సొంతిల్లు సామాన్యుడి కల. ఈ కలను నెరవేర్చుకునేందుకు చాలామంది తమ జీవితాంతం కష్టపడుతారు. ఏళ్ల తరబడి నెలవారీ సంపాదన పోగుచేస్తుంటారు. అయినా ఇప్పుడు మార్కెట్లో ఉన్న రేటుకు ఇల్లు కొనాలంటే చాలా వరకు హోంలోన్ తీసుకోవాల్సిందే. ఇదే అదనుగా హోమ్‌లోన్‌కు సంబంధించి చాలా బ్యాంకులు కనీసం 20 ఏళ్ల కాలపరిమితి ఉండేలా జాగ్రత్త పడుతుంటాయి. దాంతో కస్టమర్ల నుంచి అధిక వడ్డీ సమకూరే అవకాశం ఉంటుంది. కానీ లోన్ తీసుకునే వారికి అది భారంగా మారుతుంది. కాబట్టి కొన్ని చిట్కాలు పాటించి ఈ హోమ్‌లోన్ భారాన్ని తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
ఉదాహరణకు..విజయ్ ఏటా తొమ్మిది శాతం వడ్డీ చొప్పున 20 ఏళ్ల కాలానికిగాను రూ.25,00,000 హోంలోన్ తీసుకున్నాడని అనుకుందాం. లోన్ మొత్తానికి నెలవారీ ఈఎంఐ రూ.22,493. ఇరవై ఏళ్ల కాలానికి వడ్డీ రూ.29 లక్షలు అవుతుంది. అయితే చిన్న చిట్కాతో ఈ వడ్డీ భారాన్ని తగ్గించుకోవచ్చు. ఏడాది ప్రాతిపదికన 12 నెలలకు ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఏటా కేవలం మూడు ఈఎంఐలు అధికంగా చెల్లిస్తే ఏకంగా రూ.13 లక్షలు వడ్డీ ఆదా చేసుకోవచ్చు. బ్యాంకు సిబ్బందితో మాట్లాడి ఏటా 15 ఈఎంఐలు..అంటే మూడు ఈఎంఐలు అధికంగా చెల్లిస్తే సరిపోతుంది. అందుకు కొన్ని బ్యాంకులు ఒప్పుకోవు. ఎందుకంటే బ్యాంకు వడ్డీ కోల్పోయే ప్రమాదం ఉంది. దానివల్ల లోన్ తీసుకునేవారికి మేలు జరుగుతుంది. నిబంధనల ప్రకారం ఏడాదిలో 15 ఈఎంఐలు చెల్లించేందుకు ప్రతి బ్యాంకు అనుమతించాల్సిందే.
ఇదీ చదవండి: ఇంట్లో ఎంత బంగారం ఉండాలంటే..
నెలవారీ సంపాదనను దృష్టిలో ఉంచుకుని ఈఎంఐలు 20-30 శాతం దాటకుండా జాగ్రత్తపడాలి. సొంతిల్లు లేకపోతే సమాజం ఏమనుకుంటుందోననే భావనతో సరైన ఆర్థిక స్థోమత లేకపోయినా అప్పుచేసి ఇల్లుకొని ఇబ్బంది పడకూడదని నిపుణులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment