bank interest
-
రుణమాఫీ సరే.. వడ్డీ సంగతేంటి: హరీష్ రావు వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రైతుల రుణమాఫీ అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై మాజీ మంత్రి హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. డిసెంబర్ తొమ్మిదో తేదీన రుణమాఫీ చేస్తామని చెప్పి ఏడు నెలల కాలయాపన చేసిందన్నారు. దీంతో, రైతులకు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పుకొచ్చారు.కాగా, హరీష్ రావు ట్విట్టర్ వేదికగా.. డిసెంబర్ తొమ్మిదో తేదీన రైతు రుణమాఫీ చేస్తామని మాట తప్పి, ఏడు నెలల తర్వాత ఆ ప్రక్రియను ప్రారంభించడం వల్ల రైతులకు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. ముందుగా ఏడు నెలల వడ్డీ చెల్లించాకే, రుణ మాఫీ చేస్తామని బ్యాంకర్లు వేదిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చెప్పిన రుణమాఫీ దేవుడెరుగు, వడ్డీ చెల్లించేందుకు కొత్తగా అప్పులు చేయాల్సి వస్తుందని బాధపడుతున్నారు. డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తామన్న మాట తప్పి, 7 నెలల తర్వాత ఆ ప్రక్రియను ప్రారంభించడం వల్ల రైతులకు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. ముందుగా ఏడు నెలల వడ్డీ చెల్లించాకే, రుణ మాఫీ చేస్తామని బ్యాంకర్లు వేదిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వం చెప్పిన రుణమాఫీ… pic.twitter.com/MdHZsSeOcO— Harish Rao Thanneeru (@BRSHarish) July 26, 2024 ప్రభుత్వం తక్షణం స్పందించి, డిసెంబర్ నుంచి జూలై దాకా వడ్డీని తామే భరిస్తామనీ, రైతుల నుంచి వసూలు చేయవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను. ఉమ్మడి మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం శివంపేట్ మండలానికి చెందిన ఒక రైతు క్రాప్ లోన్‌ను, రూ.9000 మిత్తి కట్టించుకున్నాకే క్లోజ్ చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలానికి చెందిన రైతులకూ ఇదే పరిస్థితి ఎదురైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాకు రైతులు పంపిన విజ్ఞప్తులను మీ పరిశీలనకు పంపుతున్నాను. పరిష్కరించాలని కోరుతున్నా’ అంటూ కామెంట్స్ చేశారు. -
రూ. 27 లక్షల కోట్లకు గృహ రుణాలు..
న్యూఢిల్లీ: గృహాల రంగానికి ఇచ్చిన రుణాలు గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో దాదాపు రూ. 10 లక్షల కోట్లు ఎగిశాయి. ఈ ఏడాది మార్చి ఆఖరు నాటికి రికార్డు స్థాయిలో రూ. 27.23 లక్షల కోట్లకు చేరాయి. రంగాలవారీగా బ్యాంకు రుణాల అంశంపై ఆర్బీఐ వెలువరించిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి.వీటి ప్రకారం 2022 మార్చిలో గృహ నిర్మాణ రంగంలో (హౌసింగ్‌కు ప్రాధాన్యతా రంగం కింద ఇచ్చినవి సహా) రుణబాకీలు రూ. 17,26,697 కోట్లుగా ఉండగా 2024 మర్చి ఆఖరు నాటికి రూ. 27,22,720 కోట్లకు చేరింది. కమర్షియల్ రియల్ ఎస్టేట్‌కి ఇచ్చినవి రూ. 2.97 లక్షల కోట్ల నుంచి రూ. 4.48 లక్షల కోట్లకు చేరాయి.కోవిడ్ అనంతరం గత రెండేళ్లలో ఇళ్ల విక్రయాలు, ధరలు గణనీయంగా పెరిగినట్లు పలు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థలు తెలిపాయి. ప్రభుత్వ తోడ్పాటు చర్యలతో అందుబాటు ధరల్లోని ఇళ్లకు డిమాండ్ నెలకొన్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకానమిస్ట్ మదన్ సబ్నవీస్ తెలిపారు. రాబోయే రోజుల్లోనూ గృహ రుణాల వృద్ధి పటిష్టంగానే ఉంటుందని, అయితే, అధిక బేస్ కారణంగా 15–20 శాతానికి దిగి రావొచ్చని పేర్కొన్నారు.ఇవి చదవండి: పేమెంట్స్ బ్యాంకులకు ఉజ్వల భవిష్యత్తు! -
Personal Loan: పర్సనల్ లోన్ తీసుకోవాలా? ఇది మీకోసమే!
ఈ రోజు మనిషి ఎంత సంపాదించినా ఏదో తక్కువైనట్లు, ఏమీ మిగలటం లేదని భావిస్తూనే ఉంటాడు, దీనికి ప్రధాన కారణం పెరిగిన నిత్యావసరాల ధరలు కావచ్చు లేదా అధికమైన కుటుంబ ఖర్చులు కావచ్చు. దీనికోసం చాలీ చాలని సంపాదనతో ముందుకు వెళ్లలేక కొన్ని సందర్భాల్లో బ్యాంకుల నుంచి ఇతర ప్రైవేట్ సంస్థల నుంచి లోన్ తీసుకుంటాడు. ఒక వ్యక్తి పర్సనల్ లోన్ తీసుకున్న తరువాత ప్రతి నెలా ఈఎమ్ఐ రూపంలో డబ్బు చెల్లిస్తూ ఉంటాడు. లోన్ అనేది ఆర్థిక అవసరాలను తీర్చడానికి ఉపయోగపడుతుంది, అదే సమయంలో క్రెడిట్ స్కోర్ పెంచుకోవడనికి కూడా సహాయపడుతుంది. కానీ మీరు తీసుకునే లోన్ ఒకే రకమైన వడ్డీ రేటుతో లభించే అవకాశం ఉండదు. వడ్డీ బ్యాంక్, ఇతర ఫైనాన్స్ కంపెనీల మీద ఆధారపడి ఉంటుంది. లోన్ తీసుకునే వారు తప్పకుండా బ్యాంకు పర్సనల్ లోన్ వడ్డీ రేట్లను తెలుసుకోవాలి. పర్సనల్ లోన్‌పై వడ్డీ రేటు సిబిల్ స్కోర్, రీపేమెంట్ హిస్టరీ, ప్రిన్సిపల్ అమౌంట్, టెన్యూర్ వంటి వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. అంతే కాకుండా వడ్డీ అనేది పర్సనల్ లోన్ మొత్తంపై లెక్కించబడుతుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి 16 శాతం వడ్డీ రేటుపైన ఐదు లక్షలు, 60 నెలలు/5 సంవత్సరాల సమయానికి (తిరిగి చెల్లించే కాల వ్యవధి) తీసుకున్నప్పుడు అతడు మొత్తం రూ. 7.29 లక్షలు చెల్లించాలి. అంటే ఆ వ్యక్తి అదనంగా రూ. 2.29 లక్షలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇది కూడా వివిధ బ్యాంకులు విధించే వడ్డీ రేటుపైన ఆధారపడి ఉంటుంది. వినియోగదారుడు తప్పకుండా గమనించాలి. వివిధ బ్యాంకులలో వివిధ రకాల వడ్డీ రేట్లు: పర్సనల్ లోన్ వడ్డీ రేటు విషయంలో బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తక్కువ వడ్డీ రేటు లభిస్తుంది. ఇందులో రూ. 20 లక్షల వరకు లోన్ తీసుకుంటే తిరిగి చెల్లించే కాల వ్యవధి 7 సంవత్సరాలు/84 నెలలు ఉంటె వడ్డీ రేటు 9.10 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఉంటుంది. కరూర్ వైశ్యా బ్యాంక్‌లో రూ.10 లక్షల వరకు లోన్ తీసుకుంటే 12 నుంచి 60 నెలల కాలవ్యవధికి గానూ 10.20% నుంచి 13.20% వడ్డీ రేటు లభిస్తుంది. ఇండియన్ బ్యాంక్‌లో రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వ్యక్తిగత రుణానికి 12 నుంచి 36 నెలల కాలవ్యవధికి 10.65% నుంచి 12.15% వడ్డీ రేటు లభిస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్‌లో రూ.50 వేల నుంచి రూ. 50 లక్షల లోపు పర్సనల్ లోన్ కోసం 12 నుంచి 72 నెలల కాలవ్యవధికి 10.75% నుంచి 19% వరకు వడ్డీ రేటు లభిస్తుంది. పర్సనల్ లోన్ తీసుకునే వ్యక్తి క్రెడిట్ స్కోరు బాగున్నప్పుడు ఎక్కువ లోన్, కొంత తక్కువ వడ్డీకే తీసుకోవచ్చు. క్రెడిట్ స్కోర్ 750 కంటే తక్కువగా ఉన్నప్పుడు పర్సనల్ లోన్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఒక వేళా లోన్ లభించినా తక్కువ మొత్తంలో, ఎక్కువ వడ్డీ రేటుకి లభిస్తుంది. వడ్డీ రేట్లను గురించి ఖచ్చితమైన వివరాలు తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్స్ గానీ, సమీపంలోని బ్యాంకు ద్వారా తెలుసుకోవచ్చు. -
ఆర్బీఐ వరమిచ్చినా..
ముంబై: అంచనాలు, విశ్లేషణలకు అనుగుణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటును పావుశాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 6% నుంచి 5.75%కి తగ్గింది. రెపో రేటు తగ్గించడం జనవరి నుంచీ ఇది మూడవసారి. రెండు నెలలకోసారి జరిగే సమీక్షలో గడిచిన ఆరు నెలల్లో మూడు సార్లు 0.25% చొప్పున రేటును ఆర్బీఐ తగ్గిస్తూ వస్తోంది. తాజా రేటు తగ్గింపుతో రెపో తొమ్మిదేళ్ల కనిష్ట స్థాయికి చేరినట్లయింది. గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ఏకగ్రీవంగా రేటు కోత నిర్ణయం తీసుకుంది. ఇక ముందూ రేటు తగ్గిస్తామనే సంకేతాలను ఇస్తూ, పాలసీ విధానాన్ని ‘తటస్థం’ నుంచి ‘మార్పునకు వీలైన సరళ వైఖరికి’ మార్చింది. ఏంటీ రెపో... బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ రేటునే రెపోగా వ్యవహరిస్తారు. గడిచిన ఆరునెలల్లో ఇది ఏకంగా 0.75 శాతం తగ్గింది. ఇలా తగ్గటం వల్ల ఆర్బీఐ నుంచి బ్యాంకులకు చౌక వడ్డీకే నిధులు లభ్యమవుతాయి. అప్పుడు బ్యాంకులు కూడా తాము ఇచ్చే రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించవచ్చు. అలా చేసినా వాటి లాభాలపై ఎలాంటి ప్రతికూల ప్రభావమూ పడదు. కానీ ఇక్కడే జరగాల్సింది సరిగా జరగడం లేదు. స్వయంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కూడా ఈ విషయంపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ ఏడాది జూన్ 5 వరకూ ఆర్బీఐ 0.50% రేటు తగ్గిస్తే, బ్యాంకులు 0.21 శాతం తగ్గింపును మాత్రమే కస్టమర్లకు బదలాయించాయి. అది కూడా కొత్తగా రుణాలు తీసుకునే వారికి మాత్రమే ఈ ప్రయోజనాన్ని అందజేశాయి. పాత రుణ గ్రహీతలకు ఒనగూరిన రేటు తగ్గింపు ప్రయోజనం కేవలం 0.04%. ఈ విషయంపై తాను బ్యాంకర్లతో మాట్లాడతానని కూడా ఆర్బీఐ గవర్నర్ పేర్కొన్నారు. రుణాల్లో వృద్ధే ప్రధాన లక్ష్యంగా తాజా పాలసీ సమీక్ష, నిర్ణయాలు జరిగినట్లు తెలిపారు. రేటు తగ్గింపు పరిస్థితులు చూస్తే... బ్యాంకులకు తగ్గించిన రేటు ప్రయోజనం... సాధారణ వినియోగదారు నుంచి పరిశ్రమల వరకూ అందినప్పుడు అది వ్యవస్థలో రుణ రేటు తగ్గుదలకు తోడ్పడుతుంది. రుణాలపై వడ్డీ తక్కువ కనక రుణాలు ఎక్కువ తీసుకుంటారు. ఇది వృద్ధి మెరుగుదలకు దోహదపడుతుందనేది క్లుప్తంగా ఆర్థిక విశ్లేషణ. ఆర్థిక వ్యవస్థలో క్రియాశీలత తగ్గిపోయింది. మందగమనం చోటు చేసుకుంటోంది. ఈ పరిణామాల నేపథ్యంలో... రెపో రేటు తగ్గింపునకు ఆర్బీఐ శ్రీకారం చుట్టింది. ఆ అంశాలను పరిశీలిస్తే... ► అటు వినియోగదారుల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం, ఇటు టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం ప్రభుత్వం, ఆర్బీఐ నిర్దేశిత శ్రేణి 2%కి అటు ఇటుగా 4 శాతం వద్దే కొనసాగుతున్నాయి. ► మరోవైపు పారిశ్రామిక ఉత్పత్తిలో వృద్ధి ధోరణి పూర్తిగా ఆగిపోయింది. ఇంకా చెప్పాలంటే మార్చిలో క్షీణతలోకి పారిశ్రామిక రంగం జారింది. తయారీ, సేవల రంగాలు మందగమనంలోకి జారిపోయాయి. వాహన రంగం రివర్స్‌గేర్‌లో ప్రయాణిస్తోంది. ► గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో (208–19, జనవరి–మార్చి) భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ఐదేళ్ల కనిష్టస్థాయి 5.8 శాతానికి పడిపోయింది. వాహన, ఆటో, గృహ రుణ రేట్లు తగ్గే చాన్స్... బ్యాంకులు రెపో రేటు తగ్గింపు ప్రయోజనాన్ని గనక వినియోగదారులకు బదలాయిస్తే... దీనికి అనుసంధానమయ్యే వాహన, ఆటో, గృహ రుణాలపై కస్టమర్ నెలవారీ చెల్లించే వాయిదా మొత్తం (ఈఎంఐ) తగ్గుతుంది. కొత్త రుణాలకు సైతం వడ్డీ రేట్లు తగ్గుతాయి. మరోవంక డిపాజిట్లపై చెల్లించే వడ్డీని కూడా బ్యాంకులు తగ్గించేస్తాయి. అసంఘటిత రంగమే అత్యధికంగా ఉండే మన దేశంలో చాలామంది రిటైరైన తరవాత సరైన ఆదాయం కోసం వడ్డీపైనే ఆధారపడుతుంటారు. అలాంటి వారికి ఈ వడ్డీ తగ్గింపులు అశనిపాతం లాంటివే. కొన్నాళ్లుగా బ్యాంకులు ఏం చేస్తున్నాయంటే... ఆర్బీఐ రెపో రేటు తగ్గించిన వెంటనే అవి డిపాజిట్లపై వడ్డీ రేటును తగ్గించేస్తున్నాయి. అదే స్పీడులో రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించటం లేదు. దీనివల్ల బ్యాంకుల లాభాలు పెరుగుతాయి తప్ప కస్టమర్లకు ఒరిగేదేమీ ఉండదు. బ్యాంకుల ఈ వైఖరి వల్ల వృద్ధి రేటు వచ్చే మూడేళ్లు కూడా పెద్దగా పెరిగేదేమీ ఉండకపోవచ్చనేది రేటింగ్ ఏజెన్సీల అంచనా. పాలసీ ప్రధానాంశాలు... ► రెపో రేటును పావుశాతం తగ్గించడం వరుసగా ఇది మూడవసారి. ఇంతక్రితం వరుసగా రెండు దఫాలుగా తగ్గిన అరశాతంసహా తాజా పావుశాతం తగ్గింపుతో ఈ రేటు 5.75 శాతానికి దిగివచ్చింది. ఇది తొమ్మిదేళ్ల కనిష్ట స్థాయి. ► రివర్స్ రెపో రేటు 5.50 శాతంగా ఉంది. ► మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ 6%. ► పాలసీ వైఖరిని ‘తటస్థం’ నుంచి ‘తగిన విధం గా మార్చుకునే సరళ విధానం’ వైపు మార్పు. ► జీడీపీ వృద్ధి రేటు అంచనాలను 7.2 శాతం నుంచి 7 శాతానికి తగ్గింపు. ► ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య రిటైల్ ద్రవ్యోల్బణం 3 నుంచి 3.1 శాతం శ్రేణిలో ఉంటుంది. అక్టోబర్ నుంచి మార్చి మధ్య ఈ రేటు 3.4–3.7 శ్రేణిలో ఉంటుంది. ► వర్షపాతం విషయంలో అనిశ్చితి, క్రూడ్ ఆయి ల్ ధరలు, ఫైనాన్షియల్ మార్కెట్లలో ఒడిదుడుకులు, ద్రవ్యలోటు తీవ్రత వంటి అంశాలు ద్రవ్యోల్బణానికి సవాళ్లను విసురుతాయి. ► డిజిటల్ లావాదేవీల ప్రోత్సాహంలో భాగంగా ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టీ చార్జీల రద్దు. ► బ్యాంకులు విధించే ఏటీఎం చార్జీలు, ఫీజుల సమీక్షకు కమిటీ నియామకం. ► నిర్దిష్టకాల పరిమితితో సంబంధం లేకుండా, ఎప్పటికప్పుడు చిన్న ఫైనాన్స్ బ్యాంకుల లైసెన్సుల జారీకి సంబంధించి ఆగస్టు నాటికి ముసాయిదా మార్గదర్శకాల జారీ. ► పెట్టుబడుల్లో తీవ్ర మందగమనం, ప్రైవేటు వినియోగ వృద్ధి నెమ్మదించడం వంటి అంశాలపై ఆందోళన. ► పావుశాతం రేటు తగ్గింపునకు సానుకూలంగా మొత్తం ఆరుగురు సభ్యుల ఏకగ్రీవ ఓటు. ► జూన్ ప్రారంభంనాటికి వ్యవస్థలో సగటు రోజువారీ ద్రవ్యలభ్యత రూ.66,000 కోట్లు. ► దేశంలో మే 31వ తేదీ నాటికి విదేశీ మారకద్రవ్య నిల్వలు 421.9 బిలియన్ డాలర్లు. ► మొండిబకాయిల పరిష్కారం దిశలో 3, 4 రోజుల్లో కొత్త నిబంధనలు ► ద్రవ్యలోటు కట్టుతప్పకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందన్న విశ్వాసం ► నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల సవాళ్లను ఎదుర్కొనడంలో సహకారం. ► తదుపరి విధాన సమీక్ష ఆగస్టు 7. బ్యాంకర్లూ... మీరెంతో చేయాలి! ఆర్బీఐ రేటు తగ్గించినా... ఆ ప్రయోజ నాన్ని బ్యాంకర్లు వ్యవస్థలోకి బదలాయించకపోవడంపట్ల గవర్నర్ శక్తికాంత్‌దాస్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో బ్యాంకర్లు మరెంతో చేయాల్సి ఉందని ఆయన సూచిం చారు. పాలసీ అనంతరం శక్తికాంతదాస్ పేర్కొన్న అంశాలను క్లుప్తంగా చూస్తే... ‘‘గతంలో ఆర్బీఐ పాలసీ రేటు తగ్గింపు నిర్ణయం తీసుకుంటే, ఈ ప్రభావం వ్యవస్థలో ప్రతిబింబించడానికి నాలుగు నుంచి ఆరు నెలల కాలం పట్టేది. ఇప్పుడు ఈ పరిస్థితి మారింది. ఈ ఏడాది జూన్ 5 వరకూ ఆర్బీఐ 0.50 శాతం రేటు తగ్గిస్తే, బ్యాంకులు 0.21 శాతం కస్టమర్లకు బదలాయించాయి. కొత్త రుణ గ్రహీతలకే ఈ మొత్తం ప్రయోజనం దక్కింది. పాత రుణ గ్రహీతలకు ఒనగూరిన రేటు తగ్గింపు ప్రయోజనం కేవలం 0.04% మాత్రమే. రేటు తగ్గింపు ప్రయోజనం మరింతమేర, మరింత వేగంగా అందాలన్నది మా అభిప్రాయం. వినియోగదారులకు, ద్విచక్ర వాహన గ్రహీతలకు అందరికీ ఈ ప్రయోజనం అందాలి. రేటు ప్రయోజనం బదలాయింపు ఏ మేర జరుగుతోందన్న విషయాన్ని ఆర్బీఐ ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. రేటు ప్రయోజనం ఎంతో కీలకం. బ్యాంకులతో ఈ విషయంపై చర్చిస్తాం. చేయాల్సినదంతా చేస్తాం. ఏప్రిల్‌లో పావుశాతం రేటు తగ్గించాం. అయితే కొన్ని బ్యాంకులు కేవలం 5 నుంచి 10 బేసిస్ పాయింట్ల రేటు కోత నిర్ణయాన్ని తీసుకున్నాయి. అయితే మరింత రేటు ప్రయోజన బదలాయింపు జరగాలి. రుణ డిమాండ్, ఆర్థిక వ్యవస్థ క్రియాశీలతకు ఇది ఎంతో అవసరం’’ – శక్తికాంత దాస్, ఆర్బీఐ గవర్నర్ -
‘ఇంటి’కి ఇల్లాలితోనే లాభం!
ఇంటిని చూసి ఇల్లాలిని చూడాలంటారు పెద్దలు! ఇల్లే ఇల్లాలి పేరు మీద ఉండాలంటారు నిపుణులు! రెండూ నిజమే. మొదటి దాని గురించి చర్చ లేకపోయినా.. రెండో దాని గురించి వివరంగా చర్చించాల్సిందే. ఎందుకంటే ఇంటి ఓనర్‌గా, లేక కో–ఓనర్‌గా మహిళ పేరుంటే బోలెడన్ని ప్రయోజనాలున్నాయి మరి!! బ్యాంక్ వడ్డీ రేట్ల నుంచి మొదలెడితే రుణంలో, వడ్డీలో, పీఎఫ్ కోతలో.. ఆఖరికి స్టాంప్ డ్యూటీ చార్జీల్లోనూ రాయితీలున్నాయ్!! ఆ వివరాలు చూద్దాం... హైదరాబాద్, బిజినెస్ బ్యూరో సొంతిల్లు కొనటానికి రుణం తీసుకోవటం మనకు తెలిసిందే. కానీ, ప్రభుత్వం అందించే పలు రాయితీలు, ప్రోత్సాహకాలతోనూ సొంతింటి కలను సాకారం చేసుకోవచ్చు. కాకపోతే ఇంటి యజమానిగా మహిళ పేరుండాలి. లేకపోతే కో–ఓనర్‌గానైనా ఉండాలన్నది నిబంధన. అందుకే తెలివైన గృహ కొనుగోలుదారుడు ఇంటిని భార్య, తల్లి లేకపోతే అక్క, చెల్లి మొత్తమ్మీద మహిళ పేరిట కొనుగోలు చేస్తాడని నిపుణులు చెబుతున్నారు. తొలి ఉద్యోగం త్వరగా.. సొంతింటి కలను సాకారం చేసుకోవాలంటే మహిళలు వృత్తి జీవితాన్ని త్వరగా ప్రారంభించాలనేది నిపుణుల సూచన. ఉదాహరణకు.. 22 ఏళ్ల వయసు నుంచి మహిళ వృత్తి జీవితాన్ని ప్రారంభించారనుకుందాం. అప్పుడామె సగటు వార్షిక వేతనం రూ.4.5 లక్షలు. ఇది ఐటీ పరిశ్రమలో సగటు ఉద్యోగి వేతనం. 3–4 నాలుగేళ్ల తర్వాత అంటే 25–26 ఏళ్ల వయస్సులో గృహ రుణాన్ని ఎంచుకుంటే ఉత్తమం. ఎందుకంటే అప్పటికీ సదరు మహిళ వేతనం దాదాపు రూ.6–8 లక్షలుంటుంది. అన్ని బ్యాంక్‌లు నికర వేతనంపై 60 రెట్లు గృహ రుణంగా అందిస్తున్నాయి. అంటే నికర వేతనంరూ.50 వేలు అనుకుంటే.. ఉద్యోగి రూ.30 లక్షల గృహ రుణం వరకూ అర్హులు. అంటే ఈ బడ్జెట్లో అందుబాటు గృహాలను ఎంచుకునే వీలుంటుంది. మూడేళ్లు పీఎఫ్ బాధ్యత ప్రభుత్వానిదే.. ఈపీఎఫ్ అండ్ మిస్లేనియస్ ప్రొవిజన్స్ చట్టం (ఈపీఎఫ్‌వో)–1952 ప్రకారం.. పురుష ఉద్యోగులతో పోలిస్తే మహిళా ఉద్యోగి వేతనంలో పీఎఫ్ మినహాయింపు కాస్త తక్కువ. అంటే సమాన వేతనం ఉన్న పురుషులతో పోలిస్తే మహిళా ఉద్యోగికి కొంచెం ఎక్కువ జీతం చేతికొస్తుంది. తొలిసారి మహిళ ఉద్యోగి ప్రాథమిక వేతనంలో మూడేళ్ల పాటు 12% పీఎఫ్‌ను చెల్లించాల్సిన అవసరం లేదు. దీన్ని ఉద్యోగిని పేరిట ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఉదాహరణకు.. కొత్త ఉద్యోగిని నెల జీతం రూ.15 వేలు అనుకుందాం. అంటే వార్షిక వేతనం రూ.1.80 లక్షలు. మొదటి 3 ఏళ్లు 12% ఈపీఎఫ్ ప్రభుత్వమే భరిస్తుంది. అంటే రూ.21,600. మొత్తంగా మూడేళ్లలో ఉద్యోగినికి అదనంగా అందే సొమ్ము రూ.64,800. గృహ రుణంలో రూ.3.5 లక్షలు ఆదా.. గృహ రుణాల్లో మహిళలకు పన్ను ప్రయోజనాలున్నాయి. గృహ రుణంలో, వడ్డీ చెల్లింపుల్లో రెండింట్లోనూ రాయితీలున్నాయి. ఇంటి లోన్‌లో (ప్రిన్సిపల్ ఎమౌంట్) గరిష్టంగా రూ.1.5 లక్షలు, చెల్లించే వడ్డీలో రూ.2 లక్షల వరకు మినహాయింపు ఉంటుంది. అంటే మొత్తంగా రూ.3.5 లక్షలపై పన్ను ప్రయోజనాలు లభిస్తాయన్న మాట. మహిళలకు తనఖా రుణం మీద, నికర అద్దె విలువ మీద కూడా వడ్డీ రాయితీ పొందే వీలుంది. అద్దెకిచ్చేందుకు కాకుండా స్వయంగా తానుండేందుకు లేక ఇల్లు తన పేరు మీదనే ఉంటే గనక మరిన్ని పన్ను రాయితీలున్నాయి. ప్రతి ఆర్థిక సంవత్సరానికి రూ.1.5 లక్షల అదనపు వడ్డీ రాయితీ పొందవచ్చు. ఒకవేళ భార్యాభర్తలిద్దరూ ఇంటికి సహ యజమానులుగా ఉండి, భార్యకు ప్రత్యేకంగా ఆదాయ మార్గం ఉంటే గనక.. ఇద్దరూ వ్యక్తిగతంగా పన్ను తగ్గింపులను క్లెయిమ్ చేసుకోవచ్చు. కాకపోతే పన్ను తగ్గింపు ఎంతనేది ప్రాపర్టీలో సహ యజమాని వాటా మీద ఆధారపడి ఉంటుంది. బ్యాంక్ వడ్డీ రేట్లూ తక్కువే.. దాదాపు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంక్‌లు గృహ రుణాల్లో మహిళలకు ప్రత్యేక వడ్డీ రాయితీలను అందిస్తున్నాయి. లోన్ మొత్తం పెరుగుతున్న కొద్దీ వడ్డీ రేటు తగ్గుతుంది కూడా. ఎస్బీఐలో వార్షిక గృహ రుణ వడ్డీ రేటు 8.4–8.95 శాతంగా ఉంటే.. మహిళలకు 8.35–8.85 శాతంగా ఉంటుంది. ఐసీఐసీఐలో ఇతరులకు వడ్డీ రేటు 8.4–8.85 శాతంగా ఉంటే.. మహిళలకు 8.35–8.7 శాతంగా ఉంటుంది. హెచ్‌డీఎఫ్‌సీలో ఇతరులకు 8.4–9.05 శాతంగా ఉంటే.. మహిళలకు 8.35–9.05 శాతంగా ఉంది. స్టాంప్ డ్యూటీలోనూ రాయితీ.. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ మహిళ పేరిట చేసినా లేక జాయింట్ ఓనర్‌గా ఉన్నా సరే స్టాంప్ డ్యూటీలో రాయితీ పొందవచ్చు. అయితే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నిబంధన ఉండేది. అయితే స్టాంప్‌డ్యూటీని 6 శాతానికి చేర్చినపుడు ఈ నిబంధనను తొలగించినట్లు తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ (టీబీఎఫ్) జనరల్ సెక్రటరీ జె.వెంకట్ రెడ్డి చెప్పారు. ప్రస్తుతం ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ నిబంధన అమల్లో ఉంది. ఉదాహరణకు.. ఢిల్లీలో మహిళలకు స్టాంప్ డ్యూటీ 4 శాతం ఉంటే పురుషులకు 6 శాతం. హర్యానాలో మహిళలకు గ్రామీణ ప్రాంతాల్లో అయితే 4 శాతం, పట్టణ ప్రాంతాల్లో అయితే 6 శాతం. అదే పురుషులకు గ్రామీణ ప్రాంతాల్లో 6 శాతం, పట్టణ ప్రాంతాల్లో 8 శాతం. రాజస్థాన్‌లో మహిళలకు 4 శాతం, పురుషులకు 5 శాతంగా ఉంది. సీఎల్ఎస్ఎస్లో భలే రాయితీలు.. ప్రధాన్‌మంత్రి ఆవాస్ యోజన (పీఎంఈవై) పథకం కింద అందుబాటు గృహాలకు క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ (సీఎల్ఎస్ఎస్) రాయితీలను అందుకోవచ్చు. మహిళ గృహ యజమానిగా లేక సహ యజమానిగా ఉండాలనేది నిబంధన. మొదటిసారి గృహం కొనుగోలు చేసే మహిళకు సీఎల్ఎస్ఎస్ మరిన్ని ప్రయోజనాలను అందిస్తోంది. ఉదాహరణకు గృహిణి వార్షిక వేతనం రూ.6 లక్షల లోపు ఉంటే.. రూ.6 లక్షల గృహ రుణం మీద 6.5 శాతం వడ్డీ రాయితీ పొందవచ్చు. -
అసలు భద్రం... వడ్డీ అధికం!
- ఎఫ్‌ఎంపీలతో బ్యాంకు వడ్డీకన్నా ఎక్కువ రాబడి! - భద్రమైన ఫండ్హౌస్ను ఎంచుకోవటం ముఖ్యం - కాలపరిమితిలోపు విత్‌డ్రాకు అవకాశమే ఉండదు మీరు ఆరు నెలల్లో కారు కొనాలని అనుకున్నారు. దానికి కావాల్సిన రీతిలో డబ్బు పొదుపు చేస్తున్నారు. కానీ అనుకోని అవసరం వచ్చింది. పొదుపు చేసిన ఆ డబ్బుల్ని తప్పనిసరి పరిస్థితుల్లో వాడాల్సి వచ్చింది. మనసులో కారు కొందామనుకున్న ఆలోచన అలాగే ఉండిపోయింది!!. చాలామందికి ఇలా స్వల్పకాలానికి ఎన్నో ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకొని.. వాటిని సాకారం చేసుకోలేకపోతుండటం జరుగుతూనే ఉంటుంది. దీన్ని ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్స్‌లో(ఎఫ్ఎంపీ) ఇన్వెస్ట్ చేయటం ద్వారా అధిగమించవచ్చు. అంతేకాకుండా వీటిల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లతో పోలిస్తే మంచి రాబడినీ అందుకోవచ్చు. ఎఫ్ఎంపీ అంటే? ఒక రకంగా ఇవి కూడా బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ల వంటివే. వీటిని మ్యూచువల్ ఫండ్స్ అందిస్తుంటాయి. ఇవి క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్స్. అంటే ఎన్ఎఫ్ఓ ఒకసారి మాత్రమే ఉంటుంది. ఆ సమయంలోనే ఈ ఫండ్‌లో చేరాలి. వీటి మెచ్యూరిటీ సమయం ఒక నెల, 3 నెలలు, 6 నెల లు, 13 నెలలు, మూడేళ్లు, ఐదేళ్లుగా ఉంటుంది. వీటిలో మనం ఇన్వెస్ట్ చేసే డబ్బుల్ని ఫండ్ మేనేజర్లు ఫిక్స్డ్ సెక్యూరిటీ బాండ్లలో, సర్టిఫికెట్స్ ఆఫ్ డిపాజిట్స్‌లో, వాణిజ్య పత్రాల్లో, ఏఏఏ రేటింగ్ కార్పొరేట్ బాండ్లలో, ట్రెజరీ బిల్లుల్లో పెట్టుబడిగా పెడతారు. కొన్ని సమయాల్లో బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లలో కూడా ఇన్వెస్ట్ చేస్తారు. అంటే మీరు ఏడాది మెచ్యూరిటీ సమయమున్న ఎఫ్‌ఎంపీలో ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే.. మీ మొతా ్తన్ని మ్యూచువల్ ఫండ్ ఏడాది కాలపరిమితి ఉన్న బాండ్లలో పెట్టుబడిగా పెడుతుంది. ఎప్ఎంపీల్లో సాధారణ ఇన్వెస్ట్మెంట్ మొత్తం కనీసం రూ.5,000గా ఉంటుంది. మార్కెట్ రెగ్యులేటర్ సెబీ నిబంధనల ప్రకా రం... మ్యూచువల్ ఫండ్ హౌసెస్ ఎఫ్ఎంపీల్లో ఇన్వెస్ట్ చేసేవారికి రాబ డిపై ఎలాంటి హామీ ఇవ్వకూడదు. రెండు ఆప్షన్లుంటాయి.. గ్రోత్ ఆప్షన్: ఈ ఆప్షన్ ఎంచుకుంటే మెచ్యూరిటీ పీరియడ్ ముగిసేదాకా ఎలాంటి లాభాలూ అందవు. అన్నీ కూడా మెచ్యూరిటీ సమయం తర్వాతే వస్తాయి. ఇన్వెస్ట్ చేసిన మొత్తంపై వచ్చే వడ్డీని మూలధనానికి కలుపుతారు. అంటే వచ్చే రాబడిని క్యాపిటల్ గెయిన్స్ కింద లెక్కిస్తారు. వచ్చే వడ్డీ మీ ఆదాయానికి కలుస్తుంది కాబట్టి ఇక్కడ మీ ఎఫ్ఎంపీ మెచ్యూరిటీ మూడేళ్ల కాలపరిమితి లోపు ఉంటే... మెచ్యూరిటీ తర్వాత తీసుకునే మొత్తంపై మీ ట్యాక్స్ శ్లాబ్ పరిధిలో కొంత పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అదే మూడేళ్లు దాటినట్లయితే పన్ను తగ్గుతుంది. డివిడెండ్ ఆప్షన్: గ్రోత్ ఆప్షన్లోలా కాకుండా ఇందులో వచ్చే రాబడిని ఫండ్ హౌస్ ఇన్వెస్టర్లకు డివిడెండ్ రూపంలో చెల్లిస్తుంది. ఈ డివిడెండ్ ఆప్షన్లో ఇన్వెస్టర్లు డివిడె ంట్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ భరించాల్సి ఉంటుంది. ఇన్వెస్ట్‌మెంట్‌కు ముందు వీటిని గమనించండి! మిగులు ధనం ఉంటే తప్ప ఇందులో ఇన్వెస్ట్ చేయవద్దు. ఎందుకంటే ఎఫ్ఎంపీలు క్లోజ్డ్ ఎండెడ్ స్కీమ్స్. మెచ్యూరిటీ సమయానికి ముందే డబ్బులు కావాల న్నా, పథకం నుంచి బయటకు రావాలన్నా కష్టం. అంటే లిక్విడిటీ సౌకర్యం తక్కువగా ఉంటుంది. మంచి పేరున్న ఫండ్ హౌస్‌లను మాత్రమే ఎంచుకోండి. బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లకు ఉన్నట్లుగా ఎఫ్‌ఎంపీలకు రూ.లక్ష వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండదు. ప్రయోజనాలు - స్థిర ఆదాయాన్ని అందిస్తాయి. - ఈక్విటీ ఫండ్స్‌తో పోలిస్తే.. ఎఫ్ఎంపీల్లో క్యాపిటల్ లాస్ రిస్క్ చాలా తక్కువ - ఫిక్స్డ్ డిపాజిట్లతో పోలిస్తే మంచి రాబడిని అందిస్తాయి. - వడ్డీ రేట్ల ఒడిదుడుకుల తో వీటికి ఎలాంటి భయం ఉండదు. - దీర్ఘకాలిక ఇన్వెస్ట్‌మెంట్‌పై ఇండెక్సెషన్ బెనిఫిట్స్, పన్ను మినహాయింపులు ఉంటాయి. ఎవరికి ఉత్తమం - స్వల్పకాలానికి స్థిరమైన ఆదాయాన్ని కోరుకునే వారికి ఇవి ఒక చక్కటి మార్గం. - పలు రకాల బాండ్లు, బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ల వల్ల వచ్చే రాబడికి సంతృప్తి చెందని వారు ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. - ఒక పరిమిత కాలం వ రకు ఇన్వెస్ట్ చేసి, నిర్దేశించుకున్న ఆర్థిక లక్ష్యాలను చేరుకోవాలని భావించే వారికి ఉత్తమం. - తక్కువ రిస్క్‌ను భరించే వారికి ఇవి మంచి ఆప్షన్. - పదవీ విరమణ చేసిన వ్యక్తులకు ఉపయుక్తంగా ఉంటాయి. -
నమూనా చూసి ఫ్లాట్ కొనొద్దు!
‘పైన పటారం..లోన లోటారం’ అనే నానుడి భాగ్యనగరంలోని చాలా ప్రాజెక్ట్‌లకు వర్తిస్తుంది. బ్రోచర్‌ను అందంగా డిజైన్ చేసి.. ఆ తర్వాత చుక్కలు చూపించే బిల్డర్లు చాలా మందే ఉన్నారు. నచ్చిన ఫ్లాటు కనబడితే చాలు.. డెవలపర్ పూర్వాపరాలను చూడకుండానే నిర్ధారిత సొమ్మును కట్టి బోలెడుమంది ఫ్లాట్లను కొంటుంటారు. ఆ తర్వాత మార్కెట్ పరిస్థితులు మెరుగ్గా లేవనో.. అమ్మకాలు కావటం లేదనో.. నిర్మాణ పనులు నిలిచిపోతే నష్టపోయేది కొనుగోలుదారుడే. అందుకే నమూనా చూసి ఫ్లాట్లు కొనొద్దని నిపుణులు సూచిస్తున్నారు. తొందరపడితే బోల్తా పడినట్టే కొనుగోలుకు ముందే జాగ్రత్తలు అవసరం సాక్షి, హైదరాబాద్ : ప్రాజెక్ట్‌ను ప్రకటించినప్పుడు కానీ అమ్మకాల సమయంలోకానీ కొనుగోలుదారులతో బిల్డర్లు, మార్కెటింగ్ సిబ్బంది ఆత్మీయంగా మాట్లాడతారు. నిర్ధారిత సొమ్మును చెల్లిస్తే రెండేళ్లలో ప్రాజెక్ట్‌ను పూర్తి చేసిస్తామని నమ్మబలుకుతారు. గడువులోగా ఫ్లాట్ తాళాలు అందించకపోతే బ్యాంక్ వడ్డీ కొనుగోలుదారుల మీదే పడుతుంది. ఒకపక్క బ్యాంక్ వడ్డీ, మరో పక్క ఇంటి అద్దె చెల్లించలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతాం. సరిగ్గా ఈ సమయంలో ఫ్లాట్లను అమ్మిన వ్యక్తితో మాట్లాడదామంటే భూతద్దం పెట్టి వెతికినా దొరకడు. సంస్థలో ఉన్నత స్థాయి వ్యక్తుల్ని కలవడానికి ప్రయత్నించినా ఫలితముండదు. ప్రాజెక్టు ఆలస్యమైతే పరిహారం చెల్లిస్తామని కొందరు బిల్డర్లు ఒప్పందాల్లో పేర్కొంటారు. కాకపోతే ఈ పరిహారం కొనుగోలుదారులకు ఏమాత్రం చాలదు. ఉదాహరణకు ఫ్లాట్ ఆలస్యమైతే చ.అ.కు రూ.5 చొప్పున పరిహారం ఇస్తామంటారు. అయితే కొనుగోలుదారులు కట్టే నెలసరి వాయిదాలతో పోలిస్తే ఇది ఏమాత్రం సరిపోదు. సమయానికి అందించినా.. గడువు లోగా ఫ్లాట్లను పూర్తి చేయలేకపోతున్నారు బిల్డర్లు. ఈ జాబితాలో చిన్న బిల్డర్లే కాదు పెద్ద సంస్థలూ ఉన్నాయి. ఏలియెన్స్, హిల్‌కౌంటీ, ప్రజయ్ వంటివే ఇందుకు ఉదాహరణలు. ఏదైనా సంస్థ నిర్ణీత గడువులోపే ఇళ్లను అందించినా.. నిర్మాణ లోపాలు స్వాగతం పలుకుతుంటాయి. శ్లాబులు, బాత్రూముల నుంచి నీరు కారడాలు, తలుపులు సరిగ్గా పట్టకపోవడం, ఫ్లోరింగ్ ఎగుడు దిగుడుగా వేయడం, బయటి ప్రాంతాలు, గోడలకు రంగులు సరిగ్గా వేయకపోవడం.. వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. నిర్మాణ లోపాలు లేకుండా బిల్డర్లు ఫ్లాట్లు అందించగానే అంతా సవ ్యంగా ఉందని భావించరాదు. నిజానికి గృహప్రవేశం చేశాకే అసలైన సమస్యలు పుట్టుకొస్తాయి. అధిక శాతం మంది డెవలపర్లు స్థానిక సంస్థల నుంచి నిరభ్యంతర ధృవీకరణ పత్రాన్ని తీసుకోరు. 2006లో జీవో నెం. 86 అమల్లోకి వచ్చాక నిర్మాణం కట్టే ప్రతి బిల్డరూ ఈ పత్రం తప్పక తీసుకోవాలి. లేకపోతే ఆ నిర్మాణం అక్రమ కట్టడంగా పరిగణిస్తారు. పత్రాలు పక్కాగా.. లక్షలు వెచ్చించి ఫ్లాట్ కొన్నాక హక్కుల్లో చిక్కులు వస్తే ఎంత ఇబ్బంది? ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే నిర్మాణ పరమైన అనుమతులు, స్థిరాస్తి యాజమాన్య హక్కు పత్రాలు పక్కాగా ఉన్నాయా? న్యాయపరంగా చెల్లుబాటు అవుతాయా? అన్న విషయాలను చూసుకోవాలి. ఇటీవలికాలంలో కొంత మంది బిల్డర్లు ఓపెన్ స్పేస్‌లో నిర్మాణాలు చేపడుతున్నారు. వాస్తవానికి ఓపెన్ స్పేస్‌లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టరాదు. వాటికి అనుమతులు కూడా ఉండవు. కానీ కొంత మంది బిల్డర్లు అక్కడ కూడా నిర్మాణాలు చేసి తక్కువ ధరకే అంటకట్టడానికి ప్రయత్నిస్తుంటారు. అందువల్ల కొనుగోలుదారులు ప్రధానంగా ఈ విషయాన్ని గమనించాల్సి ఉంటుంది. వీలైతే అనుభవమున్న న్యాయవాదిని సంప్రదించాలి. వసతులూ ప్లాన్‌లో.. కొనుగోలుదారులకు బిల్డర్లు అనేక రకాల వరాలు ఇస్తుంటారు. కలలో ఉన్న సౌధాన్ని మాటలతో కళ్ల ముందు చూపిస్తుంటారు. అపార్టుమెంట్లో పిల్లల పార్కు, ఈత కొలను, వ్యాయామశాల వంటి మరెన్నో సౌకర్యాలను చెబుతుంటారు. ఇవన్నీ అపార్టుమెంట్ ప్లాన్‌లో పొందుపరచబడి ఉంటాయి. అందువల్ల ప్లాన్‌ను తప్పనిసరిగా పరిశీలించాలి. ఇంటీరియర్స్‌కు సంబంధించిన పనులు సాధారణంగా బిల్డర్ చేసివ్వరు. సర్వాంగ సుందరంగా ఉండే నమూనా ఫ్లాట్ అన్నది నిర్మాణపరంగా మీ ఫ్లాట్ ఎలా ఉంటుందో ఊహించుకోవడానికే కానీ ఆ ఇల్లును ఆ విధంగా చేసిస్తారని పొరపాటుపడొద్దు. ఈతీరుగా మీ ఫ్లాట్ కావాలంటే అదనపు సొమ్ము చెల్లించక తప్పదు. నాణ్యత లేకుంటే చిక్కులే.. నిర్మాణ పనులు చివరి దశలోకి రాగానే ఎప్పుడెప్పుడు గృహప్రవేశం చేయాలా అనే తహతహ చాలా మందికి ఉంటుంది. సరిగ్గా ఇక్కడే ఫ్లాట్ నాణ్యతను పరిశీలించాలి. కొందరు బిల్డర్లు నమూనా ఫ్లాట్‌పై చూపెట్టిన శ్రద్ధ వాస్తవ ఫ్లాట్‌లో పాటించరు. ఇటువంటి సమయంలో తెలివిగా వ్యవహరించాలి. ఫ్లాట్ల నిర్మాణంలో నాణ్యత లేకపోతే రాజీపడకూడదు. ఒప్పందాన్ని మీరి నాణ్యత లోపాలు ఉంటే సవరించాకే ఫ్లాట్‌ను స్వాధీనం చేసుకోవాలి. అప్పుడే ఏళ్ల నాటి కష్టం ఇంటిని చూస్తే మాయమవుతుంది. ♦ ఇంటికి వేసే రంగులు యజమానుల మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తాయి. సున్నితమైన మనస్సు ఉన్న వారు లేత రంగులు, ప్రేమ పిపాసులు గులాబీ రంగు, సంపద కోరుకునే వారు బంగారు వర్ణం, ఆహ్లాదం కోరుకునే వారు లావెండర్ వంటి రంగులు ఎంపిక చేసుకుంటారని చెబుతున్నారు. గొప్పదనాన్ని చెప్పాలనుకునే వారు ముదురు రంగులు ఎంచుకుంటారని నిపుణుల మాట. ♦ ఏ ఇంట్లోకి ప్రవేశించినా ప్రతి ఒక్కరి చూపు పడేది టీవీ క్యాబినెట్ మీదే. అందుకే టీవీ యూనిట్‌ను ఆధునికంగా తీర్చిదిద్దడమూ ఓ కళే. టీవీ యూనిట్‌కు వైరింగ్ జాగ్రత్తగా చేయించాలి. లేకపోతే ఎంత ఖరీదైన టీవీకొన్నా క్యాబినెట్ చేయించినా బయటికి వైర్లు వేలాడుతుంటే అందవికారంగా కనిపిస్తుంది. డీటీహెచ్, డీవీడీ ప్లేయర్, ఏసీ, టీవీలకు సంబంధించి వైరు, రిమోట్లు ఎక్కువే ఉంటాయి. ఇవి బయటికి కన్పించకుండా చూసుకోవాలి. టీవీ వెనకా ఒకటిన్నర అంగుళాల మందం గత పైపు ఏర్పాటు చేసి అందులో నుంచి డీవీడీ, డీటీహెచ్‌లకు కనెక్షన్ ఇవ్వాలి. టీవీకి స్పీకర్లు బిగించేవారు ఆ వైర్లు కూడా కనిపించకుండా చూసుకోవాలి. స్థిరాస్తులకు సంబంధించి మీ సందేహాలు మాకు రాయండి realty@sakshi.com -
బాబు హామీల పాపం..డ్వాక్రా సంఘాలకు శాపం
పలమనేరు: డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామంటూ బాబు ఇచ్చిన హామీ గ్రూపుల్లో మహిళల పాలిట శాపంలా మారింది. ఇన్నాళ్లు రుణాలు మాఫీ చేస్తారనే ఆశతో తీసుకున్న అప్పులను గ్రూపులు బ్యాంకులకు చెల్లించలేదు. దీంతో అసలు, వడ్డీ పెరిగి వీరికి మరింత భారంగా తయారైంది. నాలుగు నెలల వడ్డీ ఒక్కసారి కట్టాల్సి రావడంతో ఇబ్బందులు తప్పడం లేదు. బ్యాంకర్లు సైతం మొత్తం కంతులు కట్టాల్సిందేనంటూ గట్టిగానే చెబుతున్నారు. దీనికితోడు సంఘమిత్రలు గ్రూపు లీడర్లపై మరింత ఒత్తిడి తీసుకొస్తున్నారు. 4 నెలల వడ్డీ భారం రూ.25 కోట్లు చిత్తూరు జిల్లాలో 55,602 స్వయం సహాయక సంఘాలు రూ.1611.03 కోట్లు (మార్చి 31 నాటికి) బ్యాంకులకు బకాయిపడ్డాయి. మే నుంచి ఆగస్టు వరకు ఈ సంఘాలు బ్యాంకులకు కం తులు చెల్లించలేదు. 4నెలల వడ్డీతోపాటు అసలు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీరికి సంబంధిత బ్యాంకులు 13.5 శాతం వడ్డీతో అంటే నూటికి రూ.1.27 చొప్పున వడ్డీ వసూలు చేస్తున్నాయి. ఈ లెక్కన నెలకు 5.7 కోట్లు వడ్డీ చెల్లించాల్సి ఉంది. నాలుగు నెలలకు కలిపి సుమారు రూ.25 కోట్లకు పైగా గ్రూపులు వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి నె లకొంది. ఇక మహిళా గ్రూపులు ఔట్‌స్టాండింగ్‌గా సుమారు రూ.150 కోట్లు దాకా చెల్లించాల్సి ఉందని బ్యాంకర్లు చెబుతున్నారు. మరోవైపు అసలు, వడ్డీ చెల్లించలేని గ్రూపులను నాన్ పెర్ఫార్మెన్స్ అకౌంట్స్ ద్వారా బ్లాక్ లిస్టులోకి చేర్చే కార్యక్రమం కూడా ఇప్పటికే జరిగిందని తెలుస్తోంది. జిల్లాలో 8 వేల సంఘాలు ఓవర్ డ్యూ కారణంగా కొత్త రుణాలు పొందలేని పరిస్థితి ఏర్పడింది. వీరు ఇన్డేట్కు మొత్తం కంతులు చెల్లిస్తే గానీ వీరి ఖాతా రెగ్యులర్ అకౌంట్‌గా మారి ఫోర్స్‌లోకి రావు. అసలు, వడ్డీ కలిపి కట్టాల్సిందే.. రాష్ర్ట ప్రభుత్వం నుంచి డ్వాక్రా రుణాలకు సంబంధించి స్పష్టమైన ఆదేశాలు రాలేదని, జీవో సంతృప్తి కరంగా లేదని బ్యాంకర్లు చెబుతున్నారు. అసలు ప్ర భుత్వం అందిస్తున్న రూ.లక్ష రుణమాఫీనే కాదని, గ్రూపుల బలోపేతానికి ప్రోత్సాహకమేనని ఇండియ న్ బ్యాంక్ జోనల్ మేనేజర్ చంద్రారెడ్డి పేర్కొన్నారు. అసలు, వడ్డీ కలిపి కడితేగానీ ఖాతాలా వాదేవీలు ఫోర్స్‌లోకి రావంటూ గట్టిగానే చెబుతున్నారు. భవిష్యత్తులో కొత్తరుణాలు పొందాలంటే కచ్చితంగా కంతులు చెల్లించాల్సిందేనని హెచ్చరిస్తున్నారు. గ్రూపుల్లోని పొదుపు ఖాతాలపై బ్యాంకర్ల కన్ను రుణమాఫీ సంగతి పక్కనుంచి సంబంధిత గ్రూపుల్లో ని పొదుపు ఖాతాలకు మాత్రం పొదుపును జమ చే యాల్సిందేనని అటు ఐకేపీ, ఇటు మెప్మా అధికారు లు, బ్యాంకర్లు మొదటి నుంచి చెబుతూనే వస్తున్నా రు. 60 శాతం సంఘాలు ప్రతినెలా సేవింగ్స్ ఖాతా లో పొదుపును జమ చేస్తూనే వస్తున్నాయి. ప్రతి గ్రూపునకూ నెలకు రూ.వెయ్యి చొప్పున బ్యాంకుల కు రూ.60 లక్షలకు పైగా జమ అవుతోంది. ఆ లెక్కన 4 నెలలుగా రూ.2.04 కోట్లు పొదుపు ఖాతాల్లో ఉన్నాయి. ఈ డబ్బును సైతం అప్పుల్లోకి జమ వేసుకోవడానికి బ్యాంకర్లు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అసలు, వడ్డీ కట్టాలని సంఘమిత్రల హుకుం.. ఒక వైపు బ్యాంకర్లు ఒత్తిడి తెస్తుంటే మరో వైపు సంఘమిత్రలు అసలు, వడ్డీ మొత్తం కట్టాల్సిందేనంటూ హుకుం జారీ చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి అందే రూ.లక్ష వచ్చాక మిగిలిన అప్పు చెల్లిస్తామని గ్రూపు లీడర్లు చెబుతున్నా పట్టించుకోకుండా వేధిస్తున్నట్లు పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. మొత్తం మీద చంద్రబాబు హామీ కారణంగా తాము అప్పుల పాలయ్యామని చాలా మంది మహిళలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. -
వడ్డీ పెరిగితే ఏం చేద్దాం?
కిషోర్‌కు కారుంది. ఇల్లుంది. కాకపోతే ఇంటిపై లోనుంది. ఇటీవలే రిజర్వు బ్యాంకు కీలకమైన రెపో రేటు 0.25% పెంచటంతో... వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఏర్పడింది. తాను ఇప్పటికే తీసుకున్న హౌసింగ్ లోనుపై వడ్డీ రేట్లు పెరుగుతాయేమోనన్న భయం కిషోర్‌కు పట్టుకుంది. ఎందుకంటే అప్పటికే తన బడ్జెట్ బొటాబొటిగా సరిపోతోంది. బ్యాంకులైతే ఇప్పటికిప్పుడు వడ్డీ రేట్లు పెంచబోమని చెబుతున్నాయి. కానీ ఆర్బీఐ దగ్గర అవి తీసుకునే రుణాలపై వడ్డీ రేటు పెరిగింది కనక... ఇప్పుడు కాకపోతే కాస్త లేటుగానైనా అవి వడ్డీరేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకోక తప్పదు. మరి కిషోర్ ఏం చేయాలి? కిషోర్ ఒక్కడే కాదు... అలా రుణాలు తీసుకున్న వారంతా ఇప్పుడేం చేయాలి? ఇలాంటి పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి? అదే ఈ వారం ప్రాఫిట్ ప్రధాన కథనం.. ఈఎంఐ బదులు వ్యవధి పెరగొచ్చు!! అత్యవసరం అనిపించినపుడు అప్పు దొరికితే చాలనుకుంటాం. ఏదో ఒక బ్యాంకు... ఎంతో కొంత వడ్డీ.. అప్పు దొరికితే అదే పదివేలు... అనుకుంటాం. తీరా తీసుకున్నాక ఎప్పటికప్పుడు వడ్డీ రేట్లు పెరుగుతుంటే... కట్టాల్సిన మొత్తం కూడా పెరుగుతుంటుంది. అప్పుడు... అసలు లోను ఎందుకు తీసుకున్నాంరా!! అని బాధపడటమూ సహజమే. ఇలాంటివి ఎదురుకాకుండా ఉండాలంటే.. సాధారణంగా ఆర్బీఐ పాలసీ రేట్లను పెంచిన ప్రతిసారీ బ్యాంకులూ వడ్డీ రేట్లు పెంచేస్తాయని, రుణాలపై నెలవారీ చెల్లించాల్సిన ఈఎంఐలు కూడా భారమవుతాయని మీడియా ఊదరగొడుతూ ఉంటుంది. నిజానికి బ్యాంకుల బేస్ రేటు మారినంత మాత్రాన ఈఎంఐలు మారాల్సిన అవసరం లేదు. దానికి బదులుగా రుణం తిరిగి చెల్లించే వ్యవధి పెరగొచ్చు. వ్యవధి పెరిగితే.. కట్టే మొత్తమూ పెరుగుతుంది. ఉదాహరణకు రాము 15 ఏళ్ల వ్యవధికి, రాజా 17 ఏళ్ల వ్యవధికి రూ.20 లక్షల గృహ రుణాన్ని 10 శాతం వడ్డీకి తీసుకున్నారనుకుందాం. అదే రేటు కొనసాగిన పక్షంలో రాము మొత్తంగా రూ.38,68,560 కడితే, రాజా మాత్రం రూ.41,66,496 కట్టాల్సి ఉంటుంది. రాజా ఎక్కువ కాలాన్ని ఎంచుకున్నందున ఈఎంఐ కాస్త తగ్గినా.. అదనంగా సుమారు రూ. 2.97 లక్షలు కట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి.. వడ్డీ రేటు పెరిగితే ఈఎంఐ మారకుండా .. వ్యవధి మాత్రమే మారినా కట్టాల్సిన మొత్తం పెరుగుతుంది. అందుకని ఇలాంటి పరిస్థితికి సిద్ధపడాలి. వీలైతే... ఈఎంఐని పెంచుకోవడమో లేదా అదనపు భారాన్ని ముందే చెల్లించే మార్గం చూసుకోవటమో చేయాలి. ఇలాంటప్పుడు కొందరు ఒకవైపు ఈఎంఐ కడుతూనే మరోవైపు నెలకింత చొప్పున రికరింగ్ డిపాజిట్లో ఉంచి... ఏడాది తర్వాత కొంత మొత్తాన్ని ప్రీపేమెంట్ చేస్తుంటారు. ఈఎంఐని పెంచుకోవడం కన్నా ఈ విధంగా చేయడం వల్ల ఆర్డీపై తమకు వడ్డీ కూడా వస్తుంది కనుక.. ఆ మేరకు ప్రయోజనం ఉంటుందనుకుంటారు. కానీ, ఆర్డీపై వచ్చే వడ్డీతో పోలిస్తే హోమ్‌లోన్‌పై చెల్లించే వడ్డీ చాలా ఎక్కువ. ఉదాహరణకు ఆర్డీపై గరిష్టంగా 9 శాతం మేర వడ్డీ వచ్చినా.. హోమ్ లోన్‌పై వడ్డీ రేటు 10 శాతంపైనే ఉంటోంది. పెపైచ్చు .. ఆర్డీ ఆదాయంపై పన్ను భారం కూడా ఉంటుంది. దీనికి బదులుగా వెసులుబాటును బట్టి ఈఎంఐని పెంచుకునే అవకాశాన్ని చూడాలి. ఒకవేళ ఆ తర్వాత వడ్డీ రేటు తగ్గినా.. దానికి అనుగుణంగా చెల్లించాల్సిన మొత్తం కూడా తగ్గి త్వరగా రుణ విముక్తులు కావొచ్చు. ఇక్కడ మరో విషయం గుర్తుంచుకోవాలి. ఈఎంఐని పెంచుకునేటప్పుడు.. తర్వాత దశల్లో కూడా కొనసాగించగలమా లేదా అన్నది చూసుకోవాలి. లేకపోతే డిఫాల్టయ్యే ప్రమాదముంది. పెరిగిన ఈఎంఐలను తట్టుకోగలిగేదాకా ఇతర ఖర్చులను కొంతైనా తగ్గించుకోవడం మంచిది. వేరే బ్యాంకుకు మారడం... తక్కువ రాబడులిచ్చే సాధనాల్లో నుంచి వైదొలిగి తద్వారా మిగిలే మొత్తాన్ని.. రుణంలో కొంత భాగం ప్రీపేమెంట్ చేసే అవకాశాన్నీ పరిశీలించవచ్చు. అలాగే, రుణం తీసుకున్న బ్యాంకులో వడ్డీ భారం అధికంగా ఉంటే తక్కువ వడ్డీ వసూలు చేసే వేరే బ్యాంకుకు రుణాన్ని మార్చుకోవచ్చు. అయితే, ఇలా మార్చడానికి అయ్యే వ్యయాలు భారీ స్థాయిలో కాకుండా తక్కువగా ఉంటేనే అలాంటి నిర్ణయం తీసుకోవాలి. -
రుణ రేటు పెంచిన ఐసీఐసీఐ బ్యాంక్
ముంబై: ఐసీఐసీఐ బ్యాంక్ రుణ రేట్లను పావు శాతం పెంచింది. దీనితో కనీస (బేస్) రుణ రేటు 10 శాతానికి చేరింది. తాజా రేటు శుక్రవారం నుంచీ అమల్లోకి రానుంది. దీనితో ఈ రేటుకు అనుసంధానమైన వ్యక్తిగత, గృహ, వాహన, తదితర వాణిజ్య రుణాలు ప్రియం కానున్నాయి. ఫ్లోటింగ్ రేట్లపై ఉన్న ప్రస్తుత కస్టమర్లకు వర్తించే విధంగా తన ప్రామాణిక రుణ రేట్లను కూడా బ్యాంక్ పావు శాతం పెంచింది. తాజా రుణ రేట్ల మార్పు ఫిక్స్డ్ రేట్ కస్టమర్లకు వర్తించదని బ్యాంక్ ప్రకటన తెలిపింది. హెచ్డీఎఫ్సీ కూడా: హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (హెచ్డీఎఫ్సీ) కూడా గృహ రుణాలపై ప్రామాణిక రుణ రేటును పావుశాతం పెంచింది. దీనితో రూ.30 లక్షల వరకూ గృహ రుణాలపై వడ్డీరేటు 10.40 శాతానికి పెరగనుంది. రూ.30 లక్షలు దాటిన రుణాలపై రేటు 10.65కు చేరుతుంది. శుక్రవారం నుంచీ తాజా రేట్లు అమల్లోకి వస్తాయి.