గృహ ప్రలోభాలు | TDP Cheated People With NTR Housing Scheme | Sakshi
Sakshi News home page

గృహ ప్రలోభాలు

Published Fri, Mar 1 2019 8:01 AM | Last Updated on Fri, Mar 1 2019 8:01 AM

TDP Cheated People With NTR Housing Scheme - Sakshi

ఏలూరులో అర్బన్‌ హౌసింగ్‌ గృహాలు

ప్రతి పేదవానికి గృహ సౌకర్యం కల్పిస్తున్నాం. ఇందుకోసంఖర్చుకు వెనకాడకుండా ఎన్టీఆర్‌ అర్బన్‌ హౌసింగ్‌ కింద ఇళ్లునిర్మిస్తున్నాం అంటూ టీడీపీ ప్రభుత్వం పెద్దెత్తున ప్రచారం చేసుకుంటోంది. దీనిపై లోతుగా పరిశీలిస్తే... ప్రజలను అప్పుల ఊబిలోకినెట్టేసేందుకు తెలుగుదేశం ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్లుతేటతెల్లమవుతోంది. గృహనిర్మాణాల పేరుతో ప్రైవేటు వ్యక్తులకు కోట్ల రూపాయలు దోచిపెట్టి, ప్రజలను అప్పుల పాలు చేస్తోంది.

పశ్చిమగోదావరి, ఏలూరు (మెట్రో): సాధారణంగా బ్యాంకర్లు ఒక ఉద్యోగికి గృహ రుణం మంజూరు చేయాలంటే సవాలక్ష నిబంధనలు విధిస్తారు. ఇల్లు పూర్తయిన తరువాత గృహాన్ని పరిశీలించి, ఇంటికి సున్నం వేశారా, టైల్స్‌ వేశారా అనేది పూర్తిగా తనిఖీ చేశాక నిధులు విడుదల చేస్తారు. అయితే జిల్లాలో అర్బన్‌ గృహ నిర్మాణాలు చేస్తున్న షాపూంజీ పల్లోంజీ గ్రూపునకు ఇవేమీ చూడకుండానే బ్యాంకర్లు రుణాలు మంజూరు చేస్తున్నారు. లబ్ధిదారులు సంతకాలు చేసిన వెంటనే ఆ సంస్థకు లబ్ధిదారుని రుణం బదిలీ చేయించేస్తున్నారు. అసలు గృహం పూర్తయిందో లేదో కూడా పరిశీలన చేయకుండానే నిధులు బదిలీ చేయడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు.

ఏమిటీ గృహ నిర్మాణాలు : జిల్లావ్యాప్తంగా ఏలూరు కార్పొరేషన్‌తో పాటు ఎనిమిది మున్సిపాలిటీలలో ఎన్టీఆర్‌ అర్బన్‌ హౌసింగ్‌ పథకాన్ని  ప్రభుత్వం అమలు చేస్తోంది. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద ఈ ఇళ్ల నిర్మాణం చేపట్టింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కొంత నిధులు జోడించి పథకం పేరు మార్చింది. ఈ పథకంలో భాగంగా ఏలూరు కార్పొరేషన్‌లో 11,816, నిడదవోలులో 1,755, కొవ్వూరులో 1,904, తణుకు 2,920, జంగారెడ్డిగూడెం 2,107, నర్సాపురం 1,720, భీమవరం 9,500, పాలకొల్లు 7,159, తాడేపల్లిగూడెంలో 5,376 ఇలా మొత్తం 44,257 గృహాలను ప్రభుత్వం మంజూరు చేసింది. వీరిలో 10 వేల మంది లబ్ధిదారులను వివిధ కారణాలతో బ్యాంకర్లు తిరస్కరించారు. ఈ గృహాలను 300 చదరపు గజాలు, 365 చ.గ, 430 చ.గజాలుగా కేటగిరీలుగా ఏర్పాటు చేశారు. ప్రతి కేటగిరీలో గృహానికి రూ.1,50,000 కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా రు.1,50,000 చేర్చి పేదలకు గృహాలను నిర్మించి ఇవ్వాల్సి ఉంది. కానీరుణం పేరుతో ప్రైవేటు వ్యక్తులకు దోచిపెడుతున్నారు.

రుణం పేరుతో ఇలా..
ఎ కేటగిరీలోని 300 చదరపు గజాల గృహానికి ప్రభుత్వం రూ.5,65,000 ధర నిర్ణయించింది. దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రూ.3 లక్షలు చెల్లిస్తే మిగిలిన రూ.2,64,500 బ్యాంకు రుణంగా ఇస్తుంది. ఇందుకు ప్రాథమికంగా లబ్ధిదారులు రూ.500 చెల్లించాలని పేర్కొంది. అదే విధంగా బి కేటగిరీలోని 365 చదరపు గజాల గృహానికి రూ.6,65,000 ధర నిర్ణయించింది. దీనిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రూ.3 లక్షలు చెల్లిస్తే రూ.50,000 లబ్ధిదారుడు చెల్లించాలని నిర్ణయించింది. మరో రూ.3,15,000 లబ్ధిదారునికి బ్యాంకులు రుణంగా ఇవ్వాల్సి ఉంది. అదేవిధంగా 430 చ.గజాల గృహ నిర్మాణానికి రూ.7,65,000 ధర నిర్ణయించింది. దీనిలో రూ.3 లక్షలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించగా రూ.లక్ష లబ్ధిదారుని వద్ద నుండి వసూలు చేసి మిగిలిన రూ.3,65,000 బ్యాంకుల ద్వారా ప్రభుత్వం రుణం ఇప్పిస్తుంది.

గృహం పూర్తికాకుండానే రుణం వాయిదా చెల్లింపులు
లబ్ధిదారునికి రుణం ఇవ్వడంలోనే భారీగా అవినీతి చోటు చేసుకుంటోంది. గృహ నిర్మాణాలు పూర్తికాకుండానే లబ్ధిదారులు నెలనెలా వడ్డీ రూపంలో వేలకు వేలు చెల్లించాల్సి వస్తోంది. ఎ కేటగిరీలో గృహ రుణానికి ప్రతి నెలా రూ.2200 నుండి రూ.2500 వరకూ బ్యాంకు రుణాన్ని లబ్ధిదారుడు 20 సంవత్సరాలు (240 నెలలు) చెల్లించాలి. ఈ విధంగా రూ.5,70,000 వరకూ చెల్లించాలి. బి కేటగిరీలో గృహానికి ఇచ్చే రుణానికి రూ.2800 నుండి రూ.3000 వరకూ 20 సంవత్సరాలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధంగా రూ.6,80,000 వరకూ లబ్ధిదారుడు చెల్లించాల్సి ఉంటుంది. అదే విధంగా సి కేటగిరీ గృహానికి ఇచ్చే రుణానికి రూ.3200 నుండి రూ.3400 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధంగా రూ.7,80,000 వరకూ చెల్లించాల్సి ఉంటుంది. ఈ రుణాల కోసం లబ్ధిదారుల నుంచి మున్సిపల్‌ సిబ్బంది, మెప్మా సిబ్బంది సంతకాలు తీసుకుంటున్నారు. తిరిగి చెల్లించే మొత్తం ఎంత ఉంటుందనే విషయం చెప్పకుండానే ప్రజలను మభ్యపెడుతున్నారు. ఈ విధంగా ప్రజల సంతకాలతో మంజూరైన రుణాలు మొత్తం ప్రారంభంలోనే బ్యాంకర్లు గృహనిర్మాణాలు చేసే షాపూర్‌జీ పల్లోంజీ అనే కాంట్రాక్టు సంస్థ ఖాతాకు జమచేస్తుంది.

ప్రజల మేల్కోకుంటే అప్పుల ఊబిలోనే
రుణాలను 20 సంవత్సరాలు పాటు నెలకు రెండు నుంచి మూడు వేల వరకు చెల్లించే విషయంలో అవగాహన లేకుంటే లబ్ధిదారులు అప్పుల ఊబిలో కూరుకుపోవాల్సిందే. లబ్ధిదారులు ఏకారణం చేతనైనా మూడు నెలలు బ్యాంకుకు రుణం చెల్లించకుంటే సదరు బ్యాంకులు నేరుగా ఇంటిని జప్తు చేసే ప్రమాదం ఉంది. సదరు గృహాన్ని బ్యాంకర్లు నిరర్ధక ఆస్తులుగా పరిగణిస్తూ లబ్ధిదారునికి ఇంకెక్కడా రుణమే లభించకుండా చేస్తుంది.

రుణాలకు ప్రైవేటు బ్యాంకులు నో
వాస్తవానికి గృహ నిర్మాణాలకు రుణం మంజూరు చేయాలంటే సవాలక్ష నిబంధనలు పెట్టే బ్యాంకులు ఈ విషయంలో కాస్త ప్రభుత్వానికి తలొగ్గి లబ్ధిదారులకు అప్పులు ఇస్తున్నాయి. ప్రైవేటు బ్యాంకులను ప్రభుత్వం సంప్రదించినా అవి రుణాలు ఇచ్చేందుకు ముందుకు రాలేదని తెలిసింది.

20 ఏళ్లు ప్రజలు కిస్తీలు కట్టాల్సిందే
ప్రజలకు అర్బన్‌ హౌసింగ్‌ పథకం ద్వారా ఇచ్చే రుణాలు 20 సంవత్సరాల పాటు చెల్లించాల్సిందే. ఏ మూడు నెలలు లబ్ధిదారుడు రుణం చెల్లించకపోయినా బ్యాంకు ఆ ఇంటిని వేరే వారికి విక్రయించేందుకు అనుమతి ఉంది. ప్రజలు గృహ రుణాలు తీసుకునే ముందు నెలకు ఎంత చెల్లించాలనే విషయాలను బ్యాంకు అధికారులను అడిగి తెలుసుకోవాలి.– పి.సూర్యారావు, లీడ్‌ బ్యాంకు జిల్లా మేనేజరు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement