవర్గం అతలాకుతలమైంది. వందలాది మంది ఇళ్లు కోల్పోయి నిరాశ్రయిలుగా మారారు. ఈ నేపథ్యంలో వారిని పెద్ద మనసుతో ఆదుకొని, అక్కున చేర్చుకోవాల్సిన ప్రభుత్వం వివక్షత చూపింది. అధికార పార్టీ నాయకులు చెప్పినదే వేదంగా బాధితుల జాబితాను ప్రకటించిన ప్రభుత్వ యంత్రాంగం వాటి ఆధారంగా ఇళ్ల కేటాయింపులు చేసింది. ఇందులో ప్రతిపక్ష పార్టీకి చెందిన బాధితుల పేర్లు లేవు సరికదా.. అధికార పార్టీ కరుణించక పోవడంతో నిరాశ్రయులుగా మారిన పేదలను కూడా విస్మరించారు. ఇదిలా ఉండగా... తుపాను అనంతరం సంతబొమ్మాళి మండలానికి వచ్చిన సీఎం చంద్రబాబు, స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కె.అచ్చెన్నాయుడు బాధితులందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో టీడీపీ నాయకులు కొన్ని గ్రామాలకు అధికారులను తీసుకు వెళ్లి, ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద ఇళ్లు కేటాయిస్తామని నమ్మ బలికారు. దీంతో నౌపడ, సీతానగరం, మేఘవరం, సూరాడవానిపేట తదితర గ్రామాల్లో పరదాలు వేసుకుని, తల దాచుకుంటున్న ఇళ్లను కూడా కూల్చివేసి నిర్మాణాలను చేపట్టారు. అయితే... నిర్మాణాలు ప్రారంభించి నెలలు కావస్తున్నా బిల్లులు మంజూరు కాకపోవడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. అప్పులు చేసి మరీ పనులు చేపట్టామని, ఇలా అర్ధాంతరంగా వదలేయడం ఏంటని మండిపడుతున్నారు. ఈ విషయమై పలుమార్లు అధికార పార్టీ నాయకులు, హౌసింగ్ అధికారులను అడిగినా అదిగో.. ఇదిగో.. అంటూ కాలయాపన చేస్తున్నారని వాపోతున్నారు. దీంతో చాలామంది బాధితులు ఇప్పటికీ తుపాన్ షెల్టర్, అద్దె ఇళ్లలో, పరాయి పంచన తల దాచుకుంటున్నారు. తమను రోడ్డు పాటు చేసిన ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామంటూ వారంతా హెచ్చరిస్తున్నారు. కాగా అధికారుల విడుదల చేసిన, వాస్తవ బాధితుల సంఖ్యకు భారీ వ్యత్యాసం ఉండటం గమనార్హం. నియోజకవర్గంలో ఇళ్లు కోల్పోయిన తిత్లీ బాధితులు మండలం అధికారులు గుర్తించిన ఇళ్లు సంతబొమ్మాళి 1396 నందిగాం 684 టెక్కలి 40 కోటబొమ్మాళి 9 అద్దె ఇంటిలో ఉన్నాం తిత్లీ తుపాను వల్ల ఇళ్లు మొత్తం ధ్వంసమైంది. తల దాచుకునేందుకు నీడ లేకపోవడంతో ఐదు నెలలుగా అద్దె ఇంటిలో ఉంటున్నాం. ఇళ్ల నిర్మాణంలో భాగంగా పునాదులు వేసి నెలలు గడుస్తున్నా ఇంత వరకు బిల్లులు చెల్లించలేదు. – కర్రె ఈశ్వరమ్మ, తిత్లీ బాధితురాలు, నౌపడ వస్తాయనే చెబుతున్నారు తిత్లీ తుపాను ప్రభావంతో ఉన్న గూడును కోల్పోయాం. బిల్లులు వెంటనే ఇస్తామని చెప్పడంతో ఇంటి నిర్మాణం చేపట్టాం. పునాదులు వేసి నెలలు గడుస్తున్నా బిల్లులు రాలేదు. దీనికోసం అడిగితే వస్తాయనే కాలయాపన చేస్తున్నారు. – ఎల్.ప్రభావతి, బాధితురాలు, హెచ్.ఎన్.పేట -
ఇంటికి చంద్ర గ్రహణం
అనంతపురం టౌన్ : పేదల సొంతింటి కల నెరవేర్చామంటూ గొప్పలు చెబుతున్న టీడీపీ ప్రభుత్వం.. ఎన్టీఆర్ గృహ పథకం కింద ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు బిల్లులు ఇవ్వకుండా తిప్పలు పెడుతోంది. ప్రచార ఆర్భాటానికి రూ.కోట్లు ఖర్చు చేస్తున్న చంద్రబాబు సర్కార్... రూ.కోట్లబిల్లులు మాత్రం పెండింగ్‌లో పెట్టింది. దీంతో చేతిలో చిల్లిగవ్వలేక నిర్మాణాలు అర్ధంతరంగా ఆపేసిన సామాన్యులు.. ఇంటి కోసం చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక అల్లాడిపోతున్నారు. పెండింగ్‌లో రూ.50 కోట్ల బిల్లులు జిల్లాలో ఎన్టీఆర్ ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన లబ్ధిదారులకు రూ.50 కోట్ల మేర బిల్లులు అందాల్సి ఉంది. దీంతో లబ్ధిదారులు బిల్లులు మంజూరు కోసం గృహ నిర్మాణ సంస్థ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా సమాధానం చెప్పేవారు కరువయ్యారు. ఇప్పటికే అప్పులు చేసి ఇంటి నిర్మాణాలు చేపట్టామనీ, ఇక బిల్లు వస్తే కాని నిర్మాణాలు ముందుకు సాదే పరిస్థితి లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. అయోమయంలో లబ్ధిదారులు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వారంరోజుల్లో ఎన్నికల కోడ్ సైతం వచ్చే ఆవకాశ ఉందని ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఎన్నికల కోడ్ వస్తే ఇంటి బిల్లులు వాస్తయో.. రావోనని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల కోడ్ వస్తే బిల్లులు ఆగిపోతున్న భావనతో చాలామంది ఉన్నారు. గ్రామీణ గృహనిర్మాణ శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు జిల్లా నుంచే ప్రాతినిథ్యం వహిస్తున్నా ప్రయోజనం లేకుండా పోయిందని లబ్ధిదారులు వాపోతున్నారు. వెంటనే అధికార యంత్రాంగం స్పందించి త్వరతగతిన బిల్లులు మంజూరు చేసే విధంగా చొరవ చూపాలని వారు వేడుకుంటున్నారు. ఇంటి నిర్మాణం ఆపేశా నాకు ఎన్టీఆర్ ఇల్లు మంజూరు కాగా...స్లాబ్ వరకు పూర్తి చేశా.. ఇప్పటి వరకు దాదాపు రూ.55 వేలకు పైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. చేతిలో చిల్లిగవ్వలేక నిర్మాణ పనులను మధ్యలోనే ఆపేశాను. అధికారులిచ్చే బిల్లులతోనే ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోవాల్సిన పరిస్థితి నాది.– మహబుబ్దౌలా, తలుపూరు, ఆత్మకూరు మండలం – మహబుబ్ దౌలా, తలుపూరు, ఆత్మకూరు మండలం వారంలో అందజేస్తాం రూరల్ హౌసింగ్ స్కీమ్‌లో చేపడుతున్న ఇళ్ల నిర్మాణాల బిల్లులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. అర్బన్ హౌసింగ్ నిర్మాణాలకు సకాలంలో బిల్లులు మంజూరవుతున్నాయి. బిల్లులను ఆన్లైన్లో జనరేట్ చేశాం. ఎన్నికల కోడ్‌కు బిల్లులకు ఎలాంటి సంబంధం లేదు.. మార్చి మొదటి వారంలో బిల్లులు మంజూరయ్యే అవకాశం ఉంది. నిధులు రాగానే ఖాతాదారుల ఖాతాల్లో జమచేస్తాం. – చంద్రమౌళిరెడ్డి, ఇన్చార్జ్ హౌసింగ్ పీడీ -
గృహ ప్రలోభాలు
ప్రతి పేదవానికి గృహ సౌకర్యం కల్పిస్తున్నాం. ఇందుకోసంఖర్చుకు వెనకాడకుండా ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ కింద ఇళ్లునిర్మిస్తున్నాం అంటూ టీడీపీ ప్రభుత్వం పెద్దెత్తున ప్రచారం చేసుకుంటోంది. దీనిపై లోతుగా పరిశీలిస్తే... ప్రజలను అప్పుల ఊబిలోకినెట్టేసేందుకు తెలుగుదేశం ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్లుతేటతెల్లమవుతోంది. గృహనిర్మాణాల పేరుతో ప్రైవేటు వ్యక్తులకు కోట్ల రూపాయలు దోచిపెట్టి, ప్రజలను అప్పుల పాలు చేస్తోంది. పశ్చిమగోదావరి, ఏలూరు (మెట్రో): సాధారణంగా బ్యాంకర్లు ఒక ఉద్యోగికి గృహ రుణం మంజూరు చేయాలంటే సవాలక్ష నిబంధనలు విధిస్తారు. ఇల్లు పూర్తయిన తరువాత గృహాన్ని పరిశీలించి, ఇంటికి సున్నం వేశారా, టైల్స్ వేశారా అనేది పూర్తిగా తనిఖీ చేశాక నిధులు విడుదల చేస్తారు. అయితే జిల్లాలో అర్బన్ గృహ నిర్మాణాలు చేస్తున్న షాపూంజీ పల్లోంజీ గ్రూపునకు ఇవేమీ చూడకుండానే బ్యాంకర్లు రుణాలు మంజూరు చేస్తున్నారు. లబ్ధిదారులు సంతకాలు చేసిన వెంటనే ఆ సంస్థకు లబ్ధిదారుని రుణం బదిలీ చేయించేస్తున్నారు. అసలు గృహం పూర్తయిందో లేదో కూడా పరిశీలన చేయకుండానే నిధులు బదిలీ చేయడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు. ఏమిటీ గృహ నిర్మాణాలు : జిల్లావ్యాప్తంగా ఏలూరు కార్పొరేషన్‌తో పాటు ఎనిమిది మున్సిపాలిటీలలో ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఈ ఇళ్ల నిర్మాణం చేపట్టింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కొంత నిధులు జోడించి పథకం పేరు మార్చింది. ఈ పథకంలో భాగంగా ఏలూరు కార్పొరేషన్లో 11,816, నిడదవోలులో 1,755, కొవ్వూరులో 1,904, తణుకు 2,920, జంగారెడ్డిగూడెం 2,107, నర్సాపురం 1,720, భీమవరం 9,500, పాలకొల్లు 7,159, తాడేపల్లిగూడెంలో 5,376 ఇలా మొత్తం 44,257 గృహాలను ప్రభుత్వం మంజూరు చేసింది. వీరిలో 10 వేల మంది లబ్ధిదారులను వివిధ కారణాలతో బ్యాంకర్లు తిరస్కరించారు. ఈ గృహాలను 300 చదరపు గజాలు, 365 చ.గ, 430 చ.గజాలుగా కేటగిరీలుగా ఏర్పాటు చేశారు. ప్రతి కేటగిరీలో గృహానికి రూ.1,50,000 కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా రు.1,50,000 చేర్చి పేదలకు గృహాలను నిర్మించి ఇవ్వాల్సి ఉంది. కానీరుణం పేరుతో ప్రైవేటు వ్యక్తులకు దోచిపెడుతున్నారు. రుణం పేరుతో ఇలా.. ఎ కేటగిరీలోని 300 చదరపు గజాల గృహానికి ప్రభుత్వం రూ.5,65,000 ధర నిర్ణయించింది. దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రూ.3 లక్షలు చెల్లిస్తే మిగిలిన రూ.2,64,500 బ్యాంకు రుణంగా ఇస్తుంది. ఇందుకు ప్రాథమికంగా లబ్ధిదారులు రూ.500 చెల్లించాలని పేర్కొంది. అదే విధంగా బి కేటగిరీలోని 365 చదరపు గజాల గృహానికి రూ.6,65,000 ధర నిర్ణయించింది. దీనిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రూ.3 లక్షలు చెల్లిస్తే రూ.50,000 లబ్ధిదారుడు చెల్లించాలని నిర్ణయించింది. మరో రూ.3,15,000 లబ్ధిదారునికి బ్యాంకులు రుణంగా ఇవ్వాల్సి ఉంది. అదేవిధంగా 430 చ.గజాల గృహ నిర్మాణానికి రూ.7,65,000 ధర నిర్ణయించింది. దీనిలో రూ.3 లక్షలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించగా రూ.లక్ష లబ్ధిదారుని వద్ద నుండి వసూలు చేసి మిగిలిన రూ.3,65,000 బ్యాంకుల ద్వారా ప్రభుత్వం రుణం ఇప్పిస్తుంది. గృహం పూర్తికాకుండానే రుణం వాయిదా చెల్లింపులు లబ్ధిదారునికి రుణం ఇవ్వడంలోనే భారీగా అవినీతి చోటు చేసుకుంటోంది. గృహ నిర్మాణాలు పూర్తికాకుండానే లబ్ధిదారులు నెలనెలా వడ్డీ రూపంలో వేలకు వేలు చెల్లించాల్సి వస్తోంది. ఎ కేటగిరీలో గృహ రుణానికి ప్రతి నెలా రూ.2200 నుండి రూ.2500 వరకూ బ్యాంకు రుణాన్ని లబ్ధిదారుడు 20 సంవత్సరాలు (240 నెలలు) చెల్లించాలి. ఈ విధంగా రూ.5,70,000 వరకూ చెల్లించాలి. బి కేటగిరీలో గృహానికి ఇచ్చే రుణానికి రూ.2800 నుండి రూ.3000 వరకూ 20 సంవత్సరాలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధంగా రూ.6,80,000 వరకూ లబ్ధిదారుడు చెల్లించాల్సి ఉంటుంది. అదే విధంగా సి కేటగిరీ గృహానికి ఇచ్చే రుణానికి రూ.3200 నుండి రూ.3400 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధంగా రూ.7,80,000 వరకూ చెల్లించాల్సి ఉంటుంది. ఈ రుణాల కోసం లబ్ధిదారుల నుంచి మున్సిపల్ సిబ్బంది, మెప్మా సిబ్బంది సంతకాలు తీసుకుంటున్నారు. తిరిగి చెల్లించే మొత్తం ఎంత ఉంటుందనే విషయం చెప్పకుండానే ప్రజలను మభ్యపెడుతున్నారు. ఈ విధంగా ప్రజల సంతకాలతో మంజూరైన రుణాలు మొత్తం ప్రారంభంలోనే బ్యాంకర్లు గృహనిర్మాణాలు చేసే షాపూర్జీ పల్లోంజీ అనే కాంట్రాక్టు సంస్థ ఖాతాకు జమచేస్తుంది. ప్రజల మేల్కోకుంటే అప్పుల ఊబిలోనే రుణాలను 20 సంవత్సరాలు పాటు నెలకు రెండు నుంచి మూడు వేల వరకు చెల్లించే విషయంలో అవగాహన లేకుంటే లబ్ధిదారులు అప్పుల ఊబిలో కూరుకుపోవాల్సిందే. లబ్ధిదారులు ఏకారణం చేతనైనా మూడు నెలలు బ్యాంకుకు రుణం చెల్లించకుంటే సదరు బ్యాంకులు నేరుగా ఇంటిని జప్తు చేసే ప్రమాదం ఉంది. సదరు గృహాన్ని బ్యాంకర్లు నిరర్ధక ఆస్తులుగా పరిగణిస్తూ లబ్ధిదారునికి ఇంకెక్కడా రుణమే లభించకుండా చేస్తుంది. రుణాలకు ప్రైవేటు బ్యాంకులు నో వాస్తవానికి గృహ నిర్మాణాలకు రుణం మంజూరు చేయాలంటే సవాలక్ష నిబంధనలు పెట్టే బ్యాంకులు ఈ విషయంలో కాస్త ప్రభుత్వానికి తలొగ్గి లబ్ధిదారులకు అప్పులు ఇస్తున్నాయి. ప్రైవేటు బ్యాంకులను ప్రభుత్వం సంప్రదించినా అవి రుణాలు ఇచ్చేందుకు ముందుకు రాలేదని తెలిసింది. 20 ఏళ్లు ప్రజలు కిస్తీలు కట్టాల్సిందే ప్రజలకు అర్బన్ హౌసింగ్ పథకం ద్వారా ఇచ్చే రుణాలు 20 సంవత్సరాల పాటు చెల్లించాల్సిందే. ఏ మూడు నెలలు లబ్ధిదారుడు రుణం చెల్లించకపోయినా బ్యాంకు ఆ ఇంటిని వేరే వారికి విక్రయించేందుకు అనుమతి ఉంది. ప్రజలు గృహ రుణాలు తీసుకునే ముందు నెలకు ఎంత చెల్లించాలనే విషయాలను బ్యాంకు అధికారులను అడిగి తెలుసుకోవాలి.– పి.సూర్యారావు, లీడ్ బ్యాంకు జిల్లా మేనేజరు -
ఇందిరమ్మ నోరుకొట్టి ఎన్టీఆర్ గృహాలు!
టీడీపీ ప్రభుత్వం ఇందిరమ్మ పథకం లబ్ధిదారులకు నిలువనీడ లేకుండా చేసింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అమలుచేసిన ఇందిరమ్మ పథకాన్ని ఎన్టీఆర్ గృహకల్ప పథకంగా మార్చిన ప్రభుత్వం ఆ పథకంలో మంజూరైన గృహాలను లబ్ధిదారులకు సమాచారం ఇవ్వకనే రద్దుచేసి ఆన్లైన్ నుంచి వివరాలను తొలగించింది. వైఎస్ఆర్ హయాంలో 3దశల ఇందిరమ్మ పథకం ద్వారా 3,23,473 గృహాలను పేదలకు మంజూరుచేశారు. అనంతరం టీడీపీ అధికారంలోకి రాగానే ఇందిరమ్మ పథకాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. నిర్మాణంలోని ఇళ్లకు బిల్లులు ఆపేసింది. వివిధ దశల్లోని నిర్మాణాలు అసంపూర్తిగా నిలిచిపోయాయి. చిత్తూరు, బి.కొత్తకోట: జిల్లాలో మూడు విడతల్లో మంజూరైన ఇందిరమ్మ గృహాల్లో 70,483 గృహ నిర్మాణాలను లబ్ధిదారులు చేపట్టలేకపోయారు. పేదలు కావడంతో నిర్మాణాలు చేపట్టేందుకు జాప్యం చేశారు. గత ప్రభుత్వం వరకు ఈ గృహాలు అధికారికంగా మనుగడలోనే ఉన్నాయి. మంజూరైన వాటిలో ఇవి ఇంకా ప్రారంభం కాని గృహాల జాబితాలో ఉంచి లబ్ధిదారులు నిర్మాణాలను ఎప్పుడైనా చేపట్టే వీలు కల్పించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన రెండేళ్ల వరకు ఒక్క ఇంటినీ మంజూరు చేయలేదు. ఇందిరమ్మ పథకానికి రూపాయి విదల్చలేదు. ఫలితంగా జిల్లాలో ఎక్కడి నిర్మాణాలు అక్కడే ఆగిపోయాయి. చేసిన ఖర్చంతా వృథా అయ్యింది. చివరకు ఈ ఇళ్లను ప్రారంభం కాని జాబితా నుంచి తొలగించి రద్దు చేశారు. ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు పక్కా గృహాలు కోల్పోయారు. కాగా ఇందిరమ్మ పథకంలో పునాదులు, గోడల స్థాయిలో జరిగిన ఇంటి నిర్మాణాలకు అప్పటి యూనిట్ విలువకు అదనంగా రూ.25వేలు చెల్లిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీనివల్ల కూడా లబ్ధిదారులకు ప్రయోజనం లేదు. ఇందిరమ్మ పథకంలో పునాదుల స్థాయిలో 4,085 గృహాలు, గోడల స్థాయిలో 27,774 గృహాలు ఉండగా అందులో 11,238 గృహాలకు మాత్రమే అదనపు చెల్లింపులు వర్తింపజేశారు. మిగిలిన గృహాలు దీనావస్థలో అసంపూర్తిగా మిగిలిపోయాయి. ఇందిరమ్మ స్థానంలో ఎన్టీఆర్.. ఇందిరమ్మ పథకాన్ని అటకెక్కించిన ప్రభుత్వం దాని స్థానంలో ఎన్టీఆర్ గృహకల్ప పథకాన్ని తీసుకొచ్చింది. 70,483 గృహాలను రద్దుచేసిన ప్రభుత్వం 2016–17 నుంచి 2019–20 వరకు నాలుగు విడతల్లో గ్రామీణ, పట్టణ, గ్రామీణ్ పథకాల ద్వారా 95,295 ఇళ్లు ఇచ్చింది. రద్దయిన ఇందిరమ్మ ఇళ్లను కొనసాగించి ఉంటే పేదలకు ప్రయోజనం కలిగి అదనంగా పేదలకు ఇళ్లు దక్కేవి. 70,483 ఇళ్లను రద్దుచేసిన ప్రభుత్వం వీటికి అదనంగా 24,812 ఇళ్లను కలిపి 95,295 గృహాలను మంజూరు చేసింది. ఇందిరమ్మ ఇళ్ల రద్దుతో గృహాల మంజూరుకు అవసరమైన పేదల సంఖ్య పెరిగింది. ఇళ్లకోసం లక్షల సంఖ్యలో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు మంజూరు కోసం ఎదురుచూస్తుంటే పల్స్ సర్వే ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను టీడీపీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలకు కట్టబెట్టారు. రద్దయ్యాయి జిల్లాలో నిర్మాణాలు ప్రారంభం కాని ఇందిరమ్మ ఇళ్లు రద్దయ్యాయి. మంజూరైన లబ్ధిదారులు ఇళ్లు కోల్పోయారు. వీరికి ఇందిరమ్మ పథకంలో అవకాశం లేదు. పునాదులు, గోడల వరకు నిర్మాణాలు చేసుకున్న ఇందిరమ్మ లబ్ధిదారులకు యూనిట్ విలువకు అదనంగా రూ.25వేలు చెల్లిస్తున్నాం. –రామచంద్రారెడ్డి, హౌసింగ్ పీడీ, చిత్తూరు -
సిగ్గు.. సిగ్గు
టీడీపీ మార్క్ పాలన ఎలా ఉంటుందో కుక్కునూరు హౌసింగ్కార్యాలయంలో మరోసారి బయటపడింది. అధికార పార్టీకి తొత్తులుగామారిన ఆ కార్యాలయం ఉద్యోగులు టీడీపీ నాయకులను తీసుకొస్తేనే కానీఇంటి కోసం దరఖాస్తు తీసుకునేందుకు నిరాకరించే పరిస్థితి వచ్చింది. ప్రజాస్వామ్యానికే సిగ్గు చేటుగా వాళ్ల బరితెగింపు ఉంది. ఎప్పుడూ ఇదే పార్టీ పాలనలో ఉంటుందా అనే స్పృహ కూడా వాళ్లకు లేదా అనే అనుమానం కలుగుతోంది. కుక్కునూరు: ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకొనేందుకు కుక్కునూరు హౌసింగ్ కార్యాలయానికి శనివారం వెళ్లిన నిరుపేదలకు చేదు అనుభవం ఎదురైంది. అందరిని సమ దృష్టితో చూడాల్సిన ఉద్యోగులు దరఖాస్తులు ఇవ్వబోయిన నిరుపేదలను టీడీపీ నాయకులను తీసుకొస్తేనే దరఖాస్తులు స్వీకరిస్తామంటూ కార్యాలయం నుండి బయటకు గెంటేసిన ఘటన చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలో ఇళ్లులేని పేదలకు ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. అర్హుల నుంచి హౌసింగ్ అధికారులు దరఖాస్తులు స్వీకరించి ఆన్లైన్ చేస్తున్నారు. శనివారం కుక్కునూరులోని కిష్టారం కాలనీకి చెందిన పలువురు నిరుపేదలు ఇంటి కోసం దరఖాస్తులు సమర్పించేందుకు వెళ్లారు, అలా వెళ్లిన వారిని హౌసింగ్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న జగదీష్ అనే ఉద్యోగి టీడీపీ నాయకులను తీసుకొస్తేనే పై అధికారులు దరఖాస్తులు తీసుకోమన్నారని చెబుతూ తమను బయటకు గెంటేశారని పేదలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే చెప్పిన వారికే ఇళ్లు హౌసింగ్ కార్యాలయ ఉద్యోగి దరఖాస్తులు తీసుకోకపోవడంతో అదేంటని అడుగుతుండగా ఇంతలో అక్కడికి చేరుకున్న అధికారపార్టీ నాయకుడు దరఖాస్తు చేసుకునేందుకు వచ్చిన వారితో మాట్లాడుతూ.. మీరు వైఎస్సార్ సీపీ జెండాలు పట్టుకొని తిరిగారని, మీకు ఇళ్లు ఎలా వస్తాయన్నారు. స్థానికంగా ఉన్న టీడీపీకి చెందిన రాజుగారు వద్దకు వెళ్లి ఎమ్మెల్యేతో చెప్పించుకుంటేనేగానీ ఇళ్లు మంజూరు కావని చెప్పాడని బాధితులు వాపోతున్నారు. విలేకరిని బెదిరించే యత్నం ఇదిలా ఉండగా తమకు జరిగిన అన్యాయాన్ని బాధితులు స్థానిక ‘సాక్షి’ విలేకరికి చెప్పడంతో ఆయన వచ్చి సదరు ఉద్యోగిని ‘టీడీపీ నేతలను తీసుకొస్తేనే దరఖాస్తులు స్వీకరించమంటూ మీకు ఎక్కడినుంచి ఆదేశాలొచ్చాయో చెప్పాలి’ అంటూ ప్రశ్నించటంతో సదరు ఉద్యోగి ‘నీ పద్ధతి బాగోలేదు’ అని విలేకరిని బెదిరించే ప్రయత్నం చేయటం కొసమెరుపు. నీకేమీ కాదంటూ పచ్చనేత హామీ బాధితులకు అండగా వచ్చిన వైఎస్సార్ సీపీ నేతలు మాట్లాడుతుండగా పలువురి దరఖాస్తులను పట్టుకుని అక్కడకు చేరుకున్న అధికార పార్టీ నాయకుడికి ఉద్యోగి జరిగిన విషయం చెప్పారు. ఆయన నీ ఉద్యోగానికి ముప్పేమీ లేదని, అంతా నేను చూసుకుంటానని చెప్పాడు. తాను చెప్పిన వారికే ఇళ్లు మంజూరు చెయ్యమంటూ హుకుం జారీ చేశాడు. ఎవరు ఫోన్ చేసినా తన ఫోన్ నంబర్ ఇవ్వమంటూ, అతని ఫోన్ నంబర్‌ను ఉద్యోగికి ఇచ్చాడు. అధికార పార్టీ నాయకులు సొంతగూడు కోసం ఎదురుచూస్తున్న నిరుపేదలపై కక్ష సా«ధింపు చర్యలు చేపడుతున్నారని పలువురు ఆరోపించారు. పేదవాడి ఇంటికి రాజకీయాన్ని ముడిపెడుతున్న ఈ అధికార పార్టీ మూల్యం చెల్లించకతప్పదని, ఈ రాబందుల పాలన ముగిసే రోజులు దగ్గరపడ్డాయని పలువురు వాఖ్యానించారు. -
అనర్హులకే అందలం
శ్రీకాకుళం, అరసవల్లి: అనర్హుల అక్రమాలు, రాజకీయ నేతల ఒత్తిళ్ల మధ్య.. జిల్లాకు వన్నె తెచ్చిన ఓ ఐఎఎస్ అధికారి ‘నిజాయితీ’ ఓడిపోయింది. జిల్లా కేంద్రంలో కంపోస్ట్ కాలనీలో నిర్మించిన హుదూద్ ఇళ్ల కేటాయింపులో భారీ అక్రమాలున్నాయని, అర్హులుగా చూపిన వారిలో అత్యధికంగా అనర్హులే ఉన్నారంటూ కలెక్టర్ ధనంజయరెడ్డి ఈ హుదూద్ ఇళ్ల ప్రారంభోత్సవాన్ని అడ్డుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇదే అంశం రాజకీయ వ్యవహారంగా మారి జిల్లాలో పెనుదుమారమే రేపింది. ఎట్టకేలకు అధికార అగ్ర రాజకీయ నేతల ఒత్తిళ్ల ఫలితంగా వారి అక్రమాలకు ‘అడ్డు గోడ’లా ఉన్న ధనంజయరెడ్డిని పంపించేసి మరీ ఈ ఇళ్ల ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు చేశారు. ఈమేరకు శనివారం ఉదయం కంపోస్ట్ కాలనీలోని మొత్తం 192 ఇళ్లను రాష్ట్ర బీసీ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి సిద్ధం చేశారు. శుక్రవారం రాత్రి వరకు ఈ కార్యక్రమంపై ఎటువంటి సమాచారం లేకపోగా, మంత్రి అచ్చెన్న షెడ్యూల్లో ఈ కార్యక్రమాన్ని చేర్చడంతో రాత్రికి రాత్రే శిలాఫలకాన్ని సిద్ధం చేసేశారు. తుఫాన్‌కి మించి... హుదూద్ తుఫాన్ వల్ల జిల్లా కేంద్రానికి పెద్దగా ప్రభావం చూపకపోయినా, ఆ పేరుతో నిర్మించిన ఇళ్లు మాత్రం ఏకంగా కలెక్టర్ సీటుకే ఎసరు పుట్టేలా చేసినంత ప్రభావం చూపాయంటే అతిశయోక్తి కాదు. ఇదంతా ఓ అక్రమాల పుట్ట అని.. ఇళ్లు దక్కినట్లు తయారైన జాబితాలో దాదాపు 90 శాతం మంది వరకు అనర్హులే అని పత్రికల్లో కథనాలు ప్రచురితం కావడంతో జిల్లా వ్యాప్తంగా ఈ హుదూద్ ఇళ్ల వ్యవహారం చర్చనీయాంశమైంది. అనర్హుల జాబితాను ఇటీవలే ‘సాక్షి’లో ప్రచురించడంతో ఈ వ్యవహారం రచ్చరచ్చగా మారింది. దీంతో సాక్షాత్తు జిల్లా మెజిస్ట్రేట్ అయిన కలెక్టర్ ధనంజయరెడ్డి, అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గకుండా ఈ జాబితాను పక్కనపెట్టారు. దీనిపై సంతకం చేసేది లేదంటూ తేల్చి చెప్పేశారు. దీంతో అధికార పార్టీ నేతలు పట్టుబట్టి ఆయన్ను బదిలీ చేయించినట్లు తెలిసింది. అయితే కొద్ది నెలల క్రితమే బదిలీ చేస్తే అదంతా రాజకీయ బదిలీగా కన్పిస్తుందని, తాజాగా ఎన్నికల సమయం అంటూ బదిలీ చేసి, కలెక్టర్ నుంచి ఓ శాఖకు సీఈవోగా పంపించారు. హుదూద్ ఇళ్ల కేటాయింపు వ్యవహారంలో అక్రమాలుండడంతోనే సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా అనుకున్న ఈ ప్రారంభోత్సవం రెండుసార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. 2016లో నిర్మించిన ఇళ్లు మూడేళ్లు దాటినంత వరకు ప్రారంభానికి నోచుకోలేదు. స్థానిక ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో సిద్ధం చేసిన 192 మందితో కూడిన జాబితాపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అర్హులే లేరా...! హుదూద్ ఇళ్ల కేటాయింపు జాబితాలో టీడీపీ నేతలే అత్యధికంగా ఉన్నారని, వీరి అక్రమాలకు వత్తాసు పలికేలా ఉండాలనే ఉద్దేశంతో సుమారు 38 మంది పత్రికా విలేకరులకు కూడా ఇళ్లు కేటాయించారనే విమర్శలున్నాయి. కంపోస్ట్ కాలనీలో మొత్తం 192 ఇళ్లు నిర్మిస్తే, ఇందులో వాస్తవంగా హుదూద్ తుఫాన్లో ఇళ్లు కోల్పోయిన ఇద్దరికి గృహాలు కేటాయించకపోవడం గమనార్హం. కేవలం టీడీపీ నేతలు, వారి బంధువులకే ఈ ఇళ్లన్నీ కేటాయించారని తేలడంతో కలెక్టర్ ధనంజయరెడ్డి దీనిపై విచారణకు ఆదేశించారు. 10 మంది రెవెన్యూ బృందంతో అర్హులని సిద్ధం చేసిన జాబితాలో వ్యక్తులను స్క్రూట్నీ చేశారు. ఇందులో కేవలం 53 మంది వరకు మాత్రమే నిజమైన అర్హులని తేలినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. దీంతో చేసేదేమీ లేక ఎన్నికల కోడ్ రాకమునుపే తమ వారికి ఇళ్లు కేటాయించాలనే ఏకైక లక్ష్యంతో జిల్లా కలెక్టర్‌ను బదిలీ చేయించారు. శనివారం ప్రారంభోత్సావానికి సిద్ధమయ్యారు. -
‘డబుల్’ దగా!
పారదర్శకత.. విశ్వసనీయత.. అందరికీ సమన్యాయం అంటూ ఊదరగొట్టే అధికార పార్టీ నాయకులు ప్రజలను నిలువునా ముంచుతున్నారు. అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు అంటూ విస్త్రృతస్థాయిలో ప్రచారం చేసిన ప్రభుత్వం.. తీరా ఫ్లాట్ల కేటాయింపుల్లో అస్మదీయులకే పెద్దపీట వేసింది. అప్పులు చేసీ మరీ డీడీలు చెల్లించిన లబ్ధిదారులు తమకు ఇచ్చిన ఆన్లైన్ కేటాయింపు పత్రాలు చూసి అవాక్కయ్యారు. అంతా అవకతవకలుగా ఉండడంతో నష్టపోయామని గ్రహించిన ‘పీఎంఏవై– ఎన్టీఆర్ నగర్’ లబ్ధిదారులు విజయవాడ కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. తమకు న్యాయం చేయాలని నినదించారు. పటమట(విజయవాడ తూర్పు): గూడు లేనివారికి శాశ్వత నివాసం ఏర్పాటు చేస్తామని ప్రకటించిన టీడీపీ ప్రభుత్వం.. నమ్మించి మోసం చేసిందని పీఎంఏవై–ఎన్టీఆర్ నగర్ పథక లబ్ధిదారులు సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయాన్ని ముట్టడించారు. లబ్ధిదారుల జాబితాను రూపొందించటంలో అవకతవకలు చోటుచేసుకున్నాయని.. ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల అనుచరులు, టీడీపీ వర్గాల వారికి డబుల్ బెడ్ రూం ఫ్లాట్లను కేటాయించి, అర్హులైన లబ్ధిదారులకు సింగిల్ బెడ్ రూం ఇళ్లను కేటాయించారని ఆరోపిస్తూ ఆందోళన చేశారు. 8,285 మంది లబ్ధిదారులు ఓటు రాజకీయాలకు పాల్పడుతున్న టీడీపీ నేతలు నగరంలోని ఆయా డివిజన్లలో 8,285 మంది లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించామని ప్రకటించటం, కేటాయింపు పత్రాల్లో కనీసం కమిషనర్ సంతకం కూడా లేకపోవటంతో సోమవారం వీఎంసీ ప్రధానకార్యాలయంలోని కమిషనర్ చాంబర్ ముట్టడికి లబ్ధిదారులు యత్నించారు. ఇళ్లకేటాయింపులో తమకు 430 చదరపు గజాల ఫ్లాట్ ఇస్తామన్నారని.. అందుకు లబ్ధిదారుల వాటాగా రూ. 25 వేలు చెల్లించాలని చెప్పిన కార్పొరేషన్ అధికారులు, తమ వద్ద నుంచి డీడీలు కూడా తీసుకున్నారని తెలిపారు. తీరా కేటాయింపులు మాత్రం 300 చదరపు అడుగుల ఇళ్లకు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులకు కాకుండా టీడీపీ అనుచరులకు ఫ్లాట్ల కేటాయింపులు అధికంగా జరిగాయని, ఆన్లైన్ ప్రక్రియతో పారదర్శకంగా కేటాయింపులు జరుగుతాయని చెప్పిన అధికారులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు తమను మోసం చేశారని మండిపడ్డారు. సాధ్యం కాదు.. ఫ్లాట్ నంబర్ల కేటాయింపులో కీలకంగా ఉన్న కమిషనర్ తమకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న వీఎంసీ అదనపు కమిషనర్(జనరల్)డి. చంద్రశేఖర్ లబ్ధిదారులతో సంప్రదింపులు జరిపారు. తామందరికీ డబుల్‌బెడ్ రూంలు కేటాయించాలని లబ్ధిదారులు పట్టుపట్టారు. అయితే అది సాధ్యం కాదని ఏసీజీ వివరించటంతో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. సమస్య తెలుసుకుని సంఘటన వద్దకు సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు న్యాయం చేసే వరకు చాంబర్ నుంచి కదలమని బైఠాయించటంతో పోలీసు లు రంగప్రవేశంచేసి ఆందోళన కారులను చెదరగొట్టి, అనంతరం వామపక్ష నాయకులను అరెస్ట్ చేశారు. అన్యాయం చేశారు మా ఇంట్లో ఆరుగురం ఉన్నాం. కేటాయింపుల సమయంలో మా వద్ద రెండు పడకల గదులకు ఇల్లు మంజూరు జరిగిందని అందుకు రూ.25 వేలు చెల్లిచాలని చెప్పటంతో అప్పుచేసి మరీ చెల్లించాం. తీరా ఇప్పుడు చూస్తే 300 అడుగుల ఇంటిని కేటాయించామని పత్రాన్ని చేతిలో పెట్టారు. ఇదేమని అడుతుంటే కావాలంటే తీసుకోండి.. లేదంటే డీడీలు తిరిగి ఇచ్చేస్తామంటున్నారు. టీడీపీ ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తోంది.– షేక్ మస్తాన్బి, లబ్ధిదారురాలు, అజిత్‌సింగ్‌నగర్ ఇదేమి చోద్యం నా భార్య సంకు సామ్రాజ్యం పేరిట మాకు ఫ్లాట్ వచ్చింది. దరఖాస్తులో మేము డబుల్ బెడ్ రూంని ఎంపిక చేసుకున్నాం. కేటాయింపు పత్రం కూడా డబుల్‌బెడ్ ఇంటికి మంజూరయ్యిందని అధికారులు చెప్పారు. కానీ ఆన్లైన్ లాటరీ వ్యవహారంలో సింగిల్‌బెడ్ రూం అని పత్రాన్ని చేతిలో పెట్టారు. ఇదేమని అడిగితే కావాలంటే తీసుకోండి.. లేదంటే లేదు అని దురుసుగా సమాధానమిస్తున్నారు.– సంకు కోటేశ్వరరావు, లబ్ధిదారుడు, నాలుగో డివిజన్ -
ఈ ఇళ్లు మాకొద్దు బాబూ.!
వైఎస్ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు టౌన్ : ఐదేళ్ల పథకం పేరుతో హౌసింగ్ ఫర్ ఆల్ పథకం కింద చేపట్టిన గృహనిర్మాణాలు మా కొద్దు అని ప్రజలు తెగేసి చెబుతున్నారు. రూ.8 లక్షలకు పైగా డబ్బు మేము కట్టే స్థితిలో లేమని మాకు ఉచితంగా 2 సెంట్లు స్థలం ఇస్తే మా స్థోమతను బట్టి ఇళ్లు నిర్మించుకుంటామని చెబుతున్నా ప్రభుత్వం ఎన్సీసీ సంస్థతో జిల్లాలోని 8 మున్సిపాలిటీల్లో పనులు ప్రారంభించింది. జిల్లాలోని కడప కార్పొరేషన్‌తో పాటు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, బద్వేలు, రాయచోటి, రాజంపేట, ఎర్రగుంట్ల, పులివెందుల, మైదుకూరు మున్సిపాలిటీల్లో హౌసింగ్ ఫర్ ఆల్ పథకం కింద 19,232 గృహాలు మంజూరయ్యాయి. 2015–16 కు గాను ఫేజ్–1, 2017–18కి గాను ఫేజ్–2 కింద లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఇందులో కడప కార్పొరేషన్‌కు ఫేజ్–1లో 2092, ఫేజ్–2లో 2281, ప్రొద్దుటూరులో ఫేజ్–1లో 2000, ఫేజ్–2లో 2150, రాజంపేటలో ఫేజ్–2లో 1279, జమ్మలమడుగుకు ఫేజ్–2లో 1415, ఎర్రగుంట్లకు ఫేజ్–2లో 2046, పులివెందులకు ఫేజ్–2లో 2143, బద్వేల్‌కు ఫేజ్–2లో 888, రాయచోటికి ఫేజ్–2లో 1011, మైదుకూరులో 927 మంజూరు కాగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి కాలేదు. ఫేజ్–1 కింద ఒక్కో బ్లాక్‌లో 32 గృహాలు, ఫేజ్–2లో ఒక్కో బ్లాక్‌లో 48 గృహాలు నిర్మిస్తున్నారు. డీడీలు చెల్లించే వారు కొందరే... జీ ప్లస్–3 పద్ధతి కింద ప్రభుత్వం మూడు రకాల గృహాలను నిర్మిస్తోంది. ఇందులో 300, 365, 430 చదరపు అడుగుల్లో నిర్మించే గృహాలకు మొత్తం 245.17 ఎకరాల స్థలాన్ని వినియోగించనున్నారు. ప్రస్తుతం 386 బ్లాకుల్లో 16,773 ఇళ్లను నిర్మిస్తున్నారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో 71.77 ఎకరాల్లో 11.53 ఎకరాల స్థలానికి హైకోర్టు స్టే ఇవ్వడంతో 22 బ్లాకుల్లో పనులు నిలిచి పోయాయి. ఈ పద్ధతిలో నిర్మించే గృహాలను తీసుకునేందుకు ప్రజలు సుముఖంగా లేరు. బ్యాంకు నుంచి తీసుకునే రుణానికి సంబంధించి 240 నెలల పాటు రూ.3,500 ప్రకారం కంతులు కట్టాల్సి రావడంతో భయపడుతున్నారు. అప్పటి వరకు లబ్ధిదారుల పేరుతో మంజూరయ్యే గృహాలను బ్యాంకుకు తనఖా పెట్టినట్లు లబ్ధిదారుడు ఒప్పుదల పత్రాన్ని బ్యాంకు అధికారులకు అందజేయాలి. దీంతో 30 శాతం మంది కూడా ముందుకు రావడంలేదు. అంతా ఎన్సీసీ ఖాతాకే జమ.. కేంద్రం ఇచ్చే రూ.1.50 లక్షలు, రాష్ట్రం ఇచ్చే రూ.1.50 లక్షలు, బ్యాంకు నుంచి తీసుకునే రూ.3.50 లక్షలు, లబ్ధిదారుని వాటా అంతా నేరుగా ఎన్సీసీ సంస్థ ఖాతాకు జమ చేస్తారు. ఈ విధంగా ఒక్కో గృహం నిర్మాణానికి మొత్తం రూ.7.50 లక్షలు ఎన్సీసీ సంస్థ వసూలు చేస్తోంది. 2017 నవంబర్ 13వ తేదీన ఎన్సీసీ సంస్థ 15 నెలల కాల వ్యవధిలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని ఏపీ టిడ్కో సంస్థతో అగ్రిమెంట్ కుదుర్చుకుంది. మొత్తం రూ.555.19 కోట్లు విలువతో ఈ పనులు చేపట్టింది. ఇటుకతో కాదు..అంతా మూసే... ఇళ్లు కడుతున్నారంటే అదేదో పునాదులు వేసి, దానిపై సిమెంట్ బెడ్డు వేసి, ఇటుకలతో గోడలు కట్టి దానిపై సిమెంట్ స్లాబ్ వేస్తారనుకుంటే అంతా పొరపాటే. భూమిలోపల బెడ్ వేస్తారు. వాటిపై నేరుగా సిమెంట్ కాంక్రీటుతో మూస అలికి నట్లు ఇనుప కడ్డీలు వేసి కాంక్రీటు బెడ్డు వేసి గోడ నిర్మాణం చేస్తారు. ఇది అత్యాధునికమైన పద్ధతి అట. ముక్కాలు సెంటులో నిర్మించే ఈ ఇంటికి రూ.8లక్షలు చెల్లించాలా అని లబ్ధిదారుడు ప్రశ్నిస్తున్నాడు. ఈ పథకం ఐదేళ్లు కొనసాగుతుందా.. హౌసింగ్ ఫర్ ఆల్ స్కీం కింద 2015లో మొదలు పెట్టాల్సిన ఈ పథకం 2018లో మొదలు పెట్టారు. కేవలం ఫేజ్–1, ఫేజ్–2లో కేటాయించిన ఇళ్ల నిర్మా ణం పూర్తి చేసేందుకే 2020 సంవత్సరం పడుతోంది. వీటిని పూర్తి చేస్తేనే మిగిలిన మూడు విడతల్లో గృహాలను కేటాయించనున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితే పేదలకు ఉచితంగా ఇళ్లు నిర్మించి అక్క, చెల్లెమ్మలకు తాళాలు ఇస్తామని వైఎస్సార్సీపీ చెబుతున్న నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాకే ఇళ్లు తీసుకోవాలని ప్రజలు ఈ గృహాలపై ఆసక్తి చూపడం లేదు. టిడ్కో ఈఈ ఏమంటున్నారంటే... ఈ విషయంపై టిడ్కో ఈఈ లీలాప్రసాద్‌ను వివరణ కోరగా జిల్లాలో 8 మున్సిపాలిటీల్లో ప్రభుత్వం కేటాయించిన విధంగా అన్ని గృహాలకు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయన్నారు. డీడీలు కట్టే విధంగా ప్రజలతో మాట్లాడుతున్నామని చెప్పారు. ఇది ఐదేళ్ల పథకం అన్నారు. మొదటి రెండు విడతల్లో ప్రభుత్వం కేటాయించిన ఇళ్లు పూర్తయ్యాక మిగిలిన మూడు విడతల్లో గృహాల కేటాయింపు పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. -
ససేమేరా..
టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల తర్వాత పేదల కోసం నిర్మించే పక్కా గృహాలు తీసుకునేందుకు లబ్ధిదారులు ససేమిరా అంటున్నారు. 3వేల మందికి పైగా దరఖాస్తు చేసినా అందులో నాలుగో వంతు కూడా లబ్ధిదారుని వాటా చెల్లించేందుకు ముందుకు రావడం లేదు. దీంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కడప కార్పొరేషన్: పట్టణాల్లోని పేదలకు సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం(పీఎంఏవై), హౌసింగ్ ఫర్ ఆల్ (ఎన్టీఆర్ నగర్)లో అపార్ట్మెంట్ పద్ధతిలో ఇళ్లు నిర్మిస్తున్నారు. మన రాష్ట్రంలో ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ స్కీం పేరుతో ఏపీ టిడ్కో ద్వారా వీటిని నిర్మిస్తున్నారు. నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ దీనిని కాంట్రాక్టు తీసుకుంది. మలేషియాలో ఉపయోగించే షియర్ వాల్ టెక్నాలజీ పేరుతో పునాదులు, పిల్లర్లు లేకుండానే ఇళ్లు నిర్మిస్తున్నారు. వైఎస్ఆర్ జిల్లా కేంద్రమైన కడపలో సరోజినీనగర్ వద్ద దీనిని మొదలు పెట్టారు. ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల, బద్వేల్, రాయచోటి, ఎర్రగుంట్లలో ఇప్పుడిప్పుడే పనులు మొదలవుతున్నాయి. మూడు దశల్లో మొత్తం 19,232 ఇళ్లు నిర్మించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. మొదటి దశలో మొత్తం 4092 ఇళ్లను నిర్మించాల్సి ఉంది. కడపలో 33 బ్లాకులు కోర్టులో పెండింగ్ ఉన్నాయి. మరో ఆరు బ్లాకుల్లో ఆక్రమణలు ఉండగా వారికి ఇంటి స్థలాలు వేరొక చోట ఇచ్చేందుకు కలెక్టర్ సమ్మతి తెలిపినట్లు తెలిసింది. రెండో దశలో 13,213 ఇళ్లు నిర్మించనుండగా, ఇందులో కడపలో 2,281, ప్రొద్దుటూరులో 2,150, బద్వేల్లో 808, రాయచోటిలో 1,011, రాజంపేటలో 1,279, ఎర్రగుంట్లలో 2,046, జమ్మలమడుగులో 1,415, పులివెందులలో 2,143 చొప్పున నిర్మించాల్సి ఉంది. మూడో దశలో 1,927 ఇళ్లను నిర్మిచాల్సి ఉండగా మైదుకూరులో 927, పులివెందులలో 1000 చొప్పున నిర్మించాల్సి ఉంది. కాగా మైదుకూరు మినహా అన్ని మున్సిపాలిటీల్లో హౌసింగ్ నిర్మాణ పనులు మొదలయ్యాయి. అయితే కడప, జమ్మలమడుగులో నిర్మిస్తున్న ప్లాట్లు మాత్రమే మార్చి నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఫిబ్రవరి, మార్చి నాటికి ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ ఇళ్లు ఎప్పుడు పూర్తి అవుతాయనేది అనుమానంగానే ఉంది. ఇదిలా ఉండగా కడపలో కట్టిన ఇళ్లకు లబ్ధిదారులు సుముఖత చూపకపోవడం అధికార యంత్రాంగాన్ని కలవరపెడుతోంది. ఎన్ని ఆశలు కల్పించినా స్పందన అంతంత మాత్రమే... షీర్వాల్ టెక్నాలజీ వంటి అధునాతన పద్ధతిలో నిర్మిస్తున్నామని ప్రభుత్వం ఊదరగొట్టింది. ప్రజలను ఎన్టీఆర్ నగర్‌కు తీసుకెళ్లి ఇళ్లు చూపించి ఆహా, ఓహో అంటూ గొప్పలు చెప్పారు. ప్రభుత్వం ఎన్ని చెప్పినా లబ్ధిదారులు మాత్రం ముందుకు రావడం లేదు. ఇప్పుడు కేవలం రూ.500 చెల్లించి ప్లాట్ తీసుకుంటే ఎన్నికల తర్వాత వచ్చే ప్రభుత్వం ఉచితంగా ఇళ్లను ఇస్తుంది కాబట్టి ఇల్లు మిగిలిపోతుందని కొందరు ఆశలు కల్పించారు. అయినా లబ్ధిదారుల నుంచి ఆశించినంత స్పందన రాలేదు. కారణాలివే... ఎన్టీఆర్ నగర్లో ప్లాట్లు తీసుకోక పోవడానికి అనేక కారణాలున్నాయని పలువురు విశ్లేషిస్తున్నారు. ఇళ్లన్నీ తక్కువ విస్తీర్ణంలో అగ్గిపెట్టెల తరహాలో ఉండటం, బ్యాంకులకు చెల్లించాల్సిన డబ్బు లక్షల్లో ఉండటం,సన్నటి కడ్డీలతో నిర్మించడం వల్ల నాణ్యత, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరాపై ఉన్న అనుమానాలతోనే చాలా మంది ముందుకు రానట్లు తెలుస్తోంది. ఇళ్లకు నీటిని సరఫరా చేసే నీటి ట్యాంకులు చిన్నవిగా ఉన్నాయి. చాలామంది వ్యక్తిగతంగా ఇళ్ల స్థలాలు కావాలని బలంగా కోరుకుంటున్నారే తప్ప ఆపార్ట్మెంట్ తరహాలో కట్టే ఇళ్లను ఇష్టపడటం లేదని తెలుస్తోంది. 3న లబ్ధిదారులకు ప్లాట్లు కేటాయింపు డిసెంబర్ 3న కడపలో లబ్ధిదారులకు ఎన్టీఆర్ నగర్‌లోని ప్లాట్లు కేటాయించనున్నారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఆన్లైన్ ద్వారా డిప్ సిస్టమ్‌లో ఈ కేటాయింపులు జరపనున్నారు. అంధులు, వికలాంగులకు గ్రౌండ్ ఫ్లోర్లో ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించారు. కడపలో 2,600 మంది ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోగా అందులో 670 మంది మాత్రమే లబ్ధిదారుని వాటా చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ప్రస్తుతం 940 ఇళ్లు నిర్మాణం పూర్తయి పంపిణీకి సిద్ధంగా ఉన్నందున మిగిలిన వారిని ఎక్కడి నుంచి తేవాలని అధికారులు సతమతమవుతున్నారు. -
పాత ఇళ్లకే బిల్లులు!
కర్నూలు, కోడుమూరు: కోడుమూరు నియోజకవర్గంలో ఎన్టీఆర్ గృహాల బిల్లుల మంజూరులో యథేచ్ఛగా దందా కొనసాగుతోంది. ఎమ్మెల్యే మణిగాంధీ, నియోజకవర్గ ఇన్చార్జ్ ఎదురూరు విష్ణువర్దన్‌రెడ్డి వర్గీయులు గ్రామాల్లో ఇళ్ల బిల్లుల మంజూరులో కీలకంగా వ్యవహరిస్తున్నారు. కోడుమూరు మండలానికి 900ఇళ్లు, గూడూరు మండలానికి 550 సి.బెళగల్ మండలానికి 1249 ఇళ్లు మంజూరయ్యాయి. ఇల్లు కట్టుకుని బిల్లుల కోసం తిరిగే నిజమైన లబ్ధిదారుడికి బిల్లులు మంజూరు కావడం లేదు. దళారులను ఆశ్రయించి డబ్బులు ముట్టజెప్పుకుంటే హౌసింగ్ అధికారులు క్షణాల్లో బిల్లులు చేస్తున్నారు. పాత ఇంటికి బిల్లులు చేయాలంటే లబ్ధిదారుడికి సగం, దళారులు, హౌసింగ్ అధికారులకు సగం బిల్లులు ఇస్తామని ఒప్పందం చేసుకుంటే క్షణాల్లో మంజూరవుతున్నాయి. నియోజకవర్గంలో ఇప్పటి వరకు మంజూరైన ఇళ్లలో 50శాతం పాతవాటికే హౌసింగ్ అధికారులు బిల్లులు చేశారు. పాత గృహాలను కొత్తగా పేయింటింగ్ వేసి కొత్త ఇల్లుగా చూపిస్తున్నారు. మరికొన్ని ఇళ్లకు ఇంటి ముందర టైల్స్ బిళ్లలు అతికించి కొత్త ఇంటిగా చూపించి బిల్లులు మంజూరు చేయించుకుంటున్నారు. పేదలకందని ఎన్టీఆర్ గృహాలు పూరి గుడిసెల్లో, మురికివాడల్లో నివాసముంటున్న వారికి ఎన్టీఆర్ ఇళ్లు మంజూరు కావడం లేదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, పెద్ద పెద్ద వ్యాపారులకు, ఇన్‌కంటాక్స్ చెల్లించేవారికి, కార్పొరేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు ఇళ్లు మంజూరవుతున్నాయి. ఒక్కో ఇంటి మంజూరుకు రూ.20వేల నుంచి రూ.30వేల వరకు మధ్య దళారులు వసూలు చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఏకంగా 2అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారు. పేదలను కాదని సంపన్నులకే జన్మభూమి కమిటీ సభ్యులు గృహాలు మంజూరు చేయిస్తున్నారు. లబ్ధిదారులు బిల్లులు కోసంటీడీపీ నేతలను కలవకుండా నేరుగా హౌసింగ్ అధికారులను ఆశ్రయిస్తే నెలల తరబడి తిరగాల్సిందే. అయినా, బిల్లులు మంజూరు కావడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. బిల్లుల అక్రమాలకు కొన్ని ఉదాహరణలు.. చనుగొండ్ల గ్రామానికి చెందిన ఈడిగ రామకృష్ణ పదేళ్ల క్రితం తన తండ్రి పేరు మీద ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించుకుని కట్టుకున్నాడు. అదే ఇంటికి ఇప్పుడు కొత్తగా రంగులు వేయించి ఎన్టీఆర్ బిల్లు (ఐడీ నెం: 132620606ఎన్‌హెచ్1243131) మంజూరు చేయించుకున్నాడు. బిల్లు మంజూరు కోసం హౌసింగ్ అధికారికి రూ.30 వేలు ముట్టజెప్పుకున్నట్లు సమాచారం. ఈ ఇంటికి విద్యుత్ మీటర్ 10 సంవత్సరాల కిందటే మంజూరైంది. 6 సంవత్సరాలుగా గ్రామ పంచాయతీకి రామకృష్ణ ఇంటి పన్ను చెల్లిస్తున్నాడు. అదే ఇంటికి ఎన్టీఆర్ ఇళ్లు ఎలా మంజూరు చేశారో హౌసింగ్ అధికారులకే తెలియాలి. ⇒ కోడుమూరు పట్టణంలో నరసమ్మ, మనోహర్ ఇద్దరు తల్లికొడుకు జన్మభూమి కమిటీ సభ్యులకు మామూళ్లు ముట్టజెప్పడంతో 2 ఇళ్లు (ఐడీ నెం:132621904 ఎన్‌హెచ్1225962, 132621904 ఎన్‌హెచ్1225961) మంజూరు చేయించారు. సదరు లబ్ధిదారుడు రూ.50లక్షలు విలువ చేసే అధునాతనమైన భవనాన్ని నిర్మించుకున్నాడు. ⇒ సి.బెళగల్ మండలం కొండాపురంలో ఆలూరు సోమశేఖరరెడ్డి సాప్ట్వేర్ ఇంజినీర్ బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. ఇక్కడ ఎన్టీఆర్ ఇల్లు (ఐడీనెంః132620505 ఎన్‌హెచ్1256705) మంజూరు చేయించుకుని నిర్మించుకున్నాడు. ⇒ సి.బెళగల్ మండలం ముడుమాలలో శేషమ్మ, పద్మావతి ఒకే కుటుంబ సభ్యులు రెండు ఇళ్లు(ఐడీనెం: 13178506 ఎఫ్హెచ్120549, 13178506ఎఫ్హెచ్111658) మంజూరు చేయించుకుని ఒక ఇల్లు కట్టుకున్నారు. బిల్లులు మాత్రం రెండిళ్లకు మంజూరు చేయించుకున్నాడు. మధ్య దళారీ, హౌసింగ్ అధికారికి రూ.60వేలు ముట్టినట్లు సమాచారం. -
అగ్గిపెట్టెల్లాంటి ఇళ్లు
తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల తర్వాత పేదల కోసం నిర్మించే పక్కా గృహాలు అగ్గిపెట్టెలను తలపిస్తున్నాయి. ఎన్నికల ముందు సొంత ఇళ్లు లేని కుటుంబానికి మూడు సెంట్ల స్థలం ఇచ్చి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి షీర్వాల్ టెక్నాలజీ అంటూ గొప్పలు చెబుతూ జీప్లస్ త్రీ అంతస్తులతో నిర్మిస్తున్న ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ స్కీంలో కేవలం సెంటు స్థలానికి తక్కువగా ఉన్న విస్తీర్ణంలో డబుల్‌బెడ్ రూమ్ ఇళ్లను నిర్మిస్తున్నారు. కడప కార్పొరేషన్ : పట్టణాల్లోని పేదలకు సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం(పీఎంఏవై) కింద అపార్ట్మెంట్ పద్దతిలో ఇళ్లు నిర్మిస్తున్నారు. మన రాష్ట్రంలో ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ స్కీం పేరుతో ఏపీ టిడ్కో ద్వారా వీటిని నిర్మిస్తున్నారు. నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ కాంట్రాక్టుతీసుకుంది. మలేషియాలో ఉపయోగించే షియర్‌వాల్ టెక్నాలజీ పేరుతో పునాదులు, పిల్లర్లు లేకుండానే నిర్మించే ఇళ్లకు ఎంత వరకు మన్నిక ఉంటుందనే దానిపై ప్రధానంగా చర్చ సాగుతోంది. సాధారణంగా ఇక్కడ చిన్న ఇళ్లకు సైతం 12ఎంఎం ఇనుప కడ్డీలు, ఆపార్ట్‌మెంట్లకైతే 16ఎంఎం కడ్డీలు వాడుతుంటారు. ఎన్టీఆర్ హౌసింగ్‌కు మాత్రం కేవలం 8ఎంఎం సైజు కడ్డీలు ఉపయోగించి బెత్తెడు వెడల్పు మందంతో గోడలు నిర్మిస్తున్నారు. 8ఎంఎం కడ్డీలతోనే జీ ప్లస్ 3 ఆపార్ట్మెంట్లు నిర్మిస్తున్నారు. స్లాబ్ మందం మాత్రం 6 ఇంచ్‌లు వేస్తున్నారు. ఇంత బరువును ఈ నాలుగు ఇంచ్ మందం ఉన్న గోడలు ఎంతమేరకు భరిస్తాయో భగవంతుడికే ఎరుక. షియర్ వాల్ టెక్నాలజీతో కట్టే ఇళ్లు సముద్రంలోనూ, భూకంపాలు వచ్చినా చెక్కుచెదరవని ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్న మాటలు నమ్మశక్యంగా అనిపించడం లేదు. ఏ ఇంటికైనా స్లాబ్ వేసినప్పుడు కనీసం 18 రోజులైనా క్యూరింగ్ చేయాల్సిఉంది. ఇక్కడ మొత్తంసిమెంటు కాంక్రీటుతోనే నిర్మిస్తున్నందున ఈ తరహాలోనే క్యూరింగ్ చేయాల్సి ఉంది. అయితే కాంట్రాక్టు సంస్థ మాత్రం వాల్‌షీట్లు వేసి అందులో సిమెంటు కాంక్రీటు వేసి ఆరిపోగానే తీసివేస్తున్నారు. ఏడు రోజులు మాత్రమే నీళ్లు పోసి క్యూరింగ్ చేస్తున్నారు. దీనివల్ల భవిష్యత్తులో నిర్మాణాలు పగుళ్లు బారే అవకాశాలు కనిపిస్తున్నాయి. వేగంగా నిర్మించాలనే తలంపుతో కార్మికులకు షిఫ్టు పద్దతి లేకుండా రేయింబవళ్లు పనిచేయిస్తున్నారని ఆరోపణలు విన్పిస్తున్నాయి. వీరికి కల్పించాల్సిన కనీస సౌకర్యాల విషయంలోనూ కాంట్రాక్టు సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. మరుగుదొడ్డి పక్కనే వంటగది ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ స్కీంలో కేంద్ర ప్రభుత్వం రూ.1.50లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.1.50లక్షలు సబ్సిడీ ఇస్తాయి.300 చదరపు అడుగులు (రూ.6.03లక్షలు), 365 చదరపు అడుగులు(రూ.7.08లక్షలు), 430 చదరపు అడుగులు(రూ.8.20లక్షలు) వంటి మూడు కేటగిరిలలో ప్రభుత్వం ఇళ్లు నిర్మిస్తోంది. ఈమొత్తంలో ప్రభుత్వాలు ఇచ్చే రూ.3లక్షలు పోను మిగిలిన మొత్తాన్ని లబ్ధిదారుడు బ్యాంకుకు కంతుల రూపంలో చెల్లిం చాలి. రెండు, మూడు కేటగిరి ఇళ్లను ఎంచుకునే వారు లబ్ధిదారుని వాటా కింద వరుసగా రూ.50వేలు, లక్ష రూపాయలు నాలుగు విడతల్లో చెల్లించాలి. ఇందులో మొదటి రెండు కేటగిరీలు సింగిల్ బెడ్రూమ్ కాగా, మూడో కేటగిరి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు. డబుల్బెడ్రూమ్ ఇళ్లలో ఎడమ వైపు ఉన్న ఇళ్లకు బెడ్రూమ్కు వంటగదికి మధ్య బాత్రూమ్, మరుగుదొడ్డి ఏర్పాటు చేయడం మైనస్‌గా చెప్పవచ్చు. ఎవరూ కూడా వంటగది పక్కన బాత్రూమ్, మరుగుదొడ్డి ఏర్పాటు చేసుకోరు. అలాంటిది ఎన్టీఆర్ హౌసింగ్ డిజైన్లలో ఇది ఏవిధంగా చేర్చారో అర్థం కాలేదని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. దీనిపై ఏపీ టిడ్కో ఆధికారులను అడిగితే రాష్ట్ర వ్యాప్తంగా ఇదే డిజైన్ వాడుతున్నారని చెప్పడం గమనార్హం. మూడు కేటగిరీల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేవలం సెంటు విస్తీర్ణంలో నిర్మిస్తున్నారంటే అవి ఎంత పెద్దగా ఉన్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. సకాలంలో పూర్తయ్యేనా...! రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ స్కీం కింద మూడు దశల్లో నిర్మించనున్న 19,232 ఇళ్లు సకాలంలో పూర్తయ్యే సూచనలు కన్పించడం లేదు. మొదటి దశలో మొత్తం 4092 నిర్మించనుండగా కడపలో 2,092 ఇళ్లు, ప్రొద్దుటూరులో 2,000 ఇళ్లు నిర్మించాల్సి ఉంది. కడపలో ఒక బ్లాక్‌లో 32 ఇళ్ల చొప్పున మొత్తం 63 బ్లాకుల్లో 2,016 ఇళ్లు నిర్మించాలి. అయితే ఇందులో 33 బ్లాకులు కోర్టులో పెండింగ్ ఉన్నాయి. మరో ఆరు బ్లాకుల్లో ఆక్రమణలు ఉన్నాయి. మిగిలిన 24 బ్లాకుల్లో సాగుతుండగా 630 ఇళ్లు పూర్తయ్యాయి. 300 ఇళ్లను నెలాఖరులోపు పూర్తి చేయాల్సి ఉంది. ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, బద్వేల్లో ఈ స్కీం ఇంకా మొదలు కాలేదు. ఈనెల 17వ తేదీన ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేస్తారని తెలుస్తోంది. రెండవ దశలో 13,213 ఇళ్లు నిర్మించనుండగా, ఇందులో కడపలో 2,281, ప్రొద్దుటూరులో 2,150, బద్వేల్లో 808, రాయచోటిలో 1,011, రాజంపేటలో 1,279, ఎర్రగుంట్లలో 2,046, జమ్మలమడుగులో 1,415, పులివెందులలో 2143 చొప్పున నిర్మించాల్సి ఉంది. మూడో దశలో 1,927 ఇళ్లను నిర్మిచాల్సి ఉండగా ఇందులో మైదుకూరులో 927, పులివెందులలో 1000 చొప్పున నిర్మించాల్సి ఉంది. అయితే రెండు, మూడు దశల్లో నిర్మించే 15,140 ఇళ్లు డిసెంబర్, మార్చి నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే కోర్టు కేసులు, భూసేకరణ సమస్యల వల్ల ఎన్నికలు రాబోతున్న ఈ నాలుగైదు మాసాల్లో అవి పూర్తయ్యే సూచనలు కనిపించడం లేదు. ఇక ఇళ్లు నిర్మించినచోట రోడ్లు, కాలువలు, విద్యుత్, డ్రైనేజీ, త్రాగునీరు వంటి మౌలిక వసతులు ఎçప్పటిలోగా కల్పిస్తారో వేచిచూడాల్సిందే. నాణ్యతలో సందేహాలు అక్కర్లేదు: ఈఈ ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ స్కీం కింద చేపట్టే ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యతలో ఎలాంటి అక్కర్లేదని ఏపీటిడ్కో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ లీలా క్రిష్ణ ప్రసాద్ అన్నారు. క్యూరింగ్ బాగానే చేస్తున్నామని, క్వాలిటీ తనిఖీ చేయడానికి ప్రత్యేక విభాగం ఉందని చెప్పారు. వారు ఎప్పటికప్పుడు నాణ్యతను తనిఖీ చేస్తుంటారని, కడ్డీలు సన్నగా ఉన్నా ఎక్కువ కడ్డీలు వేస్తున్నందున ఇళ్లకు బలం వస్తుందని, ఎన్ని ఏళ్లయినా చెక్కుచెదరవని చెప్పారు. -
పైసలా.. పట్టుచీరా!
ధర్మవరం హౌసింగ్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారింది. చేయి తడిపితేనే పేదలు నిర్మించుకునే ఇళ్లకు బిల్లులు మంజూరవుతున్నాయి. అధికార పార్టీకి చెందిన కొందరు దళారులుగా మారి జియోట్యాగింగ్ చేయాలంటే ఒక రేటు, బిల్లు మంజూరైతే మరో రేటంటూ బహిరంగంగానే వసూళ్లు చేస్తున్నారు. అధికారులు కూడా వారు చెప్పిన వారికే బిల్లులు మంజూరు చేస్తుండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో లబ్ధిదారులు డబ్బు ముట్టజెబుతున్నారు. ధర్మవరం టౌన్ : నిరుపేదల సొంతింటి కల సాకారం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హౌసింగ్ ఫర్ ఆల్, ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకాలను ప్రవేశపెట్టాయి. ఈ పథకాల్లో భాగంగా ధర్మవరం పట్టణంలో 2016–17వ సంవత్సరానికి సంభందించి 1,400 ఇళ్లు, 2017–18వ సంవత్సరంలో 2,400 ఇళ్లు మంజూరయ్యాయి. అలానే ధర్మవరం మండలం, బత్తలపల్లి, ముదిగుబ్బ, తాడిమర్రి మండలాలకు 2016–17లో 1,250 ఇళ్లు, 2017–18వ సంవత్సరంలో 1,100 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ.1.50 లక్షలు, పట్టణాల్లో అయితే రూ.2.50 లక్షలను ప్రభుత్వం ఇస్తోంది. అంతులేని అవినీతి ఇంటి నిర్మాణం ప్రారంభించే లబ్ధిదారునికి బేస్మెంట్, రూఫ్‌లెవల్, టాప్‌లెవల్, ఇంటినిర్మాణం పూర్తి అనే నాలుగు దశలలో బిల్లును చెల్లిస్తారు. ఇందుకోసం హౌసింగ్ అధికారులు ఒక్కో దశలో జియోట్యాగింగ్ చేసి బిల్లులు ఆన్లైన్లో నమోదు చేస్తే... నేరుగా అమరావతి నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బు జమ అవుతుంది. అయితే లంచాలకు అలవాటు పడిన హౌసింగ్ అధికారులు చేయితడపందే బిల్లులు ఆన్లైన్లో నమోదు చేయడం లేదు. అంతేకాకుండా ఇలా డబ్బు వసూళ్ల కోసం అధికార పార్టీకి చెందిన వారినే దళారులుగా నియమించారు. ధర్మవరం నియోజకవర్గంలోని లబ్ధిదారుడు ఎవరైనా సరే... జియోట్యాగింగ్ చేసి బిల్లు ఆన్లైన్ చేయాలంటే... ముందుగా అధికార పార్టీకి చెందిన దళారులను ఆశ్రయించాల్సిన దుస్థితి ఉంది. వీరి ద్వారా ఒకసారి జియోట్యాగింగ్ చేస్తే రూ.2 వేలు చెల్లించాల్సి వస్తోందని లబ్ధిదారులు వాపోతున్నారు. డబ్బులివ్వకపోతే నెలలు గడచినా జియోట్యాగింగ్ చేసేందుకు అధికారులు రావడం లేదనీ...అందువల్లే తప్పనిసరి పరిస్థితులలో లంచం ఇస్తున్నామని ఇళ్ల లబ్ధిదారులు వాపోతున్నారు. మరోవైపు ఇళ్లు మంజూరు కావాలంటే ముందుగానే రూ.20 వేలు చెల్లించాలని చాలా చోట్ల దళారులు, అధికారులు దోపిడీ చేస్తున్నట్లు సమాచారం. పట్టుచీరల ఇవ్వాలని డిమాండ్ పట్టణంలోని శివానగర్, కేశవనగర్, శాంతినగర్, చంద్రబాబు నగర్ తదితర చేనేతలు అత్యధికంగా> నివశించే ప్రాంతాల్లో హౌసింగ్ అధికారులు దళారుల చేత పట్టుచీరల కోసం డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఇలా చాలామంది చేనేత కార్మికులు తాము కష్టపడి నేసిన పట్టుచీరలను హౌసింగ్ కార్యాలయంలో ఓ అధికారినికి ఇచ్చి బిల్లులు పొందామని వాపోతున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం వస్తుందన్న భరోసాతో ఇళ్లు నిర్మిస్తే..లంచాలకే అది సరిపోతోందని లబ్ధిదారులు నిట్టూరుస్తున్నారు. అధికారుల బాధ్యతా రాహిత్యం ఇటీవల మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 200 మంది లబ్ధిదారులకు ఒకసారి చెల్లించాల్సిన బిల్లును అధికారులు రెండుసార్లు ఖాతాల్లో జమ చేశారు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న అధికారులు బ్యాంకుల వద్దకు వెళ్లి లబ్ధిదారుల ఖాతాలను ఫ్రీజ్ చేశారు. వారి నుంచి డబ్బులు రికవరీ చేసేందుకు నానాపాట్లు పడ్డారు. దీంతో వాస్తవంగా ఆస్థానంలో బిల్లులు పొందాల్సిన వారు సకాలంలో బిల్లు అందక ఇంటి నిర్మాణాన్ని మధ్యలోనే నిలిపివేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలానే పట్టణంలోని శివానగర్‌లో ఒక వ్యక్తి ఇంటిని రెండు సార్లు జియోట్యాగింగ్ చేసి బిల్లును పొందారు. ఈ విషమం హౌసింగ్ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో సీరియస్ పరిగణించిన వారు బిల్లులు చెల్లించిన ఖాతాలను ఫ్రీజ్ చేసి నగదును రికవరీ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. అవినీతిని ఉపేక్షించం ఇళ్ల లబ్ధిదారులు జియోట్యాగింగ్, బిల్లులు చెల్లింపులకు ఎవరికీ డబ్బు ఇవ్వాల్సిన ఆవసరం లేదు. ఎవరైనా డబ్బులు డిమాండ్ చేసినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం. సాంకేతిక సమస్యతో ఇటీవల కొంతమంది లబ్ధిదారులకు బిల్లు రెండుసార్లు ఖాతాలో జమ అయ్యింది. వెంటనే లబ్ధిదారుల ఖాతా నుంచి నగదును రికవరీ చేశాం. భవిష్యత్‌లో ఇలాంటి తప్పిదాలు జరగకుండా చూస్తాం. –చంద్రశేఖర్, హౌసింగ్ డీఈ, ధర్మవరం -
ఎన్టీఆర్ ఇళ్లు.. నత్తకు పాఠాలు
జిల్లాలో ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణ పథకం నత్తకే నడక పాఠాలు నేర్పుతోంది. 2016–17, 2017–18 సంవత్సరాలకు రెండు విడతల్లో జిల్లాకు మొత్తం 25,537 పక్కా ఇళ్లు మంజూరయ్యాయి. అయితే వీటిలో 4770 ఇళ్లు మాత్రమే నిర్మాణం పూర్తిచేసుకున్నాయి. మరో 10,294 ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉంది. 10,473 ఇళ్ల నిర్మాణం ఇప్పటి వరకూ పూర్తికాలేదు. లబ్ధిదారుల వద్ద నగదు లేకపోవడం, బిల్లుల మంజూరులో జాప్యం వల్లే ఈ పరిస్థితి నెలకొందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాక్షి, అమరావతి బ్యూరో: జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణ పథకం కింద చేపట్టిన పక్కా ఇళ్ల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. గృహాలు మంజూరైనప్పటికీ లబ్ధిదారులు మాత్రం నిర్మాణం చేపట్టేందుకు ఆసక్తి చూపడంలేదు. లబ్ధిదారుల వద్ద నగదు లేనందునే పక్కా ఇళ్ల నిర్మాణలో జాప్యం నెలకొంది. జిల్లాకు 2016–17 సంవత్సరంలో మొదటి విడత కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణ పథకం కింద 14,578 గృహాలు, 2017–18లో రెండో విడత కింద 10,959 గృహాలు చొప్పున మొత్తం 25,537 ఇళ్లను మంజూరు చేసింది. ఈ పథకంలో 60 శాతం గృహాలను అర్హులైన ఎస్సీ, ఎస్టీలకు కేటాయించారు. రెండు విడతల్లో కేటాయించిన ఇళ్లలో ఇప్పటి వరకు 15,064 గృహాల నిర్మాణం మాత్రమే ప్రారంభమైంది. మిగిలిన 10,473 ఇళ్ల నిర్మాణం ఇప్పటి వరకూ చేపట్టలేదు. జిల్లా మొత్తంగా ఇప్పటి వరకు 4770 ఇళ్ల నిర్మాణం మాత్రమే పూర్తయింది. మరో 10,294 ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉంది. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు కేటాయించిన 15,321 గృహాల్లో కేవలం 2330 ఇళ్ల నిర్మాణం మాత్రమే పూర్తయింది. మొత్తంగా16 శాతంలోపే ఇళ్ల నిర్మాణం మాత్రమే పూర్తయింది. ఎక్కువ భాగం ఇళ్లు ప్రారంభానికి నోచుకోకపోవడం గమనార్హం. రెండు విడతల్లో మంజూరైన గృహాల నిర్మాణం పూర్తయితేనే మూడో విడత కింద జిల్లాకు మరి కొన్ని గృహాలు మంజూరు చేస్తామని కేంద్ర ప్రభుత్వం మెలిక పెట్టింది. దీంతో కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారికి ఇళ్లు ఎలా మంజూరు చేయాలో అర్థంకాక అధికారులు తలలు పట్టుకొన్నారు. గృహాల నిర్మాణం పూర్తిచేయించేందుకు నానాతంటాలు పడుతున్నారు. ముందుకురాని లబ్ధిదారులు పక్కా ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులు ముందుకు రావడంలేదు. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులు ఇళ్లపై ఆసక్తి చూపడంలేదు. గృహ నిర్మాణానికి ఇచ్చే నిధులు సరిపోవటం లేదని, పునాది వేసేందుకే తమ వద్ద డబ్బులు లేవని ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులు పేర్కొంటునారు. దీనికితోడు గృహ నిర్మాణ సామగ్రి, కూలి ధరలు పెరిగాయని వాపోతున్నారు. ప్రభుత్వం ఇచ్చే రూ.2 లక్షలు ఏమూలకూ చాలడంలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఒక్కొక్క ఇంటికి అదనంగా రూ.2 లక్షలకు పైగా వెచ్చించాల్సి వస్తోందని వాపోతున్నారు. అదనంగా డబ్బులు పెట్టలేక నిర్మాణం చేపట్టిన వాటిలో చాలా వరకు మ«ధ్యలోనే ఆగిపోతున్నాయి. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులు సైతం ప్రభుత్వమే గృహాలు నిర్మించి ఇవ్వాలని, లేకపోతే యూనిట్ ధర పెంచాలని కోరుతున్నారు. ఇంటి నిర్మాణం కోసం బ్యాంకుల నుంచి లోన్లు ఇప్పించి ఆదుకోవాలని విజ్ఞప్తిచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ఆర్థిక సహాయం చేస్తే తప్ప గృహా నిర్మాణాలను చేపట్టలేమని ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులను మొండికేస్తున్నారని సమాచారం. -
సొమ్ము పేదోడిది.. సోకు టీడీపీదా!
ప్రొద్దుటూరు టౌన్ : ‘సొమ్ము పేదోడిది.. సోకు టీడీపీది అన్నట్లుగా ఎన్టీఆర్ గృహ నిర్మాణాల కార్యక్రమం ఉంది’ అని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి విమర్శించారు. గురువారం మండల పరి ధిలోని గోపవరం గ్రామ పంచాయతీలో టీడీపీ నాయకులు ఎన్టీఆర్ గృహ ప్రవేశాల కార్యక్రమం నిర్వహించారు. ఈ గృహాలను ఎమ్మెల్యే శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడారు. ప్రభుత్వం కేవలం రూ.80 వేలు మంజూరు చేయడంతో.. ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాలేదని వారు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చి, 2015–16లో ఇళ్లు మంజూరు చేసిందన్నారు. ఎన్నికలకు ఆరు నెలల సమయం ఉండటంతో.. ఇళ్లు అసంపూర్తిగా ఉన్నా హడావిడిగా గృహ ప్రవేశాల కార్యక్రమం నిర్వహించారని విమర్శించారు. ఒక ఇంటి నిర్మాణానికి ఎంత కనీసమన్నా రూ.7 లక్షల నుంచి 8 లక్షల వ్యయం అవుతుందన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది రూ.లక్షేనని, మిగిలిన రూ.50 వేలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందన్నారు. ఎక్కువ మొత్తం లబ్ధిదారుడు పెట్టి నిర్మించుకునే ఇంటికి.. అంతా ప్రభుత్వమే ఇచ్చినట్లు చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. కొంత సహాయం చేశానని చెప్పుకోవాలన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం ఇచ్చింది రూ.70 వేల నుంచి రూ.80 వేలేనన్నారు. వెంటనే కట్టుకోవాలని ప్రభుత్వం ఒత్తిడి తేవడంతో ఉన్న ఇంటిని కూల్చేసి, అదే స్థలంలో నిర్మించుకున్నారని పేర్కొన్నారు. ఆ మధ్య సమయం దాదాపు 20 నెలల పాటు బాడుగ ఇళ్లలో ఉన్నారని, నెలకు రూ.2 వేలు చొప్పున అద్దె మొత్తం రూ.40 వేలు అయిందని చెప్పారు. ప్రభుత్వం మంజూరు చేసే రూ.1.50 లక్షలో రూ.30 వేలు టీడీపీ నాయకులకు, అధికారులకు లంచం రూపంలో ఇవ్వాల్సి వచ్చిందని ఆరోపించారు. బాడుగ, లంచం కలిపితే.. ప్రభుత్వం ఇచ్చిన డబ్బుకు సరిపోతోందన్నారు. ఇంటి మొత్తానికి లబ్ధిదారుడే ఖర్చు పెట్టాల్సి వచ్చిందన్నారు. పేదోడు తెచ్చుకున్న అప్పునకు వడ్డీ ఎవరు కడతారన్నారు. అధికార పార్టీ నేతలు పత్రికల్లో ఫోజులు ఇస్తూ అట్టహాసం, ఆర్భాటం చేశారని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం గృహ ప్రవేశాల పేరిట ఆనంద లోగిళ్లు చూద్దాం రారండి అని అన్నారని.. అయితే అవి అప్పుల గూళ్లు అని విమర్శించారు. అరకొరగా బిల్లుల చెల్లింపు జిల్లాలో 45,723 ఇళ్లు మంజూరు చేసిందన్నారు. నిర్మాణానికి నోచుకున్నవి 15 వేలేనని తెలిపారు. ఈ 15 వేల ఇళ్లలో గృహ ప్రవేశాలు చేసింది 2,725లోనేనని, వీటికి చెల్లించిన బిల్లులు కేవలం రూ.1,97,45,000 అని చెప్పారు. ఈ 15 వేల ఇళ్లకు రూ.1.50 లక్షల ప్రకారం చూస్తే రూ.22 కోట్లు అవుతుందన్నారు. ఇది ఏ శాతమో ప్రభుత్వం చెప్పాలన్నారు. ప్రొద్దుటూరులో మంజూరైన ఇళ్లు 1050 అన్నారు. ఇందులో 201 ప్రారంభించారని, బిల్లులు పూర్తిగా చెల్లించింది 28కేనని చెప్పారు. 1022 ఇళ్లను పూర్తి చేసి బిల్లులు చెల్లించాలని వివరించారు. కార్యక్రమంలో గోపవరం సర్పంచ్ దేవీ ప్రసాదరెడ్డి, నాయకులు పోరెడ్డి నరసింహారెడ్డి, ఓబయ్య యాదవ్, లింగారెడ్డి, దాదాపీర్, రఫీ, వార్డు మెంబర్లు మేరి, ఆదినారాయణరెడ్డి, ఫకృద్దీన్ పాల్గొన్నారు. -
చిలకపేటలో కొలిక్కిరాని ఎన్టీఆర్ పక్కా ఇళ్ల నిర్మాణాలు
-
లోకల్ పాట్లు!
రాయదుర్గం అర్బన్: సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో స్థానికేతరులైన నేతలు రాయదుర్గం నియోజకవర్గంలో ‘లోకల్’ అనిపించుకోవడానికి ఇప్పటి నుంచే పాట్లు పడుతున్నారు. ‘స్థానికత’ గుర్తింపు తెచ్చుకుని ఓటర్లను తమవైపు ఆకర్షించేందుకు తెగ తాపత్రయ పడుతున్నారు. అధికార తెలుగుదేశం పార్టీలో పలువురు నేతలు ఎవరికి వారు ‘సొంతిం టి కల సాకారం’ కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు. టీడీపీలో ముగ్గురు నాయకులు ఎన్నికల్లో లబ్ధి పొందేందు కోసం నియోజకవర్గ కేంద్రం రాయదుర్గంలో పాగా వేస్తున్నారు. ఇందులో భాగంగా స్థానికేతరుడైన సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి కాలవ శ్రీనివాసులు నాలుగేళ్లుగా అద్దె ఇంట్లోనే ఉన్నారు. ఈ మధ్యే నేసేపేటలో సొంతింటి కోసం భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ♦ రాయదుర్గం నియోజకవర్గంలోని ఉంతకల్లుకు చెందిన మెట్టు గోవిందరెడ్డి బెంగళూరులో పారిశ్రామికవేత్తగా స్థిరపడ్డారు. 2004 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2010 నుంచి 2015 వరకు ఎమ్మెల్సీగా కొనసాగారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున (2019) పోటీ చేయడానికి సమాయత్తమైన మెట్టు గోవిందరెడ్డికి ఇప్పటి దాకా పట్టణంలో స్వంత ఇల్లు లేదు. బెంగళూరు నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. స్థానికంగా ఉండరనే అపవాదును పోగొట్టుకునేందుకుఇటీవలే రాయదుర్గంలో సొంతింటి నిర్మాణం చేపట్టారు. ♦ హైదరాబాద్‌కు చెందిన గుణపాటి దీపక్‌రెడ్డి 2012 ఉప ఎన్నికల్లో టీడీపీ తరఫున రాయదుర్గం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసి వైఎస్సార్సీపీ అభ్యర్థి కాపు రామచంద్రారెడ్డి చేతిలో ఘోర పరాజయం పొందారు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున కాలవ శ్రీనివాసులు గెలుపొందారు. అప్పటిదాకా అద్దె ఇంట్లో ఉండే దీపక్‌రెడ్డి.. కాలవ రాకతో అక్కడి నుంచి ఖాళీ చేశారు. అనంతరం ఎమ్మెల్సీ అయిన దీపక్‌రెడ్డి అనంతపురానికి మకాం మార్చారు. మంత్రిపై అసంతృప్తి నాలుగేళ్లుగా పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులో లేకపోయినప్పటికీ, ఆశించిన స్థాయిలో అభివృద్ధి పనులు జరగపోయినప్పటికీ, మరోసారి పోటీ చేయడానికి మంత్రి కాలవ సమాయాత్తం అవుతున్నారు. ఇప్పటి వరకు బీటీ ప్రాజెక్టుకు నీరు ఇస్తామని, ఎడారి నివారణ పనులు చేపడుతామని, మల్లికేతి నుంచి ఉంతకల్లు వరకు 10 టీఎంసీల నీరు నిల్వ చేయడానికి ప్రాజెక్టు చేపడుతామని, రాయదుర్గం పట్టణంలో రూ.2 కోట్లతో డ్రెయిన్ పనులు, 20 కోట్ల సీఎం హామీ నిధులతో సీసీరోడ్లు, డ్రెయిన్లు, వివిధ అభివృద్ధి పనులు చేపడుతామని జీఓలు జారీ చేస్తున్నా ఆచరణలో అమలుకు నోచుకోవడంలేదు. ఆశించినస్థాయిలో అభివృద్ధి పనులు జరగకపోవడంతో ప్రజలు మంత్రిపై అసంతృప్తితో రగిలిపోతున్నారు. వడదెబ్బతో మాజీ సర్పంచ్ మృతి ముదిగుబ్బ: దేవరగుడ్డపల్లికి చెందిన మాజీ సర్పంచ్ బయపరెడ్డి(70) బుధవారం వడదెబ్బతో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు.. ఉదయం 11 గంటల సమయంలో అరటి తోట వద్దకు వెళ్లి మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఇంటికి చేరుకున్నాడు. కొద్దిసేపటికే అస్వస్థతకు గురై మృత్యువాత పడ్డాడు. వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ఇందుకూరి నారాయణరెడ్డి, సింగిల్ విండో మాజీ అధ్యక్షులు ప్రభాకర్‌రెడ్డి, నరసింహారెడ్డి, భాస్కర్, రామిరెడ్డి తదితరులు బయపరెడ్డి మృతికి నివాళులర్పించారు. యువ రైతు మృత్యువాత గుత్తి రూరల్: ఊటకల్లుకు చెందిన రైతు ఎస్.రమణారెడ్డి(28) వడదెబ్బతో మంగళవారం అర్ధరాత్రి మృతి చెందాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రమణారెడ్డి మంగళవారం ఉదయం నుంచి ఎర్రటి ఎండలో గ్రామ శివార్లలోని తన మామిడి తోటలో వ్యవసాయ పనులు చేశాడు. సాయంత్రం ఇంటికి వచ్చి భోజనం చేసి పడుకున్నాడు. రాత్రి తనకు బాగాలేదని కుటుంబసభ్యులకు చెప్పాడు. అర్ధరాత్రి భార్య అనూష లేచి అతడిని లేపింది. ఎంతకీ లేవకపోవడంతో బంధువులు, ఇరుగుపొరుగు వారు వచ్చి పరిశీలించగా అప్పటికే రమణారెడ్డి మృతి చెందాడు. -
ఇల్లూ పోయె.. సబ్సిడీ బిల్లూ రాకపోయె
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం లబ్ధిదారులకు ప్రభుత్వ తీరుతో అవస్థలు తప్పడం లేదు. నెల్లూరు నగరంలో సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోలేని పేద వారికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం ద్వారా సబ్సిడీ అందిస్తోందని తెలిసి చాలా మంది ఈ పథకాన్ని వినియోగించుకోవాలని తమ పాత ఇళ్లను కూలగొట్టుకుని గృహ నిర్మాణానికి పూనుకున్నారు. అయితే ఉన్న ఇళ్లను కూల్చివేసుకుని ప్రభుత్వం నుంచి రావాల్సిన సబ్సిడీ మూడు నెలలుగా ఒక్క రూపాయి రాక లబ్ధిదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ పథకం ద్వారా ఇళ్లు నిర్మించుకునేందుకు ఒక ఇంటి నిర్మాణానికి రూ.3.5 లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించింది. అందులో అర్బన్ ప్రాంతాల లబ్ధిదారులకు ప్రభుత్వం రూ.2.5 లక్షలు సబ్సిడీ కింద ఇవాల్సిఉంది. ఈ సబ్సిడీ పలు దఫాలుగా అందించాలి. మొదట లబ్ధిదారుడు బేస్మెంట్ వరకు నిర్మించుకుంటే రూ.25 వేలు, రూఫ్ లెవల్‌కు రూ.75 వేలు, శ్లాబ్ వేస్తే రూ.లక్ష, ఇంటి నిర్మాణం పూర్తయితే మిగిలిన రూ.50 వేలు ఇవ్వాల్సిఉంది. బ్యాంకు నుంచి రుణంగా రూ.75 వేలు, లబ్ధిదారుడు రూ.25 వేలు భరించాల్సిఉంటుంది. ఈ క్రమంలో నెల్లూరు నగరంలోని 54వ డివిజన్ కు చెందిన పేదవారు పాత పూరిళ్లను, రేకుల ఇళ్లను పగులగొట్టుకుని అప్పు తెచ్చి మరీ బేస్మెంట్ వరకు నిర్మాణాన్ని చేపట్టారు. అయితే నిర్మించి 3 నెలలు కావస్తున్నా హౌసింగ్‌శాఖకు సంబంధించిన అధికారులు బేస్మెంట్కు సంబంధించిన ఫొటోలు తీసుకోకపోవడంతో మొదటి విడతగా లబ్ధిదారులకు అందాల్సిన రూ.25 వేలు రాక ఇబ్బందులు పడుతున్నారు. రేకుల చాటున నివసిస్తున్నాం స్థలం ఉండి ఇల్లు నిర్మించుకుంటే ప్రభుత్వం ఇంటికి రుణం ఇస్తుందని చెబితే కూలేందుకు సిద్ధంగా ఉన్న పాత ఇంటిని కూల్చివేశాను. అ ప్పు తెచ్చి బేస్మెంట్ వరకు నిర్మించి మూడు నెలలు కావస్తున్నా ఫొటోలు తీయలేదు. ఫొటోలు తీస్తే రూ.25 వేలు ఇస్తారంట. ప్రస్తుతం ఇల్లు లేక మూడు నెలల నుంచి రేకుల చాటున రోడ్డుపై నివసిస్తున్నాం. –ఎస్.కె.బీబీజాన్. 54వ డివిజన్, జనార్దన్‌రెడ్డి కాలనీ, నెల్లూరుఇంటి కాగితాలు సరిగా లేవని బిల్లు ఇవ్వలేదుఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం ద్వారా ఇల్లు నిర్మించుకునేందుకు దరఖాస్తు చేసుకుని మూడు నెలలయింది. సొంత డబ్బులతో బేస్మెంట్ వరకు నిర్మించుకున్నా. బిల్లులు రాలేదు. ఇదేమని అడిగితే ఇంటికి సంబం ధించి కాగితాలు సరిగా లేవని, వాటిని తేస్తే చూస్తామని ఇప్పు డు చెబుతున్నారు. – టి.సుప్రియ, జనార్దన్‌రెడ్డి కాలనీ, నెల్లూరు -
అప్పుల్లో ఇల్లు
జిల్లాలో ఎన్టీఆర్ గృహ పథకం లబ్ధిదారులు అప్పుల్లో కూరుకుపోతున్నారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయించుకోవడం కోసం నానాతంటాలు పడుతున్నారు. నిర్మాణరంగ వ్యయం అధికభారమైంది. ఇంటినిర్మాణానికి ప్రభుత్వమిస్తున్న రూ.1.5లక్షలు ఏమూలకూ సరిపోవడం లేదు. దీనికితోడు నిర్మాణాలకు వెంటనే బిల్లులు చెల్లించడం లేదు. ఫలితంగా లబ్ధిదారులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. బి.కొత్తకోట : ఎన్టీఆర్ గృహనిర్మాణానికి బిల్లుల చెల్లింపు శాపమైంది. విపరీత జాప్యం వెంటాడుతోంది. దీంతో పేదలు ఇంటిని నిర్మించుకోలేకపోతున్నారు. గడచిన రెండు నెలలుగా నిర్మాణాల్లో ఆశించిన స్థాయిలో ప్రగతి లేదని అధికార వర్గాలే పేర్కొంటున్నాయి. గత ఫిబ్రవరి 12 నుంచి బిల్లుల చెల్లింపులు పూర్తిగా నిలి చిపోయాయి. లబ్ధిదారులకు అందిస్తున్న సిమెంటుతో నిర్మాణాలు కొంతమేర సాగుతున్నాయి. జిల్లాలో ఎన్టీఆర్ గ్రామీణ, పట్టణ పథకాల కింద 2016–17, 2017–18, 2018–19 ఆర్థిక సంవత్సరాలకు సంబం ధించి 57,785 ఇళ్లు మంజూరు చేశారు. ఇందులో 17,817 పూర్తి చేయించగా 12,046 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమే కాలేదు. మిగిలిన వాటిలో పునాదిలోపు స్థాయిలో 9,728, పునాది స్థాయిలో 9,401, లింటిల్‌లెవల్ స్థాయిలో 261, రూఫ్ లెవల్ స్థాయిలో 2,208 నిర్మాణాలున్నాయి. బిల్లులు రాక క్షేత్రస్థాయిలో లబ్ధి దారులు ఇంటి నిర్మాణ పనులపై ఆసక్తి చూపడంలేదని అంటున్నారు. ఫిబ్రవరి నుంచి నిధులు విడుదల చేయడం లేదు. ఫిబ్రవరి 12 నుంచి ఆ నెలాఖరు వరకు కొద్దిపాటి బిల్లులు చెల్లించినా మార్చి ఒకటి నుంచి ఇప్పటి వరకు బిల్లుల మాటేలేదు. నిర్మాణాలు చేసినా బిల్లులు ఇవ్వరన్న అభిప్రాయంతో పనులపై లబ్ధిదారులు నిరాసక్తత ప్రదర్శిస్తున్నారు. పెండింగ్‌లో రూ.35కోట్లు.. మార్చి ఒకటి నుంచి ఇప్పటివరకూ రూ.35కోట్లమేర పెండింగ్ బిల్లులున్నాయని అధికారిక సమాచారం. ఇది మరింత పెరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మండల స్థాయిలో అధికారులు రోజూ నిర్మాణ వివరాలు నమోదు చేస్తూ బిల్లుల మంజూరుకు ఆన్లైన్లో సిఫారసు చేస్తారు. ఇలా నిత్యం సిఫారసులు చేయడమే కనిపిస్తోంది తప్ప డబ్బులు రావడం లేదు. లబ్ధిదారులు గృహనిర్మాణశాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. మోల్డింగ్ వేసినా పునాది బిల్లే సొంతిల్లు లేకపోవడంతో ఎన్టీఆర్ గృహం మంజూ రు చేశారు. ఇంటి నిర్మాణ పనులు చేపట్టి మోల్డింగ్ చేయించాం. మూడు విడతల బిల్లులు మంజూరు కావాల్సివుండగా పునాది బిల్లు రూ.14,450 మా త్రమే మంజూరైంది. గోడలకు రూ.25వేలు, మోల్డింగ్‌కు రూ.40వేలు బిల్లులు మంజూరు చేయకపోవడంతో పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. అప్పులకు వడ్డీ పెరుగుతోంది. -
గూడుకు పైసల్లేవ్
సీఎం చంద్రబాబునాయుడు సొంత జిల్లాలో ఎన్టీఆర్ గృహ నిర్మాణాలు ముందుకు సాగడం లేదు. నిర్మాణాలు చేపట్టిన లబ్ధిదారులకు విడతల వారీగా చెల్లించాల్సిన బిల్లులు ఆగిపోవడంతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. బిల్లులు ఎప్పుడిస్తారో తెలియక లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. ఇప్పట్లో బిల్లులు వచ్చే సూచనలు కనిపించడం లేదని గృహ నిర్మాణ శాఖ వర్గాలు అంటున్నాయి. ఇదే జరిగితే ఎన్టీఆర్ గృహ నిర్మాణాలు అటకెక్కినట్టే. బి.కొత్తకోట: జిల్లాలో 2016–19 ఆర్థిక సంవత్సరానికి 54,010 ఎన్టీఆర్ ఇళ్లను గ్రామీణ, పట్టణ పథకాల కింద మంజూరు చేశారు. ఒక్కో ఇంటికి రూ.1.50లక్షలు ఇస్తారు. నిర్మాణం ప్రారంభమయ్యాక సిమెంటు విలువతో కలిపి తొలివిడత రూ.15వేలు, రెండో విడత రూ.25వేలు, మూడో విడత రూ.40వేలు, నాలుగో విడత రూ.12వేలు చొప్పున బిల్లులను లబ్ధిదారుల ఖాతాలకు చెల్లిస్తారు. మిగిలిన రూ.58వేలకు సంబంధించి ఉపాధి పథకం ద్వారా కూలీలు, ఇటుకల కోసం చెల్లిస్తారు. జిల్లా వ్యాప్తంగా మంజూరైన ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. బిల్లొచ్చి 50రోజులైంది.. లబ్ధిదారులకు బిల్లు మంజూరై 50 రోజులు పూర్తయింది. ఫిబ్రవరి 12వ తేదీ నుంచి మంగళవారం వరకు అంటే 50 రోజులుగా ఒక్క బిల్లు కూడా చెల్లించలేదు. ఫివ్రబరి 12 నుంచి లబ్ధిదారులకు చెల్లించాల్సిన బిల్లు కోసం సంబంధిత డీఈ, ఈఈలు ఆన్లైన్లో వివరాలు నమోదు చేశారు. వీటిని పరిశీలించి ఉన్నతాధికారులు తక్షణమే బిల్లులు మంజూరు చేస్తూ చర్యలు తీసుకొంటారు. ప్రస్తుతం భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఏప్రిల్ 2 నాటికి (సోమవారం) అధికారిక లెక్కల ప్రకారం లబ్ధిదారులకు అందాల్సిన బిల్లుల నగదు రూ.34,07,61,940. ఈ మొత్తం చెల్లింపులు ఆగిపోవడంతో పేరుకుపోయాయి. ప్రభుత్వం వీటిని ఎప్పుడు చెల్లిస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. అప్పులతో పనులు.. నిర్మాణాలు పూర్తి చేయించేందుకు గృహ నిర్మాణ శాఖ అధికారులు లబ్ధిదారుల వెంట పడుతున్నారు. దాంతో బిల్లులు అందకపోయినా అప్పులు చేసి లబ్ధిదారులు పనులు చేయిస్తున్నారు. బిల్లులు వస్తాయన్న ఆశతో రుణాలపై ఆధారపడ్డారు. ఇప్పుడు బిల్లుల కోసం అధికారులను ప్రశ్నిస్తే ఆన్లైన్లో బిల్లు జనరేట్ చేశాం.. వచ్చేస్తుంది.. అన్న సమాధానం ఇస్తున్నారే కాని స్పష్టంగా చెప్పడం లేదు. అవును బిల్లులు ఆగాయి.. జిల్లాలో ఫిబ్రవరి 12 నుంచి ఇళ్ల నిర్మాణాలకు బిల్లులు పూర్తిగా ఆగిపోయాయి. కోట్లలో బిల్లులు చెల్లించాల్సి ఉంది. శాఖ ప్రధాన కార్యాలయం నుంచే బిల్లులు లబ్ధిదారుల ఖాతాలకు జమ అవుతుంది. దీనిపై మాకు ఇప్పటివరకు స్పష్టమైన సమాచారం ఏమీలేదు. –ధనుంజయుడు, ప్రాజెక్టు డైరెక్టర్, చిత్తూరు -
అన్న ఇళ్లు ..అక్రమాల లోగిళ్లు
సాక్షి, కర్నూలు(అర్బన్): జిల్లాలో ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం పక్కదారి పడుతోంది. లబ్ధిదారుల ఎంపిక నుంచి గృహాలకు బిల్లుల చెల్లింపు వరకు అనేక ప్రాంతాల్లో అడ్డగోలు వ్యవహారాలే నడుస్తున్నాయి. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను గ్రామాలు, పట్టణాల్లో జన్మభూమి కమిటీల సిఫారసుకు వదిలి వేయడంతో అధిక శాతం గృహాలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న వారికి, తెలుగు తమ్ముళ్లకు ముడుపులు చెల్లించుకున్న వారికి మాత్రమే దక్కుతున్నాయి. ఇప్పటికే పలు మండలాల్లో ఆర్థికంగా ఒక స్థాయి ఉన్న టీడీపీ నేతలకు కూడా ఎన్టీఆర్ గృహాలు మంజూరయ్యాయి. ఈ విషయం తెలిసినా..సంబంధిత డీఈ, ఏఈలు నోరుమెదపడం లేదు. పైపెచ్చు గృహాలు నిర్మించుకోకున్నా.. పాతవాటికి బిల్లులు మంజూరు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పలు గ్రామాల్లో గృహాలు మంజూరైనా, నిర్మించుకోకుండా ఉన్న వారి జాబితాలను పరిశీలించి తమకు అనుకూలంగా ఉన్న వారి పేర్లను జాబితాల్లో చేరుస్తున్నారు. ముఖ్యంగా ఆదోని, పత్తికొండ, ఆలూరు, నందికొట్కూరు, నంద్యాల ప్రాంతాల్లోని గ్రామాల్లో అక్రమాలు భారీగా జరుగుతున్నట్లు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదులు అందుతున్నాయి. పలు ప్రాంతాల్లో టీడీపీ నేతలకు కొందరు గృహ నిర్మాణ సంస్థకు చెందిన ఉద్యోగులు, సిబ్బంది కూడా చేతులు కలపడంతో అవినీతికి అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. మున్సిపాలిటీల్లో దందా ... జిల్లాలోని తొమ్మిది మున్సిపాలిటీలకు 2017–18 ఆర్థిక సంవత్సరానికి 19,185 గృహాలు మంజూరయ్యాయి. రూ.3.50 లక్షలతో ఒక్కో గృహాన్ని నిర్మిస్తుండడంతో అక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఆయా మున్సిపాలిటీ పరిధిలో ఇళ్లు మంజూరు అయినా, పలు కారణాల వల్ల రిజెక్టు అయిన వారి స్థానంలో మరొకరిని చేర్చేందుకు ఆయా ప్రాంతాలకు చెందిన కౌన్సిలర్లు, మాజీలు రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ దందాకు సంబంధించి జిల్లా గృహ నిర్మాణ సంస్థకు చెందిన అధికారులకు ఫిర్యాదులు కూడా అందాయి. మిడుతూరు మండలం కడుమూరు గ్రామంలో 15 ఏళ్ల క్రితం నిర్మించుకున్న ఇళ్లకు ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద బిల్లులు మంజూరు చేస్తున్నారు. అలాగే గ్రామంలో రెండు, మూడు అంతస్తుల సొంత ఇళ్లు కలిగిన యజమానులకు కూడా బిల్లులు మంజూరు చేశారు. ∙ఆదోని మండలం ఇస్వి గ్రామానికి ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద 25 గృహాలు మంజూరు కాగా.. టీడీపీ నేతల ఒత్తిళ్లతో గతంలో ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం కింద నిర్మించుకున్న ఐదు ఇళ్లకు ఒక్కో ఇంటికి రూ.80 వేలను మంజూరు చేశారు. ∙2017–18 సంవత్సరానికి సంబంధించి జిల్లాలోని తొమ్మిది మున్సిపాలిటీలకు బెనిఫీషరీ లెడ్ కన్స్ట్రక్షన్ ( బీఎల్సీ ) కింద 19,185 గృహాలు మంజూరు కాగా.. వీటిలో అధికశాతం గృహాలు ముడుపులు చెల్లించిన వారికే మంజూరు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 17,419 గృహాలు మాత్రమే పూర్తి ... జిల్లాలో ఎన్టీఆర్ గృహ రూరల్, గ్రామీణ్, అర్బన్ పథకాల కింద మొత్తం 65,080 గృహాలు మంజూరు కాగా..ఇప్పటి వరకు 41,302 గృహ నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. వీటిలో 17,419 గృహాలు పూర్తి అయ్యాయి. వీటిలో అనేక గృహాలకు గత నెల రోజులుగా బిల్లులు నిలిచిపోయినట్లు సమాచారం. ఫిర్యాదులు అందిన మాట వాçస్తవమే జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న గృహ నిర్మాణాల్లో అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు ఫిర్యాదులు అందిన మాట వాస్తవమే. నాతోపాటు జిల్లా కలెక్టర్‌కు కూడా ఫిర్యాదులు వచ్చాయి. ఇప్పటికే ఆదోని మండలంలోని వివిధ గ్రామాల్లో జరుగుతున్న అక్రమాలపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని ఆదోని ఈఈకి ఆదేశాలు జారీ చేశాం. ఈఈ విచారణ నివేదికలు అందిన వెంటనే చర్యలు చేపట్టి, బాధ్యులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. – కేబీ వెంకటేశ్వరరెడ్డి, హౌసింగ్ పీడీ -
ఎదురుచూపులకు ఏడాది!
పేదల జీవితాలతో సర్కారు చెలగాటమాడుతోంది. ఇళ్ల నిర్మాణాలు చేపట్టినవారికి బిల్లులు చెల్లించకుండా కాలయాపన చేస్తోంది. మరోవైపురాష్ట్రంలో 3 లక్షల ఇళ్ల నిర్మాణానికిమహా శంకుస్థాపన పక్షోత్సవాల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటం చేస్తోంది. ఎన్టీఆర్ రూరల్, ఎన్టీఆర్గ్రామీణ్, ఎన్టీఆర్ అర్బన్ కింద జిల్లాకు మొదటి, రెండో విడతల్లో మంజూరైన64,600 ఇళ్లలో ఇప్పటి వరకు సగంకూడా పూర్తికాలేదు. మరికొన్నింటినిర్మాణాలే మొదలు కాలేదు. కోవెలకుంట్ల: తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక ఇందిరమ్మ పథకానికి స్వస్తి చెప్పి ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణ పథకం కింద రూ. 1.50 లక్షలు, ఎన్టీఆర్ గ్రామీణ పథకం కింద రూ. 2లక్షలు, ఎన్టీఆర్ పట్టణ గృహ నిర్మాణ పథకం కింద రూ. 3.50 లక్షలు ఒక్కో గృహ నిర్మాణానికి కేటాయించింది. ఇందుల్లో మెటీరియల్, లేబర్, వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణానికి సంబంధించి కేంద్రప్రభుత్వం నిధులు విడుదల కావాల్సి ఉంది. ఈ నిధుల్లో రూ. 23వేలు మెటీరియల్, రూ. 18వేలు లేబర్ బిల్లులు, రూ. 15వేలు వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణానికి ఉపాధి హామీ పథకం కింద నిధులు అందజేయాలి. ఎన్టీఆర్ పథకం కింద నిర్మిస్తున్న గృహాలను చంద్రన్న ఇస్తున్న అపురూప బహుమానం పేరుతో ఆర్భాటం చేస్తుండటంతో కేంద్రం వాటికి ఇవ్వాల్సిన నిధులు చెల్లించకుండా పెం డింగ్‌లో పెట్టినట్లు సమాచారం. ఇప్పటికే నిర్మాణాలు పూర్తి అయిన 20 వేల గృహాలకు సంబంధించి రూ. 50 కోట్ల మేర బిల్లులు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. అప్పులు చేసి ఇళ్ల నిర్మాణాలు: సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకున్న పేద కుటుంబాలకు నిరాశే మిగిలింది. పూర్తి స్థాయిలో గృహం నిర్మించుకున్నా బిల్లులు మంజూరు కాకపోవడంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. మొదటి విడతలో మంజూరైన గృహ నిర్మాణాలను పూర్తిచేసి ఏడు నెలలుగా బిల్లుల కోసం ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణ పథకం కింద రూ. 1.50 లక్షలు అందాల్సి ఉండగా లబ్ధిదారులకు కేంద్రప్రభుత్వానికి సంబంధించిన మెటీరియల్, లేబర్ బిల్లులు విడుదల కాలేదు. బిల్లులు వస్తాయనే ఆశతో ప్రైవేట్ వ్యక్తుల వద్ద అప్పులు తెచ్చుకుని నిర్మాణాలు చేపట్టి ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయం, బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తీసుకున్న అప్పు చెల్లించాలని రుణదాతల నుంచి వారికి ఒత్తిడి అధికమైంది. మరోవైపు రెండవ విడతలో ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన బిల్లులు కూడా సక్రమంగా అందలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బిల్లులు విడుదల చేసి ఆదుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు. -
ఎన్టీఆర్ ఇళ్లు.. అనర్హుల లోగిళ్లు
చీమలు పెట్టుకున్న పుట్టలను పాములు కబ్జా చేసి నివాసంగా మార్చుకోవడం తెలిసిందే.. అది ప్రకృతి సహజం.. ఆటవిక నీతి.. విశాఖ మహానగరంలోనూ అదే ఆటవిక నీతి అమలవుతోంది.. బలమున్నోడే.. పలుకుబడి కలిగినవాడే రాజు అన్నట్లు పరిస్థితి తయారైంది.. చీమల్లాంటి పేదలకు అందాల్సిన ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకం నిధులను.. పాముల్లాంటి పెద్దోళ్లు.. ఆర్థికంగా, రాజకీయంగా బలవంతులుగా చెలామణీ అవుతున్నవారు కొట్టేస్తున్నారు.. పూరిపాకలకే దిక్కులేని పేదలను వెక్కిరిస్తూ.. బహుళ అంతస్తుల భవన నిర్మాణాలకు ఈ పథకం నిధులు మళ్లుతున్నాయి.. ఆర్థికంగా పచ్చగా లేనివారిని కాదని.. రాజకీయ పచ్చరంగు పులుముకున్న వారిని, తమ బినామీలనూ జన్మభూమి కమిటీలు లబ్ధిదారులుగా ఎంపిక చేస్తున్నాయి.. ఇటీవలి కాలంలో వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన టీడీపీ ఎమ్మెల్యే బండారు వారి ఇలాకా పెందుర్తి నియోజకవర్గంలో దర్జాగా సాగిపోతున్న ఈ అవినీతి బండారం ‘సాక్షి’ పరిశీలనలో బట్టబయలైంది. సాక్షి, విశాఖపట్నం/పెందుర్తి: కేంద్ర ప్రభుత్వ నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లించి ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకం పేరుతో గత మూడేళ్లుగా అమలు చేస్తుంటే.. క్షేత్రస్థాయిలో పేదలకు అందాల్సిన ఆ పథకం అధికార టీడీపీకి చెందిన అనర్హుల పాలవుతోంది. ఎంత ధనవంతులైనా.. ఏ అర్హతలు లేకపోయినా.. ఇప్పటికే పక్కా ఇళ్లున్నా.. టీడీపీ సానుభూతిపరులైతే చాలు.. మళ్లీ ఈ పథకం కింద నిధులు కొట్టేయొచ్చు.. ఇల్లు మీద ఇల్లు.. అంతస్తుల మీద అంతస్తులు కట్టేయొచ్చన్నట్లు పరిస్థితి తయారైంది. నిన్న గాక మొన్న విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో ఏకంగా పక్క ఇళ్లకు జియోట్యాగింగ్ చేసి దర్జాగా ఎన్టీఆర్ హౌసింగ్ నిధులు దోచేసిన ఘటనలు వెలుగు చూస్తే.. తాజాగా పెందుర్తి నియోజకవర్గంలో అడ్డగోలుగా హౌసింగ్ పథకం మంజూరు చేసి ఎడాపెడా దోచుకుతింటున్న వైనం విస్తుపోయేలా చేస్తోంది. పశువుల పాకల, దుకాణ సముదాయాలు, వైన్ షాపులు, రెండు మూడంతస్తుల భవనాలకే కాదు.. చివరికి డూప్లెక్స్ స్థాయి భవనాలకు సైతం అడ్డగోలుగా ఎన్టీఆర్ హౌసింగ్ నిధులు మంజూరు చేస్తున్నారు. ఈ ఒక్క నియోజకవర్గంలోనే ఇలా దారి మళ్లిన నిధులు రూ.4 కోట్లకు పైగానే ఉంటాయని తెలుస్తోంది. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా విచారిస్తే ఏ స్థాయిలో ఎన్టీఆర్ హౌసింగ్ నిధులు అధికార పార్టీ నేతల జేబుల్లోకి వెళ్తున్నాయో అర్ధమవుతుంది. అధికారులకు బెదిరింపులు ఇలాంటి భవన సముదాయాలకు హౌసింగ్ నిధులు మంజూరు చేయలేమని ఒకరిద్దరు అధికారులు తిరస్కరించగా.. జన్మభూమి కమిటీ సిఫార్సులున్నాయి కదా.. మీకేంటి అభ్యంతరం అంటూ బెదిరించి మరీ వారితో శాంక్షన్ ఆర్డర్స్ ఇప్పించుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈ దందా అంతా చోటా మోటా నాయకులు చేస్తున్నారనుకుంటే పొరపాటే. క్షేత్ర స్థాయిలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా జన్మభూమి కమిటీ సిఫార్సుల మేరకు లబ్ధిదారుల జాబితా తయారవుతుంది. ఎమ్మెల్యే ఆమోద ముద్ర వేసిన తర్వాతే ఆ జాబితాలో ఉన్న లబ్ధిదారులకు హౌసింగ్ నిధులు మంజూరవుతాయి. ఈ లెక్కన ఎమ్మెల్యేకు తెలియకుండా అనర్హులకు రుణాలు మంజూరయ్యే అవకాశం లేదు. సందట్లో సడేమియా మూడేళ్ల పాటు పేదలకు ఒక్క ఇల్లూ నిర్మించలేని ప్రభుత్వం గత కొద్ది కాలంగా నానా హడావుడి చేస్తుండటంతో సందట్లో సడేమియా అన్నట్లు టీడీపీ నేతలు అనర్హులను అందలమెక్కిస్తున్నారు. గ్రూప్ హౌసింగ్ అంటూ హంగామా చేసిన ప్రభుత్వం చివరకు సొంత స్థలాలుండి ఇళ్లు నిర్మించుకోలేని నిరుపేదలకు రూ.1.50 లక్షల చొప్పున హౌసింగ్ రుణాలు మంజూరు చేస్తామని ప్రకటించింది. ఇందులో రూ. 92వేలు రాష్ట్ర ప్రభుత్వం, రూ. 58 వేలు కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తున్నాయి. ♦ హౌసింగ్ శాఖ ద్వారా 2016–17, 2017–18కే కాదు..చివరికి ఇంకా మొదలు కాని 2018–19 ఆర్థిక సంవత్సరానికి సైతం అడ్వాన్స్‌గా హౌసింగ్ రుణాలు మంజూరు చేసేస్తున్నారు. ♦ గ్రామీణ జిల్లాలో 2016–17లో 5560 ఇళ్లు మంజూరు చేస్తే.. నేటికి 1450 ఇళ్ల నిర్మాణం చేపట్టలేదు. ప్రారంభించిన వాటిలో బేస్మెంట్ స్థాయి కంటే తక్కువలో 764, బేస్మెంట్ స్థాయిలో 1322, రూఫ్ స్థాయిలో 517, శ్లాబ్ లెవల్లో 1298 ఉన్నాయి. ♦ 2017–18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 11,374 ఇళ్లు మంజూరు చేయగా, 5845 ఇళ్లు నిర్మాణం ప్రారంభం కాలేదు. ప్రారంభమైన వాటిలో బేస్మెంట్ స్థాయి కంటే తక్కువలో 857, బేస్మెంట్ స్థాయిలో 1858, లింటల్ లెవల్లో 593, రింటల్ స్థాయిలో 281, ఆర్సీ స్థాయిలో 1210 ఉన్నాయి. ♦ 2018–19 ఆర్థిక సంవత్సరానికి ఏకంగా 10,178 ఇళ్లు మంజూరు చేయగా వాటిలో 6522 ఇళ్లు ఇంకా ప్రారంభం కాలేదు. ప్రారంభమైన వాటిలో 1380 బీబీఎల్ స్థాయిలో, 1376 బీఎల్ స్థాయిలో, 372ఇళ్లు లింటల్ లెవల్లోనూ, 193 రింటల్ స్థాయిలో 335 ఆర్సీ స్థాయిలో ఉన్నాయి. సగానికి పైగా అనర్హులకే.. ఇక పెందుర్తి నియోజకవర్గానికి వస్తే మూడేళ్ల(2016–19)కు గానూ 2157 ఇళ్లు మంజూరు చేశారు. వీటిలో1618 ఇళ్ల నిర్మాణం ఇంకా ప్రారంభానికే నోచుకోలేదు. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. సబ్బవరం మండలంలోని సుమా రు పది గ్రామాల్లో క్షేత్ర స్థాయి పరిశీలన జరపగా.. దాదాపు ప్రతి గ్రామంలోనూ మంజూరైన ఇళ్లలో కనీసం 50 శాతం అనర్హులకే దక్కాయి. కొన్ని గ్రామాల్లో అయితే రూ.50 లక్షల నుంచి రూ.కోటి విలువైన ఇళ్లకు సైతం ఎన్టీఆర్ హౌసింగ్ నిధులు మంజూరయ్యాయంటే ఏ స్థాయిలో అవకతవకలు జరిగాయో అర్ధం చేసుకోవచ్చు. ఈ గ్రామల్లో వందలాది మంది అర్హులు హౌసింగ్ రుణం కోసం దరఖాస్తు చేస్తే..వారిలో టీడీపీ సానుభూతిపరులకు మాత్రమే జన్మభూమి కమిటీలు పచ్చజెండా ఊపగా.. ఆ జాబితాలకే ఎమ్మెల్యే ఆమోదముద్ర వేశారు. అయితే ఆ జాబితాల్లో ఉన్న వారు అర్హులా.. అనర్హులా అన్న కనీస పరిశీలన కూడా చేయకుండానే హౌసింగ్ అధికారులు రుణాలు మంజూరు చేసేశారు. జన్మభూమి కమిటీల వసూళ్లు ఇక ఇళ్ల మంజూరు పేరిట జన్మభూమి కమిటీలు ఒక్కో ఇంటికి రూ.10వేల నుంచి రూ.25 వేల వరకు వసూలు చేసినట్లు పలువురు లబ్ధిదారులు బాహటంగానే చెబుతున్నారు. సాక్షి పరిశీలనలో గుర్తించిన అనర్హులు ఏకంగా 150 మందికిపైగా ఉన్నారు. వారిలో మాజీ జెడ్పీటీసీ రొంగలి శ్రీరాములమ్మ, ఎంపీటీసీ బంధువు బోకం రామయ్యమ్మలతో పాటు దాదాపు ప్రతి ఒక్కరు టీడీపీలో గ్రామస్థాయి పదవులు నిర్వ హిస్తున్న వారు, జన్మభూమి కమిటీ సభ్యుల బంధువులే ఉన్నారు. -
గుడిసెలో టీవీ ఉంటే.. పక్కా ఇల్లు కోత!