![I have always longed for the top post, says KPCC president - Sakshi](/styles/webp/s3/article_images/2018/05/24/PARA.jpg.webp?itok=x9l4MsbF)
బెంగళూరు: కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన కేపీసీసీ అధ్యక్షుడు జి.పరమేశ్వర సంపన్న దళిత కుటుంబంలో పుట్టి విదేశాల్లో ఉన్నత చదువులు కూడా చదివారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటి నుంచి కష్టకాలంలోనూ పార్టీకి విధేయుడిగా ఉన్నారు. 2010 అక్టోబరులో కేపీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికై బుధవారంవరకూ నిరంతరాయంగా కొనసాగి ఆ పదవిలో అత్యంత ఎక్కువ కాలం ఉన్న నేతగా రికార్డులకెక్కారు. తన భావాలను స్పష్టంగా వ్యక్తపరుస్తూనే మృదువుగా మాట్లాడగల వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు.
బెంగళూరులోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ, ఎమ్మెస్సీ చదివిన అనంతరం ఆస్ట్రేలియాలోని వైటీ అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఆ తర్వాత తమ కుటుంబం స్థాపించిన విద్యాసంస్థలకు పరిపాలనాధికారిగా పనిచేశారు. 1989లో పరమేశ్వర గురించి తెలుసుకున్న రాజీవ్ గాంధీ ఆయనను ఢిల్లీకి పిలిపించుకుని మాట్లాడి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. అదే ఏడాది తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసి జనతాదళ్ అభ్యర్థిపై విజయం సాధించారు. 1999లో జరిగిన ఎన్నికల్లో 55.8 వేల ఓట్ల మెజారిటీ సాధించి తొలిసారిగా ఎస్‌ఎం కృష్ణ మంత్రివర్గంలో సహాయ మంత్రి పదవి పొందారు. 2013లో ఆయన కేపీసీసీ అధ్యక్షుడిగా ఉండగా జరిగిన కర్ణాటక విధానసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించినా పరమేశ్వర అనూహ్యంగా ఓడిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment