శనివారం బెంగళూరులో నూతన సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ డీకేలతో తేజస్వి, గహ్లోత్, నితీశ్, ఖర్గే, డి.రాజా, రాహుల్, స్టాలిన్, ప్రియాంక, ఏచూరి, సోరెన్ తదితరులు
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణం చేశారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో మధ్యాహ్నం 12.30 గంటలకు జరిగిన కార్యక్రమంలో వీరి చేత గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ప్రమాణం చేయించారు. వీరితోపాటు మరో 8 మంది.. డాక్టర్ జి.పరమేశ్వర, కేహెచ్ మునియప్ప, కేజే జార్జ్, ఎంబీ పాటిల్, సతీశ్ జారకిహోళి, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే తనయుడు ప్రియాంక్ ఖర్గే, రామలింగారెడ్డి, జమీర్ అహ్మద్ ఖాన్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దేవుని పేరిట, డీకే శివకుమార్ శ్రీ గంగాధర అనే ఆయన తాత గారి పేరిట ప్రమాణం చేశారు. పరమేశ్వర రాజ్యాంగంపై, సతీశ్ బుద్ధుడు, బసవణ్ణ అంబేడ్కర్ పేరిట, జమీర్ అహ్మద్ అల్లా, తన తల్లి పేరిట ప్రమాణం చేశారు. మిగిలిన వారు దేవుని పేరిట ప్రమాణం చేశారు. అనంతరం, సాయంత్రం నూతన సీఎం సిద్ధరామయ్య నేతృత్వంలో మంత్రివర్గం మొట్టమొదటి సమావేశం జరిగింది. ఎన్నికల సందర్భంగా ప్రజలకిచ్చిన వివిధ హామీల అమలుకు కేబినెట్ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది.
వీటి అమలుకు ఏడాదికి రూ.50 వేల కోట్ల మేర ప్రభుత్వంపై భారం పడుతుందని అంచనా. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను ఆర్థికం సహా ఎటువంటి ఇబ్బందులెదురైనా తప్పక అమలు చేస్తామని అనంతరం సీఎం సిద్ధరామయ్య చెప్పారు. ఈనెల 22 నుంచి మూడు రోజుల పాటు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమవుతుందన్నారు. నూతన ఎమ్మెల్యేలు ప్రమాణం చేస్తారని, కొత్త స్పీకర్ ఎంపిక ఈ సమావేశాల్లో ఉంటుందని చెప్పారు. ఇలా ఉండగా, సీఎం, డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన సిద్ధరామయ్య, శివకుమార్‌లకు ప్రధాని మోదీ, మాజీ ప్రధాని దేవె గౌడ, మాజీ సీఎం బొమ్మై అభినందనలు తెలిపారు.
జాతీయ నేతలు హాజరు
ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ పాల్గొన్నారు. కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియాగాంధీ హాజరు కాలేదు. కాంగ్రెస్ పాలిత రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, హిమాచల్‌ప్రదేశ్ సీఎంలు అశోక్ గెహ్లాట్, భూపేశ్ బఘేల్, సుఖ్‌వీందర్ సింగ్‌లతోపాటు తమిళనాడు, బిహార్, జార్ఖండ్ సీఎంలు ఎంకే స్టాలిన్, నితిశ్ కుమార్, హేమంత్ సోరెన్‌లు పాల్గొన్నారు.
వీరితోపాటు బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్, జమ్మూ కశ్మీర్ మాజీ సీఎంలు ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, ఆర్‌ఎస్పీ అధ్యక్షుడు ఎన్‌కే ప్రేమచంద్రన్, సీపీఐ ఎంఎల్ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య, వీసీకే అధ్యక్షుడు డాక్టర్ తిరుమల వలన్, ఆర్‌ఎల్‌డీ అధ్యక్షుడు జయంత్ చౌదరి, నటుడు కమల్ హాసన్ కూడా ఉన్నారు. నేతలంతా చేతులు కలిపి సంఘీభావం ప్రదర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment