![Fund Review SBI Long Term Equity Fund](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/sbi.jpg.webp?itok=BznrrXs3)
దీర్ఘకాల లక్ష్యాలకు సంబంధించి పెట్టుబడుల్లో ఈక్విటీలకు (Equity Fund) కచ్చితంగా చోటు కల్పించుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. ఎందుకంటే ఇతర సాధనాలతో పోల్చితే ఈక్విటీలు దీర్ఘకాలంలో మెరుగైన రాబడిని ఇచ్చినట్టు చారిత్రక డేటా తెలియజేస్తోంది. ద్రవ్యోల్బణమే సగటున 5–6 శాతం స్థాయిలో ఉంటోంది. ఇంతకుమించిన రాబడిని సంపాదించుకున్నప్పుడే అసలైన సంపద వృద్ధి సాధ్యపడుతుంది.
అందుకు ఈక్విటీలు అవకాశం కల్పిస్తాయి. ఈక్విటీల్లోనూ పన్ను ఆదా ప్రయోజనం కోరుకునే వారు ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్‌ఎస్‌ఎస్) ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఈ విభాగంలో దీర్ఘకాల చరిత్ర కలిగిన పథకాల్లో ఎస్‌బీఐ లాంగ్‌టర్మ్ ఈక్విటీ ఫండ్ (SBI Long Term Equity Fund) ఒకటి.
రాబడులు
ఈ పథకంలో ఏడాది కాల రాబడి 14 శాతంగా ఉంది. అదే మూడేళ్లలో చూసుకుంటే వార్షికంగా 23 శాతం చొప్పున రాబడిని తెచ్చిపెట్టింది. ఐదేళ్లలోనూ ఏటా 23 శాతం రాబడి ఈ పథకంలో గమనించొచ్చు. ఏడేళ్లలో ఏటా 16 శాతం, పదేళ్లలో 14 శాతం చొప్పున పెట్టుబడులపై ఇన్వెస్టర్లకు ప్రతిఫలాన్ని అందించింది. ఎల్‌ఎస్‌ఎస్ విభాగం సగటు రాబడితో పోల్చి చూసినప్పుడు ఈ పథకంలోనే మెరుగైన రాబడి కనిపిస్తోంది. వివిధ కాలాల్లో 1–8 శాతం మధ్య అధిక రాబడిని ఈ పథకమే అందించింది. అంతేకాదు బీఎస్‌ఈ 500 టీఆర్‌ఐ కంటే కూడా ఈ పథకమే మెరుగైన పనితీరు నమోదు చేసింది.
1993 మార్చి 31న ఈ పథకం ఆరంభం కాగా, అప్పటి నుంచి చూస్తే వార్షిక రాబడి 16.99 శాతంగా ఉండడం గమనార్హం. ఈ పథకంలో మొదటిసారి రూ.10,000 లంప్‌సమ్ ఇన్వెస్ట్ చేసి, ఆ తర్వాత నుంచి ప్రతి నెలా రూ.2,000 చొప్పున సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో గడిచిన ఐదేళ్ల పాటు ఇన్వెస్ట్ చేసి ఉంటే.. మొత్తం పెట్టుబడి రూ.1.30 లక్షలు కాగా, రాబడులతో కలసి అది ఇప్పుడు రూ.2,54,592గా మారి ఉండేది. అంటే ఐదేళ్లలో పెట్టుబడి దాదాపు వృద్ధిని చూసి ఉండేది. అదే డెట్ సాధనం అయిన నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్‌లో పెట్టుబడి రెట్టింపునకు ప్రస్తుతమున్న 7.7% రేటు ఆధారంగా 10 ఏళ్ల 4 నెలలు పడుతుంది.
పెట్టుడుల విధానం/ పోర్ట్‌ఫోలియో
ఈ పథకంలో పెట్టుబడిని ఆదాయపన్ను పాత విధానంలో సెక్షన్ 80సీ పరిధిలో చూపించుకుని రూ.1.5 లక్షల మొత్తంపై పన్ను మినహాయింపు ప్రయోజనం పొందొచ్చు. ఈ పథకంలో పెట్టుబడికి మూడేళ్ల లాకిన్ ఉంటుంది. ఆ తర్వాతే పెట్టుబడిని వెనక్కి తీసుకోవడానికి అనుమతిస్తారు. పన్ను ఆదాతోపాటు పెట్టుబడుల వృద్ధి ప్రయోజనం ఈ పథకంతో లభిస్తుంది. పెట్టుబడుల్లో వైవిధ్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/2_168.jpg)
కాంపౌండింగ్‌తో దీర్ఘకాలంలో పెట్టుబడి మెరుగైన వృద్ధికి నోచుకుంటుంది. ఈ పథకం నిర్వహణలో రూ.27,791 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో 90 శాతం మేర ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసింది. డెట్‌లో కేవలం 0.14 శాతమే పెట్టుబడి ఉంది. మిగిలిన 9.6 శాతం నగదు, నగదు సమానాల్లో కలిగి ఉంది. స్టాక్స్ విలువలు గరిష్టానికి చేరిన నేపథ్యంలో మెరుగైన పెట్టుబడి అవకాశాల కోసం నగదు నిల్వలు నిర్వహిస్తున్నట్టు కనిపిస్తోంది.
ఈక్విటీల్లోనూ 76 శాతం పెట్టుబడులు లార్జ్‌క్యాప్ కంపెనీల్లోనే ఉన్నాయి. మిడ్‌క్యాప్ కంపెనీలకు 16.44 శాతం, స్మాల్‌క్యాప్ కంపెనీలకు 7.84 శాతం వరకు కేటాయింపులు చేసింది. అత్యధికంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీల్లో 26 శాతం, టెక్నాలజీ కంపెనీల్లో 14.51 శాతం, ఎనర్జీ, యుటిలిటీ కంపెనీల్లో 12.47 శాతం చొప్పున పెట్టుబడులు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment