అక్రమ కేసులు.. నిర్బంధాలు.. చిత్రహింసలు.. అరాచకానికి పరాకాష్ట | Chandrababu Govt illegal cases on social media activists who questioning TDP govt | Sakshi
Sakshi News home page

అక్రమ కేసులు.. నిర్బంధాలు.. చిత్రహింసలు.. అరాచకానికి పరాకాష్ట

Published Sun, Nov 10 2024 4:40 AM | Last Updated on Sun, Nov 10 2024 7:46 AM

Chandrababu Govt illegal cases on social media activists who questioning TDP govt

వికృత క్రీడ.. చంద్రబాబు ప్రభుత్వ రాక్షసానందం

ఇష్టానుసారం కక్ష సాధింపులతో పౌర హక్కుల హననం 

పాలకులను ప్రశ్నిస్తే దండన తప్పదని సరికొత్త ఆదేశం 

జీ హుజూర్‌ అంటూ పోలీసు శాఖ అత్యుత్సాహం  

సుప్రీంకోర్టు, హైకోర్టు హెచ్చరికలు సైతం బేఖాతర్‌.. ఇప్పటికే వందలాది మందిపై తప్పుడు కేసులు 

నోటీసులు ఇవ్వకుండానే ఎత్తుకెళు్తన్న పోలీసులు.. పోలీస్‌స్టేషన్లు తిప్పుతూ థర్డ్‌ డిగ్రీ ప్రయోగిస్తున్న వైనం 

గట్టిగా నిలదీస్తేనే అరెస్టులు చూపుతున్న ఖాకీలు.. మహిళలపై కూడా చేయి చేసుకుంటూ దాష్టీకం 

అసభ్య పోస్టులు కాకపోయినా బెదిరింపులు.. ఇంకా వేలాది మందిపై కేసులకు సమాయత్తం  

సర్కారు అరాచకాలపై సర్వత్రా విస్మయం  

‘‘మేము ఎలా పాలన సాగించినా ఎవరూ నోరెత్తకూడదు.. ఇది మా ప్రభుత్వం.. అంతా మా ఇష్టం.. తప్పు పట్టడానికి మీరెవరు? కాదు కూడదని మా నిర్ణయాలను ప్రశ్నిస్తే నాలుగు తగిలించడంతో పాటు నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్లపై కేసులు పెట్టి బొక్కలో వేస్తాం. ఏం చేస్తారో చేసుకోండి. సుప్రీంకోర్టు, హైకోర్టుల సంగతి మా లాయర్లు చూసుకుంటారు. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్లను కూడా వదిలి పెట్టం. మేం చెప్పినట్లు ఎన్ని తప్పుడు కేసులైనా పెట్టడానికి పోలీసులున్నారు. ఆ విధంగా వాళ్లను ట్యూన్‌ చేసుకున్నాం. ఎవరైనా తోక జాడించి మమ్మల్ని ప్రశ్నిస్తే ఏం చేస్తామో.. ఎలాంటి కేసులు పెడతామో మాకే తెలియదు’’ అన్నట్లు కూటమి సర్కారు గుడ్లురు ముతోంది.  నియంతృత్వమే తమ చట్టం అని, రెడ్‌బుక్‌ తమ రాజ్యాంగమని స్పష్టం చేస్తోంది. తాలిబన్లు సైతం విస్తుపోయేలా వికటాట్టహాసం చేస్తూ, సోషల్‌ మీడియా యాక్టివిస్టులను భయభ్రాంతులకు గురిచేస్తూ రాజ్యమేలుతోంది. పక్కన పేర్కొన్న దయనీయ సంఘటనే ఇందుకు ఓ ఉదాహరణ. ఇలాంటి ఉదాహరణలు రాష్ట్ర వ్యాప్తంగా వందల సంఖ్యలో ఉండటం ప్రజాస్వామ్య వాదులను విస్మయ పరుస్తోంది.

సాక్షి, అమరావతి: ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న సోషల్‌ మీడియా యాక్టివిస్టులే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వారిపైకి పోలీసులను ఉసిగొలుపుతోంది. రాజ్యాంగ ధర్మాన్ని మంటగలుపుతూ పౌర హక్కులను కాలరాస్తోంది. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పోలీసులు చట్టం, రాజ్యాంగం అనే వాటికి తిలోదకాలు వదిలారు. అధికార పారీ్టల నేతలు చెప్పిన వారందరిపై ఉన్నవీ లేనివీ కల్పించి ఎక్కడికక్కడ తప్పుడు కేసులు పెడుతున్నారు. ఎక్కడికక్కడ అక్రమ అరెస్టులతో విరుచుకుపడుతున్నారు. 

అదుపులోకి తీసుకున్న వారిని 24 గంటల్లో న్యాయస్థానంలో హాజరు పరచాలన్న చట్టాన్ని నిర్భీతిగా ఉల్లంఘిస్తున్నారు. మహిళలు, వృద్ధులు, మైనర్లు అని కూడా చూడకుండా థర్డ్‌ డిగ్రీ ప్రయోగిస్తూ చిత్రహింసలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పోలీసులు అర్ధరాత్రి, అపరాత్రి అని కూడా చూడకుండా ఊళ్లపై పడి బీభత్సం సృష్టిస్తున్నారు. నిద్రిస్తున్న వారిని అపహరించుకుపోతున్నారు. ఎక్కడికి తీసుకువెళుతున్నారో చెప్పరు. పోలీసు స్టేషన్‌కు వెళ్లి అడిగితే మాకేం తెలీదనే సమాధానం వస్తుంది. 

పోలీసు వాహనాల్లో కుక్కి.. కొడుతూ ఎక్కడెక్కడో తిప్పుతున్నారు. గుర్తు తెలియని ప్రదేశాల్లో నిర్బంధించి చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఎందుకు కొడుతున్నారని అడిగితే లాఠీలే సమాధానమిస్తున్నాయి. మేం చేసిన తప్పేమిటని ప్రశ్నిస్తే పోలీసుల బూట్లే మాట్లాడుతున్నాయి. ఒక్కొక్కరిపై రెండు మూడు అక్రమ కేసులు నమోదు చేస్తూ ఒక పోలీస్‌ స్టేషన్‌ నుంచి మరో పోలీస్‌ స్టేషన్‌కు తిప్పుతున్నారు. మూడు నాలుగు రోజుల్లోనే ఏకంగా 110కి పైగా అక్రమ కేసులు నమోదు చేయడం ప్రభుత్వ దుర్మార్గానికి నిదర్శనం. 

ఇవన్నీ బాధితుల తరఫున లాయర్లు, గ్రామ పెద్దలు నిలదీస్తేనే అధికారికంగా ప్రకటించినవి కావడం గమనార్హం. అరెస్టు చూపకుండా వేధిస్తున్న కేసులు వేలల్లో ఉన్నాయనడం అక్షర సత్యం. ఒక్కో కేసులో ఒకరు మొదలు 10–20 మందిని సైతం నిందితులుగా చేరుస్తూ వేధిస్తున్నారు. సోషల్‌ మీడియా పోస్టుల ఆధారంగా అరెస్ట్‌ చేయకూడదన్న సుప్రీంకోర్టు తీర్పును సైతం బేఖాతరు చేస్తున్నారు. 41 ఏ నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలన్న ఆదేశాలు తమకు పట్టవన్నట్టు చెలరేగిపోతున్నారు. బాధిత కుటుంబాలు హెబియస్‌ కార్పస్‌ పిటీషన్లతో హైకోర్టును ఆశ్రయించినా సరే తమ నియంతృత్వాన్ని నిర్భీతిగా సమర్ధించుకోవడం దుర్మార్గం. ఇదీ చంద్రబాబు మార్కు పోలీసు రాజ్యం.     

మహిళపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగం! 
సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌ పెద్దిరెడ్డి సుధారాణి పట్ల పోలీసులు మహిళ అని కూడా చూడకుండా అత్యంత క్రూరంగా వ్యవహరించడం దారుణం. మూడు రోజుల పాటు ఆమెను, ఆమె భర్తను చిత్రహింసలకు గురిచేశారు. ‘నన్ను ఈ నెల 5వ తేదీన అదుపులోకి తీసుకున్నారు. నా భర్త వెంకటరెడ్డినీ చిత్రహింసలకు గురిచేశారు. చిలకలూరిపేట సీఐ రమేష్‌ దుర్భాషలాడారు. నోరెత్తితే ఇష్టానుసారం కొట్టారు. థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారు. 

తెలంగాణ రాష్ట్రం సిరిసిల్ల వద్ద జొన్నవాడలోని రాజరాజేశ్వరి ఆలయానికి వెళ్లినప్పుడు మమ్మల్ని పల్నాడు జిల్లా చిలకలూరిపేట సీఐ రమేష్‌ బృందం అదుపులోకి తీసుకుంది. చిలకలూరిపేట, ఒంగోలుకు తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టారు’ అని బాధితురాలు కన్నీటి పర్యంతమయ్యారు. తుదకు ఆమె తరఫు వారు హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ వేయడంతో శుక్రవారం సాయంత్రం కొత్త పేట పోలీసులు గుంటూరు కోర్టులో ప్రవేశపెట్టారు. ఇదే విషయాన్ని ఆమె మెజిస్ట్రేట్‌ ఎదుటే చెప్పారు. పోలీసులు కొట్టడంతో అయిన గాయాలను సైతం చూపించారు. ఈమెపై ఏకంగా 6 అక్రమ కేసులు బనాయించారు.   

నా భర్తను చంపేస్తారేమో.. 
‘సోషల్‌ మీడియా యాక్టివిస్టు అయిన నా భర్త వర్రా రవీందర్‌రెడ్డిని పోలీసులు చంపేస్తారేమోనని భయంగా ఉంది. రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇంత వరకు ఎక్కడున్నాడో ఆచూకీ తెలియడం లేదు. ఐ టీడీపీ, విశాఖకు చెందిన టీడీపీ సానుభూతిపరుడు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి పినపాల ఉదయ భూషణ్, చంద్ర కిరణ్‌లు మా ఆయన పేరుతో ఫేక్‌ ఐడీ సృష్టించి, సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు. 

విచారణలో కూడా ఈ విషయం తేలింది. అయినా ఇప్పుడు దీనిపై కుట్ర చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు. ఆయనేదో అంతర్జాతీయ టెర్రరిస్ట్‌ అన్నట్లు వ్యవహరిస్తున్నారు’ అని రవీందర్‌రెడ్డి భార్య కళ్యాణి శనివారం మీడియా ఎదుట కన్నీటి పర్యంతమవడం ప్రభుత్వ దుర్మార్గానికి పరాకాష్టగా నిలుస్తోంది.    

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మహిళలను వేధించినట్లా? 
కూటమి ప్రభుత్వ పెద్దలు నివసిస్తున్న విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో అరాచకాలు, దుర్మార్గాలకు అంతే లేకుండా పోయింది. ఓ పోస్టును సాకుగా చేసుకుని కూటమి నాయకుడొకరు తన పార్టీ కార్యకర్తలతో ఈ నెల 2వ తేదీన పలు పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదులిప్పించాడు. అదే రోజు ఎన్టీఆర్‌ జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్లలోనూ 42 కేసులు నమోదు చేశారు. ఎన్టీఆర్‌ జిల్లా కంచికచర్ల మండలం పెండ్యాలలో 172 మందికి నోటీసులిచ్చారు. శుక్రవారం నాటికి మొత్తంగా 260 మందికి నోటీసులు ఇచ్చారు. 

కూటమి సర్కారు వైఫల్యాలు, అక్రమాలపై ప్రశ్నిస్తే.. అమ్మాయిలపై తప్పుడు పోస్టు పెట్టారని అభాండాలు వేయడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. ‘నేను ఇటీవల ఓ వాట్సాప్‌ గ్రూప్‌లో వచ్చిన పోస్ట్‌ను చూశాను. ఈ మాత్రం దానికే నాకు సైబర్‌ పోలీసుల నుంచి నోటీసు వచ్చింది. స్టేషన్‌కు వచ్చి వివరణ ఇవ్వాలన్నారు’ అని గుంటూరుకు చెందిన ఆకుల మురళి అనే వ్యక్తి విస్మయం వ్యక్తం చేశారు.    

ఇది నేరమట!
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవులో ఈనెల 1వ తేదీన బైనపల్లి దానమ్మ అనే వృద్ధురాలు పింఛన్‌ కోసం గంటలతరబడి వేచి ఉంటూ సొమ్మసిల్లి పడిపోయింది. స్థానికులు వెంటనే ఓ ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించారు. ఇదే విషయాన్ని అదే మండలం కొండపల్లి గ్రామ ఉప సర్పంచ్‌ మడ్డు జస్వంత్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఇతని పాలిట ఇదే పాపమైపోయింది. పాలక పార్టీ పెద్దల ఆదేశాలతో పోలీసులు అక్రమంగా కేసు పెట్టారు. అంతటితో ఆగకుండా ఆయన్ను భయపెట్టాలని కూడా ఆదేశించారు. దీంతో పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. అప్పుడు ఆయన ఇంట్లో లేడు. 


గంటల కొద్దీ అక్కడే ఉండి ఆయన కుటుంబ సభ్యులను మానసికంగా వేధించారు. ఆ తర్వాత ఎటువంటి నోటీస్‌ ఇవ్వకుండానే జస్వంత్‌ను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ రోజు కార్తీక పూజ నిర్వహిస్తున్నామని, భోజనం చేసి వస్తానన్నా కూడా వదల్లేదు. ఫోన్‌ను కూడా లాగేసుకున్నారు. ఏం కేసు పెట్టారని అడిగినా అప్పుడు చెప్పలేదు. తర్వాత లాయర్‌ సాయంతో బయటకు వచ్చాడు. అయినా ఇప్పటికీ ఎప్పుడుపడితే అప్పుడు స్టేషన్‌కు రావాలంటూ ఫోన్లు చేసి పిలిపిస్తూ మానసికంగా వేధిస్తున్నారు. 192 బీఎన్‌ఎస్‌ సెక్షన్‌తో ఎఫ్‌ఐఆర్‌ (150/24) నమోదు చేశారు.  

శాంతిభద్రతలు నిల్‌.. వేధింపులు ఫుల్‌! 
వరుస హత్యలు, అత్యాచారాలు, దాడులు, దౌర్జన్యాలతో రాష్ట్రం అట్టుడుకుతోంది. వీటిని అరికట్టాల్సిన చంద్రబాబు ప్రభుత్వం నిమ్మ­కు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. టీడీపీ గూండాలు కర్రలు, కత్తులతో గ్రామాలపై పడి బీ­భత్సం సృష్టిస్తున్నారు. కేవలం నాలుగు నెలల్లోనే రాష్ట్రంలో 177 మంది హత్యకు గురయ్యారు. 500కుపైగా హత్యాయత్నాలు జరి­గాయి. 2 వేలకుపైగా దాడులతో రాష్ట్రం అల్లకల్లోలంగా మారింది. టీడీపీ గూండాల దాడులతో భీతిల్లి దాదాపు 3 వేల కుటుంబాలు గ్రామాలు విడిచిపెట్టి ఇతర ప్రాంతాల్లో తల దాచుకుంటున్నాయి. 

అత్యాచార పర్వానికి అంతు లేకుండా పోయింది. ఇళ్లల్లో ఉండే చిన్నారులు, పాఠశాలకు వెళ్లే విద్యార్ధినులు, యువతులపై అత్యాచారాలతో ప్రజలు భయ­భ్రాంతులకు గురవుతున్నారు. నాలుగు నెల­ల్లోనే రాష్ట్రంలో 110 మందిపై అత్యాచారాలు, లైంగిక దాడులు జరిగాయి. అయినా శాంతిభద్రతలతో తమకు సంబంధం లేదన్నట్లు సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఓ ముస్లిం బాలిక కిడ్నాప్‌కు గురికాగానే ప్రభుత్వం స్పందించి ఉంటే ఇప్పుడు ఆ అమ్మాయి బతికుండేది. 

డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ నాయకుడు జాన్‌ 16 ఏళ్ల బాలికకు మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడితే ఏ మేరకు శిక్ష వేశారో పాలకులే చెప్పాలి. అనంతపురం జిల్లా పుట్లూరు మండలం అరకటివేములలో టీడీపీ కార్యకర్త రవితేజ ఓ బాలికను అపహరించి తాడిపత్రి మార్కెట్‌ యార్డ్‌ వద్ద ఉన్న ఐషర్‌ వాహనంలోకి తీసుకువెళ్లి తన స్నేహితుడు నాగేంద్రతో కలసి అత్యాచారానికి పాల్పడ్డాడు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల తోటపాలెంలో ఓ యువతిని టీడీపీ నేత లైంగికంగా వేధించాడు. ఇలాంటి వారందరిపై ఏ చర్యలూ లేవు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్‌ కాలేజీలోని బాత్‌ రూమ్‌లలో రహస్య కెమెరాలు పెట్టిన వారిపై దేశ వ్యాప్తంగా చర్చ జరిగినా ఇక్కడ మాత్రం ఏ చర్యలూ లేవు.  

అన్నా.. వాడిక ఆర్నెల్లు నడవలేడు
సోషల్‌ మీడియా యాక్టివిస్టులను భయభ్రాంతులకు గురి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని నిరంకుశ పాలన సాగిస్తోంది.  ఇందులో భాగంగా అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు వారి ఆచూకీ తెలియనీయకుండా, కోర్టులోనూ హాజరు పర­చకుండా ఊళ్లు.. ఊళ్లు తిప్పుతూ.. వారిని ఏ విధంగా వేధిస్తున్నారో ఎప్పటికప్పుడు అధికార పార్టీ నేతలకు చెబుతుండటం గమనార్హం. ‘అన్నా.. మీరు చెప్పినట్లే వాడిని కుమ్మేశాను. ఏడాది.. కనీసం ఆర్నెల్లు వాడు నడవలేడు. ఆ తర్వాత కూడా వాడు కుంటుకుంటూ నడవాల్సిందే’ అని ఇటీవల ఓ ఎస్‌ఐ అధికార పార్టీ నేతకు చెప్పడం పోలీసు శాఖలో చర్చనీయాంశమైంది.  

⇒ అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలం నక్కలపల్లి గ్రామానికి చెందిన సంజీవరెడ్డిని ఈ నెల 6వ తేదీ రాత్రి పుట్టపర్తి అర్బన్‌ సీఐ సునీత సిబ్బందితో వచ్చి ఇంటి నుంచి బలంవంతంగా లాక్కెళ్లింది. అప్పటి నుంచి సంజీవరెడ్డి ఆచూకీ తెలియడం లేదు. 

⇒ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ను ప్రశ్నిస్తున్నారనే కారణంతో విశాఖ జిల్లా గాజువాకకు చెందిన వెంకటేష్, ప్రకాశం జిల్లాకు చెందిన పవన్‌పై కర్నూలు జిల్లా పత్తికొండ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలా తమకు ఊడిగం చేసే పోలీసులు ఎక్కడ ఉంటే అక్కడ అక్రమ కేసులు ఇష్టారాజ్యంగా నమోదు అవుతున్నాయి. ఇంకా వేలాది మందిపై తప్పుడు కేసులు పెట్టడానికి పోలీసులు కసరత్తు సాగిస్తున్నారు.

⇒ వాస్తవాలు ఇలా ఉంటే.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, ఏబీఎన్‌ వంటి ఎల్లో మీడియా ఈ అరాచకానికి కొమ్ము కాస్తుండటం దారుణం. నిబద్ధత కలిగిన ఇతర మీడియా సంస్థలు ప్రభుత్వ దమననీతికి వ్యతిరేకంగా ఎలుగెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో బరితెగించి సాగిస్తున్న ప్రభుత్వ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా యావత్‌ దేశ వ్యాప్తంగా చర్చ మొదలైంది. ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ బాధితుల తరఫున న్యాయ పోరాటానికి దిగింది. చంద్రబాబు ప్రభుత్వ రాక్షసత్వాన్ని నిలదీస్తోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement