అధికార కాంగ్రెస్‌లో ఓ విధమైన వేడి అలముకొంది. ఒకవైపు ఎమ్మెల్యేలను కూడగట్టి సర్కారును పడదోయాలని ప్రతిపక్ష బీజేపీ కుట్ర పన్నుతోందని ఆరోపణలు. మరోవైపు తమ నాయకుడు డీకే శివకుమారే, రెండున్నరేళ్ల కాలానికి ఆయనే సీఎం అని కొందరు ఎమ్మెల్యేలు గళమెత్తారు. ఈ రెండింటిని ఎలా ఎదుర్కోవాలా అని సీఎం సిద్దరామయ్య తన సన్నిహిత మంత్రులతో హోంమంత్రి ఇంట్లో మంతనాలు జరిపారు.
కర్ణాటక: బెంగళూరులో హోం మంత్రి జీ.పరమేశ్వర్ ఇంటిలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కొందరు మంత్రులు విందు సమావేశం కావడం రాజకీయంగా కుతూహలానికి కారణమైంది. సీఎం సిద్దరామయ్య, జీ.పరమేశ్వర్, ప్రజాపనుల శాఖ మంత్రి సతీశ్ జార్కిహొళి, సాంఘిక సంక్షేమ మంత్రి హెచ్.సీ.మహాదేవప్పలు విందు భేటీ జరిపారు. ఇందులో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ లేకపోవడం ఆయన వర్గాన్ని అసంతృప్తికి గురిచేస్తోంది. రాష్ట్ర సర్కారును పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందనే ఆరోపణలు, అలాగే డీకే శివకుమార్ సీఎం కావాలని పలువురు ఎమ్మెల్యేల డిమాండ్లు ఇందులో చర్చకు వచ్చినట్లు సమాచారం. డిప్యూటీ సీఎం పోస్టులు తమకూ కావాలని సతీశ్ జార్కిహొళి, పరమేశ్వర్‌లు అప్పుడప్పుడు చెబుతున్నారు. సర్కారు ఏర్పడి ఇంకా ఆరు నెలలే అయ్యింది. ఇంతలోనే అస్థిరత ఏర్పడినట్లు వదంతులు చెలరేగుతున్నాయి. వాటితో పాటు కాంగ్రెస్‌లోని గందరగోళాలకు తెర దించేందుకు సీఎం, మంత్రులు చర్చించారని తెలిసింది. కాగా, సీఎం స్పందిస్తూ, ఈ విందులో ఎలాంటి రాజకీయ చర్చ జరుపలేదు. పరమేశ్వర్ భోజనానికి ఆహా్వనిస్తే, వెళ్లాం. దీనికి రాజకీయ రంగును పూయవద్దు అన్నారు. పరమేశ్వర్ కూడా ఇదే మాటలు చెప్పడం గమనార్హం.
బీజేపీ కుట్రలు ఫలించవు: డీకేశి
రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ జరిపే ప్రయత్నాలు ఫలించవని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. శనివారం హైదరాబాద్‌కు వెళ్లేముందు ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. మా ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ జరుపుతున్న కుట్ర తెలుసు. దీని వెనుక పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. అయినా కానీ సర్కారును కూల్చలేరు అన్నారు. మొదటి నుంచి బీజేపీ మా ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతోందని మండ్య ఎమ్మెల్యే రవి గణిగ చేసిన ఆరోపణలను ప్రస్తావించారు. ప్రలోభాలను అసెంబ్లీలోనే బహిర్గతం చేస్తామన్నారు. కాగా, నేను సీఎం కావాలని ఎవరైనా ఎమ్మెల్యే ప్రకటిస్తే కేపీసీసీ చీఫ్‌గా వారికి క్రమశిక్షణా నోటీస్ జారీ చేయనున్నట్లు డీకే హెచ్చరించారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు, నాయకులకు పార్టీ అంతర్గత విషయాలను మీడియా ముందు మాట్లాడరాదని సూచించామన్నారు.
మంత్రి పదవి,రూ. 50 కోట్ల ఆఫర్: గణిగ
బీజేపీ నాయకులు తమ ఎమ్మెల్యేల వద్ద మాట్లాడిన ప్రలోభాల సాక్ష్యాలను మరో రెండు రోజుల తరువాత మీడియా ముందు పెడతానని మండ్య కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి గణిగ తెలిపారు. మండ్యలో శనివారం విలేకరులతో మాట్లాడిన ఆయన, ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఒక్కో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మంత్రి పదవి, రూ. 50 కోట్ల ఆఫర్ ఇచ్చారు. సీఎం, డీసీఎంతో మాట్లాడిన రెండు రోజుల తరువాత మీడియా ముందు వస్తానన్నారు. ఒక ఎమ్మెల్సీ, యడియూరప్ప పీఏ సంతో‹Ù, బెళగావి మాజీ మంత్రి ఒకరు బెంగళూరులోని గోల్డ్ ఫించ్ హోటల్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కలిసి ప్రలోభాలకు గురి చేశారని ఆరోపించారు.
డీకేశి వెంట 70 మంది ఎమ్మెల్యేలు: శివగంగ
డీసీఎం డీకే శివకుమార్‌కు కాంగ్రెస్‌లో 70 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని దావణగెరె జిల్లా చన్నగిరి కాంగ్రెస్ ఎమ్మెల్యే శివగంగా బసవరాజ్ అన్నారు. ఈ ఐదేళ్లలో ఆయనను తప్పకుండా ముఖ్యమంత్రిని తప్పకుండా చేస్తామని ప్రకటించి హస్తంలో వేడిని పెంచారు. అధికార పంపకం, పార్టీ, ప్రభుత్వం గురించి ఎమ్మెల్యేలు, నాయకులు బహిరంగ వ్యాఖ్యలు చేయరాదని శనివారం ఉదయమే సీనియర్లు కఠినమైన హెచ్చరికలు చేశారు. వీటిని బేఖాతరు చేస్తూ శివగంగా విలేకరులతో ఘాటుగా మాట్లాడారు. డీ.కే.శివకుమార్ వంద శాతం సీఎం అవుతారు. పారీ్టలో 60– 70 మంది ఎమ్మెల్యేలు డీకేకి మద్దతుకు ఉన్నామని నేను మామూలుగానే చెప్పాను. ఆ మాటకొస్తే 135 మంది ఎమ్మెల్యేలు డీకేకి అండగా ఉన్నారు అని అన్నారు. అలాగని తాను మరొకరికి వ్యతిరేకం కాదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment