బెంగళూరు: ఇటీవల వెలువడిన లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు. కర్ణాటకలో లోక్‌సభ ఫలితాలు కాంగ్రెస్‌కు వార్నింగ్ బెల్గా అభివర్ణించారు. కుమారకృపాలోని తన అధికారిక నివాసంలో శివకుమార్ మాట్లాడుతూ.. తమ పార్టీ నేతలతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. ఎన్నికల్లో ఓటమిపై ఆత్మపరిశీలన చేసుకొని అవసరమైన దిద్దుబాట్లు చేసుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. లోక్‌సభ ఫలితాలు కాంగ్రెస్‌కు ఓ వార్నింగ్ బెల్ లాంటివని పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉనన నియోజకవర్గాల వారిగా సమీక్షా సమావేశాల నిర్వహణ చేస్తామని, త్వరలోనే ఇందుకు సంబంధించిన తేదీలను వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్ ఫలితాలపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అసంతృప్తిగా ఉన్నాడని విలేఖరులు ప్రశ్నించగా.. రాష్ట్రంలో 14, 15 సీట్లు గెలుస్తామన్న నమ్మకంతో ఉన్నామని అయితే ఆ సంఖ్యను సాధించడంలో విఫలమయ్యామని తెలిపారు. ప్రజల తీర్పును తాము అంగీకరిస్తున్నామని అన్నారు. పార్టీ నేతలు చాలా వరకు వారి స్వంత గ్రామాలు,పట్టణాల నుంచి ఓట్లు రాబట్టుకోలేదని తెలిపారు.
కొంతమంది మంత్రుల ఓటమికి ఎమ్మెల్యేలపై నిందలు వేయడాన్ని ప్రస్తావిస్తూ.. ‘నాపై ఎవరూ ఫిర్యాదు చేయలేదు. ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడంలో ప్రయోజనం లేదు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ నాయకులు పార్టీ కార్యకర్తలతో మాట్లాడాలి. ఓటమికి గల కారణాలను విశ్లేషించాలి. దానిని అధిగమించాలన్నారు. ఎమ్మెల్యేలు అనవసరంగా బహిరంగ ప్రకటనలు చేయవద్దని ఎమ్మెల్యే బసవరాజ్ శివగంగ చేసిన ప్రకటనను శివకుమార్ ప్రస్తావించారు. పార్టీ కార్యకర్తలతో కలిసి కూర్చుని సమస్యపై చర్చించుకోవాలని ఆయన సూచించారు.
కాగా 28 లోక్‌సభ స్థానాలున్న కర్ణాటకలో కాంగ్రెస్ కేవలం 9 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. బీజేపీ 17 చోట్ల విజయం సాధించింది. జేడీయూ రెండు స్థానాలను గెలుచుకుంది. అటు దేశ వ్యాప్తంగానూ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సారధ్యంలోని విపక్ష ఇండియా కూటమి మ్యాజిక్ ఫిగర్‌కు చాలా దూరంలోనే ఆగిపోయింది. బీజేపీ సైతం ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీని సొంతంగా సాధించలేకపోవడంతో ఎన్డీయే మిత్రపక్షాలతో కలిసి మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment