ఎన్నో ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాం. పాత రోజుల్లాగే ఈ ఏడాదీ గడిచిపోతే కిక్కేముంటుంది. వైవిధ్యంగా ఉండాలని అందరూ అనుకుంటారు. ఆర్థికంగా ఈ ఏడాదిలో మరింత రాణిస్తూ, పెట్టుబడులను కాపాడుకోవాలని చాలా మంది భావిస్తారు. అయితే కొందరు వయసురీత్యా రిస్క్ చేయలేకపోవచ్చు. ఏ వయసువారు ఎలాంటి పెట్టుబడి పంథాను ఎంచుకోవాలో..తమ ఇన్వెస్ట్‌మెంట్ ఎలా కాపాడుకోవాలో ఆర్థిక నిపుణులు కొన్ని సలహాలు ఇస్తున్నారు.
20-30 ఏళ్ల వయసువారు..
ఈ వయసువారు కాస్త దూకుడుగా పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. వీరు తమ పెట్టుబడుల్లో సుమారు 80 శాతం వరకూ ఈక్విటీలకు కేటాయించవచ్చు. ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియో మరింత సురక్షితంగా ఉండాలంటే 70 శాతం వరకు చేస్తే సరిపోతుంది. మిగతా మొత్తాన్ని నష్టం తక్కువగా ఉంటే లిక్విడ్, డెట్ ఫండ్లలో మదుపు చేయవచ్చు. ఇన్వెస్ట్ చేసినప్పటి నుంచి మూడేళ్లలోపు నగదు అవసరం ఉందని భావిస్తే ఈ పథకాల్లో నుంచి డబ్బు తీసుకునే వీలుంటుంది. ఈక్విటీలకు సంబంధించి దీర్ఘకాలంలో మంచి రాబడులిచ్చే స్మాల్‌క్యాప్ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలి.
30-40 ఏళ్ల గ్రూప్ వారు..
వీరికి స్థిరంగా ఆదాయం ఉంటుంది. ఈ వయసులోవారు ఇల్లు కొనడం, పిల్లల చదువులు, కుటుంబ పెద్దల ఆరోగ్య ఖర్చులు, పెళ్లిళ్లు, బంధువుల ఇంటికి వెళ్లడం.. వంటి వాటికి ఎక్కువ ఖర్చు చేయాల్సి రావొచ్చు. దాంతోపాటు ప్రధానంగా పదవీ విరమణ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. కాబట్టి, రిస్క్‌తో కూడిన ఈక్విటీ పెట్టుబడులను కొంత తగ్గించుకోవాలి. మొత్తం పెట్టుబడుల్లో గరిష్ఠంగా 70 శాతం వరకే ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయాలి. మిగతాది సురక్షితంగా ఉండే వివిధ మార్గాల్లో మదుపు చేయాలి.
40-50 ఏళ్లవారు..
ఈ వయసులో రిస్క్ తీసుకోవడం సరికాదు. ఇది ప్రశాంతంగా ఉండాల్సిన సమయం. కాబట్టి ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌మెంట్‌ను తగ్గించుకుని స్థిరాదాయం ఇచ్చే డెట్ పథకాల్లోకి పెట్టుబడిని మళ్లించాలి. మొత్తం మదుపులో ఈక్విటీ పెట్టుబడులు 60 శాతం మించకుండా జాగ్రత్తపడాలి.
ఇదీ చదవండి: మినిమం బ్యాలెన్స్ లేదంటే జరిమానా.. తప్పించుకోవడం ఎలా?
50 దాటిన వారు..
ఈ వయసులో అసలు రిస్క్ తీసుకోకూడదు. పదవీ విరమణ తర్వాత ప్రశాంత జీవితానికి ఏర్పాట్లు చేసుకోవాలి. పదవీ విరమణ మరో మూడేళ్లు ఉందనుకున్నప్పుడే క్రమంగా మీ ఈక్విటీ పెట్టుబడులను స్థిర ఆదాయం వచ్చే డెట్ ఫండ్స్‌లోకి మళ్లించాలి. లేదంటే ఏదైనా అనిశ్చితులు ఏర్పడి మార్కెట్ పడిపోయినా, కొంత కాలంపాటు ఎలాంటి పెరుగుదల లేకుండా కదలాడినా భారీగానే నష్టపోవాల్సి ఉంటుంది. పదవీవిరమణ తర్వాత ఆదాయం ఉండదు కాబట్టి డబ్బును కాపాడుకోవడం ఉత్తమం.
Comments
Please login to add a commentAdd a comment