‘ఇంటి’కి ఇల్లాలితోనే లాభం! | Home loan interest rate for women is low | Sakshi
Sakshi News home page

‘ఇంటి’కి ఇల్లాలితోనే లాభం!

Published Mon, Apr 2 2018 12:15 AM | Last Updated on Mon, Apr 2 2018 8:27 AM

Home loan interest rate for women is low  - Sakshi

ఇంటిని చూసి ఇల్లాలిని చూడాలంటారు పెద్దలు! ఇల్లే ఇల్లాలి పేరు మీద ఉండాలంటారు నిపుణులు!
రెండూ నిజమే. మొదటి దాని గురించి చర్చ లేకపోయినా.. రెండో దాని గురించి వివరంగా చర్చించాల్సిందే. ఎందుకంటే ఇంటి ఓనర్‌గా, లేక కో–ఓనర్‌గా మహిళ పేరుంటే బోలెడన్ని ప్రయోజనాలున్నాయి మరి!! బ్యాంక్‌ వడ్డీ రేట్ల నుంచి మొదలెడితే రుణంలో, వడ్డీలో, పీఎఫ్‌ కోతలో.. ఆఖరికి స్టాంప్‌ డ్యూటీ చార్జీల్లోనూ రాయితీలున్నాయ్‌!! ఆ వివరాలు చూద్దాం... హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో

సొంతిల్లు కొనటానికి రుణం తీసుకోవటం మనకు తెలిసిందే. కానీ, ప్రభుత్వం అందించే పలు రాయితీలు, ప్రోత్సాహకాలతోనూ సొంతింటి కలను సాకారం చేసుకోవచ్చు. కాకపోతే ఇంటి యజమానిగా మహిళ పేరుండాలి. లేకపోతే కో–ఓనర్‌గానైనా ఉండాలన్నది నిబంధన. అందుకే తెలివైన గృహ కొనుగోలుదారుడు ఇంటిని భార్య, తల్లి లేకపోతే అక్క, చెల్లి మొత్తమ్మీద మహిళ పేరిట కొనుగోలు చేస్తాడని నిపుణులు చెబుతున్నారు.


తొలి ఉద్యోగం త్వరగా..
సొంతింటి కలను సాకారం చేసుకోవాలంటే మహిళలు వృత్తి జీవితాన్ని త్వరగా ప్రారంభించాలనేది నిపుణుల సూచన. ఉదాహరణకు.. 22 ఏళ్ల వయసు నుంచి మహిళ వృత్తి జీవితాన్ని ప్రారంభించారనుకుందాం. అప్పుడామె సగటు వార్షిక వేతనం రూ.4.5 లక్షలు.

ఇది ఐటీ పరిశ్రమలో సగటు ఉద్యోగి వేతనం. 3–4 నాలుగేళ్ల తర్వాత అంటే 25–26 ఏళ్ల వయస్సులో గృహ రుణాన్ని ఎంచుకుంటే ఉత్తమం. ఎందుకంటే అప్పటికీ సదరు మహిళ వేతనం దాదాపు రూ.6–8 లక్షలుంటుంది. అన్ని బ్యాంక్‌లు నికర వేతనంపై 60 రెట్లు గృహ రుణంగా అందిస్తున్నాయి. అంటే నికర వేతనంరూ.50 వేలు అనుకుంటే.. ఉద్యోగి రూ.30 లక్షల గృహ రుణం వరకూ అర్హులు. అంటే ఈ బడ్జెట్‌లో అందుబాటు గృహాలను ఎంచుకునే వీలుంటుంది.

మూడేళ్లు పీఎఫ్‌ బాధ్యత ప్రభుత్వానిదే..
ఈపీఎఫ్‌ అండ్‌ మిస్‌లేనియస్‌ ప్రొవిజన్స్‌ చట్టం (ఈపీఎఫ్‌వో)–1952 ప్రకారం.. పురుష ఉద్యోగులతో పోలిస్తే మహిళా ఉద్యోగి వేతనంలో పీఎఫ్‌ మినహాయింపు కాస్త తక్కువ. అంటే సమాన వేతనం ఉన్న పురుషులతో పోలిస్తే మహిళా ఉద్యోగికి కొంచెం ఎక్కువ జీతం చేతికొస్తుంది.

తొలిసారి మహిళ ఉద్యోగి ప్రాథమిక వేతనంలో మూడేళ్ల పాటు 12% పీఎఫ్‌ను చెల్లించాల్సిన అవసరం లేదు. దీన్ని ఉద్యోగిని పేరిట ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఉదాహరణకు.. కొత్త ఉద్యోగిని నెల జీతం రూ.15 వేలు అనుకుందాం. అంటే వార్షిక వేతనం రూ.1.80 లక్షలు. మొదటి 3 ఏళ్లు 12%  ఈపీఎఫ్‌ ప్రభుత్వమే భరిస్తుంది. అంటే రూ.21,600. మొత్తంగా మూడేళ్లలో ఉద్యోగినికి అదనంగా అందే సొమ్ము రూ.64,800.

గృహ రుణంలో రూ.3.5 లక్షలు ఆదా..
గృహ రుణాల్లో మహిళలకు పన్ను ప్రయోజనాలున్నాయి. గృహ రుణంలో, వడ్డీ చెల్లింపుల్లో రెండింట్లోనూ రాయితీలున్నాయి. ఇంటి లోన్‌లో (ప్రిన్సిపల్‌ ఎమౌంట్‌) గరిష్టంగా రూ.1.5 లక్షలు, చెల్లించే వడ్డీలో రూ.2 లక్షల వరకు మినహాయింపు ఉంటుంది. అంటే మొత్తంగా రూ.3.5 లక్షలపై పన్ను ప్రయోజనాలు లభిస్తాయన్న మాట. మహిళలకు తనఖా రుణం మీద, నికర అద్దె విలువ మీద కూడా వడ్డీ రాయితీ పొందే వీలుంది.

అద్దెకిచ్చేందుకు కాకుండా స్వయంగా తానుండేందుకు లేక ఇల్లు తన పేరు మీదనే ఉంటే గనక మరిన్ని పన్ను రాయితీలున్నాయి. ప్రతి ఆర్థిక సంవత్సరానికి రూ.1.5 లక్షల అదనపు వడ్డీ రాయితీ పొందవచ్చు. ఒకవేళ భార్యాభర్తలిద్దరూ ఇంటికి సహ యజమానులుగా ఉండి, భార్యకు ప్రత్యేకంగా ఆదాయ మార్గం ఉంటే గనక.. ఇద్దరూ వ్యక్తిగతంగా పన్ను తగ్గింపులను క్లెయిమ్‌ చేసుకోవచ్చు. కాకపోతే పన్ను తగ్గింపు ఎంతనేది ప్రాపర్టీలో సహ యజమాని వాటా మీద ఆధారపడి ఉంటుంది.

బ్యాంక్‌ వడ్డీ రేట్లూ తక్కువే..
దాదాపు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ బ్యాంక్‌లు గృహ రుణాల్లో మహిళలకు ప్రత్యేక వడ్డీ రాయితీలను అందిస్తున్నాయి. లోన్‌ మొత్తం పెరుగుతున్న కొద్దీ వడ్డీ రేటు తగ్గుతుంది కూడా. ఎస్‌బీఐలో వార్షిక గృహ రుణ వడ్డీ రేటు 8.4–8.95 శాతంగా ఉంటే.. మహిళలకు 8.35–8.85 శాతంగా ఉంటుంది. ఐసీఐసీఐలో ఇతరులకు వడ్డీ రేటు 8.4–8.85 శాతంగా ఉంటే.. మహిళలకు 8.35–8.7 శాతంగా ఉంటుంది. హెచ్‌డీఎఫ్‌సీలో ఇతరులకు 8.4–9.05 శాతంగా ఉంటే.. మహిళలకు 8.35–9.05 శాతంగా ఉంది.

స్టాంప్‌ డ్యూటీలోనూ రాయితీ..
ప్రాపర్టీ రిజిస్ట్రేషన్‌ మహిళ పేరిట చేసినా లేక జాయింట్‌ ఓనర్‌గా ఉన్నా సరే స్టాంప్‌ డ్యూటీలో రాయితీ పొందవచ్చు. అయితే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఈ నిబంధన ఉండేది. అయితే స్టాంప్‌డ్యూటీని 6 శాతానికి చేర్చినపుడు ఈ నిబంధనను తొలగించినట్లు తెలంగాణ బిల్డర్స్‌ ఫెడరేషన్‌ (టీబీఎఫ్‌) జనరల్‌ సెక్రటరీ జె.వెంకట్‌ రెడ్డి చెప్పారు.

ప్రస్తుతం ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ నిబంధన అమల్లో ఉంది. ఉదాహరణకు.. ఢిల్లీలో మహిళలకు స్టాంప్‌ డ్యూటీ 4 శాతం ఉంటే పురుషులకు 6 శాతం. హర్యానాలో మహిళలకు గ్రామీణ ప్రాంతాల్లో అయితే 4 శాతం, పట్టణ ప్రాంతాల్లో అయితే 6 శాతం. అదే పురుషులకు గ్రామీణ ప్రాంతాల్లో 6 శాతం, పట్టణ ప్రాంతాల్లో 8 శాతం. రాజస్థాన్‌లో మహిళలకు 4 శాతం, పురుషులకు 5 శాతంగా ఉంది.

సీఎల్‌ఎస్‌ఎస్‌లో భలే రాయితీలు..
ప్రధాన్‌మంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఈవై) పథకం కింద అందుబాటు గృహాలకు క్రెడిట్‌ లింక్డ్‌ సబ్సిడీ స్కీమ్‌ (సీఎల్‌ఎస్‌ఎస్‌) రాయితీలను అందుకోవచ్చు. మహిళ గృహ యజమానిగా లేక సహ యజమానిగా ఉండాలనేది నిబంధన. మొదటిసారి గృహం కొనుగోలు చేసే మహిళకు సీఎల్‌ఎస్‌ఎస్‌ మరిన్ని ప్రయోజనాలను అందిస్తోంది. ఉదాహరణకు గృహిణి వార్షిక వేతనం రూ.6 లక్షల లోపు ఉంటే.. రూ.6 లక్షల గృహ రుణం మీద 6.5 శాతం వడ్డీ రాయితీ పొందవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement