
డిపాజిట్ల కోసం బ్యాంకుల మధ్య పోటీ
ప్రస్తుతం లిక్విడిటీకి కొరత
డిపాజిట్లపై రేట్లు ఇప్పట్లో తగ్గకపోవచ్చు
రెపో ఆధారిత రుణాలపై వేగంగా అమలు
ఎంసీఎల్‌ఆర్ ఆధారిత రుణాలపై ఆలస్యంగా..
ఆర్‌బీఐ చాలా కాలం తర్వాత కీలకమైన రెపో రేటు ను 25 బేసిస్ పాయింట్లు (0.25 శాతం) తగ్గిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో హమ్మయ్య రుణ రేట్లు తగ్గుతాయని, నెలవారీ ఈఎంఐ చెల్లింపుల భారం దిగొస్తుందని ఆశపడే వారు.. కొంత కాలం పాటు వేచి చూడక తప్పేలా లేదు. రెపో రేటు కోత ప్రభావం రుణాలు, డిపాజిట్లపై పూర్తిగా ప్రతిఫలించేందుకు కొన్ని నెలల సమయం తీసుకోవచ్చని విశ్లేషకులు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
దీనికి ప్రస్తుతం బ్యాంకింగ్ రంగంలో ద్రవ్య లభ్యత కొరత (లిక్విడిటీ) ఉండడాన్ని, డిపాజిట్ల సమీకరణ కోసం బ్యాంక్‌ల మధ్య నెలకొన్న తీవ్ర పోటీని ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్‌ఆర్) ఆధారంగా మంజూరయ్యే రుణాలతోపాటు, డిపాజిట్లపై రేటు తగ్గింపు వెంటనే అమల్లోకి రాకపోవచ్చని.. అదే సమయంలో రెపో ఆధారిత రుణాలపై రేట్ల తగ్గింపు వేగంగా బదిలీ అవుతుందని చెబుతున్నారు.
కొంత సమయం తర్వాతే..
‘‘తాజా రేటు తగ్గింపు ప్రయోజనం కొత్త రుణాలపై అమలయ్యేందుకు కొంత సమయం తీసుకోవచ్చు. ఎందుకంటే డిపాజిట్ల కోసం పోటీ కారణంగా నిధులపై బ్యాంకులు అధికంగా వ్యయం చేయాల్సి వస్తోంది’’అని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ అజిత్ వెలోనీ తెలిపారు. ఫ్లోటింగ్ రేటు రుణాలపై ఆర్‌బీఐ రేటు తగ్గింపు వేగంగా అమల్లోకి వస్తుందన్నారు. బ్యాంకు రుణాల్లో 40 శాతం మేర రెపో ఆధారిత రుణాలు ఉన్నట్టు చెప్పారు. ఆర్‌బీఐ నిర్ణయంతో రెపో రేటు 6.5 శాతం నుంచి 6.25 శాతానికి దిగిరావడం తెలిసిందే.
మరోవైపు సమీప భవిష్యత్‌లో లిక్విడిటీ పట్ల నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లిక్విడిటీ పెంచే అదనపు చర్యలను ఆర్‌బీఐ తీసుకోకపోతే మార్చి నాటికి వ్యవస్థ వ్యాప్తంగా రూ.2.5 లక్షల కోట్ల లోటు ఏర్పడొచ్చని అంటున్నారు. అప్పుడు ఆర్‌బీఐ రేట్ల తగ్గింపు బదిలీకి మరింత సమయం పట్టొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎంసీఎల్‌ఆర్ ఆధారిత రుణాలపై రేట్ల తగ్గింపునకు రెండు త్రైమాసికాల సమయం తీసుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా ఈ రుణాల రేట్లను బ్యాంక్‌లు ఆర్నెళ్లకోసారి సమీక్షించడాన్ని ఇందుకు నిదర్శనంగా పేర్కొంటున్నారు. దీంతో బ్యాంక్‌లు జూలై లేదా వచ్చే డిసెంబర్‌లో ఈ రుణాల రేట్లను సవరించే అవకాశం ఉంటుంది.
డిపాజిట్లపై..
ఇప్పటికే ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసిన వారికి తాజా రేటు తగ్గింపుతో ఎలాంటి ప్రభా వం పడదు. కొత్తగా డిపాజిట్ చేసే వారికి రేటు తగ్గే అవకాశాలున్నాయి. కాకపోతే వెంటనే కాకుండా క్రమంగా డిపాజిట్లపై ఈ మార్పు కనిపిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. డిపాజిట్ల కోసం బ్యాంక్‌ల మధ్య పోటీ ఉన్నందున రేట్లను వెంటనే తగ్గించకుండా, ఆర్‌బీఐ చర్యలతో లిక్విడిటీ మెరుగయ్యాకే డిపాజిట్లపై రేట్లు తగ్గించొచ్చని భావిస్తున్నారు. ‘‘ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్స్ అనుసంధానిత రుణాలపై రేట్ల మార్పు ప్రభావం వెంటనే అమల్లోకి రావచ్చు. ఎంసీఎల్‌ఆర్ ఆధారిత రుణాలపై అమలు కావడానికి కొంత సమయం తీసుకోవచ్చు. మానిటరీ పాలసీ రేట్ల ప్రభావం డిపాజిట్లపై ప్రతిఫలించేందుకు కూడా రెండు త్రైమాసికాలు పట్టొచ్చు’’అని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ స్వామినాథన్ పేర్కొనడం గమనార్హం.
– సాక్షి, బిజినెస్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment