కాంగ్రెస్‌లో ఇంటిపోరు
చల్లారని అసమ్మతి
భర్తీ కాని నామినేటెడ్ పోస్టులు
రాహుల్ దృష్టికి సమస్య
ఇలాగే ఉంటే భవిష్యత్తు ఉండదని ఆందోళన
బెంగళూరు:అధికార కాంగ్రెస్ పార్టీ పాలనా పగ్గాలు చేపట్టి దాదాపు రెండేళ్లు కావస్తున్నా ఇప్పటికీ ఆ పార్టీలో అసమ్మతి చల్లారడం లేదు. కొంతమంది పార్టీనాయకులైతే ఏకంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పరమేశ్వర్ లక్ష్యంగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. రాష్ట్రంలో పార్టీ అధికారంలో రావడానికి తామెంతో కష్టపడినా అందుకు తగ్గఫలితం మాత్రం దక్కడంలేదని వాపోతున్నారు. ఈ విషయమై అమీతుమీకి సిద్ధమైన ఆ అసృతప్త నాయకులు ఏకంగా కాంగ్రెస్ యువరాజుకు లేఖరాసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ ఇంకా 40 శాతం కూడా పూర్తి కాలేదు. ఈ పదవుల పై ఆశలు పెట్టుకున్న నాయకులు ఎన్నోసార్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతోపాటు కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్‌కు తగిన స్థానం ఇవ్వాల్సిందిగా విన్నవిస్తున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు. పదవుల భర్తీ విషయమై సిద్ధు.... పరమేశ్వర్ ‘ఎవరికీ వారే యమునాతీరే’ అన్న రీతిలో వ్యవహరిస్తుండటం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని కాంగ్రెస్ పార్టీ నాయకులే చెబుతున్నారు. రాష్ట్రంలో ఈ నామినేటెడ్ పదవుల పై డీసీసీ అధ్యక్షులతో పాటు వారి అనుచరులు కన్నేసి ఉంచారు.
పదవుల కోసం ఎదురు చూస్తూ కూర్చోవడం వల్ల లాభం లేదని భావించిన వీరంతా ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి తమ గోడును వెళ్లబోసుకుంటూ లేఖరాశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఆ లేఖలో... ‘2013లో కర్ణాటకలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం క్షేత్రస్థాయి కార్యకర్తలు ఎంతగానో శ్రమించారు. అందువల్లే దాదాపు పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది. అయితే క్షేత్రస్థాయి సిబ్బంది కష్టాన్ని విస్మరించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పరమేశ్వర్ వంటి కొంత మంది నాయకులే పదవులను అ నుభవిస్తున్నారు. కనీసం నామినేటెడ్ పోస్టులను కూ డా మాకు కట్టబెట్టడం లేదు. ఎన్ని సార్లు వారిని కలిసి విన్నవించినా రేపు మాపు అంటూ వాయిదా వేస్తున్నా రు. వారికి సమయం లేదేమో., మీరే కల్పించుకుని మా కష్టానికి తగిన ప్రతిఫలం దక్కేలా చూడండి. లేదంటే రానున్న బీబీఎంపీ, గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాం గ్రెస్ పార్టీ విజయం పై మేము భరోసా ఇవ్వలేం’ అని ఘాటుగా పేర్కొన్నారు. మరోవైపు మంత్రి మండలి కూడా పూర్తీ స్థాయిలో భర్తీ కాలేదు. ఇంకా నాలుగు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ పదవుల పై కన్నేసిన నాయకులే డీసీసీ అధ్యక్షుల లేఖల ఘటాన్ని తెరవెనక నుండి నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై కాంగ్రెస్ నాయకుడు ఒకరు మాట్లాడుతూ... ‘మంత్రి పదవుల పై కన్నేసిన నాయకులు సిద్ధరామయ్య ‘వాయిదా వ్యవహార శైలి’ పై కినుకు వహించారు. డీసీసీ అధ్యక్షుల ద్వారా హై కమాండ్ పై ఒత్తిడి తీసుకువచ్చి నామినేటెడ్ పదవుల భర్తీ సమయంలోనే మంత్రిమండలి విస్తరణకు కూడా అనుమతి పొందవచ్చునని భావిస్తున్నారు. అందువల్లే ఈ లేఖల ఘట్టాన్ని తెరవెనక ఉండి నడిపిస్తున్నారు.’ అని పేర్కొన్నారు.