home loan interest
-
మూడు ఈఎంఐలతో రూ.13 లక్షలు ఆదా!
సొంతిల్లు సామాన్యుడి కల. ఈ కలను నెరవేర్చుకునేందుకు చాలామంది తమ జీవితాంతం కష్టపడుతారు. ఏళ్ల తరబడి నెలవారీ సంపాదన పోగుచేస్తుంటారు. అయినా ఇప్పుడు మార్కెట్లో ఉన్న రేటుకు ఇల్లు కొనాలంటే చాలా వరకు హోంలోన్ తీసుకోవాల్సిందే. ఇదే అదనుగా హోమ్‌లోన్‌కు సంబంధించి చాలా బ్యాంకులు కనీసం 20 ఏళ్ల కాలపరిమితి ఉండేలా జాగ్రత్త పడుతుంటాయి. దాంతో కస్టమర్ల నుంచి అధిక వడ్డీ సమకూరే అవకాశం ఉంటుంది. కానీ లోన్ తీసుకునే వారికి అది భారంగా మారుతుంది. కాబట్టి కొన్ని చిట్కాలు పాటించి ఈ హోమ్‌లోన్ భారాన్ని తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.ఉదాహరణకు..విజయ్ ఏటా తొమ్మిది శాతం వడ్డీ చొప్పున 20 ఏళ్ల కాలానికిగాను రూ.25,00,000 హోంలోన్ తీసుకున్నాడని అనుకుందాం. లోన్ మొత్తానికి నెలవారీ ఈఎంఐ రూ.22,493. ఇరవై ఏళ్ల కాలానికి వడ్డీ రూ.29 లక్షలు అవుతుంది. అయితే చిన్న చిట్కాతో ఈ వడ్డీ భారాన్ని తగ్గించుకోవచ్చు. ఏడాది ప్రాతిపదికన 12 నెలలకు ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఏటా కేవలం మూడు ఈఎంఐలు అధికంగా చెల్లిస్తే ఏకంగా రూ.13 లక్షలు వడ్డీ ఆదా చేసుకోవచ్చు. బ్యాంకు సిబ్బందితో మాట్లాడి ఏటా 15 ఈఎంఐలు..అంటే మూడు ఈఎంఐలు అధికంగా చెల్లిస్తే సరిపోతుంది. అందుకు కొన్ని బ్యాంకులు ఒప్పుకోవు. ఎందుకంటే బ్యాంకు వడ్డీ కోల్పోయే ప్రమాదం ఉంది. దానివల్ల లోన్ తీసుకునేవారికి మేలు జరుగుతుంది. నిబంధనల ప్రకారం ఏడాదిలో 15 ఈఎంఐలు చెల్లించేందుకు ప్రతి బ్యాంకు అనుమతించాల్సిందే.ఇదీ చదవండి: ఇంట్లో ఎంత బంగారం ఉండాలంటే..నెలవారీ సంపాదనను దృష్టిలో ఉంచుకుని ఈఎంఐలు 20-30 శాతం దాటకుండా జాగ్రత్తపడాలి. సొంతిల్లు లేకపోతే సమాజం ఏమనుకుంటుందోననే భావనతో సరైన ఆర్థిక స్థోమత లేకపోయినా అప్పుచేసి ఇల్లుకొని ఇబ్బంది పడకూడదని నిపుణులు చెబుతున్నారు. -
తగ్గిన వడ్డీ రేట్లు.. ప్రాసెసింగ్ ఫీజు మొత్తం రద్దు.. బ్యాంక్ సంచలన నిర్ణయం!
Bank Of Maharashtra: ఒక వ్యక్తి తన జీవిత కాలంలో ఏదో ఒక సందర్భంలో అప్పు చేయక తప్పదు. తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు చేస్తే వడ్డీల మీద వడ్డీలు కట్టి అమాంతం మునిగిపోతారు. బ్యాంకుల వద్ద తీసుకోవాలంటే ప్రాసెసింగ్ ఫీజులు, వడ్డీ అంటూ ఎన్నెన్నో వసూలు చేస్తారు. అయితే అలాంటి ఇబ్బందులకు చెక్ పెడుతూ ఒక బ్యాంక్ గుడ్ న్యూస్ చెప్పింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఖాతాదారులు తీసుకునే లోన్ మీద ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు మాఫీ చేస్తున్నట్లు తెలిపింది. అంతే కాకుండా వడ్డీ రేటుని కూడా భారీగా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో అకౌంట్ హోల్డర్ల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్న బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఇప్పుడు హౌస్ అండ్ కార్ లోన్ వడ్డీ రేటుని 0.20 శాతం తగ్గించింది. దీంతో పాటు ప్రాసెసింగ్ ఫీజు కూడా పూర్తిగా మాఫీ చేసింది. దీంతో కారు లోన్ 8.90 శాతం నుంచి 8.70 శాతానికి చేరింది. హౌస్ లోన్ వడ్డీ రేటు 8.60 శాతం నుంచి 8.50 శాతానికి (0.10 శాతం తగ్గింపు) చేరింది. ఇదీ చదవండి: ఆరుపదుల వయసులో రూ. 23,000కోట్ల అధిపతిగా.. ఎవరీ లచ్మన్ దాస్ మిట్టల్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కొత్త రూల్స్ 2023 ఆగష్టు 14 నుంచి అమలులో ఉంటాయని తెలుస్తోంది. తక్కువ వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజుల మినహాయింపు కస్టమర్లతో కొత్త ఉత్సాహాన్ని నింపడంలో సహాయపడింది. అంతే కాకూండా లోనే తీసుకునే వారి సంఖ్య కూడా దీని వల్ల పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
కేంద్ర బడ్జెట్‌పై దేశీయ నిర్మాణ రంగం గంపెడాశలు.. కోరుతుందేంటి?
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెలలో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌పై దేశీయ నిర్మాణ రంగం గంపెడాశలు పెట్టుకుంది. స్థిరాస్తి రంగానికి పరిశ్రమ హోదా ఇవ్వడంతో పాటూ సులభతర ఆర్థిక లభ్యత, జీఎస్టీ రేట్ల తగ్గింపు వంటివి ప్రకటించి దేశీయ రియల్ ఎస్టేట్ రంగానికి చేదోడుగా నిలవాలని పరిశ్రమ వర్గాలు ముక్తకంఠంతో కోరుతున్నాయి. నివాస విభాగంలో డిమాండ్‌ను పెంచాలంటే పలు కీలక ప్రకటనలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపాయి. అందులోని పలు కీలకాంశాలు.. అఫర్డబుల్ హౌసింగ్ ధరలలో సవరణ చేయాల్సిన అవసరం ఉంది. ఆస్తి పరిమాణం, ధర, కొనుగోలుదారుల ఆదాయం ఆధారంగా అందుబాటు గృహాల నిర్వచనాన్ని కేంద్ర గృహ నిర్మాణం మరియు పట్టణ పేదరిక నిర్మూలన మంత్రిత్వ శాఖ నిర్వచించింది. నాన్-మెట్రోపాలిటన్ సిటీలు, నగరాలలో అఫర్డబుల్ హౌసింగ్ 90 చ.మీ. వరకు కార్పెట్ ఏరియాతో ఉండాలి. ప్రధాన నగరాల్లో అయితే 60 చ.మీ. కార్పెట్ ఏరియా. ఈ రెండింటికీ ధర రూ.45 లక్షల లోపు ఉండాలి. రానున్న బడ్జెట్లో ఈ విభాగాన్ని మరింత విస్తరించి ఎక్కువ మంది కస్టమర్లు ఈ పరిధిలోకి తీసుకురావాలి. అలాగే నగరాల వారీగా ధరల పరిమితులను సవరించాల్సిన అవసరం ఉంది. 90, 60 చ.మీ. కార్పెట్ ఏరియా యూనిట్ల పరిమాణం బాగానే ఉన్నప్పటికీ.. ధర రూ.45 లక్షలు అనేది చాలా నగరాలలో ఆచరణయోగ్యంగా లేవు. ఉదాహరణకు ముంబైలో రూ.45 లక్షల బడ్జెట్ అనేది చాలా తక్కువ అందుకే దీన్ని రూ.85 లక్షలకు పెంచాలి. ఇతర నగరాల్లో రూ.60-65 లక్షలకు పెంచాల్సిన అవసరం ఉంది. ధరల సవరణతో ఎక్కువ గృహాలు అఫర్డబులిటీ కిందకి వస్తాయి. దీంతో కొనుగోలుదారులు 1 శాతం జీఎస్టీ, ప్రభుత్వ రాయితీలు, వడ్డీ చెల్లింపులతో కలిపి మొత్తం రూ.3.5 లక్షల వరకు పన్ను మినహాయింపులు వంటి బహుళ ప్రయోజనాలను పొందుతారు. పెద్ద మొత్తంలో అఫర్డబుల్ హౌసింగ్‌లను నిర్మించేందుకు ప్రభుత్వ అధీనంలో ఉన్న భూములను కేటాయించాలి. భారీ పరిశ్రమల శాఖ, రైల్వేలు, పోర్ట్ ట్రస్ట్‌లు మొదలైన వాటి పరిధిలోకి వచ్చే నగరాల్లోని కొన్ని భూములను సంబంధిత ప్రభుత్వ సంస్థలు విడుదల చేయాలి. తక్కువ ధరతో భూమి లభ్యత పెరిగితే ప్రాపర్టీ ధరలను నియంత్రించవచ్చు. గత బడ్జెట్లో అందించిన అఫర్డబుల్, అద్దె గృహాల రుణాలపై రూ.1.5 లక్షల అదనపు మినహాయింపు గడువు ఈ ఏడాది మార్చి 31తో ముగియనుంది. దీన్ని మరో ఏడాది పాటు పొడిగించాలి. దీంతో ఈ విభాగంలో సరఫరా పెరుగుతుంది. అనరాక్ నివేదిక ప్రకారం గతేడాది దేశంలోని ఏడు ప్రధాన నగరాలలోని మొత్తం గృహాల సరఫరాలో 26 శాతం అఫర్డబుల్ హౌసింగ్లే ఉన్నాయి. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 24 కింద గృహ రుణ వడ్డీ రేట్లపై రూ.2 లక్షల పన్ను రాయితీని రూ.5 లక్షలకు పెంచాలి. పన్ను రేట్లలో కోత లేదా సవరించిన పన్ను శ్లాబ్‌ల ద్వారా వ్యక్తిగత పన్ను ఉపశమనం ప్రకటించాలి. ప్రత్యేకించి సెక్షన్ 80సీ(ఏడాదికి రూ.1.5 లక్షలకు) కింద తగ్గింపు పరిమితిని చివరిసారిగా 2014లో పెంచారు. రానున్న బడ్జెట్లో ఈ పరిమితిని పెంచాల్సిన అవసరం ఉంది. (చదవండి: హైదరాబాద్‌లో అమెజాన్ సొంత క్యాంపస్.. అదిరిపోయే సౌకర్యాలు!) -
‘ఇంటి’కి ఇల్లాలితోనే లాభం!
ఇంటిని చూసి ఇల్లాలిని చూడాలంటారు పెద్దలు! ఇల్లే ఇల్లాలి పేరు మీద ఉండాలంటారు నిపుణులు! రెండూ నిజమే. మొదటి దాని గురించి చర్చ లేకపోయినా.. రెండో దాని గురించి వివరంగా చర్చించాల్సిందే. ఎందుకంటే ఇంటి ఓనర్‌గా, లేక కో–ఓనర్‌గా మహిళ పేరుంటే బోలెడన్ని ప్రయోజనాలున్నాయి మరి!! బ్యాంక్ వడ్డీ రేట్ల నుంచి మొదలెడితే రుణంలో, వడ్డీలో, పీఎఫ్ కోతలో.. ఆఖరికి స్టాంప్ డ్యూటీ చార్జీల్లోనూ రాయితీలున్నాయ్!! ఆ వివరాలు చూద్దాం... హైదరాబాద్, బిజినెస్ బ్యూరో సొంతిల్లు కొనటానికి రుణం తీసుకోవటం మనకు తెలిసిందే. కానీ, ప్రభుత్వం అందించే పలు రాయితీలు, ప్రోత్సాహకాలతోనూ సొంతింటి కలను సాకారం చేసుకోవచ్చు. కాకపోతే ఇంటి యజమానిగా మహిళ పేరుండాలి. లేకపోతే కో–ఓనర్‌గానైనా ఉండాలన్నది నిబంధన. అందుకే తెలివైన గృహ కొనుగోలుదారుడు ఇంటిని భార్య, తల్లి లేకపోతే అక్క, చెల్లి మొత్తమ్మీద మహిళ పేరిట కొనుగోలు చేస్తాడని నిపుణులు చెబుతున్నారు. తొలి ఉద్యోగం త్వరగా.. సొంతింటి కలను సాకారం చేసుకోవాలంటే మహిళలు వృత్తి జీవితాన్ని త్వరగా ప్రారంభించాలనేది నిపుణుల సూచన. ఉదాహరణకు.. 22 ఏళ్ల వయసు నుంచి మహిళ వృత్తి జీవితాన్ని ప్రారంభించారనుకుందాం. అప్పుడామె సగటు వార్షిక వేతనం రూ.4.5 లక్షలు. ఇది ఐటీ పరిశ్రమలో సగటు ఉద్యోగి వేతనం. 3–4 నాలుగేళ్ల తర్వాత అంటే 25–26 ఏళ్ల వయస్సులో గృహ రుణాన్ని ఎంచుకుంటే ఉత్తమం. ఎందుకంటే అప్పటికీ సదరు మహిళ వేతనం దాదాపు రూ.6–8 లక్షలుంటుంది. అన్ని బ్యాంక్‌లు నికర వేతనంపై 60 రెట్లు గృహ రుణంగా అందిస్తున్నాయి. అంటే నికర వేతనంరూ.50 వేలు అనుకుంటే.. ఉద్యోగి రూ.30 లక్షల గృహ రుణం వరకూ అర్హులు. అంటే ఈ బడ్జెట్లో అందుబాటు గృహాలను ఎంచుకునే వీలుంటుంది. మూడేళ్లు పీఎఫ్ బాధ్యత ప్రభుత్వానిదే.. ఈపీఎఫ్ అండ్ మిస్లేనియస్ ప్రొవిజన్స్ చట్టం (ఈపీఎఫ్‌వో)–1952 ప్రకారం.. పురుష ఉద్యోగులతో పోలిస్తే మహిళా ఉద్యోగి వేతనంలో పీఎఫ్ మినహాయింపు కాస్త తక్కువ. అంటే సమాన వేతనం ఉన్న పురుషులతో పోలిస్తే మహిళా ఉద్యోగికి కొంచెం ఎక్కువ జీతం చేతికొస్తుంది. తొలిసారి మహిళ ఉద్యోగి ప్రాథమిక వేతనంలో మూడేళ్ల పాటు 12% పీఎఫ్‌ను చెల్లించాల్సిన అవసరం లేదు. దీన్ని ఉద్యోగిని పేరిట ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఉదాహరణకు.. కొత్త ఉద్యోగిని నెల జీతం రూ.15 వేలు అనుకుందాం. అంటే వార్షిక వేతనం రూ.1.80 లక్షలు. మొదటి 3 ఏళ్లు 12% ఈపీఎఫ్ ప్రభుత్వమే భరిస్తుంది. అంటే రూ.21,600. మొత్తంగా మూడేళ్లలో ఉద్యోగినికి అదనంగా అందే సొమ్ము రూ.64,800. గృహ రుణంలో రూ.3.5 లక్షలు ఆదా.. గృహ రుణాల్లో మహిళలకు పన్ను ప్రయోజనాలున్నాయి. గృహ రుణంలో, వడ్డీ చెల్లింపుల్లో రెండింట్లోనూ రాయితీలున్నాయి. ఇంటి లోన్‌లో (ప్రిన్సిపల్ ఎమౌంట్) గరిష్టంగా రూ.1.5 లక్షలు, చెల్లించే వడ్డీలో రూ.2 లక్షల వరకు మినహాయింపు ఉంటుంది. అంటే మొత్తంగా రూ.3.5 లక్షలపై పన్ను ప్రయోజనాలు లభిస్తాయన్న మాట. మహిళలకు తనఖా రుణం మీద, నికర అద్దె విలువ మీద కూడా వడ్డీ రాయితీ పొందే వీలుంది. అద్దెకిచ్చేందుకు కాకుండా స్వయంగా తానుండేందుకు లేక ఇల్లు తన పేరు మీదనే ఉంటే గనక మరిన్ని పన్ను రాయితీలున్నాయి. ప్రతి ఆర్థిక సంవత్సరానికి రూ.1.5 లక్షల అదనపు వడ్డీ రాయితీ పొందవచ్చు. ఒకవేళ భార్యాభర్తలిద్దరూ ఇంటికి సహ యజమానులుగా ఉండి, భార్యకు ప్రత్యేకంగా ఆదాయ మార్గం ఉంటే గనక.. ఇద్దరూ వ్యక్తిగతంగా పన్ను తగ్గింపులను క్లెయిమ్ చేసుకోవచ్చు. కాకపోతే పన్ను తగ్గింపు ఎంతనేది ప్రాపర్టీలో సహ యజమాని వాటా మీద ఆధారపడి ఉంటుంది. బ్యాంక్ వడ్డీ రేట్లూ తక్కువే.. దాదాపు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంక్‌లు గృహ రుణాల్లో మహిళలకు ప్రత్యేక వడ్డీ రాయితీలను అందిస్తున్నాయి. లోన్ మొత్తం పెరుగుతున్న కొద్దీ వడ్డీ రేటు తగ్గుతుంది కూడా. ఎస్బీఐలో వార్షిక గృహ రుణ వడ్డీ రేటు 8.4–8.95 శాతంగా ఉంటే.. మహిళలకు 8.35–8.85 శాతంగా ఉంటుంది. ఐసీఐసీఐలో ఇతరులకు వడ్డీ రేటు 8.4–8.85 శాతంగా ఉంటే.. మహిళలకు 8.35–8.7 శాతంగా ఉంటుంది. హెచ్‌డీఎఫ్‌సీలో ఇతరులకు 8.4–9.05 శాతంగా ఉంటే.. మహిళలకు 8.35–9.05 శాతంగా ఉంది. స్టాంప్ డ్యూటీలోనూ రాయితీ.. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ మహిళ పేరిట చేసినా లేక జాయింట్ ఓనర్‌గా ఉన్నా సరే స్టాంప్ డ్యూటీలో రాయితీ పొందవచ్చు. అయితే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నిబంధన ఉండేది. అయితే స్టాంప్‌డ్యూటీని 6 శాతానికి చేర్చినపుడు ఈ నిబంధనను తొలగించినట్లు తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ (టీబీఎఫ్) జనరల్ సెక్రటరీ జె.వెంకట్ రెడ్డి చెప్పారు. ప్రస్తుతం ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ నిబంధన అమల్లో ఉంది. ఉదాహరణకు.. ఢిల్లీలో మహిళలకు స్టాంప్ డ్యూటీ 4 శాతం ఉంటే పురుషులకు 6 శాతం. హర్యానాలో మహిళలకు గ్రామీణ ప్రాంతాల్లో అయితే 4 శాతం, పట్టణ ప్రాంతాల్లో అయితే 6 శాతం. అదే పురుషులకు గ్రామీణ ప్రాంతాల్లో 6 శాతం, పట్టణ ప్రాంతాల్లో 8 శాతం. రాజస్థాన్‌లో మహిళలకు 4 శాతం, పురుషులకు 5 శాతంగా ఉంది. సీఎల్ఎస్ఎస్లో భలే రాయితీలు.. ప్రధాన్‌మంత్రి ఆవాస్ యోజన (పీఎంఈవై) పథకం కింద అందుబాటు గృహాలకు క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ (సీఎల్ఎస్ఎస్) రాయితీలను అందుకోవచ్చు. మహిళ గృహ యజమానిగా లేక సహ యజమానిగా ఉండాలనేది నిబంధన. మొదటిసారి గృహం కొనుగోలు చేసే మహిళకు సీఎల్ఎస్ఎస్ మరిన్ని ప్రయోజనాలను అందిస్తోంది. ఉదాహరణకు గృహిణి వార్షిక వేతనం రూ.6 లక్షల లోపు ఉంటే.. రూ.6 లక్షల గృహ రుణం మీద 6.5 శాతం వడ్డీ రాయితీ పొందవచ్చు. -
న్యూ ఇయర్ బొనాంజా : ఖాతాదారులకు ఎస్బీఐ గుడ్‌న్యూస్
సాక్షి, ముంబయి: కొత్త ఏడాది ఖాతాదారులకు ప్రభుత్వ రంగ ఎస్బీఐ తీపికబురు అందించింది. బేస్ రేటు ప్రకారం లోన్లు పొందిన పాత కస్టమర్లకు ఊరట కల్పిస్తూ బేస్ రేటును 0.3 శాతం తగ్గించింది. దీంతో బేస్ రేటు ప్రస్తుతం 8.65 శాతానికి దిగివచ్చింది. తాజా తగ్గింపుతో ఇతర బ్యాంకులతో పోలిస్తే ఎస్బీఐ బేస్ రేటు అతితక్కువ కావడం గమనార్హం. మిగిలిన బ్యాంకులూ ఎస్బీఐ బాటలో బేస్ రేటును తగ్గించవచ్చని భావిస్తున్నారు. ఎస్బీఐ చర్యతో పలు కస్టమర్లకు భారీ ఊరట లభించనుంది. విద్యార్థులు, గృహ రుణాలు తీసుకున్న కస్టమర్లు తమ రుణాలపై బేస్ రేటుకు అనుగుణంగా వడ్డీ రేట్లు ఉండటంతో తాజా తగ్గింపుతో వీరందరికీ ప్రయోజనం చేకూరనుంది. -
ఎస్ బీఐ తీపి కబురు
న్యూఢిల్లీ: తమ బ్యాంకులో గృహరుణాలు తీసుకున్న వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్ బీఐ) తీపికబురు అందించింది. గృహరుణాలపై వడ్డీరేటును ఎస్ బీఐ 0.25 శాతం తగ్గించింది. దీంతో వడ్డీరేటు 10.15 శాతం నుంచి 9.9 శాతానికి తగ్గించింది. ఇది ఈ నెల 13 (సోమవారం)నుంచి అమల్లోకి వస్తుందని ఎస్ బీఐ తెలిపింది. కొత్తగా రుణాలు తీసుకునేవారికి కూడా ఇదే తగ్గించిన వడ్డీరేటు వర్తిస్తుంది. తాజా తగ్గింపుతో గృహరుణ గ్రహీతలకు ఇఎంఐ భారం కాస్త తగ్గుతుంది. హెచ్డీఎఫ్సీ వడ్డీ రేట్లు తగ్గించిన రెండు రోజులకు ఎస్ బీఐ కూడా ఇదే బాట పట్టింది. రుణాలపై వడ్డీరేటును హెచ్డీఎఫ్సీ 0.2 శాతం తగ్గించింది. దీంతో వడ్డీరేటు 9.9 శాతానికి దిగొచ్చింది. కొత్త, పాత రుణగ్రహీతలకు ఇది వర్తిస్తుందని వివరించింది.