
వ్యక్తి హక్కును తృణీకరించి అరాచకం రాజ్యమేలేచోట వ్యక్తికిగానీ, సమాజానికిగానీ రక్షణ ఉండ దంటాడు ఆఫ్రో–అమెరికన్ రచయిత ఫ్రెడరిక్ డగ్లస్. జనాన్ని అన్ని విధాలా ఏమార్చి తొమ్మిది నెలల క్రితం అందలం ఎక్కిన కూటమి సర్కారు వల్ల ఆంధ్రప్రదేశ్‌లో అక్షరాలా ఆ పరిస్థితే కొన సాగుతోంది. ఎన్నికల్లో అడ్డూ ఆపూ లేకుండా ఇచ్చిన హామీలేమయ్యాయని అడిగితే... వరస వైఫ ల్యాలను ఎండగడితే... తప్పుడు ప్రచారాలను నిలదీస్తే... జైళ్లు నోళ్లు తెరుచుకుంటున్నాయి.
ప్రాథ మిక హక్కయిన భావప్రకటనా స్వేచ్ఛ బందీ అవుతోంది. అడుగడుగునా పౌరుల హక్కులను హరి స్తున్న పోలీసుల తీరును సహించబోమని రాష్ట్ర హైకోర్టు ఇప్పటికి మూడు సందర్భాల్లో ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినా ఈ తోలు మందం ప్రభుత్వానికి వివేకం కలిగినట్టు లేదు. అందుకే మంగళ వారం జస్టిస్ రావు రఘునందన్ రావు, జస్టిస్ మన్మథరావులతో కూడిన ధర్మాసనం మరో రెండు కేసుల్లో పోలీసులకు అక్షింతలు వేయాల్సివచ్చింది.
పోలీసులైనాసరే చట్టానికి లోబడే వ్యవహరించాలని చీవాట్లుపెట్టింది. ఊహల ఆధారంగా కేసులు పెట్టడం, బెయిల్ రాకుండా తప్పుడు సెక్షన్లు బనాయించటం సహించబోమంది. చిన్న తప్పులే కదా అని వదిలేస్తే రేపు కోర్టుల్లోకొచ్చి కూడా అరెస్టు చేస్తారంది. ఈ వ్యాఖ్యలు చాలు... ఏపీలో పాలన ఎంత నిరంకుశంగా ఉందో చెప్పడానికి!
మనసంటే తెలియని, మనుషులంటే లక్ష్యంలేని కూటమి నాయకులకూ, కార్యకర్తలకూ మూడు నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు మనోభావాలు దెబ్బతింటున్నాయి! అంటురోగం ప్రబలినట్టు, ఊరంతా ఒకేసారి పూన కాలు వ్యాపించినట్టు వీరంతా ఉన్నట్టుండి ఫిర్యాదులు చేస్తున్నారు. ఏమైంది వీళ్లకు? ఇదే తీరు కొనసాగిస్తే చట్టాన్ని సవరించి ఇలాంటి కేసుల్లో మొదటగా ఫిర్యాదీదారులను సైకియా ట్రిస్టుల దగ్గరకు పంపాలని... ఎన్నాళ్లుగా మనోభావాలు దెబ్బతిని వున్నాయో, పర్యవసానంగా వారిలో కనబడిన వైపరీత్యాలేమిటో కుటుంబసభ్యుల నుంచి తెలుసుకోవాలనీ నిబంధనలు చేర్చాలన్న డిమాండ్ బయల్దేరినా ఆశ్చర్యం లేదు. ఆ పనిచేస్తే ఇలాంటివారి రోగం కుదురుతుంది.
అధికారంలో ఉన్నవారి మెప్పు పొందేందుకు ఫిర్యాదు అందిందే తడవుగా వెనకా ముందూ చూడకుండా పోలీసులు అరెస్టులకు దిగుతున్నారు. గొలుసు కేసులతో వందలాది కిలోమీటర్ల దూరంలోవుండే పోలీస్ స్టేషన్లకు మార్చి మార్చి తిప్పుతున్నారు. ఎవరిపై ఎన్ని కేసులు పెడుతున్నారో గమనిస్తే ఎవ రంటే పాలకులు వణుకుతున్నారో అర్థమవుతుంది.
ప్రముఖ సినీ రచయిత పోసాని కృష్ణమురళి సంగతే తీసుకుంటే, 67 ఏళ్ల ఆ పెద్దమనిషిపై లెక్కకు మిక్కిలి కేసులు పెట్టారు. ఒకటి రెండు కేసుల్లో బెయిల్ వచ్చిన వెంటనే మరో కేసు తగిలించి అరెస్టు చేస్తున్నారు. గుండెకు శస్త్ర చికిత్స చేయించుకుని పలు అనారోగ్య సమస్యలతో ఉన్న పోసానిని కేసుల పేరుతో వందల మైళ్లు తిప్పుతున్నారు.
సోషల్ మీడియా కార్యకర్త అవుతు శ్రీధర్ రెడ్డిపై పెట్టిన కేసు గమనిస్తే పోలీసుల అత్యుత్సాహం అర్థమవుతుంది. ఒక కేసులో మేజిస్ట్రేట్ ఆయన రిమాండ్‌ను తిరస్కరించి విడుదల చేయాలని ఆదేశించిన వెంటనే పోలీసులు అతి తెలివి ప్రదర్శించి తిరిగి అవే ఆరోపణలతో ఆయనను మరో సారి అరెస్టు చే శారు. ఈసారి న్యాయస్థానం ఆయన్ను రిమాండ్‌కు తరలించింది. ఈ విషయంలో పోలీసుల పనితీరును హైకోర్టు ధర్మాసనం నిశితంగా విమర్శించింది. ఘాటు వ్యాఖ్యలు చేసింది.
ఇష్టానుసారం అరెస్టు చేయటం, చట్టనిబంధనలను తుంగలో తొక్కడం చెల్లదని పేర్కొంది. ఈ విషయంలో యాంత్రికంగా వ్యవహరించినందుకు మేజిస్ట్రేట్‌ను తప్పుబట్టింది. తాచెడ్డ కోతి వనమంతా చెరచినట్టు పోలీసుల తీరు వల్ల కిందిస్థాయి న్యాయస్థానాలకు సైతం మందలింపులు తప్పటం లేదు. నిర్బంధంలోకి తీసుకున్న వ్యక్తికి ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పరు. ఆయన బంధువులకు సమాచారం ఇవ్వరు. అసలు ఆయనపై వున్న కేసులేమిటో చెప్పరు.
ఇవి పాటించలేదని తెలిశాక కూడా యాంత్రికంగా రిమాండ్‌కు పంపుతున్న వైనాన్ని ధర్మాసనం ప్రత్యేకించి ప్రస్తావించింది. ఈ ధోరణి సరికాదని మందలించింది. మాదిగ మహాసేన వ్యవస్థాపక అధ్యక్షుడు కొరిటిపాటి ప్రేమ్ కుమార్ అరెస్టు విషయంలో కూడా న్యాయమూర్తులు ఈ విధంగానే స్పందించారు.
వ్యంగ్యంగా, ప్రతీకాత్మకంగా రూపొందించిన ఒక చిన్న రూపకం పోలీసులకు అభ్యంతర కరంగా తోచింది. అంతే... నిరుడు డిసెంబర్‌లో అర్ధరాత్రి దాటాక రెండున్నర గంటలకు కర్నూలు పోలీసులు తలు పులు బద్దలుకొట్టి ప్రేమ్‌కుమార్ భార్యాపిల్లలను వేరే గదిలో బంధించి ఆయన్ను ఈడ్చుకెళ్లారు.
హాస్యాస్పదమైన విషయమేమంటే వినయ్‌కుమార్ దగ్గర దొరికిన రూ. 300 అక్రమ వసూళ్లట! పైగా సంఘటిత నేరాలకు పాల్పడ్డారంటూ ఆరోపించి బీఎన్‌ఎస్‌లోని సెక్షన్ 111 బనాయించారు. ఈ రెండు కేసుల విషయంలో మాత్రమే కాదు... ఇంతకు మునుపు మరో మూడు కేసుల్లో కూడా పోలీసుల తీరును హైకోర్టు తప్పుబట్టింది. డీజీపీని రప్పించాల్సివస్తుందని హెచ్చరించింది. అయినా పోలీసుల తీరు మారడం లేదు.
ఈ తెలివితక్కువ చర్యల్ని ఘనకార్యాలుగా భావిస్తూ పాలకులు సిగ్గువిడిచి ఊరేగుతున్నారు. తమకు ఎదురులేదని విర్రవీగుతున్నారు. అలవిమాలిన హామీలిచ్చి, ఈవీఎంలను నమ్ముకుని, డబ్బు సంచులు గుమ్మరించి అందలం ఎక్కిన కూటమి ఇకముందూ ఇదే దోవలో అధికారాన్ని శాశ్వతం చేసుకోవచ్చని కలలు కంటోంది.
తప్పు మీద తప్పు చేస్తూ పోతోంది. ఈ క్రమంలో పోలీసులను ఉపయోగించుకుని సంఘటిత నేరాలకు పాల్పడుతోంది. ఎల్లకాలమూ ఈ వ్యవహారం సాగదు. జనం నిజం గ్రహించారు. కీలెరిగి వాత పెట్టే రోజు ఎంతో దూరంలో లేదు.
Comments
Please login to add a commentAdd a comment