
చిలకలూరిపేట బ్రాంచిలో రూ.కోట్ల డిపాజిట్లు మాయం
నిందితుడు, అతని తల్లి ఖాతాల్లోకి రూ.35 కోట్లు బదిలీ అయినట్టు గుర్తింపు
అజిత్‌కుమార్ అరెస్టును అడ్డుకున్న టీడీపీ నేతలు
ఎట్టకేలకు టీడీపీ నేత అజిత్‌కుమార్‌ను అరెస్టు చేసిన సీఐడీ
చిలకలూరిపేట: ఐసీఐసీఐ బ్యాంకు చిలకలూరిపేట శాఖలో జరిగిన కుంభకోణంలో కీలక సూత్రధారి అయిన టీడీపీ నేతను ఎట్టకేలకు అరెస్టు చేశారు. కోట్లాది రూపాయల ఖాతాదారుల సొమ్ము కాజేసిన ఈ కుంభకోణంలో ఈ టీడీపీ నేతే సూత్రధారి అని అప్పట్లోనే తేటతెల్లమైనా, ఆయన్ని అరెస్టు చేయకుండా అధికార పార్టీ నేతలు అడ్డుకున్నారు. దీంతో ఆయన అరెస్టుకు సుదీర్ఘకాలం పట్టింది. కుంభకోణంలో కీలక పాత్రధారిగా ఉన్న బ్యాంకు మేనేజర్ దూడ నరేష్ చంద్రశేఖర్ కొన్నాళ్లు అజ్ఞాతంలో ఉండి కుంభకోణానికి సంబంధించిన వివరాలను సెల్ఫీ వీడియోలో బహిర్గతం చేశారు.
ఈ కుంభకోణానికి సంబంధించి రూ. 35 కోట్ల అజిత్‌కుమార్, ఆయన తల్లి ఖాతాల్లో జమ అయినట్లు సీఐడీ విచారణలో తేలింది. దీంతో అజిత్ కుమార్‌ను అరెస్టు చేయక తప్పలేదు. సీఐడీ డీఎస్పీ గోలి లక్ష్మయ్య ఆధ్వర్యంలో అధికారుల బృందం శుక్రవారం చిలకలూరిపేట మండలం మురికిపూడిలో ఆయన్ని అరెస్టు చేశారు. అనంతరం విజయవాడ న్యాయస్థానంలో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించటంతో నెల్లూరు జైలుకు తరలించారు.
అరెస్టు సందర్భంగా అజిత్‌కుమార్, అయన సోదరుడు దీపక్ సీఐడీ అధికారులపై దురుసుగా ప్రవర్తించినట్లు అధికారులు తెలిపారు. అధికార పార్టీకి చెందిన తనను అరెస్టు చేస్తారా అంటూ ఎదురు తిరిగాడు. దీంతో తమ విధులకు ఆటంకం కలిగించారంటూ సీఐడీ అధికారులు చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అజిత్‌కుమార్‌పై కేసు నమోదు చేసిననట్లు రూరల్ ఎస్‌ఐ అనిల్‌కుమార్ చెప్పారు.
టీడీపీ నేతగా హల్‌చల్
ఈ కుంభకోణం వెలుగు చూసిన వెంటనే మేనేజర్ నరేష్ చంద్రశేఖర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ కుంభకోణానికి సంబంధించిన విషయాలను సెల్ఫీ వీడియో ద్వారా విడదల చేశాడు. ఇందులో కీలక సూత్రధారి సింగ్ అజిత్‌కుమార్ అనే విషయం అప్పట్లోనే వెల్లడైంది. తనకు టీడీపీ అధిష్టానం వద్ద పలుకుబడి ఉందని, పార్టీ ఫండ్‌గా రూ. 4 కోట్ల ఇచ్చానని, టీడీపీ టికెట్ తనదేనని ప్రచారం చేసుకొన్నారు.
ఎన్నారైగా చెప్పుకుంటూ పెద్ద కాన్వాయ్, దాంట్లో బౌన్సర్లతో హల్‌చల్ చేసేవాడు. అమెరికాలో ఉంటున్నట్లు చెప్పుకున్నప్పటికీ, తరుచూ స్వగ్రామానికి రావడంతో స్థానికుల్లోనూ అనుమానాలు ఉండేవి. ఎన్నికల్లో చిలకలూరిపేట టికెట్ ప్రత్తిపాటి పుల్లారావుకు రావడంతో ఆయనకు మద్దతుగా ప్రచారం చేశాడు. ఆయనకు ఎలక్షన్ ఫండ్ కింద రూ. 2 కోట్లు ఇచ్చినట్టు సైతం ప్రచారంలో ఉంది.
ఇదీ జరిగింది..
పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని ఐసీఐసీఐ బ్యాంకు బ్రాంచిలో ఖాతాదారుల సొమ్ము కోట్ల రూపాయలు గోల్‌మాల్ జరిగినట్లు గతేడాది అక్టోబర్‌లో వెలుగులోకి వచ్చింది. ఇక్కడ పలువురు ఫిక్స్‌డ్, రికరింగ్ డిపాజిట్లు చేయడంతోపాటు గోల్డ్ లోన్లు పొందారు. రికరింగ్ డిపాజిట్ల వడ్డీ తీసుకొనే వారు బ్యాంకుకు రావడంతో వారి ఖాతాల్లో డిపాజిట్లు మాయమైనట్లు తేలింది. దీంతో బాధితులు పెద్దఎత్తున బ్యాంకు ముందు ఆందోళనకు దిగారు.
బ్యాంకు జోనల్ మేనేజర్ సందీప్ మెహ్రా, రీజినల్ హెడ్ రమేష్, ఇతర ఉన్నతా«ధికారులు బ్రాంచికి చేరుకొని విచారణ జరిపి, కోట్లాది రూపాయల అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఈ కేసు దర్యాప్తును సీఐడీకి అప్పగించారు.
2017 నుంచి చిలకలూరిపేట బ్రాంచి మేనేజర్‌గా వ్యవహరించిన దూడ నరేష్ చంద్రశేఖర్ ఈ గోల్‌మాల్లో కీలకపాత్ర పోషించినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. ఆయన 2021లో నరసరావుపేట, 2023లో విజయవాడలోని భారతీనగర్ బ్రాంచికి బదిలీ అయ్యారు. 2024లో చిలకలూరిపేట బ్రాంచి కుంభకోణం వెలుగు చూడటంతో ఆయన్ని సస్పెండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment