సాక్షి, ముంబై : రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని మానిటరీ పాలసీ కమిటీ రెపో రేటు కోతకే మొగ్గు చూపింది. 2019 సంవత్సరంలో వరుసగా రెండవ త్రైమాసికంలో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ ఆర్‌బీఐ గురువారం నిర్ణయం తీసుకొంది. దీంతో కీలక వడ్డీరేటు 6.25 శాతం నుంచి 6 శాతానికి దిగి వచ్చింది. దీంతో గృహరుణాలతో పాటు ఇతర రుణాలపై భారం తగ్గే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. దీంతోపాటు ఇప్పటికే తీసుకున్న రుణాలపై ఈఎంఐ భారం కూడా తగ్గనుంది.
గత సమీక్షలో రెపో రేటు తగ్గించడంతో పలు బ్యాంకులు రుణాలపై వసూలు చేసే ఎంసీఎల్‌ఆర్‌ను ఇప్పటికే 5 నుంచి 15 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంకు, కోటక్, ఎస్‌బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తదితర బ్యాంకులు ఈ జాబితాలో ఉన్నాయి.
కాగా కొత్త ఆర్థిక సంవత్సరం(2019-20)లో తొలి ద్వైమాసిక పాలసీ సమీక్షలో ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ అధ్యక్షతన మూడు రోజుల పాటు సమావేశమైన మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) తాజాగా రెపో రేటులో పావు శాతం కోతను ప్రకటించింది. ఇందుకు ఎంపీసీ 4:2 వోటింగ్‌తో నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఎంఎస్‌ఎఫ్‌తోపాటు.. బ్యాంక్ రేటును 6.5 శాతం నుంచి 6.25 శాతానికి ఎంపీసీ సవరించింది. అంతేకాకుండా బ్యాంకులు స్వల్పకాలిక నిధులను రిజర్వ్ బ్యాంక్ వద్ద డిపాజిట్ చేస్తే లభించే రివర్స్ రెపో రేటు సైతం 6 శాతం నుంచి 5.75 శాతానికి పరిమితంకానుంది.
జీడీపీ 7.2 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(2019-20) దేశ ఆర్థిక వ్యవస్థ 7.2 శాతం వృద్ధి సాధించవచ్చని ఆర్‌బీఐ తాజాగా అంచనా వేసింది. గతంలో 7.4 శాతం వృద్ధి అంచనాలను స్వల్పంగా తగ్గించింది. ఈ బాటలో తొలి అర్ధభాగానికి 6.8-7.1 శాతం స్థాయిలో జీడీపీ పురోగమించే వీలున్నట్లు అభిప్రాయపడింది. ఈ నెల 11వ తేదీన తొలి విడత సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సమయంలో ఆర్‌బీఐ ఈ కీలక నిర్ణయం తీసుకోవడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment