Updates:
►కర్ణాటక విజయంతో కాంగ్రెస్‌లో జోష్ వచ్చిందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఈ మేరకు గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యేల అభిప్రాయాలను పార్టీ పరిశీలకులు హైకమాండ్‌కు అందజేశారని పేర్కొన్నారు.. సీఎంపై ఏకాభిప్రాయం కోసం రెండు, మూడు రోజులుగా చర్చలు జరిపినట్లు తెలిపారు. కర్ణాటక కొత్త సీఎంగా సిద్ధరామయ్యను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. శివకుమార్ ఒక్కరే డిప్యూటీ సీఎంగా ఉంటారని తెలిపారు. పీసీసీ చీఫ్‌గా కూడా డీకే కొనసాగుతారని చెప్పారు. ఎల్లుండి(శనివారం) ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుందన్నారు.
►డిప్యూటీసీఎం పదవికి డీకే శివకుమార్ అంగీకరించడం వెనక సోనియా గాంధీ ప్రముఖపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. సీఎ పదవిని కాదని రెండో స్థానాన్ని ఓకే చేసేలా ఆయన్ను సోనియా బుజ్జగించినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. పార్టీ ప్రయోజనాలు, గాంధీ కుటుంబం కోసం శివకుమార్ ‘త్యాగం’ చేశారని, డిప్యూటీ సీఎం పదవికి అంగీకరించారని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయియి.
► ఢిల్లీలోని కేసీ వేణుగోపాల్ నివాసానికి సిద్ధరామయ్య, డీకే శివకుమార్ చేరుకున్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌తో చర్చల అనంతరం వీరు రాహుల్‌గాంధీని కలవనున్నారు.
► కర్ణాటక ముఖ్యమంత్రి ఎంపిక వ్యహహారం కొలిక్కివచ్చింది. ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యను ప్రకటించడం లాంఛనమే! పార్టీ అధిష్టానంతో సుదీర్ఘ చర్చల అనంతరం కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ గురువారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
► ‘నేను పూర్తి సంతోషంగా లేను. కర్ణాటక ప్రజలకు ఇచ్చిన హామీలను మా ప్రభుత్వం నెరవేర్చాల్సి ఉంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా, పార్టీ ప్రయోజననాల కోసం.. మా నాయకత్వం చెప్పిన ఫార్ములాకి అంగీకరిస్తున్నా’అని డీకేశీ పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: గత నాలుగు రోజులుగా ఉత్కంఠ రేపుతున్న కర్ణాటక ముఖ్యమంత్రి పీఠంపై సస్పెన్స్ వీడినట్లే తెలుస్తోంది. కర్ణాటక ప్రభుత్వ ఏర్పాటుపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. ఊహించినట్టుగానే మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత సిద్ధరామయ్య మరోసారి కర్ణాటక సీఎం పీఠాన్ని అధిరోహించబోతున్నారు. ఇక రేసులో నిలిచిన డీకే శివకుమార్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకోబోతున్నారు. దీనిపై కాంగ్రెస్ హైకమాండ్ నేడు అధికారిక ప్రకటన వెలువరించనుంది.
అర్దరాత్రి వరకు సాగిన చర్చలు
బుధవారం పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. తొలుత చెరొక రెండున్నరేళ్లు సీఎం పదవిలో ఉంటారని, తరువాత సిద్ధరామయ్యే పూర్తి కాలం సీఎంగా ఉంటారని ప్రచారాలు సాగాయి. అయితే ఏఐసీసీ కర్ణాటక ఇంచార్జి రణ్‌దీప్ సుర్జేవాలాతోపాటు డీకే శివకుమార్ వీటిని ఖండించారు. తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. ఢిల్లీలో గురువారం తెల్లవారు జామున వరకు కాంగ్రెస్ హైకమాండ్ తీవ్ర మంతనాలు జరిపింది. ముందు నుంచి ఢిల్లీలోనే ఉంటూ లాబియింగ్ చేసిన సిద్ధరామయ్య.. ఖర్గే, అనంతరం సోనియా గాంధీతో చర్చించారు.
చదవండి: కర్ణాటక సీఎం పంచాయితీ...ఎందుకిలా..? ఢిల్లీకి వెళ్లడంతోనే ఈ చిక్కులు
మెట్టుదిగిన డీకే!
మరోవైపు డీకే శివకుమార్ కూడాఖర్గే, సోనియా, రాహుల్‌ను కలిశారు. అయితే అర్థరాత్రి జరిగిన చర్చలతో డీకే మెట్టు దిగినట్లు, రాజీ ఫార్ములాకు శివకుమార్ అంగీకరించినట్లు సమాచారం. మరోవైపు నేడు రాత్రి 7 గంటలకు కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. అనంతరం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ గవర్నర్‌ను కలవనున్నారు.
శనివారం ప్రమాణ స్వీకారం
ఇక ఈనెల 20న మధ్యాహ్నం 12.30 గంటలకు సిద్ధరామయ్య సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శనివారం బెంగళూరు కంఠీరవ స్టేడియంలో కాంగ్రెస్ అధిష్టానం సమక్షంలో ఈ ప్రమాణస్వీకారం జరగనుంది. పలు రాష్ట్రాల సీఎంలు సైతం హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి అగ్రనేతలను ఆహ్వానించడం ద్వారా ప్రతిపక్షాల ఐక్యతను చాటాలని కాంగ్రెస్ యోచిస్తోంది.
చదవండి: ‘చేతి’కి అధికారం ఇచ్చాక? సీఎం సీటు షేరింగ్.. ఓ ఫ్లాప్ ఫార్ములా..!
Comments
Please login to add a commentAdd a comment