KPCC chief
-
డీకే Vs సతీష్.. కన్నడ కాంగ్రెస్‌లో రసవత్తర రాజకీయం!
బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్‌లో రాజకీయం రసవత్తరంగా మారింది. కాంగ్రెస్ నేతల మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో మరో మంత్రి మాటల యుద్ధానికి దిగారు. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ పోస్టుపై ఇద్దరు నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. దీంతో, అధికార పార్టీ వ్యవహారంపై ప్రతిపక్ష బీజేపీ సెటైర్లు వేస్తోంది.కన్నడ కాంగ్రెస్‌లో కలహాలు ఉధృతమయ్యేలా ఉన్నాయి. డిప్యూటీ సీఎంతో మరో మంత్రి మాటల యుద్ధానికి దిగారు. నాయకులు ఇష్టానుసారం మాట్లాడరాదని ఇటీవలే హైకమాండ్ ఆదేశించినా పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ గురువారం విధానసౌధలో విలేకరులతో మాట్లాడుతూ.. కేపీసీసీ అధ్యక్ష పోస్టు అంగడిలో దొరకదు. మీడియా ముందు మాట్లాడితే లభించదు. మనం పార్టీకి చేసిన సేవలు, శ్రమను గుర్తించి సరైన పదవి ఇస్తారని, కొంతమంది మీడియా ముందుకొచ్చి పదవిని కోరుతున్నారని అన్నారు.పార్టీలో అందరూ క్రమశిక్షణ పాటించాలని రాహుల్‌గాంధీ, సీఎం సిద్దరామయ్య సూచించారన్నారు. కాంగ్రెస్ పార్టీని తానొక్కడే కాదు, కార్యకర్తలు, ప్రజలు కలిసి గెలిపించారన్నారు. జై భీమ్ సమావేశాల నిర్వహణ పరిశీలనకు ఇన్చార్జి సుర్జేవాలా శుక్రవారం బెళగావికి వస్తారని, మీ ప్రశ్నలు ఏమైనా ఉంటే ఆయనను అడగాలని నేతలకు సూచించారు. మరోవైపు మంత్రి సతీష్ జార్కిహొళికి కేపీసీసీ నుంచి నోటీసులు వెళ్లాయి.రేసులో ఉన్నాననలేదు: సతీశ్కేపీసీసీ నుంచి నోటీసులు ఇచ్చినప్పటికీ ఏమీ కాదు, దీనికి స్పష్టమైన సమాధానం అధ్యక్షుడి ముందు ఇస్తానని మంత్రి సతీష్ జార్కిహొళి చెప్పారు. డీకేపై తరచూ విమర్శలు చేస్తున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నోటీస్ ఇచ్చే అధికారం ఆయనకు ఉందన్నారు. కేపీసీసీ రేసులో ఉన్నానని నేను ఎక్కడా చెప్పలేదన్నారు. తన మాటలతో ఎవరికీ ఇబ్బంది లేదని, నేను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు. మీడియా ఉదయం హీరోను చేసి, సాయంత్రం విలన్‌ను చేస్తారని, ఇది సబబు కాదని వాపోయారు. మరోవైపు.. కాంగ్రెస్‌లో ప్రస్తుత పరిణామాలపై ప్రతిపక్ష బీజేపీ నేతలు సెటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు. కాంగ్రెస్‌లో ఇలాంటివి కొత్తేమీ కాదని కామెంట్స్ చేస్తున్నారు. -
కాంగ్రెస్ టికెట్ కావాలా? దరఖాస్తు ఫీ రూ.2 లక్షలే.. వారికి 50% డిస్కౌంట్!
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి. ఈ క్రమంలో ఇప్పటి నుంచే అందుకు సన్నద్ధమవుతోంది కర్ణాటక కాంగ్రెస్. ఎన్నికల పట్ల అభ్యర్థులు సీరియస్‌గా ఉండేందుకోసమంటూ దరఖాస్తు ప్రక్రియను బుధవారం ప్రకటించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ కావాలనుకునే వారు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించారు కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్. ఈ ప్రక్రియ 10 రోజుల పాటు సాగనుందన్నారు. ‘కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేయాలనుకుంటున్న వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాం. దరఖాస్తు విండో నవంబర్ 5 నుంచి 15వ తేదీ వరకు 10 రోజుల పాటు తెరిచి ఉంటుంది. మా ఆఫీసులో దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉన్నాయి. అప్లికేషన్ ఫీజు రూ.5,000. జనరల్ కేటగిరీ దరఖాస్తుదారులు రూ.2 లక్షల డిమాండ్ డ్రాఫ్ట్(డీడీ) ఇవ్వాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీలకు 50శాతం డిస్కౌంట్‌తో రూ.1 లక్ష కట్టాలి. సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. అందులో నేను సైతం ఉంటాను. నేను పోటీ చేయాలనుకుంటే, తప్పకుండా దరఖాస్తు చేసుకోవాల్సిందే.’అని తెలిపారు కేపీసీసీ ప్రెసిడెంట్ డీకే శివకుమార్. ఈ ఫండ్స్‌ను పార్టీ నూతన భవనం నిర్మాణం సహా వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రకటనలు ఇచ్చేందుకు ఉపయోగిస్తామని తెలిపారు. మరోవైపు.. ఎన్నికలకు చాలా సమయం ఉన్నప్పటికీ ఈసారి దరఖాస్తులను ముందస్తుగానే ఆహ్వానిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఎన్నికల పట్ల అశ్రద్ధగా ఉన్నవారిని ఫిల్టర్ చేసేందుకే ఫీజును పెంచినట్లు చెప్పాయి. ఏఐసీసీ అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మార్గదర్శకత్వం, కాంగ్రెస్ భావజాలాన్ని నమ్మే వారు ఎవరైనా పార్టీలో చేరొచ్చని తెలిపారు డీకే శివకుమార్. ఆన్లైన్ సభ్యత్వ నమోదు కొనసాగుతోందని చెప్పారు. అలాగే.. ఏఐసీసీ అధ్యక్షుడిగా రాష్ట్ర నేత మల్లికార్జున ఖర్గే బాధ్యతలు చేపట్టిన క్రమంలో ఆయనకు నవంబర్ 6న సర్వోదయ సమవేశం ద్వారా ఘన స్వాగతం పలకాలని ఏర్పాట్లు చేస్తోంది. ఇదీ చదవండి: ‘ఈ విచారణలేందుకు.. వీలైతే నేరుగా అరెస్ట్ చేయండి’.. జార్ఖండ్ సీఎం సవాల్ -
భారత్ జోడో యాత్రలో సోనియా, ప్రియాంక
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో సాగే భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా పాల్గొననున్నారు. రాహుల్ గాంధీ సారథ్యంలో కొనసాగుతున్న ఈ యాత్ర ఈనెల 30వ తేదీన ఉదయం 9 గంటలకు కేరళ సరిహద్దులోని గుండ్లుపేట్ వద్ద కర్ణాటకలో ప్రవేశించనుంది. రాష్ట్రంలో జరిగే యాత్రలో సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా వేర్వేరుగా పాల్గొంటారని కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ శుక్రవారం చెప్పారు. ఇందుకు సంబంధించిన తేదీలను త్వరలో ప్రకటిస్తామన్నారు. కర్ణాటకలో భారత్ జోడో యాత్రకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టే బాధ్యతలను నాయకులకు అప్పగించామని తెలిపారు. దీనిపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, రణదీప్ సింగ్ సూర్జేవాలాలతో కలిసి సమీక్షించామన్నారు. ఇలా ఉండగా, కేరళలోని చలకుడి వద్ద భారత్ జోడో యాత్ర శుక్రవారం విశ్రాంతి కోసం నిలిచిపోయిందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ చెప్పారు. యాత్రికుల కోసం కేటాయించిన కంటెయినర్లో రాహుల్‌గాంధీ విశ్రాంతి తీసుకున్నారని చెప్పారు. అక్కడే వైద్య శిబిరం నిర్వహించినట్లు వెల్లడించారు. రాహుల్ ఢిల్లీ వెళ్లారంటూ మీడియాలో వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. -
డీకే శివకుమార్‌కు సీబీఐ సమన్లు
బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్‌కు శనివారం సీబీఐ సమన్లు పంపింది. లెక్కల్లో చూపని ఆస్తుల కేసులో సీబీఐ ఈ సమన్లు పంపింది. ఈ నెల 25న శివకుమార్ సీబీఐ ముందు హాజరుకానున్నారు. 23న తమ ముందు హాజరుకమ్మని సీబీఐ కోరిందని, కానీ తనకు వేరే కార్యక్రమం ఉన్నందున 25న హాజరవుతానని తెలిపారు. కర్ణాటకలోని మస్కి, బసవకళ్యాణ నియోజకవర్గాల్లో త్వరలో ఉప ఎన్నికలను ప్రకటించే అవకాశాలున్నాయి. అందుకే ఈ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతలు పర్యటించనున్నారు. గతనెల 5న శివకుమార్‌తో పాటు పలువురికి చెందిన నివాసాలపై సీబీఐ సోదాలు నిర్వహించింది. సోదాల్లో రూ.57లక్షల నగదు, పలు డాక్యుమెంట్లు, లభించినట్లు సీబీఐ తెలిపింది. -
ఉప ఎన్నికల్లో బీజేపీ విజయభేరి
సాక్షి, బెంగళూరు: కర్ణాటక ఉప ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 15 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 12 సీట్లను కమలం పార్టీ గెల్చుకుంది. రెండు స్థానాల్లో కాంగ్రెస్, ఒక స్థానంలో బీజేపీ రెబల్ విజయం సాధించారు. డిసెంబర్ 5న ఎన్నికలు జరగగా, ఫలితాలు సోమవారం వెలువడ్డాయి. ఈ విజయంతో రాష్ట్రంలో యడియూరప్ప ప్రభుత్వం మెజారిటీ మార్క్‌ను సొంతంగా సాధించుకున్నట్లైంది. అసెంబ్లీలో మొత్తం 225 (ఒక నామినేటెడ్సహా) సీట్లు కాగా, రెండు ఖాళీగా ఉన్నాయి. మిగిలిన 223 స్థానాలకు 112 మెజారిటీ మార్క్. ప్రస్తుతం ఉన్న 105 స్థానాలకు తాజా విజయంతో మరో 12 సీట్లను బీజేపీ కలుపుకుంది. దాంతో, అసెంబ్లీలో బీజేపీ బలం 117కి చేరుకుని, మెజారి టీ మార్క్‌ను సునాయాసంగా దాటేసింది. ఈ ఎన్నికలు కాంగ్రెస్‌కు ఘోర పరాజయాన్ని మిగిల్చాయి. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ సీఎల్పీ నేత సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు గుండూరావు తమ పదవులకు రాజీనామా చేశారు. శివాజీనగర, హణసూరు నియోజకవర్గాల్లో మినహాయించి మిగిలిన అన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. శివాజీనగర్‌లో రిజ్వాన్ అర్షద్, హణసూరు లో మంజునాథ్‌లు గెల్చారు. హొసకోటలో బీజేపీ తిరుగుబాటు అభ్యర్థి శరత్ గెలుపొందారు. జేడీఎస్ అభ్యర్థులు పోటీ చేసిన 12 స్థానాల్లోనూ ఓడిపోయారు. ఉప ఎన్నికలు జరిగిన ఈ 15 సీట్లలో 12 కాంగ్రెస్‌వే. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 15 సీట్లకు గానూ.. 12 స్థానాల్లో కాంగ్రెస్, 3 సీట్లలో జేడీఎస్ గెలుపొందాయి. ఆ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఈ ఎన్నికల్లో మెజారిటీని ఇచ్చిన రాష్ట్ర ప్రజలకు యడియూరప్ప కృతజ్ఞతలు తెలిపారు. మిగతా మూడున్నరేళ్లు సుస్థిర, ప్రగతిశీల పాలన అందిస్తానన్నారు. ఈ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇస్తానన్న హామీ విషయంలో వెనక్కు వెళ్లబోనన్నారు. ప్రస్తుతం, ముఖ్యమంత్రి సహా కేబినెట్లో 18 మంది మంత్రులున్నారు. మంత్రిమండలిలో మొత్తం 34 మందికి చోటు కల్పించే అవకాశం ఉంది. వెన్నుపోటుదారులకు మద్దతిచ్చారు ఉప ఎన్నికల ఫలితాలపై బహుభాషా నటుడు ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. ‘అభినందనలు కర్ణాటక. వెన్నుపోటు పొడిచే వ్యక్తులు మళ్లీ ముందుకు వచ్చారు. వారే మీకు తిరుగుబాణం అవుతారని ఆశిస్తున్నాను. అనర్హులకు మద్దతు ఇచ్చారు, మంచిది’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేల గెలుపు కాంగ్రెస్, జేడీఎస్‌లకు చెందిన 17 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి, బీజేపీకి మద్దతివ్వడంతో, ఈ జూలై నెలలో జేడీఎస్ నేత కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వం కుప్పకూలింది. యడియూరప్ప ముఖ్యమంత్రిగా బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. ఆ 17 మందిని స్పీకర్ అనర్హులుగా ప్రకటించారు. జూలై 29న యడియూరప్ప అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నెగ్గారు. స్పీకర్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థిస్తూనే, ఆ ఎమ్మెల్యేలు ఉప ఎన్నికల్లో పోటీ చేసే చాన్సిచ్చింది. మస్కి, ఆర్ఆర్ నగర్ స్థానాలకు సంబంధించి హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండటంతో ఆ స్థానాలను మినహాయించి, 15 స్థానాల్లో ఉప ఎన్నికలు నిర్వహించారు. కాంగ్రెస్, జేడీఎస్‌లపై తిరుగుబాటు చేసి తమ పార్టీలో చేరి, అనర్హతకు గురైన ఎమ్మెల్యేల్లో 13 మందిని బీజేపీ పోటీలో నిలపగా 11 మంది గెల్చారు. -
కేపీసీసీ చీఫ్‌గా దినేశ్ గుండూరావు
న్యూఢిల్లీ: కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడి(కేపీసీసీ)గా దినేశ్ గుండూరావు(48) నియమితులయ్యారు. ప్రస్తుత పీసీసీ చీఫ్ జి.పరమేశ్వర సంకీర్ణ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా కూడా కొనసాగుతున్నందున ఈ నియామకం చేపట్టినట్లు ఏఐసీసీ పేర్కొంది. బెంగళూరులోని గాంధీనగర్ స్థానం నుంచి ఐదు పర్యాయాలు ఎన్నికైన గుండూరావు కేపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఆయన గత కేబినెట్లో పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయనతోపాటు ఎమ్మెల్యేగా ఈశ్వర్ ఖంద్రేను కేపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. కర్ణాటకలో జేడీఎస్–కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం అధికారం చేపట్టిన నేపథ్యంలో ఈ నియామకాలు జరిగాయి. రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో యువ రక్తాన్ని నింపాలన్న రాహుల్ ఆలోచన మేరకే ఈ మార్పులు చోటుచేసుకున్నట్లు భావిస్తున్నారు. -
కేపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజీనామా
బెంగళూరు: కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎస్ఆర్ పాటిల్ తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో.. ఉత్తర (బాంబే) కర్ణాటక ప్రాంతంలో కాంగ్రెస్ పేలవ ప్రదర్శనకు నైతిక బాధ్యత వహిస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి నా రాజీనామా లేఖను పంపించాను. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఆశించిన స్థాయిలో విజయం సాధించనందుకు నైతిక బాధ్యతగా రాజీనామా చేశాను. ఉత్తర కర్ణాటకలో మా పార్టీ మరికొన్ని సీట్లు గెలిచుంటే.. సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసుకునేవాళ్లం’ అని పాటిల్ ఆదివారం బెంగళూరులో తెలిపారు. -
కేపీసీసీ అధ్యక్షుడిగా అత్యధిక కాలం
బెంగళూరు: కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన కేపీసీసీ అధ్యక్షుడు జి.పరమేశ్వర సంపన్న దళిత కుటుంబంలో పుట్టి విదేశాల్లో ఉన్నత చదువులు కూడా చదివారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటి నుంచి కష్టకాలంలోనూ పార్టీకి విధేయుడిగా ఉన్నారు. 2010 అక్టోబరులో కేపీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికై బుధవారంవరకూ నిరంతరాయంగా కొనసాగి ఆ పదవిలో అత్యంత ఎక్కువ కాలం ఉన్న నేతగా రికార్డులకెక్కారు. తన భావాలను స్పష్టంగా వ్యక్తపరుస్తూనే మృదువుగా మాట్లాడగల వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. బెంగళూరులోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ, ఎమ్మెస్సీ చదివిన అనంతరం ఆస్ట్రేలియాలోని వైటీ అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్లో పీహెచ్డీ పూర్తి చేశారు. ఆ తర్వాత తమ కుటుంబం స్థాపించిన విద్యాసంస్థలకు పరిపాలనాధికారిగా పనిచేశారు. 1989లో పరమేశ్వర గురించి తెలుసుకున్న రాజీవ్ గాంధీ ఆయనను ఢిల్లీకి పిలిపించుకుని మాట్లాడి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. అదే ఏడాది తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసి జనతాదళ్ అభ్యర్థిపై విజయం సాధించారు. 1999లో జరిగిన ఎన్నికల్లో 55.8 వేల ఓట్ల మెజారిటీ సాధించి తొలిసారిగా ఎస్ఎం కృష్ణ మంత్రివర్గంలో సహాయ మంత్రి పదవి పొందారు. 2013లో ఆయన కేపీసీసీ అధ్యక్షుడిగా ఉండగా జరిగిన కర్ణాటక విధానసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించినా పరమేశ్వర అనూహ్యంగా ఓడిపోయారు. -
ఢిల్లీకి రండి !
బెంగళూరు: రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ, పునఃరచన విషయమై మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో చర్చ మొదలైంది. ఈ విషయంపై కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జి.పరమేశ్వర్, కాంగ్రెస్ సీనియర్ నేత ఎస్.ఎం.కృష్ణతో సమావేశమయ్యారు. ఇక మంత్రి వర్గ విస్తరణపై చర్చించేందుకు ఢిల్లీకి రావాల్సిందిగా పరమేశ్వర్‌కు హైకమాండ్ నుంచి పిలుపు అందింది. దీంతో శనివారం సాయంత్రమే కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జి. పరమేశ్వర్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. దసరా పండుగ అనంతరం మంత్రివర్గ విస్తరణ చేపడతామని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ రాష్ట్ర పర్యటన కంటే ముందు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేడు (ఆదివారం) ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీ చేరుకున్న అనంతరం రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ, పునఃరచన విషయాలపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హైకమాండ్‌తో చర్చించనున్నారు. కాగా, ఇదే సందర్భంలో కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జి.పరమేశ్వర్‌కు సైతం కాంగ్రెస్ హైకమాండ్ నుంచి పిలుపు అందింది. మంత్రివర్గ విస్తరణపై చర్చించేందుకు దిల్లీకి రావాల్సిందిగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కర్ణాటక కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్ నుంచి పరమేశ్వర్‌కు పిలుపు అందింది. దీంతో శనివారం సాయంత్రమే పరమేశ్వర్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఎస్.ఎం.కృష్ణతో భేటీ... కాగా, ఢిల్లీ బయలుదేరి వెళ్లడానికి ముందు కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జి.పరమేశ్వర్, మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.ఎం.కృష్ణతో భేటీ అయ్యారు. శనివారం ఉదయమిక్కడి ఎస్.ఎం.కృష్ణ నివాసానికి చేరుకున్న పరమేశ్వర్ మంత్రి వర్గ విస్తరణతో పాటు తన ఢిల్లీ పయనంపై చర్చించారు. ఎస్.ఎం.కృష్ణతో, జి.పరమేశ్వర్ భేటీ కావ డం కాంగ్రెస్ పార్టీతో పాటు రాజకీయ వర్గాల్లో తీవ్ర కుతూహలాన్నే రేకెత్తిస్తోంది. రాష్ట్ర రాజకీయాలపై హైకమాండ్‌తో చర్చించేందుకు గాను ఎస్.ఎం.కృష్ణ సైతం ఇటీవలే ఢిల్లీ వెళ్లి వచ్చారు. దీంతో పరమేశ్వర్, ఎస్.ఎం.కృష్ణల భేటీపై అన్ని వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది. కాగా, ఈ సమావేశం అనంతరం పరమేశ్వర్ విలేకరులతో మాట్లాడుతూ....ఎస్.ఎం.కృష్ణతో తాను సమావేశం కావడంలో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని వివరించారు. కేవలం ఆయనతో వ్యక్తిగత విషయాలు మాట్లాడేందుకు మాత్రమే తాను వచ్చానని చెప్పారు. ఇక ఉప ముఖ్యమంత్రి పదవికి సంబంధించి హైకమాండ్‌దే తుది నిర్ణయమని పరమేశ్వర్ తెలిపారు. ఎస్.ఎం.కృష్ణ ఇంటి వద్ద బారులుతీరిన ఆశావహులు... ఇక మంత్రి వర్గ విస్తరణ తుది ఘట్టానికి చేరుకున్న నేపథ్యంలో మంత్రి వర్గంలో స్థానాన్ని ఆశించే ఆశావహులంతా ఎస్.ఎం.కృష్ణ ఇంటి వద్ద బారులు తీరారు. తమకు మంత్రివర్గంలో స్థానం ఇప్పించాల్సిందిగా సిఫార్సు చేయాలని కోరేందుకు వీరంతా ఎస్.ఎం.కృష్ణ ఇంటికి చేరుకుంటున్నారు. దసరా శుభాకాంక్షలు తెలియజేసేందుకు అంటూ ఎస్.ఎం.కృష్ణ ఇంటికి చేరుకుంటున్నారు. కాగా, ఎస్.ఎం.కృష్ణను కలిసిన ఆశావహుల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే బసవరాజ రాయరెడ్డి సైతం ఉన్నారు. -
కాంగ్రెస్‌లో ఉత్కంఠ
20 తర్వాత నామినేటెడ్ పోస్టుల భర్తీ! * అనంతరం మంత్రి మండలి విస్తరణ, పునర్ వ్యవస్థీకరణ * లాబీయింగ్ జోరు పెంచిన ఆశావహులు * సమన్వయ బాటలో సీఎం సిద్ధు, కేపీసీసీ చీఫ్ ? సాక్షి, బెంగళూరు : అధికార కాంగ్రెస్ పార్టీలో అటు ప్రభుత్వ పరంగా, ఇటు పార్టీ పరంగా నెలాఖరుకు భారీ మార్పులు జరగబోతున్నాయి. గత ఏడాదిన్నరగా ఊరిస్తున్న నామినేటెడ్ పోస్టుల భర్తీతో పాటు మంత్రి మండలి విస్తరణ, పునఃవ్యవస్థీకరణ కూడా జరగనుంది. దీంతో ఆశావహులు ఇటు సీఎం సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్‌తో పాటు ఢిల్లీ పెద్దల ఆశీస్సులను పొందడానికి భారీ లాబీయింగ్ చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా ఇప్పటికీ నామినేటెడ్ పోస్టుల భర్తీ కొలిక్కి రాలేదు. సీఎం సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ మధ్య నడుస్తున్న కోల్డ్‌వారే ఇందుకు ప్రధాన కారణమనేది బహిరంగ రహస్యం. అయితే గత నెల బెంగళూరు వచ్చిన కాంగ్రెస్ పార్టీ కర్ణాటక రాజకీయ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ ఈ ఇద్దరు నాయకులపై సీరియస్ అయ్యారు. దీంతో వారు దారిలోకి వచ్చినట్లు సమాచారం. దీంతో ఈ నెల 20 తర్వాత జాబితాను విడుదల చేయాలని పార్టీ అధినాయకులు భావిస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై సీఎం ఆప్త మంత్రి ఒకరు మాట్లాడుతూ... ‘మొదట్లో ఈనెల 16న జాబితా విడుదల చేయాలని భావించినా, ఎమ్మెల్యేలు, ఎన్నికల్లో ఓడిపోయిన వారికి పోస్టులను కేటాయించడంపై కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అందువల్లే సిద్ధరామయ్య, పరమేశ్వర్ సోమవారం నాటి ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. ఇరవై తర్వాత వారు ఈ విషయమై చర్చించేందుకు ఢిల్లీ వెళ్లనున్నారు. ఏది ఏమైనా నెలాఖరుకు ఈ విషయంలో స్పష్టత వస్తుంది’ అని పేర్కొన్నారు. పదవులు కోల్పోవడం ఖాయం! ఏడాదిన్నర దాటినా రాష్ట్ర మంత్రి మండలిలో ఇంకా ఖాళీలు ఉన్నాయి. వీటిపై చాలా మంది నాయకులు ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా పరమేశ్వర్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి కచ్చితమనే వాదన వినిపిస్తోంది. సీనియర్ ఎమ్మెల్యే బసవరాజరాయరెడ్డి తదితరులు మంత్రి పదవులు ఆశలు పెట్టుకున్నారు. వీరికి ఇప్పటికైనా పదవులు కేటాయించకపోతే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం. పరమేశ్వర్ డిప్యూటీ సీఎం పదవి కోరకున్నా ఆయన అనుచరులు హైకమాండ్‌పై ఒత్తిడి తీసుకు వస్తున్నారు. ‘అన్ని విషయాలు పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటాం. మంత్రి మండలి విస్తరణ కూడా ఉంటుంది’ అని ఇటీవల బెంగళూరు పర్యటనలో డిగ్గీ పేర్కొనడం ఇందుకు ఊతమిస్తోంది. చాలా మంది సీనియర్ మంత్రులు కార్యకర్తలకు అందుబాటులో ఉండటం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయమై సొంత పార్టీ ఎమ్మెల్యేలే సీఎం సిద్ధరామయ్యకు లేఖలు రాశారు. మరోవైపు అవినీతి, అక్రమాలే ప్రచార సాధనాలుగా చేసుకుని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలోని కొంత మంది మంత్రులపై భూకబ్జా, ఇసుక అక్రమ రవాణా తదితర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో పునఃవ్యవస్థీకరణలో భాగంగా కొంతమందిని పదవుల నుంచి తప్పించడంతో పాటు శాఖల మార్పు కూడా జరగవచ్చునని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈ రెండు విషయాలపై కూడా ‘ఢిల్లీ టూర్’లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాగా,‘పునఃవ్యవస్థీకరణలో భాగంగా కొంత మంది మంత్రులను తప్పించవచ్చు. శాఖల మార్పు కూడా ఉంటుంది’ అని సీఎం సిద్ధరామయ్య ఢిల్లీలో ఇటీవల పేర్కొనడం ఇందుకు మరింత బలమిస్తోంది. ఏది ఏమైన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన దాదాపు ఏడాదిన్నర తర్వాత కాంగ్రెస్ పార్టీలో భారీ మార్పులు జరుగనున్నాయనేది స్పష్టమవుతోంది. అయితే ఈ పరిణామం ఏ మలుపు తిరుగుతుందో తెలియడానికి మరికొంత సమయం వేచిచూడాల్సి ఉంటుంది. -
ఓటమిపై పోస్టుమార్టం
- ఆత్మావలోకన సమావేశంలో సీఎంకు వ్యతిరేకంగా పలువురి ఫిర్యాదు - హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లిన దిగ్విజయ్ సింగ్ - ముఖ్యమంత్రి, కేపీసీసీ చీఫ్‌కు అధిష్టానం పిలుపు సాక్షి ప్రతినిధి, బెంగళూరు : లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. గత వారంతంలో నిర్వహించిన ఆత్మావలోకన సమావేశంలో ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్ సింగ్‌కు పలువురు ఫిర్యాదు చేశారు. ఓటమికి ఆయనే కారణమంటూ ఆరోపణలు చేశారు. దీనిపై నివేదికను అధిష్టానానికి సమర్పించినట్లు సమాచారం. రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రితో పాటు కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వరల నుంచి వివరణ కోరడానికి బుధవారం ఢిల్లీకి రావాల్సిందిగా ఇద్దరినీ ఆదేశించినట్లు సమాచారం. ఇదే సమయంలో సీఎంపై వచ్చిన ఆరోపణలపై కేంద్ర మాజీ మంత్రి ఏకే. ఆంటోనీ వివరణ కోరే అవకాశముంది. ఒంటెత్తు పోకడలు నగరంలో పార్టీ నాయకులతో దిగ్విజయ్ సింగ్ బహిరంగంగానే చర్చించినప్పటికీ, పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆయనను విడిగా కలుసుకుని సిద్ధరామయ్య, ఆయన సన్నిహితులపై ఆరోపణలు చేసినట్లు తెలిసింది. ఎన్నికల్లో కేవలం తొమ్మిది స్థానాలతోనే తృప్తి పడాల్సి రావడంపై ఆవేదన వ్యక్తం చేశారు. సిద్ధరామయ్య వ్యవహార శైలే ఇందుకు కారణమని, అందరినీ ఏకతాటిపై నడిపించక పోవడం వల్లే ఈ ఓటమి ఎదురైందని విశ్లేషించారు. ఏడాది కిందట జరిగిన శాసన సభ ఎన్నికల్లో 122 సీట్లను గెలుచుకుని అధికారంలోకి వచ్చినా... లోక్‌సభ ఎన్నికల్లో 136 సెగ్మెంట్లలో వెనుకబడి పోయామని వివరించారు. ప్రభుత్వ పనితీరుపై రాష్ర్టంలో ప్రధాన సామాజిక వర్గాలైన ఒక్కలిగులు, లింగాయత్‌లు అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమను పూర్తిగా విస్మరించిందనే భావన ఆ వర్గాల్లో నెలకొందని చెప్పారు. పూర్వాశ్రమంలో జేడీఎస్‌కు చెందిన వారు సీఎం చుట్టూ కోటరీగా ఏర్పడి, ప్రభుత్వ నిర్ణయాల్లో కీలక పాత్ర వహిస్తున్నారని ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. తొలి నుంచీ కాంగ్రెస్‌నే నమ్ముకున్న వారిని పూర్తిగా విస్మరించారని ఆరోపించినట్లు సమాచారం.