disagreement
-
పశ్చిమగోదావరి: టీడీపీ-జనసేనలో భగ్గుమన్న అసమ్మతి
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: టీడీపీ-జనసేన అధినేతల వ్యవహార శైలి, సీట్ల ప్రకటన ఇరు పార్టీల కేడర్‌కు మింగుడు పడటం లేదు. పొత్తుల పేరుతో ఇరు పార్టీల నేతలు కత్తులు నూరుకుంటున్నాయి. జిల్లాలో అసంతృప్తి సెగలు రగులుతున్నాయి. నరసాపురంలో జనసేన నేత బొమ్మిడి నాయకర్‌కు సీటు కేటాయించడంపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు, కొవ్వలి రామ్మోహన్ నాయుడు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తనకు సమాచారం ఇవ్వకుండా టికెట్ కేటాయించారంటూ కొత్తపల్లి సుబ్బారాయుడు అలకబూనారు. భీమవరంలో జనసేన అభ్యర్థిని బరిలో దింపకుండా టీడీపీ నుంచి పులపర్తి రామాంజనేయులు చేర్చుకుని టికెట్ కేటాయించడంపై జనసేన శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆచంట నియోజకవర్గంలో కొందరు నేతలకే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ జనసేన నేతల్లో వర్గ పోరు నెలకొంది. తణుకు నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ మాట ఇచ్చిన సీటు రాకపోవడంతో విడివాడ రామచంద్రరావు నైరాశ్యంలో మునిగిపోయారు. తణుకులో టీడీపీ జెండా ఎగరనివ్వనంటూ ఆయన శపథం పూనుతున్నారు. దశాబ్ద కాలంగా పార్టీకి సేవ చేసిన టికెట్ తనకు కేటాయించకపోవడంతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే శివరామరాజు రెబల్ అభ్యర్థిగా బరిలో దిగనున్నట్లు సమాచారం. పోలవరం సీటుపై పంచాయితీ తేలలేదు. టీడీపీ నుంచి బొరగం శ్రీనివాస్, లేదా జనసేన నుంచి బాలరాజు కేటాయించుకుంటే.. తాము సహకరించబోమని కేడర్ తేల్చి చెబుతోంది. -
తిరుపతి టీడీపీ-జనసేనలో అసమ్మతి జ్వాలలు
సాక్షి, తిరుపతి జిల్లా: తిరుపతి టీడీపీ-జనసేనలో అసమ్మతి జ్వాలలు భగ్గుమంటున్నాయి. తిరుపతి నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులను టీడీపీ, జనసేనలో ఒక వర్గం వ్యతిరేకిస్తుంది. లోకల్ ముద్దు - నాన్ లోకల్ వద్దు అంటూ టీడీపీ- జనసేన నాయకులు ఉమ్మడిగా వ్యతిరేకిస్తున్నారు. నాగబాబు వద్దకు తిరుపతి పంచాయితీ చేరింది. మరోవైపు, టికెట్ ఇస్తే జనసేన నుంచి పోటీకి సిద్ధమని సుగుణమ్మ అంటున్నారు. శ్రీకాళహస్తిలో ఉమ్మడి అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి నాయకత్వాన్ని మాజీ ఎమ్మెల్యే ఎస్పీవీ వర్గం వ్యతిరేకిస్తోంది. సత్యవేడు నియోజకవర్గంలో టీడీపీ టికెట్ దక్కించుకున్న కోనేటి ఆది మూలం వద్దని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. టీడీపీ రెబెల్‌గా సత్యవేడు మాజీ ఇన్ఛార్జ్ జీడి రాజశేఖర్ బరిలో దిగారు. మదనపల్లి నియోజకవర్గంలో షాజహాన్ బాషాను దొమ్మల పాటి రమేష్, జనసేన పార్టీ నేత రామ్ దాస్ చౌదరి వ్యతిరేకిస్తున్నారు. తంబల్లపల్లెలో జయచంద్రారెడ్డికి కేటాయించడంతో మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ వర్గం ఆగ్రహంతో ఉన్నారు. ఇదీ చదవండి: బాబును నమ్ముకో.. ఉన్నది అమ్ముకో.. -
‘కారు’లో.. మూడు ముక్కలాట!
నారాయణ్‌పేట్: జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్లో అసంతృప్త సెగలు భగ్గుమంటున్నాయి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య విభేదాలు.. మరో ముఖ్యనేత అసమ్మతి రాగం వెరసి ‘కారు’లో కీచులాటలు తారస్థాయికి చేరాయి. శుక్రవారం ప్రగతిభవన్‌కు చేరిన అలంపూర్ పంచాయితీయే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఎమ్మెల్యే అబ్రహంకు టికెట్ ఇవ్వొద్దని.. అభ్యర్థిని మార్చాలని వందలాది వాహనాల్లో తరలివెళ్లిన పార్టీ నాయకులు మంత్రి కేటీఆర్‌ను కలిసి ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. మరోవైపు గులాబీ సీనియర్ నేత, మాజీ ఎంపీ, ఢిల్లీలో అధికార ప్రతినిధి మందా జగన్నాథం సైతం పార్టీ అభ్యర్థిని మార్చాలని.. తన కుమారుడికి అవకాశం ఇవ్వాలని బహిరంగంగానే విమర్శలు గుప్పించడం హాట్‌టాపిక్‌గా మారగా.. పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. ‘చల్లా’రుతాయా.. లేక.. ప్రస్తుతం ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగా.. వచ్చే నెల మూడో తేదీన ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ వెలువడనుంది. త్వరలో బీఆర్ఎస్ అభ్యర్థులకు బీఫాం ఇచ్చేందుకు ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో అలంపూర్‌లో చల్లారినట్లే చల్లారిన అసమ్మతి సెగలు మళ్లీ భగ్గుమనడంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసమ్మతి నేతలు భేటీకి అలంపూర్‌ను ఎంచుకున్నప్పటికీ.. ఎర్రవల్లి మండలంలోని బీచుపల్లికి మార్చారు. ఎమ్మెల్సీ చల్లా సూచనతోనే సమావేశ వేదికను మార్చినట్లు సమాచారం. సమావేశం అనంతరం అసమ్మతి నేతలు హైదరాబాద్‌కు వెళ్లి అలంపూర్ అభ్యర్థిని మార్చాలని ఏకవాక్య తీర్మానంతో వినతిపత్రం సమర్పించిన క్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ ‘మీరు ఏదైతే వినతిపత్రం ఇచ్చారో యథాతథంగా సీఎం కేసీఆర్‌కు అందజేస్తాను. ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి మీ మనోభావాలను మీరు స్పష్టంగా చెప్పారు.. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాను.. వారు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటారు.’అని వెల్లడించడంపై రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. అభ్యర్థిని మార్చని పక్షంలో చల్లా నిర్ణయం ఏవిధంగా ఉంటుందోననే చర్చ సైతం రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ‘మందా’ సైతం అసమ్మతి గళం.. ‘అలంపూర్ బీఆర్ఎస్ ఎదగడానికి నాతో పాటు నా కుమారుడు మందా శ్రీనాథ్ కృషి చేశారు.. అయితే కేసీఆర్ మమ్మల్ని విస్మరించారు.. అభ్యర్థిని మార్చకపోతే బీఆర్ఎస్ ఓడిపోతుందని శ్రేణులే చెబుతున్నాయి.. ఇప్పుడు ప్రకటించిన అలంపూర్ అభ్యర్థిని గెలిపించలేం.. ఆయనను మార్చాలన్నదే మా డిమాండ్.. ఎమ్మెల్సీ చల్లాది కూడా అదే డిమాండ్’ అని మాజీ ఎంపీ మందా జగన్నాథం బహిరంగంగానే చెబుతున్నారు. ‘మందా శ్రీనాథ్‌కు బీఫాం ఇవ్వండి.. చల్లా సహకారం తీసుకుంటాం.. గెలుస్తాం’ అని సైతం వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. ఈ క్రమంలో అలంపూర్ బీఆర్ఎస్లో రాజకీయాలు మూడు ముక్కలాటను తలపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అప్పటి నుంచి పెరిగిన గ్యాప్.. అలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ను మరింత బలోపేతం చేసేందుకు చల్లా వెంకట్రామిరెడ్డిని పార్టీలో చేర్చుకుని.. ఆ వెంటనే ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జోగుళాంబ ఆలయ చైర్మన్, తదితర పరిణామాల క్రమంలో ఎమ్మెల్యే అబ్రహం, ఆయన మధ్య గ్యాప్ బాగా పెరిగింది. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందస్తుగానే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటిస్తారనే ప్రచారం ఊపందుకోగా.. ఎమ్మెల్యే అబ్రహానికి కాకుండా ఇతరులకు పార్టీ టికెట్ ఇప్పించేందుకు చల్లా ప్రయత్నించినట్లు సమాచారం. ఉమ్మడి పాలమూరులో సిట్టింగ్ ఎమ్మెల్యేలనే అభ్యర్థులుగా ఖరారు చేస్తూ సీఎం కేసీఆర్ జాబితా ప్రకటించగా.. నియోజకవర్గంలోని పలు మండలాల్లో నాయకులు అబ్రహానికి వ్యతిరేకంగా సమావేశాలు నిర్వహించారు. వీటి వెనుక ఎమ్మెల్సీ చల్లా హస్తం ఉందని ఎమ్మెల్యే సైతం పరోక్షంగా ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు. ఇన్చార్జ్గా నియామకం.. ఆ మరునాడే.. బీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థుల ఖరారు తర్వాత అలంపూర్‌తో పాటు పాలమూరులోని కల్వకుర్తి తదితర సెగ్మెంట్లలో అసమ్మతి జ్వాలలు ఎగిసిపడ్డాయి. బుజ్జగింపులు, పార్టీలో ప్రాధాన్యం, పదవుల భర్తీ వంటి చర్యలతో అసంతృప్త నేతలకు చెక్ పెట్టే వ్యూహాన్ని పార్టీ పెద్దలు అమలు చేశారు. కొంతకాలం నిశ్శబ్దంగానే ఉన్నప్పటికీ.. అలంపూర్‌లో మళ్లీ అసమ్మతి రాజుకోవడం హాట్‌టాపిక్‌గా మారింది. ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డిని ఎన్నికల క్యాంపెయిన్ ఇన్చార్జిగా నియమిస్తూ బీఆర్ఎస్ అధిష్టానం గురువారం రాత్రి ప్రకటన విడుదల చేసింది. ఆ మరునాడే ఆయన వర్గీయులుగా ముద్రపడిన నేతలు అబ్రహం అభ్యర్థిత్వాన్ని మార్చాలంటూ హైదరాబాద్‌లో కేటీఆర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. -
అసమ్మతుల చూపు.. ప్రగతి భవన్ వైపు..!
భద్రాద్రి: రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే టికెట్లు దక్కించుకున్న బీఆర్ఎస్ అభ్యర్థులు, టికెట్లపై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టులు అంతా ‘చలో హైదరాబాద్’ అంటున్నారు. ఇప్పటికే కొందరు రాజధానిలో మకాం వేయగా.. మరికొందరు నేడు, రేపు హైదరాబాద్ బాట పట్టనున్నారు. చల్లారని ఇల్లెందు సెగ.. ఇల్లెందు నియోజవకర్గంలో బీఆర్ఎస్లో చెలరేగిన అసమ్మతి ఎంతకీ చల్లారడం లేదు. రెండు వారాల క్రితం మంత్రి హరీశ్‌రావుకు తమ ఇబ్బందులు చెప్పుకున్న అసమ్మతి వర్గం నేతలు గురువారం హైదరాబాద్ వెళ్లి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిశారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ కవితతో కలిసి ఇల్లెందు మున్సిపల్ చైర్మన్ డీవీ, పార్టీ అధికార ప్రతినిధి పులిగండ్ల మాధవరావు, కృష్ణప్రసాద్, మధుకర్‌రెడ్డి కేటీఆర్‌ను కలిశారు. సుమారు రెండు గంటల పాటు నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని వివరించారు. అసమ్మతి నేతలు చెప్పిన అంశాలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ నుంచి వచ్చే ఏ ఆదేశాలనైనా పాటించేందుకు సిద్ధంగా ఉండాలని వారికి సూచించారు. సోమవారం తొలి జాబితా.. కమలం పార్టీకి సంబంధించి ఇల్లెందు నుంచి ఊకె అబ్బయ్య, భద్రాచలం నుంచి కుంజా సత్యవతి వంటి మాజీ ఎమ్మెల్యేలు ఆయా స్థానాల నుంచి టికెట్ ఆశిస్తున్నారు. కొత్తగూడెం నుంచి పోటీకి రంగాకిరణ్ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. పినపాక నుంచి కేంద్ర సర్వీసులకు చెందిన కొత్త అభ్యర్థిని రంగంలోకి దించుతారనే ప్రచారం జరుగుతోంది. కాగా బీజేపీ మొదటి జాబితా వచ్చే సోమవారం వెలువడుతుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. దీంతో ఆశావహులు తమ వంతు ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు. ‘గులాబీ’ అభ్యర్థుల పయనం.. అధికార భారత రాష్ట్ర సమితి పార్టీ జిల్లాలోని ఐదు అసెంబ్లీ స్థానాలకు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. గత నెల రోజులుగా వీరంతా నియోజకవర్గాల స్థాయిలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు తదితర అధికారిక కార్యక్రమాల్లో బిజీగా గడిపారు. అయితే ఎన్నికలు సమీపించిన వేళ ఇల్లెందు, అశ్వారావుపేటలో అసమ్మతి చెలరేగడం అభ్యర్థులకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. ఈనెల 15న హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ సమావేశం జరగనుంది. టికెట్లు కేటాయించిన అభ్యర్థులకు ఆ సమావేశంలోనే బీ ఫామ్‌లు ఇస్తారని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. దీంతో కొత్తగూడెం అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు ఇప్పటికే హైదరాబాద్ చేరుకోగా, రేగాకాంతారావు, హరిప్రియనాయక్, మెచ్చా నాగేశ్వరరావు, తెల్లం వెంకట్రావు నేడు, రేపు హైదరాబాద్ వెళ్లనున్నారు. ఢిల్లీ టు హైదరాబాద్.. కాంగ్రెస్‌లో టికెట్ల కేటాయింపు అంశం ఇంకా ఓ కొలిక్కి రాకపోవడంతో ఆ పార్టీకి చెందిన ఆశావహులంతా గత పది రోజులుగా ఢిల్లీ కేంద్రంగా లాబీయింగ్ చేయడంలో బిజీగా ఉన్నారు. నిన్నా మొన్నటి వరకు టికెట్ల కేటాయింపు కోసం నియమించిన స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు ఢిల్లీలో జోరుగా సాగాయి. దీంతో ఆశావహులు తమకు సానుకూలంగా ఉన్న అంశాలను పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లేందుకు అక్కడే మకాం వేశారు. లంబాడా సామాజిక వర్గానికే ఇల్లెందు టికెట్ ఇవ్వాలంటూ ఆజ్మీరా శంకర్‌నాయక్, ప్రవీణ్ నాయక్, రామచంద్రునాయక్ తమ వంతు ప్రయత్నాలు చేశారు. ఇక కొత్తగూడెం టికెట్ బీసీలకే ఇవ్వాలంటూ ‘గూడెం’ నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. గుర్రుగా ఉన్న పొదెం.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌తో వామపక్షాలకు పొత్తు కుదిరితే భద్రాచలం అసెంబ్లీ స్థానం సీపీఎంకు కేటాయిస్తారనే ప్రచారం విపరీతంగా జరగడంతో కాంగ్రెస్ పార్టీ పెద్దలతో ఆమీతుమీ తేల్చుకునేందుకు భద్రాచలం సిట్టింగ్ ఎమ్మెల్యే పొదెం వీరయ్య రెండు రోజుల క్రితం హైదరాబాద్ చేరుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని పొత్తులో ఇతర పార్టీకి టికెట్ కేటాయించడమేంటని ఆయన పార్టీ పెద్దలను నేరుగా ప్రశ్నిస్తున్నారు. ఒక వేళ పొత్తుల్లో భద్రాచలం స్థానాన్ని సీపీఎంకు ఇవ్వాల్సిన పరిస్థితి ఎదురైతే పినపాక నుంచి పోటీ చేయాలని పొదెం వీరయ్యకు కాంగ్రెస్ ఆఫర్ చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. అయితే భద్రాచలం నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వకుంటే ములుగు నుంచి పోటీకి సిద్ధమని ఆయన పార్టీ పెద్దలకు కబురు పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. భద్రాచలం, ములుగు తప్ప మరో స్థానం నుంచి పోటీ చేసే ప్రసక్తి లేదని పొదెం వీరయ్య కుండబద్ధలు కొట్టినట్టు గాంధీభవన్ వర్గాల సమాచారం. -
విశాఖ బీజేపీలో అసమ్మతి సెగ
సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగర బీజేపీలో అసమ్మతి సెగ రగిలింది. గ్రేటర్ ఎన్నికల అభ్యర్థుల ఖరారు లో జనసేన-బీజేపీ పొత్తు తో బీజేపీ సీనియర్ నేతలకు అన్యాయం జరిగిందంటూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కిల్లి శ్రీరామమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. 26 ఏళ్లుగా పార్టీ కు సేవ చేస్తున్నా 57 వ వార్డుకు తనను కాదని జనసేన కు కేటాయించడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. (టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు ఏకమై దాడులు) జాబితా ప్రకటించక ముందే 57వ వార్డు అభ్యర్థిగా బీజేపీ తరపున శ్రీరామమూర్తి నామినేషన్ దాఖలు చేశారు. అదే రోజు బీజేపీ- జనసేన సంయుక్తంగా అభ్యర్థుల జాబితాలో తన పేరు లేదని బీజేపీ నేతలు చెప్పటంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కోసం లక్ష జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి బీజేపీకి సేవ చేస్తే.. తనను ఏమి చేసావంటూ మాజీ ఎమ్యెల్యే విష్ణుకుమార్ రాజు ప్రశ్నించడం పట్ల శ్రీరామమూర్తి అసహనం వ్యక్తం చేశారు. (బెడిసికొట్టిన జనసేన కిడ్నాప్ డ్రామా) -
ఆ ఎమ్మెల్యేల రహస్య భేటీల వెనుక ఆంతర్యమేమిటి?
సాక్షి, బెంగళూరు: కేబినెట్ విస్తరణ అనంతరం బీజేపీ ఎమ్మెల్యేల్లో అసమ్మతి రేగిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో వరుసగా రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారు. మొదట మంత్రి జగదీశ్ శెట్టర్ నివాసంలో సమావేశమయ్యారు. అదేవిధంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌తో మరో 25 మంది రెండు రోజుల క్రితం అర్ధరాత్రి వరకు భేటీ అయి చర్చించారు. గత మంగళవారం అర్ధరాత్రి సుమారు 25 మంది బీజేపీ ఎమ్మెల్యేలు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌తో భేటీ అయ్యారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో జాతీయ ప్రధాన కార్యదర్శితో కలిసి భేటీ కావడం కర్ణాటక రాజకీయాల్లో కుతూహలం రేపుతోంది. ఒక్కో ఎమ్మెల్యే ప్రత్యేకంగా భేటీ అయి రాజకీయ పరిణామాల గురించి చర్చించినట్లు తెలిసింది. ప్రతి ఎమ్మెల్యేతో నాలుగైదు ని మిషాల పాటు బీఎల్ సంతోష్ మాట్లాడారు. ఈక్రమంలో అర్ధరాత్రి 1.30 గంటల వరకు చర్చ కొనసాగింది. అయితే పాలనపై వ్యతిరేకమా? లేక మంత్రివర్గంలో చోటు దక్కలేదనే అసమ్మతి వ్యక్తం చేశారా? అనే విషయాలు స్పష్టంగా తెలియరాలేదు. కానీ రాజకీయ పరిణామాల గురించి చర్చించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. పార్టీలో జాతీయ స్థాయిలో కీలకపాత్ర పోషిస్తున్న బీఎల్ సంతోష్ రెండు రోజుల క్రితం ఢిల్లీ నుంచి బెంగళూరుకు వచ్చారు. ఈక్రమంలో మంత్రివర్గంలో చోటు దక్కని ఎమ్మెల్యేలు అసమ్మతి వ్యక్తం చేసినట్లు సమాచారం. గతంలో సీఎంగా యడియూరప్ప ఉన్నప్పుడు కూడా జగదీశ్ శెట్టర్ సమక్షంలో అసమ్మతి లేచిన సంగతి తెలిసిందే. యడియూరప్ప పదవీచ్యుతుడు కాగా జగదీశ్ శెట్టర్ అప్పట్లో సీఎం అయ్యారు. అయితే ప్రస్తుతం యడియూరప్ప మంత్రివర్గంలో జగదీశ్ శెట్టర్ కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఆధ్వర్యంలో అసమ్మతి నేతలు భేటీ కావడం చర్చనీయంగా మారింది. -
ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌పై అసమ్మతి
గుంటూరు, వెంకటపాలెం(తుళ్లూరురూరల్): తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌పై అసమ్మతి వర్గం తుళ్లూరు మండలంలో శనివారం విస్తృత స్థాయిలో సమావేశాలు నిర్వహించింది. సాయంత్రం ఆరు గంటల నుంచి ప్రారంభమైన ఈ సమావేశాలు వెంకటపాలెం, మందడం, వెలగపూడి, మల్కాపురం, ఉద్దండ్రాయునిపాలెం గ్రామాల్లో అర్ధరాత్రి వరకు కొనసాగాయి. రానున్న ఎన్నికల్లో శ్రావణ్‌కుమార్‌కు టికెట్ ఇవ్వొద్దని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేందుకు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అనుచరుల మద్దతు కోరారు. వెంకటపాలెం గ్రామానికి చెందిన నాయకుడు బెల్లంకొండ నరసింహారావును తమ వర్గంలోకి రావాలని చర్చలు జరిపారు. రాజధాని ప్రాంతంలో వర్గాలను తయారు చేస్తున్న ఎమ్మెల్యే చేతుల్లో పార్టీని పెట్టడం సరైంది కాదని చెప్పారు. శ్రావణ్‌కుమార్‌కు టికెట్ ఇస్తే సహకరించేది లేదని తీర్మానించుకున్నారు. స్థానిక నాయకుల మాట కాదని అధిష్టానం వ్యవహరిస్తే ఇక్కడ ఓడిస్తామని స్పష్టం చేశారు. టీడీపీ నేతలు నరేంద్రబాబు, సుధాకర్ తరదితరుల నివాసాలలో ఈ చర్చలు జరిగాయి. -
సబితా ఇంద్రారెడ్డికి సొంతపార్టీలోనే అసమ్మతి
-
ఇండిపెండెంట్లుగా..!
టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు రెబెల్స్ బెడద తప్పేలా లేదు. జిల్లాలోని ఆయా అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన తర్వాత అసమ్మతి జ్వాలలు భగ్గున మండాయి. తమకే టికెట్ వస్తుందని ఆశించిన వారికి భంగపాటు ఎదురవడంతో అభ్యర్థిని వ్యతిరేకిస్తూ బహిరంగ ప్రకటనలు కూడా చేశారు. వివిధ రూపాల్లో నిరసనలు తెలిపారు. అధిష్టానం కొందరిని బుజ్జగించినా మరికొందరు ససేమిరా అంటున్నారు. అలాంటి వారు ఇప్పుడు ఇండిపెండెంట్‌గా బరిలో దిగేందుకు కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. మిర్యాలగూడ, నల్లగొండలో ఈ పరిస్థితి ఎదురవుతోంది. సాక్షిప్రతినిధి, నల్లగొండ : జిల్లాలో టీఆర్ఎస్ రాజకీయం నెల రోజులుగా రోజుకో రకంగా మారుతూ వస్తోంది. పార్టీలో ముందునుంచీ పనిచేసిన వారు టికెట్లపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. నెల రోజుల కిందట ఆ పార్టీ అధ్యక్షుడు, ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల్లో తమ పేరు లేకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనైన సదరు నేతలు అధికారిక అభ్యర్థులకు వ్యతిరేకంగా అసమ్మతి కుంపటి రాజేశారు. అభ్యర్థులను మార్చాలని, ఏళ్లకు ఏళ్లుగా పార్టీని నమ్ముకున్న తమకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నెల రోజులుగా జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న అసమ్మతి కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు అధినాయకత్వం భగీరథ ప్రయత్నమే చేసింది. వీరిలో కొందరు దారికి వచ్చినా, మరికొందరు మాత్రం ససేమిరా అంటున్నారు. జిల్లా కేంద్రంలో 4వ తేదీన జరిగిన ఉమ్మడి జిల్లా ప్రజా ఆశీర్వాద సభ వరకు ఓపిక పట్టిన అసమ్మతి నాయకులు ఒక్కొక్కరు ఇప్పుడు తమ అభిమతాన్ని బయట పెడుతున్నారు. ఇక, అధిష్టానం దిగివచ్చి అభ్యర్థులను మార్చే అవకాశాలు దాదాపుగా లేకపోవడంతో, చేసేది లేక తామే బరిలోకి దిగేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అసంతృప్త నేతలు కొందరు ఇప్పటికే తాము ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తామని ప్రకటించారు. రెబల్స్ బెడద ఇప్పటికిప్పుడు టీఆర్ఎస్లోనే ఎక్కువగా కనిపిస్తోంది. అభ్యర్థుల ప్రకటన తర్వాత కాంగ్రెస్‌లోనూ ఇదే పరిస్థితి తలెత్తే అవకాశాలు లేకపోలేదని పేర్కొంటున్నారు రెబల్ గులాబీలు.. ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో ఇప్పటికే పది చోట్ల అభ్యర్థులను ప్రకటించారు. నాగార్జునసాగర్, మునుగోడు, మిర్యాలగూడ, నల్లగొండ, తుంగతుర్తి నియోజకవర్గాల్లో అభ్యర్థులకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు, అసమ్మతి సమావేశాలు జరిపారు. వీరిలో కొందరు అగ్రనాయకత్వం పిలిపించి మాట్లాడడంతో తమ రాజకీయ భవిష్యత్ కోసం రాజీపడిపోయారు. మరికొందరు మాత్రం ససేమిరా అంటూ ఇండిపెండెంట్లుగా బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. మిర్యాలగూడలో గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన అలుగుబెల్లి అమరేందర్ రెడ్డి టికెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ, ఇక్కడి సిట్టింగ్ భాస్కర్‌రావు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరారు. అధినాయకత్వం చివరకు ఆయనకే టికెట్ ఖాయం చేసింది. ఈ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన అలుగుబెల్లి తానే స్వయంగా పోటీలో ఉంటానని ప్రకటించారు. ఈ మేరకు ఆయన నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచారం కూడా చేస్తున్నారు. పార్టీ నాయకత్వం పిలిపించి మాట్లాడే ప్రయత్నం చేసినా అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ప్రస్తుతం ఆయన టీఆర్ఎస్ అభ్యర్థి భాస్కర్‌రావుకు దీటుగా నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నారు. నల్లగొండ నియోజకవర్గంలోనూ ఇదే పరి స్థితి ఉంది. మాజీ ఇన్చార్జి చకిలం అనిల్‌కుమార్ రాష్ట్ర నాయకత్వంతో మాట్లాడి వచ్చారు. అయినా, తన నిర్ణయంలో మార్పు లేదంటున్న ఆయన ప్రస్తుతం నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని ప్రకటించిన ఆయన ఆ మాటకే కట్టుబడి నియోజకవర్గాన్ని చుట్టి వస్తున్నారు. మరో అసమ్మతి నేత, తిప్పర్తి జెడ్పీటీసీ సభ్యుడు తండు సైదులు గౌడ్ ఇన్ని రోజులు ఎదురు చూసి ఆదివారం తన నిర్ణయాన్ని ప్రకటించారు. తన అనుయాయులతో సమావేశమై ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉండాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఇప్పుడు నల్లగొండ టీఆర్ఎస్లో ఇద్దరు రెబల్స్ ఉన్నట్టు లెక్క. హుజూర్నగర్ నియోజకవర్గ నాయకుడు సామల శివారెడ్డి సైతం తాను ఇండిపెండెంటుగా బరిలో ఉంటానని ప్రకటించారు. కాకుంటే ఆయన ఎలాంటి ప్రచారం, ఇతర కార్యక్రమాలేవీ చేపట్టడం లేదు. మరో వైపు పార్టీ నిర్ణయంపై అసంతృప్తితో జెడ్పీ చైర్మన్ బాలూనాయక్ కాంగ్రెస్‌లో చేరారు. నల్లగొండలో మున్సిపల్ వైస్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కాంగ్రెస్‌కూ రెబల్స్ ముప్పు అభ్యర్థులు ప్రకటించిన టీఆర్ఎస్లో మాత్రమే రెబల్స్ ఉన్నట్లు కనిపిస్తున్నా.. త్వరలో అభ్యర్థులు ఖరారు కానున్న కాంగ్రెస్‌కూ రెబల్స్ బెడద తప్పేలా లేదని అంచనా వేస్తున్నారు. మునుగోడు టికెట్ ఆశిస్తున్న శాసన మండలి సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే ఎన్నికల కమిటీల నియామకాలపై నాయకత్వంపై విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్సీగా మరో మూడేళ్లకుపైగానే పదవీ కాలం ఉన్నందున ఆయనకు టికెట్ నిరాకరిస్తే ఇండిపెండెంటుగానైనా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన అనుచరగణం పేర్కొంటోంది. మునుగోడును పొత్తుల్లో భాగంగా సీపీఐకి కేటాయించినా, తనకు కాకుండా మరో అభ్యర్థికి ప్రకటించినా రాజగోపాల్‌రెడ్డి రెబల్‌గా బరిలోకి దాదాపు ఖాయమని పేర్కొంటున్నారు. టికెట్లు ప్రకటించాక గానీ కాంగ్రెస్‌కు ఏయే నియోజకవర్గాల్లో ఈ బెడద ఉంటుందో చెప్పలేమన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. -
అసమ్మతి నేతలకు.. తాయిలాల ముకుతాడు!
సాక్షిప్రతినిధి, నల్లగొండ : టీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి గళాలకు తాళం పడినట్టేనా..? దాదాపు అన్ని నియోజకవర్గాల్లో అసమ్మతి నాయకులను పిలిపించుకుని మాట్లాడిన రాష్ట్ర నాయకత్వం తాయిలాలతో వారికి ముకుతాడు వేసిందా..? తాజా పరిణామాలను పరిశీలిస్తే.. పై ప్రశ్నలకు అవుననే సమాధానమే లభిస్తోంది. ప్రతి పక్ష పార్టీల అభ్యర్థులు తేలక ముందే ఆయా నియోజకవర్గాల్లో అసమ్మతి నాయకులకు చెక్ పెట్టడంలో పార్టీ అధినాయకత్వం వ్యూహాత్మకంగా వేసిన అడుగులు సత్ఫలితాలు ఇచ్చినట్లే కనిపిస్తున్నాయి. ఒక్క మిర్యాలగూడలో తప్ప దాదాపు అన్ని నియోజకవర్గాల్లో అసమ్మతి నాయకులను, రాజకీయాలను దారిలోకి తెచ్చుకుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సరిగ్గా నెల రోజుల కిందట ఇదే రోజున (సెప్టెంబరు 6వ తేదీ) టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాలకు గాను 10 స్థానాల్లో తమ అభ్యర్థులను ప్రకటించారు. కోదాడ, హుజూర్నగర్ల అభ్యర్థుల ప్రకటనను పెండింగ్‌లో పెట్టారు. మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సూర్యాపేట, నకిరేకల్ నియోజకవర్గాలు మినహా మిగిలిన ఎనిమిది స్థానాల్లో అసమ్మతి భగ్గుమంది. కొన్ని నియోజకవర్గాల్లో ఆ అసమ్మతి నామమాత్రంగానే ఉండగా, మరికొన్ని చోట్ల తారాస్థాయికి చేరింది. అభ్యర్థులను మార్చాల్సిందేనని పట్టుబట్టారు. అయితే, దేవరకొండ వంటి చోట టికెట్ ఆశించిన భంగపడిన జెడ్పీ చైర్మన్ బాలునాయక్ పార్టీ మారారు. మునుగోడులో అసమ్మతి నేత వేనేపల్లి వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ వేటు వేసి, పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి కూడా తొలగించారు. ఆలేరులో అసమ్మతిపై నీళ్లు చల్లగా, భువనగిరిలో చేతులు కలిపించారు. తుంగతుర్తిలో కూడా మందలింపులతో సరిపెట్టారు. నాగార్జున సాగర్, నల్లగొండ నియోజకవర్గాల్లో పార్టీ అధినాయకత్వం కల్పించుకోవాల్సి వచ్చింది. మిర్యాలగూడలో మాత్రం ‘తారక’ మంత్రం ఫలించలేదు. మొత్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎనిమిది నియోజకవర్గాల్లో అసమ్మతి నేతలను దారికి తెచ్చుకోవడానికి వివిధ మార్గాలను ఆశ్రయించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నల్లగొండలో ఒక విధంగా పార్టీకి కార్యకలాపాలకు దూరంగా ఉండిన మాజీ ఇన్చార్జి దుబ్బాక నర్సింహారెడ్డిని పిలిపించుకుని మాట్లాడారు. ఆయనకు శాసన మండలి సభ్యత్వం ఇస్తామన్న హామీ ఇచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ కారణంగానే ఆయన గురువారం నాటి అపద్ధర్మ సీఎం కేసీఆర్ పాల్గొన్న ప్రజా ఆశీర్వాద సభకు హాజరయ్యారని సమాచారం. నాగార్జున సాగర్‌లో అభ్యర్థిని మార్చాల్సిందేనని పట్టుబట్టిన అసమ్మతి నాయకుడు ఎంసీ కోటిరెడ్డి, ఆయన అనుచర నాయకులు, ఇతర ముఖ్యులను కూడా హైదరాబాద్ ప్రగతి భవన్‌కు పిలిపించుకుని మంత్రులు కె.తారక రామారావు (కేటీఆర్), జగదీశ్‌రెడ్డి బుజ్జగించారు. సుదర్ఘీ మంతనాల అనంతరం అభ్యర్థి నోముల నర్సింహయ్యతో, ఎంసీ కోటిరెడ్డి చేతులను కలిపించారు. దానికి ముందు ఎంసీ కోటిరెడ్డికి కూడా శాసన మండలి సభ్యత్వం ఇస్తారన్న హామీని పార్టీ నాయకత్వం ఇచ్చిందని సమాచారం. తుంగతుర్తిలో అసమ్మతి నాయకుడు మందుల సామేలుకు ఇప్పటికే రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌గా కొనసాగుతున్నందున ఒప్పించారని అంటున్నారు. భువనగిరిలో చింతల వెంకటేశ్వర్ రెడ్డి, అభ్యర్థి పైళ్ల శేఖర్ రెడ్డిల మధ్యా సయోధ్య కుదిర్చారు. పనిచేయని బుజ్జగింపులు మిర్యాలగూడలో పార్టీ మాజీ ఇన్చార్జి, అసమ్మతి నాయకుడు అలుగుబెల్లి అమరేందర్ రెడ్డి విషయంలో బుజ్జగింపులు పనిచేయలేదని చెబుతున్నారు. ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని అంటున్నారు. అన్నీ అనుకూలించి కాంగ్రెస్ టికెట్ వస్తే ఆ పార్టీ తరఫున, లేదంటే ఇండిపెండెంట్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో పడ్డారని పేర్కొంటున్నారు. మరో వైపు మంత్రి కేటీఆర్ ఒకసారి పిలిపించి మాట్లాడినా, నిర్ణయం మార్చుకోకుండా నల్లగొండ మాజీ ఇన్చార్జి చకిలం అనిల్ కుమార్ పోటీలో ఉంటానని ప్రకటించి ప్రచారం చేసుకుంటున్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, తిప్పర్తి జెడ్పీటీసీ సభ్యుడు తండు సైదులుగౌడ్ కూడా నల్లగొండ అభ్యర్థిని మార్చాలని డిమాండ్ చేసిన వారే. అధిష్టానం అభ్యర్థి మార్పు ఉండదని స్పష్టమైన సంకేతాలు ఇవ్వడంతో వారిద్దరూ తమ దారి తాము చూసుకునే పనిలో ఉన్నారని అంటున్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మరికొందరు అనుచర కౌన్సిలర్లతో కలిసి తమ సొంత గూడు కాంగ్రెస్‌లోకి వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని చెబుతున్నారు. మొత్తంగా జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో అసమ్మతికి దాదాపు తెరపడినట్టేనని పేర్కొంటున్నారు. అభ్యర్థులను ప్రకటించాల్సి ఉన్న కోదాడలో ఇన్చార్జి శశిధర్ రెడ్డి, హుజూర్నగర్ ఇన్చార్జి శంకరమ్మ ఇంకా బెట్టు వీడడం లేదంటున్నారు. ఇక్కడ అభ్యర్థుల ప్రకటన తర్వాత ఈ రెండు చోట్లా అసమ్మతి పొగ గుప్పుమనే అవకాశాల్లేకపోలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
అలకవీడిన కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా కాంగ్రెస్ ముఖ్య నేత, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి అలకవీడారా..? పార్టీ అనుమానపు చూపులను తట్టుకోలేక ఒకానొక దశలో పోటీకి దూరంగా ఉండేందుకు సిద్ధమైన ఆయన మళ్లీ మనసు మార్చుకున్నారా? టీపీసీసీ ముఖ్య నేతలు కేఎల్లార్‌తో చర్చలు జరిపి ఆయన జారిపోకుండా జాగ్రత్త పడ్డారా.. అంటే అవుననే సమాధానమే వస్తోంది. ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీతో అంటీముట్టనట్టుగానే ఉంటున్న కేఎల్లార్ ఈనెల 4న జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచార శంఖారావం కార్యక్రమానికి హాజరు కావడం విశేషం. అయితే, అసలు కేఎల్లార్ ఎందుకు అలిగారు.. పార్టీ నాయకత్వానికి, కేఎల్లార్‌కు పొరపొచ్చాలు వచ్చాయా? మేడ్చల్ అసెంబ్లీ టికెట్ కాంగ్రెస్ ఇవ్వనందా.. టీఆర్ఎస్ ఇస్తానందా? అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి. సీటు కోసం కుట్ర జరిగిందా? వాస్తవానికి, మేడ్చల్ అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ టికెట్ కోసం పోటీపడేవారిలో కేఎల్లార్ పేరు మొదటి వరుసలో ఉంటుంది. మాజీ ఎమ్మెల్యేగా, నియోజకవర్గ ఇన్చార్జిగా ఆయన పేరును పరిశీలించిన తర్వాతే ఇతరుల పేర్ల జోలికి వెళ్లాల్సి ఉంటుంది. అయితే, ఆ సీటు కేఎల్లార్‌కు రాకుండా పీసీసీ ముఖ్యులతో కలిసి కొందరు స్థానిక నేతలు కుట్రపన్నారని కేఎల్లార్ వర్గీయులు ఆరోపిస్తున్నారు. అందులో భాగంగానే కేఎల్లార్‌ను పార్టీకి దూరం చేసే ప్రయత్నాలు చేశారని, అక్కడ టీఆర్ఎస్ నేతలను కలిశారు.. ఇక్కడ కలిశారంటూ ప్రచారం చేశారని చెబుతున్నారు. అయితే, కేఎల్లార్ మాత్రం గుంభనంగానే ఉన్నారని, ఎన్నికల్లో పోటీచేసేందుకు కూడా వెనక్కు తగ్గారని తెలుస్తోంది. పార్టీ అనుమానపు చూపులు తనను కలిచి వేస్తున్నాయని, ఒక్క సీటు కోసం తన వ్యక్తిత్వాన్ని కోల్పోవడం కన్నా అవసరమైతే ఎన్నికలకు దూరంగా ఉందామని కేఎల్లార్ తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించడం జిల్లా పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం కూడా అయింది. ఎట్టకేలకు సుఖాంతం కేఎల్లార్ వ్యవహారాన్ని కొంతకాలం పాటు గమనించిన కాంగ్రెస్ అధిష్టానం అసలు విషయాన్ని గమనించి చర్చలకు ఉపక్రమించడంతో ఎట్టకేలకు కథ సుఖాంతమయిందని తెలుస్తోంది. పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క కేఎల్లార్‌తో చర్చలు జరిపి, ఆయనకు మేడ్చల్ టికెట్‌పై గట్టి హామీ ఇప్పించారని, దీంతో శాంతించిన ఆయన గద్వాల ఎన్నికల ప్రచారానికి వెళ్లారనే చర్చ జిల్లా కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది. అగ్నికి ఆజ్యం పోసిన టీఆర్ఎస్ పార్టీలో అంతర్గత పరిస్థితులు ఇలా ఉంటే.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మేడ్చల్ అసెంబ్లీ స్థానానికి ఎవరినీ అభ్యర్థిగా ప్రకటించకపోవడం అగ్గికి ఆజ్యం పోసినట్టయింది. కేఎల్లార్ టీఆర్ఎస్లోకి వెళ్తారని, ఆయనకు టికెట్ ఇచ్చేందుకే సుధీర్‌రెడ్డిని పక్కనపెట్టారని ఆయన వ్యతిరేకులు ప్రచారం చేసేందుకు అస్త్రం లభించినట్టయింది. కాంగ్రెస్ పార్టీలో కేఎల్లార్ అసంతృప్తిగా ఉన్నారనే సమాచారంతో టీఆర్ఎస్ కూడా ఆయన్ను బుట్టలోకి వేసుకునే ప్రయత్నాలు చేసింది. ఈ విషయాలన్నీ ప్రసార మాధ్యమాల్లో వార్తలుగా మారడంతో ఆయన ఓ దశలో అసహనానికి, ఆవేదనకు గురికావాల్సి వచ్చింది. -
గుబులు రేపుతున్న గులాబీ రేకులు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి నేటికి నెలరోజులు. అభ్యర్థులను ప్రకటించిన నాటి నుంచి అసమ్మతి కుంపటి పెట్టిన ఆయా నియోజకవర్గాల నాయకులు పట్టు వీడడం లేదు. ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల్లో మినహా మిగతా చోట్ల అభ్యర్థుల పట్ల అసంతృప్తి పెల్లుబుకింది. చెన్నూర్‌లో సిట్టింగ్ అభ్యర్థి నల్లాల ఓదెలును మార్చడంతో అసమ్మతి తలెత్తగా, మిగతా చోట్ల సిట్టింగ్ స్థానాల విషయంలో అసంతృప్తి చెలరేగింది. అసంతృప్తి వాదులను చల్లబరిచేందుకు ఓవైపు మంత్రి కేటీఆర్ ప్రయత్నిస్తున్నప్పటికీ, రోజుకో కొత్త సమస్య ఉత్పన్నమవుతూనే ఉంది. స్థానిక మండల, నియోజకవర్గ నాయకుల అసమ్మతి రాగం వెనుక పెద్ద నాయకులే ఉండడం గమనార్హం. ఈ నేపథ్యంలో గుబులు రేపుతున్న అసమ్మతి నేతలతో అభ్యర్థులకు తంటాలు తప్పేలా లేవని పరిశీలకులు భావిస్తున్నారు. సుమన్‌కు షాకిచ్చిన ‘బ్రదర్స్’ చెన్నూర్ టీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్‌ను మార్చి మాజీ మంత్రి జి.వినోద్‌కు సీటివ్వాలని ఆయన సోదరుడు మాజీ ఎంపీ వివేక్‌తో పాటు నియోజకవర్గానికి చెందిన ఆయన అనుచరులు మంత్రి కేటీఆర్‌ను శుక్రవారం కోరారు. ప్రగతిభవన్‌లో కేటీఆర్‌ను కలిసిన వివేక్, వినోద్, చెన్నూర్ నుంచి వెళ్లిన వందలాది మంది అనుచరులు బాల్క సుమన్ స్థానంలో వినోద్‌కు సీటివ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే దానికి కేటీఆర్ సుముఖత వ్యక్తం చేయలేదు. తిరిగి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వినోద్‌కు ఎమ్మెల్సీ ఇవ్వడం జరుగుతుందని, ఎమ్మెల్యే టికెట్టు మార్చలేమని స్పష్టం చేశారు. ఇది సుమన్‌కు కొత్త షాక్. ఓదెలు ఎపిసోడ్ నుంచి తేరుకోక ముందే... చెన్నూర్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుకు నిరాకరించి పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌కు సీటిచ్చిన విషయం విదితమే. దీంతో ఓదెలు తీవ్ర అసంతృప్తికి గురవడం, స్వీయ గృహనిర్బంధం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. అనంతరం జైపూర్ మండలం ఇందరాంలో ఓదెలు అనుచరుడు గట్టయ్య పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడడంతో అనిశ్చిత పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఓదెలును ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్‌కు పిలిపించి మాట్లాడి భవిష్యత్తుపై హామీ ఇవ్వడంతో చల్లబడ్డారు. శుక్రవారం మందమర్రి, చెన్నూర్‌లలో ఓదెలుతో కలిసి సుమన్ ప్రచారం సాగించారు. ఓదెలు అండదండలు పుష్కలంగా ఉంటాయని భావిస్తున్న తరుణంలో వివేక్ బ్రదర్స్ హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో చేసిన హంగామా మింగుడుపడని అంశమే. జిల్లా పరిషత్ వైస్‌చైర్మన్ మూల రాజిరెడ్డి ప్రస్తుతం వివే క్ సోదరులకు అండగా నిలిచినట్లు సమాచారం. బోథ్, ముథోల్‌లలో నివురు గప్పిన నిప్పులా... బోథ్‌లో రాథోడ్ బాపూరావు స్థానంలో తనకు టికెట్టు ఇవ్వాలని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ ఇప్పటికే పలుమార్లు అధిష్టానం పెద్దలను కలిశారు. అయినా ఎటువంటి హామీ రాలేదు. దీంతో ప్రస్తుతానికి నగేష్ అనుయాయులు మౌనంగానే ఉన్నారు. అయితే బీఫారంలు జారీ చేసే సమయంలోనైనా అభ్యర్థిని మారుస్తారనే ధీమాతో ఉన్నారు. గురువారం తలమడుగు మండలంలో పూజలు చేసేందుకు దేవాలయానికి వచ్చిన బాపూరావుకు స్థానికుల నుంచి నిరసన సెగ తగలడం గమనార్హం. ప్రచార పర్వంలో ఎలా ఉంటుందో తెలియదు. ఈలోపు నోటిఫికేష్ వచ్చి బీఫారంలు ఇచ్చే సమయంలో మార్పులు తప్పవని అంచనాతో ఎంపీ మద్దతుదారులు ఉన్నారు. ముథోల్‌లో విఠల్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ మాజీ ఎంపీ సముద్రాల వేణుగోపాలచారి వర్గీయులు చాపకింద నీరులా తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. గాంధీ జయంతి సందర్భంగా విఠల్‌రెడ్డిని మార్చాలని గాంధీ విగ్రహానికి వినతిపత్రం ఇవ్వడం, చారి నిర్వేదంతో భైంసాలో మకాం వేయడం రాబోయే పరిణామాలను సూచిస్తున్నాయి. మిగతా స్థానాల్లో... బెల్లంపల్లిలో ఇప్పటికే తిరుగుబాటు జెండా ఎగరేసిన మాజీ ఎమ్మెల్యే శ్రీదేవితో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ప్రభుత్వం వచ్చిన తరువాత తగిన గుర్తింపు ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చినా, ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం చిన్నయ్య మార్చాలనే పట్టుపడుతున్నారు. బెల్లంపల్లి టికెట్టు ఆశించి భంగపడ్డ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రవీణ్‌కుమార్ ప్రస్తుతం చెన్నూర్‌లో బాల్క సుమన్ వెంట ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆయన అనుచరులు మాత్రం బెల్లంపల్లిలోనే ఉండి చిన్నయ్యకు వ్యతిరేకంగా లోపాయికారి కార్యక్రమాలు చేస్తున్నారని సమాచారం. మంచిర్యాలలో అభ్యర్థి నడిపెల్లి దివాకర్‌రావును వ్యతిరేకించిన ఎంపీపీ బేర సత్యనారాయణ బీఎస్పీలో చేరి అభ్యర్థిగా ప్రచారం ప్రారంభించారు. ఇక్కడ కొందరు ముఖ్య నాయకులు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా అంతర్గత కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. నిర్మల్‌లో గురుశిష్యుల స్నేహరాగం ఎందాకా..? గత ఎన్నికల్లో తనపై విజయం సాధించిన అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డికి పార్టీ టికెట్టు ఇచ్చారని కినుకతో ఉన్న శ్రీహరిరావు ఇటీవల మంత్రి కేటీఆర్ చొరవతో స్నేహగీతం ఆలపించారు. గతంలో గురుశిష్యులుగా కలిసి పనిచేసిన వీరు ప్రస్తుతం ఒకరింటికి ఒకరు వెళ్లి తామొక్కటే అనే సంకేతాలను పంపించే ప్రయత్నం చేశారు. టీఆర్ఎస్లో చేరి మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు తనను పట్టించుకోలేదనే అసంతృప్తితో ఉన్న శ్రీహరిరావు ఎంతమేరకు సహకరిస్తారనే భయం మాత్రం మంత్రి ఐకే రెడ్డి వర్గీయుల్లో ఉంది. -
వెన్నుపోటే!
నగర టీడీపీలో నలుగురు నేతలు.. ఆ నలుగురివీ సొంత అజెండాలు.. లాబీయింగ్‌లు.. రాజకీయ పైరవీలు.. కానీ ఆ నలుగురు నేతలు మాత్రం నెల్లూరు నగరంలో మంత్రి నారాయణ ఉంటే ఆయన వెంటే ఉండి అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు. వారు పరోక్షంగా మంత్రి నారాయణ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ వ్యక్తిగత అజెండాతో ముందుకుసాగుతున్నారు. ఆ నలుగురికి నగర టీడీపీ టికెట్ కావాలి. అందరికీ దీనికి సంబంధించి రకరకాల హామీలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో అందరూ మంత్రి నారాయణ అభ్యర్థిత్వాన్ని తెరపైన ఆమోదిస్తున్నట్లు కనిపిస్తున్నా తెర వెనుక మాత్రం తీవ్రంగా వ్యతిరేకించడంతోపాటు సహకరించడంపై ఇప్పుడే నీలినీడలు కమ్ముకున్నాయి. పర్యవసానంగా మంత్రి నారాయణకు సొంత పార్టీలోనే వెన్నుపోట్లు తప్పవనే ప్రచారం పార్టీలో బలంగా సాగుతోంది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: తెలుగుదేశం పార్టీ నెల్లూరు నగర టికెట్ విషయాన్ని పార్టీ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బరిలో ఎవరిని దింపాలన్న విషయంలో నాలుగు నెలల క్రితం వరకూ అయోమయంగా ఉన్న అధిష్టానంలో ఇప్పుడు ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. రానున్న ఎన్నికల్లో నగర టీడీపీ అభ్యర్థిగా మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ బరిలో ఉంటారని ఆ పార్టీలో బలంగా ప్రచారం సాగుతోంది. మంత్రి నారాయణ సైతం తన అభ్యర్థిత్వం ఖరారు అయిందనే సంకేతాలు పార్టీ శ్రేణులకు ఇవ్వడంతోపాటు ముఖ్యులకు తానే పోటీ చేస్తున్నానని చెప్పి ఆ మేరకు పనుల్లో మంత్రి నారాయణ బిజీగా ఉన్నారు. అయితే మంత్రినారాయణ కోటరీలో కీలక నేతలుగా ఉన్న టీడీపీ నగర ఇన్చార్జ్ ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, నగర మేయర్ అబ్దుల్ అజీజ్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు తాళ్లపాక అనురాధ ఈ టికెట్‌పైనే ఆశలు పెంచుకున్నారు. నాలుగు నెలల క్రితం వరకు మంత్రి ద్వారానే లాబీయింగ్ పర్వం నిర్వహించారు. మంత్రి కూడా అందరికీ టికెట్ ఇప్పిస్తాననే హామీతో వారిని ఇప్పటివరకు తనతో తిప్పుకోవడంతోపాటు ఆర్థికంగా కూడా కొందరికి లబ్ధి చేకూర్చారు. ఈ పరిణామాల క్రమంలో నలుగురు నేతల ఆశలు అడియాశలయ్యేలా టికెట్ ఇప్పిస్తానన్న గాఢ్ ఫాదర్ నేరుగా బరిలో నిలవనుండడంతో వారు వ్యక్తిగత అజెండాతో ముందుకుసాగుతున్నారు. సొంత లాబీయింగ్‌పై దృష్టి సారించడంతోపాటు మంత్రి నెల్లూరు నగరంలో తమ సహకారం లేకుండా ఎలా గెలుస్తారో చూద్దాం అంటూ తమ వర్గీయుల వద్ద బహిరంగంగానే వాఖ్యానిస్తుండడం ఆ పార్టీలో కలకలం రేపింది. దీనికితోడు మంత్రి నగరంలో లేని సందర్భంలో నలుగురు నేతలు వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తుండడం గమనార్హం. కచ్చితంగా టిక్కెట్ వస్తుందనే ఆశ 2014 ఎన్నికల్లో టీడీపీ నగర అభ్యర్థిగా ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈక్రమంలో మంత్రి నారాయణ ముంగమూరుకు రాజధానిలో జరుగుతున్న నిర్మాణ పనుల్లో కొన్ని కాంట్రాక్ట్ పనులు, అలాగే నెల్లూరు నగరంలోనూ పలు పనులు కేటాయించారు. పనుల విలువ వందల కోట్లలో ఉంది. అలాగే ఇప్పుడు తాజాగా మళ్లీ భారీగా పనులు శ్రీధరకృష్ణారెడ్డికి అప్పగించనున్నారు. ఈక్రమంలో శ్రీధరకృష్ణారెడ్డి తనకు సహకరించాలనేది మంత్రి షరతుగా తెలుస్తోంది. అయితే అన్ని చోట్ల ఇన్‌చార్జ్‌లకు దక్కిన విధంగానే తనకు పనులు దక్కాయే తప్ప కొత్తగా ఏమీ రాలేదని, 2014 నుంచి నగరంలో పార్టీ అభ్యున్నతి కోసం తాను పనిచేస్తున్నానని, తనకు కచ్చితంగా టికెట్ వస్తుందని ముంగమూరు భరోసాతో ఉన్నారు. మేయర్ ధీమా నెల్లూరు నగర మేయర్ అబ్దుల్ అజీజ్ టికెట్ హామీతోనే మంత్రి నారాయణ ద్వారా వైఎస్సార్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ఈక్రమంలో ముస్లిం కోటాలో తనకు టికెట్ వస్తుందని ధీమాతో ఉన్నారు. అయితే ఇటీవల జరిగిన పరిణామాలతో మంత్రికి, అబ్దుల్ అజీజ్‌కు మధ్య దూరం పెరిగింది. రొట్టెల పండగ కార్యక్రమం కోసం నగరపాలక సంస్థ నుంచి నిధులు కేటాయించడంతోపాటు అన్నీ తానై 20 రోజులపాటు అక్కడే ఉండి పనులు చూసుకున్నారు. చివరికి అన్ని పనులు మంత్రి నారాయణ చేశారని భారీగా పత్రికా ప్రకటనలు గుప్పించడంతో అబ్దుల్ అజీజ్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. మరోవైపు లోకేష్ తనకు హామీ ఇచ్చారని టికెట్ తప్పక వస్తుందని ధీమాతో ఉన్నట్లు తెలుస్తోంది. నుడా చైర్మన్‌కు బాలకృష్ణ ఆశీస్సులు! నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి తనకు బాలకృష్ణ ఆశీస్సులు ఉన్నాయని, తప్పక అవకాశం వస్తుందని ప్రచారం చేసుకుంటున్నారు. అలాగే తాళ్లపాక అనురాధ తనకు మహిళా కోటాలో టికెట్ వస్తుందని భరోసాతో ఉన్నారు. ఈక్రమంలో మంత్రి కోటరీ నేతలంతా అభ్యర్థులే అయితే మంత్రి కోసం నగరంలో పనిచేసేదెవరనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. -
టీఆర్ఎస్ అభ్యర్థుల్లో అసమ్మతి గళం
టీఆర్ఎస్ అభ్యర్థులపై ఆశావహుల నిరసన కొనసాగుతూనే ఉంది. తమకు టికెట్ దక్కుతుందని ఆశించిన నేతలకు భంగపాటు కలగడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరిని అధిష్టానం సముదాయించే యత్నం చేసినా ఫలితం కనిపించడం లేదు. ఈనేపథ్యంలో బరిలో ఉన్న అభ్యర్థులకు తలనొప్పిగా మారింది. కొన్ని ప్రాంతాల్లో అసమ్మతి నేతలు కూటమిగా ఏర్పాటు కావడంతో ఆందోళన చెందుతున్నారు. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: అసమ్మతి నేతలు దారికి రావడం లేదు. అభ్యర్థుల ఖరారుతో అలకబూనిన ఆశావహులు.. అధిష్టానంపై నిరసన స్వరం వినిపిస్తూనే ఉన్నారు. ఒకట్రెండు చోట్ల ఒకరిద్దరు మెత్తబడినా.. చాలామంది ఇంకా శాంతించకపోవడంతో గులాబీ నాయకత్వానికి తలనొప్పిగా మారింది. టికెట్ ఆశించి భంగపడిన నేతలను బుజ్జగించే బాధ్యతను ఎంపీ/మంత్రులకు అప్పగించినా చిటపటలు ఆగడం లేదు. ఆఖరికి ప్రగతి భవన్లో మంత్రాంగం నెరిపినా ఫలితం లేకపోవడంతో హైకమాండ్‌కు ఏమీ పాలుపోవడం లేదు. దీంతో అసంతృప్తనేతలతో చర్చలకు ఫుల్స్టాప్ పెట్టి ప్రచారపర్వంలో నిమగ్నం కావాలని టీఆర్ఎస్ నాయకత్వం అభ్యర్థులకు సూచించింది. అయితే, ఆశావహులు కంట్లో నలుసులా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండడంతో అభ్యర్థులకు ఇబ్బందికరంగా మారింది. దీనికితోడు పార్టీ శ్రేణుల్లోనూ గందరగోళం ఏర్పడుతోంది. పలు నియోజకవర్గాల్లో గ్రూపులుగా చీలిపోవడంతో పార్టీలో సమన్వయం సాధించడం ద్వితీయ శ్రేణి నాయకులకు తలకు మించిన భారంగా మారుతోంది. రాజీనామాస్త్రంతో పరిష్కారం చేవెళ్లలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నంకు టికెట్ దక్కకపోవడంతో టీఆర్ఎస్ పార్టీకి గుడ్‌బై చెప్పి ఆయన.. ఏకంగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో పార్టీ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే కాలె యాదయ్యకు సొంత పార్టీలో వైరివర్గం లేకుండా పోయింది. రత్నం మాత్రం పార్టీని వీడడమేగాకుండా.. తనతోపాటు భారీ అనుచరగణాన్ని తనతోపాటు తీసుకెళ్లారు. ఇది పార్టీ గెలుపోటములను ప్రభావితం చేసే అవకాశం లేకపోలేదు. అసమ్మతి కూటమి షాద్‌నగర్‌లో విచిత్ర పరిస్థితి నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అభ్యర్థిత్వం ఖరారు కావడమే తరువాయి.. గులాబీదళంలో ముసలం పుట్టింది. టికెట్ ఆశించిన నేతలంతా ఒకతాటి మీదకు వచ్చి అంజయ్యకు వ్యతిరేకంగా తిరుగుబావుటా ఎగురవేశారు. వీర్లపల్లి శంకర్, అందె బాబయ్య నిరసనగళం వినిపించడమేగాకుండా.. ఆయనను వ్యతిరేకిస్తున్న వారితో జట్టు కట్టే ప్రయత్నం చేస్తున్నారు. పనిలోపనిగా కాంగ్రెస్‌లో ఉన్న లుకలుకలను కూడా అదనుగా మలుచుకొని అసమ్మతి కూటమిగా బరిలో దిగేందుకు ఎత్తుగడ వేస్తున్నారు. పార్టీలో నెలకొన్న అసమ్మతిని చల్లార్చేందుకు ఎంపీ జితేందర్‌రెడ్డి, మంత్రి లక్ష్మారెడ్డి నేరుగా రంగంలోకి దిగినా ఫలితం లేకుండా పోయింది. ఆఖరికి మంత్రి కేటీఆర్ కూడా అధికారిక అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేస్తున్నవారితో మాట్లాడినా మెత్తబడకపోవడం గమనార్హం. చాపకింద నీరులా.. ఇబ్రహీంపట్నంలోనూ అసమ్మతి రాజకీయాలకు తెరపడలేదు. తాజా మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని సొంతపార్టీలోని వైరివర్గం వ్యతిరేకిస్తోంది. ముఖ్యంగా గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కంచర్ల చంద్రశేఖరరెడ్డి పార్టీ వ్యవహారశైలిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయనతోపాటు ఎంపీపీ నిరంజన్‌రెడ్డి, సీనియర్ నేత శేఖర్‌గౌడ్ కూడా మంచిరెడ్డికి టికెట్ ఇవ్వడంపై తాడోపేడో తేల్చుకోవడానికి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నారు. అవసరమైతే స్వతంత్రంగా బరిలో దిగాలని కంచర్లపై ఆయన అనుచరగణం ఒత్తిడి తెస్తోంది. మేడ్చల్లోను అదే సీనూ.. మేడ్చల్, ఉప్పల్‌లోనూ అసమ్మతి రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. తాజా మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని పక్కనపెట్టిన అధిష్టానం.. ఎంపీ మల్లారెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. దీంతో మేడ్చల్ టికెట్ ఆశించిన హరివర్ధన్‌రెడ్డి, నక్కా ప్రభాకర్, సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కినుక వహించారు. అలాగే ఉప్పల్‌లో బేతి సుభాష్‌రెడ్డి అభ్యరిత్వంపై కార్పొరేటర్లు నిరసనగళం వినిపిస్తున్నారు. మరోవైపు రాజేంద్రనగర్‌లో తోకల శ్రీశైలం రెడ్డి, మహేశ్వరంలో కొత్త మనోహర్‌రెడ్డి, శేరిలింగంపల్లిలో సాయిబాబా, రాగం నాగేందర్, శంకర్‌గౌడ్ కూడా చిటపటలాడుతునే ఉన్నారు. ఎల్బీనగర్లో రామ్మోహన్‌గౌడ్‌కు వ్యతిరేకంగా కార్పొరేటర్లంతా తిరుగుబావుటా ఎగురవేశారు. ఈనేపథ్యంలో అసమ్మతినేతలను శాంతింపజేయడం అభ్యర్థులతో పాటు అధిష్టానానికి తలనొప్పిగా మారింది. కింకర్తవ్యం.. కల్వకుర్తిలో టీఆర్ఎస్ అభ్యర్థి జైపాల్‌యాదవ్‌కు ఇంటి సెగ తాకుతునే ఉంది. నాలుగు గ్రూపులుగా వీడిపోయిన ఆశావహులతో మంతనాలు జరిపిన మంత్రి కేటీఆర్.. దాదాపుగా అందరినీ శాంతింపజేశారు. అభ్యర్థి గెలుపే ధ్యేయంగా సర్దుకుపోవాలని హితోపదేశం చేశారు. స్థానిక నాయకుల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలను పరిష్కరించే బాధ్యతను మంత్రి జూపల్లి కృష్ణారావుకు అప్పగించారు. అయితే, మంత్రి పర్యటనలో మాత్రం ఐక్యతారాగం వినిపిస్తున్నా అంతర్గతంగా మాత్రం అసమ్మతిని కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి మాత్రం జైపాల్ యాదవ్ అభ్యర్థిత్వంతో కినుక వహించారు. ఇప్పటి వరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. 2014 ఎన్నికల్లో అటు జైపాల్‌యాదవ్‌ను.. ఇటు కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డిని వ్యతిరేకించిన నేతలంతా స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన కసిరెడ్డికి మద్దతుగా నిలిచారు. అనంతరం జరిగిన సమీకరణల నేపథ్యంలో ఆయన టీఆర్ఎస్ కండువా కప్పుకోవడం.. ఎమ్మెల్సీగా గెలుపొందడం చకచకా జరిగిపోయాయి. అయితే, తాజా పరిణామాలతో కసిరెడ్డి వర్గీయులు సందిగ్ధంలో పడిపోయారు. జైపాల్‌కు మద్దతుగా ప్రచారం చేసేది లేదని, ‘మీరు ప్రచారం చేసినా పార్టీని వీడుతాం’ అంటూ అల్టిమేటం జారీ చేస్తుండడం కసిరెడ్డిని ఆత్మరక్షణలో పడేసింది. ‘మా మాట వినకుంటే మీ దారి మీది.. మా దారి మాది’ అని తేల్చిచెబుతుండడంతో కష్టకాలంలో వెన్నంటి నిలిచిన అనుచరులను బుజ్జగించలేక సతమతమవుతున్నారు ఆయన. అవసరమైతే ఇండిపెండెంట్‌గా బరిలో దిగాలని ఒత్తిడి చేస్తున్నారు. దీనిపై కసిరెడ్డి అంతరం గం ఏమిటో మరికొన్ని రోజుల్లో తేలనుంది. -
అసమ్మతి సెగలు
సాక్షి, కొత్తగూడెం(ఖమ్మం): టీఆర్ఎస్లో అభ్యర్థుల ప్రకటన తర్వాత నెమ్మదిగా బయటపడిన అసమ్మతి ప్రస్తుతం తారాస్థాయికి చేరుకుంది. సిట్టింగులకే టీఆర్ఎస్ టికెట్లు ఇవ్వడంతో వివిధ పార్టీల నుంచి వచ్చిన ఆశావహులు భగ్గుమన్నారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసేందుకు బలమైన అభ్యర్థులు లేని సమయంలో పార్టీ నుంచి పోటీచేసిన వారు సైతం ఈసారి టికెట్లు ఆశించారు. అయితే సిట్టింగులకే టికెట్లు కేటాయించడంతో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రకటించిన అభ్యర్థులపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది. ఇప్పటికీ అసమ్మతి సెగలు చల్లారలేదు. గత ఆదివారం కొత్తగూడెంలో జరిగిన సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ అసమ్మతులు రెండు రోజుల్లో సర్దుకోవాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. అయినా అసంతృప్తి ఏమాత్రం తగ్గలేదు. ముఖ్యంగా ఇల్లెందు, పినపాక నియోజకవర్గాల్లో మరింతగా రగులుకుంటోంది. ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే ఊకె అబ్బయ్య సోమవారం టీఆర్ఎస్కు రాజీనామా చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. తుమ్మల అనుచరుడిగా ఉన్న అబ్బయ్య రాజీనామా చేసిన తెల్లవారే (మంగళవారం) ఇల్లెందు నియోజకవర్గంలోని టేకులపల్లి మండలంలో 30 మంది టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పార్టీకి మూకుమ్మడిగా రాజీనామా చేశారు. వీరంతా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ప్రకటించారు. వీరిలో పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు దళపతి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. గత ఎన్నికల్లో కోరం కనకయ్యకు శ్రీనివాస్ ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇల్లెందు నియోజకవర్గంలో రాజకీయం మరింత వేడెక్కింది. కాగా గతంలో సీపీఐ తరపున బూర్గంపాడు ఎమ్మెల్యేగా, ఇల్లెందు నుంచి ఒకసారి సీపీఐ తరపున, మరోసారి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా వ్యవహరించిన ఊకె అబ్బయ్య టికెట్ అంశం ప్రస్తావనకు రాకుండా బేషరతుగా కాంగ్రెస్‌లోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ∙పినపాక నియోజకవర్గంలో సైతం రాజకీయ సమీకరణలు మారే పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడి నుంచి బూర్గంపాడు మార్కెట్ కమిటీ డైరెక్టర్ వట్టం రాంబాబు, బూర్గంపాడు జెడ్పీటీసీ బుట్టా విజయ్‌గాంధీ టీఆర్ఎస్ టికెట్ ఆశించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుపై నియోజకవర్గ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత ఉందని, అభ్యర్థిని మార్చాలని వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు డిమాండ్ చేశారు. టికెట్ల ప్రకటన తరువాత కూడా వారు అదే పంథాలో ఉన్నారు. అభ్యర్థిని మార్చి వేరెవరికి టికెట్ ఇచ్చినా సహకరిస్తామని, పాయంనే బరిలో ఉంచితే ఓడిస్తామని చెబుతున్నారు. వట్టం రాంబాబు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అసమ్మతి కార్యకర్తలు సమావేశాలు, కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అవసరమైతే వట్టం రాంబాబును రెబల్ అభ్యర్థిగా బరిలో దించేందుకు సిద్ధమని ప్రకటించారు. దీంతో పినపాక నియోజకవర్గంలోనూ రాజకీయ పరిణామాలు మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరోవైపు టీఆర్ఎస్లో మొదటి నుంచి పనిచేస్తున్న ఉద్యమకారులు జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీతో పాటు అభ్యర్థులపై గుర్రుగా ఉన్నారు. ∙ఇక టీఆర్ఎస్ అభ్యర్థులకు ప్రధాన ప్రత్యర్థులైన కాంగ్రెస్ కూటమిలో పేర్లు ప్రకటించిన తర్వాత మరిన్ని రాజకీయ పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇల్లెందు, కొత్తగూడెం, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ల రేసులో పోటీ తీవ్రంగా ఉంది. కొత్తగూడెంలో మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, టీపీసీసీ సభ్యుడు ఎడవల్లి కృష్ణ మధ్య పోటీ తీవ్రంగా ఉండగా, సీపీఐ ఈ సీటును గట్టి గా కోరుతోంది. అశ్వారావుపేట నుంచి కారం శ్రీ రాములు, కోలా లక్ష్మీనారాయణ, ధన్‌జూనాయ క్, సున్నం నాగమణి, బాణోత్ పద్మావతి పోటీ పడుతున్నారు. ఇల్లెందు నుంచి చీమల వెంకటేశ్వ ర్లు, భూక్యా దళ్‌సింగ్‌నాయక్, బాణోత్ హరిప్రి య, డాక్టర్ రామచందర్‌నాయక్ పోటీలో ఉన్నా రు. అయితే కొత్తగూడెం, ఇల్లెందు నుంచి టికెట్లు రానివారు రెబల్‌గా అయినా సరే పోటీలో ఉండేందుకు రంగం సిద్ధం చేసుకుంటుండడంతో రాజకీయ వాతావరణం మరింతగా వేడెక్కుతోంది. -
ఊపుతగ్గని అసమ్మతి!
టీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి లొల్లికి ఫులిస్టాప్ పడడం లేదు. నాగార్జునసాగర్‌లో స్థానికత అంశాన్ని తెరపైకి తీసుకువచ్చిన ఎంసీ కోటిరెడ్డి.. ఇప్పటికే ప్రకటించిన నోముల నర్సింహయ్య అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు.ఈ నేపథ్యంలో సోమవారం నియోజకవర్గంలో మోటార్‌సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఒకవైపు అసమ్మతి నేతలపై ఆయా నియోజకవర్గాల అభ్యర్థులు అధిష్టానానికి ఎప్పటికప్పుడు తెలియ జేస్తూనే ఉన్నారు. అధిష్టానం కూడా వారిపై ఒకింత ఆగ్రహంగానే ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. బుజ్జగించండి..వినకపోతే వదిలేయండి.. మీకు పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెబుతున్నట్లు తెలుస్తోంది. సాక్షి ప్రతినిధి, నల్లగొండ : టీఆర్ఎస్లో అసమ్మతి రాజకీయానికి చెక్ ఎలా పెట్టాలా అని అధినాయకత్వం ఆలోచిస్తోంది. మరోవైపు కొన్ని నియోజకవర్గాల్లో అసమ్మతి నేతల ఊపు తగ్గడం లేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా పది నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించి మరో ఐదు రోజులైతే నెల అవుతుంది. ఇప్పటికే పలుచోట్ల అసమ్మతి నేతల సభలు, ర్యాలీలు జరిగాయి. ఆ నేతలను పిలిపించుకుని రాష్ట్ర నాయకత్వం మాట్లాడింది. బుజ్జగించే కాడికి బుజ్జగించింది. అయినా, కొన్నిచోట్ల ఇంకా అసంతృప్తి రగులుతూనే ఉంది. తొలి విడత ప్రచారంలో భాగంగా ఈ నెల 4వ తేదీన పార్టీ అధినేత కేసీఆర్ నల్లగొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొననున్నారు. దీనికోసం జిల్లా నాయకత్వమంతా నియోజకవర్గాల వారీగా మండలాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించి సమీకరణపై కసరత్తు చేస్తోంది. కాగా, అసమ్మతి నాయకులు ఇదే అదునుగా తమ ప్రభావాన్ని నాయకత్వానికి స్పష్టం చేసేందుకు రంగంలోకి దిగుతున్నారు. సాగర్‌లో సద్దుమణగని అసమ్మతి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఒక్క నాగార్జునసాగర్ నియోజకవర్గంలో మాత్రమే ఇంకా అసమ్మతి సద్దుమణగలేదు. సోమవారం నియోజకవర్గంలో ని అన్ని మండలాల్లో బైక్ ర్యాలీలు జరిగాయి. అన్ని మండలాల ర్యాలీలు నియోజకవర్గ కేంద్రం హాలియాలో కలుసుకుని హాలియా, నిడమనూరు మండలాల మీదుగా త్రిపురారం చేరుకున్నాయి. ఇక్కడ అసమ్మతి నాయకుడు ఎంసీ కోటిరెడ్డి బహిరంగ సభ నిర్వహించారు. స్థానిక నినాదంతో నియోజకవర్గ స్థానికులకే టికెట్ కేటాయించాలని, స్థానికేతరుడైన అభ్యర్థి నర్సింహయ్యను మార్చాలని ఈ బహిరంగ సభ డిమాండ్ చేసింది. దాదా అన్ని నియోజకవర్గాల్లో అసమ్మతి నేతల కార్యకలపాలు తగ్గాయి. అయితే, మిర్యాలగూడలో అసమ్మతి నేత అలుగుబెల్లి అమరేందర్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు నిర్ణయించుకుని నియోజకవర్గంలో సొంతంగా ప్రచారం కూడా చేస్తున్నారు. నల్లగొండలో మరో అసమ్మతి నేత చకిలం అనిల్ కుమార్ సైతం తాను ఈ సారి పోటీలో నిలబడతానని ప్రచారం చేస్తున్నారు. ఒకటీ రెండు నియోజకవర్గాలు అని కాకుండా అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులపై అసమ్మతితో ఉన్నారనుకుంటున్న నేతలందరినీ పలిపించి మరో మాట్లాడాలని జిల్లా నాయకత్వానికి అధి ష్టానం సూచించినట్లు పార్టీ వర్గాల సమాచారం. నల్లగొండ అసమ్మతిపై అధిష్టానం సీరియస్ నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గంలో అసమ్మతి నేతల కార్యకలాపాలపై అధినాయకత్వం ఒకింత సీరియస్‌గానే ఉందంటున్నారు. ఇక్కడ మాజీ ఇన్చార్జులు దుబ్బాక నర్సింహారెడ్డి, చకిలం అనిల్‌కుమార్, తిప్పర్తి జెడ్పీటీసీ సభ్యుడు తండు సైదులు గౌడ్ అభ్యర్థిని మార్చాలని సమావేశాలు పెట్టారు. చకిలం అనిల్‌కుమార్‌ను పిలిపించుకుని మాట్లాడినా, తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉంటా నని స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. మిగతా ఇద్దరి నేతలు ఇప్పటికైతే కామ్ అయిపోయారంటున్నారు. అయితే, అభ్యర్థిని మార్చే ప్రసక్తి లేదని తేల్చిచెప్పిన అధినాయకత్వం, నల్లగొండలో అసమ్మతి నేతలుగా ఉన్నవారు పార్టీలో లేరని, వారు పనిచేయరని అనుకుని ప్రచారం చేసుకోవాల్సిం దిగా అభ్యర్థి కంచర్ల భూపాల్‌రెడ్డికి సూచిం చారని ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా నల్లగొండలో పాగా వేసేందుకే టీఆర్ఎస్ అధినేత, ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ 4వ తేదీన నల్లగొండలో తొలి బహిరంగ సభలో పాల్గొంటున్నారని చెబుతున్నారు. అసమ్మతి నాయకులపై ఇప్పటికిప్పుడు సస్పెన్షన్ వేటు వేయడం వంటి నిర్ణయాల జోలికి పోకుండా, మరోసారి పిలిపించి మాట్లాడాలని, మాట వినకుంటే వారి ఖర్మ అని కూడా అధినాయకత్వం అభిప్రాయ పడిందని చెబుతున్నారు. కేసీఆర్ సభపైనే నేతల దృష్టి తొలి విడత ప్రచారంలో భాగంగా కేసీఆర్ పాల్గొం టున్న బహిరంగ సభను విజయవంతం చేయడంపైనే జిల్లా నాయకత్వం దృష్టి పెట్టింది. జిల్లా మం త్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, డాక్టర్ బూర నర్సయ్యగౌడ్, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, మండలిలో ప్రభు త్వ విప్ పల్లారాజేశ్వర్‌రెడ్డి, జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, రాష్ట్ర పార్టీ కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి తదితరులు సభను సక్సెస్ చేయడంపై దృష్టి పెట్టారు. బహిరంగ సభ నిర్వహణ ఇన్చార్జిగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి సన్నాహక సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఒకవైపు అక్కడక్కడా అసమ్మతి తలనొప్పులు ఉన్నా, ఆ ప్రభావం బహిరంగ సభా నిర్వహణపై పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పార్టీ శ్రేణులను కేసీఆర్ సభ విజయవంతం చేసేందుకు బిజీ చేశారు. -
చల్లారేదెన్నడు ?
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: వేగంగా దూసుకెళ్లాలని ఉవ్విళ్లూ రుతున్న ‘కారు’కు అసమ్మతి నేతలు కొరకరాని కొయ్యలా తయారయ్యారు. అసెంబ్లీ రద్దు చేసిన వెనువెంటనే బరిలో నిలిచే అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకెళ్లాలని భావించిన టీఆర్ఎస్కు ఈ అంశం మింగుడు పడటం లేదు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మక్తల్, కల్వకుర్తి, షాద్‌నగర్, అలంపూర్ నియోజకవర్గాల్లో అసమ్మతి చిచ్చు రగిలింది. దీంతో జిల్లాకు చెందిన మంత్రులు డాక్టర్ సి.లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావుతో పాటు టీఆర్ఎస్ ముఖ్యలైన మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు జోక్యం చేసుకోవడంతో అసమ్మతి గళం సద్గుమణిగినట్లు కనిపించింది. అయితే ఒక్క అలంపూర్ మినహా మిగతా చోట్ల పరిస్థితి మళ్లీ మొదటికొస్తోంది. ఈ నేపథ్యంలో గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. స్వయంగా పార్టీ అభ్యర్థులకు ఫోన్లు చేసి ‘అసమ్మతి నేతలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు ప్రచారంలో నిమగ్నం కావాలి.. ఏ ఒక్క గంటను కూడా వృథా చేయడానికి వీలులేదు. అసమ్మతి నేతలు లేరనుకుని ప్రచారంలో ముందుకు సాగండి’ అంటూ స్పష్టం చేశారు. దీంతో ఒక్కసారిగా పార్టీ తరఫున బరిలో నిలిచే అభ్యర్థులకు కొండంత ధీమా వచ్చినట్లయింది. అభ్యర్థులను మార్చేది లేదు.. విపక్షపార్టీలకు చిక్కకుండా వేగంగా దూసుకెళ్లాలని భావించిన టీఆర్ఎస్ అభ్యర్థులకు అక్కడక్కడా అసమ్మతి నేతలు బ్రేకులు వేస్తున్నారు. కొన్ని చోట్ల అభ్యర్థులను మార్చాలంటూ సభలు, సమావేశాలు ఏర్పాటుచేస్తుండగా.. మరికొన్ని చోట్ల ద్వితీయశ్రేణి నాయకత్వం పార్టీని వీడుతోంది. మక్తల్, కల్వకుర్తిలో అభ్యర్థులను మార్చాలనే డిమాండ్ కొనసాగుతుండగా.. అచ్చంపేట, దేవరకద్ర తదితర చోట్ల ద్వితీయశ్రేణి నేతలు పార్టీని వీడారు. అచ్చంపేట నియోజకవర్గానికి పలువురు కీలక నేతలు టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు వినికిడి. ఇలా ఉమ్మడి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లోని పరిస్థితులు పార్టీ అధిష్టానానికి చికాకు తెచ్చి పెడుతున్నాయి. నష్టనివారణకు... అభ్యర్థుల విషయమై అసంతృప్తి విషయంలో నష్టనివారణ చర్యల కోసం పార్టీకి చెందిన ముఖ్యులు కొంత కాలంగా విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా జిల్లాకు చెందిన మంత్రులు లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావుతో పాటు ప్రభుత్వంలోని కీలక మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు కూడా పలు దఫాలు అసంతృప్తులతో చర్చలు జరిపారు. పార్టీ తరఫున బరిలో నిలిచే అభ్యర్థుల విషయమై అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే టికెట్ ప్రకటించినట్లు నేతలకు సర్దిచెబుతున్నారు. అభ్యర్థుల విషయంలో సీఎం కేసీఆర్ తీసుకున్న తుది నిర్ణయానికి అందరూ కట్టుబడి పార్టీ కోసం పనిచేయాలని హితబోధ చేశారు. పార్టీలో ఉన్న వారికి ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా చూసుకుంటామని... భవిష్యత్‌లో మంచి అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. దీంతో కొందరు అసమ్మతి నేతలు వెనక్కి తగ్గారు. అయితే, కొన్ని చోట్ల మాత్రం వెనక్కి తగ్గినట్లే తగ్గి.. మళ్లీ నిరసనల గళం వినిపిస్తుండడం గమనార్హం. ఎంపీ జితేందర్‌రెడ్డిపై ఒత్తిడి ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఈనెల 5న వనపర్తిలో ఎన్నికల ప్రచార సభ ఏర్పాటుచేశారు. ఈ సభకు సీఎం కేసీఆర్ హాజరుకానుండగా.. అప్పటి లోగా అసమ్మతి పూర్తిగా తగ్గిపోవాలని ఆదేశాల మేరకు ముఖ్యనేతల సంప్రదింపులు ముమ్మరం చేశారు. మక్తల్ నియోజకవర్గ ం విషయంలో మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డిపై తీవ్ర ఒత్తిడి పెరుగుతున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అసమ్మతి గళం వినిపించే వారందరు కూడా ఎంపీ అనుచరగణంగా గుర్తింపు పొందారు. ఈ నేపథ్యం లో ఆదివారం మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన సభలో... పార్టీ అభ్యర్థి చిట్టెం రామ్మో హన్‌రెడ్డిపై అసమ్మతినేతలు చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలాన్ని రేపుతున్నాయి. కొందరు ఏకంగా చిట్టెంను వ్యక్తిగతంగా దూషించారు. పార్టీ తరఫున బరిలో నిలిచే అభ్యర్థిపై అసభ్యపదజాలాన్ని ఉపయోగించినా... పార్టీ ముఖ్యులు ఉపేక్షించడంలో మతలబు ఏమిటని చిట్టెం వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. అలాగే పార్టీ అధిష్టానం నుంచి కూడా ఒత్తిళ్లు పెరుగుతుండడంతో ఎంపీ జితేందర్‌రెడ్డి ఆగమేఘాల మీద సోమవారం మక్తల్ వెళ్లి... అసంతృప్తుల విషయమై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు కేసీఆర్ మాటే వేదంగా టీఆర్ఎస్ అభ్యర్థి చిట్టెం రాంమోహన్‌రెడ్డి విజయానికి అందరూ కృషి చేయాల్సిందేనని స్పష్టం చేశారు. కల్వకుర్తిలో తర్జనభర్జన రాజకీయ సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే క ల్వకుర్తి విషయంలో అసమ్మతి వర్గం తర్జనభర్జన పడుతోంది. రాబోయే ఎన్నికలకు పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ను అభ్యర్థిగా ప్రకటించారు. అయితే టికెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న కసిరెడ్డి నారాయణరెడ్డి వర్గం తీవ్ర అసంతృప్తితో ఉంది. కసిరెడ్డికి పార్టీ టికెట్ ఇస్తే సులువుగా గెలవొచ్చంటూ వారి అనుచరులు పేర్కొంటున్నా రు. ఈ విషయంలో మంత్రి కేటీఆర్ జోక్యం చేసు కుని ముఖ్యనేతలందరితో సంప్రదింపులు చేసి, పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని సూచిం చారు. ఇటీవల నాగర్‌కర్నూల్‌లో నిర్వహించిన బహిరంగసభలో కూడా మంత్రి కేటీఆర్ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. కానీ కసిరెడ్డి వర్గం మాత్రం ససేమిరా అంటోంది. స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో దిగాలని కొంత కాలంగా ఒత్తిడి చేస్తున్నా.. ఆయన వెనుకడుగు వేస్తున్నారు. ఇప్పటికీ కసిరెడ్డి వర్గం ఎక్కడా కూడా పూర్తిస్థాయిలో ప్రచారంలో పాల్గొనకుండా ప్రత్యేక సమావేశాలతో తర్జనభర్జనలు చేస్తుండడం గమనార్హం. -
సయోధ్య కుదురుతోంది!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఎన్నికల్లో టికెట్టు ఆశించి భంగపడ్డ టీఆర్ఎస్ నేతలను బుజ్జగించే కార్యక్రమం ఊపందుకొంది. టీఆర్ఎస్లో కీలకనేత, రాష్ట్ర మంత్రి కె.తారక రామారావు నియోజకవర్గాల వారీగా అసంతృప్తి నాయకులను పిలిపించి మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా గులాబీ శ్రేణులు పనిచేయాలని చెబుతూ అసంతృప్తి వాదులను బుజ్జగిస్తున్నారు. కలిసి పనిచేయలేకపోయినా... వ్యతిరేక శిబిరంలోకి వెళ్లకుండా ముందు చూపుతో కేటీఆర్ చేస్తున్న సయోధ్య పర్వం ఎంత మేర సఫలమవుతుందో చూడాల్సిందే. మంత్రి ఐకే రెడ్డితో శ్రీహరిరావు రాజీ గత ఎన్నికల్లో నిర్మల్ టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన శ్రీహరిరావుకు ఈసారి ఎన్నికల్లో చుక్కెదురైంది. బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసి శ్రీహరిరావుపై గెలిచిన అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి తరువాత టీఆర్ఎస్లో చేరి మంత్రి అయ్యారు. ఈ నాలుగేళ్లలో శ్రీహరిరావు దాదాపుగా కనుమరుగయ్యారు. పార్టీ కార్యకలాపాల్లో గానీ, అధికార కార్యకలాపాల్లో గానీ నిర్మల్‌లో ఆయనకు ఏమాత్రం ప్రాధాన్యత లభించలేదు. ఈ పరిస్థితుల్లో ఐకే రెడ్డికి అధికారికంగా టీఆర్ఎస్ టికెట్టు రావడంతో శ్రీహరిరావు జీర్ణించుకోలేకపోయారు. తన వర్గీయులతో సమావేశమై అసంతృప్తిని వ్యక్తపరిచారు. నిర్మల్‌లో కాంగ్రెస్‌తో తీవ్ర పోటీ నెలకొని ఉన్న నేపథ్యంలో శ్రీహరిరావు వల్ల జరిగే నష్టాన్ని ఊహించిన మంత్రి ఐకే రెడ్డి చొరవ తీసుకున్నారు. మంత్రి కేటీఆర్ ద్వారా శ్రీహరిరావును సోమవారం ప్రగతిభవన్‌కు పిలిపించి మాట్లాడారు. ఐకేరెడ్డితో సయోధ్య కుదిర్చి కలిసి పనిచేయాలని, టీఆర్ఎస్ను గెలిపించాలని సూచించారు. దీంతో ఇప్పటివరకున్న అసంతృప్తి టెన్షన్ పోయిందని నిర్మల్‌లో అధికార పార్టీ నేతలు ఉన్నారు. బెల్లంపల్లిలో మాజీ ఎమ్మెల్యే శ్రీదేవితో కేటీఆర్ బెల్లంపల్లి నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్య తీరు పట్ల, టీఆర్ఎస్ పార్టీ వైఖరి పట్ల మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి ఇటీవల మీడియా సమావేశంలో ధ్వజమెత్తారు. ఆమె కాంగ్రెస్ పార్టీలోకి వెళుతుందన్న ఊహాగానాలు కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలో సోమవారం శ్రీదేవిని ప్రగతిభవన్‌కు పిలిపించిన మంత్రి కేటీఆర్ పలు విషయాలు మాట్లాడినట్లు తెలిసింది. చిన్నయ్యను గెలిపించాలని, వచ్చే ప్రభుత్వంలో తగిన ప్రాధాన్యత లభిస్తుందని ఆయన సూచించారని సమాచారం. బెల్లంపల్లిలో నెలకొన్న పరిస్థితులను శ్రీదేవి మంత్రి కేటీఆర్‌కు వివరించినట్లు సమాచారం. అయితే చిన్నయ్యతో కలిసి పనిచేసేది మాత్రం అనుమానమేనని పార్టీ వర్గాలు చెపుతున్నాయి. చెన్నూర్‌లో ఓదెలుతో సయోధ్య... ‘రాజీ’ కాని రాజిరెడ్డి 105 మంది టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిన రోజు తన పేరు గల్లంతవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన చెన్నూర్ సిట్టింగ్ నేత నల్లాల ఓదెలును వినాయక చవితి రోజు ఇంటికి పిలిపించి కేసీఆర్ మాట్లాడి సర్ది చెప్పారు. ఇటీవల ఒకట్రెండు సమావేశాల్లో సుమన్‌తో కలిసి ఓదెలు పాల్గొన్నారు. ఇదే చెన్నూర్‌లో తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని జెడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి అలిగారు. ఆయన కాంగ్రెస్‌లోకి వెళ్లడం దాదాపుగా ఖరారైంది. ఈ నేపథ్యంలో రాజిరెడ్డిని ఇటీవల సుమన్ హైదరాబాద్‌కు తీసుకెళ్లి, టీఆర్ఎస్ భవన్లో కేటీఆర్‌తో కలిపించారు. టీఆర్ఎస్లో చేరిక కార్యక్రమంలో ఆయనను వేదికపైనే కూర్చోబెట్టారు. ఆ ఫొటోలను చెన్నూర్‌లో వైరల్ చేయించారు. అయితే తాను ‘రాజీ’పడలేదని, త్వరలోనే తన సత్తా చూపిస్తానని రాజిరెడ్డి ‘సాక్షి ప్రతినిధి’తో మాట్లాడుతూ చెప్పారు. ముధోల్‌లో మాజీ జెడ్పీ చైర్మన్‌కు బుజ్జగింత ముథోల్ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి విఠల్‌రెడ్డికి వ్యతిరేకంగా గళం విప్పిన జెడ్పీ మాజీ వైస్‌చైర్మన్ జుట్టు అశోక్‌తో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. విఠల్‌రెడ్డిని మరోసారి గెలిపించాలని సూచించారు. విఠల్‌రెడ్డి గెలిస్తే పార్టీలో, ప్రభుత్వంలో తగిన ప్రాధాన్యత లభిస్తుందని ఆయన వివరించినట్లు సమాచారం. కాగా ఈ నియోజకవర్గంలో ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి ఎస్.వేణుగోపాలచారి వర్గం కొంత అసంతృప్తితో ఉంది. త్వరలో చారితో కూడా మంత్రి మాట్లాడే అవకాశం ఉంది. అలాగే ఇతర నియోజకవర్గాల్లో సైతం అసంతృప్తిని చల్లార్చేందుకు మంత్రి నాయకులతో సమావేశమవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. -
ఆచి.. తూచి.. అడుగులు
సాక్షి, భూపాలపల్లి (వరంగల్): జిల్లాలో ఎన్నికల వేడి మొదలైనప్పటి నుంచి ప్రచారం జోరుగా కొనసాగుతోంది. కార్యకర్తలతో పాటు నాయకులు తమ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అయితే ప్రతీసారి ఎన్నికల ముందు వలసల ఉధృతి ఉంటుంది. వివిధ పార్టీల్లో చేరేవారు.. వెళ్లే వారితో సందడి వాతావరణం నెలకొంటుంది. ఈసారి జిల్లాలో ప్రస్తుతం అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. అడపాదడపా చేరికలు జరుగుతున్నా పెద్దగా ప్రభావం చూపించే స్థాయిలో లేవు. అధికార పార్టీలోని అసంతృప్త నేతలు సైతం కొంత ప్రా భల్యం కలిగి ఉండడంతో వారు వేరే పార్టీలోకి వెళ్లడానికి ఆసక్తి చూపడంలేదు. కార్యకర్తలు సైతం వారినే అంటిపెట్టుకుని ఉండడంతో వలసలకు అవకాశం లేకుండా పోయింది. రాష్ట్ర అసెంబ్లీ రద్దయి 25 రోజులు గడిచింది. అయినప్పటికీ జిల్లాలో చెప్పుకోదగిన రీతిలో వలసలు కనిపించడంలేదు. గ్రామపంచాయతీ ఎన్నికల ముందు నమోదైన వలసలతో పొల్చితే అసెంబ్లీ ఎన్నికల ముందు వలసలు అధికంగా ఉంటాయని రాజకీయ పరిశీలకులు ఊహించినా ఆ స్థాయిలో లేవు. కార్యకర్తలు, నాయకులు అందరూ గోడమీద పిల్లుల మాదిరిగా వేచిచూసే ధోరణిలో ఉన్నారు. ఇప్పటివరకు టీఆర్ఎప్ పార్టీ మినహా ఇతర ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులపై స్పష్టత ఇవ్వలేదు. ఇంకా ఎన్నికల షెడ్యూల్ వెలువడకపోవడంతో పార్టీలు మారాలనుకున్న చాలా మంది ఆలోచనలో పడ్డారు. అభ్యర్థుల ప్రకట న తర్వాతే బలాబలాలను బేరీజు వేసుకుని పార్టీ మారడమా? లేక ఉన్నదాంట్లోనే కొనసాగడమా? అనేది నిర్ణయించుకోవడానికి వేచిచూస్తున్నారు. అసమ్మతి ఉన్నా.. పటిష్టమే.. జిల్లాలోని ములుగు, భూపాలపల్లి నియోజకవర్గాల్లో అధికార పార్టీ టికెట్లు ప్రకటించిన తర్వాత అసమ్మతి బెడద పెరిగింది. చందూలాల్‌కు ములుగు నుంచి టీఆర్ఎస్ టికెట్ ప్రకటించగా.. ఏజెన్సీ ప్రాంతం కావడం.. ఆదివాసీల ప్రాభల్యం అధికంగా ఉండడంతో వారికే అవకాశం కల్పించాలని ఆ పార్టీకి చెందిన అసమ్మతి నేతలు పట్టుపడుతున్నారు. అంతేకాకుండా మంత్రిగా ఉన్న చందూలాల్ తమను పట్టించుకోలేదని, ఆయన కుమారుడి అరాచకాలతో వేగలేకపోతున్నామని.. అభ్యర్థిని మార్చాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. తమలో ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించుకుంటామని.. పార్టీ మారే ఆలోచనే లేదని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు ములుగు కాంగ్రెస్‌లో ప్రస్తుతం రెండు వర్గాలు ఉన్నాయి. పొదెం వీరయ్య, సీతక్క నాయకత్వాల వారీగా విడిపోయి కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేస్తున్నారు. ప్రస్తుతానికి స్తబ్ధుగా ఉన్నా పార్టీ నుంచి టికెట్‌పై స్పష్టత వచ్చిన తర్వాత అసంతృప్తులు వేరే పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక భూపాలపల్లి విషయానికి వస్తే టీఆర్ఎస్ టికెట్ స్పీకర్ మధుసూదనాచారికి కేటాయించగా.. అదే పార్టీలోని నాయకుడు గండ్ర సత్యనారాయణరావు టికెట్ ఆశించి దక్కకపోవడంతో రెబల్‌గా బరిలో ఉంటానని స్పష్టంచేసి ప్రచారం సైతం ప్రారంభించారు. దీంతో నియోజకవర్గంలో పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి తమ నాయకుల వెంటే ఉంటున్నారు. మిగతా పార్టీలు తమ అభ్యర్థులను ఇంకా ప్రకటించకపోయినా కాంగ్రెస్, బీజేపీ తరఫున గండ్ర వెంకటరమణారెడ్డి, కీర్తిరెడ్డి విస్తృతంగా ప్రచారం చేపడుతున్నా ఆయా పార్టీల్లో పెద్దగా చేరికలు కనిపించడంలేదు. పుకార్లతో పరేషాన్.. ప్రస్తుతం అధికార టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మహాకూటమి ఏర్పాటుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. జిల్లా పరిధిలోని మంథని, భూపాలపల్లి, ములుగు, భద్రాచలం నియోజకవర్గాల్లో ఏ పార్టీకి సీటు కేటాయిస్తారనే విషయంపై స్పష్టత రాకపోవడం పార్టీ మారాలనుకునే వారిని డైలామాలో పడేసింది. ఉదా హరణకు మంథని నియోజకవర్గంలో బలమైన కాంగ్రెస్ నాయకు డు శ్రీధర్‌బాబు వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే పుకార్లు షికారు చేస్తున్నాయి. దీంతో తాను మంథని నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని చెప్పుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరి ణామాలతో నాయకులు సైతం ఎందుకైనా మంచిదని టికెట్లపై క్లారి టీ కోసం ఎదురుచూస్తున్నారు. మంథని నియోజకవర్గంలోని కాటా రం, మహాముత్తారం, మహదేవపూర్ మండలాల్లో టీఆర్ఎస్, కాం గ్రెస్ పార్టీల్లోని కార్యకర్తలు అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు మారుతున్నారు. అయితే ములుగు, భూపాలపల్లి నియోజకవర్గాల్లో మాత్రం ఇలాంటి పరిస్థితి కనిపించడం లేదు. ప్రధానంగా అభ్యర్థుల ప్రకటన తర్వాతే వలసల జోరు కనిపించే అవకాశం ఉంది. -
అధ్యక్షా.. మా సంగతేంది?
సాక్షి ప్రతినిధి, వరంగల్ : భిన్న దృక్పథాలు.. విభిన్న ధ్రువాలు అయినప్పటికీ గులాబీ జెండా నీడ కింద ఏకమయ్యారు. దళపతి ఒక్క ఈల కొడితే లాఠీలకు ఎదురొడ్డారు.. తెలంగాణ ఉద్యమ పొద్దుకు రణనినాదం అయ్యారు. పోరు మీదనే ఈడు గడిచిపోతున్నా.. వారసత్వపు ఆస్తులన్నీ కరిగిపోతున్నా.. లక్ష్యం ముద్దాడే వరకు వెనుకడుగు వేయకుండా నెత్తురు ధారవోశారు. అధికారంలోకి వచ్చినవేళ కానివాళ్లంతా ‘కారె’ క్కిపోతుంటే.. అధ్యక్షుల వారికి అన్ని తెలుసులే అని మనుసుకు సర్దిచెప్పుకుంటూ పార్టీని నడిపిస్తూ.. నడుస్తున్నారు. సర్వం త్యాగం చేసిన వాళ్లిప్పుడు ‘అధ్యక్షా.. మా సంగతేంది’ అని అడుగుతుండ్రు. ‘గుడిమల్ల’ అడుగుతున్నారు... వరంగల్ జిల్లాలో పార్టీకి సర్వం త్యాగం చేసిన వాళ్లలో గుడిమల్ల రవికుమార్ ఒకరు. ఉద్యమ సమయంలో తన లాయర్ వృత్తిని పార్టీ కోసమే ఉపయోగించారు. టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఒక్క పిలుపు ఇస్తే చాలు ట్రేడ్ యూనియన్ నాయకుడిగా వేల కొద్ది ఆటోలు, ఇతర వాహనాలను రోడ్డు మీద నిలబెట్టారు. ఉద్యమ సమయంలో పోలీసులు, కోర్టులు ఇలా అన్నీ తానై నడిపించారు. ఏనాడు పార్టీలో నాకు ఇది కావాలని అడగలేదు. టీఆర్ఎస్ అధినేత, అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను నమ్ముకుని పార్టీలో ఉన్నారు. కడియం శ్రీహరి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి, వరంగల్ లోక్‌సభ స్థానానికి రాజీనామా చేసిన అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో ఈ స్థానం నుంచి పోటీ చేయడానికి గుడిమల్ల రవికుమార్ సిద్ధమయ్యారు. అధిష్టానం కూడా ఆయన పేరును ఖరారు చేసింది. ఇంతలో ఏమైందో ఏమో.. ఆయనను పక్కనపెట్టి పసునూరి దయాకర్‌కు పార్టీ టికెట్ ఇచ్చింది. అనంతరం జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్.. రవికుమార్‌ను కలిసి ‘నీ రాజకీయ భవిష్యత్ నాది’ అని మాట ఇచ్చారు. ఈ నమ్మకంతో ‘అధ్యక్షా.. వరంగల్ తూర్పు టికెట్ నాకు ఇవ్వు’ అని గుడిమల్ల అడుగుతున్నారు. ‘తక్కెళ్లపల్లి’ ఆక్రోశం.... అప్పటి మాజీ మంత్రి యతి రాజారావుకు ముఖ్య అనుచరుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన తక్కెళ్లపల్లి రవీందర్రావు 2007లో కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. రెండేళ్ల పాటు జన రల్ సెక్రటరీగా కొనసాగారు. ఆ తర్వాత పాలకుర్తి నియోజకవర్గం ఇన్చార్జిగా అక్కడి గ్రామాల్లో పార్టీని బలోపేతం చేశారు. కుల వృత్తులు, చేతి వృత్తుల వాళ్లను ఉద్యమం వైపు నడిపించడంలో కీలకంగా పనిచేశారు. ఆయన శ్రమను గుర్తించిన కేసీఆర్.. పార్టీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యుడిగా నియమించారు. మానుకోట సంఘటనలో తక్కెళ్లపల్లి కీలకపాత్ర పోషించారు. జెడ్పీ చైర్మన్ పీఠం దక్కించుకోవడంలో క్యాంపులకు కూడా ఇన్చార్జిగా వ్యవహరించారు. మొదటి నుంచి పాలకుర్తి నియోజకవర్గంపై ఆశలు పెట్టుకున్నారు. 2014 ఎన్నికల్లో దాదాపు ఆయనకు టికెట్ ఖరారు అయినట్లే అయింది. కానీ.. తన రాజకీయ గురువు యతిరాజారావు కొడుకు సుధాకర్‌రావు కోసం త్యాగం చేశారు. ఈ ఎన్నికల్లో టికెట్ తనకే వస్తుందనే ఆలోచనతో పని చేసుకుంటున్న ఆయనకు ఎర్రబెల్లి దయాకర్‌రావు రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. ఈ నేపథ్యంలో కొంత ధిక్కార స్వరం అందుకున్న అయన ‘అధ్యక్షా.. ఎర్రబెల్లికి కొండా దంపతులు అంటే గిట్టదు.. ఆయనకు వరంగల్ తూర్పు టికెట్ ఇచ్చి నాకు పాలకుర్తి ఇవ్వండి’ అని అడుగుతున్నారు. ‘నాగుర్ల’ కల నెరవేరేనా... తెలంగాణ ఉద్యమంలో మొదటి తరం నేత నాగుర్ల వెంకటేశ్వర్లు. భూపాలపల్లి నియోజక వర్గంలోని మొగుళ్లపల్లి జెడ్పీటీసీ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలి చారు. టీఆర్ఎస్ జెడ్పీ ఫ్లోర్‌లీడర్‌గా పనిచేశా రు. జెడ్పీటీసీ సభ్యుడిగా కొనసాగుతూనే ఉద్యమకారుడిగా నియోజకవర్గంలో పార్టీని విస్తరిం చారు. ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న ఉద్యమంలో భూపలపల్లి, పరకాల నియోజక వర్గంలో విస్త్రతంగా పర్యటిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమకారులు, మద్దతుదారులను కూడగట్టారు. ఈ క్రమంలో 2014లో జరిగిన ఎన్నికల్లో అసెంబ్లీ సీటు ఆశించారు. పార్టీ అధినేత కేసీఆర్.. సిరి కొండ మధుసూదనచారికి అవకాశం కల్పిం చారు. ఆ సమయంలో నాగుర్ల వెంకటేశ్వర్లును టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలిపించుకుని అవకాశం కల్పిస్తానని బుజ్జగించారు. దీంతో పార్టీకి విథేయుడిగా ఉంటూ వచ్చారు. ఇటీవలే ఆయనకు రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. కానీ.. అది ఇప్పటివరకూ అమల్లోకి రాలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో భూపాలపల్లి లేదా పరకాల నుంచి తనకు అవకాశం కల్పించాలని ఆయన కోరుతున్నారు. సహోదర్‌రెడ్డి సంకల్పం... ముద్దసాని సహోదర్‌రెడ్డి సీనియర్ న్యాయవాది. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఎగసిన జ్వాల. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి హన్మకొండ అసెంబ్లీ స్థానానికి ఈయన పేరు వినిపించింది. ఆయన్ను కాదని మందాడి సత్యనారాయణరెడ్డికి టికెట్ ఇచ్చింది. సహోదర్‌రెడ్డి పార్టీ గెలుపుకోసం పని చేశారు. ఉద్యమం ఉధృతమవుతున్న రోజుల్లో తానే ముందుండి నడిపించారు. 2009లోను వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి మరోసారి ప్రయత్నించి విఫలం అయ్యారు. 2014లో ఆయనకు పరకాల నుంచి తొలి అవకాశం ఇచ్చారు. చల్లా ధర్మారెడ్డి చేతిలో ఓడిపోయారు. అనంతర జరిగిన రాజకీయ పరిణామాల్లో చల్లా ధర్మారెడ్డి టీఆర్ఎస్లో చేరారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ధర్మారెడ్డిని టీఆర్ఎస్ ఖరారు చేసింది. ఈ క్రమంలో తనకు అవకాశం కల్పించాలని పార్టీ అధిష్టానాన్ని సహోదర్‌రెడ్డి కోరుతున్నారు. గోవింద్ నాయక్ ఆవేదన.. ఈ యువ మాజీ ఉపాధ్యాయుడు టీఆర్ఎస్ పార్టీ తొలి నాళ్ల నుంచీ ఉన్నాడు. కేసీఆర్ పిలుపు అందుకుని 2004లో ఉద్యోగానికి రాజీనామా చేశారు. ములుగు ప్రాంతంలోని గోండు, కోయ, లంబాడాలను ఏకం చేసి ఉద్యమం వైపుకు నడిపించారు. అప్పట్లో ఇది మావోయిస్టు ప్రోత్సాహ ఉద్యమం అని పోలీసులు వెంబడించారు. అయినా ఊరూరా గులాబీ జెండాను ఎగురేశారు. 2004లో టీఆర్ఎస్ పార్టీ టికెట్ కోసం ప్రయత్నం చేస్తే టీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తులో భాగంగా కాంగ్రెస్‌కు పోయింది. పొదెం వీరయ్యకు కేటాయించారు. 2009 మహాకూటమి పొత్తు కారణంగా సీటు టీడీపీకి పోయింది. సీతక్కకు సీటు దక్కింది. అయినా టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూనే ఉన్నారు. ఎంపీటీసీ సభ్యుడుగా కొనసాగుతున్నారు. ఇప్పుడు గోవింద్ నాయక్ ‘ అధ్యక్షా... నా త్యాగాన్ని గుర్తించి ములుగు టికెట్ విషయంలో నా అభ్యర్థనను పరిశీలించండి.’ అని కోరుతున్నారు. -
గులాబీ పార్టీలో తగ్గని అసమ్మతి
రాష్ట్ర శాసనసభ రద్దుతో పాటు ముందస్తు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. జహీరాబాద్ మినహా జిల్లాలోని మిగతా నాలుగు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. పేర్లను ఖరారు చేసి పది రోజులు కావస్తున్నా పార్టీ నేతల్లో నెలకొన్న అసమ్మతి పర్వానికి తెరపడడం లేదు. టికెట్లు ఆశించి భంగపడిన నేతలు, అభ్యర్థులపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నాయకులు అసమ్మతి స్వరం వినిపిస్తున్నారు. అసమ్మతిని చల్లార్చేందుకు ఆపద్ధర్మ మంత్రి హరీశ్‌రావు ప్రయత్నాలు సాగిస్తున్నారు. పటాన్చెరు, నారాయణఖేడ్‌లో అసమ్మతి స్వరం తీవ్ర స్థాయిలో ఉండడంతో ప్రత్యేక దృష్టి సారించారు. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లా నుంచి రాష్ట్ర శాసనభకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఈ నెల 7న తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. జహీరాబాద్ స్థానంలో అభ్యర్థి పేరును ఖరారు చేయకుండా పెండింగ్‌లో పెట్టారు. అందోలు నియోజకవర్గంలో తాజా, మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్‌ను తప్పించి, ఆయన స్థానంలో పాత్రికేయుడు క్రాంతి కిరణ్‌కు అవకాశం ఇచ్చారు. జిల్లాలో వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించి పది రోజులు కావస్తున్నా, అసంతృప్తి సెగలు చల్లారడం లేదు. అభ్యర్థులను ప్రకటించిన వెంటనే జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ అసమ్మతి నేతలు స్వరం విప్పారు. పటాన్చెరు, నారాయణఖేడ్, సంగారెడ్డి, నర్సాపూర్‌లో పార్టీ ప్రకటించిన అభ్యర్థులను మార్చాలంటూ సొంత పార్టీ నేతల నుంచే డిమాండ్లు వినిపించాయి. ఉద్యమ సమయంలో పదవీ త్యాగం చేసిన తనకు టికెట్ ఎందుకు ఇవ్వరంటూ సంగారెడ్డిలో మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ ప్రెస్‌మీట్ నిర్వహించి తన ఆవేదన వెల్లగక్కారు. పటాన్చెరులో సపాన్‌దేవ్, గాలి అనిల్ కుమార్, కొలను బాల్‌రెడ్డి, జె.రాములు తదితర నేతలు ఉమ్మడి ప్రెస్మీట్లో అభ్యర్థిని మార్చాలని డిమాండ్ చేశారు. నారాయణఖేడ్‌లో పార్టీ అభ్యర్థి భూపాల్‌రెడ్డిని మార్చాలంటూ అసమ్మతి నేతలు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. నర్సాపూర్‌లో తాజా మాజీ ఎమ్మెల్యేకు సహకరించేది లేదని హత్నూర జెడ్పీటీసీ సభ్యులు జయశ్రీ తదితరులు తెగేసి చెప్పారు. అసమ్మతి వర్గంతో మంతనాలు.. పార్టీలో నెలకొన్న అసమ్మతిని అభ్యర్థులే పరిష్కరించుకోవాలని టీఆర్ఎస్ అధిష్టానం నుంచిసంకేతాలు అందాయి. అసమ్మతికి దారితీస్తున్న కారణాలను విశ్లేషించుకుని పనితీరు మార్చుకోవాల్సిందిగా హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ఈ నెల 8న హైదరాబాద్‌లో జరిగిన పార్టీ అభ్యర్థుల సమావేశంలో మంత్రి హరీశ్‌రావు పార్టీ వైఖరిని స్పష్టం చేసినట్లు తెలిసింది. పార్టీ సంకేతాలను సీరియస్‌గా తీసుకున్న సంగారెడ్డి, పటాన్చెరు, అందోలు అభ్యర్థులు అసంతృప్తి నేతలతో వరుసగా మంతనాలు జరుపుతున్నారు. నేరుగా వారికి ఇళ్లకు వెళ్లి ఎన్నికల్లో మద్దతు పలకాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు. నారాయణఖేడ్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులుగా మరోమారు అవకాశం దక్కించుకున్న తాజా మాజీ ఎమ్మెల్యేలు మాత్రం అసమ్మతి నేతలతో దూరం పాటిస్తున్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో రోజురోజుకూ విభేదాలు మరింత తీవ్రం అవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. అసమ్మతి నేతలతో హరీశ్ భేటీ.. పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గంలో అసమ్మతి స్వరం బలంగా వినిపిస్తున్న నేతలతో మంత్రి హరీశ్‌రావు మూడు రోజుల క్రితం హైదరాబాద్‌లోని తన నివాసంలో భేటీ అయ్యారు. సపాన్‌దేవ్, అనిల్‌కుమార్, బాల్‌రెడ్డి, జయరాములుతో పాటు కొందరు తాజామాజీ సర్పంచ్‌లు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. పార్టీకి నష్టం కలిగించే రీతిలో తొందరపాటు చర్యలకు పూనుకోవద్దని హరీశ్ అసమ్మతి నేతలకు సర్ది చెప్పినట్లు సమాచారం. త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసేందుకు సమయం తీసుకుంటానని హామీ ఇవ్వడంతో బుధవారం వరకు వేచి చూడాలని అసమ్మతి స్వరం వినిపిస్తున్న నేతలు నిర్ణయించుకున్నారు. సంగారెడ్డిలో అసమ్మతి నేతలతో సఖ్యత కోసం పార్టీ అభ్యర్థి చింతా ప్రభాకర్ సొంత ప్రయత్నాలు చేస్తుండగా, ఒకరిద్దరు నేతలతో త్వరలో హరీశ్ భేటీ కానున్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో అసమ్మతి నేతలతో సంప్రదింపుల బాధ్యతను పార్టీ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు మురళీయాదవ్‌కు అప్పగించారు. ఇప్పటికే ఒక దఫా అసమ్మతి నేతలతో హరీశ్ సమావేశం కాగా, మరోసారి పూర్తి స్థాయిలో భేటీ జరపాలని నిర్ణయించారు. జిల్లాలోని అసమ్మతి నేతల జాబితాపై ఇప్పటికే స్పష్టత వచ్చిందని, వారం రోజుల్లో పార్టీలో అసమ్మతి, అసంతృప్తి సమసిపోతుందని భేటీల ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తున్న నేత ఒకరు వ్యాఖ్యానించారు. పటాన్చెరు, నర్సాపూర్‌కు చెందిన ఇద్దరు అసమ్మతి నేతలు మాత్రం టికెట్ దక్కకుంటే వేరే పార్టీలోకి వెళ్తామంటూ సంకేతాలు ఇస్తున్నారు. -
టీఆర్ఎస్లో సమ్మతిరాగం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు ఒకేసారి 105 మంది అభ్యర్థులను ప్రకటించి దూకుడు ప్రదర్శించిన టీఆర్ఎస్ అధిష్టానం... అసంతృప్తులను కలుపుకుపోవడంలోనూ పక్కా వ్యూహంతో ముందుకెళ్తోంది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌కు ముందే పార్టీలో అసమ్మతిని పూర్తిగా తొలగించాలని భావిస్తోంది. నియోజకవర్గాలవారీగా పరిస్థితులను పరిశీలిస్తూ అవసరమైన రీతిలో వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఆయా సెగ్మెంట్లలో అసమ్మతి నేతలు, అసంతృప్తులను కలుపుకొని వెళ్లేలా కార్యాచరణ ప్రారంభించింది. టీఆర్ఎస్ ముఖ్య నేతలు కె. తారక రామారావు, టి. హరీశ్ రావు ఈ ప్రక్రియలో నిమగ్నమయ్యారు. ప్రత్యేక పరిస్థితులున్న నియోజకవర్గాల విషయంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా పరిస్థితులను చక్కబెడుతున్నారు. చెన్నూరు అసెంబ్లీ సెగ్మెంట్ విషయంలో బుజ్జగింపుల ప్రక్రియ విజయవంతమైంది. టికెట్ కోల్పోయిన తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు పార్టీపైనా, కేసీఆర్‌పైనా పూర్తి విధేయత ప్రకటించారు. టికెట్ కేటాయింపులో ఇబ్బందికర పరిస్థితులున్న నియోజకవర్గాల్లో చెన్నూరు తరహా విధానాన్ని అనుసరించాలని టీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోంది. అసమ్మతి నేతలు ఉండే నియోజకవర్గాలను పరిశీలించి మరో వారంలో సర్దుబాట్లు చేయాలని నిర్ణయించింది. ముందుగా అభ్యర్థులను ప్రకటించడం వల్ల అసమ్మతి నేతలతో చర్చించి ఒప్పించే సమయం టీఆర్ఎస్కు ఏర్పడింది. చర్చలతో మెజారిటీ అసమ్మతి నేతలు పార్టీ దారిలోకి వచ్చి అభ్యర్థుల కోసం పని చేసే అవకాశం ఉందని టీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోంది. భవిష్యత్తు అవకాశాల విషయంలో అసంతృప్తులకు భరోసా కల్పిస్తామని చెప్పి వారిని దారికి తెస్తోంది. ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించిన వారితో కేటీఆర్, హరీశ్‌రావు సంప్రదింపులు జరుపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం వస్తే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థులుగా ప్రకటించిన వారిపై ద్వితీయశ్రేణి నేతల్లో ఉండే అసంతృప్తిని పోగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అభ్యర్థులపై ద్వితీయశ్రేణి నేతలు చేసే ఫిర్యాదులను సావధానంగా విని సర్ది చెబుతున్నారు. అన్ని స్థాయిల్లోని పార్టీ శ్రేణులు, నేతలు ఎన్నికల్లో కలసి పని చేసేలా ఒప్పిస్తున్నారు. మరోవైపు కొన్ని నియోజకవర్గాల్లో విభిన్న పరిస్థితులు ఉన్నాయి. టీఆర్ఎస్ అభ్యర్థిత్వం దక్కని వారు సైతం పోటీలో ఉంటామని ప్రకటిస్తున్నారు. చివరి వరకు తమకే అవకాశం వస్తుందని చెబుతూ ప్రచారం సైతం కొనసాగిస్తున్నారు. వారి విషయంలో చెన్నూరు తరహాలో పిలిచి ఒప్పించే ప్రక్రియను మొదలుపెడుతున్నారు. కేసీఆర్ మాట శిరోధార్యం: నల్లాల ఓదెలు చెన్నూరు తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు గురువారం సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘సెప్టెంబర్ 6 నుంచి చెన్నూరు నియోజకవర్గంలో జరుగుతున్న అన్ని పరిణామాలపై సీఎంగారు నాతో చర్చించారు. 2001 నుంచి వెన్నంటి ఉన్న నాకు పార్టీలో సముచిత స్థానం ఉంటుందని భరోసా ఇచ్చారు. కొన్ని ప్రత్యేక పరిస్థితులున్న దృష్ట్యా చెన్నూరు విషయంలో ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. నా దగ్గర నామినేషన్‌కు కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో మొదటిసారి టికెట్ ఇచ్చి కోటీశ్వరుడిపై పోటీ చేసే అవకాశం కల్పించారు. మూడుసార్లు నియోజకవర్గ ప్రజలు గెలిపించారు. సీఎం కేసీఆర్ నా వెంట ఉన్న కార్యకర్తలందరికీ న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. కేసీఆర్ మాటే నాకు శిరోధార్యం. ఆయన మాట ప్రకారం నడుచుకుంటా. కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటే చెన్నూరు నియోజకవర్గంలో మళ్లీ టీఆర్ఎస్ గెలవాలి. అందుకే టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకుందామని కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా. కార్యకర్తలు తొందరపడకుండా పార్టీ వెంటే నడవాలని కోరుతున్నా’అని విజ్ఞప్తి చేశారు. -
నోట్ల రద్దుతో పన్ను ఉగ్రవాదం: యశ్వంత్ సిన్హా
న్యూఢిల్లీ: నోట్ల రద్దు నిర్ణయం పన్ను ఉగ్రవాదానికి దారి తీసిందని బీజేపీ అసమ్మతి నేత, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా విమర్శించారు. పేర్లు ప్రస్తావించకుండానే ప్రధాని మోదీని పిచ్చి తుగ్లక్‌గా పేరుమోసిన 16వ శతాబ్దపు ఢిల్లీ రాజు మహ్మద్ బిన్ తుగ్లక్తో పోల్చారు. ఆర్థిక వేత్త అరుణ్ కుమార్ రాసిన ‘డీమానెటైజేషన్ అండ్ ద బ్లాక్ ఎకానమీ’ అనే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో యశ్వంత్ సిన్హా మాట్లాడారు. పెద్దనోట్లను ఉపసంహరించడం వల్ల ఏ ప్రయోజనాలు ఉంటాయని మోదీ చెప్పారో వాటిలో ఏ ఒక్కటీ జరగలేదన్నారు. -
ఏలూరు టీడీపీలో అసమ్మతి జ్వాలలు
-
మళ్లీ అసమ్మతి వ్యతిరేక విద్వేష పర్వం
అవలోకనం కన్హయ్య, ఉమర్ ఖలీద్, గుర్మెహర్, షెహ్లా రషీద్ వంటి ధైర్యవంతులైన యువతీయువకులు హిందుత్వకు ఎదురు నిలుస్తున్నారు. వారేమీ తప్పు మాట్లాడటం లేదు. కశ్మీరీలతో చర్చను ప్రారంభించడంలో తప్పు ఏముంది? మనం మన ఆదివాసులు, దళితులతో చెడుగా ప్రవర్తిస్తున్నామనడంలో తప్పేముంది? అది నిజం. ‘దేశ వ్యతిరేకుల’పై మరో దఫా హింస, విద్వేషకాండ ప్రారంభమయ్యాయి. వారి అభిప్రాయాలతో ఏకీభవించినా, ఏకీభవించకున్నా మనం వారికి మద్దతు తెలపాలి, వారి తరఫున నిలవాలి. మోదీ ప్రభుత్వ నియంత్రణలోని ఢిల్లీ పోలీసులు కన్హయ్య కుమార్ దేశద్రోహ నేరానికి పాల్పడ్డాడని నిరూపించే ఆధారాలను చూపలేదని ఇటీవలి వార్తా నివే దికలను బట్టి తెలుస్తోంది. కన్హయ్య, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థి. ఏడాదిక్రితం జాతీయస్థాయి విద్వేషానికి గురైన వ్యక్తి. అతనెవరో తెలి యనివారికోసమే ఈ వివరాలు. ఆయనపై భారత వ్యతిరేక నినాదాలు చేస్తున్నా డనే అభియోగం మోపారు. ఇంతకూ అసలు భారత వ్యతిరేక నినాదం అంటే ఏమిటో చాలా మందికి తెలియదు. అజాదీ అనే పదానికి ఎన్నో రూపాలూ, అర్థాలూ ఉన్నా, ‘‘కశ్మీర్ కోరేది అజాదీ’’ అనే నినాదం భారత వ్యతిరేకమైనదని భావిస్తుంటారు. అది ‘దేశ వ్యతిరేకమైనదే’ అనుకున్నా దేశద్రోహం కాదు. నిర్ధి ష్టంగా హింసకు పిలుపును ఇస్తేనే ఆ వ్యక్తిపై దేశద్రోహ నేరాన్ని మోపవచ్చునని సుప్రీంకోర్టు విస్పష్టంగా చెప్పింది. టేపులలో కన్హయ్య గొంతు వినరాలేదని ఇప్పుడు చెబుతున్నారు. ఈ కారణంగా అతనిపై దేశద్రోహ నేరాన్ని ఆరోపించ కూడదు, అతనిని అరెస్టు చేసి, జైలుపాలు చేసి ఉండకూడదు. ఇక కోర్టులో అత నిపై దాడి చేసిన లాయర్లది క్రిమినల్ నేరం. జేఎన్‌యూ వ్యవహారంపై కఠోరమైన వ్యాఖ్యలను ట్వీట్ చేసిన ప్రధాని, స్మృతి ఇరానీలు అతనికి క్షమాపణ చెప్పాలి. జైలు నుంచి విడుదౖలñ నప్పుడు కన్హయ్య చేసిన ఉపన్యాసం అద్భుతమైనదని చాలా మంది అభిప్రాయం. అలా అనుకున్న వారిలో నేనూ ఒకడిని. బీజేపీకి అతను చాలా ప్రమాదకరమైనవాడు, అది అతనివైపు వేలెత్తి చూపకపోవడమే మంచిది అని నేను అప్పుడు రాశాను. అతనికి ఎదుటివారిని ఒప్పింపచేయగల భావ వ్యక్తీకరణా సామర్థ్యం ఉంది. రాహుల్ గాంధీ లాంటి నేతలు చేయలేని విధంగా అతను ప్రధాని నరేంద్ర మోదీ గంభీర పద గుంభనను సమర్థవంతంగా ఎదుర్కోగలడు. కన్హయ్య జైలు నుంచి వచ్చాక నేను అతన్ని కలుసుకున్నాను. మా సమావేశం అతని ఉపన్యాసంలో కనిపించిన దాన్ని ధృవీకరించింది. అతను ఆకర్ష ణీయమైన వ్యక్తి. భావ గాంభీర్యంగల, ఆలోచనాయుతుడైన, నమ్రతగల యువ కుడు. అతనికి తన గురించి మాట్లాడటం నచ్చదు. సమస్యలపై లోతుగా చర్చిం చాలని కోరుకుంటాడు. అతను విడుదలైన తర్వాత బీజేపీ విద్యార్థి విభాగం అతన్నిSవిస్మరించింది, పార్టీ సైతం అతనితో వాదోపవాదాల్లోకి దిగడం కంటే దూరంగా ఉండటాన్నే ఎంచుకుని తెలివైన పని చేసింది. మీడియా తన దృష్టిని అతనిపై నిలపకుండా నిలువరించింది. ఈ విషయానికి ఇక ముగింపు పలకాలనే అతనికి వ్యతిరేకంగా ఆధారాలేవీ లేవనే వార్తను లీక్ చేసి ఉండొచ్చు. కానీ దేశ వ్యతిరేకత సమస్య విశ్వవిద్యాలయాలలో తిరిగి తలెత్తింది. ఈసారి అమర జవాను కుమార్తె గుర్మెహర్ కౌర్ వంటి ఇతర యువతీయువకులు జాతీయ ప్రముఖులుగా మారారు. యుద్ధానికి వ్యతిరేకంగా ఆమె చేసిన ప్రకటన లపై క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ జోకులు వేసి హేళన చేశారు. ఈ దేశ వ్యతిరేక చర్చలోని ఇరు పక్షాలలో ఒక పక్షం మాత్రమే హింసాత్మకమైనది, హింసను అను మతించేది. అది ప్రభుత్వమూ, ఏబీవీపీలాంటి దాని మిత్ర బృందాలే. తమ చర్య లను మీడియా, సాధారణ ప్రజానీకమూ తీవ్రంగా వ్యతిరేకిస్తారని స్పష్టంగా తెలిసి కూడా విద్యార్థులు సమస్యను ఎందుకు కొని తెచ్చుకుంటున్నారు, తమ పైకి హింసను ఎందుకు ఆహ్వానిస్తున్నారు? ఇదే అసలు ప్రశ్న. అధిక సంఖ్యాకవాదపు, పచ్చిగూండాయిజపు భావజాలాన్ని ప్రతిఘటించడానికి నేడు భారతదేశంలో మరో వేదిక లేకపోవడమే అందుకు కారణం. బీజేపీ, హిందుత్వ గ్రూపులు జాతీయవాద ఎజెండాను గట్టిగా ముందుకు నెడుతున్నాయి. జాతీయగీతం, జాతీయ జెండా, కశ్మీర్, మావోయిజం లేదా మైనా రిటీల హక్కులు వంటి అంశాలపై వారు మరో అభిప్రాయాన్ని సహించరు. మిగతా పార్టీలు ఈ జాతీయవాదం చర్చ నుంచి పారిపోతాయి. వ్యక్తిహక్కులు, భావప్రకటనా స్వేచ్ఛ, పౌర స్వేచ్ఛలకోసం నిలబడటం వల్ల కలిగే ఎన్నికలపర మైన ప్రయోజనాలేవీ లేవని కాంగ్రెస్ భావిస్తుంది. ప్రజల మానసిక స్థితి మరింత ఎక్కువ జాతీయవాదానికి అనుకూలంగా ఉన్నదని కోర్టులు సైతం నిర్ధారణకు వచ్చినట్టుంది. సినిమా ప్రదర్శనకు ముందు జాతీయగీతాన్ని లేచి నిలబడి, వినడాన్ని తప్పనిసరి చేస్తూ ఇటీవల ఇచ్చిన తీర్పులు దాన్నే సూచిస్తున్నాయి. మీడియా ఒక వ్యాపారం కాబట్టి అది జనాభిప్రాయానికి తలవంచక తప్పదు. వార్తా పత్రికలు వాటి సంపాదకీయ పేజీలలో అసమ్మతి అభిప్రాయాలను అనుమ తిస్తాయి. కానీ టీవీకి ఇది నిజంగానే సాధ్యం కాదు. వార్తా చానళ్లు తమ రేటింగ్స్‌ను పెంచుకోవాలంటేæ మెజారిటీతో పాటే నిలవాలి. ప్రతిఘటనకు, అసమ్మతికి ఇక ఉన్న ఏకైక వేదిక విశ్వవిద్యాలయమే. కన్హయ్య, ఉమర్ ఖలీద్, గుర్మెహర్, షెహ్లా రషీద్ వంటి ధైర్యవంతులైన యువతీ యువకులు హిందుత్వకు ఎదురు నిలుస్తున్నారు. వారేమీ తప్పు మాట్లాడటం లేదు. కశ్మీరీలతో చర్చను ప్రారంభించడంలో తప్పు ఏముంది? మనం మన ఆది వాసులు, దళితులతో మనం చెడుగా ప్రవర్తిస్తున్నామనడంలో తప్పేముంది? అది నిజం. దేశంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లను ప్రవేశపెట్టిన మాజీ ఎన్నికల కమిషనర్ ఎంఎస్ గిల్‌తో మాట్లాడుతూ నేనొకసారి నేనీ విషయాన్ని ప్రస్తావించాను. ఒక విశ్వవిద్యాలయాన్ని గొప్పదిగా చేసేది ఏది? అని అడిగాను. కేంబ్రిడ్జిలో చదివిన ఆయన, ఆలోచనా స్వేచ్ఛను అనుమతించేదని చెప్పారు. ధైర్యవంతులైన మన విద్యార్థులు అడుగుతున్నది అలా ఆలోచించే హక్కునే. వారు గత ఏడాది దీన్నే కోరారు. అందుకుగానూ అప్పట్లో తిట్లూ, తన్నులూ తిన్నారు. నాడు దెయ్యంగా చిత్రించిన మనిషి చట్టవిరుద్ధమైనదేదీ చేయలేదనే వార్తను మోదీ ప్రభుత్వ పోలీ సులు చల్లగా లీకు చేశారు. ‘దేశవ్యతిరేకుల’కు వ్యతిరేకంగా మరో దఫా హింస, విద్వేషకాండ ప్రారం భమయ్యాయి. వారి అభిప్రాయాలతో ఏకీభవించినా ఏకీభవించకున్నా మనం వారికి మద్దతు తెలపాలి, వారి తరఫున నిలవాలి. - ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com -
చల్లారని అసమ్మతి
రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు మండ్యలో అంబి అభిమానురాలి ఆత్మహత్యాయత్నం రాజీనామా ఉపసంహరించుకోవాలని అంబిని కోరిన సీఎం ? అంబికి దేవెగౌడ ఫోన్‌కాల్ బెంగళూరు: రాష్ట్ర మంత్రిమండలి పునర్ వ్యవస్థీకరణ జరిగి 24 గంటలు గడిచినా అధికార కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి చల్లారడం లేదు. రెబెల్‌స్టార్‌గా పేరున్న శాండల్వుడ్నటుడు తాజా మాజీ గృహ నిర్మాణశాఖ మంత్రి అంబరీష్ ఏకంగా తన శాసనసభ సభ్యత్వాన్ని త్యజించడానికి సిద్దపడగా ఆయన బాటలో మరికొంతమంది నడవడానికి సిద్ధంగా ఉన్నారు. మరోవైపు పదవులు కోల్పోయిన మరికొంతమంది సిద్ధరామయ్యపై ధిక్కారస్వరం వినిపిస్తుండగా ఆయన అనుచరుల రాస్తారోకోలు, నిరసన కార్యక్రమాలు సోమవారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగాయి. పునర్వ్యవస్థీకరణలో భాగంగా అంబరీష్‌తో పాటు మొత్తం 14 మంది తమ మంత్రి పదవులు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘రెబెల్‌స్టార్’ తిరుగుబావుట ఎగురవేశారు. మంత్రిపదవిని తొలగించినందుకు నిరసనగా తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు డిప్యూటీ స్పీకర్ శివకుమార్‌రెడ్డికి ‘మండ్య శాసనసభ్య స్థానానికి రాజీనామా చేస్తున్నాను.’ అన్న ఒక్క వ్యాఖ్యతో పాటు అంబరీష్ సంతకం కలిగిన లేఖను డిప్యూటీ స్పీకర్ శివశంకర్‌రెడ్డికి ఆయన ఆప్తుడిగా పేరొందిన శ్రీనివాస్ అందజేశారు. అయితే నిబంధనలకు అనుగుణంగా రాజీనామాపత్రం లేదని పేర్కొంటూ అంబరీష్ రాజీనామాను శివశంకర్‌రెడ్డి తిరస్కరించారు. అంబి స్వయంగా వచ్చి రాజీనామా చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య కూడా అంబరీష్‌కు నేరుగా ఫోన్‌చేసి రాజీనామా ఉపసంహరించుకోవాలని కోరినట్లు సమాచారం. అయితే తాను రాజీనామా నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేది లేదని సిద్దుకు తేల్చినట్లు సమాచారం. అంతేకాకుండా అంబరీష్ తన అనుచరులతో సోమవారం సాయంత్రం ప్రత్యేకంగా సమావేశమై భవిష్యత్ రాజకీయాలపై చర్చించారు. ఈ విషయాలన్నింటపై నేడు (మంగళవారం) మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా ‘ముక్కుసూటిగా వ్యవహరించేవారు, నిజాయితీ కలిగిన వారు ప్రస్తుత రాజకీయాల్లో రాణించలేరు.’ అని అంబరీష్ భార్య సుమలత ఫేస్బుక్లో పోస్టు చేశారు. అంబరీష్‌తో పలువురి భేటీ మరోవైపు అంబరీష్ రాజీనామా విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు జేడీఎస్ పార్టీకి చెందిన వారు ఆయన్ను బెంగళూరులో కలుసుకున్నారు. ముఖ్యంగా మంత్రి పదవి దక్కనందుకు సిద్ధుతో పాటు పార్టీ హైకమాండ్‌పై గుర్రుగా ఉన్న యశ్వంతపుర ఎమ్మెల్యే సోమశేఖర్ ‘రెబెల్’తో ప్రత్యేకంగా అరగంటసేపు మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... రాజీనామాపై తొందర పడొద్దని సూచించినట్లు చెప్పారు. మరోవైపు జేడీఎస్ జాతీయాధ్యక్షుడు దేవేగౌడ అంబికి సోమవారం సాయంత్రం ఫోన్‌చేసి మాట్లాడారు. మీకు రాజకీయాల్లో మంచి భవిష్యత్తు ఉందని త్వరపడి నిర్ణయం తీసుకోకండని పేర్కొన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా దేవేగౌడ అనుమతితో ఆ పార్టీ ఎమ్మెల్సీ శరవణ నేతృత్వంలో కొంతమంది నాయకులు అంబరీష్‌ను ఆయన నివాసంలో కలిసి గంటకు పైగా చర్చించారు. అనంతరం శరవణ మీడియాతో మాట్లాడుతూ...‘రూ.100 కోట్లు ఇచ్చినా రాజీనామాను వెనక్కు తీసుకోనని అంబరీష్ స్పష్టం చేశారు. జేడీఎస్ పార్టీలోకి ఆహ్వానించాము. ఆలోచించి నిర్ణయం తీసుకుంటానన్నారు.’ అని పేర్కొన్నారు. అభిమానుల నిరసనలు మండ్య: మంత్రి వర్గం నుంచి అంబరీశ్‌ను తప్పించడంతో సోమవారం ఆయన తన ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేయడంతో ఆయన మహిళా అభిమానుల్లో ఆవేశం కట్టలు తెంచుకుంది. సోమవారం నగరంలోని జయచామరాజేంద్ర ఒడయార్ సర్కిల్లో ఓ మహిళా అభిమాని కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించింది. తాలూకాలోని బేవినహళ్లికి చెందిన కనకమ్మ అంబి వీరాభిమాని. ఉదయం అంబి మహిళా అభిమానులు, కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. వీరిలో అంబి వీరాభిమాని అయిన కనకమ్మ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. పోలీసులు సకాలంలో అక్కడకు చేరుకుని సపర్యలు చేపట్టారు. -
ముదురుతున్న చైర్ వార్
వేడెక్కిన నగరపాలక సంస్థ టీడీపీ పాలి‘ట్రిక్స్’ మేయర్‌ను దింపేందుకు అసమ్మతి వర్గం యత్నాలు తమకు మద్దతిచ్చి గద్దెనెక్కిస్తే నెలకు రూ.2 లక్షలు ఇస్తామని ప్రతిపాదన సీఎం వద్ద పంచాయితీకి సిద్ధమైన మేయర్ గ్రూపు ఎత్తుకు పై ఎత్తులతో నగరపాలక సంస్థ టీడీపీ రాజకీయం రసవత్తరంగా మారింది. మేయర్‌ను గద్దె దింపేందుకు అసమ్మతి వర్గం రూ.లక్షల్లో ఎరవేసింది. నెలవారీ ఆదాయంగా రూ.2 లక్షలు ఇస్తామంటూ ఆఫర్ ప్రకటించింది. ఈ ప్రతిపాదనతో మెజారిటీ కార్పొరేటర్లు అసమ్మతి వర్గానికి చేరువయ్యారు. ఈ విషయం తెలుసుకున్న మేయర్ వర్గం ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైంది. విజయవాడ సెంట్రల్ : ఐదేళ్లపాటు నగర పాలన బాధ్యతలను అప్పగించిన ప్రజల తీర్పును టీడీపీ అపహాస్యం చేస్తోంది. పార్టీ కార్పొరేటర్లు రెండు వర్గాలుగా చీలిపోయారు. అసమ్మతి వర్గం మేయర్ కుర్చీకోసం మామూళ్ల పర్వానికి తెరలేపగా.. మేయర్ వర్గం కుర్చీని కాపాడుకునేందుకు చర్యలు చేపట్టింది. మేయర్ చైర్‌ను దక్కించుకొనేందుకు అసమ్మతి వర్గం అధికారపార్టీ కార్పొరేటర్లకు మామూళ్ల ఎర వేసింది. తమ ప్యానల్ గద్దెనెక్కితే సహకరించిన కార్పొరేటర్లకు ఒక్కక్కరికి నెలకు రూ.2 లక్షల చొప్పున ఇస్తామంటూ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ ప్రతిపాదనతో మెజారిటీ (23మంది) కార్పొరేటర్ల మద్దతు కూడగట్టగలిగిందని సమాచారం. అసమ్మతి వర్గం కదలికలపై నిఘా పెట్టిన మేయర్ గ్రూపు ఈ విషయాన్ని పసిగట్టి, ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమైందని తెలిసింది. కోల్డ్ వార్‌కు కారణాలెన్నో... టీడీపీలో కొంతకాలంగా సాగుతున్న కోల్డ్‌వార్ బట్టబయలవడానికి బలమైన కారణాలే ఉన్నాయి. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు చేసిన ప్రతిపాదనను మేయర్ తోసిపుచ్చడం వల్ల వారే అసమ్మతి వర్గం కొమ్ము కాస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నగర పాలక సంస్థ వాటర్ట్యాంకులపై ప్రైవేటు కంపెనీల సెల్‌టవర్లు ఏర్పాటు చేసుకొనే అవకాశం కల్పించమనివారు కోరగా మేయర్ నిరాకరించారు. గతనెలలో జరిగిన సమావేశంలో వాటర్ ట్యాంకులపై ప్రస్తుతం ఉన్న అన్ని సెల్‌టవర్లను తొలగించాల్సిందిగా కౌన్సిల్లో తీర్మానం చేశారు. సెల్‌టవర్ కంపెనీలతో భారీ డీల్ కుదుర్చుకోగా మేయర్ గండికొట్టడంతో వారు గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది. వన్‌టౌన్ కాళేశ్వరరావు మార్కెట్లో ప్లాంట్ఫారాలపై వ్యాపారాలు చేసుకొనే వారి అద్దెలను పెంపుదల చేయాల్సిందిగా మేయర్ అధికారులను ఆదేశించారు. అద్దె పెంపుదల చేయొద్దన్న బుద్దా సూచనలను మేయర్ పట్టించుకోనట్లు తెలుస్తోంది. వీటన్నింటినీ మనసులో పెట్టకొనే మేయర్ కుర్చీకి ఎసరు పెట్టారనే వాదనలు వినిపిస్తున్నాయి. సీఎం అపాయింట్మెంట్ కోరిన మేయర్ వర్గం అసమ్మతి గ్రూపు, వారికి సహకరిస్తున్న నాయకుల వ్యవహారశైలిపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేసేందుకు మేయర్ వర్గం సిద్ధమైంది. ఈ మేరకు అపాయింట్మెంట్ కోరినట్లు తెలుస్తోంది. పార్టీ ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా కొందరు కుట్ర పన్నుతున్నారని ఆధారాలతో సహా సీఎంకు ఫిర్యాదు చేస్తారని సమాచారం. విజ్ఞానయాత్రకు వెళ్లిన కార్పొరేటర్ల బృందం మేయర్‌ను మార్చేద్దామని చండీఘర్లోనే వ్యూహరచన చేసిందని, ఇందులో భాగంగానే సంతకాల సేకరణ పేరుతో హంగామా చేస్తోందని మేయర్ వర్గం ఆరోపిస్తోంది. తలనొప్పిగా మారిన నగరపాలక సంస్థ టీడీపీ పాలి‘ట్రిక్స్’పై పార్టీ అధిష్టానం సీరియస్‌గా ఉందని తెలిసింది. -
సమ్మె విరమణపై జువెలర్స్ లో భిన్నస్వరాలు
♦ స్థానిక అసోసియేషన్స్ నుంచి వ్యతిరేకత ♦ చాలా ప్రాంతాల్లో కొనసాగుతోన్న సమ్మె న్యూఢిల్లీ/ముంబై: సమ్మె విరమణ ప్రక్రియపై జువెలర్స్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ప్రభుత్వపు హామీతో ఒక శాతం ఎక్సైజ్ సుంకం విధింపును వ్యతిరేకిస్తూ జువెలర్స్ చేపట్టిన నిరవధిక సమ్మెను విరమించాలని శనివారం ఆల్ ఇండియా అండ్ జువెలరీ ట్రేడ్ ఫెడరేషన్(జీజే ఎఫ్), ఆల్ ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ), జెమ్స్ జువెలరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (జీజేఈపీసీ) సంఘాలు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ చర్యను ఢిల్లీ-ఎన్సీఆర్, రాజ స్తాన్, ఉత్తర్‌ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లోని కొన్ని స్థానిక అసోసియేషన్స్ వ్యతిరేకిస్తున్నాయి. ఎక్సైజ్ సుంకాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సురీంధర్ కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వం తన చర్యను వెనక్కు తీసుకునేంతవరకు దేశ రాజధానిలో సమ్మె కొనసాగిస్తామని ప్రకటించారు. దేశవ్యాప్తంగా 40 శాతం షాపుల్లో మాత్రమే కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని, మిగిలినవి సమ్మెలోనే ఉన్నాయని జీజేఎఫ్ మాజీ ప్రెసిడెంట్ బచ్‌రాజ్ బమల్వా తెలిపారు. జువెలర్స్ డిమాండ్స్ పరిశీలనకు కమిటీ న్యూఢిల్లీ: ఎక్సైజ్ సుంకం విధింపును నిరసిస్తూ సమ్మె చేస్తోన్న జువెలర్స్ డిమాండ్స్ పరిశీలన కోసం కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అశోక్ లహ్రి అధ్యక్షత వహిస్తారు. ఇది 60 రోజుల్లో తన నివేదికను కేంద్రానికి సమర్పించాల్సి ఉంటుంది. ఎక్సైజ్ సుంకం వర్తింపు సహా రికార్డుల నిర్వహణ వంటి తదితర సంబంధిత అంశాలను ఈ కమిటీ పరిశీలించనున్నది. అన్ని జువెలరీ అసోసియేషన్స్ వాటి సమస్యలను కమిటీకి విన్నవించుకోవచ్చని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. -
అసంతృప్తులకు ఆహ్వానం
టీఆర్ఎస్ టికెట్ దక్కని వారి వైపు బీజేపీ చూపు అధికార పార్టీకిఝలక్ ఇవ్వాలనే ఆలోచన గ్రేటర్లో గెలుపే లక్ష్యంగా కమలనాథుల వ్యూహం హన్మకొండ : టీఆర్ఎస్లో రాజుకుంటున్న అసమ్మతిని అనుకూలంగా మలుచుకోవాలని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. ఈ మేరకు అధికార పార్టీలో టికెట్ రాని వారిని తమ వైపునకు తిప్పుకుని టికెట్ ఇచ్చి గెలిపించుకోవాలని బీజేపీ ఆశిస్తోంది. వివరాల్లోకి వెళితే.. టీఆర్ఎస్లోకి కాంగ్రెస్, టీడీపీ నుంచి ఇటీవల వలసలు పెరగడంతో మొదటి నుంచి పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న నాయకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే ఉన్న టీఆర్ఎస్ నాయకులతోపాటు కాంగ్రెస్, టీడీపీల నుంచి వచ్చిన వారు కార్పొరేటర్ల టికెట్లు ఆశిస్తున్నారు. దీంతో అధికార పార్టీలో టికెట్ల కోసం పోటీ పెరిగింది. అయితే టీఆర్ఎస్లో చోటు దక్కని వారిలో ప్రజల్లో పట్టున్న నాయకుడిని తమ వైపునకు లాక్కుని బీజేపీ నుంచి పోటీ చేయించి టీఆర్ఎస్ను దెబ్బ తీయాలనే వ్యూహంతో నాయకులు వ్యూహం రచిస్తున్నారు. కాగా, వలసలతో కాం గ్రెస్, టీడీపీలు డీలా పడడంతో టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయంగా బీజేపీ భావిస్తోంది. గతంలో బీజేపీ ఒకసారి మేయర్ పదవిని చేపట్టడంతోపాటు హన్మకొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా, అప్పటి హన్మకొండ పార్లమెంట్ నుంచి ఒక పర్యాయం ప్రాతినిథ్యం వహించిన పట్టు బీజేపీకే ఉంది. దీంతో పాటు ప్రధాని నరేంద్రమోదీపై ఉన్న అభిమానాన్ని, కేంద్రంలో అధికారంలో ఉండడం వంటి అంశాలను అనుకూలంగా మలుచుకోవడం ద్వారా గ్రేటర్ వరంగల్‌లో పట్టు నిలుపుకోవాలని చూస్తుంది. ఈ క్రమంలో టీఆర్ఎస్ రెబల్స్‌పై బీజేపీ నాయకులు కన్నేశారు. చోటుదక్కని వారికి ఆహ్వానం.. మొత్తం 58 డివిజన్లలో సోమవారం 26 మంది అభ్యర్థులతో, మంగళవారం 17 మంది అభ్యర్థులతో బీజేపీ జాబితాను విడుదల చేసింది. అయితే టీఆర్ఎస్లో చోటుదక్కని వారు తమ వద్దకు వస్తే తొలుత ప్రకటించిన జాబితాలో నుంచి కొంతమంది అభ్యర్థులను తప్పించి, వచ్చిన వారికి అవకాశం కల్పించి టీఆర్ఎస్కు ఝలక్ ఇవ్వాలనే ఆలోచనలో బీజేపీ వర్గాలు ఉన్నట్లు సమాచారం. ఉద్యమం నాటి నుంచి పనిచేస్తున్న నాయకుల మధ్య టీఆర్ఎస్లో పోటీ తీవ్రంగా ఉండగా, కొత్త వారి చేరికతో ఈ పోటీ మలుపులు తిరుగుతోంది. -
మెట్టు దిగారు
మేయర్‌గా శ్రీధరే కొనసాగుతారు స్పష్టంచేసిన టీడీపీ అసమ్మతి కార్పొరేటర్లు కలకలం రేపిన ‘సాక్షి’ కథనం విజయవాడ సెంట్రల్ : టీడీపీ అసమ్మతి కార్పొరేటర్లు స్వరం మార్చారు. ‘మేయర్‌గా కోనేరు శ్రీధరే కొనసాగుతారు. మా మద్దతు ఆయనకే. కావాలంటే రాసిస్తాం..’ అని స్పష్టంచేశారు. ‘టీడీపీలో చైర్వార్’ శీర్షికన శనివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం ఆ పార్టీలో తీవ్ర కలకలమే రేపింది. పార్టీ పరువు బజారున పడటంతో హైకమాండ్ దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది. ఫ్లోర్‌లీడర్ జి.హరిబాబు అధ్యక్షతన సెంట్రల్ నియోజకవర్గ కార్పొరేటర్లు శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. శ్రీకనకదుర్గ కో-ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ భూముల లేఅవుట్ రిలీజ్‌పై అవగాహన లేకపోవడం వల్ల మేయర్‌ను ప్రశ్నించామన్నారు. మేయర్‌ను తాము వ్యతిరేకించడం లేదని పేర్కొన్నారు. ఆయన నాయకత్వంలోనే పనిచేస్తామని స్పష్టం చేసుకోలేదు. గుట్టుచప్పుడు కాకుండా చేసేద్దామనుకున్న తీర్మానం బెడిసికొట్టింది. దీంతో తీర్మానాన్ని రద్దు చేయాలనే నిర్ణయానికి వచ్చారు. డీవియేషన్స్ లేవు లేఅవుట్ వ్యవహారంపై కమిషనర్ జి.వీరపాండియన్ నోరు విప్పారు. శనివారం తన చాంబర్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. సొసైటీ భూములకు సంబంధించి ఎలాంటి డీవియేషన్స్ లేవన్నారు. అందువల్లే తాను కౌన్సిల్‌కు ప్రతిపాదన పెట్టానని చెప్పారు. పదిశాతం కంటే స్థలం తగ్గినవారు భవిష్యత్‌లో ఇదే విధానాన్ని అమలు చేయాలని కోరితే ఏం చేస్తారన్న ప్రశ్నకు సమాధానమిస్తూ ముందే ఊహించలేం కదా అని బదులిచ్చారు. కౌన్సిల్ అత్యవసర సమావేశంలో తీర్మానాన్ని రద్దు చేస్తారంటూ సాగుతున్న ప్రచారాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లగా ‘చూద్దాం..’ అన్నారు. చర్యలు తీసుకోండి లేఅవుట్ వ్యవహారంలో అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు మల్లాది విష్ణు కోరారు. శనివారం కమిషనర్‌ను కలిసిన ఆయన ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. సొసైటీ పాలకవర్గం ప్రదక్షిణలు రాజకీయ పార్టీలు, అధికారుల చుట్టూ సొసైటీ పాలకవర్గం ప్రదక్షిణలు చేస్తోంది. లేఅవుట్లో ఎలాంటి అవకతవకలు లేవని తీర్మానాన్ని యథాతథంగా ఆమోదించాల్సిందిగా అధికార, ప్రతిపక్ష సభ్యులను వారు వేర్వేరుగా కలిసి కోరారు. ‘అల్లరి అయిపోయింది కాబట్టి తామేమీ చేయలేం..’ అని పాలకపక్షం సభ్యులు చెప్పినట్లు తెలుస్తోంది. పదిశాతంపైనే పట్టుబట్టాలని ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు భావిస్తున్నారు. కౌన్సిల్‌కు ప్రతిపాదన పెట్టడంతోనే తన పనైపోయిందని, తుది నిర్ణయం కౌన్సిల్‌దేనని కమిషనర్ స్పష్టం చేశారని తెలుస్తోంది. ఎవరికివారు చేతులెత్తేయడంతో సొసైటీ పాలకవర్గం అంతర్మథనంలో పడింది. -
టార్గెట్ మేయర్
టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి సెంట్రల్ ఎమ్మెల్యే వద్ద కార్పొరేటర్ల పంచాయితీ సీఎంను కలిసేందుకు సన్నాహాలు చిచ్చుపెట్టిన లే అవుట్ విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థ టీడీపీలో అసమ్మతి భగ్గుమంది. మేయర్ కోనేరు శ్రీధర్ వైఖరిపై ఆ పార్టీ కార్పొరేటర్లు గుర్రుగా ఉన్నారు. సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు వద్ద పంచాయితీ పెట్టారు. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. కౌన్సిల్లో మేయర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, కోటరీలోని కార్పొరేటర్లకు మాత్రమే ఆర్థిక లబ్ధిచేకూరుస్తున్నారన్నది అసమ్మతి కార్పొరేటర్ల ప్రధాన ఆరోపణలు. సెంట్రల్ నియోజక వర్గం కేంద్రంగా రాజుకున్న ఈ అసంతృప్తి అగ్గిని ఆసరాగా తీసుకొని మేయర్ చైర్‌కు ఎసరు పెట్టేందుకు అసమ్మతి వర్గం చురుగ్గా పావులు కదుపుతోందని సమాచారం. ఏమైందంటే.. కనకదుర్గ కో-ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్‌కు చెందిన 12.96 ఎకరాల భూమిని నగరపాలక సంస్థ స్వాధీనం చేసుకొని లే అవుట్ రిలీజ్ చేయాల్సిందిగా సొసైటీ సభ్యులు కోరారు. 1994 నుంచి ఈ ఫైల్ ఉడాలో పెండింగ్ ఉంది. నాటి నిబంధనల ప్రకారం 12.5344 (10శాతం) లే అవుట్ వదలాల్సి ఉండగా 1,088 సంట్లు (8.68శాతం) మాత్రమే వదిలారు. లే అవుట్ స్థలం తక్కువ వదలడంతో ఉడా ఫైల్ పెండింగ్ పెట్టింది. ఉడా రద్దయ్యి సీఆర్డీఏ ఏర్పడటంతో ఆ ఫైల్ కార్పొరేషన్‌కు చేరింది. సీఆర్డీఏ తాజా నిబంధనల ప్రకారం 14 శాతం లే అవుట్ ఓపెన్‌స్పేస్ వదలాలని తెలుస్తోంది. 8.68 శాతం మాత్రమే స్థలం ఉన్నప్పటికీ లే అవుట్ రిలీజ్‌కు కౌన్సిల్ ఆమోదముద్ర వేయడం వివాదాస్పదమైంది. హైడ్రామా ఈ నెల 9న కౌన్సిల్ జరిగింది. దీనిపై ముందురోజు కేశినేని భవన్లో కార్పొరేటర్లతో మేయర్ సమావేశం నిర్వహించారు. అందులో ఈ విషయంపై ఎలాంటి చర్చరాలేదు. సాయంత్రం 6 గంటల వరకు ఈ అంశం కౌన్సిల్ వద్దకు రాలేదు. 93 అంశాలపై చర్చించిన మేయర్ పది నిమిషాలు బ్రేక్ ఇస్తున్నా అంటూ బయటకు వెళ్లారు. ఆ తరువాత అదనపు అంశం 108/109గా దీన్ని చేర్చారు. ఇందులో ఏదో తేడా జరుగుతోందని పసిగట్టిన కొందరు టీడీపీ కార్పొరేటర్లు వాయిదా వేయాల్సింగా కోరారు. ఇందులో ఏం తేడా లేదని సర్దిచెప్పి హడావుడిగా ఆమోదించేశారు. 21 సంవత్సరాలు ఉడాలో పెండింగ్ఉన్న ఫైల్‌పై ఇరవై నిమిషాలు కూడా చర్చ జరక్కుండా ఆమోదించడం ఏమిటన్నది కొందరు టీడీపీ కార్పొరేటర్ల ప్రశ్న. కోట్ల రూపాయలు చేతులు మారడం వల్లే తీర్మానం చేశారని టీడీపీ కార్పొరేటర్ ఒకరు ‘సాక్షి’ వద్ద ఆరోపించారు. దీనిపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తున్నట్లు పేర్కొన్నారు. తిలాపాపం.. తలా పిడికెడు తిలాపాపం తలా పిడికెడు చందంగా ఇందులో టౌన్‌ప్లానింగ్ అధికారుల పాత్ర ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 14 శాతం లే అవుట్ ఓపెన్ స్పేస్‌కు గాను 8.68 శాతం మాత్రమే సొసైటీ వదలింది. మిగిలిన స్థలం మార్కెట్ వ్యాల్యూ ప్రకారం రూ.15 కోట్లు ఉంటుందని అంచనా. ఇంత భారీ మొత్తం మినహాయింపు ఇవ్వడం వెనుక అమ్యామ్యాల కథ నడిచినట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఎన్జీవో మాజీ నేత ఒకరు చక్రం తిప్పినట్లు భోగట్టా. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిగితే మరిన్ని అక్రమాలు వెలుగు చూసే అవకాశం ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద లేఅవుట్ రిలీజ్ వ్యవహారంలో టీడీపీలో చిచ్చుపెట్టింది. హడావుడిగా తీర్మానం ఎందుకు? విజయవాడ సెంట్రల్ : ‘కౌన్సిల్లో హడావుడిగా తీర్మానం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది. ఇందులో ఏదో తేడా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కౌన్సిల్‌ను అప్రదిష్టపాలు చేశారు’ అంటూ సెంట్రల్ నియోజక వర్గ టీడీపీ కార్పొరేటర్లు మేయర్ కోనేరు శ్రీధర్‌తో వాదనకు దిగారు. దీంతో ఆయన అవాక్కయ్యారు. బుధవారం రాత్రి చాంబర్లో మేయర్‌ను కలిసిన పలువురు మహిళా కార్పొరేటర్లు కనకదుర్గ కో-ఆపరేటివ్ హౌస్‌బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ లేఅవుట్ రిలీజ్‌కు సంబంధించి చేసిన తీర్మానంపైప్రశ్నించారు. కౌన్సిల్లో ఏం జరుగుతోందో తెలియకుండా తీర్మానం చేయాల్సిన అవసరం ఏం వచ్చిందని నిలదీశారు. ఈ వ్యవహారంపై తమకు అవగాహన లేదని, ఆఖరి నిమిషంలో పెట్టి తీర్మానం చేశారని పేర్కొన్నారు. దీనివల్ల పార్టీ ప్రతిష్టదెబ్బతిందని, వెంటనే తీర్మానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే తాము అధిష్టానం వద్దే తేల్చుకుంటామని అల్టిమేటం ఇచ్చారు. మేయర్ వర్గానికి చెందిన కొందరు కార్పొరేటర్లు సర్దిచెప్పేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. చాంబర్లో పెద్దగా అరుపులు వినిపించడంతో అక్కడున్న సిబ్బంది విస్మయం వ్యక్తంచేశారు. -
కాంగ్రెస్‌లో ఇంటిపోరు
చల్లారని అసమ్మతి భర్తీ కాని నామినేటెడ్ పోస్టులు రాహుల్ దృష్టికి సమస్య ఇలాగే ఉంటే భవిష్యత్తు ఉండదని ఆందోళన బెంగళూరు:అధికార కాంగ్రెస్ పార్టీ పాలనా పగ్గాలు చేపట్టి దాదాపు రెండేళ్లు కావస్తున్నా ఇప్పటికీ ఆ పార్టీలో అసమ్మతి చల్లారడం లేదు. కొంతమంది పార్టీనాయకులైతే ఏకంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పరమేశ్వర్ లక్ష్యంగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. రాష్ట్రంలో పార్టీ అధికారంలో రావడానికి తామెంతో కష్టపడినా అందుకు తగ్గఫలితం మాత్రం దక్కడంలేదని వాపోతున్నారు. ఈ విషయమై అమీతుమీకి సిద్ధమైన ఆ అసృతప్త నాయకులు ఏకంగా కాంగ్రెస్ యువరాజుకు లేఖరాసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ ఇంకా 40 శాతం కూడా పూర్తి కాలేదు. ఈ పదవుల పై ఆశలు పెట్టుకున్న నాయకులు ఎన్నోసార్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతోపాటు కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్‌కు తగిన స్థానం ఇవ్వాల్సిందిగా విన్నవిస్తున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు. పదవుల భర్తీ విషయమై సిద్ధు.... పరమేశ్వర్ ‘ఎవరికీ వారే యమునాతీరే’ అన్న రీతిలో వ్యవహరిస్తుండటం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని కాంగ్రెస్ పార్టీ నాయకులే చెబుతున్నారు. రాష్ట్రంలో ఈ నామినేటెడ్ పదవుల పై డీసీసీ అధ్యక్షులతో పాటు వారి అనుచరులు కన్నేసి ఉంచారు. పదవుల కోసం ఎదురు చూస్తూ కూర్చోవడం వల్ల లాభం లేదని భావించిన వీరంతా ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి తమ గోడును వెళ్లబోసుకుంటూ లేఖరాశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఆ లేఖలో... ‘2013లో కర్ణాటకలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం క్షేత్రస్థాయి కార్యకర్తలు ఎంతగానో శ్రమించారు. అందువల్లే దాదాపు పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది. అయితే క్షేత్రస్థాయి సిబ్బంది కష్టాన్ని విస్మరించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పరమేశ్వర్ వంటి కొంత మంది నాయకులే పదవులను అ నుభవిస్తున్నారు. కనీసం నామినేటెడ్ పోస్టులను కూ డా మాకు కట్టబెట్టడం లేదు. ఎన్ని సార్లు వారిని కలిసి విన్నవించినా రేపు మాపు అంటూ వాయిదా వేస్తున్నా రు. వారికి సమయం లేదేమో., మీరే కల్పించుకుని మా కష్టానికి తగిన ప్రతిఫలం దక్కేలా చూడండి. లేదంటే రానున్న బీబీఎంపీ, గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాం గ్రెస్ పార్టీ విజయం పై మేము భరోసా ఇవ్వలేం’ అని ఘాటుగా పేర్కొన్నారు. మరోవైపు మంత్రి మండలి కూడా పూర్తీ స్థాయిలో భర్తీ కాలేదు. ఇంకా నాలుగు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ పదవుల పై కన్నేసిన నాయకులే డీసీసీ అధ్యక్షుల లేఖల ఘటాన్ని తెరవెనక నుండి నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై కాంగ్రెస్ నాయకుడు ఒకరు మాట్లాడుతూ... ‘మంత్రి పదవుల పై కన్నేసిన నాయకులు సిద్ధరామయ్య ‘వాయిదా వ్యవహార శైలి’ పై కినుకు వహించారు. డీసీసీ అధ్యక్షుల ద్వారా హై కమాండ్ పై ఒత్తిడి తీసుకువచ్చి నామినేటెడ్ పదవుల భర్తీ సమయంలోనే మంత్రిమండలి విస్తరణకు కూడా అనుమతి పొందవచ్చునని భావిస్తున్నారు. అందువల్లే ఈ లేఖల ఘట్టాన్ని తెరవెనక ఉండి నడిపిస్తున్నారు.’ అని పేర్కొన్నారు. -
అసమ్మతి నేతలపై ఆప్ వేటు
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ అత్యున్నత విధాన నిర్ణాయక విభాగమైన రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) నుంచి.. ఆ పార్టీ వ్యవస్థాపక సభ్యులైన యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్లను తొలగించారు. వీరివురూ ఇక పార్టీ పీఏసీలో పనిచేయరని.. వారిద్దరికీ పార్టీకి సంబంధించి కొత్త బాధ్యతలు అప్పగిస్తామని పార్టీ జాతీయ కార్యవర్గం(ఈసీ) సమావేశం అనంతరం ఆప్ అధికార ప్రతినిధి కుమార్ విశ్వాస్ మీడియాకు వెల్లడించారు. ఆమ్ ఆద్మీ పార్టీ సమైక్య శక్తిగానే ఉందని.. వ్యక్తిగత అభిప్రాయాలు, వ్యక్తిగత విభేదాలు పార్టీ ఐక్యతపై ప్రభావం చూపబోవని.. ఢిల్లీ ప్రజలు, దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు తమ పార్టీ శాయశక్తులా కృషిచేస్తుందని పేర్కొన్నారు. వేటుకు కారణం ఏమిటి? ఢిల్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన అరవింద్ కేజ్రీవాల్ పార్టీ జాతీయ కన్వీనర్‌గా కొనసాగరాదని.. ఆ పదవి నుంచి వైదొలగాలని యోగేంద్ర, ప్రశాంత్‌లు గళం విప్పారు. దీనిపై పార్టీకి రాసిన లేఖలను మీడియాకు లీక్ చేయటంతో పాటు.. కేజ్రీవాల్ వ్యవహార శైలిపైనా బహిరంగంగా విమర్శలు గుప్పించటంతో వివాదం రాజుకుంది. ఆప్ నాయకత్వం ఏమంటోంది? యోగేంద్ర, ప్రశాంత్‌లు కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా కుట్రపన్నారని.. పార్టీని తమ కుటుంబం గుప్పెట్లో ఉంచుకోవాలని ప్రశాంత్ ప్రయత్నిస్తున్నారని కేజ్రీవాల్ వర్గం ప్రత్యారోపణలు గుప్పించటంతో వివాదం ముదిరింది. కాగా, పార్టీలో విభేదాలను శాంతియుతంగా పరిష్కరించుకుని.. సమైక్యంగా కొనసాగాలని ఆ పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఆకాంక్షిస్తూ అటు ఇంటర్నెట్లోని సామాజిక వెబ్సైట్లలోనూ.. ఇటు పార్టీ ఈసీ భేటీ వద్ద విజ్ఞప్తులు చేశారు. ఏం నిర్ణయం తీసుకున్నారు? బుధవారం ఢిల్లీలో సమావేశమైన ఆప్ జాతీయ కార్యవర్గం ఈ వివాదాలపై ఆరు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించింది. పీఏసీలో మొత్తం 21 మంది సభ్యులుండగా పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు మరో నేత హబుంగ్ పయెంగ్ ఈ భేటీకి హాజరు కాలేదు. సమావేశంలో యోగేంద్ర, ప్రశాంత్‌భూషణ్‌లు పీఏసీ నుంచి తప్పుకోవాలని సూచించగా.. అందుకు వారు నిరాకరిస్తూ ఓటింగ్ కోరారు. దీంతో కేజ్రీవాల్ సన్నిహితుడు, ఉప ముఖ్యమంత్రి మనీష్‌సిసోడియా.. వారిద్దరినీ పీఏసీ నుంచి తప్పించాలంటూ తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి అనుకూలంగా 11 ఓట్లు పోలవగా.. వ్యతిరేకంగా 8 ఓట్లు పోలయ్యాయి. సమావేశానికి అధ్యక్షత వహించిన కుమార్‌విశ్వాస్ ఓటు వేయలేదు. వారిద్దరి స్పందన ఏమిటి? ఈసీ నిర్ణయం తీసుకున్న తర్వాత యోగేంద్ర, ప్రశాంత్‌లు భేటీ నుంచి వెళ్లిపోయారు. పార్టీకి నిబద్ధుడైన కార్యకర్తలా తాను పని చేయటం కొనసాగిస్తానని యోగేంద్ర మీడియాతో పేర్కొన్నారు. ప్రశాంత్ స్పందిస్తూ.. మెజారిటీ నిర్ణయానిదే విజయమని వ్యాఖ్యానించారు. కన్వీనర్ పదవికి కేజ్రీవాల్ రాజీనామా.. తిరస్కరణ ఆప్ ఈసీ సమావేశానికి ముందు.. కేజ్రీవాల్ ఢిల్లీ సీఎంగా తనకు పని ఒత్తిడి పెరిగినందున.. పార్టీ జాతీయ కన్వీనర్ పదవికి రాజీనామా చేస్తున్నానంటూ సంబంధిత లేఖను పార్టీ కార్యదర్శికి పంపించారు. ఈ అంశంపై చర్చించిన ఈసీ ఆ రాజీనామాను తిరస్కరించింది. గత వారం జరిగిన ఈసీలో సైతం కేజ్రీవాల్ రాజీనామా చేయగా.. ఈసీ తిరస్కరించింది. -
అసమ్మతి లేదు
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎవరూ రాజీనామాలు చేయడం లేదు ప్రభుత్వానికి ఢోకా లేదు తుమకూరు : రాష్ర్టంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకాలేదని, మంత్రిమండలిలో ఎలాంటి అసమ్మతి లేదని రాష్ర్ట ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టంచేశారు. స్థానిక మహాత్మాగాంధీ క్రీడా మైదానంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మంత్రి సతీష్ జారకీహోళీ రాజీనామా పత్రాన్ని తనకు పంపించిన విషయంపై మాట్లాడుతూ నిజమేనని ధ్రువీకరించారు. ఈ విషయంపై తాను జారకీహోళీతో మాట్లాడినట్లు తెలిపారు. ఏ మంత్రులూ రాజీనామా చేయడం లేదని తేల్చి చెప్పారు. టీఆర్పీ కోసం పాకులాట వద్దు సమాజంలో ఉన్న అవినీతిని, అక్రమాలను వెలికి తీసి ప్రజలకు చాటి చెప్పేలా టీవీ చానళ్లు ఉండాలని, కేవలం టీఆర్పీ రేటింగ్స కోసం పాకులాడడం సబబు కాదని సిద్ధరామయ్య పేర్కొన్నారు. తుమకూరులోని బసవేశ్వర పాఠశాల మైదానంలో ప్రజా ప్రగతి పత్రికా సంపాదకుడు ఎస్.నాగన్న కొత్తగా ఏర్పాటు చేసిన ప్రగతి చానెల్‌ను ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... సాంకేతిక విప్లవం కారణంగా ప్రపంచంలో ఎక్కవ ఏమీ జరిగినా టీవీ చానెల్ ద్వారా తెలుసుకునేందుకు వీలవుతోందని అన్నారు. అయితే సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలను వదిలి ఇతరత్రాలను మళ్లీమళ్లీ చూపించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని అన్నారు. కార్యక్రమంలో సిద్ధగంగ మఠానికి చెందిన డాక్టర్ శివకుమారస్వామీజీ, జిల్లా ఇన్చార్జి మంత్రి టి.బి.జయచంద్ర, ఎమ్మెల్యేలు రాజన్న, రఫీక్ అహ్మద్, ఎమ్మెల్సీ హులినాయ్కర్, హెచ్.ఎం.రేవణ్ణ, జిల్లా అధికారి సత్యమూర్తి పాల్గొన్నారు. -
సెగ..
సిద్ధుకు ఇంటా బయట అసమ్మతి అర్కావతిపై జేడీఎస్, బీజేపీ పట్టు రాజీనామాలతో బెంబేలెత్తించిన మంత్రి! అదే బాటలో మరికొందరు మంత్రులు? బెంగళూరు : ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు శాసనసభ సమావేశాలకు ముందు అసమ్మతి సెగ తీవ్రతరమైంది. ఇప్పటి వరకు విపక్షాల నుంచి మాత్రమే ఉన్న సెగ ప్రస్తుతం స్వపక్షంలోనే మంత్రి సతీష్‌జారకిహోళి రాజీనామా రూపంలో బయట పడింది. ఇది ప్రస్తుతానికి చల్లారదని మరింతగా రాజుకుంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అర్కావతి డీ నోటిఫికేషన్ విషయంలో అటు బీజేపీతో పాటు జేడీఎస్ పార్టీ నేతలు కూడా సిద్ధరామయ్యకు విరుద్ధంగా ఒంటికాలిపై లేస్తున్నారు. ఎలాగైనా ఈ విషయంలో ఆయన్ను ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలని ఇరు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయంలో బీజేపీ ఏకంగా సిద్ధరామయ్య విరుద్ధంగా ప్రాసిక్యూషన్ (విచారణ)కు ఆదేశించాలని గవర్నర్ వజుభాయ్రుడాభాయ్ వాలా పై ఒత్తిడి తీసుకువస్తోంది. ఫిబ్రవరి 2 నుంచి ప్రారంభం కానున్న శాసనసభ సమావేశాల్లో ఇదే విషయాన్ని ప్రధాన అస్త్రంగా చేసుకుని సిద్ధరామయ్యతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి నిర్ణయించుకుంది. ఇదిలా ఉండగా సిద్ధరామయ్యకు స్వపక్షంలోనే కొత్త తలనొప్పి మొదలయ్యింది. నూతన శాఖలు కేటాయించాలని ఎప్పటి నుంచో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పై ఒత్తిడి తీసుకు వస్తున్న మంత్రులు తాజాగా రాజీనామా అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. దీనివల్ల త్వరలో జరగనున్న మంత్రి మండలి పునఃవిస్తరణలో తమకు నచ్చిన శాఖలు దక్కించుకోవడానికి అవకాశం ఉంటుందనేది వారి ఆలోచన. అందులో భాగంగానే సతీష్జారికిహోళి రాజీనామా చేసినట్లు సమాచారం. అదే దారిలో మరికొంతమంది అమాత్యులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జైన వర్గానికి చెందన అభయ్‌కుమార్ జైన్‌కు యువజన, క్రీడలతోపాటు మత్స్యపరిశ్రమాభివృద్ధి శాఖను కేటాయించడం పట్ల మొదటి నుంచి ఆయన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా పౌరసరఫరాలశాఖ మంత్రి దినేష్‌గుండూరావ్, సహకారశాఖ మంత్రి మహదేవప్రసాద్, వైద్య విద్యాశాఖను నిర్వహిస్తున్న శరణ్ప్రకాశ్పాటిల్తో పాటు ఐటీ,బీటీ శాఖ మంత్రి ఎస్.ఆర్పాటిల్లు కూడా రాజీనామ అస్త్రాన్ని ప్రయోగిస్తారని తెలుస్తోంది. గతంలో వీరంతా బహిరంగంగానే తమకు కేటాయించిన శాఖల పట్ల అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయాన్ని రాజకీయ విశ్లేషకులు ఇక్కడ గుర్తుచేస్తున్నారు. అటు విపక్షాల నుంచి ఎదురవుతున్న ‘అర్కావతి’ ఆరోపణలు నుంచి బయటపడటానికి సిద్ధరామయ్య ప్రయత్నిస్తున్న నేపథ్యంలో కొత్తగా స్వపక్షం నుంచే రాజీనామాల ఘట్టం తెరపైకి రావడం సిద్ధుకు కంటి పై కునుకులేకుండా చేస్తోంది. -
అదే అసమ్మతి
సీఎల్పీ సమావేశంలో మంత్రులపై విరుచుకుపడిన శాసనసభ్యులు మంత్రిమండలిని పూర్తిగా పునర్వ్యవస్థీకరించాలని డిమాండ్ విమర్శలకు కలత చెంది బయటికి వచ్చిన మంత్రి శివరాజ్ తంగడి బెంగళూరు : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాదిన్నర గడుస్తున్నా అసమ్మతి తగ్గలేదు. శాసనసభ్యులకు, మంత్రుల మధ్య ఉన్న భేదాలు శాసనసభాపక్షం సాక్షిగా మరోసారి శుక్రవారం బయటపడ్డాయి. మంత్రిమండలిని పూర్తిగా పునర్వ్యవస్థీకరించి సమర్థులైన నాయకులకు పదవులు కట్టబెట్టాలనే డిమాండ్‌పై ఎక్కువ శాతం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిలబడ్డారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడి విధానసౌధాలో శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరిగింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... సమావేశం ప్రారంభమైన వెంటనే విప్ పీఎం అశోక్ మాట్లాడుతూ... గ్రామపంచాయతీల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి మాత్రమే సమావేశంలో చర్చించాల్సిందిగా కోరారు. శాసనసభ్యులు ఎవరూ మంత్రులపై వ్యక్తిగత విమర్శలు చేయకూడదని సూచించారు. ఇందుకు సభ్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. తమ అభిప్రాయలకు విలువనివ్వకుండా ‘మీరు చెప్పడానికి మేం వినడానికి’ అన్నట్లు సీఎల్పీ నిర్వహించడం ఎందుకు అని తీవ్ర స్థాయిలో ప్రశ్నించారు. పరిస్థితి చేయిదాటిపోతోందని భావించిన సీఎం సిద్ధు ప్రతి సభ్యున్ని మాట్లాడటానికి అవకాశం కల్పిస్తామని.. అయితే ఎక్కువ సమయం తీసుకోకుండా తమ అభిప్రాయాలను సూటిగా చెప్పాలని సూచించారు. దీంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాట్లాడుతూ...‘ఎన్ని సీఎల్పీ సమావేశాలు జరిగినా మంత్రుల ప్రవర్తనలో మార్పు రావడం లేదు. అభివృద్ధి పనుల కేటాయింపు, సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక విషయంలో బీజేపీ, జేడీఎస్ నాయకులకు ఇచ్చిన మర్యాద కూడా స్వపక్షనాయకులైన మాకు ఇవ్వడం లేదు. వెంటనే మంత్రి మండలిలో ప్రక్షాలన చేపట్టి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు కార్యకర్తలకు అందుబాటులోలేని మంత్రులను తొలగించి సమర్థులైన నాయకులను మంత్రి మండలిలో స్థానం కల్పించాలి. లేదంటే పార్టీ మనుగడ కష్టం’ అని మెజారిటీ నాయకులు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా గత శీతాకాల సమావేశాల సందర్భంగా జరిగిన సీఎల్పీ సమావేశం వలే తాజా సమావేశంలో కూడా చిన్ననీటిపారుదలశాఖ మంత్రి శివరాజ్తంగడిపై యశ్వంతపుర ఎమ్మెల్యే సోమశేఖర్‌తోపాటు పలువురు నాయకులు విరుచుకుపడ్డారు. ఆయన ప్రతి పనికీ కమిషన్ వసూలు చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో సభ నుంచి కొద్ది సేపు బయటకు వచ్చిన ఆయన దాదాపు అరగంట తర్వాత తిరిగి సీఎల్పీకు హాజరయ్యారు. మరోవైపు రాష్ట్రంలో దార్మిక సంస్థలను ప్రభుత్వ పరిధిలోకి తీసుకువచ్చేలా వివాదాస్పద బిల్లు రూపొందించి న్యాయశాఖ మంత్రి టీ.బీ జయచంద్ర ప్రజల దృష్టిలో ప్రభుత్వానికి వ్యతిరేకత మూటగట్టించారిని...గతంలో కూడా ఇలాంటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడం వల్ల పార్టీ, ప్రభుత్వం తీవ్రంగా నష్టపోయిందని ఎమ్మెల్యేలు విరుచుకుపడ్డారు. ఇదిలా ఉండగా గ్రామపంచాయతీల పునర్వవస్థీకరణకు సంబంధించి నంజయ్యమఠ్, రామేష్కుమార్ కమిటీలు ప్రభుత్వానికి అందజేసిన నివేదికల ప్రకారం అధికార వికేంద్రీకరణకు గ్రామపంచాయతీల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని చాలా మంది నాయకులు అభిప్రాయడ్డారు. ప్రతి ఐదు కిలోమీరటర్ల పరిధిలో ఒక గ్రామపంచాయతీ ఉండటంతో పాటు సగటున 5,375 మంది జనాభా ఉండటం ఉత్తమమని తెలిపారు. దీని వల్ల ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 5,629 గ్రామపంచాయతీల సంఖ్య 6,068కు పెరుగుతుందని అందువల్ల సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనులు, నిధుల కేటాయింపులో పారదర్శకత పెరుగుతుందని కోళివాడ, మాలకరెడ్డి వంటి సీనియర్‌నాయకులతో పాటు మెజారిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. -
హరీశ్వర్ అలక!
⇒ గులాబీ గూటిలో అసమ్మతి కుంపటి! ⇒ సీఎం కేసీఆర్ ‘పదవి’ హామీ ⇒ నిలబెట్టుకోలేదని అసంతృప్తి ⇒ అధినాయకత్వం తీరుపై పెదవి విరుస్తున్న దిగువ శ్రేణి సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: గులాబీగూటిలో అసమ్మతి కుంపటి రాజుకుంటోంది. పదవుల పందేరంలో సీనియర్లను పక్కన పెడుతున్నారన్న అసంతృప్తి సర్వత్రా వ్యక్తమవుతోంది. కష్టకాలంలో పార్టీని ముందుండి నడిపించిన నేతలను తోసిరాజని.. ఎన్నికల వేళ కారెక్కిన నేతలకు అధిష్టానం పెద్దపీట వేస్తుందనే వాదన బలంగా వినిపిస్తోంది. టీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్వర్‌రెడ్డి పార్టీలో నెలకొంటున్న తాజా పరిణామాల పట్ల తీవ్ర ఆవేదనతో ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీని వీడి అందరికన్నా ముందు కారెక్కిన తనను ఆదరించకపోవడంపై హరీశ్వర్, ఆయన వర్గీయుల్లో నిరసన వ్యక్తమవుతోంది. ఈ పరిణామంతో అధికార పార్టీలో అసమ్మతి రాబోయే కాలంలో తీవ్రమయ్యే అవకాశాలుంటాయని రాజకీయవిశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా ఇప్పటికే హరీశ్వర్ పలుమార్లు కేసీఆర్‌ను కలిసినప్పటికీ ప్రయోజనం లేకపోవడం, పుండు మీద కారం చల్లినట్లుగా పార్టీలో ఇటీవల చేరినవారికీ పదవులు కట్టబెట్టడంపై ఆయన శిబిరంలో అసంతృప్తిని మరింత ఎగదోసినట్లు కనిపిస్తోంది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న టీడీపీపై తిరుగుబాటు చేసిన కొప్పుల.. టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అప్పట్లో జిల్లాలో ఆ పార్టీకి పెద్ద దిక్కు కూడా లేదు. హరీశ్వర్ రాకతో ఆ పార్టీకి జవసత్వాలు వచ్చాయి. ప్రస్తుత ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కూడా ఆయనతోపాటే కారెక్కారు. ఈ క్రమంలోనే పరిగి నుంచి శాసనసభ్యుడిగా గెలిస్తే మంత్రి పదవి కట్టబెడతానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగా, దురదృష్టవశాత్తు హరీశ్వర్ మాత్రం పరాజయం పాలయ్యారు. ఈ నేపథ్యంలో ఓడిపోయిన హరీశ్వర్‌ను ఓదార్చిన కేసీఆర్.. సీనియర్ నేతగా తగిన గుర్తింపు ఇస్తామని భరోసా ఇచ్చారు. శాసనమండలికి అవకాశం కల్పించడం ద్వారా మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం పరిశీలిస్తానని హామీ ఇచ్చినట్లు ఆయన వర్గీయులు చెప్పుకున్నారు. ముఖ్యమంత్రి హామీతో ఎమ్మెల్సీ పదవిపై గంపెడాశ పెట్టుకున్న హరీశ్వర్‌కు చుక్కెదురైంది. ఓడిపోయిన నేతలకు ఎమ్మెల్సీ పదవి ఇస్తే పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని, అలాకాకుండా ప్రభుత్వంలో కీలకభూమిక పోషించే ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పీఠానికి నామినేట్ చేస్తానని బుజ్జగించారు. ఈ పోస్టును ‘మీ కోసమే..’ సృష్టిస్తున్నానని చెప్పడంతో ఈ పదవిపై ఆశలు పెట్టుకున్న హరీశ్వర్‌కు రెండోసారి నిరాశే ఎదురైంది. ఈ నామినేటెడ్ పదవిని పార్టీ సీనియర్ నాయకుడు నిరంజన్‌రెడ్డికి ఇవ్వడంతో ఆయన ఆశలపై నీళ్లుచల్లినట్లయింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం ముఖ్యమంత్రిని కలవాల్సిందిగా సీఎం వ్యక్తిగత సహాయకుడి నుంచి సమాచారం అందినా హరీశ్వర్ పట్టించుకోలేదు. నమ్మినవారిని పట్టించుకోకుండా తెలంగాణ ఉద్యమ ద్రోహులకు పదవులు కట్టబెట్టడంపై అగ్గిమీద గుగ్గిలం అవుతున్న ఆయన వర్గీయులు.. తమ నేతకు పదవి రాకుండా ప్రత్యర్థివర్గం పావులు కదుపుతోందని ఆరోపిస్తున్నారు. ఇదిలావుండగా, మరికొందరు నేతలు సైతం గులాబీపార్టీ అధినాయకత్వం తీరుపై పెదవి విరుస్తున్నారు. కష్టకాలంలో పార్టీని నడిపించిన తమను కాదని.. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కార్పొరేషన్ పదవులు ఇవ్వాలని సీఎం నిర్ణయించడంపై నిరసనగళం వినిపిస్తున్నారు. -
అసమ్మతిచిచ్చు
మంత్రులు లేకుండా సీఎల్పీ సమావేశం నిర్వాహించాలన్న ఎమ్మెల్యేలు శీతాకాల సమావేశాల తర్వాత సమస్యలు వినడానికి ఓ వారం కేటాయిస్తానని సీఎం బుజ్జగింపు దీంతో వెనక్కు తగ్గిన ఎమ్మెల్యేలు రామనాథ్ రై, అంబరీష్లే ప్రధాన టార్గెట్లుగాఎమ్మెల్యేల విమర్శలు అర్ధాంతరంగా బయటకు వెళ్లిన మంత్రి రామనాథ్ రై బెంగళూరు: అధికార కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి స్వరం తగ్గడం లేదు. వారం వ్యవధిలో రెండు సార్లు శాసనసభ పక్ష సమావేశాలు (సీఎల్పీ) జరిపినా పరిస్థితిలో ఎటువంటి మార్పు రాలేదు. తాజాగా మంత్రులు లేకుండానే సీఎల్పీ నిర్వహించాలని ఎమ్మెల్యేలు పట్టుపట్టడం, సమావేశం నుంచి అర్ధాంతరంగా అమాత్యులు బయటకు రావాడం వంటి విషయాలను గమనిస్తే కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుందని ఆ పార్టీ నాయకులే పేర్కొనడం గమనార్హం. బెళగావిలోని సువర్ణ విధాన సౌధాలో బుధవారం ఉదయం కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష సమావేశం జరిగింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. సభ ప్రారంభమైన వెంటనే పలువురు ఎమ్మెల్యేలు మంత్రులపై విమర్శల వర్షం కురిపించారు. తమ నియోజక వర్గ పరిధిలో మంత్రులు పెత్తనాలు చెలాయిస్తున్నారని వాపోయారు. అంతేకాకుండా సీఎల్పీ సమావేశాల్లో మంత్రులపై ఆరోపణలు చేస్తున్నామనే విషయం మనసులో పెట్టుకుని తమ నియోజక వర్గంలోని సమస్యల పట్ల వారు స్పందించడం లేదన్నారు. అంతేకాకుండా అభివృద్ధి పనులకు నిధుల విడుదల్లో కూడా మోకాలడ్డుతున్నారని వాపోయారు. అందువల్ల వెంటనే మంత్రులను సీఎల్పీ సమావేశం నుంచి బయటకు పంపించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కంగుతిన్న సీఎం సిద్ధరామయ్య శాసనసభ్యులకు సర్ధిచెప్పడానికి నానా తంటాలు పడాల్సి వచ్చింది. ‘మంత్రులు లేకుండా సీఎల్పీ నిర్వహిస్తే విపక్షాలతో పాటు ప్రజల దృష్టిలో కూడా చులకన కావాల్సి వస్తుంది. అందువల్ల కొంత సహనం వహించండి. మీ సమస్యలు వినడానికి బెంగళూరులో వచ్చే సోమవారం నుంచి వారం రోజులు నాతోపాటు మంత్రులు సైతం మీకు ప్రత్యేక సమయం కేటాయిస్తారు.’ అని సర్ధి చెప్పడంతో ఎమ్మెల్యేలు వెనక్కుతగ్గారు. అంబరీష్, రామనాథరై లే టార్గెట్లు ... శాసనసభాపక్ష సమావేశంలో గృహ నిర్మాణశాఖ మంత్రి అంబరీష్, అటవీ శాఖ మంత్రి రామనాథరైలను టార్గెట్ చేసుకొని ఎమ్మెల్యేలు విమర్శలు కురిపించినట్లు తెలిసింది. ముఖ్యంగా ‘ఆశ్రయ’ పథకం కింద పేదలకు ఇళ్లను కేటాయించే విషయంలో ఎమ్మెల్యేలకు కాక స్థానిక పంచాయతీలు లబ్ధిదారులను ఎంపిక చేసే విధంగా నిబంధనలు రూపొందిస్తూ అంబరీష్ తమకు విలువ లేకుండా చేస్తున్నారని ఎమ్మెల్యేలు వాపోయారు. ఇలా అయితే త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి శరాఘాతం తప్పదని ఎమ్మెల్యేలు ఆక్రోశం వ్యక్తం చేశారు. అంబరీష్ సమాధానం కోసం సీఎం సిద్ధుతో పాటు మిగిలిన వారు ఎదురుచూడగా అసలు సభలో అంబరీష్ లేరనే తెలియడంతో అందరూ అవాక్కయ్యారు. తర్వాత కొద్ది సేపటికి నింపాదిగా అంబరీష్ సీఎల్పీ సమావేశానికి హాజరయ్యారు. మరోవైపు బుధవారం జరిగిన సీఎల్పీ సమావేశంలో అటవీశాఖ మంత్రి రామనాథరై పై మరోసారి పలువురు శాసనసభ్యులు ఫిర్యాదుల పరంపర కొనసాగించారు. దీంతో అసహనం వ్యక్తం చేస్తూ సమావేశం నుంచి రామనాథరై అర్ధాంతరంగా బయటికి వచ్చేశారు. ఈ ఏడాది శీతాకాల శాసనసభ సమావేశాల ప్రారంభం రెండో రోజున (ఈనెల 10న) ఎమ్మెల్యే శంకుంతలా శెట్టి ‘రై’ కార్యవైఖరిపై ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీరు కార్చిన విషయం ఇక్కడ గమనార్హం. -
మళ్లీ కసరత్తు
నామినేటెడ్ పోస్టుల భర్తీకి ఢిల్లీ పెద్దల సూచన నివేదిక కోరిన దిగ్విజయ్ స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా హైకమాండ్ ముందస్తు చర్యలు బెంగళూరు: మండళ్లు, కార్పోరేషన్లకు సంబంధించి అధ్యక్షులు, ఉపాధ్యక్షుల (నామినేటెడ్ పోస్టుల) భర్తీ వల్ల ఏర్పడిన అసమ్మతిని తగ్గించే చర్యలను కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ముమ్మరం చేసింది. అందులోభాగంగా చాలా ఈ సంస్థల డెరైక్టర్ పోస్టులతోపాటు పాలనాపరమైన సభ్యుల ఎంపిక ప్రక్రియను కూడా ప్రారంభించాల్సిందిగా ఢిల్లీ పెద్దలు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతోపాటు, కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్లకు సూచించినట్లు సమాచారం. చాలా కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో చాలా మంది పదవులపై కన్నేసిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల జరిగిన నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో తీవ్ర అసమ్మతి చెలరేగింది. ఈ క్రమంలోనే ఆయన గుల్బర్గాలో జరిగిన మంత్రి మండలి సమవేశానికి మంత్రి అంబరీష్ డుమ్మాకొట్టారు. మరికొంతమంది నాయకులు బహిరంగంగానే తమ అసమ్మతిని వెళ్లగక్కగా కొంతమంది కార్యకర్తలు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ క్రమంలో పార్టీలో అసమ్మతి ఇలాగా ఉంటే భవిష్యత్‌లో రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి తిరిగి మొదటికి వస్తుందని భావించిన పార్టీ హైకమాండ్ చక్కదిద్దే కార్యక్రమాలను ప్రారంభించింది. అందులో భాగంగా బీడీఏ, గృహ మండలి, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, మురికివాడల అభివృద్ధి మండలి తదితర సంస్థల డెరైక్టర్ స్థానాలకే కాకుండా సాధారణ సభ్యుల స్థానాలకు కూడా చాలా మంది పోటీపడుతున్నారు. దీంతో ఆయా పోస్టుల ఎంపిక ప్రక్రియను కూడా ప్రారంభించాలని రాష్ట్ర రాజకీయ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్‌సింగ్ సీఎం సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయమై చివరి వారంలోపు తనకు నివేదిక అందజేయాలని ఆయన ఇరువురునాయకులకు స్పష్టం చేసినట్లు తెలిసింది. మార్చిలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే హైకమాండ్ రాష్ట్ర నాయకులకు ఈ రకమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయమై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఒకరు మాట్లాడుతూ... ‘డెరైక్టర్ పోస్టుతోపాటు సాధారణ సభ్యుల ఎంపిక ప్రక్రియను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించాలనేది సీఎం సిద్ధు ఆలోచన, అయితే హైకమాండ్ ఇందుకు ఒప్పుకోలేదు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోపు పార్టీలో ఏర్పడిన అసమ్మతిని కనిష్టానికి తగ్గించే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకుంది.’ అని పేర్కొన్నారు. -
పరమేశ్వర్‌తో విభేదాల్లేవ్
కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్‌తో తనకు ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. నామినేటెడ్ పోస్టుల నియామకాల్లోనూ ఎలాంటి గందరగోళం లేదని వివరించారు. తుమకూరు : కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్‌తో తనకు ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవని, కొందరు అనవసరంగా గందరగోళం ృసష్టిస్తున్నారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. గురువారం మధుగిరి తాలూకా మిడిగేశిలో సుమారు రూ.560 కోట్లుతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం మాట్లాడారు. నామినేటెడ్ పోస్టుల నియామకంలో ఎలాంటి గందరగోళం లేదన్నారు. అక్రమ గనుల తవ్వకాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని విశ్రాంత లోకాయుక్త సంతోష్‌హెగ్డే చేసిన వ్యాఖ్యలు సత్యదూరమన్నారు. ఇప్పటికే కొన్ని కేసులను సీబీఐ విచారణ చేస్తోందన్నారు. కార్యక్రమంలో మంత్రులు హెచ్‌సీ మహదేవప్ప, టీబీ జయచంద్ర, ఎమ్మెల్యేలు కేఎన్ రాజణ్ణ, రఫీక్ అహ్మద్, జెడీప అధ్యక్షుడు వైఎచ్ హుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. -
దళంలో అసమ్మతి గళం
జేడీఎస్‌లో పెరుగుతున్న విభేదాలు కార్యకర్తల నిర్ణయానికి బద్ధుడినౌతానన్న బసవరాజ్ హొరట్టి పార్టీ పదవులేవీ చేపట్టబోనన్న జమీర్ అహ్మద్ బెంగళూరు : జేడీఎస్‌లో అసమ్మతి స్వరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. పార్టీ అధినాయకత్వం తమకు సరైన ప్రాధాన్యం కల్పించడం లేదంటూ ఫిర్యాదు చేస్తున్న నాయకుల సంఖ్య పెరుగుతోంది. ఇక ఇదే విధమైన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న అబ్దుల్ అజీమ్ తన పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇదే బాటలో జేడీఎస్ ఎమ్మె ల్సీ బసవరాజ్ హొరట్టి కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హుబ్లీలో ఆదివారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో బసవరాజ్ హొరట్టి చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. జేడీఎస్‌ని క్షేత్రస్థాయి నుంచి పటిష్టం చేయడంలో భాగంగా హుబ్లీలో ఆదివారం జేడీఎస్ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ బసవరాజ్ హొరట్టి మాట్లాడుతూ...‘పార్టీలో నా మాటకు అసలు గౌరవమే లేదు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా నా సూచనలు పాటిం చలేదు. పార్టీ అధినాయకత్వం మమ్మల్ని పట్టించుకోనప్పుడు మేం ఏం చేయాలనేది కార్యకర్తలే నిర్ణయిస్తారు. కార్యకర్తల నిర్ణయమేదైనా అందుకు బద్ధుడినౌతాను’ అని పేర్కొన్నారు. దీంతో బసవరాజ్ హొరట్టి కూడా పార్టీ వీడతారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. పార్టీ పదవులేవీ చేపట్టను... ఇక జేడీఎస్ నేత కుమారస్వామితో ఎప్పటికప్పుడు విభేదిస్తూ వస్తున్న ఆ పార్టీ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ ఆ పార్టీకి మరో షాక్ ఇచ్చారు. ఆదివారమిక్కడ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న జమీర్ అహ్మద్ మాట్లాడుతూ....‘నేను జేడీఎస్ పార్టీ వీడను. ఈ పార్టీ కేవలం కుమారస్వామి కష్టంతో ఏర్పాటైన పార్టీ కాదు, మాజీ ప్రధాని దేవేగౌడతో పాటు జేడీఎస్ కార్యకర్తలందరి కష్టంతో ఈ పార్టీ అభివృద్ధి చెందింది. పార్టీ నిర్వహించే కార్యక్రమాల్లో మాత్రం పాల్గొనను. అంతేకాదు పార్టీ పదవులేవీ చేపట్టను కూడా’ అని వెల్లడించారు. అసలు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా పార్టీలో ఎంత కాలం కొనసాగుతారనేది రాజకీయ విశ్లేషకుల నుంచి ఎదురవుతున్న ప్రశ్న. -
తారస్థాయికి ‘దేశం’ విభేదాలు !
శ్రీకాకుళం:వర్గ విభేదాలకు మారుపేరైన జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకు ల్లో ఏమాత్రం మార్పురాలేదు. పలువురి మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. తొలి నుంచి జిల్లాలో కింజరా పు, కళావర్గాలు పై చేయి కోసం ప్రయత్నిస్తూనే వచ్చాయి. కింజరాపు ఎర్రన్నాయుడు మరణం తరువాత కళా వెంకటరావు వర్గానిది పైచేయి అవుతుందని అందరూ భావించారు. అయితే పార్టీ అధినేత చంద్రబాబు.. కింజరాపు వర్గానికి పెద్దపీట వేస్తూ వచ్చారు. ఈ క్రమంలో రాష్ట్ర మంత్రితో పాటు జెడ్పీ చైర్మన్, విప్ తదితర పదవులన్నీ కింజరాపు వర్గానికే దక్కాయి. కళా వెంకటరావు టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు పీఆర్పీలో చేరడంతో చంద్రబాబు ఆయనకు అంతగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. కష్టకాలంలో పార్టీ వెన్నంటి ఉండడంతో కింజరాపు వర్గాన్ని ప్రోత్సహిస్తున్నట్టు పార్టీ వర్గాలే చెబుతున్నాయి. దీంతో తీవ్ర అసహనంతో ఉన్న కళావర్గం కింజరాపు వర్గాన్ని ఏమీ చేయలేక మాజీ స్పీకర్ ప్రతిభా భారతిపై దృష్టి సారించారు. ఎన్నికలు ముగిసిన నాటి నుంచి కళావర్గంతో పాటు మాజీ స్పీకర్ భారతి వర్గం కూడా పార్టీ అధినేతకు పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటూ వచ్చాయి. తన ఓటమికి కారణం కళా వర్గమేనని ప్రతిభా భారతి ఇప్పటికే ఫిర్యాదు చేసిన విషయం విదితమే. తాజాగా భారతి వర్గానికి చెందిన పీఎసీఎస్ అధ్యక్షుడు కరణం శ్రీనివాసరావును అవిశ్వాసం ద్వారా దించాలని కళా వర్గం ప్రయత్నిస్తోంది. సొంత పార్టీకి చెందిన నాయకులపైనే అవిశ్వాసానికి పూనుకోవడంపై ప్రతిభా భారతి ఆగ్రహంతో ఉన్నా.. చేసేది లేక లోలోనే దిగమింగుకుంటూ వచ్చారు. విషయాన్ని మంత్రి అచ్చెన్న దృష్టికి కూడా తీసుకువెళ్లడంతో ఆయన ఈ వ్యవహారంలో తలదూర్చారు. పార్టీ ప్రతిష్ట అంటూ కళావర్గం ఎత్తుగడలను అడ్డుకోవాలని నిర్ణయించి అవిశ్వాసం నోటీసు వచ్చినా చర్యలు తీసుకోకుండా ఉండేలా అధికారులతో మాట్లాడినట్టు భోగట్టా. ఈ విషయం తెలుసుకున్న కళావర్గం మండిపడుతోంది. తమ ప్రాంతంలో అచ్చెన్నాయుడు జోక్యం చేసుకోవడంపై ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. అచ్చెన్న మాత్రం ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లి దీన్ని అడ్డుకుంటానని చెప్పడంతో ఆయనకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు సమాచారం. దీంతో అచ్చెన్నాయుడు ప్రత్యక్షంగానే అవిశ్వాస తీర్మానాన్ని అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఇది కళావర్గంపై పుండు మీద కారం చల్లినట్లైంది. మంత్రిపై ఫిర్యాదు చేసేందుకు ముగ్గురు నాయకులు హైదరాబాద్ వెళ్తున్నట్టు సమాచారం. మాజీ స్పీకర్ ప్రతిభాభారతికి మంత్రి అండ దొరకడంతో కళా వెంకటరావుపై మరోసారి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీకి చెందిన వ్యక్తిపైనే అవిశ్వాస తీర్మానం పెట్టాలని భావించడాన్ని తప్పుపడుతూ ముఖ్యమంత్రికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయనున్నారు. ఈ వ్యవహారం భవిష్యత్‌లో ఎటువంటి పరిస్థితులకు దారి తీస్తుందో వేచి చూడాలి.