ఎన్నికల సమయంలో ఇచ్చే హామీలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. తమ రాష్ట్రాల బడ్జెట్‌ను పరిగణలోకి తీసుకోకుండా హామీలను ప్రకటించవద్దని.. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల కాంగ్రెస్ చీఫ్‌లకు సూచనలు చేశారు. బడ్జెట్ ఆధారంగా గ్యారంటీలు ప్రకటించాలని తెలిపారు.
కాగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో మహిళా ప్రయాణికులకు ఉచిత బస్సు సేవలను అందించే శక్తి పథకాన్ని సమీక్షిస్తామని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఖర్గే నుంచి ఈ పిలుపు వచ్చింది. అయితే శక్తి పథకాన్ని పునఃసమీక్షించే ఆలోచన ప్రస్తుతం ప్రభుత్వానికి లేదని సీఎం సిద్దరామయ్యతోపాటు, రవాణా శాఖ మంత్రి రామలింగా రెడ్డి స్పష్టం చేశారు.
ఈ మేరకు శుక్రవారం ఖర్గే మాట్లాడుతూ.. హామీల ప్రకటించే విషయంలో జాగ్రత్తగా పరిశీలించాలని, ప్రణాళిక లేకుండే హామీలివ్వడం ద్వారా.. భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఇది ముందు తరాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. ప్రభుత్వం తాను హామీ ఇచ్చిన వాటిని అమలు చేయడంలో విఫలమైతే ప్రజల్లో నమ్మకం కోల్పోతుందని..చెడ్డపేరు మూటగట్టుకోవాల్సి వస్తుందన్నారు.
‘త్వరలో మహారాష్ట్రలో ఎన్నికలు జరగబోతున్నాయి. అయిదు, ఆరు, ఏడు, ఎనిమిది వంటి గ్యారంటీలు ఇస్తామంటూ హామీలు ఇవ్వవద్దని నేను మహారాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు సూచించాను. దానికి బదులు మీ బడ్జెట్‌తో సరిపోయే హామీలు ఇవ్వండి బడ్జెట్‌ను పరిగణనలోకి తీసుకోకుండా వాగ్దానాలు చేయడం వల్ల రాష్ట్రం దివాలా తీసే పరిస్థితి ఏర్పడుతుంది.
ప్రణాళికా రహిత విధానం ఆర్థిక ఇబ్బందులకు దారి తీస్తుంది. రోడ్లు వేసేందుకు కూడా డబ్బు ఉండకపోవచ్చు. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైతే.. భవిష్యత్తు తరాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. రాబోయే పదేళ్లపాటు ప్రభుత్వం ఆంక్షలను ఎదుర్కొంటుంది’ అంటూ ఎన్నికల హామీలపై ఖర్గే వ్యాఖ్యానించారు.
కాగా ఇటీవల ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలకు కల్పిస్తున్న ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని సమీక్షిస్తామని వెల్లడించారు. టికెట్లు కొనుక్కొని ప్రయాణించేందుకు పలువురు మహిళలు ముందుకు వస్తున్నందున ఈ పథకాన్ని సమీక్షిస్తామని తెలిపారు.
‘సోషల్ మీడియా ద్వారా, ఈ–మెయిళ్ల ద్వారా చాలామంది మహిళలు టికెట్లకు డబ్బులు చెల్లించి ప్రయాణిస్తామని మమ్మల్ని సంప్రదిస్తున్నారు. దీనిపై చర్చిస్తాం’ అని శివకుమార్ తెలిపారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పించే శక్తి పథకం కాంగ్రెస్ కన్నడనాట ఇచ్చిన ఐదు ప్రధాన హామీల్లో ఒకటనే విషయం తెలిసిందే. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కిందటేడాది జూన్ 11న శక్తి పథకాన్ని ప్రారంభించింది. ఈనెల 18 నాటికి 311 కోట్ల ఉచిత ప్రయాణాలు జరగ్గా.. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 7,507 కోట్లను దీనిపై వెచ్చించింది.
Comments
Please login to add a commentAdd a comment