home loan rates
-
ఇంటి రుణం.. భారం దింపుకుందాం
గృహ రుణం.. రెండేళ్ల క్రితం వరకు ఇల్లు కొనుగోలుదారులకు ఆకర్షణీయంగా కనిపించిన సాధనం. కేవలం 6.7 శాతం వార్షిక రేటుపై ఇంటి కొనుగోలుకు రుణం లభించింది. కానీ, స్థూల ఆరి్థక పరిస్థితుల్లో వచ్చిన మార్పుల నేపథ్యంలో ఆర్బీఐ కీలక రేటును 2022 మే నుంచి 2.5 శాతం మేర పెంచింది. ఫలితంగా గృహ రుణం రేట్లు 9.5–10 శాతానికి చేరాయి. దీంతో అప్పటికే ఇంటి కోసం రుణం తీసుకున్న వారికి నెలవారీ ఈఎంఐ భారంగా మారింది. 15 ఏళ్ల కనిష్టాలకు చేరిన గృహ రుణ రేట్లు ఒక్కసారిగా భారంగా మారాయి. ఆ తర్వాత ద్రవ్యోల్బణం గరిష్టాల నుంచి కొంత మేర దిగివచ్చింది. అంతర్జాతీయంగా కఠినతర ద్రవ్య విధానం దాదాపు చివరి దశకు చేరింది. దీంతో వడ్డీ రేట్ల పెంపు సైతం ముగింపునకు వచ్చేసిందని విశ్లేషకుల అభిప్రాయం. ఆర్బీఐ సైతం రేట్ల యథాతథ స్థితినే కొనసాగిస్తోంది. అయినా కానీ, వడ్డీ రేట్ల తగ్గింపునకు మరికొన్ని త్రైమాసికాలు వేచి చూడాల్సి రావచ్చని భావిస్తున్నారు. దాదాపు అన్ని బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు రేట్ల పెంపు భారాన్ని రుణ గ్రహీతలకు బదిలీ చేశాయి. ఈ తరుణంలో ఈఎంఐ భారం తగ్గించుకునేందుకు ఉన్న మార్గాల్లో బ్యాలన్స్‌ను మరో రుణదాతకు బదిలీ చేసుకోవడం ఒకటి. దాని గురించి వివరించే కథనం ఇది... ఇంటి కోసం రుణం తీసుకున్న వారికి ప్రస్తుత ఈఎంఐ భారంగా అనిపిస్తే, అప్పుడు ఇతర బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు వసూలు చేస్తున్న వడ్డీ రేట్లను ఒక్కసారి పరిశీలించాలి. ఇతర సంస్థలతో పోలిస్తే మీ బ్యాంక్ అధిక రేటు వసూలు చేస్తున్నట్టు గుర్తిస్తే కనుక, అప్పుడు దాన్ని తక్కువ రేటుకు ఆఫర్ చేస్తున్న బ్యాంక్‌కు బదిలీ చేసుకోవడాన్ని పరిశీలించొచ్చు. ఇలా మిగిలి ఉన్న రుణాన్ని మరో సంస్థకు బదిలీ చేసుకునే ముందు, ఇందుకు అనుసరించాల్సిన ప్రక్రియ, ఇందుకు అయ్యే చార్జీలు, అసలు బదిలీ చేసుకోవడం వల్ల మిగిలే ప్రయోజనం ఎంత మేర? తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించడం అవసరం. ఫ్లోటింగ్ రేటు విధానంలో రేట్లను ఎలా నిర్ణయిస్తారనేది కూడా తెలుసుకోవాలి. రేట్ల విధానాలు.. గృహ రుణంపై ఫిక్స్డ్ (స్థిర), ఫ్లోటింగ్ (అస్థిర) రేట్ల విధానాలు అందుబాటులో ఉన్నాయి. ఫ్లోటింగ్ రేటు రుణాలు ఆర్బీఐ కీలక రేట్ల సవరణకు అనుగుణంగా మార్పులకు లోనవుతుంటాయి. ఫిక్స్డ్ రేట్ విధానంలో నిరీ్ణత కాలం పాటు రుణంపై ఒకటే రేటు కొనసాగుతుంది. కనుక ఫ్లోటింగ్ రేట్ రుణాలతో పోలిస్తే ఫిక్స్డ్ రేట్ రుణాలపై వడ్డీ రేటు 1.5–2 శాతం వరకు అధికంగా ఉంటుంది. ప్రస్తుతం అధిక శాతం గృహ రుణాలు ఫ్లోటింగ్ రేట్ విధానంలోనే ఉంటున్నాయి. ఆర్బీఐ 2016లో మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ఆర్) విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇది ఇప్పటికీ కొనసాగుతోంది. బ్యాంక్‌లు లేదా ఎన్‌బీఎఫ్‌సీలకు నిధులపై అయ్యే వ్యయంతోపాటు, జీ–సెక్ ఈల్డ్స్, బ్యాంకింగ్ రంగంలో లిక్విడిటీ తదితర అంశాలు ఈ విధానంలో రేట్లను ప్రభావితం చేస్తాయి. బ్యాంక్ సొంతంగా రేట్లను నిర్ణయించుకునే స్వేచ్ఛ ఎంసీఎల్ఆర్ విధానంలో ఉంటుంది. ఎంసీఎల్ఆర్ అంటే క్లుప్తంగా నిధులపై బ్యాంక్‌లకు అయ్యే వ్యయం. దీనికి అదనంగా తనకు కావాల్సిన మార్జిన్‌ను బ్యాంక్ జోడించి రుణాలపై రేటును నిర్ణయిస్తుంది. ఆర్బీఐ రేట్లను మార్చినప్పుడు ఎంసీఎల్ఆర్లోనూ మార్పులు చోటు చేసుకుంటాయి. కానీ, వెంటనే కాదు. సాధారణంగా ఆరు నెలల నుంచి ఏడాది సమయం తీసుకుంటుంది. ఎంసీఎల్ఆర్లో ఒక్క రెపో రేటు కాకుండా, ఇతర అంశాలు కూడా రేట్లను ప్రభావితం చేస్తాయి. నిజానికి ఎంసీఎల్ఆర్ విధానం అంత పారదర్శకమైనది కాదు. రిటైల్ రుణ గ్రహీతలు దీన్ని అర్థం చేసుకోలేరు. ఈ లోపాలను అధిగమించేందుకు వీలుగా ఆర్బీఐ 2019లో రెపో లింక్డ్ లెండింగ్ రేట్ (ఆర్ఎల్ఎల్ఆర్)ను ప్రవేశపెట్టింది. రుణం బదిలీతో ఆదా ఎంత? వడ్డీ రేట్లు పెరిగినప్పుడు సాధారణంగా బ్యాంక్‌లు గృహ రుణాలపై ఈఎంఐని పెంచడానికి బదులు, రుణ కాలవ్యవధిని పెంచుతుంటాయి. దాంతో ఈఎంఐలో ఎలాంటి మార్పు ఉండదు. దీంతో ఇబ్బందేమీ లేదన్నట్టు వ్యవహరించరాదు. ప్రస్తుత బ్యాంక్ లేదా ఎన్‌బీఎఫ్‌సీతో మెరుగైన డీల్ కోసం సంప్రదించాలి. సానుకూల స్పందన రానప్పుడు మిగిలి ఉన్న రుణ బకాయిని మరో బ్యాంక్‌కు బదిలీ చేసుకోవడాన్ని పరిశీలించాలి. బ్యాలన్స్ బదిలీకి సంబంధించి అర్హత ఉందా? అన్నది తెలుసుకోవాలి. బ్యాలన్స్ బదిలీకి అనుమతించే విషయంలో కొన్ని బ్యాంక్‌లు, పూర్వపు సంస్థ వద్ద కనీసం 24 నెలల పాటు అయినా క్రమం తప్పకుండా ఈఎంఐ చెల్లించిన చరిత్రను అడుగుతున్నాయి. ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇళ్లు, లేదా స్వా«దీనం చేసిన ఇళ్లకు సంబంధించి రుణం బ్యాలన్స్ బదిలీకే బ్యాంక్‌లు ఆసక్తి చూపిస్తున్నాయి. వీటికి అదనంగా వేతనం, క్రెడిట్ స్కోర్ కూడా కీలకమవుతాయి. ముఖ్యంగా మిగిలిన రుణాన్ని, తక్కువ వడ్డీ రేటుకు ఆఫర్ చేస్తున్న మరో సంస్థకు బదిలీ చేసుకోవడం వల్ల కొంత ఆదా చేసుకుందామని భావించే వారు.. అసలు ఎంత ఆదా అవుతుందన్న దానిపై అంచనాకు రావాలి. ఉదాహరణకు రూ.75 లక్షల రుణం, 20 ఏళ్ల కాలానికి మిగిలి ఉందని అనుకుందాం. 9.5 శాతం వడ్డీ రేటు ఆధారంగా దీని ఈఎంఐ రూ.69,910 అవుతుంది. ఈ రుణాన్ని బదిలీ చేసుకుంటే, కొత్త సంస్థ 9.1 శాతం రేటుకు ఆఫర్ చేసిందనుకుంటే, అప్పుడు ఎంతో ఆదా అవుతుంది. కొత్త సంస్థ వద్ద 9.1 శాతం రేటు ప్రకారం ఇదే రుణంపై ఈఎంఐ రూ.67,963 అవుతుంది. 20 ఏళ్ల కాలంలో రూ.4,67,280 ఆదా అవుతుంది. ఇది ఏడు నెలల ఈఎంఐకి సమానం. అంటే రుణం ఏడు నెలల ముందే తీరిపోతుంది. మరో సంస్థకు రుణాన్ని బదిలీ చేసుకోవడం వల్ల మిగిలే ప్రయోజనం ఇలా ఉంటుంది. రుణం తీసుకున్న తర్వాత పెరిగిన ఆదాయం, మెరుగుపడిన క్రెడిట్ స్కోర్, మెరుగైన చెల్లింపుల చరిత్ర ఆధారంగా కొత్త సంస్థ తక్కువ రేటుకు ఆఫర్ చేసే అవకాశాలు ఉంటాయి. వడ్డీ రేటు ఎంత తగ్గితే ఆదా అయ్యే మొత్తం అధికంగా ఉంటుంది. ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ అయితే ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు తక్కువ రేట్లకు రుణాలను ఆఫర్ చేస్తున్నాయి. 0.25–0.50 శాతం మేర వడ్డీ తక్కువగా ఉండి, రుణ చెల్లింపుల కాలం మరో 15 ఏళ్లు అయినా ఉంటే నిస్సంకోచంగా రుణాన్ని బదిలీ చేసుకోవచ్చు. 2024 మధ్య నుంచి వడ్డీ రేట్లు తగ్గితే, అప్పుడు ఈఎంఐ భారం మరింత దిగొస్తుంది. రూ. 20,000 వరకు చార్జీలు రుణ బదిలీలకు సంబంధించి న్యాయపరమైన, సాంకేతిక మదింపు చార్జీలు కూడా భరించాల్సి వస్తుంది. ఇవి రూ.5,000 నుంచి రూ. 20,000 వరకు ఉంటాయి. కొన్ని బ్యాంక్‌లు విడిగా పేర్కొనకుండా, ఈ మొత్తాన్ని ప్రాసెసింగ్ ఫీజులో కలిపేస్తున్నాయి. కనుక చార్జీల గురించి సమగ్రంగా అడిగి తెలుసుకోవాలి. ఇక మెమోరాండం ఆఫ్ డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్ (ఎంవోడీటీ) గురించి కూడా తెలుసుకోవాలి. రుణ గ్రహీత తన ఇంటి డాక్యుమెంట్లను రుణదాతకు స్వా«దీనం చేయడం. రుణం ఇచ్చే సంస్థ తన పేరిట ఆ ప్రాపరీ్టని రిజి్రస్టేషన్ చేయించుకుంటుంది. ఇందుకు అయ్యే చార్జీలను రుణ గ్రహీత భరించాల్సి వస్తుంది. ఈ చార్జీలు రుణంలో 0.1–0.2 శాతంగా ఉంటాయి. ఇందులో ఎలాంటి తగ్గింపు రాదు. సుమారు రూ.75 లక్షల గృహ రుణాన్ని ఒక సంస్థ నుంచి మరో సంస్థకు బదిలీ చేసుకుంటున్నారని అనుకుంటే, ఇందుకోసం పలు రకాల చార్జీల రూపంలో రూ.62,500 వరకు కోల్పోవాల్సి వస్తుంది. లీగల్ ఫీజులు, ప్రాసెసింగ్ ఫీజుల్లో తగ్గింపు పొందడం ద్వారా ఈ భారాన్ని వీలైనంత తగ్గించుకోవచ్చు. పారదర్శక.. రెపో లింక్డ్ లెండింగ్ రేట్ రెపో లింక్డ్ లెండింగ్ రేట్ ఎంతో పారదర్శకమైనది. రెపో రేట్‌కు బ్యాంక్‌లు తమకు కావాల్సిన మార్జిన్‌ను కలిపి రుణాలపై రేట్లను నిర్ణయిస్తాయి. దీంతో రుణ గ్రహీతలు సైతం సులభంగా అర్థం చేసుకోగలరు. రెపో రేటు పెరిగి, తగ్గినప్పుడు తమపై పడే భారం ఎంతన్నది సులభంగా తెలుసుకోగలరు. అంతేకాదు రేట్ల విధానం సులభంగా ఉండడంతో, ఆర్బీఐ రెపో రేటును సవరించిన వెంటనే బ్యాంక్‌లు రుణ గ్రహీతలకు దాన్ని బదలాయిస్తాయి. సాధారణంగా ఆర్బీఐ రెపో రేటు సవరణ అనంతరం వారం నుంచి నెల రోజుల వ్యవధిలో ఆర్ఎల్ఎల్ఆర్ రుణాల రేట్లు మార్పులకు లోనవుతాయి. రెపో రేటు విధానంలో.. వడ్డీ రేట్లు తగ్గించడం, పెంచడం వేగంగా జరుగుతుంది. కనుక వడ్డీ రేట్లు పెరిగే క్రమంలో ఆ భారం వెంటనే రుణ గ్రహీతలకు బదలాయింపు అవుతుందని గుర్తు పెట్టుకోవాలి. ఈ విధానంలో బ్యాంక్‌లు సాధారణంగా రెపో రేటుపై 2.5–3 శాతాన్ని తమ మార్జిన్ కింద చార్జ్ చేస్తుంటాయి. ప్రస్తుతం గృహ రుణాలపై బ్యాంక్‌లు 9.5–10 శాతం వసూలు చేస్తున్నాయి. రెపో రేటు 6.5 శాతంపై 3–3.5 శాతం మార్జిన్‌గా వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్బీఎఫ్సీలు అయితే 10.5 శాతం వరకు చార్జ్ చేస్తున్నాయి. అయితే, ఇదే రేటు అందరికీ ప్రామాణికంగా అమలవుతుందని చెప్పలేం. రుణం మొత్తం, కాల వ్యవధి, క్రెడిట్ స్కోర్ తదితర అంశాలు కూడా రేటుపై ప్రభావం చూపిస్తాయి. రేట్ల అస్థిరతలు పెద్ద పట్టింపు కాదంటే, రిటైల్ రుణ గ్రహీతలకు ఎంసీఎల్ఆర్ కంటే ఆర్ఎల్ఎల్ఆర్ రేటు అనుకూలంగా ఉంటుంది. చార్జీల పట్ల అవగాహన ఫిక్స్డ్ వడ్డీ రేటు విధానంలో రుణం తీసుకున్న వారు, మరో సంస్థకు దాన్ని బదిలీ చేసుకోవడం ఖరీదైన వ్యవహారమే అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే రుణం ఇచి్చన సంస్థ మిగిలి ఉన్న రుణాన్ని బదిలీ చేసేందుకు గాను, ఆ మొత్తంపై 2–4 శాతం వరకు చార్జ్ వసూలు చేయవచ్చు. అదే ఫ్లోటింగ్ రేట్ విధానంలో రుణం తీసుకుని ఉంటే, ఎలాంటి ముందస్తు చెల్లింపుల రుసుములు లేకుండా మిగిలి ఉన్న రుణాన్ని మరో బ్యాంక్ లేదా ఎన్బీఎఫ్సీకి బదిలీ చేసుకోవచ్చు. ఎందుకంటే ఫ్లోటింగ్ రేట్ రుణాలపై ముందస్తు చెల్లింపుల చార్జీలను ఆర్బీఐ నిషేధించింది. అయితే రుణాన్ని మరో సంస్థకు బదిలీ చేసుకోవాలంటే రుణ గ్రహీత కొన్ని రకాల చార్జీలు భరించాల్సి వస్తుంది. అన్ని బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు రుణాలపై ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తున్నాయి. రుణంపై (బదిలీ చేసుకునే మొత్తం) 0.50 శాతం వరకు ప్రాసెసింగ్ ఫీజు కింద చాలా బ్యాంక్‌లు తీసుకుంటున్నాయి. కొన్ని ప్రభుత్వరంగ బ్యాంక్‌లు ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేయడం లేదు. నూతన తరం బ్యాంక్‌లు, కొన్ని ఎన్బీఎఫ్సీలు 3 శాతం వరకు ప్రాసెసింగ్ ఫీజు తీసుకుంటున్నాయి. కాకపోతే అన్ని బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీల్లో ఒకే మాదిరి చార్జీలు ఉంటాయని అనుకోవద్దు. కనుక ఆయా సంస్థల వెబ్సైట్లకు వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. నేరుగా సంప్రదింపులు చేయడం ద్వారా చార్జీల భారం లేకుండా చూసుకోవచ్చు. బదిలీ చేస్తే అయ్యే వ్యయాలు బదిలీ రుణం :రూ.75 లక్షలు ప్రాసెసింగ్ ఫీజు రుణంపై: 0.3–3% వరకు లీగల్ ఫీజు :రూ.5,000–20,000 ఎంవోటీడీ చార్జీలు :రుణంపై 0.1–0.2 శాతం ఫ్రాంకింగ్ చార్జీలు :రుణంపై 0.1–0.2 శాతం -
ఎల్ఐసీ, బజాజ్ హౌసింగ్ సంస్థల రుణ రేట్లు పెంపు
ముంబై: ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలు తమ గృహ రుణ రేటును 50 బేసిస్ పాయింట్ల (0.50 శాతం) వరకూ పెంచాయి. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ విషయానికి వస్తే, అరశాతం వడ్డీ పెంపుతో వేతనం, వృత్తి పరమైన వ్యక్తులకు గృహ రుణ రేటు 7.70 శాతంగా ఉండనుంది. ఇక ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ప్రైమ్ లెండింగ్ 7.50 శాతం నుంచి 8 శాతానికి చేరింది. -
ఆర్బీఐ షాక్: ఇక ఈఎంఐలు భారమే!
సాక్షి,ముంబై: కేంద్ర బ్యాంకు ఆర్బీఐ తాజా నిర్ణయంతో సామాన్యుడికి భారీ షాక్ ఇచ్చింది. గవర్నర్ శక్తికాంత దాస్ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించిన ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షలో 50 బీపీఎస్ పాయింట్లు మేర రెపోరేటును నిర్ణయాన్ని ఏకగగ్రీవంగా తీసుకున్నారు. దీంతో రెపో రేటు 5.40 శాతాని చేరింది. ఫలితంగా గృహ, వాహనాల రుణాలపై వినియోగదారులకు ఈఎంఐ భారం పడనుంది. రెపో రేట్ పెరిగితే బ్యాంకులు కస్టమర్లకు ఇచ్చే రుణాల వడ్డీ రేట్లు పెంచకుండా ఉండవు. దీంతో కస్టమర్లకు ఈఎంఐ భారం అవుతుంది. హోమ్ లోన్, పర్సనల్ లోన్, ఇతర రుణాల వడ్డీ రేట్లు పెరుగుతాయి. కొత్తగా రుణాలు తీసుకునేవారికీ ఎక్కువ వడ్డీ రేటు వర్తిస్తుంది. ముఖ్యంగా రెపో రేట్‌కు అనుసంధానమైన హోమ్ లోన్లు తీసుకున్న వారికి తాజా సవరణతో సమస్య తప్పదు. దాదాపు 40 శాతం రుణాల రేట్లు ఇలానే ఉంటాయి. అలాగే ఆ ప్రభావం రియల్ ఎస్టేట్ రంగంపై ప్రతికూలంగా ఉండనుంది. (చదవండి: Adani Road Transport: అదానీ హవా, 3 వేల కోట్ల భారీ డీల్ హోం లోన్ తీసుకున్నవారికి మరో భారీ షాక్ తప్పదా? ఏం చేయాలి? -
చౌక ఇళ్ల రుణ విభాగంపై ప్రభావం
ముంబై: అందుబాటు ధరల్లోని (అఫర్డబుల్) ఇళ్లకు గృహ రుణాలను అందించే కంపెనీలపై పెరుగుతున్న వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణ ప్రభావం ఉంటుందని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ సంస్థ అంచనా వేసింది. అధిక ద్రవ్యోల్బణం కారణంగా నిర్మాణ రంగ వ్యయాలు పెరిగిపోతాయని పేర్కొంది. ఇది అందుబాటు ధరల ఇళ్లకు రుణాలిచ్చే కంపెనీల వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిదానించేందుకు దారితీస్తుందని విశ్లేషణ వ్యక్తం చేసింది. రూ.25 లక్షలు, అంతకంటే దిగువ బడ్జెట్ ఇళ్లను అఫర్డబుల్‌గా చెబుతారు. ఆర్థిక అనిశ్చితుల ప్రభావం ఈ విభాగంపై ఎక్కువగా ఉండదని లోగడ నిరూపితమైందంటూ.. గడిచిన దశాబ్ద కాలంలో ఈ విభాగం వేగంగా పురోగతి సాధించిందని ఇండియా రేటింగ్స్ తెలిపింది. గత ఐదేళ్ల కాలంలో చూస్తే హౌసింగ్ ఫైనాన్స్ మార్కెట్లో వృద్ధిని.. అందుబాటు ధరల ఇళ్లకు రుణాలిచ్చే కంపెనీల వృద్ధి అధిగమించడాన్ని ఈ నివేదిక ప్రస్తావించింది. ఈ విభాగంలో తొలుత కొంత జోరు కనిపించినప్పుటికీ అది ఇప్పుడు సాధారణ స్థాయికి దిగొచ్చిందని పేర్కొంది. ‘‘అధిక ద్రవ్యోల్బణం కారణంగా రుణ గ్రహీతల వద్ద నగదు ప్రవాహం తగ్గిపోతుంది. నిర్మాణ వ్యయాలు పెరగడం వల్ల ప్రాపర్టీ ధరలు పెరగడమే కాకుండా, కొత్తగా ప్రారంభించే ప్రాజెక్టులు తగ్గుతాయి. ప్రభుత్వం అత్యవసర రుణ హామీ పథకాన్ని నిలిపివేయడం అనే సవాలును ఈ విభాగం ఎదుర్కొంటోంది’’ అని ఇండియా రేటింగ్స్ నివేదిక వివరించింది. ఇటీవలి కాలంలో ఆర్బీఐ 0.90 శాతం మేర రెపో రేటును పెంచడం తెలిసిందే. ఈ చర్యతో బ్యాంకులు సైతం వెంటనే పలు రుణాల రేట్లను సవరించేశాయి. ప్రస్తుత రెపో రేటు కరోనా ముందున్న రేటు కంటే పావు శాతం తక్కువ. ప్రస్తుత ఆర్థిక సంత్సరంలో హౌసింగ్ ఫైనాన్స్ (గృహ రుణాలు) మార్కెట్ 13 శాతం వృద్ధిని చూపిస్తుందని ఇండియా రేటింగ్స్ అంచనా వేసింది. పెరగనున్న భారం ‘‘ఒక శాతం మేర వడ్డీ రేట్లు పెరిగితే రుణాల ఈఎంఐ 6.1–6.4 శాతం మేర పెరుగుతుంది. అందుబాటు ధరల ఇళ్ల రుణ గ్రహీతలపై ఈ పెరుగుదల 5.3 శాతంగా ఉంటుంది’’అని ఈ నివేదిక వివరించింది. వడ్డీ రేట్ల సైకిల్ ఇలానే ముందుకు సాగితే 2 శాతం మేర రేటు పెరగడం వల్ల ఈఎంఐపై పడే భారం 10.8–13 శాతం వరకు ఉండొచ్చని అంచనా వేసింది. ‘‘ఇప్పటికే రుణాలు తీసుకున్న వారికి కాల వ్యవధి పెంచడం ద్వారా (ఈఎంఐ పెంచకుండా) రుణ దాతలు ఆ ప్రభావాన్ని అధిగమించగలరు. కొత్త కస్టమర్లకు మాత్రం పెరిగిన రేట్ల మేర ఈఎంఐ అధికమవుతుంది. ఇది ఇల్లు కొనుగోలు సెంటిమెంట్‌ను మధ్య కాలానికి ప్రతికూలంగా మార్చేయవచ్చు’’అని ఈ నివేదిక వివరించింది. నిర్మాణంలో వాడే సిమెంట్, స్టీల్, కాంక్రీట్ సహా ఎన్నో ముడి సరుకుల ధరల గణనీయంగా పెరిగిన విషయాన్ని ప్రస్తావించింది. కార్మికులకు చెల్లింపులు కూడా పెరిగిన విషయాన్ని పేర్కొంది. నిర్మాణ వ్యయం 20–25 శాతం మేర పెరిగేందుకు ఈ అంశాలు దారితీశాయని తెలిపింది. పెరిగిన ధరల ప్రభావాన్ని నిర్మాణదారులు పూర్తిగా కొనుగోలుదారులకు బదిలీ చేయలేవని పేర్కొంటూ.. మధ్య కాలానికి ప్రాపర్టీ ధరలపై ఇవి ప్రతిఫలిస్తాయని అంచనా వేసింది. -
కొత్త ఇల్లు కొనేవారికి ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ శుభవార్త!
మీరు కొత్త ఇల్లు కొనుగోలుచేయాలని చూస్తున్నారా?, అయితే మీకు ఒక అదిరిపోయే శుభవార్త. ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్(ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్) పండుగ సీజన్ ఆఫర్లలో భాగంగా గృహ రుణాలను అతి తక్కువకు(6.66%) అందించనున్నట్లు నేడు ప్రకటించింది. వినియోగదారులు ₹2 కోట్ల వరకు తక్కువ వడ్డీ రేటుకే గృహ రుణాలను పొందవచ్చు అని తెలిపింది. నేడు ప్రకటించిన ఈ కొత్త ఆఫర్ సిబిల్ స్కోరు 700 అంతకంటే ఎక్కువ ఉన్న రుణగ్రహీతలకు మాత్రమే వర్తిస్తుంది. వారి వృత్తితో సంబంధం లేకుండా (అంటే వేతన లేదా వృత్తిపరమైన/స్వయం ఉపాధి కలిగిన వ్యక్తులు) రుణాలు మంజూరు చేయనున్నట్లు ప్రకటనలో తెలిపింది. ఈ ఆఫర్ సెప్టెంబర్ 22 నుంచి నవంబర్ 30, 2021 వరకు మంజూరు చేసిన రుణాల మాత్రమే వర్తిస్తుంది అని తెలిపింది. గతంలో ఈ ఆఫర్ రూ.50 లక్షల వరకు గృహరుణాలు తీసుకునే వారికి వర్తించేది అని సీఈఓ వై. విశ్వనాథ గౌద్ తెలిపారు. కానీ, ప్రస్తుతం ₹2కోట్ల వరకు రుణాలకు అదే రేటును పొడిగించినట్లు ఆయన తెలిపారు. రుణగ్రహీతలు HomY App ద్వారా గృహ రుణాల కోసం ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఆఫర్ పరిమిత కాలం మాత్రమే ఉంటుంది. గృహ రుణాలపై ఇప్పటివరకు అందిస్తున్న అతి తక్కువ వడ్డీ రేటు ఇదే. మీ సిబిల్ స్కోరు 700 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే మాత్రమే ఈ తక్కువ వడ్డీ రేటుకు గృహ రుణం పొందే అవకాశం ఉంటుంది. మీ సిబిల్ స్కోరు గనుక తక్కువ ఉంటే వడ్డీ రేటు పెరిగే అవకాశం ఉంది.(చదవండి: ఫ్రెషర్స్‌కు గుడ్‌న్యూస్, లక్షకు పైగా ఉద్యోగాలకు..) -
దశాబ్ద కనిష్టానికి గృహ రుణ రేట్లు
ముంబై: వ్యవస్థలో నిధుల లభ్యత (లిక్విడిటీ) పెరగడంతో గృహ రుణ రేట్లు దశాబ్ద కనిష్టానికి దిగొచ్చాయి. ఇలా రేట్లను తగ్గించిన వాటిల్లో ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకు, కోటక్ మహీంద్రా బ్యాంకు సైతం ఉన్నాయి. గత వారం చివరికి బ్యాంకింగ్ వ్యవస్థలో రూ.6.5 లక్షల కోట్ల నిధుల మిగులు ఉన్నట్టు కేర్ రేటింగ్స్ గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. ఈ డిపాజిట్లు అన్నీ సేవిం గ్స్ ఖాతాల్లోనివే అనుకున్నా.. వాటిపై కనీసం 2.5 శాతం చొప్పున వార్షిక వడ్డీ రేటును బ్యాంకులు చెల్లించుకోవాల్సి వస్తుంది. దీంతో గృహ రుణాలపై రేట్లను స్వల్ప మార్జిన్‌తోనే ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు వస్తున్నాయి. ఆర్బీఐ గణాంకాల ప్రకారం 2020–21లో గృహ రుణాల జారీలో వేగం తగ్గింది. 2020 జనవరిలో గృహ రుణాల మంజూరులో 17.5 శాతం ఉండగా.. 2021 జనవరిలో ఇది 7.7 శాతానికే పరిమితమైం ది. కరోనా మహమ్మారి ఎంతో మంది ఆర్థిక పరిస్థితులను తలకిందులు చేసిన విషయం తెలిసిందే. రిస్క్‌కు దూరం..: నిధుల లభ్యత అధికంగా ఉన్నప్పటికీ బ్యాంకులు రిస్క్ తీసుకునేందుకు ధైర్యం చేయలేకపోతున్నాయి. దీంతో కొంత వరకు భద్రత ఉండే గృహ రుణాల వైపు మొగ్గు చూపుతున్నాయి. వ్యక్తిగత రుణాలన్నవి అన్సెక్యూర్డ్వి. అదే గృహ రుణాల్లో ప్రాపర్టీ బ్యాంకు తనఖాలో ఉంటుంది. అందుకే ఎన్పీఏలు ఈ విభాగంలో 1% కంటే తక్కువే ఉంటున్నాయి. ఇటీవలి కాలంలో ఆర్థిక వ్యవస్థ వేగంగా రికవరీ అవుతుండడంతో ఇళ్ల కొనుగోలు డిమాండ్ పెరుగుతుందని బ్యాంకులు అంచనా వేస్తున్నాయి. వినియోగదారులకూ గృ హ రుణాల విషయంలో ప్రస్తుతం పలు ప్రయోజనాలు ఉన్నాయి. గృహ రుణాలపై పన్ను రాయితీలు, అందుబాటులో ప్రాపర్టీ ధరలు, పలు చోట్ల స్టాంప్‌డ్యూటీ చార్జీల తగ్గింపు వంటివి ఆకర్షణీయమైనవే. క్రెడిట్ స్కోరే ప్రామాణికం.. ఇక అందరికీ ఒకటే రేటు అని కాకుండా.. మెరుగైన రుణ చరిత్ర ఉన్నవారికి బ్యాంకులు ఆకర్షణీయమైన వడ్డీకే గృహ రుణాలను ఇస్తున్నాయి. ఎస్బీఐ 6.7 శాతం, కోటక్ బ్యాంకు 6.65 శాతం చొప్పున తాజా ఆఫర్లను తీసుకొచ్చాయి. కానీ, 800 కంటే ఎక్కువ క్రెడిట్ స్కోరు ఉన్న వారికే ఈ రేట్లు వర్తిస్తాయి. వాస్తవానికి గృహ రుణాలపై వడ్డీ రేట్ల తగ్గింపు విషయంలో బ్యాంకుల మధ్య పోటీకి తెరతీసింది ఎస్బీఐనే. గృహ రుణ మార్కెట్లో 34 శాతం వాటా కలిగిన ఎస్బీఐ 10 బేసిస్ పాయింట్ల మేర రేట్లను తగ్గిస్తూ 6.7%> మార్చి 1న ప్రకటించింది. దీంతో ఇతర అగ్రగామి బ్యాంకులూ ఇదే బాటలో నడవక తప్పలేదు. -
గృహ, వాహన రుణాలపై తగ్గనున్న వడ్డీరేట్లు
సాక్షి, ముంబై : రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని మానిటరీ పాలసీ కమిటీ రెపో రేటు కోతకే మొగ్గు చూపింది. 2019 సంవత్సరంలో వరుసగా రెండవ త్రైమాసికంలో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ ఆర్బీఐ గురువారం నిర్ణయం తీసుకొంది. దీంతో కీలక వడ్డీరేటు 6.25 శాతం నుంచి 6 శాతానికి దిగి వచ్చింది. దీంతో గృహరుణాలతో పాటు ఇతర రుణాలపై భారం తగ్గే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. దీంతోపాటు ఇప్పటికే తీసుకున్న రుణాలపై ఈఎంఐ భారం కూడా తగ్గనుంది. గత సమీక్షలో రెపో రేటు తగ్గించడంతో పలు బ్యాంకులు రుణాలపై వసూలు చేసే ఎంసీఎల్ఆర్ను ఇప్పటికే 5 నుంచి 15 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంకు, కోటక్, ఎస్‌బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తదితర బ్యాంకులు ఈ జాబితాలో ఉన్నాయి. కాగా కొత్త ఆర్థిక సంవత్సరం(2019-20)లో తొలి ద్వైమాసిక పాలసీ సమీక్షలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ అధ్యక్షతన మూడు రోజుల పాటు సమావేశమైన మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) తాజాగా రెపో రేటులో పావు శాతం కోతను ప్రకటించింది. ఇందుకు ఎంపీసీ 4:2 వోటింగ్‌తో నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఎంఎస్‌ఎఫ్‌తోపాటు.. బ్యాంక్ రేటును 6.5 శాతం నుంచి 6.25 శాతానికి ఎంపీసీ సవరించింది. అంతేకాకుండా బ్యాంకులు స్వల్పకాలిక నిధులను రిజర్వ్ బ్యాంక్ వద్ద డిపాజిట్ చేస్తే లభించే రివర్స్ రెపో రేటు సైతం 6 శాతం నుంచి 5.75 శాతానికి పరిమితంకానుంది. జీడీపీ 7.2 శాతం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(2019-20) దేశ ఆర్థిక వ్యవస్థ 7.2 శాతం వృద్ధి సాధించవచ్చని ఆర్బీఐ తాజాగా అంచనా వేసింది. గతంలో 7.4 శాతం వృద్ధి అంచనాలను స్వల్పంగా తగ్గించింది. ఈ బాటలో తొలి అర్ధభాగానికి 6.8-7.1 శాతం స్థాయిలో జీడీపీ పురోగమించే వీలున్నట్లు అభిప్రాయపడింది. ఈ నెల 11వ తేదీన తొలి విడత సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సమయంలో ఆర్బీఐ ఈ కీలక నిర్ణయం తీసుకోవడం విశేషం. -
గృహరుణాలపై వడ్డీరేట్లు తగ్గించిన ఎస్బీఐ
ముంబై: అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహరుణాలపై వడ్డీరేట్లను తగ్గించింది. రూ.75లక్షలకు పైన తీసుకునే హోంలోన్లపై 10 బీపీఎస్ పాయింట్ల మేర కోత పెట్టింది. ఈ ఆదేశాలు జూన్15నుంచి అమల్లోకి వస్తాయని శుక్రవారం ప్రకటించింది.అంచనాలకు అనుగుణంగానే ఎస్బీఐ గృహరుణాలపై వడ్డీరేటులో కోత పెట్టింది. అయితే పరిమితిరూ.75లక్షలకు పైన ఈ తగ్గింపును వర్తింపచేయడంతో నిరాశ వ్యక్తమవుతోంది తాజా తగ్గింపు ప్రకారం ఇకపై రూ.75లక్షల పైన గృహరుణాలపై 8.55 శాతం వడ్డీరేట్లు వర్తించనుంది. మహిళలకు 8.60శాతం వడ్డీరేట్లును అమలు చేయనుంది. ఇంటిని కొనుగోలు చేయడం పెద్ద విషచయనీ, ఈ వడ్డీ రేట్ తగ్గింపు ద్వారా గృహ కొనుగోలుదారులు తమ ఇంటిని సొంతం చేసుకోవడానికి ఉపయోడపడుతుందని ఎస్బీఐ నేషనల్ బ్యాంకింగ్, మేనేజింగ్ డైరెక్టర్ రాజనీష్ కుమార్ తెలిపారు. తమ కస్టమర్లకుసేవలో తమ బ్యాంకు ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందన్నారు. కాగా 2017 ఏప్రిల్ 9న హోంలోన్లపై (ఎంసీఎల్ఆర్)25 బేసిస్‌పాయింట్లను తగ్గించిన సంగతి తెలిసిందే. -
యాక్సిస్ బ్యాంక్ వడ్డీరేట్లు కోత
దేశంలోనే మూడో అతిపెద్ద ప్రైవేట్ దిగ్గజ బ్యాంక్ యాక్సిస్ బ్యాంకు వడ్డీరేట్లపై గుడ్ న్యూస్ చెప్పింది. గృహరుణాలపై వడ్డీరేట్లను 30 బేసిస్ పాయింట్లు తగ్గించింది. అఫార్డబుల్ హౌజింగ్ ఫైనాన్స్ ను అందించే లక్ష్యంతో రేట్లను సమీక్షించినట్టు బ్యాంకు చెప్పింది. దీంతో 30 లక్షల వరకున్న శాలరీ సెగ్మెంట్లో గృహరుణాలపై వడ్డీరేటు 8.35 శాతానికి దిగొచ్చింది. ఇండస్ట్రీలోనే ఇవే అత్యంత కనిష్టస్థాయి. 2017 మే 16 నుంచి ఈ సమీక్షించిన వడ్డీరేట్లు అందుబాటులోకి వస్తున్నాయని బ్యాంకు చెప్పింది. ఇప్పటివరకు 75 లక్షల వరకున్న గృహరుణాలపై 8.65 శాతం వడ్డీరేట్లున్నాయి. ప్రస్తుతం ఈ వడ్డీరేట్లను 8.35శాతానికి తగ్గించింది. ఈ బ్యాంకు ప్రత్యర్థులు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంకులు కూడా గతవారంలోనే తమ వడ్డీరేట్లను తగ్గించాయి. యాక్సిస్ బ్యాంకు రుణాలు సమీక్షించిన వడ్డీరేట్లు సెగ్మెంట్ 30లక్షల వరకు 30-75 లక్షలు 75 లక్షలకు పైబడి శాలరీ 8.35శాతం 8.65 శాతం 8.70శాతం సెల్ఫ్ ఎంప్లాయిడ్ 8.40శాతం 8.70 శాతం 8.75శాతం -
గృహ రుణాలు ఇక చౌక
ఐసీఐసీఐ యాక్సిస్ పాత, కొత్త కస్టమర్లందరికీ ఐసీఐసీఐ 0.25% వడ్డీరేటు తగ్గింపు యాక్సిస్ బ్యాంక్ కోత 0.2 శాతం... మంగళవారం నుంచే అమల్లోకి... ఇదే బాటలో డీహెచ్ఎఫ్ఎల్, ఇండియాబుల్స్ కూడా న్యూఢిల్లీ: రాజన్ ఘాటు వ్యాఖ్యల ప్రభావంతో బ్యాంకులు రుణాలపై రేట్ల కోత నిర్ణయాలను వరుసపెట్టి ప్రకటిస్తున్నాయి. ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీల బాటనేదేశీ ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజాలు ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకులు కూడా అనుసరించాయి. గృహ రుణాలపై ఐసీఐసీఐ పావు శాతం, యాక్సిస్ 0.2 శాతం చొప్పున వడ్డీ రేటును తగ్గించాయి. ప్రస్తుత, కొత్త రుణ గ్రహీతలందరికీ... స్థిర(ఫిక్సిడ్), చర(ఫ్లోటింగ్) రేట్లు అన్నింటిపైనా ఈ తగ్గింపు మంగళవారం(ఏప్రిల్ 14) నుంచే వర్తిస్తుందని ఐసీఐసీఐ బ్యాంక్ ఒక ప్రకటనలో పేర్కొంది. దీని ప్రకారం మహిళలు, ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన కస్టమర్లకు గృహ రుణ రేటు 9.85 శాతంగా ఉంటుంది. ఇతర కస్టమర్లందరికీ 9.9%గా ఉంటుందని వెల్లడించింది. ఇక యాక్సిస్ బ్యాంక్ గృహ రుణాలపై వడ్డీరేటు 9.95%కి చేరింది. ఈ మార్పు కూడా మంగళవారం నుంచే అమలవుతుందని బ్యాంక్ పేర్కొంది. అదేవిధంగా రుణ మొత్తంతో సంబంధం లేకుండా వేతనజీవులందరికీ ఒకే శ్లాబ్‌ను వర్తింపజేయనున్నట్లు వెల్లడించింది. కాగా, ఆర్బీఐ తాజా పాలసీ సమీక్ష అనంతరం ఐసీఐసీఐ తన బేస్ రేటును(కనీస రుణ రేటు) పావు శాతం తగ్గించి 9.75%కి చేర్చిన సంగతి తెలిసిందే. వెరసి గృహ రుణ గ్రహీతలకు నెలవారీ వాయిదా(ఈఎంఐ)ల్లో తగ్గింపు ఉపశమనం లభించనుంది. డిసెంబర్ 2014 నాటికి ఐసీఐసీఐ గృహ రుణాల పోర్ట్‌ఫోలియో రూ.84,425 కోట్లు. ఫలించిన రాజన్ మంత్రం... తాజా పరపతి విధాన సమీక్షలో ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ కీలక పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఏడాది ఇప్పటిదాకా రెపో రేటును రెండు సార్లు(పాలసీలో కాకుండా) పావు శాతం చొప్పున తగ్గించడంతో ఇది 7.5 శాతానికి చేరింది. కాగా, నిధుల సమీకరణ వ్యయం ఇంకా అధికంగానే ఉండటంతో రుణాలపై రేట్ల తగ్గింపుపై ఆచితూచి వ్యవహరిస్తామన్న బ్యాంకర్ల వ్యాఖ్యలపై ‘నాన్సెన్స్’ అంటూ రాజన్ ఘాటుగా స్పందించిన విషయం విదితమే. దీంతో బ్యాంకర్లు తక్షణం బేస్ రేటును తగ్గింపు ప్రకటించి.. క్రమంగా గృహ రుణాలపై కూడా వడ్డీరేట్ల కోతను అమల్లోకి తీసుకొచ్చాయి. ఈ జాబితాలో ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ వంటివి ఇప్పటికే చేరాయి. పావు శాతం వరకూ తగ్గింపును ప్రకటించాయి. తాజాగా ఐసీఐసీఐ, యాక్సిస్‌లు కూడా ఇదే బాట పట్టాయి. దీంతో ఇతర బ్యాంకులు కూడా ఇదే రూట్‌ను అనుసరించొచ్చనేది పరిశ్రమ వర్గాల అభిప్రాయం. డీహెచ్ఎఫ్ఎల్, ఇండియాబుల్స్... హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ డీహెచ్ఎఫ్ఎల్ కూడా గృహ రుణాలపై పావు శాతం వడ్డీరేటు తగ్గింపును ప్రకటించింది. దీంతో ఈ రేటు ఇప్పుడున్న 10.15 శాతం నుంచి 9.9 శాతానికి చేరింది. కొత్త రేటు బుధవారం నుంచి అమల్లోకి వస్తుందని డీహెచ్ఎఫ్ఎల్ ఒక ప్రకటనలో తెలిపింది. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, పట్టణాల్లో ప్రతిఒక్కరికీ సొంతింటి కలను సాకారం చేసే దిశగా తమ సంస్థ అంకితభావానికి ఈ రేట్ల తగ్గింపు నిదర్శనమని సంస్థ సీఎండీ కపిల్ వాధ్వాన్ వ్యాఖ్యానించారు. మరో ప్రైవేటు రంగ సంస్థ ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కూడా గృహ రుణ రేట్లను 0.2% తగ్గించింది.. దీంతో ఇది 10.10% నుంచి 9.9%కి చేరింది. మంగళవారం నుంచే ఈ రేట్లు అమల్లోకి వచ్చాయని సంస్థ తెలిపింది. ఐసీఐసీఐ తగ్గింపు ప్రభావం ఇదీ... కస్టమర్లు కొత్త వడ్డీ రేటు మహిళలు, బలహీన వర్గాలు(ఫ్లోటింగ్ రేటు) 9.85% ఇతర కస్టమర్లు(ఫ్లోటింగ్ రేటు) 9.90% రూ.30 లక్షల వరకూ ఫిక్సిడ్ రేటు గృహ రుణాలపై 9.90% (10 ఏళ్ల కాల వ్యవధి వరకూ) బేస్ రేటు 9.75% -
గృహ రుణాలపై ఐసీఐసీఐ వడ్డీరేట్ల తగ్గింపు
ముంబై: ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బాటలోనే.. తాజాగా ఐసీఐసీఐ బ్యాంక్ కూడా గృహ రుణాలపై వడ్డీరేట్లను తగ్గించింది. కొత్తగా గృహ రుణం తీసుకునేవారికి 15 బేసిస్ పాయింట్ల(0.15 శాతం) తగ్గింపుతో ప్రత్యేక స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం రూ.75 లక్షల వరకూ రుణాలపై 10.25 శాతం, రూ. 75 లక్షలకు పైబడిన రుణాలపై 10.50 శాతం చొప్పున వడ్డీరేటును ఆఫర్ చేస్తున్నట్లు బ్యాంక్ పేర్కొంది. ప్రస్తుత రుణగ్రహీతలకు మాత్రం ఇప్పుడున్న 10.40%, 10.65% రేట్లు యథావిధంగా కొనసాగుతాయని వెల్లడించింది. కొత్త ఆఫర్ తక్షణం అమల్లోకి వచ్చిందని... జనవరి 31 వరకూ అందుబాటులో ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం ఐసీఐసీఐ కనీస రుణ(బేస్) రేటు 10%గా ఉంది. కొత్త గృహ రుణ గ్రహీతలకు ఎస్బీఐ 0.4% వరకూ.. హెచ్డీఎఫ్సీ పావు శాతం మేర(జనవరి 31 వరకూ ఆఫర్) వడ్డీరేట్లను తగ్గించడం తెలిసిందే. తాజా సమీక్షలో రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) కీలక పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించడం విదితమే -
రిటైల్ రుణాలపై ఆంధ్రాబ్యాంక్ వడ్డీరేట్ల తగ్గింపు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రిటైల్ రుణాలపై వడ్డీరేట్ల తగ్గింపు పోటీలో ప్రభుత్వరంగ ఆంధ్రాబ్యాంక్ కూడా వచ్చి చేరింది. గృహ రుణాలను బేసు రేటుకే అందిస్తుండగా, వాహన రుణాలపై మరో అర శాతం చెల్లిస్తే సరిపోతుంది. ప్రస్తుతం ఆంధ్రాబ్యాంక్ బేస్ రేటు 10.25%గా ఉంది. ఈ తగ్గింపు రేట్లు అక్టోబర్ 10 నుంచి జనవరి 31, 2014 వరకు అమలులో ఉంటాయని ఆంధ్రాబ్యాంక్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఆఫర్ సమయంలో అన్ని రుణాలపై ప్రాసెసింగ్ ఫీజును పూర్తిగా రద్దు చేసినట్లు బ్యాంకు వెల్లడించింది. గృహరుణాలను 10.25-10.5 శాతానికి, కార్ల రుణాలను 10.75%, ద్విచక్ర వాహనాలను 11.25%, కన్జూమర్ లోన్స్ 12.25%, ప్రభుత్వ, మంచి గుర్తింపు పొందిన సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు ఎలాంటి హామీ లేకుండా ఇచ్చే క్లీన్ రుణాలను 14.25 శాతానికే అం దిస్తున్నట్లుబ్యాంక్ పేర్కొంది. సిండికేట్ బ్యాంక్ కూడా... బెంగళూరు: సిండికేట్ బ్యాంక్ గృహ రుణాలపై వడ్డీరేటును తగ్గించింది. రూ.75 లక్షలకు పైబడిన గృహ రుణాలపై వడ్డీరేట్లను పావు శాతం తగ్గిస్తున్నట్లు తెలిపింది. దీంతో ఇకపై రుణ మొత్తాలతో సంబంధం లేకుండా అన్ని గృహ రుణాలకు 10.25 బేస్ రేట్ ప్రాతిపదికగా ఉంటుంది. తక్షణం అమల్లోకి వచ్చేలా అన్ని ప్రస్తుత గృహ రుణాలకూ 10.25% రేటు వర్తిస్తుందని తెలిపింది. పండుగల నేపథ్యంలో నాలుగు చక్రాల వాహనాల రుణాలపై రేట్‌ను 11% నుంచి 10.90%కి ఇప్పటికే తగ్గించినట్లు పేర్కొంది. ద్విచక్ర వాహనాలపై రేటును అరశాతం తగ్గించినట్లు(12.25%కి) పేర్కొంది. పండుగల సీజన్లో అన్ని గృహ, వాహన రుణాలపై సర్వీస్ చార్జీలను 50% తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. -
రుణ రేటు పెంచిన ఐసీఐసీఐ బ్యాంక్
ముంబై: ఐసీఐసీఐ బ్యాంక్ రుణ రేట్లను పావు శాతం పెంచింది. దీనితో కనీస (బేస్) రుణ రేటు 10 శాతానికి చేరింది. తాజా రేటు శుక్రవారం నుంచీ అమల్లోకి రానుంది. దీనితో ఈ రేటుకు అనుసంధానమైన వ్యక్తిగత, గృహ, వాహన, తదితర వాణిజ్య రుణాలు ప్రియం కానున్నాయి. ఫ్లోటింగ్ రేట్లపై ఉన్న ప్రస్తుత కస్టమర్లకు వర్తించే విధంగా తన ప్రామాణిక రుణ రేట్లను కూడా బ్యాంక్ పావు శాతం పెంచింది. తాజా రుణ రేట్ల మార్పు ఫిక్స్డ్ రేట్ కస్టమర్లకు వర్తించదని బ్యాంక్ ప్రకటన తెలిపింది. హెచ్డీఎఫ్సీ కూడా: హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (హెచ్డీఎఫ్సీ) కూడా గృహ రుణాలపై ప్రామాణిక రుణ రేటును పావుశాతం పెంచింది. దీనితో రూ.30 లక్షల వరకూ గృహ రుణాలపై వడ్డీరేటు 10.40 శాతానికి పెరగనుంది. రూ.30 లక్షలు దాటిన రుణాలపై రేటు 10.65కు చేరుతుంది. శుక్రవారం నుంచీ తాజా రేట్లు అమల్లోకి వస్తాయి.