బెంగళూరు: మైసూరు నగర అభివృద్ధి సంస్థ(ముడా) కుంభకోణంలో సీఎం సిద్దరామయ్యను టార్గెట్ చేస్తూ ప్రతిపక్ష బీజేపీ చేస్తున్న ఆరోపణలపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఘాటుగా స్పందించారు. ముఖ్యమంత్రి పదవి నుంచి సిద్దరామయ్యను దింపడమే లక్ష్యంగా కమలం పార్టీ పని చేస్తుందని మండిపడ్డారు. ముడా కుంభకోణం వ్యవహారంలో సీఎం సిద్దరామయ్యకు ఎటువంటి సంబంధం లేదన్నారు.
కాగా ముడా భూముల కేటాయింపులో అవకతవకలపై సీఎం సిద్దరామయ్యను విచారించేందుకు గవర్నర్ అనుమతిచ్చిన విసయం తెలిసిందే. ఈ క్రమంలో సీఎం పదవికి సిద్దూ రాజీనామా చేయాలని బీజేపీ పట్టుబడుతోంది.
దీనిపై తాజాగా శివకుమార్ మాట్లాడుతూ.. సిద్దరామయ్య అమాయకుడని, ముఖ్యమంత్రికి కాంగ్రెస్ పార్టీ నూటికి నూరు శాతం మద్దతుగా నిలుస్తుందని చెప్పారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నుంచి బూత్ స్థాయి కార్యకర్త వరకు అంతా సిఎం సిద్దరామయ్య వెంట ఉన్నారన్నారు. ఆయన రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
చట్టమే ముఖ్యమంత్రిని కాపాడుతుందని, ముఖ్యమంత్రి తప్పు చేశాడని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు. ఇది పూర్తిగా బీజేపీ ఆడుతున్న రాజకీయ డ్రామాగా అభివర్ణించారు. మరోవైపు తాను ముఖ్యమంత్రి పదవి కోసం తాపత్రయపడుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. అది హైకమాండ్ నిర్ణయమని తెలిపారు.
ఇదిలా ఉండగా ఈ వ్యవహారంపై భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాసినట్లు డీకే వెల్లడించారు.. సీఎం సిద్దరామయ్యను ప్రాసిక్యూషన్ చేయాలంటూ గవర్నర్ ఆదేశాలు జారీ చేసిన అంశంలో జోక్యం చేసుకోని, ఆ ఆర్డర్‌ను వెనక్కి తీసుకునేలా గవర్నర్‌తో మాట్లాడాలని రాష్ట్రపతి ముర్మును కోరినట్లు తెలిపారు.
కాగా గవర్నర్ జారీ చేసిన ఆదేశాలు నిలిపివేయాలంటూ.. సీఎం సిద్దరామయ్య సోమవారం కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆగస్ట్ 29వ తేదీ వరకు ఈ కేసులో సీఎం సిద్దరామయ్యను ఎటువంటి ప్రాసిక్యూషన్ చేయవద్దంటూ కర్ణాటక హైకోర్టు ఆదేశించింది. దీంతో ఈ కేసులో సిఎం సిద్దరామయ్యకు తాత్కాలిక ఊరట లభించినట్లు అయింది.
Comments
Please login to add a commentAdd a comment