
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: టీడీపీ-జనసేన అధినేతల వ్యవహార శైలి, సీట్ల ప్రకటన ఇరు పార్టీల కేడర్‌కు మింగుడు పడటం లేదు. పొత్తుల పేరుతో ఇరు పార్టీల నేతలు కత్తులు నూరుకుంటున్నాయి. జిల్లాలో అసంతృప్తి సెగలు రగులుతున్నాయి. నరసాపురంలో జనసేన నేత బొమ్మిడి నాయకర్‌కు సీటు కేటాయించడంపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు, కొవ్వలి రామ్మోహన్ నాయుడు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తనకు సమాచారం ఇవ్వకుండా టికెట్ కేటాయించారంటూ కొత్తపల్లి సుబ్బారాయుడు అలకబూనారు.
భీమవరంలో జనసేన అభ్యర్థిని బరిలో దింపకుండా టీడీపీ నుంచి పులపర్తి రామాంజనేయులు చేర్చుకుని టికెట్ కేటాయించడంపై జనసేన శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆచంట నియోజకవర్గంలో కొందరు నేతలకే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ జనసేన నేతల్లో వర్గ పోరు నెలకొంది.
తణుకు నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ మాట ఇచ్చిన సీటు రాకపోవడంతో విడివాడ రామచంద్రరావు నైరాశ్యంలో మునిగిపోయారు. తణుకులో టీడీపీ జెండా ఎగరనివ్వనంటూ ఆయన శపథం పూనుతున్నారు. దశాబ్ద కాలంగా పార్టీకి సేవ చేసిన టికెట్ తనకు కేటాయించకపోవడంతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే శివరామరాజు రెబల్ అభ్యర్థిగా బరిలో దిగనున్నట్లు సమాచారం. పోలవరం సీటుపై పంచాయితీ తేలలేదు. టీడీపీ నుంచి బొరగం శ్రీనివాస్, లేదా జనసేన నుంచి బాలరాజు కేటాయించుకుంటే.. తాము సహకరించబోమని కేడర్ తేల్చి చెబుతోంది.