
సీఐడీ, ఏసీబీ చీఫ్ పోస్టులు వద్దంటున్న సీనియర్ ఐపీఎస్‌లు
కుట్రలకు తమను పావులుగా వాడుకుంటున్నారని బెంబేలు
తరువాత తమకు ఇబ్బందులు తప్పవని ఆందోళన
బాబుపై కేసులు క్లోజ్ చేయడమే సీఐడీ చీఫ్ టార్గెట్
కేంద్ర సర్వీసుకు వెళ్లేందుకు అయ్యన్నార్ సన్నాహాలు
తననూ తప్పించాలని కోరుతున్న ఏసీబీ చీఫ్ అతుల్ సింగ్
త్వరలో సీనియర్ ఐపీఎస్‌ల బదిలీలతో భారీ కుదుపు
సాక్షి, అమరావతి: పోలీసు శాఖలో కీలక విభాగాల అధిపతి పోస్టు దక్కించుకునేందుకు సాధారణంగా ఉన్నతాధికారులు పోటీ పడతారు. అలాంటిది టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక పోలీసు శాఖలో కీలక పోస్టులంటేనే సీనియర్ ఐపీఎస్‌లు హడలెత్తిపోతున్నారు. ప్రధానంగా సీఐడీ, అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) చీఫ్ పోస్టుల పేరు చెబితేనే కంపించిపోతున్నారు.
అవి మాకొద్దు..! అప్రాధాన్య పోస్టులైనా ఫర్వాలేదు..! వీలైతే కేంద్ర సర్వీసులకు పంపండి..! అని మొర పెట్టుకుంటున్నారు. ముఖ్యనేతల కుట్రలను అమలు చేసేందుకు నిరాకరించి కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయిన సీఐడీ ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ బాటలో సాగేందుకు పలువురు ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీల్లో భారీ కుదుపులు ఉండొచ్చని పోలీసువర్గాలు భావిస్తున్నాయి.
తలొగ్గిన వారికి పెద్దపీట..
పోలీసు శాఖలో సీఐడీ, ఏసీబీ, విజిలెన్స్–ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాలు అత్యంత కీలకమైనవి. కీలక కేసుల్లో సమర్థ దర్యాప్తు, అవినీతి నిర్మూలన ప్రాతిపదికన ఆ మూడు విభాగాల అధిపతులుగా సీనియర్ ఐపీఎస్‌లను నియమించడం సంప్రదాయంగా వస్తోంది. టీడీపీ సర్కారు దీనికి మంగళం పాడింది. తాము సూచించిన వారికి వ్యతిరేకంగా అక్రమ కేసులు నమోదు చేయడం, అక్రమంగా నిర్బంధించడం, బెదిరించడం, హింసించడం, వేధించడమే అర్హతగా నిర్ణయించింది.
అందుకు తలొగ్గిన సీనియర్ ఐపీఎస్ అధికారులనే సీఐడీ, ఏసీబీ, విజిలెన్స్–ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాలకు అధిపతులుగా నియమించింది. విజిలెన్స్–ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం డీజీగా ఉంటూ రెడ్‌బుక్ కుట్రల అమలుకు అనుగుణంగా నివేదికలు రూపొందించినందువల్లే హరీశ్ కుమార్ గుప్తాను డీజీపీగా నియమించారన్నది పోలీసు శాఖలో బహిరంగ రహస్యం.
ఐరాసకు అయ్యన్నార్...!
చంద్రబాబుపై గతంలో సీఐడీ పూర్తి ఆధారాలతో నమోదు చేసిన స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ఫైబర్ నెట్, అసైన్డ్ భూములు, ఇన్నర్‌రింగ్ రోడ్డు, మద్యం, ఇసుక కుంభకోణాల కేసులను అర్ధంతరంగా క్లోజ్ చేయాలన్న షరతు మీదే సీఐడీ అధిపతిగా రవి శంకర్ అయ్యన్నార్‌ను నియమించారు. మొదట్లో అందుకు తలూపినా అది అంత సులభం కాదనే వాస్తవం అయ్యన్నార్‌కు అర్థమైంది.
వేధించినా.. బలవంతంగా 164 సీఆర్‌సీపీ కింద అబద్ధపు వాంగ్మూలాలు ఇప్పించినా అవన్నీ తరువాత తన మెడకే చుట్టుకుంటాయని ఆయన గ్రహించడంతో కొద్ది నెలలుగా ఆయన కాస్త ఉదాసీనంగా ఉంటున్నారు. దీంతో వైఎస్సార్‌సీపీ హయాంలో మద్యం విధానంపై అక్రమ కేసు దర్యాప్తు నుంచి రవి శంకర్ అయ్యన్నార్‌ను తప్పించి విజయవాడ సీపీ ఎస్వీ రాజశేఖర్‌బాబుకు అప్పగించారు.
ఈ నేపథ్యంలో రవిశంకర్ అయ్యన్నార్ కేంద్ర సర్వీసులకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఐక్యరాజ్య సమితి (యూఎన్‌వో) ఆఫ్రికా దేశాల్లో నిర్వహిస్తున్న ప్రత్యేక పోలీసు ఆపరేషన్ల విభాగానికి వెళ్లేందుకు ఆయనకు మార్గం సుగమమైనట్లు సమాచారం. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా సూత్రప్రాయంగా ఆమోదించినట్లు తెలుస్తోంది.
ఇక ఏసీబీ చీఫ్‌గా ఉన్న అతుల్ సింగ్ కూడా తనను ఆ పోస్టు నుంచి తప్పించాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. కేంద్ర సర్వీసుకు డిప్యుటేషన్‌పై పంపాలని లేదంటే రాష్ట్రంలోనే ఏదైన అప్రాధాన్య పోస్టుకు బదిలీ చేయాలని ఆయన కోరుతున్నట్లు సమాచారం.
ఇక ఆ ఇద్దరే..!
ఇద్దరు ఉన్నతాధికారులు తప్పుకొంటుండటంతో సీఐడీ, ఏసీబీ అధిపతులుగా ఎవరిని నియమిస్తారన్నది పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. బరితెగించి కుట్రలను అమలు చేసే సీనియర్ ఐపీఎస్‌ల కోసం ప్రభుత్వ పెద్దలు జల్లెడ పడుతున్నారు. గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, విజయవాడ సీపీ రాజశేఖర్ బాబే ప్రభుత్వం దృష్టిలో అర్హులుగా ఉన్నారని పోలీసు వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
ప్రస్తుతం డీజీపీ హరీశ్ కుమార్‌గుప్తా నిర్వహిస్తున్న విజిలెన్స్–ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ పోస్టులో సీనియర్ ఐపీఎస్ బాలసుబ్రహ్మణ్యంను నియమించాలని ప్రభుత్వం భావిస్తుండగా ఆయన ఐటీ–ఆర్‌టీజీఎస్ శాఖల ముఖ్యకార్యదర్శి పోస్టు కోసం పట్టుబడుతున్నారు. శాంతి–భద్రతల విభాగం అదనపు డీజీగా ఉన్న మధుసూదన్‌రెడ్డి తనను ఆ పోస్టు నుంచి తప్పించాలని కోరుతున్నారు.