equity fund
-
రిస్క్ తక్కువ.. రాబడులు స్థిరం
రిస్క్ పెద్దగా భరించలేని వారు, అదే సమయంలో ఈక్విటీ ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్ చేయాలని భావించే వారు యూటీఐ ఫ్లెక్సీక్యాప్ ఫండ్‌ను పరిశీలించొచ్చు. దీర్ఘకాలంలో రాబడుల చరిత్ర స్థిరంగా ఉంది. గతంలో యూటీఐ ఈక్విటీ ఫండ్‌గా కొనసాగిన ఈ పథకం, 2017 అక్టోబర్‌లో సెబీ తీసుకొచ్చిన పునర్వ్యవస్థీకరణ నిబంధనల అనంతరం ఫ్లెక్సీక్యాప్గా మారింది.ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్, లార్జ్‌క్యాప్ విభాగాల్లో స్వేచ్ఛగా ఇన్వెస్ట్ చేయగలవు. మెరుగైన అవకాశాలున్న చోట ఎక్కువ పెట్టుబడులు పెట్టేందుకు నిబంధనల పరంగా వెసులుబాటు ఉంటుంది. రిస్క్–రాబడుల సమతుల్యానికి ఈ ఫండ్స్ అనుకూలంగా ఉంటాయి. దీర్ఘకాలంలో మెరుగైన రాబడులు ఈ పథకం 2008, 2011, 2020 కరెక్షన్ సమయాల్లో నష్టాలను పరిమితం చేయడాన్ని గమనించొచ్చు. ఐదేళ్లు, ఏడేళ్లు, పదేళ్ల కాలంలో చూస్తే సగటున మెరుగైన రాబడులు ఉన్నాయి. ఈ పథకం రాబడులకు ఎస్అండ్పీ నిఫ్టీ 500 సూచీ ప్రామాణికం. ఏడాది కాలంలో ఈ పథకం 24 శాతం మేర రాబడులు అందించింది. ఐదేళ్ల కాలంలో సగటున వార్షికంగా 16.47 శాతం రాబడులు ఇచ్చింది.ఏడేళ్ల కాలంలో ఏటా 14 శాతం, పదేళ్ల కాలంలో ఏటా 12.50 శాతం చొప్పున పెట్టుబడులపై ప్రతిఫలాన్ని అందించింది. పోటీ పథకాలతో పోల్చితే రాబడులు కొంత తక్కువగా కనిపించినప్పటికీ.. కరెక్షన్ సమయాల్లో నష్టాలను పరిమితం చేయడంలో ఈ పథకం మెరుగైన పనితీరు చూపిస్తోంది. రాబడుల చరిత్ర గొప్పగా లేకున్నా, దీర్ఘకాలానికి మెరుగ్గా ఉంది. స్థిరంగా తక్కువ ఆటుపోట్లతో ఉన్నందున రిస్క్ తక్కువ కోరుకునే వారికి మంచి ఎంపిక అవుతుంది. ముఖ్యంగా సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఇన్వెస్ట్ చేసుకుంటే మరింత మెరుగైన రాబడులు అందుకోవచ్చు. పెట్టుబడుల విధానం/ పోర్ట్‌ఫోలియో ఈ పథకం నిర్వహణలో ప్రస్తుతానికి రూ.27,706 కోట్ల పెట్టుబడులు (నిర్వహణ ఆస్తులు/ఏయూఎం) ఉన్నాయి. దీర్ఘకాల చరిత్ర ఉండడంతో పెద్ద పథకాల్లో ఒకటి కావడం గమనార్హం. నిర్వహణ ఆస్తుల్లో 96 శాతం మేర ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయగా, 0.52 శాతం మేర డెట్ సాధనాల్లో పెట్టుబడులు పెట్టింది. 3.45 శాతం మేర నగదు నిల్వలు కలిగి ఉంది. ప్రస్తుత మార్కెట్ దిద్దుబాటులో ఆకర్షణీయ అవకాశాలకు వీలుగా నగదు నిల్వలు కలిగి ఉన్నట్టు అర్థమవుతోంది.ఈక్విటీ పెట్టుబడులు గమనించగా, 70 శాతం వరకు లార్జ్‌క్యాప్‌లో ఉంటే, మిడ్‌క్యాప్‌లో 28 శాతం, స్మాల్‌క్యాప్‌లో 2 శాతం వరకు పెట్టుబడులు పెట్టింది. టాప్–10 స్టాక్స్‌లోనే 42 శాతం మేర పెట్టుబడులు ఉన్నాయి. పెట్టుబడులను గమనించినట్టయితే.. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగానికి ఎక్కువ వెయిటేజీ ఇస్తూ, 22 శాతం పెట్టుబడులను ఈ రంగాలకు చెందిన కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేసింది. ఆ తర్వాత టెక్నాలజీ కంపెనీలకు 22 శాతం, కన్జ్యూమర్ డిస్క్రీషినరీ రంగానికి 18 శాతం, హెల్త్‌కేర్ కంపెనీలకు 12 శాతం చొప్పున పెట్టుబడులు కేటాయించింది. -
ఫండ్స్‌లో కొత్త ఇన్వెస్టర్ల జోరు
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ రంగంలో కొత్త ఇన్వెస్టర్ల జోరు కొనసాగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) మొదటి రెండు నెలల్లోనే (ఏప్రిల్, మే) మ్యూచువల్ ఫండ్స్‌లో 81 లక్షల కొత్త ఖాతాలు (ఫోలియోలు) నమోదయ్యాయి. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) డేటాను పరిశీలించగా.. మే చివరికి నాటికి ఫోలియోలు 18.6 కోట్లకు చేరాయి. ఈ ఏడాది మార్చి చివరికి ఉన్న 17.78 కోట్ల ఫోలియోలతో పోలిస్తే 4.6 శాతం పెరిగాయి. ఏప్రిల్‌లో 36.11 లక్షల ఫోలియోలు ప్రారంభం కాగా, మే నెలలో 45 లక్షలుగా ఉన్నాయి. 2023లో నెలవారీ సగటు నూతన ఖాతాల ప్రారంభం 22.3 లక్షలుగా ఉంది. దీంతో పోల్చి చూసినప్పుడు ఏప్రిల్, మే నెలల్లో రెట్టింపు స్థాయిలో కొత్త ఖాతాలు ప్రారంభమైనట్టు తెలుస్తోంది. ఒక ఇన్వెస్టర్‌కు ఒక మ్యూచువల్ ఫండ్ పథకంలో పెట్టుబడిని సూచించేదే ఫోలియో. ఇలా ఒక ఇన్వెస్టర్ పలు రకాల పథకాల్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఒకటికి మించిన ఫోలియోలు కలిగి ఉండడం సహజం. పెరుగుతున్న అవగాహన... ఇన్వెస్టర్లలో అవగాహన పెంచేందుకు మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ అనుసరిస్తున్న పలు ప్రచార కార్యక్రమాలకు తోడు, ఈక్విటీల బలమైన ప్రదర్శన ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు. మ్యూచువల్ ఫండ్స్‌తో పోల్చి చూసినప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్లలో రాబడులు అంత ఆకర్షణీయంగా లేకపోవడం కూడా ఇన్వెస్టర్ల ధోరణిలో మార్పునకు కారణంగా పేర్కొంటున్నారు. అలాగే పెరుగుతున్న ఆదాయం, డిజిటల్ సాధనాల ద్వారా ఆరి్థక సాధనాల్లో పెట్టుబడులకు ఉన్న సౌలభ్యం వృద్ధికి అనుకూలిస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు. కొత్తగా వస్తున్న ఇన్వెస్టర్లలో ఎక్కువ మంది డిజిటల్ ఛానళ్లను ఎంపిక చేసుకుంటున్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఏప్రిల్, మే నెలలో వచి్చన 81 లక్షల కొత్త ఫోలియోలలో 61.25 లక్షలు ఈక్విటీలకు సంబంధించినవి కావడం గమనార్హం. దీంతో పరిశ్రమ వ్యాప్తంగా మొత్తం ఈక్విటీ ఫోలియోలు 12.89 కోట్లకు పెరిగాయి. మొత్తం ఫోలియోలలో ఈక్విటీల వాటా 69 శాతంగా ఉంది. ఈ ఆరి్థక సంవత్సరం మొదటి రెండు నెలల్లో థీమ్యాటిక్/సెక్టోరల్ విభాగంలోనే 23.19 లక్షల కొత్త ఖాతాలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత స్మాల్‌క్యాప్ (8.04 లక్షలు), మిడ్‌క్యాప్ ఫండ్ (7.74 లక్షలు) విభాగాల్లో కొత్త ఖాతాల ప్రారంభం ఎక్కువగా ఉంది. -
ఈ ఫండ్‌తో నమ్మకమైన రాబడులు!
ఇన్వెస్టర్లలో కొందరు రిస్క్ తీసుకోలేరు. అటువంటి వారు ఈక్విటీలకు దూరంగా ఉంటుంటారు. కానీ, దీర్ఘకాలంలో అంటే ఐదేళ్లకు మించిన కాలంలో ఈక్విటీలు మెరుగైన రాబడులు ఇచ్చినట్టు చారిత్రక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కనుక రిస్క్‌ను చూసి భయపడి ఈక్విటీ పెట్టుబడులకు దూరంగా ఉండడం సరికాదు. కాకపోతే మొత్తం పెట్టుబడుల్లో ఈక్విటీలకు కేటాయింపులు కొంత తక్కువ చేసుకుంటే సరిపోతుంది. ఐదేళ్లకు మించి పెట్టుబడులు పెట్టే వెసులుబాటు ఉండి, మోస్తరు రిస్క్‌కు సిద్ధపడే వారికి అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ అనుకూలంగా ఉంటాయి. ఈ విభాగంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఈక్విటీ అండ్ డెట్ ఫండ్ ఎంతో మెరుగైన పనితీరును ప్రదర్శిస్తోంది. రాబడులు ఈ పథకానికి సుదీర్ఘమైన చరిత్ర ఉంది. 1999 నవంబర్ 3న ప్రారంభమైంది. ఆరంభంలో ఈ పథకంలో ఒకే విడత రూ.లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే, నేడు అది రూ.29.33 లక్షలుగా మారి ఉండేది. అంటే ఏటా 15 శాతం కాంపౌండెడ్ రాబడిని అందించింది. ఆరంభం నుంచి ప్రతి నెలా సిప్ రూపంలో రూ.10,000 ఇన్వెస్ట్ చేసినా రూ.28.9 లక్షలు సమకూరి ఉండేది. గడిచిన ఏడాది కాలంలో ఈ పథకం 25 శాతం రాబడులు అందించింది. ఇదే కాలంలో అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ విభాగం సగటు రాబడి 19 శాతంగా ఉంది. మూడేళ్ల కాలంలో ఈ పథకం ఏటా 26 శాతం రాబడిని తెచ్చి పెట్టింది. ఐదేళ్లలో 19 శాతం, ఏడేళ్లలో 16.61 శాతం, పదేళ్లలో 17.69 శాతం చొప్పున వార్షిక రాబడుల చరిత్ర ఈ పథకానికి ఉంది. అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ విభాగం కంటే ఈ పథకంలోనే 2–9 శాతం మధ్య వివిధ కాలాల్లో అధిక రాబడులు ఉన్నట్టు గణాంకాలను పరిశీలిస్తే తెలుస్తుంది. సూచీతో పోల్చి చూసినా ఈ పథకమే ఎక్కువ రాబడిని తెచ్చి పెట్టింది. అన్ని కాలాల్లోనూ స్థిరమైన, నమ్మకమైన రాబడుల చరిత్ర ఈ పథకానికి ఉంది. ముఖ్యంగా గడిచిన ఏడాది కాలంలో కేవలం బెంచ్ మార్క్ అనే కాకుండా, ఈ విభాగంలోని పోటీ పథకాల కంటే మెరుగైన ప్రదర్శన చేసింది. పెట్టుబడుల విధానం, పోర్ట్‌ఫోలియో పరిస్థితులకు అనుగుణంగా ఈ పథకం ఈక్విటీ పెట్టుబడులను 65–80 శాతం మధ్య నిర్వహిస్తూ ఉంటుంది. అలాగే, డెట్ పెట్టుబడులను 20–35 శాతం మధ్య కొనసాగిస్తుంది. స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్, లార్జ్‌క్యాప్ విభాగాల్లో పెట్టుబడులు పెట్టే స్వేచ్ఛ ఈ పథకానికి ఉంది. అంతే కాదు విదేశీ స్టాక్స్‌లో పెట్టుబడుల అవకాశాలను సైతం ఈ పథకం పరిశీలిస్తూ ఉంటుంది. మార్కెట్ల కరెక్షన్లలో పెట్టుబడుల విలువను కాపాడుకునేందుకు డెరివేటివ్స్‌లో ఎక్స్పోజర్ తీసుకుంటుంది. ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.28వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇందులో ఈక్విటీలకు 69 శాతం కేటాయించగా, డెట్ పెట్టుబడులు 22 శాతంగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ సాధనాల్లో 2 శాతం పెట్టుబడులు ఉన్నాయి. నగదు, నగదు సమానాలు 7 శాతంగా ఉన్నాయి. ఇక ఈక్విటీల్లో 86 శాతానికి పైనే లార్జ్‌క్యాప్ కంపెనీలకు కేటాయించింది. మిడ్‌క్యాప్ కంపెనీల్లో 12 శాతం, స్మాల్‌క్యాప్ కంపెనీల్లో 1.24 శాతం చొప్పున పెట్టుబడులు ఉన్నాయి. డెట్ విభాగంలో ఎస్వోవీల్లో 13 శాతం పెట్టుబడులు, 4 శాతం ఏఏ రేటెడ్ సాధనాల్లో కలిగి ఉంది. ఈక్విటీల్లో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు 16 శాతం కేటాయించింది. ఇంధన రంగ కంపెనీల్లో 15.66 శాతం, ఆటోమొబైల్ కంపెనీల్లో 9 శాతం, కమ్యూనికేషన్ కంపెనీల్లో 6.35 శాతం చొప్పున ఇన్వెస్ట్ చేసింది. టాప్ ఈక్విటీ హోల్డింగ్స్ కంపెనీ పెట్టుబడుల శాతం ఎన్టీపీసీ 7.43 ఐసీఐసీఐ బ్యాంక్ 7.01 భారతీ ఎయిర్టెల్ 6 ఓఎన్జీసీ 4.18 మారుతి సుజుకీ 3.92 రిలయన్స్ ఇండస్ట్రీస్ 3.39 సన్‌ఫార్మా 3.07 ఇన్ఫోసిస్ 3.02 హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2.95 టాటామోటార్స్ డీవీఆర్ 2.63 -
అధిక రాబడులు ఆశించే వారికి బెస్ట్ ఆప్షన్
భారత ఆర్థిక వ్యవస్థ 6 శాతంపైనే వృద్ధి సాధిస్తుందని ఆర్బీఐ, రేటింగ్ ఏజెన్సీలతోపాటు ప్రపంచబ్యాంక్, ఐఎంఎఫ్ అంచనా వేస్తున్నాయి. ఈ దశాబ్దం భారత్‌దే అని ఘంటాపథంగా చెబుతున్నాయి. ఆర్థిక వృద్ధి వేగవంతం అయితే ఎక్కువగా లాభపడేది చిన్న, మధ్య స్థాయి కంపెనీలే. ఎందుకంటే ఇవి పెద్ద మొత్తంలో వ్యాపార అవకాశాలను సొంతం చేసుకుంటాయి. కనుక దీర్ఘకాలానికి అధిక రాబడులు ఆశించే వారు, రిస్క్ భరించే సామర్థ్యం ఉన్నట్టు అయితే మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్ పథకాలను ఎంపిక చేసుకోవచ్చు. మిడ్‌క్యాప్ విభాగంలో కోటక్ ఎమర్జింగ్ ఈక్విటీ పథకం మెరుగైన పనితీరు చూపిస్తోంది. రాబడులు ఈ పథకం మిడ్‌క్యాప్ స్టాక్స్‌లో ఎక్కువగా పెట్టుబడులు పెడుతుంటుంది. దీర్ఘకాలంలో పనితీరును గమనించినట్టయితే రాబడులు మెరుగ్గా కనిపిస్తున్నాయి. గడిచిన ఏడాది కాలంలో ఈ పథకంలో రాబడులు 18 శాతానికి పైగా రాబడులు వచ్చాయి. గడిచిన మూడేళ్లలో 29 శాతం, ఏడేళ్లలో 16 శాతం, పదేళ్లలో 22 శాతం చొప్పున వార్షిక రాబడులను ఇచ్చి.. మిడ్‌క్యాప్ విభాగంలోని మెరుగైన పథకాల్లో ఒకటిగా నిలిచింది. మిడ్‌క్యాప్ విభాగం సగటు రాబడులతో పోల్చి చూసినప్పుడు మూడేళ్లు, ఐదేళ్లు, ఏడేళ్లు, పదేళ్ల కాలంలో ఈ పథకమే అధిక రాబడులను అందించింది. కోటక్ మ్యూచువల్ ఫండ్ నిర్వహిస్తున్న ఏకైక మిడ్‌క్యాప్ పథకం ఇదే. బీఎస్ఈ 150 మిడ్‌క్యాప్ టీఆర్ఐతో పోల్చి చూసినప్పుడు ఏడాది, ఐదేళ్లు, పదేళ్ల కాలంలో ఈ పథకమే మెరుగైన పనితీరు చూపించింది. పెట్టుబడుల విధానం/పోర్ట్‌ఫోలియో కనీసం 65 శాతం నుంచి గరిష్టంగా 100 శాతం వరకు పెట్టుబడులను మిడ్‌క్యాప్ కంపెనీలకు కేటాయించడం ఈ పథకం పెట్టుబడుల విధానంలో భాగం. ఎంతో వృద్ధికి అవకాశం ఉన్న ఆణిముత్యాల్లాంటి కంపెనీలను ఈ పథకం గుర్తించి ఇన్వెస్ట్ చేస్తుంటుంది. వ్యాల్యూ స్టాక్స్‌ను సైతం పోర్ట్‌ఫోలియోలో చేర్చుకోవడాన్ని గమనించొచ్చు. మంచి స్టాక్స్‌ను గుర్తించడమే కాదు.. తగిన రాబడులు ఇచ్చే వరకు పోర్ట్‌ఫోలియోలో కొనసాగిస్తుంటుంది. ప్రస్తుతానికి ఈ పథకం నిర్వహణలో రూ.33,918 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. పోర్ట్‌ఫోలియోను గమనించినట్టయితే.. 94.27 శాతం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయగా, మిగిలిన మొత్తాన్ని నగదు రూపంలో కలిగి ఉంది. ఈక్విటీ పెట్టుబడుల్లో 71 శాతం మిడ్‌క్యాప్ కంపెనీల్లోనే ఉన్నాయి. లార్జ్‌క్యాప్ కంపెనీల్లో 27 శాతం ఇన్వెస్ట్ చేయగా, స్మాల్‌క్యాప్ కంపెనీల్లో 2 శాతం మేర పెట్టుబడులు కలిగి ఉంది. పోర్ట్‌ఫోలియోలో మొత్తం 80 స్టాక్స్ ఉన్నాయి. పెట్టుబడుల పరంగా క్యాపిటల్ గూడ్స్ కంపెనీలకు అగ్ర ప్రాధాన్యం ఇచ్చింది. ఈ రంగాలకు చెందిన కంపెనీలకు 19 శాతం కేటాయింపులు చేసింది. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీల్లో 13 శాతం పెట్టుబడులు ఉన్నాయి. మెటీరియల్స్ కంపెనీల్లో 11 శాతం, కెమికల్స్ కంపెనీల్లో 10 శాతం, కన్జ్యూమర్ డిస్క్రీషనరీ కంపెనీల్లో 10 శాతం చొప్పున ఇన్వెస్ట్ చేసింది. హెల్త్‌కేర్ కంపెనీల్లో 6 శాతం వరకు పెట్టుబడులు ఉన్నాయి. లార్జ్‌క్యాప్‌తో పోలిస్తే మిడ్‌క్యాప్ విభాగంలో ఆటుపోట్లు ఎక్కువ. కనుక రిస్క్ భరించే వారే ఈ తరహా పథకాలను పరిగణనలోకి తీసుకోవాలి. -
వృద్ధులకు మెరుగైన పెట్టుబడి సాధనం?
వేర్వేరు మ్యూచువల్ ఫండ్స్‌కు విడిగా కేవైసీ ఇవ్వకుండా, ఏదైనా కేంద్రీకృత ప్లాట్‌ఫామ్ ఉందా? – సమీర్ పటేల్ కేవైసీ (కస్టమర్ గురించి తెలుసుకోవడం) అనేది ఇన్వెస్టర్ల గుర్తింపు, చిరునామాకు సంబంధించినది. నల్లధన నిరోధక చట్టం కింద ఇన్వెస్టర్ విధిగా కేవైసీ వివరాలు ఇవ్వాల్సిందే. ప్రస్తుతం కేంద్రీకృత కేవైసీ (సీకేవైసీ) ప్లాట్‌ఫామ్ ఒకటి పనిచేస్తోంది. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినది. ఇన్వెస్టర్ తన కేవైసీ ప్రక్రియను ఒక్కసారి పూర్తి చేస్తే చాలు. ఇన్వెస్టర్ కొత్త మ్యూచువల్ ఫండ్ పథకంలో ఇన్వెస్ట్ చేయాల్సిన ప్రతి సందర్భంలోనూ కేవేసీ సమర్పించాల్సిన అవసరం ఉండదు. అలాగే, ఇన్వెస్టర్లు పాన్, చిరునామా ధ్రువీకరణ పత్రాలను మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ లేదా సెబీ వద్ద నమోదైన క్యాపిటల్ మార్కెట్ మధ్యవర్తి (స్టాక్ బ్రోకర్, డీపీ)కి సమర్పించొచ్చు. ఆ సమాచారం కేవైసీ రిజిస్ట్రేషన్ ఏజెన్సీల ద్వారా కేంద్రీకృత వ్యవస్థలో నమోదు అవుతుంది. నా వయసు 62 ఏళ్లు. నేను ఏక మొత్తంలో పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నాను. నా మాదిరి వృద్ధులు ఒకే విడత ఇన్వెస్ట్ చేసుకునేందుకు డెట్ ఫండ్ లేదా ఈక్విటీ ఫండ్ ఏది అనుకూలం? – శర్వానంద్ శివమ్ వృద్ధులు కేవలం డెట్‌లోనే ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే అది పొరపాటు అవుతుంది. ముందు కొంత సమయం తీసుకుని పెట్టుబడిపై మరింత స్పష్టతను తెచ్చుకోవాల్సి ఉంటుంది. మీ పెట్టుబడి ఉద్దేశాలు, పెట్టబడి కాలం ఎంతన్నది తేల్చుకోవాలి. మీకు దీర్ఘకాల లక్ష్యం ఉందా? లేక ఐదేళ్లు అంతకంటే ఎక్కువ కాలం తర్వాతే పెట్టుబడి అవసరం ఉందా? వీటికి అవును అనేది సమాధానం అయితే అందుకు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ సరైన ఎంపిక అవుతుంది. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్/క్రమానుగత పెట్టుబడి) లేదా లంప్సమ్ (ఒకే విడత) పెట్టుబడిలో ఏది మంచిది? అని అడిగితే.. మేము అయితే సిప్‌కు అనుకూలం. ఎందుకంటే ఇది కొనుగోలు ధరను సగటుగా మారుస్తుంది. మార్కెట్లు పడిపోయినప్పుడు తక్కువ ధరల్లోనూ సిప్ ద్వారా కొనుగోలు చేస్తారు. అలాగే, మార్కెట్లు గరిష్టాల్లో ఉన్నప్పుడు కూడా క్రమశిక్షణతో పెట్టుబడులు కొనసాగుతాయి. డెట్ ఫండ్స్ అన్నవి స్థిరంగా ఉంటాయి. పెట్టుబడికి రక్షణ ఉద్దేశంతో కొనసాగుతాయి. మీ పెట్టుబడి ఉద్దేశాలకు అనుకూలం అనుకుంటే డెట్ ఫండ్స్‌లో ఒకే విడత ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈక్విటీ పథకాలు స్వల్పకాలంలో తీవ్ర అస్థిరతలతో ఉంటాయి. కనుక ఈక్విటీ పథకాల్లో ఒకే విడత పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసుకోవాలని అనుకుంటుంటే, అప్పుడు ఆ మొత్తాన్ని డెట్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసుకోండి. అక్కడి నుంచి సిస్టమ్యాటిక్ విత్ డ్రాయల్ ప్లాన్ ద్వారా ఈక్విటీ పథకాల్లోకి నిర్ణీత కాలంలోపు పెట్టుబడులను బదిలీ చేసుకోండి. నా సోదరుడు ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసి ఉన్నాడు. దురదృష్టంకొద్దీ అతడు ఇటీవలే మరణించాడు. నామినీగా మా వదిన ఉండడంతో, ఆమె పేరు మీదకు ఫండ్స్ యూనిట్లు బదిలీ అయ్యాయి. ఇప్పుడు మా ఒదిన వాటిని విక్రయించాల్సి ఉంటుందా? –వరుణ్ యూనిట్ హోల్డర్ మరణిస్తే, వారి పేరుమీద ఉన్న యూనిట్లను నామినీ క్లెయిమ్ చేసుకోవాలి. అప్పుడు ఆ యూనిట్లు నామినీకి బదిలీ అవుతాయి. సాధారణంగా బ్యాంకు డిపాజిట్లు, బీమా ప్లాన్లలో ఆ మొత్తం నామినీ బ్యాంకు ఖాతాకు జమ అవుతుంది. కానీ, మ్యూచువల్ ఫండ్స్‌లో అలా కాకుండా యూనిట్లను నామినీకి బదిలీ చేస్తారు. ఒకసారి ఇలా బదిలీ అయిన యూనిట్లకు నామినీయే యజమాని అవుతారు. కనుక వారు కోరుకున్నంత కాలం ఆ యూనిట్లను కొనసాగించుకోవచ్చు. విక్రయించడం తప్పనిసరి కాదు. -
ఇన్వెస్టర్లకు లాభాల్ని తెచ్చిపెట్టే ఫోకస్డ్ ఈక్విటీ పథకాలేంటో తెలుసా
దీర్ఘకాల ఇన్వెస్టర్లకు ఫోకస్డ్ ఈక్విటీ పథకాలు ఎంతో అనుకూలం. ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాల నుంచి అస్థిరతల మధ్య చలిస్తున్న మార్కెట్లో లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ పథకాలకు మించి ఫ్లెక్సీక్యాప్ మెరుగైన పనితీరు ప్రదర్శించాయి. రోలింగ్ రాబడులను గమనిస్తే గత ఏడేళ్ల కాలంలో ఇతర పథకాలతో పోలిస్తే ఇన్వెస్టర్లకు మంచి ప్రతిఫలాన్నిచ్చాయి. ఫ్లెక్సీక్యాప్ పథకాలు లార్జ్‌క్యాప్‌లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తాయి. కనుక ఆటుపోట్లను మెరుగ్గా తట్టుకోగలవు. మార్కెట్ల ర్యాలీల్లో ఇవి మంచి రాబడులు కూడా ఇస్తాయి. ఈ విభాగంలో ఐఐఎఫ్ఎల్ ఫోకస్డ్ ఫండ్‌ను ఇన్వెస్టర్లు పరిశీలించొచ్చు. రాబడులు ఫోకస్డ్ ఫండ్స్ విభాగంలో ఈ పథకం పనితీరు బలంగా, ఆకర్షణీయంగా ఉండడాన్ని ఇన్వెస్టర్లు గమనించొచ్చు. అన్ని రకాల కాల వ్యవధుల్లో స్థిరమైన రాబడులతో మెరుగ్గా ఉంది. పోటీ పథకాలతో చూసినా, బెంచ్ మార్క్ కంటే మంచి పనితీరు చూపిస్తోంది. ఐదేళ్ల కాలంలో రోలింగ్ రాబడులను గమనిస్తే 2012 నుంచి 2022 అక్టోబర్ మధ్య ఈ పథకం ఏటా 16.3 శాతం మేర ప్రతిఫలాన్ని ఇన్వెస్టర్లకు తెచ్చి పెట్టింది. టాప్ పథకాల్లో ఇది కూడా ఒకటి. కాకపోతే, దేశీ, విదేశీ స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టే ఎస్బీఐ ఫోకస్డ్ ఫండ్ ఈ విభాగంలో ఐదేళ్ల కాల రోలింగ్ రాబడుల పరంగా మొదటి స్థానంలో ఉంది. ఏటా 16.5 శాతం వార్షిక రాబడులను ఇచ్చింది. అంటే 0.2 శాతం అధిక రాబడులు ఎస్బీఐ ఫోకస్డ్ ఫండ్‌లో ఉన్నాయి. కానీ ఏడేళ్ల కాలంలో ఐఐఎఫ్ఎల్ ఫోకస్డ్ ఈక్విటీ పథకం ఏటా 16.5 శాతం చొప్పున రాబడిని తెచ్చి పెట్టింది. ఎస్అండ్పీ బీఎస్ఈ 500 కంటే 3–4 శాతం అధిక ప్రతిఫలాన్నిచ్చింది. పాయింట్ టు పాయింట్ (కచ్చితంగా రెండు కాలాల మధ్య) రాబడుల పరంగా చూస్తే మూడు, ఐదు, ఏడేళ్ల కాలంలో ఈ విభాగంలో ఈ పథకమే ముందుంది. 2020 మార్కెట్ క్రాష్‌లో సూచీలకు అనుగుణంగా 36.5 శాతం మేర నష్టపోయింది. పెట్టుబడుల విధానం ఈ పథకం వ్యాల్యూ, మూమెంటమ్ అనే రెండు రకాల విధానాలతో పెట్టుబడులు పెడుతుంటుంది. మోస్తరు రిస్క్ తీసుకునే వారు తమ పోర్ట్‌ఫోలియోలోకి ఈ పథకాన్ని చేర్చుకోవచ్చు. కనీసం 7–10 ఏళ్ల పాటు అయినా పెట్టుబడులను కొనసాగించాలి. ఇక సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా పెట్టుబడులు పెట్టడం మరింత మెరుగైన ఆప్షన్ అవుతుంది. అన్ని రకాల మార్కెట్ విలువలు కలిగిన విభాగాల్లో పెట్టుబడులు పెట్టే వెసులుబాటు ఫ్లెక్సీక్యాప్ పథకాలకు ఉంటుంది. ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.3,231 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో 93.25 శాతాన్నే ఈక్విటీలకు కేటాయించగా, మిగిలిన 6.75 శాతాన్ని నగదు రూపంలో కలిగి ఉంది. అందులోనూ 72 శాతం పెట్టుబడులను లార్జ్‌క్యాప్ కంపెనీలకే కేటాయించింది. మిడ్‌క్యాప్‌లో 13.57 శాతం, స్మాల్‌క్యాప్‌లో 14 శాతం మేర పెట్టుబడులు కలిగి ఉంది. పోర్ట్‌ఫోలియోలో 30 స్టాక్స్ ఉన్నాయి. పెట్టుబడుల పరంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్‌కు అత్యధికంగా 32 శాతం మేర పెట్టుబడులను కేటాయించింది. ఆ తర్వాత టెక్నాలజీ రంగానికి 10 శాతం, ఆటోమొబైల్ రంగానికి 9 శాతం చొప్పున కేటాయింపులు చేసింది. -
'సిప్' రూపంలో పెట్టుబడులు పెట్టేందుకు వారం మంచిదా? నెలవారీ మంచిదా!
నేను సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఈక్విటీ పథకంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఇందుకు వారం వారీ సిప్ లేదా నెలవారీ సిప్ ఏది ఎంపిక చేసుకోవాలి? – అమర్ సహాని నేను ఈ రెండింటిని పోల్చి ఎటువంటి వివరణాత్మక అధ్యయనం చేయలేదు. వారం వారీ సిప్‌ను ఎంపిక చేసుకుని ఇన్వెస్ట్‌మెంట్‌ను మరింత క్లిష్టం చేసుకోవడం ఎందుకు? అన్నది నా అభిప్రాయం. వారం వారీ అంటే నెలలో నాలుగు సార్లు పెట్టుబడుల లావాదేవీలు నమోదవుతాయి. దీంతో లావాదేవీల నివేదిక చాంతాడంత ఉంటుంది. దీన్ని పరిశీలించుకోవడం కూడా ఇబ్బందే. మూలధన లాభాల విషయాన్ని పరిశీలించినా లావాదేవీలు భిన్న ఎన్‌ఏవీలతో ఉంటాయి. తిరిగి వీటిని వెనక్కి తీసుకునే సమయంలో మూలధన లాభాల పన్ను లెక్కించడం కూడా క్లిష్టంగా మారుతుంది. డిజిటల్‌గా చేస్తున్నాం కదా అని వాదించొచ్చు. కానీ, తక్కువ మొత్తంతో ఎందుకు అంత తరచుగా సిప్ అమలు చేయాలి? దీనికి బదులు మేము అయితే నెలవారీ సిప్‌నే సూచిస్తుంటాం. ఇన్వెస్టర్ల నగదు ప్రవాహ కాలాలకు (నెలవారీ ఆదాయం) అనుగుణంగా ఉంటుంది. మన ఆదాయం నెలవారీగా వస్తుంటుంది. అందుకనే నెలవారీగా ఇన్వెస్ట్ చేనుకోవడం సముచితం. కనుక గతం నుంచి అమల్లో ఉన్న నెలవారీ సిప్‌కు వెళ్లమనే నా సూచన. డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ పథకాల పట్ల మీ అభిప్రాయం ఏమిటి? – మంజునాథ్ డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు పన్ను పరంగా అనుకూలం కానందున వీటి పట్ల నేను వ్యతిరేకం. డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కింద ఫండ్ సంస్థ డివిడెండ్ ప్రకటించినట్టయితే ఆ మొత్తం ఇన్వెస్టర్ బ్యాంకు ఖాతాకు రాదు. ఆ మొత్తం ఆటోమేటిక్‌గా అదే పథకంలో పెట్టుబడిగా మారిపోయి యూనిట్లు జమ అవుతాయి. దాంతో డివిడెండ్ విలువకు సరిపడా యూనిట్లను పొందుతారు. ఈ కార్యక్రమం మొత్తం మీద చేతికి వచ్చే డివిడెండ్ ఏమీ లేకపోయినా పన్ను మాత్రం చెల్లించాల్సి వస్తుంది. ఐటీ రిటర్నులు దాఖలు చేసినప్పుడు మ్యూచువల్ ఫండ్స్ యూనిట్ల డివిడెండ్ ఆదాయం కూడా మొత్తం ఆదాయానికి కలుస్తుంది. అప్పుడు వారికి వర్తించే శ్లాబు ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కనుక ఇన్వెస్టర్లకు గ్రోత్ ప్లాన్ మెరుగైన ఎంపిక అవుతుంది. సెన్సెక్స్ 42,000కు చేరినప్పుడు ఈక్విటీల నుంచి 50 శాతం పెట్టుబడులు వెనక్కి తీసేసుకున్నాను. ఆ తర్వాత నేను చేసింది తప్పు అని అర్థం చేసుకున్నాను. తిరిగి మళ్లీ ఇప్పుడు పెట్టుబడులు ఎలా పెట్టాలి? – రాజేష్ అందుకే మార్కెట్ టైమింగ్‌ను ఎప్పుడూ అంచనా వేసే ప్రయత్నం చేయకూడదు. మార్కెట్లు ఏ సమయంలో ఎలా నడుచుకుంటాయన్నదానిపై దృష్టి సారించకూడదు. దీనికి బదులు మీ పెట్టుబడుల లక్ష్యాలు, కాల వ్యవధి, ఎంత రిస్క్ తీసుకోగలరు తదితర అంశాల ఆధారంగానే నడుచుకోవాలి. దీన్ని ఒక అనుభవంగా తీసుకుని మార్కెట్ గమనాన్ని అంచనా వేసే ప్రయత్నం మానుకోండి. దీనికి బదులు పెట్టుబడుల నిర్ణయాలకు సమయాన్ని కేటాయించండి. మళ్లీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి భిన్నంగా ఏమీ వ్యవహరించక్కర్లేదు. మీ దగ్గరున్న పెట్టుబడిని క్రమానుగతంగా వచ్చే 10–12 నెలల కాలంలో ఇన్వెస్ట్ చేసుకోండి. చదవండి👉 వారం/నెల ‘సిప్’.. ఏది మంచిది? -
ఏ ఫండ్‌లో పెట్టుబడులు పెడితే మంచి లాభాలొస్తాయ్!
ఇండెక్స్ ఫండ్‌ను ఎంపిక చేసుకునే విషయంలో పరిశీలించాల్సిన ముఖ్య అంశాలు రెండున్నాయి. ఒకటి ఎక్స్పెన్స్ రేషియో. ప్రస్తుతం ఇండెక్స్ ఫండ్స్ మధ్య చాలా పోటీ ఉంది. 10–15 బేసిస్ పాయింట్ల (0.1–0.15 శాతం) ఎక్స్పెన్స్ రేషియోకే ఇండెక్స్ ఫండ్స్ డైరెక్ట్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. కనుక అంతకంటే ఎక్కవ చెల్లించాల్సిన అవసరం లేదు. రెండోది ట్రాకింగ్ ఎర్రర్. ఒక ఇండెక్స్ ఫండ్.. తాను పెట్టుబడులను అనుసరించే ఇండెక్స్‌తో పోలిస్తే రాబడుల విషయంలో ఎంత మెరుగ్గా పనిచేసిందన్నది ఇది చెబుతుంది. ఇండెక్స్ ఫండ్ నిర్వహణ బృందం సామర్థ్యాన్ని ఇది ప్రతిఫలిస్తుంది. తక్కువ ఎక్స్పెన్స్ రేషియోతోపాటు.. ట్రాకింగ్ ఎర్రర్ తక్కువగా ఉన్న పథకం మెరుగైనది అవుతుంది. ఈ రెండు అంశాలను ప్రామాణికంగా చేసుకుని చూస్తే ఎస్బీఐ, యూటీఐ, హెచ్డీఎఫ్సీ సంస్థల పథకాలు మెరుగ్గా పనిచేస్తున్నాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్లూచిప్ ఫండ్ యూనిట్లను గతేడాది కొనుగోలు చేశాను. వాటిని నేను ఇప్పుడు విక్రయించినట్టయితే ఎగ్జిట్ లోడ్ ఉంటుందా? – శశికళ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్లూచిప్ ఫండ్‌లో మీ పెట్టుబడి తేదీ నుంచి ఏడాది పూర్తయినట్టయితే ఎటువంటి ఎగ్జిట్ లోడ్ చెల్లించాల్సిన అవసరం ఏర్పడదు. ఒకవేళ ఒకే విడత కాకుండా సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఇన్వెస్ట్ చేస్తూ వచ్చి ఉంటే అప్పుడు పెట్టుబడి మొత్తానికి ఏడాది పూర్తయి ఉండదు. అలా ఏడాది పూర్తి కాని మొత్తాలను వెనక్కి తీసుకుంటే ఆ మొత్తం విలువపై ఒక శాతం ఎగ్జిట్ లోడ్ చెల్లించాల్సి వస్తుంది. ఎగ్జిట్ లోడ్ విషయంలో చాలా మంది అయోమయానికి గురవుతుంటారు. కానీ, వారు పెట్టుబడి చేసిన నాటికి ఉన్న ఎగ్జిట్ లోడ్ విధానమే అమలవుతుందని గుర్తు పెట్టుకోవాలి. పైగా కొందరికి అసలు ఎగ్జిట్ లోడ్ గురించే తెలియదు. పెట్టుబడి వెనక్కి తీసుకున్న సమయంలో.. అందులోంచి ఎగ్జిట్‌లోడ్‌ను మిహాయించిన తర్వాతే వారికి ఆ విషయం తెలిసి వస్తుంది. కనుక మీ పెట్టుబడులకు సంబంధించి ఎగ్జిట్ లోడ్ విషయంలో స్పష్టత కోసం కస్టమర్ కేర్‌కు కాల్ చేసి తెలుసుకోవచ్చు. కామ్స్ వెబ్సైట్ నుంచి ఎగ్జిట్ లోడ్ స్టేట్మెంట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. వ్యాల్యూ రీసెర్చ్ ప్రీమియం చందాదారులు ‘మై ఇన్వెస్ట్మెంట్’ టూల్ సాయంతో తాము ఇన్వెస్ట్ చేసిన పథకానికి సంబంధించి ఎగ్జిట్ లోడ్ వివరాలను తెలుసుకోవచ్చు. ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్‌లలో వ్యయాలు, లిక్విడిటీ పరంగా ఏది మెరుగైనది? – దినేష్ జనార్థన్ వ్యయాల పరంగా చూస్తే ఈటీఎఫ్ (ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్) పథకాలకు అనుకూలత ఎక్కువ. 5–7 బేసిస్ పాయింట్లకే ఈటీఎఫ్ పథకాలు అందుబాటులో ఉన్నాయి. అదే సమయంలో ఇండెక్స్ ఫండ్స్ డైరెక్ట్ ప్లాన్లు సైతం 10–15 బేసిస్ పాయింట్ల ఎక్స్పెన్స్ రేషియోకి పెట్టుబడుల సేవలను ఆఫర్ చేస్తున్నవీ ఉన్నాయి. వ్యయాల పరంగా ఈటీఎఫ్, ఇండెక్స్ ఫండ్స్ మధ్య పెద్ద వ్యత్యాసం లేదు. లిక్విడిటీ పరంగా చూస్తే, ఇండెక్స్ఫండ్స్ విషయంలో ఆందోళన అక్కర్లేదు. పెట్టుబడుల ఉపసంహరణను అన్ని పనిదినాల్లో నాటి ఎన్ఏవీ ఆధారంగా చెల్లింపులకు ఫండ్స్ సంస్థలు కట్టుబడి ఉండాల్సిందే. కనుక లిక్విడిటీ విషయంలో ఇక్కడ ఆందోళన అనవసరం. ఈటీఎఫ్‌ల విషయంలో లిక్విడిటీ వివిధ పథకాల మధ్య కొంత భిన్నంగా ఉండొచ్చు. కొన్ని పథకాలు రోజువారీగా అధిక వ్యాల్యూమ్ (పరిమాణం)లో ట్రేడ్ అవుతుంటాయి. కానీ, అన్నింటి విషయంలో ఇలా ఉండదు. కనుక ఇన్వెస్ట్ చేయడానికి ముందు ఆయా పథకాల ట్రేడింగ్ పరిమాణాన్ని పరిశీలించాల్సి ఉంటుంది. ఇన్వెస్టర్లు పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసేట్టు అయితే ఇండెక్స్ ఫండ్స్‌కు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలను ఈటీఎఫ్ కోసం తెరవాల్సిన శ్రమ తప్పుతుంది. డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలున్న వారికి ఈటీఎఫ్‌లు కూడా మెరుగైన ఎంపికే అవుతుంది. -
డీఎస్పీ అంతర్జాతీయ ఫండ్స్‌లో పెట్టుబడులకు బ్రేక్
న్యూఢిల్లీ: డీఎస్పీ మ్యూచువల్ ఫండ్.. విదేశీ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసే ఆరు పథకాల్లోకి తాజా పెట్టుబడులు స్వీకరించడం లేదని ప్రకటించింది. డీఎస్పీ యూఎస్ ఫ్లెక్సిబుల్ ఈక్విటీ ఫండ్, డీఎస్పీ గ్లోబల్ అలోకేషన్ ఫండ్, డీఎస్పీ వరల్డ్ గోల్డ్ ఫండ్, డీఎస్పీ వరల్డ్ మైనింగ్ ఫండ్, డీఎస్పీ వరల్డ్ అగ్రికల్చర్ ఫండ్, డీఎస్పీ వరల్డ్ ఎనర్జీ ఫండ్ పథకాలకు ఈ నిర్ణయం అమలవుతుంది. విదేశాల్లో ఇన్వెస్ట్ చేసే పథకాలకు తాజా సబ్స్క్రిప్షన్లు తీసుకోవద్దంటూ సెబీ జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ వ్యాప్తంగా విదేశీ పెట్టుబడులు 7 బిలియన్ డాలర్లు (రూ.లక్ష కోట్లు) మించకూడదని సెబీ లోగడే పరిమితి విధించింది. దేశీ మ్యూచువల్ ఫండ్స్ విదేశీ పెట్టుబడుల విలువ ఈ పరిమితి దాటిపోవడంతో తాజా సబ్స్క్రిప్షన్లు తీసుకోవడం నిలిపివేయాలని సెబీ ఆదేశించింది. దీంతో ఫిబ్రవరి 2 నుంచి అన్ని కొనుగోళ్లు.. స్విచ్ ఇన్, న్యూసిప్/ఎస్టీపీ/డీటీపీ రిజిస్ట్రేషన్ అభ్యర్థనలు ఆమోదించడం లేదని డీఎస్పీ మ్యూచువల్ ఫండ్ ప్రకటన జారీ చేసింది. -
గొప్ప రాబడుల చరిత్ర
ICICI Prudential Equity And Debt Fund: రాబడులు కావాలి. పెట్టుబడులు పూర్తిగా ప్రమాదంలో పడకూడదు. అంటే రిస్క్ కొంచెం తక్కువగా ఉండాలి. ఇలా భావించే వారికి హైబ్రిడ్ ఫండ్స్ అనుకూలంగా ఉంటాయి. ఈ విభాగంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఈక్విటీ అండ్ డెట్ ఫండ్‌కు సుదీర్ఘ చరిత్ర ఉంది. ఇది అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్ కిందకు వస్తుంది. అంటే తన నిర్వహణలోని మొత్తం ఆస్తుల్లో 65 శాతం నుంచి 80 శాతం వరకు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. డెట్ సాధనాల్లో 20 శాతం నుంచి 35 శాతం వరకు పెట్టుబడులు పెడుతుంది. రాబడులు ఈ పథకం 1999 నవంబర్ 3న మొదలు కాగా, ఆరంభంలో రూ.లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పటికి అది రూ.21.76 లక్షలు సమకూరి ఉండేది. అంటే కాంపౌండెడ్‌గా ఏటా 15.03 శాతం రాబడిని ఇచ్చింది. కానీ, అదే కాలంలో నిఫ్టీ 50 టోటల్ రిటర్న్ ఇండెక్స్ కాంపౌండెడ్‌గా వార్షికంగా ఇచ్చిన ప్రతిఫలం (సీఏజీఆర్) 14.04 శాతంగానే ఉంది. అంటే నిఫ్టీలో రూ.లక్ష పెట్టుబడి రూ.18.01 లక్షలు అయి ఉండేది. నూరు శాతం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయకుండా, కొంత మొత్తాన్ని డెట్‌లో పెడుతూ ఈక్విటీ సూచీ కంటే అధిక రాబడిని ఇవ్వడం అన్నది కచ్చితంగా మెరుగైన పనితీరుగానే చూడాలి. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా ఈ పథకంలో ప్రతీ పెలా రూ.10,000 చొప్పున ఆరంభం నుంచి ఇన్వెస్ట్ చేసి ఉంటే.. మొత్తం పెట్టుబడి ఇన్నేళ్లలో రూ.26.4 లక్షలు కాగా, సమకూరిన మొత్తం రూ.2.11 కోట్లుగా ఉండేది. సిప్ మార్గంలో సీఏజీఆర్ 16.22 శాతంగా ఉంది. గడిచిన ఏడాది కాలంలో ఈ పథకంలో పెట్టుబడులపై 53 శాతం ప్రతిఫలం లభించింది. మూడేళ్లలో వార్షికంగా 19 శాతం చొప్పున రాబడిని ఇచ్చింది. ఐదేళ్లలో 15.58 శాతం, ఏడేళ్లలో 13.49 శాతం, పదేళ్లలో 17 శాతం చొప్పున వార్షిక రాబడుల చరిత్ర ఈ పథకానికి ఉంది. ఒక హైబ్రిడ్ ఫండ్ ఇంత నిలకడైన పనితీరు చూపించడం అరుదైనది. ఈ పథకం నిర్వహణ బాధ్యతలను ఎస్.నరేన్ చూస్తున్నారు. గడిచిన 18 నెలల్లో వ్యాల్యూ స్టాక్స్‌కు ఆయన ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. మార్కెట్ ర్యాలీలో అన్ని రంగాల స్టాక్స్ పాల్గొనడంతో వ్యాల్యూ స్టాక్స్ మంచి రాబడులను ఇచ్చాయి. పోర్ట్‌ఫోలియో/పెట్టుబడుల విధానం ఈ పథకం నిర్వహణలో ప్రస్తుతానికి రూ.18,740 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. అన్ని విభాగాల్లోని స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే సౌలభ్యం ఈ పథకానికి ఉంది. అంటే లార్జ్, మిడ్, స్మాల్‌క్యాప్ స్టాక్స్‌లో ఎక్కడ అవకాశాలున్నా ఇన్వెస్ట్ చేస్తుంది. ప్రస్తుతానికి మొత్తం నిర్వహణ ఆస్తుల్లో ఈక్విటీ విభాగంలో 74.4 శాతం పెట్టుబడులు ఉన్నాయి. డెట్ సాధనాల్లో 17.1 శాతం ఇన్వెస్ట్ చేయగా, మిగిలిన మొత్తాన్ని నగదు రూపంలో కలిగి ఉంది. లార్జ్‌క్యాప్ కంపెనీల్లోనే 90 శాతం పెట్టుబడులు పెట్టి ఉంది. మిడ్, స్మాల్‌క్యాప్ స్టాక్స్‌కు చెరో 5 శాతం కేటాయింపులు చేసింది. ప్రైస్ టు బుక్ విధానంలో స్టాక్స్ ఎంపిక ఉంటుంది. టాప్ డౌన్, బోటమ్ అప్ విధానాలను అనుసరిస్తుంటుంది. విద్యుత్, టెలికం, ఆయిల్, నాన్ ఫెర్రస్ మెటల్ స్టాక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. బ్యాంకులు, సాఫ్ట్వేర్, కన్జ్యూమర్ నాన్ డ్యురబుల్స్ కంపెనీల పట్ల తక్కువ వెయిటేజీ కలిగి ఉంది. ఈక్విటీలకు సంబంధించి విదేశీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ ఆప్షన్ కూడా ఈ పథకంలో భాగంగా ఉంది. మార్కెట్ల దిద్దుబాట్లలో పెట్టుబడుల విలువకు రక్షణ కోసం గాను డెరివేటివ్స్‌లో హెడ్జింగ్ కూడా చేస్తుంది. డెట్ విభాగంలో దీర్ఘకాల ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీలను, ఏఏ అంతకంటే మెరుగైన రేటింగ్ ఉన్న వాటిని ఎంపిక చేసుకుంటుంది. టాప్ ఈక్విటీ హోల్డింగ్స్ కంపెనీ పెట్టుబడుల శాతం ఐసీఐసీఐ బ్యాంకు 8.46 ఎన్టీపీసీ 7.69 భారతీ ఎయిర్టెల్ 7.32 ఓఎన్జీసీ 5.17 హిందాల్కో ఇండస్ట్రీస్ 4.35 సన్‌ఫార్మా 3.97 టాటా మోటార్స్ డీవీఆర్ 3.93 హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 3.19 ఇన్ఫోసిస్ 2.67 ఐటీసీ 2.36 చదవండి: హెచ్డీఎఫ్సీ హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్ రివ్యూ -
రాబడులకు రక్షణ!
ఈక్విటీ మార్కెట్లు గణనీయంగా ర్యాలీ చేసిన తర్వాత దిద్దుబాటుకు గురికావడం సహజం. అమ్మకాల ఒత్తిడికి పడిపోయినా.. కనిష్ట ధరల వద్ద కొనుగోళ్లు మార్కెట్లను ఎప్పుడూ ఆదుకుంటుంటాయి. దీంతో బలంగా తిరిగి ముందుకు ర్యాలీ చేస్తుంటాయి. మార్కెట్ కరెక్షన్లలో కాస్తంత అయినా తమ పెట్టుబడులకు కుదుపుల నుంచి రక్షణ ఉండాలని భావించే వారు, అదే సమయంలో ఈక్విటీల్లో పెట్టుబడులపై అధిక రాబడులు ఆశించే వారు ప్రిన్సిపల్ హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్‌ను పరిశీలించొచ్చు. పెట్టుబడుల విధానం.. ఇది అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్. పెట్టుబడుల్లో గరిష్టంగా 35 శాతాన్ని డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటుంది. దీంతో ఈక్విటీ మార్కెట్లు పడినాకానీ.. పెట్టుబడుల విలువ గణనీయంగా పడిపోకుండా డెట్ విభాగం ఆదుకుంటుంది. షేర్ల ధరలు గణనీయంగా పడిపోతుంటే రిటైల్ ఇన్వెస్టర్లు భావోద్వేగాలకు గురికావడం సహజంగా చూస్తుంటాం. దీంతో నష్టాలకు కూడా విక్రయించేస్తుంటారు. అదే మాదిరి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఎన్ఏవీల క్షీణతను చూసి విక్రయించే తప్పిదం చేయకూడదు. అందుకనే భావోద్వేగాలపై నియంత్రణ లేని వారు, రిస్క్ అంతగా వద్దనుకునేవారికి హైబ్రిడ్ ఫథకాలు అనుకూలంగా ఉంటాయి. ఎందుకంటే కొంత భాగం పెట్టుబడులు డెట్ సాధనాల్లో ఉంటాయి కనుక.. ఈక్విటీ కరెక్షన్లలోనూ ఎన్ఏవీ పెద్దగా పడిపోవడం జరగదు. ఈ పథకం ఈక్విటీల్లో గరిష్టంగా 65 శాతం వరకు పెట్టుబడులు పెడుతుంది. దీనివల్ల మార్కెట్ల ర్యాలీల్లో అధిక రాబడులు పొందేందుకు అవకాశం ఉంటుంది. హైబ్రిడ్ ఫండ్స్ రూపంలో ఈ విధంగా రెండు రకాల ప్రయోజనాలను పొందొచ్చు. ఈ విభాగంలో ప్రిన్సిపల్ హైబ్రిడ్ ఈక్విటీ పథకం మంచి రాబడులతో మెరుగైన స్థానంలో ఉంది. గతంలో ఈ పథకం ప్రిన్సిపల్ బ్యాలన్స్డ్ ఫండ్‌గా కొనసాగేది. రాబడులు ఈ పథకం పనితీరు అన్ని కాలాల్లోనూ ఆకర్షణీయంగా కనిపిస్తోంది. గడిచిన ఏడాది కాలంలో పెట్టుబడులపై 48 శాతం రాబడులను అందించింది. గడిచిన మూడేళ్ల కాలంలో చూసుకున్నా వార్షిక రాబడులు 13.36 శాతం చొప్పున ఉన్నాయి. అదే విధంగా ఐదేళ్లలో 13.51%, ఏడేళ్లలో 12.77 శాతం, పదేళ్లలో 14.85 శాతం చొప్పున వార్షిక రాబడులు ఈ పథకంలో కనిపిస్తాయి. డెట్‌తో కూడిన పథకం దీర్ఘకాలంలో సగటున 12 శాతంపైనే రాబడులను అందించడం అన్నది మంచి విషయమే. పోర్ట్‌ఫోలియో ఈ పథకం నిర్వహణలో ప్రస్తుతానికి రూ.1,120 కోట్లున్నాయి. అన్ని రకాల మార్కెట్ పరిస్థితుల్లోనూ ఈ పథకం పెట్టుబడుల విషయంలో అప్రమత్తంగా ఉంటుంది. 2017 బుల్ మార్కెట్, 2018 బేర్ మార్కెట్ సమయాల్లో ఈ పథకం ఈక్విటీల్లో పెట్టబడులను 65–68 శాతం మధ్య కొనసాగించింది. ఈ రెండు సంవత్సరాల్లోనూ హైబ్రిడ్ ఫండ్స్ విభాగం సగటు రాబడులతో పోలిస్తే ప్రిన్సిపల్ హైబ్రిడ్ ఈక్విటీ పనితీరు మెరుగ్గా ఉండడం గమనార్హం. ప్రస్తుతానికి మొత్తం పెట్టుబడుల్లో 75 శాతం ఈక్విటీల్లోనే ఉన్నాయి. డెట్ పెట్టుబడులు 20 శాతంగా ఉంటే, మిగిలిన మేర నగదు నిల్వలను కలిగి ఉంది. మొత్తం 60 స్టాక్స్ పోర్ట్‌ఫోలియోలో ఉన్నాయి. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు ఎక్కువ వెయిటేజీ ఇస్తూ 24 శాతం పెట్టుబడులను వీటికే కేటాయించింది. ఆ తర్వాత టెక్నాలజీ, ఇంధనం, ఆటోమొబైల్ కంపెనీలకు ప్రాధాన్యం ఇచ్చింది. -
పతనాల్లో కొంత రక్షణ
ఎన్నికల ముందు మార్కెట్లలో అస్థిరతల పట్ల ఆందోళనతో ఉన్న వారు, మార్కెట్ కరెక్షన్లలో కాస్తంత అయినా తమ పెట్టుబడులకు కుదుపుల నుంచి రక్షణ ఉండాలని భావించే వారు, అదే సమయంలో ఈక్విటీల్లో పెట్టుబడులపై కాస్త అధిక రాబడులు ఆశించే వారికి ప్రిన్సిపల్ హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్ కూడా ఒక ఎంపిక అవుతుంది. ఇది అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్. పెట్టుబడుల్లో గరిష్టంగా 35 శాతాన్ని తీసుకెళ్లి డెట్సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. దీంతో మార్కెట్ పతనాల్లో ఎన్ఏవీ ఘోరంగా పతనం కాకుండా డెట్ పెట్టుబడులు మేలు చేస్తాయి. అలాగే, ఈక్విటీల్లో గరిష్టంగా 65 శాతం వరకు పెట్టుబడులు పెడుతుంది. దీనివల్ల మార్కెట్ల ర్యాలీల్లో అధిక రాబడులు పొందేందుకు వీలు పడుతుంది. హైబ్రిడ్ ఫండ్స్ నుంచి ఉన్న రెండిందాల ప్రయోజనాలు ఇవే. ఈ విభాగంలో ప్రిన్సిపల్ హైబ్రిడ్ ఈక్విటీ పథకం మంచి రాబడులతో మెరుగైన స్థానంలో ఉంది. గతంలో ప్రిన్సిపల్ బ్యాలెన్స్డ్ ఫండ్ పేరుతో కొనసాగగా... సెబీ పథకాల పునర్వ్యవస్థీకరణ ఆదేశాల తర్వాత పేరులో మార్పు చోటు చేసుకుంది. పెట్టుబడుల విధానం అన్ని మార్కెట్ పరిస్థితుల్లోనూ ఈ పథకం పెట్టుబడుల విషయంలో అప్రమత్త ధోరణితో కొనసాగుతుంది. ఈక్విటీలకు పెట్టుబడులను 70 శాతం వరకు కేటాయించడం అన్నది అరుదుగా మాత్రమే ఈ ఫండ్ మేనేజర్ చేస్తుంటారు. 2017 బుల్ మార్కెట్, 2018 బేర్ మార్కెట్ సమయాల్లో ఈ పథకం ఈక్విటీల్లో పెట్టబడులను 65–68 శాతం మధ్య కొనసాగించింది. ఈ రెండు సంవత్సరాల్లోనూ హైబ్రిడ్ ఫండ్స్ విభాగం సగటు రాబడులతో పోలిస్తే ప్రిన్సిపల్ హైబ్రిడ్ ఈక్విటీ పనితీరు మెరుగ్గా ఉండడం గమనార్హం. 2017 ర్యాలీలో మిడ్‌క్యాప్ స్టాక్స్‌లో ఎక్కువ పెట్టుబడులు కలిగి ఉండడం వల్ల అద్భుత పనితీరు చూపించింది. సమస్యాత్మకమైన సాఫ్ట్వేర్, ఫార్మా వంటి విభాగాల్లో ఆ ఏడాది పెట్టుబడులను తగ్గించుకుంది. ఇక 2018లో సురక్షితంగా కనిపించిన కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్ స్టాక్స్‌ను యాడ్ చేసుకుంది. తద్వారా అస్థిరతల ప్రభావాన్ని తగ్గించుకుంది. అలాగే, రూపాయి బలోపేతం అవుతుండడంతో ఐటీ స్టాక్స్‌లో పెట్టుబడులను పెంచుకోవడం ఆరంభించింది. దీనికితోడు అస్థిరతల ప్రభావం తక్కువగా ఉండే లార్జ్‌క్యాప్‌కు ప్రాధాన్యం పెంచింది. 2018 ఆరంభంలో మిడ్, స్మాల్‌క్యాప్ స్టాక్స్‌లో పెట్టుబడులు 25 శాతంగా ఉండగా, వాటిని 20%కి తగ్గించుకుంది. ఇక డెట్ విభాగంలోనూ పలు మార్పులు చేసుకుంది. 10 ఏళ్ల ప్రభుత్వ సెక్యూరిటీల ఈల్డ్స్ 6.5% నుంచి 8%కి పెరగడంతో ఈ ఇన్స్ట్రుమెంట్లలో ఎక్స్పోజర్ను తగ్గించుకుంది. ఈ విధమైన వ్యూహాలు, పెట్టుబడుల విధానాల కారణంగా ఈ పథకం హైబ్రిడ్ విభాగంలో మెరుగైన రాబడులను ఇస్తోంది. రాబడులు..: ఈ పథకం ఏడాది కాలంలో ఇచ్చిన రాబడులు 2.5%. ఇదే సమయంలో ఈ విభాగం సగటు రాబడులు 2.2% ఉన్నాయి. మూడేళ్ల కాలంలో చూసుకుంటే ఈ పథకం వార్షికంగా ఇచ్చిన రిటర్నులు 16.7% ఉన్నాయి. ఈ విభాగం సగటు రాబడులు 11.2%∙ఉండడం గమనార్హం. మూడేళ్ల కాలంలో ఈ పథకం రాబడులు వార్షికంగా 15.1% ఉంటే, విభాగం రాబడులు 12.4%గానే ఉన్నాయి. -
లాభసాటి పెట్టుబడులు!
ఈక్విటీ పెట్టుబడులపై తగినంత రాబడులు కోరుకునే వారికి ఎస్బీఐ ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్ మంచి ఎంపికే అవుతుంది. అన్ని రకాల మార్కెట్లలోనూ లాభాలు ఇవ్వగల స్టాక్స్‌ను గుర్తించి ఇన్వెస్ట్ చేయడం ద్వారా రాబడులు ఇచ్చే విధానంలో ఈ పథకం పనిచేస్తుంటుంది. కనుక ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో ఇన్వెస్టర్లకు ఇదొక మంచి పెట్టుబడి ఆప్షన్ అవుతుంది. ఈ పథకానికి ఆర్ శ్రీనివాసన్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు. పెట్టుబడుల విధానం ఫోకస్డ్ ఈక్విటీ పథకాల్లో ముందు నుంచి ఉన్న పథకాల్లో ఇదీ ఒకటి. పోర్ట్‌ఫోలియోలో 25 స్టాక్స్ వరకు నిర్వహిస్తుంటుంది. మిగిలిన ఈక్విటీ పథకాల మాదిరిగా కాకుండా... ఫోకస్డ్ ఈక్విటీ విభాగంలోని పథకాలు తక్కువ స్టాక్స్‌ను పోర్ట్‌ఫోలియోలో కలిగి ఉంటాయి. ప్రస్తుతం పోర్ట్‌ఫోలియోలో 24 స్టాక్స్ ఉన్నాయి. 10 స్టాక్స్‌లోనే 51 శాతం మేర పెట్టుబడులు ఉన్నాయి. ఇందులోనూ హెచ్డీఎఫ్సీ బ్యాంకు, పీఅండ్‌జీ హైజీన్, ఎస్బీఐ, కోటక్ బ్యాంకు, దివిస్ ల్యాబ్స్‌లో అత్యధికంగా (33శాతం) ఇన్వెస్ట్ చేసి ఉంది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ స్టాక్స్‌లో 35 శాతానికి పైగా పెట్టుబడులు పెట్టింది. ఆ తర్వాత ఎఫ్ఎంసీజీ, ఇంజనీరింగ్ రంగాల్లో ఇన్వెస్ట్ చేసింది. సర్వీసెస్, కెమికల్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, హెల్త్‌కేర్, టెక్నాలజీ, కమ్యూనికేషన్, టెక్స్టైల్స్, ఆటోమొబైల్, ఎనర్జీ రంగాల్లోనూ పెట్టుబడులు ఉన్నాయి. లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ కంపెనీల కలయికగా పోర్ట్‌ఫోలియో ఉంది. లార్జ్‌క్యాప్‌లో 59 శాతం, మిడ్‌క్యాప్‌లో 22 శాతం, స్మాల్‌క్యాప్‌లో 19 శాతం కేటాయింపులు ఉన్నాయి. తన పోర్ట్‌ఫోలియోలో ఓ విదేశీ స్టాక్‌ను కూడా యాడ్ చేసుకుంది. గూగుల్ మాతృ సంస్థ అయిన ఆల్ఫాబెట్ ఐఎన్‌సీ క్లాస్ఏ షేర్లలో 3.39 శాతం పెట్టుబడులు కలిగి ఉంది. ఈ తరహా స్టాక్స్ ఎంపిక కారణంగా ఈ పథకానికి దీర్ఘకాలంలో మంచి రాబడుల ట్రాక్ ఉంది. గతంలో ఎస్బీఐ ఎమర్జింగ్ ఫండ్‌తో నడిచిన ఈ పథకం పేరు ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్‌గా గతేడాది మారింది. రాబడులు ముఖ్యంగా దీర్ఘకాలంలో ఈ పథకం పనితీరు ఎంతో మెరుగ్గా ఉంది. ఐదేళ్లు, పదేళ్ల కాలంలో బీఎస్ఈ 500 టీఆర్ఐ కంటే అధిక రాబడులతో ముందుంది. ఐదేళ్లలో వార్షిక సగటు రాబడులు 18.66 శాతం, పదేళ్లలో వార్షిక సగటు రాబడులు 25.71 శాతం చొప్పున ఉన్నాయి. ఇదే కాలంలో బీఎస్ఐ 500 టీఆర్ఐ రాబడులు 14.74 శాతం, 17.48 శాతం చొప్పున ఉన్నాయి. ఇక ఏడాది కాలంలో ఈ పథకం రాబడులు మైనస్ 2.20 శాతం కాగా, బీఎస్ఈ 500 రాబడులు మైనస్ 1.06 శాతం (నష్టాలు)గా ఉన్నాయి. మూడేళ్ల కాలంలో ఎస్బీఐ ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్ 14.78 శాతం చొప్పున వార్షిక రాబడులను ఇచ్చింది. ఈ కాలంలో బీఎస్ఈ 500 సూచీ మొత్తం రాబడులు వార్షికంగా 15.54 శాతంగా ఉన్నాయి. ఏడాది, మూడేళ్ల కాలంలో స్వల్పంగా రాబడుల్లో వెనుకబడి ఉన్నప్పటికీ... దీర్ఘకాలంలో మాత్రం అధిక రాబడులను ఇచ్చినట్టు గణాంకాల ద్వారా తెలుస్తోంది. -
పెట్టుబడుల్లో బ్యాలన్స్...
మార్కెట్ అస్థిరతల్లో పెట్టుబడులకు తక్కువ రిస్క్‌ను ఆశించే వారు, దీర్ఘకాలంలో సంప్రదాయ ఎఫ్డీలు, పోస్టాఫీసు పథకాల కంటే కాస్త అధికరాబడులు కోరుకునే వారు పరిశీలించాల్సిన పథకాల్లో ఎస్బీఐ హైబ్రిడ్ ఈక్విటీ కూడా ఒకటి. గతంలో ఇది ఎస్బీఐ మ్యాగ్నం ఫండ్ పేరుతో నడిచింది. గతేడాదే సెబీ ఆదేశాల మేరకు పథకం పేరు మారింది. ఈ పథకం ఈక్విటీ, డెట్ రెండింటిలోనూ ఇన్వెస్ట్ చేస్తుంది. కానీ, డెట్ సాధనాలకు మించి రాబడులను ఇవ్వగలదు. కనీసం 65 శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. మిగిలిన మొత్తాన్ని ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీల్లో పెడుతుంది. బుల్ మార్కెట్లో, బేర్ మార్కెట్లోనూ పనితీరు పరంగా ఈ పథకానికి మంచి ట్రాక్ రికార్డు ఉంది. రాబడులు ఈ పథకం రాబడులు గడచిన ఏడాది కాలంలో మైనస్ 2 శాతంగా ఉన్నాయి. కానీ, మూడేళ్ల కాలంలో చూసుకుంటే సగటున ఏటా 10.46 శాతం, ఐదేళ్ల కాలంలో వార్షికంగా 15.39 శాతం, పదేళ్ల కాలంలో 16.19 శాతం చొప్పున రాబడులు ఇచ్చింది. 1995 డిసెంబర్ 31న ఈ పథకం ప్రారంభం కాగా, అప్పటి నుంచి చూసుకుంటే వార్షిక రాబడులు 15.84 శాతంగా ఉన్నాయి. కనుక దీర్ఘకాలంలో ఓ బ్యాలన్స్డ్ ఫండ్‌లో ఈ స్థాయి రాబడులు మెరుగైనవేనని చెప్పుకోవాలి. రిస్క్ ఎక్కువగా తీసుకోలేని వారికి ఈ తరహా బ్యాలన్స్డ్ ఫండ్స్ అనుకూలం. పెట్టుబడుల విధానం పెట్టుబడుల కేటాయింపును ఈ పథకం మేనేజర్లు తెలివిగా చేస్తుంటారు. ఆటుపోట్ల సమయాల్లో ఈక్విటీ ఎక్స్పోజర్ను తగ్గించుకుని నగదు నిల్వలు పెంచుకుంటారు. 2011 మార్కెట్ కరెక్షన్లో, 2015 ఒడిదుడుకుల సమయాల్లో ఈక్విటీలకు ఎక్స్పోజర్ తగ్గించుకోవడం వల్ల ఈ పథకంలో నష్టాలు పరిమితం అయ్యాయి. 2014 బాండ్ మార్కెట్ ర్యాలీ ప్రయోజనాలను సైతం పొందింది. 2018 మార్కెట్ల అస్థిరతల్లోనూ ఈక్విటీలో అధిక పెట్టుబడులను కాస్త తగ్గించుకుంది. ఈ విధమైన వ్యూహాలతో నష్టాలను పరిమితం చేయడం, లాభాలను ఒడిసిపట్టడం ఈ ఫండ్ మేనేజర్లు చేసే పని. ప్రస్తుతానికి ఈక్విటీల్లో 71.95 శాతం, డెట్‌లో 25.76 శాతం, నగదు నిల్వలు రూ.2.29 శాతం కలిగి ఉంది. ఈ పథకం ఈక్విటీ పోర్ట్‌ఫోలియోలో 58 స్టాక్స్ ఉన్నాయి. మూడు రంగాల కంపెనీల్లోనే 44 శాతం వరకు ఇన్వెస్ట్ చేసింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ స్టాక్స్‌కు 27 శాతం వరకు కేటాయింపులు చేసింది. ఆ తర్వాత సేవల రంగానికి 9 శాతం వరకు కేటాయింపులు ఉన్నాయి. ఎనర్జీ, టెక్నాలజీ, ఎఫ్ఎంసీజీ, ఆటోమొబైల్ రంగాలకు సుమారు ఐదు శాతం చొప్పున కేటాయింపులు ఉన్నాయి. ఈ పథకంలో కనీసం రూ.1,000 మొత్తంతో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ప్రతీ నెలా సిప్ రూపంలో అయితే రూ.500 నుంచి కూడా ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం ఉంది. టాప్ హోల్డింగ్స్ అంశం పెట్టుబడుల శాతం హెచ్డీఎఫ్సీ 5.85 ఎస్బీఐ 4.55 కోటక్ బ్యాంకు 3.95 బీపీసీఎల్ 2.99 ఆర్ఐఎల్ 2.74 ఇన్ఫోసిస్ 2.53 దివిస్ ల్యాబ్స్ 2.43 ఐసీఐసీఐ బ్యాంకు 2.39 ఐటీసీ 2.36 భారతీ ఎయిర్టెల్ 2.29 -
దీర్ఘకాలానికి సురక్షితం!
ఇది దీర్ఘకాలికంగా మంచి పనితీరు కలిగిన లార్జ్‌క్యాప్ ఫండ్. గత ఐదేళ్ల పనితీరు కూడా ఆశాజనకంగానే ఉంది. 2008, 2011, 2013, 2016లో మార్కెట్ల డౌన్‌ట్రెండ్‌లో ఉన్నప్పుడు కూడా రాబడులు పడిపోకుండా చూసిన పథకమిది. అయితే మార్కెట్లు ర్యాలీ చేసినపుడు కూడా ఇది మరీ భారీ రాబడులేమీ ఇవ్వలేదు. పర్వాలేదనిపించే రాబడులనిచ్చింది. మోస్తరు రిస్క్ భరించేవారు, దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేయాలని భావించే వారు పరిశీలించదగిన పథకాల్లో ఇదీ ఒకటి. పనితీరు ఎలా ఉందంటే... దీర్ఘకాలంలో ఈ పథకం పనితీరు బావుంది. కాకపోతే ఏడాది, రెండేళ్ల కాలంలో మాత్రం ఆశించిన మేర లేదు. లార్జ్‌క్యాప్ స్టాక్స్‌లో 80 శాతం వరకు పెట్టుబడులు పెడుతుంది. మిగిలిన నిధుల్ని మిడ్‌క్యాప్స్‌కు కేటాయిస్తుంది. రాబడుల కోసం అధిక వృద్ధికి అవకాశం ఉన్న బలమైన కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. 5–10 ఏళ్ల కాలంలో రాబడులు బెంచ్ మార్క్‌తో ఇండెక్స్‌లతో పోలిస్తే 3–4 శాతం అధికంగానే ఉన్నాయి. అదే స్వల్పకాలంలో చూస్తే మాత్రం ఒకటి, రెండు శాతం తక్కువగా ఉన్నాయి. ఏడాది కాలంలో ఈ పథకం రాబడులు వార్షికంగా 9.5 శాతంగా ఉంటే, బెంచ్‌మార్క్ రాబడులు వార్షికంగా 14 శాతంగా ఉన్నాయి. మూడేళ్ల కాలంలో ఈ పథకం రాబడులు 9.2 శాతం కాగా, బెంచ్ మార్క్ రాబడులు 10.2 శాతంగా ఉన్నాయి. ఇక ఐదేళ్ల కాలంలో పథకం రాబడులు 16.4 శాతం అయితే, బెంచ్ మార్క్ రాబడులు 15.2 శాతమే. అంటే దీర్ఘకాలంలో ఈ పథకం బెంచ్‌మార్క్‌కు తగ్గకుండా రాబడులను ఇస్తుందని ఆశించవచ్చు. ఫైనాన్స్ షేర్లకు పెద్దపీట... ఈ పథకం ఎక్కువగా బ్యాంకులకు, ఫైనాన్స్ స్టాక్స్‌కు ప్రాధాన్యం ఇచ్చింది. బ్యాంకుల్లో 22.9 శాతం, ఫైనాన్స్ స్టాక్స్‌లో 11.8 శాతం, సాఫ్ట్‌వేర్‌లో 10.4 శాతం, కన్జూమర్ నాన్ డ్యూరబుల్ రంగం స్టాక్స్‌లో 10.3 శాతం, ఆటోమొబైల్స్‌లో 7.2 శాతం, ఫార్మాలో 4.8 శాతం చొప్పున ఎక్స్పోజర్ కలిగి ఉంది. ఈ పథకం పోర్ట్‌ఫోలియోలో భిన్న రంగాలకు చెందిన మొత్తం 77 స్టాక్స్ ఉన్నాయి. దీనివల్ల ఈ పథకం రిస్క్ తక్కువే అని చెప్పుకోవచ్చు. గత ఏడాది కాలంలో డాబర్ ఇండియా, ఇమామి, పీఎన్బీ, పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్, ఓఎన్జీసీ తదితర కంపెనీలను పోర్ట్‌ఫోలియోకు యాడ్ చేసింది. గత ఏడాది కాలంలో బజాజ్ ఫైనాన్స్, చోళమండలం ఇన్వెస్ట్మెంట్, హెచ్‌యూఎల్, బ్రిటానియా, టైటాన్లో పెట్టుబడుల కారణంగా మంచి రాబడులను అందుకుంది. సెబీ మార్గదర్శకాలు సెబీ మార్గదర్శకాల ప్రకారం ఈ పథకం 80 శాతం నిధుల్ని లార్జ్‌క్యాప్‌లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మిగిలిన నిధుల్ని మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ స్టాక్స్, డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. గతంలో బీఎస్ఈ 200 ఈ పథకానికి ప్రామాణిక సూచీగా ఉంటే, మార్పుల అనంతరం జూన్ 4 నుంచి నిఫ్టీ 50 బెంచ్‌మార్క్‌గా మారింది. సెబీ మార్గదర్శకాలతో రిస్క్ ఇంకాస్త తగ్గింది. -
భవిష్యత్తు వృద్ధి కోసం... మిరే అస్సెట్ ఇండియా ఈక్విటీ ఫండ్
చాలా కంపెనీలు వచ్చే రెండు, మూడేళ్ల కాలంలో తమ ఫలితాల్లో రెండంకెల స్థాయిలో వృద్ధి ఉంటుందని ఇటీవల ఫలితాల అనంతరం నిర్వహించిన కాన్ఫరెన్స్ కాల్స్‌లో స్పష్టం చేశాయి. అంటే భవిష్యత్తులో తమ పెట్టుడులపై మెరుగైన రాబడులు కోరుకునే వారు ఈ తరహా కంపెనీలను సరైన సమయంలో గుర్తించి ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుందన్న మాట. ఆ విధంగా చూసినప్పుడు రిస్క్ కొంచెం భరించగలిగే వారికి మిరే అస్సెట్ ఇండియా ఈక్విటీ ఫండ్ కూడా ఒక ఎంపిక అవుతుంది. పెట్టుబడుల విధానం ఇదీ... దీర్ఘకాలంలో పెట్టుబడుల వృద్ధికి గాను దేశ ఆర్థిక రంగంతో ముడిపడిన రంగాల్లో కంపెనీలను గుర్తించి ఈక్విటీ, ఈక్విటీ సంబంధిత సెక్యూరిటీల్లో ఈ పథకం ఇన్వెస్ట్ చేస్తుంది. ఈ నెల 28 నాటికి బ్యాంకింగ్, ఫైనాన్షియల్, హౌసింగ్ ఫైనాన్స్ రంగాల్లో ఎక్కువ ఎక్స్పోజర్ తీసుకుంది. ఈ రంగాల్లో 25.71 శాతం పెట్టుబడులు పెట్టింది. 8.19 శాతం నిధుల్ని ఐటీ, సాఫ్ట్వేర్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టింది. రిఫైనరీ కంపెనీల్లో 6.38 శాతం, ఫార్మా కంపెనీల్లో 4.24 శాతం మేర ఇన్వెస్ట్ చేసింది. ఈక్విటీల్లో 97.2 శాతం నిధుల్ని ఇన్వెస్ట్ చేయగా, 2.44 శాతం మేర నగదు నిల్వలను కలిగి ఉంది. పనితీరు... ఈ పథకం ఎక్కువగా లార్జ్‌క్యాప్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఏడాది కాలంలో 11.22 శాతం, గత మూడేళ్ల కాలంలో సగటున 13 శాతం, ఐదేళ్ల కాలంలో సగటున 20 శాతం చొప్పున వార్షిక రాబడులందించింది. కానీ, ఈ కాలంలో బెంచ్ మార్క్ బీఎస్ఈ 200 రాబడులు 9 నుంచి 13 శాతంగానే ఉన్నాయి. ఆస్తులపై అధిక రాబడులున్న కంపెనీలను కొనుగోలు చేస్తుంది. ఈ పథకం పనితీరును మెరుగ్గా ఉంచుతున్నవి ఇవే. మిగిలిన పోటీ పథకాలతో పోలిస్తే 5–10 శాతం అదనంగా లార్జ్‌క్యాప్ స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టింది. లార్జ్క్యాప్స్లోనూ విలువలకే ప్రాధాన్యం ఇస్తోంది. గడిచిన ఆరు నెలల కాలంలో కొత్తగా ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్, బ్యాంక్ ఆఫ్ బరోడా, భారత్ ఎలక్ట్రానిక్స్, సిప్లా, మారికో, యునైటెడ్ ఫాస్ఫరస్, భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్‌లో ఇన్వెస్ట్ చేసింది. సీఈఎస్సీ నుంచి పూర్తిగా తప్పుకోగా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఏషియన్ పెయింట్స్, పెట్రోనెట్ ఎల్ఎన్జీ, టీసీఎస్‌లో వాటాల్ని పెంచుకుంది. -
క్వాంటమ్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్
మార్కెట్లలో దిద్దుబాటు కొనసాగితే మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో వేల్యూ ఇన్వెస్టింగ్ అనుసరించేవి ఆకర్షణీయంగా మారతాయి. విలువల పరంగా ఆకర్షణీయ స్థాయిలో ఉన్న స్టాక్స్‌ను కొనుగోలు చేయడం వేల్యూ ఇన్వెస్టింగ్లో భాగం. ఈ తరహా పథకాలకు ఇటీవల కాస్తంత ఆదరణ తగ్గింది. బుల్ ర్యాలీ జోరే అందుకు కారణం. కరెక్షన్ నేపథ్యంలో వీటికి మళ్లీ ఆకర్షణ వస్తోంది. ఇటువంటి పథకాల్లో క్వాంటమ్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ కూడా ఒకటి. మార్కెట్లు డౌన్‌సైడ్‌లో ఉన్నపుడు ఆ ప్రభావాన్ని గట్టిగా ఎదుర్కోగలిగే సామర్థ్యం ఈ ఫండ్‌కు ఉంది. లార్జ్‌క్యాప్ ఫండ్ కేటగిరీలోకి వస్తుంది. దీర్ఘకాలంలో ఇతర పథకాల కంటే క్వాంటమ్ లాంగ్‌టర్మ్ రాబడులు అధికంగా ఉండడం గమనించొచ్చు. రాబడులు బాగున్నాయి... గతేడాది బుల్స్ ర్యాలీ జోరుగా ఉన్నప్పుడు, ఈ పథకం రాబడులు 12.5 శాతమే. గతేడాది ప్రామాణిక సూచీల రాబడులు 22.5 శాతం అయితే, లార్జ్‌క్యాప్ ఫండ్స్‌లోనే ఇతర పథకాల సగటు రాబడులు 20 శాతం. కాకపోతే, దీర్ఘకాలంలో చూస్తే మూడు, ఐదు, పదేళ్ల కాలంలో క్వాంటమ్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ రాబడులు సూచీలకు దీటుగా కాస్తంత పైనే ఉన్నాయి. అందుకే దీర్ఘకాలిక లక్ష్యాలు, అవసరాల కోసం నిధి సమకూర్చుకునేందుకు పరిశీలించతగిన పథకం ఇది. దీర్ఘకాలిక పోర్ట్‌ఫోలియోలో, లార్జ్‌క్యాప్‌కు ప్రాధాన్యం ఇచ్చే వారి పోర్ట్‌ఫోలియోలో చోటివ్వదగిన పథకం. ముఖ్యంగా గడిచిన ఏడాది కాలంలో ఈ ఫండ్ రాబడులు తక్కువగా ఉండడానికి ప్రధాన కారణం అధిక నగదు నిల్వలు ఉండటమే. మొత్తం నిధుల్లో 16 శాతం నగదు రూపంలోనే ఉన్నాయి. పెట్టుబడుల్లో 80 శాతం లార్జ్‌క్యాప్ స్టాక్స్‌కే కేటాయించింది. దీంతో బుల్ ర్యాలీలో రాబడులు పరిమితంగా, స్థిరంగా ఉన్నాయి. మార్కెట్లు, స్టాక్స్ విలువలు ఖరీదుగా మారాయని భావిస్తే విక్రయించేసి నగదు నిల్వలను పెంచుకోవడంలో ఈ పథకం ఏమాత్రం సంకోచించదు. అధిక నగదు నిల్వలుండటం వల్ల మార్కెట్ల దిద్దుబాటులో ఆకర్షణీయమైన విలువల వద్ద లభించే స్టాక్స్‌లో తిరిగి ఇన్వెస్ట్ చేసే వెసులుబాటు లభిస్తుంది. పెట్టుబడులు, పోర్ట్‌ఫోలియో ఈ పథకం లార్జ్‌క్యాప్ స్టాక్స్‌కే పరిమితం. దీంతో మార్కెట్లు డౌన్టర్న్లో స్మాల్, మిడ్ క్యాప్ స్టాక్స్ మాదిరిగా విలువ భారీగా హరించుకుపోయే ప్రమాదం తక్కువ. ఇతర పథకాలతో పోలిస్తే ప్రతికూల సమయాల్లోనూ ఈ ఫండ్ మెరుగ్గా రాణించడానికి ఈ విధానమే కారణం. ఈ ఫండ్ ఎక్స్పెన్స్ రేషియో (వ్యయాల నిష్పత్తి) చాలా తక్కువ. డైరెక్ట్ ప్లాన్‌లో ఇది 1.29 శాతం అయితే, రెగ్యులర్ ప్లాన్‌లో 1.46. ఇక పోర్ట్‌ఫోలియో సైతం అధిక నాణ్యత కలిగిన 25లోపు కంపెనీలతోనే ఉండడం ఆకర్షణీయమే. గడిచిన ఏడాది కాలంలో ఈ ఫండ్ తన పోర్ట్‌ఫోలియోలోకి చేర్చుకున్న స్టాక్ లుపిన్ మాత్రమే. ఈ షేరు ధర భారీగా పతనం కావడంతో చౌకగా లభిస్తుండడమే కారణం. మరోవైపు, కోటక్ మహింద్రా బ్యాంకు, ఇండియన్ ఆయిల్, పెట్రోనెట్ ఎల్ఎన్జీ, భారతీ ఎయిర్టెల్ స్టాక్స్‌ను విక్రయించింది. టాప్ టెన్ హోల్డింగ్స్ కంపెనీ పెట్టుబడుల శాతం బజాజ్ ఆటో 7.55 హెచ్డీఎఫ్సీ 7.36 ఇన్ఫోసిస్ 6.46 హీరో మోటోకార్ప్ 6.13 టీసీఎస్ 5.80 ఐసీఐసీఐ బ్యాంక్ 4.66 ఎస్బీఐ 4.05 ఇండియన్ హోటల్స్ 3.89 విప్రో 3.71 ఎన్టీపీసీ 3.66 -
చక్రవడ్డీ ప్రయోజనాలు ఫండ్స్‌లో లభిస్తాయా?
నేను గత కొన్నేళ్లుగా ఒక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేస్తున్నాను. కానీ ఈ ఫండ్ పనితీరు అంచనాలకు అనుగుణంగా లేదు. ఈ ఫండ్ నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను పూర్తిగా వెనక్కి తీసుకొని వేరే ఫండ్‌లోకి మారుద్దామనుకుంటున్నాను. ఇలా ఒకేసారి ఒక ఫండ్ నుంచి మరో ఫండ్‌లోకి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మార్చుకోవచ్చా ? పన్ను బాధ్యత ఏమైనా ఉంటుందా ? –విజయ్, విశాఖపట్టణం ఒక ఈక్విటీ ఫండ్‌లో మీరు ఇప్పటిదాకా ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్ట్మెంట్స్ అన్నింటినీ ఒకేసారి వెనక్కి తీసుకొని వేరే ఫండ్‌లోకి ఇన్వెస్ట్ చేయడంలో ఎలాంటి ఇబ్బంది లేదు. ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానమే సరైనది. సాధారణంగా ఈక్విటీ ఫండ్స్ దీర్ఘకాలంలో మంచి రాబడులే ఇస్తాయి. కేవలం 3,4 సంవత్సరాల పనితీరును ఆధారంగా చేసుకొని వేరే ఫండ్‌లోకి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మార్చాలనుకోవడం సరికాదు. కాదు, కూడదు ఫండ్‌ను మార్చాలనేది మీ నిర్ణయమైతే, మీరు.. కొన్ని విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఎగ్జిట్ లోడ్ వర్తిస్తుందేమో అన్న విషయాన్ని చెక్ చేసుకోవాలి. మీ సిప్‌లకు ఎగ్జిట్ లోడ్ వర్తించే కాలం ముగిసిన తర్వాతే వేరే ఫండ్‌లోకి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను బదిలీ చేసుకుంటే ఎగ్జిట్ లోడ్ వ్యయాలు తగ్గుతాయి. ఇక ఒక ఫండ్ నుంచి వేరే ఫండ్‌లోకి మారడమంటే ఒక ఫండ్ నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకొని, వేరే కొత్త ఫండ్‌లో ఇన్వెస్ట్‌చేయడంగా పరిగణిస్తారు. అందుకని మీ పాత ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను వర్తిస్తుందేమో ఒక సారి చెక్ చేయండి. అలా వర్తించే పక్షంలో స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను భారం పడని కాలం వరకూ వేచి చూసి, ఆ తర్వాత వేరే ఫండ్‌లోకి మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మార్చుకోండి. ఫిక్స్డ్ డిపాజిట్లలో చక్రవడ్డీ ప్రయోజనాలు లభిస్తాయి. అలాంటి ప్రయోజనం మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే లభిస్తుందా ? –మేరీ, సికింద్రాబాద్ చక్రవడ్డీ ప్రయోజనాలు మ్యూచువల్ ఫండ్స్‌లో లభిస్తాయి. మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించి గ్రోత్ ప్లాన్లు ఈ తరహావే అని చెప్పవచ్చు. అయితే వీటిని ఫిక్స్డ్ డిపాజిట్లుగా పరిగణించడానికి లేదు. ఎందుకంటే, ఫిక్స్డ్ డిపాజిట్లలో ఎంత కాలం ఇన్వెస్ట్ చేస్తే, ఎంత మొత్తం రాబడి వస్తుందో ముందే తెలుస్తుంది. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఇంత మొత్తాల్లో రాబడులు వస్తాయని గ్యారంటీగా చెప్పలేము. అయితే అంతకు మించిన లాభాలు వచ్చాయని చరిత్ర చెబుతోంది. గత 20 ఏళ్లలో బీఎస్ఈ సెన్సెక్స్ 17–18 శాతం చొప్పున వృద్ధి సాధించింది. ఇది డిపాజిట్ రేట్కన్నా దాదాపు రెట్టింపు. కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ఏడాదికి 20–22 శాతం చక్రగతి రాబడులను కూడా ఇచ్చాయి. నేను దీర్ఘకాలం పాటు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. కొన్ని బ్యాలన్స్డ్ ఫండ్స్‌ను షార్ట్‌లిస్ట్ చేశాను. ఇటీవలే కంపెనీ నుంచి రూ. లక్ష వరకూ బోనస్ వచ్చింది. ఈ మొత్తాన్ని ఒకేసారి ఇన్వెస్ట్ చేయమంటారా ? ఈ మొత్తాన్ని బ్యాంక్‌లో డిపాజిట్ చేసి నెలకు కొంత మొత్తం చొప్పున సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయమంటారా ? –సందీప్, విజయవాడ ఈక్విటీ గానీ, బ్యాలన్స్డ్ మ్యూచువల్ ఫండ్స్‌లో కానీ ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు సిప్ విధానమే శ్రేయస్కరం. మీ దగ్గర ఇన్వెస్ట్ చేయడానికి పెద్ద మొత్తంలో డబ్బులు ఉన్నప్పుడు. ముందుగా మీరు షార్ట్ టర్మ్ డెట్ ఫండ్‌లో ఆ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయండి. ఆ తర్వాత ఒక మంచి బ్యాలన్స్డ్ ఫండ్‌ను ఎంచుకోండి. ఈ షార్ట్ టర్మ్ డెట్ ఫండ్ నుంచి సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్(ఎస్టీపీ) ద్వారా మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను బ్యాలన్స్డ్ ఫండ్‌కు మార్చుకోండి. ఇలా చేస్తే, మీరు బ్యాలన్స్డ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ముందు మీరు బ్యాంక్‌లో ఉంచేదానికన్నా అధికంగానే షార్ట్ టర్మ్డెట్ ఫండ్ ద్వారా రాబడులు పొందవచ్చు. బ్యాలన్స్డ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయడాన్ని కనీసం ఏడాది, ఏడాదిన్నర కొనసాగించండి. ఈ కాలంలో మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై మీకు తగిన అవగాహన వస్తుంది. మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై తగిన అవగాహన వచ్చిన తర్వాత ఒకటి లేదా రెండు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంచుకొని సిప్ విధానంలో ఆ ఫండ్స్‌లో ఇన్వెస్ట్మెంట్స్ కొనసాగించండి. రిటైర్మెంట్ నిధి ఏర్పాటు, సొంత ఇంటిని సమకూర్చుకోవడం, పిల్లల ఉన్నత చదువులు తదితర దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల సాధన కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మంచి సాధనాలు. నేను గతంలో బ్యాంక్‌లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన మొత్తం మరో రెండు, మూడు నెలల్లో మెచ్యూర్ అవుతుంది. ఈ మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. కనీసం ఎనిమిదేళ్ల పాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఈ విషయమై తగిన సలహా ఇవ్వండి ? –రియాజ్, హైదరాబాద్ ఎనిమిదేళ్ల పాటు ఇన్వెస్ట్ చేయడమంటే దీర్ఘకాలం కిందే లెక్క. ఇంత ఎక్కువ కాలం ఇన్వెస్ట్‌మెంట్స్‌పై మంచి రాబడులు పొందాలంటే ఉన్న కొన్ని రాబడి సాధనాల్లో ఈక్విటీ మ్యూచువల్ çఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ఒక మార్గం. మీరు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు కొత్త కాబట్టి, ముందుగా 2 లేదా 3 బ్యాలన్స్డ్ ఫండ్స్ ఎంచుకోండి. మీరు పన్ను బ్రాకెట్లో ఉంటే, ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్(ఈఎల్ఎస్ఎస్)ల్లో ఇన్వెస్ట్ చేయండి. ఫలితంగా సెక్షన్ 80సీ కింద మీకు రూ. లక్షన్నర వరకూ పన్ను మినహాయింపులు లభిస్తాయి. – ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
ఈక్విటీ ఫండ్సా? డెట్ ఫండ్సా?
ఫైనాన్షియల్ బేసిక్స్... మార్కెట్లో చాలా ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి. ఫండ్ ఎంపికకు ముందే మనం (ఇన్వెస్టర్) తొలిగా ఈక్విటీ ఫండ్‌ను ఎంచుకోవాలా? లేదా డెట్ ఫండ్‌ని ఎంపిక చేసుకోవాలా? అని నిర్ణయం తీసుకోవాలి. ద్రవ్యోల్బణాన్ని అధిగమించి దీర్ఘకాలంలో పెట్టుబడులకు సరైన ప్రతిఫలం పొందాలంటే మన పొర్ట్‌ఫోలియోలో ఈక్విటీ అసెట్స్ తప్పనిసరి. ఈక్విటీ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టడమంటే కంపెనీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడమే. మార్కెట్ పరిస్థితులకు అనువుగా ఈక్విటీ, డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. ఫండ్ ఎంపిక ఇలా.. ఇన్వెస్ట్మెంట్ లక్ష్యం: ఆర్థిక లక్ష్యాలకు అనువుగా ఇన్వెస్ట్మెంట్స్ జరగాలి. కొంత రాబడి కోసమైతే డెట్ ఫండ్స్ వైపు చూడాలి. అదే సంపద వృద్ధి కోసం ఈక్విటీ ఫండ్స్‌కు ప్రాధాన్యమివ్వాలి. పెట్టుబడుల కాలం: ఇన్వెస్టర్ ఒక అసెట్ తరగతిని ఎంపిక చేసుకునేటప్పుడు అందులో ఎంత కాలం ఇన్వెస్ట్ చేయాలి అనే అంశాన్ని అప్పటికే నిర్ణయించుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ల కాలం ఐదేళ్లలోపు ఉంటే డెట్ ఫండ్‌ని, ఐదేళ్ల పైన ఉంటే ఈక్విటీ ఫండ్‌ను ఎంచుకోవాలి. రాబడి అంచనా: మన రాబడి అంచనాలకు అనుగుణంగా ఫండ్ ఎంపిక ఉండాలి. ఒక్కొక్క ఫండ్ రాబడి ఒక్కోలా ఉంటుంది. ఈ రాబడిని అప్పటి పరిస్థితులు కూడా ప్రభావితం చేస్తాయి. దీర్ఘకాలంలో సగటున డెట్ ఫండ్స్ రాబడి 9 శాతంగా, ఈక్విటీ ఫండ్స్ రాబడి 16 శాతంగా ఉండొచ్చు. చివరిగా: ఏ ఫండ్‌ను ఎంపిక చేసుకోవాలి? అనే ప్రశ్నకు సమాధానం తెలిసిన తర్వాత ఫండ్ హౌస్‌ను ఎంచుకోవాలి. ఫండ్ హౌస్ బ్రాండ్ విలువ, దాని మేనేజ్మెంట్, ఇది వరకు ఫండ్ పనితీరు, సేవల నాణ్యత వంటి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. -
అలెఫ్ మోబిటెక్లో టాటా క్యాపిటల్ ఫండ్ పెట్టుబడులు
ముంబై: అమెరికాకు చెందిన అలెఫ్ మోబిటెక్ సొల్యూషన్స్ సంస్థలో టాటా క్యాపిటల్ నిర్వహిస్తున్న ప్రైవేట్ ఈక్విటీ ఫండ్.... టాటా క్యాపిటల్ ఇన్నోవేషన్స్ ఫండ్(టీసీఐఎఫ్) 50 లక్షల డాలర్లు పెట్టుబడులు పెట్టింది. తమ వ్యాపారాభివృద్ధి, మార్కెటింగ్, పరిశోధన, అభివృద్ధి తదితర కార్యకలాపాలు టీసీఐఎఫ్ పెట్టుబడులతో మరింత శక్తివంతమవుతాయని ఆలెఫ్ మోబిటెక్ సొల్యూషన్స్ పేర్కొంది. మొబైల్ వినియోగదారులకు అలెప్ సంస్థ మొబైల్ కంటెంట్‌ను అందిస్తోంది. టాటా ప్రాజెక్ట్స్‌కు రూ. 4,328 కోట్ల రైల్వే ప్రాజెక్ట్ * టాటా ప్రాజెక్ట్స్ రూ. 4,328 కోట్ల రైల్వే కారిడార్ కాంట్రాక్టును కైవసం చేసుకుంది. సరుకు రవాణాకు సంబంధించిన ఈ ప్రత్యేక కారిడార్ కింద ముంబై-ఢిల్లీ పట్టణాల మధ్య 320 కి.మీ రైల్వే కారిడార్‌ను టాటా ప్రాజెక్ట్స్ 48 నెలల్లో నిర్మించనుంది. -
ఉబెర్ కారెక్కిన ‘టాటా’ ఫండ్!
- ట్యాక్సీ యాప్ దిగ్గజంలో భారీ పెట్టుబడి... - టాటా ఆపర్చూనిటీస్ ఫండ్ ద్వారా వాటా కొనుగోలు రెండేళ్ల క్రితం భారత్‌లో ట్యాక్సీ యాప్ సేవలను ఆరంభించిన ఉబెర్... ప్రస్తుతం 18 నగరాల్లో కార్యకలాపాలను నిర్వహిస్తోంది. 1.5 లక్షల మంది డ్రైవర్లు ఈ సంస్థతో జట్టుకట్టారు. కస్టమర్ల ట్రిప్పుల ప్రాతిపదికన నెలవారీగా 40 శాతం మేర వృద్ధిని నమోదు చేస్తోంది. ఈ విభాగంలో ప్రస్తుతం దాదాపు 35 శాతం వాటాను ఉబెర్ చేజిక్కించుకున్నట్లు అంచనా. భారత్‌లో వచ్చే 6-9 నెలల్లో రోజుకు పది లక్షల ప్రయాణాల(రైడ్స్)ను లక్ష్యంగా పెట్టుకున్న ఉబెర్.. అదనంగా మరో బిలియన్ డాలర్ల(దాదాపు రూ.6,500 కోట్లు) మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టనున్నట్లు కూడా ఇటీవలే ప్రకటించింది. హైదరాబాద్‌లో తాము అతిపెద్ద విదేశీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నామని, ఇందుకోసం వచ్చే ఐదేళ్లలో 5 కోట్ల డాలర్లను వెచ్చించనున్నట్లు కూడా ఉబెర్ పేర్కొంది. న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ట్యాక్సీ యాప్ దిగ్గజం ఉబెర్‌లో టాటా గ్రూప్ సారథ్యంలోని ప్రైవేటు ఈక్విటీ(పీఈ) ఫండ్ భారీగా పెట్టుబడి పెట్టనుంది. టాటా క్యాపిటల్ నిర్వహణలో ఉన్న టాటా ఆపర్చ్యూనిటీస్ ఫండ్(టీఓఎఫ్) ద్వారా వాటాలను కొనుగోలు చేయనుంది. ఈ విషయాన్ని టీఓఎఫ్ మంగళవారం వెల్లడించింది. అయితే, ఎంత వాటా తీసుకుంటోంది, పెట్టుబడి మొత్తం వంటి వివరాలను మాత్రం తెలియజేయలేదు. కాగా, ఉబెర్‌లో టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ సంస్థ టైమ్స్ ఇంటర్నెట్ ఈ ఏడాది మార్చిలో దాదాపు రూ.150 కోట్లతో స్వల్ప వాటాను దక్కించుకున్న సంగతి తెలిసిందే. తాజా డీల్‌తో ఉబెర్‌లో పెట్టుబడిపెట్టిన రెండో భారతీయ సంస్థగా టీఓఎఫ్ నిలుస్తోంది. టీఓఎఫ్కు ఇదే తొలి విదేశీ పెట్టుబడి కూడా. కాగా, టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా.. ఉబెర్ పోటీ కంపెనీ అయిన ఓలా క్యాబ్స్‌లో వ్యక్తిగతంగా ఇప్పటికే పెట్టుబడి పెట్టడం విశేషం. ఉత్సాహాన్నిస్తోంది..: ఉబెర్ ‘ట్యాక్సీ సేవల రంగంలో ఉబెర్ ప్రపంచవ్యాప్తంగా కొనసాగిస్తున్న విజయపథం, వృద్ధికి మేం కూడా తోడ్పాటునందిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ముఖ్యంగా చైనా, భారత్‌లో ఉబెర్ దూసుకెళ్తోంది. సాంకేతికపరిజ్ఞానం ద్వారా ప్రజా రవాణాలో కోట్లాదిమందికి సరికొత్త సేవలను ఉబెర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతేకాకుండా వేలాదిమంది తొలిస్థాయి ఎంట్రప్రెన్యూర్లకు(కారు డ్రైవర్లు, ఓనర్లు) ఆర్థికపరమైన ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తోంది. ఈ సంస్థ అందిస్తున్న సేవలను గుర్తించే మేం పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చాం’ అని టీఓఎఫ్ మేనేజింగ్ పార్ట్నర్(ఇండియా అడ్వయిజరీ టీమ్) పద్మనాభ్ సిన్హా పేర్కొన్నారు. కాగా, ఇప్పటివరకూ టీఓఎఫ్ జింజర్ హోటల్స్, టాటా స్కై, వరోక్ ఇంజనీరింగ్, శ్రీరామ్ ప్రాపర్టీస్, టాటా ప్రాజెక్ట్స్, టీవీఎస్ లాజిస్టిక్స్ తదితర సంస్థల్లో 40 కోట్ల డాలర్ల మేర(దాదాపు రూ.2,600 కోట్లు) పెట్టుబడులను పెట్టింది. భారత కార్పొరేట్ రంగానికి టాటా ప్రతీకగానిలుస్తుందని.. అలాంటి గ్రూపునకు చెందిన టీఓఎఫ్ తమ భాగస్వామిగా చేరుతుం డటం ఉత్సాహాన్నిస్తోందని ఉబెర్ ఇండియా హెడ్ అమిత్ జైన్ వ్యాఖ్యానించారు. -
ఎల్అండ్టీ ఈక్విటీ ఫండ్‌కు పదేళ్లు...
ముంబై: ఎల్అండ్టీ మ్యూచువల్ ఫండ్‌లో ప్రముఖ ఎల్అండ్టీ ఈక్విటీ ఫండ్ ప్రారంభమై పదేళ్లయ్యింది. భారత్ మార్కెట్లో ఈక్విటీ, ఈక్విటీ సంబంధిత సెక్యూరిటీల్లో దీర్ఘకాలిక పెట్టుబడులకు అత్యధిక రాబడిని అందించాలన్న ప్రధాన ఉద్దేశంతో 2005మేలో ఈక్విటీ ఫండ్ ప్రారంభమయ్యింది. ఈ పదేళ్లలో ఫండ్ దాదాపు 7 లక్షల మంది ఇన్వెస్టర్ల పెట్టుబడులను నిర్వహించినట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. 10 సంవత్సరాలు ఫండ్‌లో ఉన్న ఇన్వెస్టర్లు మంచి ఆర్థిక ఫలితాలు పొందినట్లు వివరించింది. ఉదాహరణకు 2005 మే నెలలో రూ.లక్ష ఇన్వెస్ట్ చేసినవారికి 2015 మే నాటికి ఈ మొత్తం రూ.6.28 లక్షలకు పెరిగినట్లు ఎల్అండ్టీ మ్యూచువల్ ఫండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కులకర్ణి వివరించారు. చక్రగతిన వార్షిక రిటర్న్ 20 శాతమని తెలిపారు. -
సంపాదన ఉంటేనే టర్మ్ ఇన్సూరెన్స్
నేను రూ.10-15 లక్షల వరకూ మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌ల్లో ఇన్వెస్ట్ చేశాను. అయితే ఇవన్నీ కాగిత రూపంలోనే ఉన్నాయి. వీటిని డీమ్యాట్ రూపంలోకి మార్చుకోవాలా? అలాచేస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ప్రస్తుతం నా దగ్గర రూ.5 లక్షల వరకూ డబ్బులున్నాయి. దీనిని ఏదైనా డెట్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసి, ఆ తర్వాత వాటిని ఏదైనా ఈక్విటీ ఫండ్‌లోకి బదిలీ చేయాలనుకుంటున్నాను. సరైన డెట్ ఫండ్‌ను సూచించండి. -ఉమశ్, వరంగల్ ప్రత్యేకమైన ప్రయోజనాలు లేకపోయినప్పటికీ కాగిత రూపంలోని మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లను డీమ్యాట్ అకౌంట్లోకి మార్చుకుంటే మంచిదే. ఇక మీ రెండో ప్రశ్నకు వస్తే..., మీరు వివిధ మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌ల్లో ఇన్వెస్ట్ చేశారు. కాబట్టి వాటి వివరాలు తెలియకుండా ఏదో ఒక ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయమని సలహా ఇవ్వలేను. మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్న మొత్తాన్ని ముందుగా ఏదైనా షార్ట్-టర్మ్ బాండ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయండి. ఆ తర్వాత సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ ద్వారా ఏదైనా ఈక్విటీ ఫండ్‌లోకి బదిలీ చేయండి. కాకుంటే మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న షార్ట్-టర్మ్ బాండ్ ఫండ్, బదిలీ చేసే ఈక్విటీ ఫండ్- ఈ రెండు ఒకే మ్యూచువల్ ఫండ్ కంపెనీకి చెందినవైతే మంచి ప్రయోజనాలు పొందవచ్చు. నేను ఒక ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్ఎస్ఎస్)కు చెందిన డివిడెండ్ రీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్‌లో కొంత మొత్తం ఇన్వెస్ట్ చేశాను. ఈ స్కీమ్ నుంచి డివిడెండ్ పే అవుట్ స్కీమ్‌కు మారాలనుకుంటున్నాను. ఎలా మారాలో వివరించండి? -అమరేశ్వరి, గుంటూరు మీరు ప్రస్తుతం డివిడెండ్ రీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ ఫండ్ నుంచి డివిడెండ్ పేఅవుట్(చెల్లించే) ఆప్షన్‌కు మారాలనుకుంటున్నట్లు ఒక రిక్వెస్ట్ లెటర్‌ను గానీ, చేంజ్ ఆప్షన్ స్లిప్‌ను గానీ ఆ మ్యూచువల్ ఫండ్ సంస్థకు పంపించాలి. మీ స్కీమ్‌కు లాక్-ఇన్ పీరియడ్ ఉన్నా ఇలా మార్చుకోవచ్చు. అయితే గ్రోత్ ఆప్షన్ స్కీమ్లైతే లాకిన్ పీరియడ్ తర్వాతనే మార్చుకోవడానికి వీలవుతుంది. మీ పెట్టుబడులను 3 ఏళ్ల లాకిన్ పీరియడ్ పూర్తయిన తర్వాత రిడీమ్ చేసుకోవచ్చు. ఇటీవలనే మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్‌కు సంబంధించి డివిడెండ్ రీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్‌ను ఆపేయాలని ఆదేశాలు జారీ చేసింది. నేను కొటక్ గోల్డ్ ఫండ్ యూనిట్లను విక్రయించాలనుకుంటున్నాను. నేనేమన్నా లాంగ్‌టెర్మ్, షార్ట్ టెర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చెల్లించాలా? ఎన్ని సంవత్సరాల పెట్టుబడి తర్వాత లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్ను చెల్లించాల్సి ఉంటుంది? -సరళ, హైదరాబాద్ ఆదాయపు పన్ను చట్టం ప్రకారం, దేశీయ ఈక్విటీల్లో 65 శాతం వరకూ ఇన్వెస్ట్ చేసే ఫండ్స్‌ను ఈక్విటీ ఫండ్స్‌గా పరిగణిస్తారు, ఇలా కాని వాటిని నాన్-ఈక్విటీ ఫండ్స్‌గా పరిగణిస్తారు. కొటక్ వరల్డ్ గోల్డ్ ఫండ్‌ను విదేశీ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తుంది కాబట్టి దీనిని నాన్-ఈక్విటీ ఫండ్‌గా పరిగణిస్తారు.ఈ ఫండ్ నుంచి మీరు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మూడేళ్లలోపే ఉపసంహరించుకుంటే మీరు షార్ట్-టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మీ ట్యాక్స్ శ్లాబులననుసరించి ఈ పన్ను విధిస్తారు. మూడేళ్ల త ర్వాత ఉపసంహరించుకుంటే దీర్ఘకాల క్యాపిటల్ గెయిన్స్ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇండెక్సేషన్‌తో కలుపుకొని ఇది 20 శాతంగా ఉంటుంది. నా కొడుకు వయస్సు 20 సంవత్సరాలు. అతడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అతడిపేరు మీద ఒక టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుందామనుకున్నాను, రెండు మూడు జీవిత బీమా వెబ్సైట్లలో ఆన్లైన్ ద్వారా ఈ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే ప్రయత్నాలు చేశాను. కానీ ఈ వెబ్సైట్లన్నీ ఆదాయ ధ్రువీకరణ అడుగుతున్నాయి. నా కొడుకు ఇంకా చదువుతున్నాడు. కాబట్టి అతడికి ఆదాయ ధ్రువీకరణ లేదు. నా కొడుక్కి వేరే మార్గాల్లో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చా? -ఆంజనేయ శాస్త్రి, కర్నూలు సాధారణంగా కుటుంబంలో సంపాదించే వ్యక్తులే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు. ఈ సంపాదించే వ్యక్తి ప్రమాదవశాత్తూ మరణిస్తే, అతడి పై ఆధారపడ్డ వారికి ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులను తట్టుకోవడానికి ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుంది. సంపాదన లేని వ్యక్తికి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం సరైనది కాదు. -
అత్యవసర నిధి కోసం లిక్విడ్ ఫండ్స్..?
మిరా అసెట్ ఇండియా ఆపర్చునిటీస్ ఫండ్‌లో డెరైక్ట్ ప్లాన్‌లో డివిడెండ్ పేఅవుట్ ఆప్షన్లో ఇన్వెస్ట్ చేశాను. ఈ ప్లాన్‌కు సంబంధించి డెరైక్ట్, రెగ్యులర్ ప్లాన్ల ఎన్ఏవీల మధ్య రూ. 4 తేడా ఉంది. ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎన్ఏవీ అధికంగా ఉండటంతో నాకు యూనిట్లు తక్కువగా వచ్చాయి. డెరైక్ట్ ప్లాన్, రెగ్యులర్ ప్లాన్లలో ఏది ఇన్వెస్టర్లకు మంచిదో వివరించండి? - కుమార్, మంగళగిరి ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎన్ఏవీ అధికంగా ఉందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రెగ్యులర్ ప్లాన్‌తో పోల్చితే డెరైక్ట్ ప్లాన్ రాబడులు అధికంగా ఉన్నాయా లేదా అన్నది అసలు విషయం. ఏ ఇతర ప్లాన్లతో పోల్చినా కూడా డెరైక్ట్ ప్లాన్ ద్వారా వచ్చే రాబడి అధికంగా ఉంటాయి. వ్యయాలు తక్కువగా ఉండటమే దీనికి కారణం. మ్యూచువల్ ఫండ్స్‌ను విక్రయించే దళారీలకు చెల్లించే కమిషన్, ఇతర ఖర్చులు డెరైక్ట్ ప్లాన్లలో ఉండవు. ఇలా ఆదా అయిన వ్యయాలను సదరు మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఇన్వెస్టర్లకే అందిస్తాయి. అందుకే ఈ డెరైక్ట్ ప్లాన్ల ఎన్ఏవీ, రాబడులు అధికంగా ఉంటాయి. ఏ ఫండ్‌ను కొనుగోలు చేయాలో అన్న విషయంపై మీకు పూర్తి స్థాయిలో స్పష్టత ఉన్నప్పుడే మీరు డెరైక్ట్ ప్లాన్‌లో ఇన్వెస్ట్చేయడం మంచిది. ఇలా కాని పక్షంలో రెగ్యులర్ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం. డెరైక్ట్ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల రాబడులు అధికంగా వస్తాయనేది కాదనలేని సత్యం. అయితే ఈ డెరైక్ట్ ప్లాన్‌ను ఎంచుకునేందుకు బాగా రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఏడాది క్రితం నేనొక ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేశాను. ఇప్పడు ఈ ఫండ్‌లోని ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్)లో సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్(ఎస్టీపీ)లోకి మళ్లిద్దామనుకుంటున్నాను. సెక్షన్ 80సీ కింద నాకు ఏమైనా పన్ను రాయితీలు లభిస్తాయా? - మల్లిక, హైదరాబాద్ ఒక ఫండ్ నుంచి మరో ఫండ్‌లోకి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మళ్లించడాన్ని -ఒక ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకొని మరో ఫండ్‌లో కొత్తగా ఇన్వెస్ట్‌చేయడంగా పరిగణిస్తారు. ఈక్విటీ ఫండ్ నుంచి ఏడాది కాలంలోపు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మళ్లిస్తే మీరు షార్ట్టెర్మ్క్యాపిటల్ గెయిన్స్ పన్ను, ఏడాది దాటిన తర్వాత అయితే లాంగ్‌టెర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈక్విటీ ఫండ్స్‌పై ఏడాది దాటితే ఎలాంటి లాంగ్‌టెర్మ్ క్యాపిటల్ గెయిన్స్చెల్లించాల్సిన అవసరం లేదు. ఇక మీ విషయానికొస్తే, మీ ఈక్విటీ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు ఏడాది పూర్తయినందున మీరు ఎలాంటి లాంగ్‌టెర్మ్ క్యాపిటల్ గెయిన్స్ చెల్లించాల్సిన పని లేదు. ఇక ఈఎల్ఎస్ఎస్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీరు సెక్షన్ 80 సీ కింద పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్‌చేసిన తేదీ నుంచి లాకిన్ పీరియడ్ మూడేళ్లుగా ఉంటుంది. మీరు ఈఎల్ఎస్ఎస్లో ఎస్టీపీ విధానంలో మళ్లించిన ప్రతీ ఇన్‌స్టాల్‌మెంట్‌కు అప్పటి నుంచి మూడేళ్ల లాకిన్ పీరియడ్ వర్తిస్తుంది. నా నెలజీతానికి ఆరురెట్లు మొత్తాన్ని అత్యవసర నిధి కింద ఏర్పాటు చేయాలని భావిస్తున్నాను. నేను 30 శాతం పన్ను పరిధిలోకి వస్తాను. మిత్రులు లిక్విడ్ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయమని చెబుతున్నారు. ఈ అత్యవసర నిధి ఇన్వెస్ట్మెంట్స్ సురక్షితంగా ఉండాలి, ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసుకునేలా ఉండాలి. మరోవైపు ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే అదనపు వడ్డీని అందించగలగాలి. తగిన సలహా ఇవ్వండి. - అబ్రహాం, గుంటూరు అత్యవసర నిధి కోసం ఇన్వెస్ట్మెంట్స్ కోసం కొన్ని విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. తక్కువ రిస్క్, ఎక్కువ లిక్విడిటీ...వాటిల్లో కొన్ని. అత్యవసర నిధి కోసం ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ మంది లిక్విడ్ ఫండ్స్‌ను ఎంచుకుంటారు. 91 రోజుల కంటే తక్కువ వ్యవధిలో మెచ్యూరిటీ అయ్యే సెక్యూరిటీల్లో ఈ లిక్విడ్మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తాయి. మనీ మార్కెట్ ఇన్ స్ట్రుమెంట్స్, స్వల్ప కాలిక కార్పొరేట్డిపాజిట్లు, ట్రెజరీ సాధనాల్లో ఇవి ఇన్వెస్ట్ చేస్తాయి. ఈ ఫండ్స్ల్లోని ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకుంటే ఆ మొత్తం ఇతర మ్యూచువల్ ఫండ్ల్లా కాకుండా ఒక బిజినెస్ డేలోనే మీ చేతికి అందుతాయి. తక్కువ రిస్క్, అధిక లిక్విడిటీ కారణంగా అత్యవసర నిధి కోసం వీటికి ప్రాధాన్యత ఇస్తారు. వీటిపై వడ్డీ 6-8 శాతం వరకూ వస్తుంది. అయితే మీరు మీ అత్యవసర నిధి ఇన్వెస్ట్మెంట్స్ మొత్తాన్ని కొంత నగదుగా మీ దగ్గర, కొంత సేవింగ్స్‌బ్యాంక్ అకౌంట్లోనూ, మిగిలినది లిక్విడ్ ఫండ్స్‌లోనూ ఇన్వెస్ట్ చేయడం సమంజసంగా ఉంటుంది. -
రిటైర్మెంట్కు మంచి ప్రణాళిక ఎలా..?
నేనొక డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్(ఎస్టీపీ) ద్వారా నా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఈ ఫండ్ నుంచి ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్ఎస్ఎస్) ఫండ్‌లోకి మళ్లిద్దామనుకుంటున్నాను. ఇలాచేస్తే నాకు పన్ను ప్రయోజనాలు లభిస్తాయా? సాంకేతికంగా చూస్తే ఇది కొత్త ఇన్వెస్ట్మెంట్ కాదు కాబట్టి పన్ను ప్రయోజనాలు లభించవని నేను అనుకుంటున్నాను. ఈఎల్ఎస్ఎస్ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌కు మూడేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. అలా అయితే పన్ను ప్రయోజనాలు లభిస్తాయి కదా. ఈ విషయంలో నాకు తగిన సలహా ఇవ్వండి. - రవీందర్, వరంగల్ ఒక ఫండ్ నుంచి మరో ఫండ్‌కు ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మార్చుకోవచ్చు. ఒకేసారి కానీ, సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్(ఎస్టీపీ) ద్వారా మార్చుకోవచ్చు. ఎస్టీపీ ద్వారా మార్చుకుంటేనే ఉత్తమం. ఇక ఇలా ఒక ఫండ్ నుంచి మరో ఫండ్‌లోకి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మార్చుకుంటే, ఒక ఫండ్ నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకొని, మరో ఫండ్‌లో కొత్తగా ఇన్వెస్ట్ చేసినట్లుగా పరిగణిస్తారు. మీరు డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఈఎల్ఎస్ఎస్ ఫండ్‌లోకి మళ్లిద్దామనుకుంటున్నారు. ఈఎల్ఎస్ఎస్ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌కు మూడేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. మీరు ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మార్చినప్పటి నుంచి లాకిన్ పీరియడ్ వర్తిస్తుంది. మీరు సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. నా తల్లిదండ్రుల కోసం యునెటైడ్ ఇండియా సూపర్ టాపప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాను. ఈ పాలసీకి సంబంధించిన ప్రీమియమ్‌ను నగదు రూపంలో చెల్లించాను. ప్రీమియమ్‌ను చెక్కు ద్వారా గానీ, నెట్‌బ్యాంకింగ్ ద్వారా కానీ చెల్లించనందున ఈ ప్రీమియమ్‌కు ఆదాయపు పన్ను ప్రయోజనాలు లభ్యం కావని నా మిత్రుడొకరు చెప్పాడు. అయితే ప్రీమియమ్ చెల్లించిన రసీదుతో పన్ను ప్రయోజనాలు పొందవచ్చని బీమా ఏజెంట్ ఒకరు చెప్పారు. ఈ రెండింటిలో ఏది కరెక్టు? - సోమసుందర్, విశాఖపట్టణం తల్లిదండ్రుల కోసం తీసుకున్న ఆరోగ్య పాలసీల ప్రీమియమ్‌కు ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80డీ ప్రకారం పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. అయితే ఈ ప్రీమియమ్‌ను చెక్కు ద్వారా గానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా గానీ చెల్లించాలి. నగదు రూపంలో చెల్లిస్తే పన్ను ప్రయోజనాలు లభ్యం కావు. ఈ విషయంలో మీ మిత్రుడే కరెక్టు. మీరు పన్ను ప్రయోజనాలు పొందలేరు. రిటైర్మెంట్ అవసరాల నిమిత్తం నెలకు రూ.40,000 చొప్పున ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. ఈ మొత్తాన్ని పోస్ట్ ఆఫీస్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్(ఎన్ఎస్సీ)లో ఇన్వెస్ట్ చేయమని మిత్రుడొకరు సలహా ఇచ్చారు. ఇలా ఇన్వెస్ట్ చేస్తే రిటైర్మెంట్ తర్వాత క్రమం తప్పకుండా ఆదాయం పొందవచ్చనేది అతని అభిప్రాయం. కానీ ఇంత మొత్తం కొన్నేళ్లపాటు ఈ స్కీమ్‌లో నిరుపయోగంగా ఉండిపోతుందనేది నా అభిప్రాయం? మీరేమంటారు? - ఆనంద్, హైదరాబాద్ రిటైర్మెంట్ అవసరాల కోసం ఇన్వెస్ట్ చేయడమనేది పలు అంశాలపై ఆధారపడి ఉంటుంది. మీ వయస్సు, మీ రిటైర్మెంట్ అవసరాలు, మీ ప్రస్తుత సంపాదన ఇలా పలు అంశాలను పరిగణనలోకి తీసుకొని రిటైర్మెంట్ కోసం చేసే ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ప్లాన్ చేసుకోవాలి. మీరు మీ వయస్సును వెల్లడించలేదు. కాబట్టి, మూడు రకాలైన పరిస్థితుల్లో మీరు ఎలా ఇన్వెస్ట్ చేయవచ్చో సూచించాం. మీకు సరిపోయినది ఎంచుకోండి. మొదటిది: మీరు రిటైర్మెంట్కు దగ్గరగా ఉంటే ఎన్ఎస్సీల్లో ఇన్వెస్ట్ చేయడమే ఉత్తమం. ప్రతి నెలా అంత మొత్తానికి నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లు కొనుగోలు చేస్తే, అవి మెచ్యూరిటీ అయి రిటైర్మెంట్ తర్వాత క్రమం తప్పని ఆదాయం పొందవచ్చు.అయితే ఎన్ఎస్సీ వంటి స్థిరాదాయ మార్గాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల పెరుగుతున్న ద్రవ్యోల్బణం నుంచి రక్షణ పొందలేరు. రెండోది: మీ రిటైర్మెంట్ ఇంకా ఎక్కువ సంవత్సరాలున్నట్లయితే, ఈక్విటీల్లో కూడా ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం. మొత్తం ఇన్వెస్ట్‌మెంట్స్‌లో కనీసం 10 శాతాన్ని ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. ఏదైనా మంచి రేటింగ్ ఉన్న బ్యాలెన్స్డ్ ఫండ్‌ను ఎంచుకొని, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో పెట్టుబడులు పెట్టాలి. మిగిలిన మొత్తాన్ని ఎన్ఎస్సీల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. మూడవది: మీకు 30లోపు వయస్సుండి, రిటైర్మెంట్ అవసరాల కోసం చూస్తున్నట్లయితే, మొత్తం ఇన్వెస్ట్‌మెంట్స్‌లో 60 శాతాన్ని డైవర్సిఫైడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసి, మిగిలిన మొత్తాన్ని ఎన్ఎస్సీల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్