
ఐసీఐసీఐ బ్యాంక్(ICICI Bank) బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై నగరాల్లోని తన కార్యాలయాల్లో అత్యాధునిక అట్మాస్ఫియరిక్ వాటర్ జనరేటర్లను (AWG) ఏర్పాటు చేసింది. ఈ ఏడబ్ల్యూజీలు వాతావరణంలోని తేమ ద్వారా త్రాగునీటిని ఉత్పత్తి చేస్తాయి. ఈ యూనిట్లు రోజుకు 8,000 లీటర్ల మంచినీటి ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లు బ్యాంకు తెలిపింది. ఈ ఏడబ్ల్యూజీ ప్లాంట్ల ద్వారా ఆయా ప్రదేశాల్లోని దాదాపు 4,200 మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పింది.
ఏడబ్ల్యూజీ ఎలా పని చేస్తుందంటే..
వాతావరణంలోని తేమను గ్రహించి సూక్ష్మజీవులు లేని శుభ్రమైన తాగునీటిని ఉత్పత్తి చేసేందుకు అట్మాస్ఫియరిక్ వాటర్ జనరేటర్లు (ఏడబ్ల్యూజీ) తోడ్పడుతాయి. ఈ ప్రక్రియలో తేమ ఘనీభవనం చెంది తర్వాత నీటి ఆవిరి బిందువులుగా రూపాంతరం చెందుతుంది. విభిన్న శ్రేణుల్లో వడపోత ప్రక్రియ జరుగుతుంది. తుదకు తాగేందుకు వీలైన శుభ్రమైన నీటిని అందిస్తుంది. పరిసర ఉష్ణోగ్రతలు 18-45 డిగ్రీ సెంటీగ్రేడ్, సాపేక్ష తేమ 25-100% ఉన్న సమయంలో ఈ ప్రక్రియ ద్వారా ఏడబ్ల్యూజీలు సంవత్సరం పొడవునా తాగునీటిని అందిస్తాయి. వాతావరణ తేమను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ప్యాకేజ్డ్ నీటిపై ఆధారపడటాన్ని తగ్గించే అవకాశం ఉంటుందని బ్యాంకు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వాతావరణంలో పునరుత్పాదక వనరును సద్వినియోగం చేసుకోవాలని బ్యాంక్ లక్ష్యంగా పెట్టుకుంది.
‘పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం’
ఐసీఐసీఐ బ్యాంక్ గ్రూప్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ సౌమేంద్ర మట్టగజాసింగ్ మాట్లాడుతూ..‘పర్యావరణ పరిరక్షణకు బ్యాంక్ కట్టుబడి ఉంది. ఇందుకోసం 4R సూత్రం పాటిస్తున్నాం. R-రెడ్యుజ్(వాతావరణంలోని కాలుష్యాలను తగ్గించడం), R-రీయూజ్(వాటిని సమర్థవంతంగా తిరిగి ఉపయోగించడం), R-రిసైకిల్(రిసైకిల్ చేయడం), R-రెస్పాన్సిబుల్(బాధ్యతాయుతంగా వ్యవహరించడం) అనే విధానాలకు కట్టుబడి ఉన్నాం. ప్రపంచంలోని వివిధ నదుల్లో ఉన్న మంచినీటి కంటే వాతావరణంలోని తేమ అనేక రెట్లు అధికంగా ఉందని అంచనా. ఈ ఏడబ్ల్యూజీలను ఏర్పాటు చేయడం ద్వారా పర్యావరణంపై సానుకూల ప్రభావంపడేలా కృషి చేస్తున్నాం’ అని అన్నారు.
ఇదీ చదవండి: రూ.26,000 కోట్ల విలువైన బిడ్లను తిరస్కరించిన ఆర్‌బీఐ
వివిధ సుస్థిరత కార్యక్రమాలు
ఐసీఐసీఐ బ్యాంక్ ఎన్విరాన్‌మెంటల్, సోషల్ అండ్ గవర్నెన్స్ (ఈఎస్‌జీ) పాలసీ కింద వివిధ సుస్థిరత కార్యక్రమాలను అమలు చేస్తోంది. 2032 ఆర్థిక సంవత్సరం నాటికి స్కోప్ 1, స్కోప్ 2 ఉద్గారాల్లో(స్కోప్ 1 ఉద్గారాలు- బ్యాంకు సొంత వాహనాల నుంచి వెలువడే ఉద్గారాలు, స్కోప్ 2 ఉద్గారాలు-బ్యాంకు కొనుగోలు చేస్తున్న విద్యుత్‌తో నడిచే ఎలక్ట్రానిక్ వస్తువుల ద్వారా వెలువడే ఉద్గారాలు. ఉదా: ఏసీ, రిఫ్రిజిరేటర్..నుంచి వచ్చే ఉద్గారాలు) కార్బన్ న్యూట్రల్‌గా మార్చాలని బ్యాంక్ లక్ష్యంగా పెట్టుకుంది. 49.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ బ్యాంకు కార్యాలయాలకు చెందిన 180 సైట్లకు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) ధ్రువీకరణ లభించింది. ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లోని బ్యాంకు సర్వీస్ సెంటర్ 2024 ఆర్థిక సంవత్సరంలో ‘నెట్ జీరో వేస్ట్’ సర్టిఫికేట్ పొందింది.
Comments
Please login to add a commentAdd a comment