రుణ రేటు పెంచిన ఐసీఐసీఐ బ్యాంక్
ముంబై: ఐసీఐసీఐ బ్యాంక్ రుణ రేట్లను పావు శాతం పెంచింది. దీనితో కనీస (బేస్) రుణ రేటు 10 శాతానికి చేరింది. తాజా రేటు శుక్రవారం నుంచీ అమల్లోకి రానుంది. దీనితో ఈ రేటుకు అనుసంధానమైన వ్యక్తిగత, గృహ, వాహన, తదితర వాణిజ్య రుణాలు ప్రియం కానున్నాయి. ఫ్లోటింగ్ రేట్లపై ఉన్న ప్రస్తుత కస్టమర్లకు వర్తించే విధంగా తన ప్రామాణిక రుణ రేట్లను కూడా బ్యాంక్ పావు శాతం పెంచింది. తాజా రుణ రేట్ల మార్పు ఫిక్స్‌డ్ రేట్ కస్టమర్లకు వర్తించదని బ్యాంక్ ప్రకటన తెలిపింది.
హెచ్‌డీఎఫ్‌సీ కూడా: హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (హెచ్‌డీఎఫ్‌సీ) కూడా గృహ రుణాలపై ప్రామాణిక రుణ రేటును పావుశాతం పెంచింది. దీనితో రూ.30 లక్షల వరకూ గృహ రుణాలపై వడ్డీరేటు 10.40 శాతానికి పెరగనుంది. రూ.30 లక్షలు దాటిన రుణాలపై రేటు 10.65కు చేరుతుంది. శుక్రవారం నుంచీ తాజా రేట్లు అమల్లోకి వస్తాయి.