గృహ రుణాలు ఇక చౌక
ఐసీఐసీఐ యాక్సిస్
పాత, కొత్త కస్టమర్లందరికీ ఐసీఐసీఐ 0.25% వడ్డీరేటు తగ్గింపు
యాక్సిస్ బ్యాంక్ కోత 0.2 శాతం...
మంగళవారం నుంచే అమల్లోకి...
ఇదే బాటలో డీహెచ్‌ఎఫ్‌ఎల్, ఇండియాబుల్స్ కూడా
న్యూఢిల్లీ: రాజన్ ఘాటు వ్యాఖ్యల ప్రభావంతో బ్యాంకులు రుణాలపై రేట్ల కోత నిర్ణయాలను వరుసపెట్టి ప్రకటిస్తున్నాయి. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీల బాటనేదేశీ ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజాలు ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకులు కూడా అనుసరించాయి. గృహ రుణాలపై ఐసీఐసీఐ పావు శాతం, యాక్సిస్ 0.2 శాతం చొప్పున వడ్డీ రేటును తగ్గించాయి. ప్రస్తుత, కొత్త రుణ గ్రహీతలందరికీ... స్థిర(ఫిక్సిడ్), చర(ఫ్లోటింగ్) రేట్లు అన్నింటిపైనా ఈ తగ్గింపు మంగళవారం(ఏప్రిల్ 14) నుంచే వర్తిస్తుందని ఐసీఐసీఐ బ్యాంక్ ఒక ప్రకటనలో పేర్కొంది. దీని ప్రకారం మహిళలు, ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన కస్టమర్లకు గృహ రుణ రేటు 9.85 శాతంగా ఉంటుంది.
ఇతర కస్టమర్లందరికీ 9.9%గా ఉంటుందని వెల్లడించింది. ఇక యాక్సిస్ బ్యాంక్ గృహ రుణాలపై వడ్డీరేటు 9.95%కి చేరింది. ఈ మార్పు కూడా మంగళవారం నుంచే అమలవుతుందని బ్యాంక్ పేర్కొంది. అదేవిధంగా రుణ మొత్తంతో సంబంధం లేకుండా వేతనజీవులందరికీ ఒకే శ్లాబ్‌ను వర్తింపజేయనున్నట్లు వెల్లడించింది. కాగా, ఆర్‌బీఐ తాజా పాలసీ సమీక్ష అనంతరం ఐసీఐసీఐ తన బేస్ రేటును(కనీస రుణ రేటు) పావు శాతం తగ్గించి 9.75%కి చేర్చిన సంగతి తెలిసిందే. వెరసి గృహ రుణ గ్రహీతలకు నెలవారీ వాయిదా(ఈఎంఐ)ల్లో తగ్గింపు ఉపశమనం లభించనుంది. డిసెంబర్ 2014 నాటికి ఐసీఐసీఐ గృహ రుణాల పోర్ట్‌ఫోలియో రూ.84,425 కోట్లు.
ఫలించిన రాజన్ మంత్రం...
తాజా పరపతి విధాన సమీక్షలో ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ కీలక పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఏడాది ఇప్పటిదాకా రెపో రేటును రెండు సార్లు(పాలసీలో కాకుండా) పావు శాతం చొప్పున తగ్గించడంతో ఇది 7.5 శాతానికి చేరింది. కాగా, నిధుల సమీకరణ వ్యయం ఇంకా అధికంగానే ఉండటంతో రుణాలపై రేట్ల తగ్గింపుపై ఆచితూచి వ్యవహరిస్తామన్న బ్యాంకర్ల వ్యాఖ్యలపై ‘నాన్సెన్స్’ అంటూ రాజన్ ఘాటుగా స్పందించిన విషయం విదితమే. దీంతో బ్యాంకర్లు తక్షణం బేస్ రేటును తగ్గింపు ప్రకటించి.. క్రమంగా గృహ రుణాలపై కూడా వడ్డీరేట్ల కోతను అమల్లోకి తీసుకొచ్చాయి. ఈ జాబితాలో ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ వంటివి ఇప్పటికే చేరాయి. పావు శాతం వరకూ తగ్గింపును ప్రకటించాయి. తాజాగా ఐసీఐసీఐ, యాక్సిస్‌లు కూడా ఇదే బాట పట్టాయి. దీంతో ఇతర బ్యాంకులు కూడా ఇదే రూట్‌ను అనుసరించొచ్చనేది పరిశ్రమ వర్గాల అభిప్రాయం.
డీహెచ్‌ఎఫ్‌ఎల్, ఇండియాబుల్స్...
హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ డీహెచ్‌ఎఫ్‌ఎల్ కూడా గృహ రుణాలపై పావు శాతం వడ్డీరేటు తగ్గింపును ప్రకటించింది. దీంతో ఈ రేటు ఇప్పుడున్న 10.15 శాతం నుంచి 9.9 శాతానికి చేరింది. కొత్త రేటు బుధవారం నుంచి అమల్లోకి వస్తుందని డీహెచ్‌ఎఫ్‌ఎల్ ఒక ప్రకటనలో తెలిపింది. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, పట్టణాల్లో ప్రతిఒక్కరికీ సొంతింటి కలను సాకారం చేసే దిశగా తమ సంస్థ అంకితభావానికి ఈ రేట్ల తగ్గింపు నిదర్శనమని సంస్థ సీఎండీ కపిల్ వాధ్వాన్ వ్యాఖ్యానించారు. మరో ప్రైవేటు రంగ సంస్థ ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కూడా గృహ రుణ రేట్లను 0.2% తగ్గించింది.. దీంతో ఇది 10.10% నుంచి 9.9%కి చేరింది. మంగళవారం నుంచే ఈ రేట్లు అమల్లోకి వచ్చాయని సంస్థ తెలిపింది.
ఐసీఐసీఐ తగ్గింపు ప్రభావం ఇదీ...
కస్టమర్లు కొత్త వడ్డీ రేటు
మహిళలు, బలహీన వర్గాలు(ఫ్లోటింగ్ రేటు) 9.85%
ఇతర కస్టమర్లు(ఫ్లోటింగ్ రేటు) 9.90%
రూ.30 లక్షల వరకూ ఫిక్సిడ్ రేటు గృహ రుణాలపై 9.90%
(10 ఏళ్ల కాల వ్యవధి వరకూ)
బేస్ రేటు 9.75%