![Karnataka DK Shivakumar slams Satish Jarkiholi over KPCC chief remarks](/styles/webp/s3/article_images/2025/01/17/Kannada-Congress.jpg.webp?itok=cuFwzss3)
బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్‌లో రాజకీయం రసవత్తరంగా మారింది. కాంగ్రెస్ నేతల మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో మరో మంత్రి మాటల యుద్ధానికి దిగారు. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ పోస్టుపై ఇద్దరు నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. దీంతో, అధికార పార్టీ వ్యవహారంపై ప్రతిపక్ష బీజేపీ సెటైర్లు వేస్తోంది.
కన్నడ కాంగ్రెస్‌లో కలహాలు ఉధృతమయ్యేలా ఉన్నాయి. డిప్యూటీ సీఎంతో మరో మంత్రి మాటల యుద్ధానికి దిగారు. నాయకులు ఇష్టానుసారం మాట్లాడరాదని ఇటీవలే హైకమాండ్ ఆదేశించినా పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ గురువారం విధానసౌధలో విలేకరులతో మాట్లాడుతూ.. కేపీసీసీ అధ్యక్ష పోస్టు అంగడిలో దొరకదు. మీడియా ముందు మాట్లాడితే లభించదు. మనం పార్టీకి చేసిన సేవలు, శ్రమను గుర్తించి సరైన పదవి ఇస్తారని, కొంతమంది మీడియా ముందుకొచ్చి పదవిని కోరుతున్నారని అన్నారు.
పార్టీలో అందరూ క్రమశిక్షణ పాటించాలని రాహుల్‌గాంధీ, సీఎం సిద్దరామయ్య సూచించారన్నారు. కాంగ్రెస్ పార్టీని తానొక్కడే కాదు, కార్యకర్తలు, ప్రజలు కలిసి గెలిపించారన్నారు. జై భీమ్ సమావేశాల నిర్వహణ పరిశీలనకు ఇన్‌చార్జి సుర్జేవాలా శుక్రవారం బెళగావికి వస్తారని, మీ ప్రశ్నలు ఏమైనా ఉంటే ఆయనను అడగాలని నేతలకు సూచించారు. మరోవైపు మంత్రి సతీష్ జార్కిహొళికి కేపీసీసీ నుంచి నోటీసులు వెళ్లాయి.
రేసులో ఉన్నాననలేదు: సతీశ్
కేపీసీసీ నుంచి నోటీసులు ఇచ్చినప్పటికీ ఏమీ కాదు, దీనికి స్పష్టమైన సమాధానం అధ్యక్షుడి ముందు ఇస్తానని మంత్రి సతీష్ జార్కిహొళి చెప్పారు. డీకేపై తరచూ విమర్శలు చేస్తున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నోటీస్ ఇచ్చే అధికారం ఆయనకు ఉందన్నారు. కేపీసీసీ రేసులో ఉన్నానని నేను ఎక్కడా చెప్పలేదన్నారు. తన మాటలతో ఎవరికీ ఇబ్బంది లేదని, నేను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు. మీడియా ఉదయం హీరోను చేసి, సాయంత్రం విలన్‌ను చేస్తారని, ఇది సబబు కాదని వాపోయారు. మరోవైపు.. కాంగ్రెస్‌లో ప్రస్తుత పరిణామాలపై ప్రతిపక్ష బీజేపీ నేతలు సెటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు. కాంగ్రెస్‌లో ఇలాంటివి కొత్తేమీ కాదని కామెంట్స్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment