అసమ్మతి లేదు
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
ఎవరూ రాజీనామాలు చేయడం లేదు
ప్రభుత్వానికి ఢోకా లేదు
తుమకూరు : రాష్ర్టంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకాలేదని, మంత్రిమండలిలో ఎలాంటి అసమ్మతి లేదని రాష్ర్ట ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టంచేశారు. స్థానిక మహాత్మాగాంధీ క్రీడా మైదానంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
మంత్రి సతీష్ జారకీహోళీ రాజీనామా పత్రాన్ని తనకు పంపించిన విషయంపై మాట్లాడుతూ నిజమేనని ధ్రువీకరించారు. ఈ విషయంపై తాను జారకీహోళీతో మాట్లాడినట్లు తెలిపారు. ఏ మంత్రులూ రాజీనామా చేయడం లేదని తేల్చి చెప్పారు.
టీఆర్‌పీ కోసం పాకులాట వద్దు
సమాజంలో ఉన్న అవినీతిని, అక్రమాలను వెలికి తీసి ప్రజలకు చాటి చెప్పేలా టీవీ చానళ్లు ఉండాలని, కేవలం టీఆర్‌పీ రేటింగ్‌స కోసం పాకులాడడం సబబు కాదని సిద్ధరామయ్య పేర్కొన్నారు. తుమకూరులోని బసవేశ్వర పాఠశాల మైదానంలో ప్రజా ప్రగతి పత్రికా సంపాదకుడు ఎస్.నాగన్న కొత్తగా ఏర్పాటు చేసిన ప్రగతి చానెల్‌ను ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... సాంకేతిక విప్లవం కారణంగా ప్రపంచంలో ఎక్కవ ఏమీ జరిగినా టీవీ చానెల్ ద్వారా తెలుసుకునేందుకు వీలవుతోందని అన్నారు. అయితే సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలను వదిలి ఇతరత్రాలను మళ్లీమళ్లీ చూపించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని అన్నారు. కార్యక్రమంలో సిద్ధగంగ మఠానికి చెందిన డాక్టర్ శివకుమారస్వామీజీ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి టి.బి.జయచంద్ర, ఎమ్మెల్యేలు రాజన్న, రఫీక్ అహ్మద్, ఎమ్మెల్సీ హులినాయ్కర్, హెచ్.ఎం.రేవణ్ణ, జిల్లా అధికారి సత్యమూర్తి పాల్గొన్నారు.